Sunday, January 3, 2021

రామ సుగ్రీవుల స్నేహం సీతాన్వేషణకేనా? : వనం జ్వాలా నరసింహారావు

 రామ సుగ్రీవుల స్నేహం సీతాన్వేషణకేనా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (03-01-2020) ప్రసారం  

సుగ్రీవుడు పంపగా పోయిన హనుమంతుడు  తన వెంట తీసుకొచ్చిన రామలక్ష్మణులను ఆయనకు సవివరంగా పరిచయం చేశాడు.  విస్తారమైన సత్యం, శౌర్యం, సత్యమైన శౌర్యం, సత్యమే శౌర్యంగా కల వాడు రాముడనీ, సాక్షాత్తూ పరమాత్మ అనుకోవాలనీ చెప్పాడు. దశరథమహారాజు కొడుకైన ఆయన అడవుల్లో తిరుగుతుంటే, రావణాసురుడి వల్ల తన భార్యను కోల్పోయాదనీ, సుగ్రీవుడి స్నేహం కోరి అన్నదమ్ములు ఇక్కడికి వచ్చారు కాబట్టి వారిని పూజించమనీ చెప్పాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులను సమీపించి, పూజించి, రామచంద్రమూర్తిని చూసి ఇలా అన్నాడు.

          “రామచంద్రా! నాతో స్నేహం చేయడానికి నీకు పరిపూర్ణంగా అంగీకారమైతే, నా చేతిలో నీ చేయి వెయ్యి. ఇదిగో, నా చేతిని స్నేహధర్మ మర్యాద ప్రకారం చాచాను. ఇది అభయహస్త ప్రధానప్రార్థన”. ఆ మాట విన్న రామచంద్రమూర్తి సంతోషించి, తన అరచేతిని, సుగ్రీవుడి అరచేతిలో వుంచి, గౌరవించి నిండు మనస్సుకల స్నేహంతో కౌగలించుకున్నాడు. అప్పుడు అగ్నిహోత్రాన్ని వారిద్దరిమధ్య హనుమంతుడు పెట్టాడు. రామసుగ్రీవులు అడవి పూలతో పూజించి, ఒకరిచేయి మరొకరు పట్టుకుని,  ఆసక్తిగా అగ్నికి ప్రదక్షిణ చేశారు. ఇలా రామసుగ్రీవులు స్నేహం చేసి ఇద్దరూ తమ పని జరిగినట్లే సంతోషించారు.

అప్పుడు సవినయంగా సుగ్రీవుడు తనకు అన్న వాలి చేసిన అపకారాన్ని గురించి ఇలా చెప్పసాగాడు. “రామచంద్రా! నా అన్న వాలి భయంకరమైన పరాక్రమం కలవాడు. వాడు నామీద కోపంతో నన్ను రాజ్యం నుండి పంపించి, నా భార్యను హరించి, నిర్దయుడై వెళ్లగొట్టితే, ప్రాణభయంతో కొండాకోనలలో అల్లల్లాడుతున్నాను. నన్ను కరుణార్ద్ర దృష్టులతో చూసి వాలి భయం నాకు లేకుండా చేసి నన్ను రక్షించు”.

సుగ్రీవుడిలా చెప్పగా స్నేహధర్మం తెల్సిన శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో ప్రీతిగా సుగ్రీవుడితో వాలిని చంపడానికి ప్రతిజ్ఞ చేస్తూ రాముడు ఇలా అన్నాడు. “స్నేహితుడంటే ఉపకారం చేసేవాడని అర్థం. ఇది నేను చక్కగా ఎరుగుదును. కాబట్టి నీ భార్యను అపహరించిన ధర్మవిరుద్ధచరిత్రుడైన వాలిని చంపుతాను. భయపడవద్దు. రాముడిలా చెప్పగా, సంతోషించిన సుగ్రీవుడు, “రామచంద్రా! నీ అనుగ్రహంవల్ల నా భార్య, రాజ్యలక్ష్మి లభిస్తే సంతోషిస్తాను. నీ బాణాలతో వాలిని త్వరగా చంపి నా తీవ్ర దుఃఖాన్ని తొలగించి రక్షించు. నీకు నీ భార్యను ఎడబాయడం వల్ల కలిగిన దుఃఖాన్ని నేను తొలగిస్తాను. నువ్వు బాధపడవద్దు. పతివ్రతైన సీతాదేవిని నీచుడైన రాక్షసుడు ఏ ప్రదేశంలో దాచినప్పటికీ, పాతాళంలో వున్నా సరే, ఆకాశాన వున్నా సరే, రామచంద్రా! ఆమెను నేను తేగలను. నువ్వు బాధపడవద్దు”.

          సుగ్రీవుడు శ్రీరాముడితో ఇంకా ఇలా అన్నాడు. “మేం సీతను చూడడమే కాదు. ఆమెకూడా మమ్మల్ని చూసి, ఆమె తనమీది ఉత్తరీయంలో సొమ్ములను మూటగట్టి విసిరివేసింది. వాటన్నింటినీ నేను కొండగుహమీద వున్న హనుమంతుడి చేతికి ఇచ్చి దాచిపెట్టాను. వాటిని త్వరగా తెప్పిస్తాను. నీ భార్యవేమో చూడు” అని వాటిని తెచ్చి రాముడికి చూపించడం జరిగింది. చీరచెరగున కట్టిన సొమ్ములను రామచంద్రమూర్తి చేతికి తీసుకుని, వాటిని చూస్తూ, కళ్లల్లో కన్నీళ్లు వస్తుంటే, అవి చూపులను అడ్డగిస్తుంటే, “హా! ప్రియురాలా! రమణీ!” అంటూ ఆరాటంగా ఆ భూషణాలను ఒత్తిపట్టుకుని పుట్టలోని పాము బుసకొట్టినట్లు పెద్ద శ్వాస విడిచాడు. “లక్ష్మణా, వీటిని నువ్వు చూడు. ఇవి సీతవే కదా?” అని అడిగాడు. జవాబుగా లక్ష్మణుడు, “అన్నా! ఈ బాహుపురులు, ఈ కమ్మలు, సీతాదేవివి అవునో-కాదో నేను చెప్పలేను. ప్రతిదినం ఆమెకు పాదాభివందనం చేసేటప్పుడు చూసేవాడిని కాబట్టి ఈ అందియలు సీతాదేవివే అని చెప్పగలను” అన్నాడు.

         లక్ష్మణుడు ఇలా చెప్పగానే, సుగ్రీవుడిని రావణుడి వృత్తాంతం అడిగాడు రాముడు. ఆ రాక్షసుడు కాపురముండే దేశం కానీ, అతడి బలం కానీ, శక్తికానీ, సామర్థ్యం కానీ, అ అనీచుడి కులంకానీ తనకు తెలియదనీ, అయినా విచారపడవద్దనీ, ఏవిధంగానైనా వాడిని కనుక్కునే మార్గాన్ని అన్వేషిస్తామనీ అన్నాడు సుగ్రీవుడు. సీతాదేవి ఎక్కడున్నా వెతికి ఆ రాక్షసుడిని బంధువులతో, కొడుకులతో, స్నేహితులతో యుద్ధంలో చీల్చివేసి రాముడి మనస్సుకు సంతోషం కలిగేట్లు చేస్తానని మాట ఇచ్చాడు.

         ఇక్కడ సుగ్రీవుడు స్పష్టంగా అబద్ధం చెప్పాడు. రావణాసురుడి విషయం హనుమంతుడికి తెలియదుకాని సుగ్రీవుడికి బాగా తెలసు. రావణాసురుడు వాలిచేతిలో ఓడిపోయి సంధి కుడుర్చుకున్నవాడే. అప్పుడు సుగ్రీవుడు కూడా అక్కడ వున్నాడు. అలాంటప్పుడు తెలిసి-తెలిసి అబద్ధం చెప్పడం మిత్రద్రోహం కాదా? కాదు. కానేకాదు. ఇప్పుడే రావణాసురుడి గురించి సుగ్రీవుడు చెప్తే చాలా తొందరలో వున్న రామచంద్రమూర్తి వెంటనే లంకమీదకు యుద్ధానికి పోదామని అనవచ్చు. వాడి బలం ఈయనకు తెలియదు. తానేమో వాలి జీవించి ఉన్నంతదాకా ఈ స్థలాన్ని విడిచి పోవడానికి వీల్లేదు. ఒకవేళ పోయినా ఇప్పుడున్న ఐదుగురితో చేయగలిగింది ఏమీ లేదు. తాము బయల్దేరిపోతే వాలి సైన్యంతో దండెత్తి వస్తాడు. వాలి, రావణుడు ఒకటైతారు. అప్పుడీయన ఎవరితోనని యుద్ధం చేస్తాడు? తొందరపాటు వల్ల కార్యభంగమే కాని అనుకూలంకావు. వాలిని చంపి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇస్తే తానూ సర్వాధికారి అవుతాడు. అప్పుడు నిర్భయంగా లంకమీదకు దండెత్తవచ్చు. ఇలా కార్యభారం, సాధన మార్గం ఆలోచించి సుగ్రీవుడు అబద్ధం చెప్పాడు. దీనివల్ల రామచంద్రమూర్తి పని పాడవలేదు. స్నేహధర్మాన్ని అనుసరించి ఆడిన అబద్ధం తప్పుకాదు.       

ఈ విధంగా రామసుగ్రీవులు వారి-వారి సుఖ దుఃఖాలు ఒకరితో మరొకరు ఏకాంతంగా చెప్పుకున్నారు. ఏక నిశ్చయంతో రామసుగ్రీవులు ఇలా తమ సుఖదుఃఖాలు ఒకరికొకరు చెప్పగా, సుగ్రీవుడు తన కార్యం సఫలమైంది కదా అని మిక్కిలి సంతోషించాడు.

         వాలి తనకు చేసిన కీడును గురించి సుగ్రీవుడు రాముడికి వివరంగా చెప్పాడు. తన ప్రాణాలకంటే ప్రియమైన భార్యను అపహరించాదనీ, తన స్నేహితులను, బంధువులను, చెరసాలలో బంధించాడనీ, తన ప్రాణాలను తీయడానికి ఆలోచిస్తున్నాదనీ చెప్పాడు. “వాలి మహా పరాక్రమశాలి. సూర్యుడిలాంటివాడు. శత్రువులకు భయంకరుడు. అలాంటివాడు చచ్చి నేలబడితేనేకాని నా దుఃఖాలు పోవు”.

         తనకు, తన అన్నకు విరోధం వచ్చిన విధం చెప్పడం ప్రారంభించాడు. “మయుడి కుమారుడు, దుందుభి సోదరుడైన మాయావి అనేవాడు స్త్రీ కారణాన వాడికీ, వాలికీ వున్న విరోధాన్ని అడ్డం పెట్టుకుని ఒక అర్థరాత్రి అందరూ నిద్రించే సమయంలో వాలిమీదకు యుద్ధానికి వచ్చాడు. రాక్షసులతో అర్థరాత్రి యుద్ధానికి పోవడం మంచిది కాదని నచ్చచెప్పాం. మా మాట వినకుండా వాడిమీదకు యుద్ధానికి పోయాడు”.

“ఒంటరిగా రాక్షసులమీడకు యుద్ధానికి పోతున్న అన్న వాలి వెంట నేను కూడా పోయాను.  ఆ రాక్షసుడు భయంతో వేగంగా పరుగెత్తసాగాడు. ఆ దానవుడు ఒక బిలంలో ప్రవేశించాడు. అప్పుడు మా అన్న దానవుడిని చంపి వస్తానని చెప్పి లోపలికి పోయాడు. నేను బిలం బైట నిలబడ్డాను. ఒక సంవత్సరం నేనా బిలం బైటనే వుండిపోయాను. బిలంలోనుండి నెత్తురు భయంకరమైన నురుగుతో బయటకు రాసాగింది. రాక్షసుల సింహనాదాలు స్పష్టంగా వినపడ్డాయి. వాలి దీనమైన ఏడుపు వినపడ్డది. పరాక్రమం క్షీణించి వాలి రాక్షసుడి చేతిలో చిక్కాడని, మరణించాడని భావించి, కొండను ఆ బిలానికి అడ్డంగా వేసి అక్కడి నుండి వెళ్లిపోయాను. మంత్రులు నన్ను రాజ్యానికి రాజుగా చేసి, పట్టాభిషేకం చేశారు. ఆ విధంగా రాజునైన నేను రాజ్యాన్ని పాలిస్తున్నాను”.

“ఇంతలో, వాలి దైత్యుడిని చంపి, నగరానికి వచ్చి, రాజ్యాన్ని కోరి తనను విడిచి వెళ్ళిపోయానని సందేహించాడు. పట్టాభిషేకం చేసుకున్న నన్ను చూసి కోపంగా చూశాడు. నన్ను తిట్టి, నా దగ్గరున్న మంత్రులందరినీ బంధించి, వాళ్లను చెరసాలలో వేశాడు. నన్ను వూరు వెడలగొట్టాడు. నా భార్యను గ్రహించాడు. అంతటితో ఆగకుండా నన్ను చంపడానికి రావడంతో ప్రాణ భయంతో అనేక దేశాల్లో తిరిగి చివరకు ఈ గుట్టకు అతడు రాలేకపోవడానికి కారణం వుండడం వల్ల ఇక్కడ స్థానం ఏర్పాటు చేసుకున్నాను. బుద్ధిపూర్వకంగా నేను ఏ అపకారం చేయలేదు. అలా అయినప్పటికీ పడరాని కష్టాలను పడుతున్నాను. నన్ను రక్షించు”.

సుగ్రీవుడు జరిగినదంతా సత్యంగానే చెప్పాడు కాని, తాను రాజుగా వున్న సమయంలో అన్న భార్య తారను గ్రహించిన సంగతి చెప్పలేదు. ఈ కలహంలో మొదలు సుగ్రీవుడు మీద అనుమానం రావడం సహజమే. కాని సుగ్రీవుడు బుద్ధిపూర్వకంగా చేయాలని పొరపాటు చేయలేదు. వాస్తవంగా రాజ్యకాంక్ష వల్ల వాలికి ద్రోహం చేసినట్లయితే అతడు కిష్కింధకు వచ్చినప్పుడు తన బలంతో వాలిని నిగ్రహించగలిగేవాడే! వాలిసుగ్రీవులు ఇద్దరూ ఇంచుమించు సమానమైన బలవంతులే. వాలిదగ్గర ఇంద్రదత్తహారం వుండడం వల్ల ఎక్కువ బలశాలి అయ్యాడు. హనుమంతుడు, నీలుడు లాంటివారు సుగ్రీవుడి సహాయకులు. సుగ్రీవుడు వాలితో యుద్ధానికి పూనుకుంటే ఒక్క హనుమంతుడే వాలిని మట్టుబెట్టగలడు. కాబట్టి సుగ్రీవుడిలో ద్రోహబుద్ది లేదు.

సుగ్రీవుడి విషయంలో వాలి అనుమానపడ్డాడు. బిలద్వారం మూయడం, రాజ్యాభిషిక్తుడు కావడం ద్రోహబుద్ధితో చేశాడని నమ్మాడు. తాను జీవించి వుండగా తన భార్య తారను గ్రహించాడని కోపం వచ్చి వుండవచ్చు. అందుకే ఆ తరువాత సుగ్రీవుడి భార్యను వాలి గ్రహించాడు. అయితే సోదరుడు మరణిస్తేనే ఆయన భార్యను స్వీకరించవచ్చని ఒక మర్యాద ఆ జాతుల్లో వుంది. వాస్తవానికి వాలి మరణించాడని నమ్మి ఆయన భార్యను సుగ్రీవుడు గ్రహించాడు. కాని, సుగ్రీవుడు జీవించి ఉన్నాడని తెల్సికూడా వాలి అతడి భార్యను గ్రహించాడు. ఈ కులమర్యాదను రామచంద్రుడు కూడా ఆదరించాడు. ఎందుకంటేవాలి మరణం తరువాత సుగ్రీవుడు తారను గ్రహించాడని తెలిసీ ఆయన ఏం అనలేదు. వాలి కుల మర్యాదను, శాస్త్ర మర్యాదను ఉల్లంఘించడం వల్లే శిక్షార్హుడయ్యాడు.

సుగ్రీవుడు ఇలా చెప్పడంతో రామచంద్రమూర్తి అతడితో, “మిత్రమా! బాధపడవద్దు. నా బాణాలతో నీ పగ తీరుస్తాను. ఆ పాపాత్ముడెంతవరకు నాకంట పడడో అప్పటివరకే సుఖంగా వుంటాడు. కపీశ్వరా నా దుఃఖంలాంటిదే నీ దుఃఖం. దాన్ని ఉపశమించేట్లు చేస్తా. సంతోషించు”. ఆ తరువాత దుందుభి వృత్తాంతాన్ని చెప్పాడు. వాలి, దుందుభి మధ్య జరిగిన యుద్ధంలో ఏ విధంగా వాలి దుందుభిని చంపి, వాడి కళేబరాన్ని చేతులతో పైకెత్తి, ఆమడ దూరంలో పడేట్లు విసిరి వేసింది చెప్పాడు. “అప్పుడారాక్షసుడి నోటినుండి కారుతున్న నెత్తురు గాలికి కొట్టుకుని వచ్చి మతంగాశ్రమంలో పడింది. అది చూసి మునీశ్వరుడు బాగా కోపం తెచ్చుకున్నాడు. తన తపశ్శక్తితో బలోన్మత్తుడైన వాలి చేసిన పని ఇది అను గ్రహించాడు. వాలిమీద కోపం తెచ్చుకున్నాడు ముని. వాలి ఇక్కడికి వస్తే చచ్చిపోతాడు అని శపించాడు. అప్పటి నుండి వాలి ఇక్కడికి రాడు. ఆ విషయం నాకు తెలిసినందువల్ల భయం లేకుండా ఇక్కడ తిరుగుతున్నాను. అదిగో అదే ఆ రాక్షసుడి ఎముకల గూడు. నేలపడి వుంది చూడు. రామచంద్రా! వాలి భుజబలం ఎలాంటిదో నీకు చెప్పాను. అలాంటి మహాబలశాలి వాలిని నువ్వెలా చంపుతావో చెప్పు” అని అంటాడు సుగ్రీవుడు.

         రాముడు తనలో తానే నవ్వుకుని, తన బలాన్ని ఆయన నమ్మేట్లు ప్రదర్శిస్తానని సుగ్రీవుడితో అన్నాడు. దుందుభి శరీరాన్ని దూదిలాగా తన వేలితో అవలీలగా ఎత్తి పది యోజనాల అవతల పడేట్లు చిమ్మాడు. రామచంద్రమూర్తి ఇంకా సుగ్రీవుడికి నమ్మకం కలిగేట్లు చేయడానికి, ఆయన చూపించిన మద్దిచెట్టును గురిచూసి కొట్టాడు. రామచంద్రమూర్తి వేసిన బాణం త్వరగా పోయి, ఆ ఏడు చెట్లను త్వరగా నరికి, కొండబద్దలయ్యేలా భేదించి, భూమిలో దూరి, మళ్లీ త్వరగా బయటకు వచ్చి ఆయన అంబులపొదిలో చేరింది. తన రెండు చేతులు జోడించి, రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ తన అన్న వాలి ఆయనకు ఒక లెక్క కాదన్నాడు. అన్నను రాముడు చంపుతాడన్న నమ్మకం కుదిరింది. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

No comments:

Post a Comment