రామాయణం గానం చేస్తున్న కుశ లవులను పిలిపించిన శ్రీరాముడు
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-38
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (04-01-2021)
ముని కుమారుల వేషాలను ధరించి మన్మధా
కారులై-చంద్ర బింబం లాంటి ముఖం వున్నవారై- అత్యంత తేజస్సుతో అలరారుతూ-చక్కగా రాజవీధుల్లో
గానంచేస్తున్న కుశ లవులను,
సూర్య తేజస్సుతో ప్రకాశించే శ్రీరామచంద్రమూర్తి,తన ఇంటికి పిలిపించుకుంటాడు. ఆ సమయంలో కుశ లవులు, నల్లని తుమ్మెదలను మించిన
ముంగురులతోను,లేత చంద్రుడితో పోల్చదగే నొసలుతోను,శరీరకాంతితోను మెరిసి
పోతుంటారు. తన తమ్ములు,
ఇతర సామంత రాజులు, మంత్రులు, మరెందరో తను కూర్చున్న బంగారు సింహాసనం చుట్టూ చేరి, తనకు సేవలు చేస్తున్న సమయంలో, కుశ లవులనుద్దేశించి
" నాయన లారా,
మీరేదో పాడుతున్నారే ! దానిని నేనూ వింటాను" అని
అంటాడు శ్రీరాముడు. మన్మధాకారంగల ముని వేషధారులైన కుశ లవులిద్దరు, ఒకేరకంగా వున్న విషయాన్ని - వారిని చూడగానే సమస్త విద్యలను సరిసమానంగా
నేర్చుకున్నట్లుగా తెలుస్తున్న విషయాన్ని, నీతిమంతుడైన
శ్రీరామచంద్రుడు గమనించి,
తన మనసులో అనుకుంటున్న దాన్ని తమ్ములతో ప్రస్తావిస్తాడు.
తేనెలొలికే అందం తోనూ,
అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం తోనూ, వింటున్న కొద్దీ
బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు గానం చేస్తున్నారని అంటాడు.
(రామాయణం వేదార్థం కలది. శ్రుతి కటువుగా కాకుండా, విన సొంపై,
కేవలం ఐహికానందం మాత్రమే కాకుండా, అమృతంలాగా మోక్షానందం కూడా కలిగించేది రామాయణం. అలలు ఎలా అంతం లేకుండా
వస్తుంటాయో,
అలానే రామాయణ కావ్యం కూడా ఎప్పటికప్పుడు బ్రహ్మానందం
కలిగిస్తూనే వుంటుంది. అసత్యమంటే ఎరుగని - అసత్యమాడని శ్రీరామచంద్రుడు తన మనసులో
వున్న ఇదే విషయాన్ని బయటకంటాడు. ఆనందం రెండు రకాలు: విషయానందం, బ్రహ్మానందం. కమ్మని రుచికరమైన పదార్థాలను తినడం-ఇంపైన ధ్వనులను వినడం-పరిమళ
పదార్థాలను చూడడం వలన కలిగే ఆనందం విషయానందం. మోక్ష కాలంలో పరిపూర్ణ బ్రహ్మానుభవం
ద్వారా కలిగే ఆనందం బ్రహ్మానందం).
కుశలవుల గానాన్ని వినమని తమ్ముళ్లను
ప్రోత్సహిస్తూ: "ఈ బాలకులు ఏ రసాన్నైతే అభినయిస్తూ పాడుతున్నారో, ఆ రసమే మనలో పుట్టి మనకూ అనుభవంలోకి వస్తున్నది. కవిత్వం విషయానికొస్తే, ఆసాంతం,
విచిత్ర శబ్దాలతో కూడి వినసొంపుగావుంది. ఏ దోషాలు లేవు.
ఇలాంటి నిర్దుష్టమైన-గుణవంతమైన-శ్లాఘ్యమైన కావ్యాన్ని చంద్ర బింబం లాంటి ఈ ముని
కుమారులు గానం చేస్తున్నారు" అని సగౌరవంగా మాటలతోనే బహుకరిస్తూ అంటాడు
శ్రీరాముడు. ఆలాపాల,
రాగాల తీయ దనంతో, ప్రవాహంలాగా రామాయణ గానం
చేస్తున్న బాలకుల ప్రతిభను గమనిస్తున్న వారంతా, ఆ రసాస్వాదనలో మునిగి
తేలుతూ, ఇంకా తనివితీరా వింటే బాగుంటుందని భావిస్తూ పరవశులై పోతుంటారు. కుశ లవుల గాన
మాధుర్యాన్ని-మనోహరత్వాన్ని ఆస్వాదించడమే కాకుండా, పాటకు సంబంధించిన కథలోని విశేషాన్ని కూడా గమనించాలని, శ్రోతలనుద్దేశించి అంటాడు శ్రీరాముడు. ఆయనలా మాట్లాడడంతో, కుశ లవులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తేనెలో చక్కెర కలిపితే, తీపి దనం ఎలా పెరుగుతుందో, అలానే, భగవత్ కథలో తీయదనం కలిగిస్తున్న కుశ లవులు బాలకులైనప్పటికీ, భగవత్ కథను చెప్తున్నందున, వారికంటే ఉన్నత స్థానంలో
తను కూర్చోడం భావ్యం కాదని తలచిన శ్రీరాముడు, సందడి చేయకుండా బంగారు
సింహాసనం మీదనుండి దిగి,
అక్కడున్న నలుగురి మధ్య ఒకడిగా కూచుంటాడు. దీంతో మరింత
సంబరపడిన కుశ లవులు,
అసలు-సిసలైన సంగీత విధానంలో రామ చరిత్రనంతా గానం చేశారు.
("తపమున స్వాధ్యాయంబున. ... .. " అనే పద్యంతో ఆరంభమై, ఇంతవరకు చెప్పిందంతా ఉపోద్ఘాతం లాంటిది. నాటకానికి నాంది-ప్రస్తావనలు ఎలా
అంతర్భాగాలో,
రామాయణానికి ఇలాంటి ఉపోద్ఘాతం ఒక అంతర్భాగం. వ్యక్తి
వైలక్షణ్యం,
విషయ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం అనే
మూడు ప్రధాన విషయాలను,
రామాయణం చదివే వారికి-దానిపై గౌరవం కలించేందుకు, ఈ ఉపోద్ఘాతం లో వివరించడం జరిగింది. కుశ లవులు రామాయణ గానం చేయడం, గ్రంథ రచన తదుపరి జరిగిన సంఘటన. ఎందుకు ఆరంభంలోనే దీన్ని రాయాల్సి వచ్చిందన్న
ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. త్రికాల జ్ఞానైన వాల్మీకి మహర్షి యోగ దృష్టితో రామాయణ
వృత్తాంతమంతా ఆద్యంతం మొదలే తెలుసుకున్న విధంగానే, ఈ విషయాన్నీ తెలుసుకుని, కుశ లవులతో
చెప్పించినట్లుగా భావించాలి. వాస్తవానికి ఉపోద్ఘాతంలో తెలియచేసినట్లుగా, కుశ లవులు రామాయణ గానం చేసిన సంగతి ఉత్తర కాండలో సరైన సందర్భంలో చెప్పడం
జరిగింది.దాన్నే పాఠకులకు సంక్షిప్తంగా ముందుగానే వివరించడం జరిగింది.మొదటి మూడు
సర్గల్లో స్వవిషయం గురించి,
తనకు యోగ దృష్టి కలదని చెప్పడం గురించి, బ్రహ్మ సాక్షాత్కారం గురించి, రాయడాన్ని కొందరు
వాల్మీకి ఆత్మ స్తుతిగా ఆక్షేపించవచ్చు. వాస్తవానికి మొదటి మూడు సర్గల్లో
"గ్రంథోత్పత్తి" గురించి చెఫ్ఫడం జరిగిందే కాని మరింకేమీ కాదు.
బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై
అవతరించాల్సిన కారణం,
అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ
సంపత్తి,
సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి
హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం
శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని
స్థాపించి,
పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతుని అర్థం చేసుకోవాలి.
భగవంతునందు చేసిన శరణాగతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగ కాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది.
ఇట్టి శరణా గతికి పురుష కారం అవశ్యం. పురుషకారానికి కావాల్సిన ముఖ్యగుణం శరణాగతుడి
పట్ల దయ. ఈ గ్రంథంలో పురుషకారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి
శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్యవలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది.
శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక
జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది
రామాయణమే).
No comments:
Post a Comment