హనుమంతుడు ఆచార్యపదవికి తగినవాడేనా?
వనం జ్వాలా నరసింహారావు
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (02-01-2021) ప్రసారం
పంపా తీరం చేరిన రామచంద్రమూర్తి, అపహరించబడిన
భార్య సీత కోసం బేలవలె ఏడుస్తూ వుండడం చూసిన లక్ష్మణుడు సమాయనుకూల హితబోధ చేసి
సంతాపాన్ని ఉపశమింప చేసే ప్రయత్నం చేశాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సత్యమని
భావించిన రాముడు దుఃఖాన్ని విడిచి ధైర్యం వహించాడు. ఆ తరువాత శీఘ్రంగా నిర్భయంగా
నడుస్తూ,
తమ్ముడు
ధర్మ వాక్యాలు చెప్తుంటే వినుకుంటూ ఋశ్యమూక పర్వతం దిశగా ముందుకు సాగిపోయారు.
రాముడు, లక్ష్మణుడు
ఋశ్యమూక పర్వతం దరిదాపుల్లో సంచరిస్తుండగా, వారిని, కొండమీద వున్న సుగ్రీవుడు చూసి
భయపడ్డాడు. సుగ్రీవుడితో పాటు ఇతర వానరులు కూడా చూశారు. రామలక్ష్మణులను చూసిన
వానరులకు వీరిని వాలి పంపగా తమను చంపడానికి వచ్చారని భావించారు. పంపానదికి ఉత్తరాన
రామలక్ష్మణులు, దక్షిణాన
సుగ్రీవాదులు వున్నారు. వారి వెంట ఇంకా ఎవరైనా వస్తున్నారేమోనని నలుదిక్కులా
చూశాడు. ఒకచోట నిల్వలేకపోయాడు. పరుగెత్త సాగాడు.
ఆ సమయంలో ఆంజనేయుడు సుగ్రీవుడి దగ్గరకు పోయి "వానర
రాజా! ఎందుకు నీకు భయం వేస్తున్నది? వాలి
భయంతో ఎందుకు నువ్వీవిధంగా పరుగెత్తుతున్నావు? ఈ పర్వతం ఋష్యమూకం కదా! ఇక్కడ వాలివల్ల
భయం లేదుకదా? ఒకవేళ
భయపడడానికైనా వాలి ఇక్కడెక్కడా కనబడడం లేదే? కాబట్టి ఎందుకు తొట్రుపాటు పడుతున్నావు? నీ పిరికితనానికి కారణం ఏమిటి?" అంటాడు. హితమైన మాటలు చెప్పిన
ఆంజనేయుడితో సుగ్రీవుడు రామ లక్ష్మణులను చూసిన విషయం చెప్పి, తనను చంపగల
వారెవరినో ఇక్కడికి వాలి పంపాడని నిశ్చయించాను కాబట్టి భయపడ్డానని అంటాడు.
“రాజులందరూ తమ శత్రువులను ఉపాయంతోనే కదా చంపుతారు? అలాగే వాలి కూడా చేస్తుండవచ్చు.
అయినప్పటికీ ఇది ఇలాగే అని నేను చెప్పలేను. నా జాగ్రత్తలో నేను వుండడం మంచిదని పరుగెత్తి
వచ్చాను. నా ఆలోచన సరైందా? కాదా? అని తెలుసుకోవాలి. దానికొరకు ఎవరో ఒక
సామాన్యుడిని వారిదగ్గరకు పంపాలి. నువ్వే సామాన్య మనిషి వేషంలో వాళ్ల దగ్గరికి
పోయి విషయం తెలుసుకో. ఆంజనేయా! నువ్వు పోయి వాళ్ల మనస్సు నిజంగా ఎలాంటిదో కనుక్కో.
నీమీద ముందుగా నమ్మకం పుట్టించుకుని ఆ తరువాత
నామీద వాళ్లకు సదభిప్రాయం కలిగేట్లు చేయి. వాళ్లు నిర్మలమైన మనస్సు కలవారనీ, వంచన గుణం లేనివారనీ నీకు నమ్మకం
కుదిరితే, వాళ్లు
మాట్లాడే విధానం గమనించు. వారి మాటల్లో నిజమెంతో, మోసమెంతో తెలుసుకో".
అని సుగ్రీవుడు చెప్పగా హనుమంతుడు రామలక్ష్మణులున్న
ప్రదేశానికి నిజస్వరూపంలో పోతే,
పోయిన పని నెరవేర్చడం కష్టమని భావించి, వానర రూపం వదిలి,
సన్న్యాసి లాగా తానున్న కొండ దగ్గరినుండి, వారిదగ్గరికి
పోయి ఏకాగ్రచిత్తంతో, వినయంగా వాళ్లకు నమస్కారం చేశాడు.
ఇక్కడ
సన్న్యాసి రూపం ధరించిన హనుమంతుడు గృహస్తుడైన రామచంద్రమూర్తికి ముందుగా తానే
నమస్కారం చేయడం అంటే సర్వత్రా ఇలాంటి ఆచారం సమంజసమని అనుకోవాలి. సన్న్యాసి
గృహస్తుడికి నమస్కారం చేయడం భావ్యం కాదని కొందరంటారు కాని, అది
వాస్తవం కాదు. మనువాక్యమూ కాదు. మనుశాస్త్రానికి విరుద్ధం కూడా. ఆ మాటకు మూలం ఏంటో,
కర్త ఎవరో కూడా తెలియదు. జ్ఞానాధికుడైన గృహస్తుడికి సన్న్యాసి నమస్కరించాలి
అనేదే మనువాక్యం. హనుమంతుడు అత్యద్భుతములైన రామలక్ష్మణుల ఆకారాలు చూసిన వెంటనే
అధికానంద పరవశుడై తాను ధరించిన సన్న్యాసి ఆకారాన్ని కూడ మరచిపోయి అవశంగా వారికి
నమస్కారం చేశాడు. ఇది సర్వత్రా ప్రామాణికం కాదని కొందరి అభిప్రాయం. ఇది
యుక్తంకాదు. హనుమంతుడు నిపుణమతి. గొప్ప మంత్రి. రాముడి అభిప్రాయం కనుక్కొని రమ్మని
సుగ్రీవుడు పంపగా వచ్చాడు. అలాంటి వాడు ఆదిలోనే తనను తాను మరచిపోతే తక్కిన కార్యం
ఎలా నెరవేర్చగలడు? రామచంద్రమూర్తి ఎలా నమ్ముతాడు?
రామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహం చూడగానే వీరు సుగ్రీవుడికి మేలు
చేసేవారే కాని పగవారు కాదని నిశ్చయించిన హనుమంతుడు తాను వేసుకున్న వేషం మారు
వేషమనీ, తాను చారుడనీ తెలియచేయడానికే నమస్కారం చేశాడు. ఇక్కడ బిక్షువు అంటే
సన్న్యాసికాడు. బ్రహ్మచారి అని కొందరంటారు. అదీ యుక్తం కాదు. హనుమంతుడు మొదటినుండీ
బ్రహ్మచారే కాని, ఇప్పుడు కొత్తగా వేయలేదు. కాబట్టి
హనుమంతుడు సన్న్యాసి వేషం ధరించాడనీ, జ్ఞానాధికుడైన
రామచంద్రుడికి, గృహస్తుడికి, నమస్కరించడం
తప్పుకాదనీ చెప్పాలి.
ఆ
తరువాత సుగ్రీవుడి అభిప్రాయానికి సరిపోయేట్లు తన అభిప్రాయాన్ని చెప్పాడు హనుమంతుడు
రాముడితో ఇలా. "అయ్యలారా! మీరెవరు? ఈ
అడవి ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీరు
రాజర్షులతో, దేవతలతో సమానంగా వున్నారు. మీలో రాజవేషం , ముని
వేషం రెండూ కలిసి వున్నాయి. అలా అయితే మీరు సంకరులని నా అభిప్రాయం కాదు. మీరేదో
మంచి వ్రతం పూని ఇలా వున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వ్రతం మీరు పూనడానికి
కారణమేంటి? మహిమలో దేవతలకు సమానంగా వున్నారు. కాబట్టి ఎలాంటి శత్రువునైనా చంపగల
సమర్థులు మీరు. మీరెందుకు నారచీరెలు కట్టి జడదారుల్లాగా జడలు ధరించి
తిరుగుతున్నారు? మీ యోగ్యతకు, మీ ఇప్పటి
స్థితి, పరస్పర విరుద్ధంగా వుండడానికి కారణం ఏంటి?.
మీరేదో శత్రుసంహార కార్యక్రమానికి సిద్ధమైనట్లు కనపడుతున్నది”.
హనుమంతుడు
ఇన్ని ప్రశ్నలు వేసినా రామలక్ష్మణులు ఆయన మాటల సొంపు-పెంపు వింటూ వూరకే వున్నారు
తప్ప ఒక్కదానికైనా జవాబివ్వలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. ఆయన మాటలపట్ల ఆసక్తి
కావచ్చు. తాము మాట్లాడితే ఆయన మాటలు వినే అవకాశం కోల్పోవచ్చు. సన్న్యాసులు తిరగకూడని
ప్రదేశంలో తిరుగుతున్న ఈ సన్న్యాసి నిజమైన సన్న్యాసా? కాదా?
అన్న సందేహం కావచ్చు. బిక్షకోసం వచ్చిన సన్న్యాసి అయితే ఆయన స్థితిగతులు
చెప్పుకోవాలి కాని తమ స్థితిగతులను గురించి ఎందుకు అడగాలి?
వేగులవాడేమో! ఇక్కడ పరస్పర శత్రువులైన వాలి-సుగ్రీవులలో ఇతడు ఎవరి పక్షమో?
కాబట్టి ముందుగా తానెవరో చెప్పిన తరువాత మాట్లాడుదామని రామలక్ష్మణులు భావించి
వుండాలి.
ఇక
హనుమంతుడు వేరే విధంగా ఆలోచించ సాగాడు. తానెంత మాట్లాడినా వీళ్లు బదులు చెప్పడం
లేదు. తనమీద వీరికి సందేహం కలిగిందేమో? ఆ సందేహం
తీరేవిధంగా తాను సంభాషిస్తేనేగాని వాళ్లు తనను నమ్మి తనతో మాట్లాడారని అనుకుంటాడు.
వీళ్లు గొప్పవారిలాగా వున్నారు కాబట్టి వీళ్ల స్నేహం తప్పక చేయాలి అని ఆలోచించి తన
వృత్తాంతాన్ని కపటం లేకుండా ఇలా చెప్పాడు.
“ఆర్యులారా!
నా వృత్తాంతాన్ని చెప్తా వినండి. ఈ ప్రాంతంలో సుగ్రీవుడు అనే ఒక ధర్మాత్ముడు,
కోతిరాజు, వీరుల
గౌరవానికి పాత్రుడు వున్నాడు. అతడిని ఆయన అన్న వెళ్లగొట్టితే నిలువనీడలేక,
ప్రాణ భయంతో అమితంగా బాధపడ్తూ దేశంలో తిరుగుతున్నాడు. మీ స్నేహం కోరి
ధర్మాత్ముడైన సుగ్రీవుడు పంపుతే మీ దగ్గరికి వచ్చాను నేను. నేనాయన మంత్రిని.
వాయుపుత్రుడిని. నా పేరు హనుమంతుడు. నేను వానరుడిని. కోరిన రూపం ధరించి,
కోరిన ప్రదేశానికి వెళ్లగలను. సుగ్రీవుడి మేలు కోరి సన్న్యాసి వేషంలో ఋశ్యమూకం
నుండి ఇక్కడికి వచ్చాను” అని చెప్పి హనుమంతుడు మౌనం దాల్చాడు.
దీంతో
రామలక్ష్మణుల సందేహం తీరింది. వాలి-సుగ్రీవుల పేర్లు, వాలి
సుగ్రీవుడిని వెళ్లగొట్టడం, సుగ్రీవుడు
ఋశ్యమూకం మీద వుండడం, ఇవన్నీ రామలక్ష్మణులకు తెలిసిన
విషయమే. కాబట్టి సందేహానికి తావు లేదు. ఆ తరువాత తాను సుగ్రీవుడి మంత్రినని
చెప్పాడు హనుమంతుడు. అంటే సుగ్రీవుడి పక్షంవాడని అర్థమయింది.
హనుమంతుడి
మాటలకు సంతోషించిన రాముడు, తమ్ముడు
లక్ష్మణుడిని చూసి హనుమంతుడిని ప్రశంసిస్తూ చెప్పాడు. “లక్ష్మణా! ఇతడు
సుగ్రీవుడికి ప్రీతిపాత్రుడైన మంత్రి. మనం ఏ సుగ్రీవుడిని చూడాలని పోతున్నామో,
అతడి మంత్రే ఈ రూపంలో మనదగ్గరికి వచ్చాడు. అంటే,
సుగ్రీవుడితో ఏ పనైతే అవుతుందని అనుకుంటున్నామో,
అది ఇతడిద్వారానే జరుగుతుంది. ఆయన్ను మనం ఎలా నమ్మవచ్చో ఇతడిని కూడా అలాగే
నమ్మవచ్చు. ఆయనకూ, ఇతడికీ భేదం లేదు”.
హనుమంతుడు ఆచార్యపదవికి తగినవాడని
శ్రీరామచంద్రమూర్తి ఆయన యోగ్యతను గురించి చెప్పాడు. ఆచార్యుడు వేదం
తెల్సినవాడిగానూ, విష్ణుభక్తుడుగానూ,
మాత్సర్యం లేనివాడుగానూ, విష్ణుమంత్రం తెలిసినవాడుగానూ,
ఆ మంత్రం మీద భక్తికలవాడుగానూ,
మంత్రార్థం ఇతరులకు చెప్పగలిగినవాడుగానూ,
బాహ్యాభ్యంతరాలలో నిర్మలమైనవాడుగానూ,
గురుభక్తికలవాడుగానూ, పురాణాల జ్ఞానంకలవాడుగానూ
వుండాలి. ఇలాంటివాడినే ఆచార్యడు అంటారు. ఈ గుణాలు హనుమంతుడిలో వున్నాయని
శ్రీరాముడు చెప్పాడు లక్ష్మణుడితో.
సుగ్రీవుడితో స్నేహం చేస్తే తన పని
హనుమంతుడి వల్లే సఫలం అవుతుందని రామచంద్రమూర్తి నిశ్చయించుకున్నాడు. వాక్యజ్ఞుడు
లక్ష్మణుడు, వాక్యజ్ఞుడు హనుమంతుడు అని శ్రీరామచంద్రమూర్తి అంటాడు. అంటే,
ఈ గుణాలన్నీ లక్ష్మణుడిలో,
హనుమంతుడిలో-ఇద్దరిలో- కలవనీ, ఇద్దరూ
సమానులే అనీ భావం.
శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా చెప్పడంతో,
వాక్యజ్ఞుడైన లక్ష్మణుడు వాక్యజ్ఞుడైన హనుమంతుడితో ఇలా అన్నాడు. “అయ్యా! పండితుడా!
సుగ్రీవుడి గురించి, అతడి ప్రభావం గురించీ,
అతడి గొప్ప గుణాలను గురించీ, మేం
ఇదివరకే విన్నాం. కాబట్టే ఆయన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. నువ్వు చెప్పిన
సుగ్రీవుడి పనిని మేం సంతోషంతో నువ్వు చెప్పినట్లే చేయగలం”. ఇది విని హనుమంతుడు
సుగ్రీవుడి జయం కోరుతూ రామసుగ్రీవులకు స్నేహం కుదర్చాలని అనుకున్నాడు. ఆ తరువాత
హనుమంతుడితో తమ యావత్ వృత్తాంతాన్ని చెప్పాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడు ఇలా చెప్పగానే,
అతడిని చూసి,
హనుమంతుడు, “ఈ పరాక్రమం, ఈ
ఇంద్రియ జయం, ఈ బుద్ధి సంపద, ఇలాంటి
సదాచార సంపత్తికల మిమ్మల్ని తన అదృష్టం కొద్దీ సుగ్రీవుడు చూశాడు. సజ్జన స్తోత్ర
పాత్రమైన నడవడి కలవారా! ఇక సుగ్రీవుడి చరిత్ర చెప్తాను వినండి” అంటూ చెప్పసాగాడు.
“తన అన్న అయిన వాలి పగపట్టి,
బాధపెట్టి, ఊరు వెడలగొట్టి అతడి భార్యను అధర్మ పద్ధతిలో హరించడం వల్ల అడవుల్లో
కీడు దశ అనుభవిస్తున్నాడు సుగ్రీవుడు. సీతాదేవిని వెతికే పనిలో మాలాంటి కోతులను
రంగంలోకి దింపి మీకు తప్పక సహాయం చేస్తాడు”.
ఇలా చెప్పి సుగ్రీవుడిని చూడడానికి పోదాం
రమ్మని రామలక్ష్మణులను అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు రామచంద్రమూర్తితో “అన్నా!
హనుమంతుడు యదార్థం చెప్తున్నాడు. సుగ్రీవుడికి నీతో పని వుంది. కాబట్టి సంతోషించు.
నీ కార్యం కూడా నెరవేరిందని భావించు. ఒకవేళ యితడు చెప్పింది అబద్ధమైతే దానివల్ల
మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పనైతే అయింది, లేకపోతె లేదు. ఇప్పుడు మనం వున్న
స్థితికంటే తక్కువ స్థితికి పోము. ఆయన మాటలు సంతోషంగా కార్యసాధకుడిలాగా వున్నాయి.
సందేహించడానికి తావులేకుండా స్పష్టంగా సాదుభావంతో ప్రసంగిస్తున్నాడు. కాబట్టి
హనుమంతుడు కోరినట్లు మనం సుగ్రీవుడి దగ్గరికి పోదాం”. అని లక్ష్మణుడు చెప్పగా
రామచంద్రమూర్తి అలాగే చేద్దామన్నాడు.
ఆంజనేయుడు
తన సన్న్యాసి రూపాన్ని వెంటనే వదిలాడు. రామలక్ష్మణులను ఇద్దరినీ భుజాలమీద
ఎక్కించుకుని, సుగ్రీవుడు తిరుగుతున్న చోట దించాడు.
(వాసుదాసుగారి
ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)
No comments:
Post a Comment