Saturday, February 13, 2021

తొలి సీతాన్వేషణలో హనుమ విఫలుడైనాడా? : వనం జ్వాలా నరసింహారావు

 తొలి సీతాన్వేషణలో హనుమ విఫలుడైనాడా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (13-02-2021) ప్రసారం  

రాక్షస సంచారం లేని ప్రదేశం ద్వారా హనుమంతుడు లంకా ప్రవేశం చేశాడు. శతృ స్థానాలలోకి దొడ్డిదారి ("అద్వారం") నుండే ప్రవేశించాలన్నది రాజనీతి. హనుమంతుడదే పనిచేసాడు. శత్రు దేశంలోకి ప్రవేశించేటప్పుడు ఎడమకాలు ముందుంచాలి కాబట్టి హనుమంతుడు ఆ పద్ధతినే అనుసరిస్తాడు. రాచబాటకు చేరిన హనుమంతుడు, లంకను నలు దిక్కులనుండి చూసి, దాని బహుముఖ ఐశ్వర్యానికి  మురిసిపోయాడు. అలా తిరుగుతున్న హనుమంతుడికి వర్ణనాతీతమైన ధ్వనులు వినిపిస్తాయి. ధ్వనులకు తోడు, వేదాధ్యయనం చేసేవారిని, రాక్షస వందిమాగధులను, రాచబాటల నడుమ నిల్చున్న గుంపులను, వేగులను, గర్జించే రాక్షసులను, దీక్షలో వున్నవారిని కూడా చూసాడు హనుమంతుడు. రావణాసురుడి ఇంటి ముందు, కాపలాకాస్తున్న ఆయన మూలబలగాన్నీ చూసాడు హనుమంతుడు. కమ్మని వాసనలతో కూడి వున్న రావణాసురుడి అంతఃపురాన్నిచూసాడు హనుమంతుడు.

 రావణుడి అంతఃపురాన్ని బయటనుండే చూసి, ఆ తర్వాత లోనికి ప్రవేశిస్తాడు. మద్యపానంతో శరీరాన్ని మరిచి ఏంచేస్తున్నారో తెలియని రాక్షసులుండే ఇళ్ల సముదాయాన్ని కనుగొంటాడు మారుతి. మద్యపాన ప్రభావంతో దేహాన్ని మరిచి మాట్లాడుతూ, ఇతరులను బెదిరిస్తున్న రాక్షసులను హనుమంతుడు చూసాడు. భర్తలను రతికై ప్రార్ధిస్తున్న స్త్రీలను హనుమంతుడు చూసాడు. కామావేశం వున్న స్త్రీలను, వికారమైన, విడ్డూరమైన, ఇంపైన చేష్టలు చేస్తున్న స్త్రీలను, పెళ్లై సంతోషంతో వున్న స్త్రీలను చూసాడు హనుమంతుడు. లేతవయస్సులో వున్నవారిని, చంద్రబింబం లాంటి ముఖం కలవారిని, వంకరకనురెప్పల వెంట్రుకలున్నవారిని, ఆభరణాలు ధరించిన వారిని, మెరుపు తీగల్లాంటి ఆడవారిని చూసాడాంజనేయుడు.

         తను చూస్తున్న స్త్రీలలో, రాజవంశంలో పుట్టినదాని లాంటి దానిని, స్వసంకల్పంతో అయోనిజగా పుట్టిన దానిని మాత్రం చూడలేకపోయాడు హనుమంతుడు. సీతాదేవిని తాను వెతికిన అన్ని రహస్య ప్రదేశాల్లో ఎక్కడా చూడలేక పోయినందుకు హనుమంతుడు బాధపడ్డాడు ఆసమయంలో. రాక్షసుల ఇళ్లల్లో ఎంత వెతికినా, సీతాదేవిని చూడలేకపోయినందుకు చింతిస్తూ హనుమంతుడు తాను కోరిన రూపాన్ని ధరించి, మరింత వేగంగా, శ్రధ్ధగా తిరిగి వెతకనారంభించాడు. సింహాల కాపలాలో నిరపాయంగా వుండే వనంలాగా, ప్రాకారంతో చుట్టబడి వున్న రావణ గృహాన్ని చూసాడు హనుమంతుడు. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ ఇంటిని చూసి ఆశ్చర్యంతో ముక్కుపై వేలుంచుకుని దాన్నే చూడసాగాడు హనుమంతుడు. అక్కడా-ఇక్కడా అన్ని చోట్లా వెతకసాగాడు సీతకోసం హనుమంతుడు.

ఇలా తిరుగుతూ రావణుడి రాక్షస నాయకులు వుండే ఇళ్లంటిలో వరుస తప్పక సీతకొరకై వెతుకుతాడు హనుమంతుడు. అయినా ఫలితం కానరాలేదు. ఇలా వీళ్లందరి ఇళ్లల్లో వెతికిన హనుమంతుడు, మనోహరంగా, విశాలంగా వున్న అందమైన రావణాసురుడి గృహాన్ని చూస్తాడు హనుమంతుడు. ఆ పరిసరాలలో సువాసనలు వెదజల్లే మనోరంజకమైన పుష్పక విమానాన్ని చూసిన హనుమంతుడు దాని రూపకల్పనకు ఆశ్చర్య పడ్డాడు. ఆపట్టణంలో ఎంతసేపు తిరిగినా, వెతుకుతున్న సీత జాడ తెలియరానందున ఏంచేయాలన్న విచారంలో పడ్డాడు సునేత్రుడైన హనుమంతుడు. దాని సౌందర్యం దేవతల విమానాలకు లేనేలేదు. దాంట్లోని ఏ భాగం, ఏ ప్రదేశం చూసినా ఆశ్చర్యం కలుగక మానదు.

         పుష్పక విమానం మధ్యలో, అర్ధ యోజనం వెడల్పు, యోజనం పొడవున్న రావణుడి ఇంటిని చూసి, అందులోకి పోయి, అక్కడ సీతాదేవి కనపడుతుందేమోనని వెతకసాగాడు హనుమంతుడు. మేడలనేకం వున్న రావణుడి నగరంలోని బలవంతులైన రాక్షసుల ఇళ్లలోనూ, రావణుడుంటున్న ఇంటిలోనూ, తనకార్యక్రమాన్ని కొనసాగించాడు మారుతి. రావణాసురుడి రక్షణలో వున్న ఆ ఇల్లు, ఇంపైన ధ్వనులతో వీనులకు, రూపాలతో కళ్లకు, త్రాగటానికి ఇంపైన వాటితో చర్మానికి, వాసనలతో ముక్కుకు, నోరూరిస్తూ నాలుకకు తృప్తినిచ్చాయి హనుమంతుడికి. అక్కడి దీపాల కాంతి, రావణుడి దేహకాంతి, వాడు ధరించిన బంగారపు సొమ్ముల కాంతి, కలవడంతో ఆ శాల మండుతున్నట్లు వెలుగుతోంది. ఆ విశేషం చూసి హనుమంతుడు, ఔరా! అని తనలో మెచ్చుకుంటాడు.

             ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, చింతిస్తూ, సీతాన్వేషణ కొనసాగిస్తాడు హనుమంతుడు. అలా వెళ్తున్న అతడికి రావణుడి శయ్య కనిపిస్తుంది. చిత్రమైన దాని ఆసనాలు స్ఫటికాలతో, బంగరు వైడూర్యాలతో, దంతాలతో చేయబడ్డాయి. ఇంద్రుడి పానుపును మించిన రావణుడి మంచాన్ని తిలకించి ఆశ్చర్య పోతాడు హనుమంతుడు. సర్వాలంకార శోభితంగా గడచిన రాత్రి సయ్యాటల అలసటతో కనిపిస్తున్న రావణాసురుడు ఆ పెద్ద పానుపుమీద నిద్రపోతుండడం గమనిస్తాడు హనుమంతుడు. అయ్యో! ఈపాపాత్ముడి దగ్గరకెందుకొచ్చానా అని బాధపడ్డాడు కాసేపు. నవ్వుముఖంతో రావణుడి కాళ్లదగ్గర నిద్రిస్తున్న, వాడి స్త్రీలను  నిర్మలమైన మనస్సుతో చూసాడు ఆంజనేయుడు. బాగా మత్తుగా మద్యం సేవించి, నాట్యాలు చేసి, భర్తతో రతిక్రీడలాడి, అలసి-సొలసి, వళ్లు తెలీకుండా అక్కడ పడిపోయి నిద్రపోతున్నారు రావణుడి భార్యలందరూ.

         వీరాంజనేయుడు ఇలా నిద్రిస్తున్న స్త్రీలందరినీ చూసుకుంటూ పోయి-పోయి, ఓ ప్రత్యేకమైన స్థలంలో, ఏకాంతంగా నిద్రిస్తున్న ముగ్ధ మనోహర సౌందర్యాతిశయంకల, మరో స్త్రీని గమనిస్తాడు. అలా కనిపించిన స్త్రీ పట్టపు దేవికనుక, ఈమూకలో కలవక వేరే ఒంటరిగా నిద్రిస్తోంది. మనోహర సౌందర్యరాశి, పట్టపురాణి మండోదరిని అక్కడి పడకటింట్లో నిదిరిస్తుండగా చూసాడు హనుమంతుడు. ఆమె ముగ్ధమోహనాకృతిని చూసిన హనుమంతుడు, "సీతను చూసితి-చూసితి"నని సంతోషంతో భుజాలు తట్టుకున్నాడు. తోకను ముద్దిడుకుంటాడు. గెంతులేస్తాడు. "అబ్బ ఇప్పటికి చూసాకదా సీతాదేవిని" అని అనుకుంటాడు కొంతసేపు హనుమంతుడు. కుదుటపడ్డ ఆయన మనస్సు, ఈమెట్లా శ్రీరాముడి భార్య సీతాదేవవుతుందని తర్కించుకుంటుంది. ఈమె సీత కాద"ని నిశ్చయించుకుని, మండోదరిని దాటి ఆవలికిపోయి, మద్యం సేవించే పానశాలలో సీతను వెతకడం ప్రారంభిస్తాడు.

         రావణుడి అంతఃపురమంతా వివరంగా గాలించినప్పటికీ, సీతాదేవి రూపం, ఆమె వున్న స్థలం జాడ ఏ మాత్రం తెలవకపోవటంతో చింతించాడు హనుమంతుడు. నిద్రలో పరవశమై వళ్లు తెలియకుండా వున్న పరస్త్రీలను చూసి పాపం చేసాననుకుంటాడు. ఇట్లా ఆలోచిస్తున్న హనుమంతుడి మనసుకు, తాను చేసిందిన్ది తప్పా-ఒప్పా అని నిశ్చయించి తీర్మానించగల సామర్ధ్యం-బుధ్ధి మళ్లీ కలిగింది. ఇలా విచారించే బదులు ఇంకోచోట వెతుకుతాననుకుంటాడు. ఆడది ఆడవారి మధ్యలో వుండక ఎక్కడుంటుందని నిష్కాముడనై, కర్తవ్యం నెరవేర్చాలి అనుకుంటాడు మరల. "నిష్కల్మశమైన మనస్సుతో అంతఃపురమంతా మిక్కిలి శ్రధ్ధతో వెతికాను-సీతాదేవి ఎక్కడా కానరాలేదు కదా" అనుకుని, పానశాలను విడిచి, అంతఃపురంలో వెతకసాగాడు మళ్లీ.

ఆ అంతఃపురం మధ్యలో తీగలతో ఏర్పాటుచేసిన ఇండ్లలోనూ, చిత్రాలతో అలంకరించబడిన ఇండ్లలోనూ ఎంత వెతికినా సీత కనపడలేదు. ఆమె కనపడనందున ఒకవేళ మరణించిందేమోనని అనుకుంటాడు. పాతివ్రత్య రక్షణకు పూనుకుని, సత్పురుషులతో స్తుతించబడే సుగుణోపేత సీతామాత ఆత్మహత్య చేసుకోక పోయుండవచ్చునేమో కాని, క్రూరుడైన రావణుడు చంపాడేమోనని అనుకుంటాడు. కాకపోతే కామాసక్తుడై తెచ్చిన వాడు నయానో, భయానో, కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు కాని, హింసించి వుండడనుకుంటాడు. ఒకవేళ భయంకర, వికార దేహాలు, ముఖాలు, కన్నులు వున్న రాక్షస స్త్రీలకు భయపడి సీతాదేవి ప్రాణాలు వదిలిపెట్టిందేమో, ఏంచేయాలిప్పుడని ఆలోచనలో పడ్తాడు హనుమంతుడు. చెప్పిన పౌరుష వాక్యాలను నెరవేర్చలేక, సీతను చూడలేక సుగ్రీవుడు పెట్టిన గడువు దాటినతర్వాత, ఆయన్ను చూడడం ఏ ధర్మాన్ననుసరించి చేయాలని భయపడ్తాడు. ఒకవేళ వెళ్లినా బలవంతుడైన అతడు తన ఆజ్ఞను మీరినందుకు తనను దండించక మానుతాడా? అని తలపోస్తాడు.

         "అంతఃపురంలో చూసాను, రావణాసురుడి స్త్రీలందరి మధ్యలో చూసాను. అయినా ఎక్కడా సీతాదేవి కనిపించలేదు. చేయాల్సిన కృషి అంతా చేసానే! శ్రమ వ్యర్ధమైందికదా!" అని అనుకుంటాడు హనుమంతుడు. వానరుల ఎదుట పౌరుషాలు పలికినందుకు; "హనుమంతా, ఏంచేసొచ్చావు? సీతను తెస్తానంటివే? తెచ్చావా?" అని అడిగితే జవాబేమివ్వాలి? వెతికాను, కానరాలేదు, పోయినవాడిని పోయినట్లే తిరిగొచ్చాను అని చెప్పనా? అలా ఎలా చెప్పేది? చెప్తే మంచిగుండదు. ఇలా అనుకున్న హనుమంతుడు, ఇక్కడే వుండి వెతుక్కుంటూపోతే, హనుమంతుడు రావణుడి చేతిలో చచ్చిపోయాడేమోననుకోవచ్చు నని తలుస్తాడు. అలా అనుకుని మిగిలిన వానరులు తామూ బ్రతికుండి ప్రయోజనం లేదనుకుని ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకోవచ్చుననుకుంటాడు. ఇక్కడుండకూడదు, మరలిపోవాల్సిందే అనుకుంటాడు. పోతే నాడు పొగిడిన, శ్లాఘించిన జాంబవంతుడు,అంగదుడు, ఇతర వానర ముఖ్యులు "ఛీ" అంటారేమోనని కూడా భయపడ్తాడు.

         తానిక్కడ ఊరకనే ఉండరాదనీ, వ్యర్ధుడై పోనూకూడదనీ, అధైర్యపడకూడదనీ, కార్యం ఎట్లాగైనా సాధించాలనీ, సకల కార్యాలను నెరవేర్చే ఉత్సాహాన్ని ఆశ్రయించి మళ్లీ ప్రయత్నించాలనీ నిశ్చయించుకుంటాడు హనుమంతుడు. రావణాసురుడు రక్షించే అన్నిప్రదేశాలు: పానగృహాలు, చిత్రగృహాలు, తోటలు, కేళిశాలలు, సందులు, గొందులు, వీధులు, విమానాలు, ఇవీ,అవీ,అన్నీ విడిచిపెట్టకుండా గాలించాలనీ ఆలోచిస్తాడు. అనుకున్నదే తడువుగా వెతకడం ప్రారంభించాడు. నేలమాళిగలలో, నాలుగు వీధులు కలిసే ప్రదేశాలలోని మందిరాలలో, రావణుడింటి దగ్గరున్న ఆటపట్టులలో, ఇలా పోయినచోటికే పోయి, ఎక్కినమెట్టే ఎక్కి, దిగినమెట్టే దిగి వెతుకుతాడు. ప్రాకారాలలో, ఇంటింటి మధ్యనున్న వీధుల్లో, అరుగుల్లో, దిగుడుబావుల్లో, సరస్సు తీరాలలో, రావణుడికి అనుకూలురైన స్త్రీల మధ్య, ప్రతికూలురైన స్త్రీల మధ్య ఎంత వెతికినా సీత కానరాక పోవటంతో దిగులు పడ్డాడు హనుమంతుడు.

         అక్కడినుండి ప్రాకారం మీదకు చేరిన హనుమంతుడు సీతాదేవిని చూడలేకపోయినందుకు చింతించసాగాడు. మనస్సు కలతచెందింది మరోమారు. లంకలోని చెరువులు, గుంటలు, సరస్సులు, నదులు, వంకలు, వాగులు, కొండలు, డొంకలు, సమస్త ప్రదేశాలలో వెతికినా వ్యర్ధమయింది కదా అని వ్యాకులపడ్తాడు.తర్వాత ఇలా ఆలోచిస్తాడు:

         "సీతను చూడలేకపోయాను. సీత రావణుడింట వున్నదని ఎంతోనమ్మకంతో చెప్పాడే సంపాతి! అయినా ఆమె ఇక్కడ కనపడలేదాయె! ఏంచేయాలి? సంపాతి అసత్యమాడడే? దానివలన అతడికి కలిగే లాభమేంటి? కాబట్టి ఇక్కడే ఎక్కడో సీత వుండేవుండి తీరాలి. ఎందున్నదో? రావణాసురుడికి వశపడినందున వాడామెను వీరందరిలో కలపక మరెక్కడైనా వుంచాడా?ఛీ, ఎందుకిలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి? ఆమె జనకరాజు కూతురు, మిధిలలో పుట్టింది, శ్రీరాముడి భార్య, విదేహ సంబంధమున్నది, భూమిలో పుట్టింది, పేరు సీత...అలాంటిది కామవశురాలై దుష్టుడు, జాతివల్ల నీచుడు, దనుజుడు, క్రూరుడు, మనుష్యులను తినేవాడైన రావణుడిని ఎట్లా కామిస్తుంది? అట్టి విపరీతం ఎప్పటికీవుండదు"

         "సీతాదేవి ఇందులేదు-అందులేదు. పోనీ రావణుడు అపహరించుకుని ఎత్తుకొస్తున్న సమయంలో, అబల అయిన సీత నడితోవలో పడిపోయివుండవచ్చా? అలాకాకపోతే ఆకాశమార్గాన తన్నెత్తుకుని రావణుడు పోతున్న సమయంలో, క్రిందున్న సముద్రాన్ని చూసి, పరవశించి, వశంతప్పి, దాంట్లో పడిపోయిందా? వాడి వేగానికి ధైర్యం కోల్పోయి, వణకుతూ ఆకాశంలోనే తనువు చాలించిందా? శ్రీరామచంద్రుడిని, పున్నమినాటి చంద్రుడినే తిరస్కరించేరీతి ముఖాన్ని, తామరపూలరేకుల్లాంటి ఆయన కళ్లను స్మరిస్తూ ప్రాణం విడిచిందా? రావణుడే భక్షించాడా? రావణస్త్రీలు చంపారా? చంపి తిన్నారా? రామా! లక్ష్మణా! అంటూ ఏడుస్తూ మరణించిందా? ఇలా పరిపరి విధాలుగా అనుకుంటాడు.

రామపత్ని సీత రావణాసురుడి వశంకావడం కల్లనీ, అందువల్ల, వాడే ఎక్కడైనా సీతను దాచైనా వుంచి వుండాలి, లేదా, పతివ్రత కనుక వశపడక సముద్రంలో పడి మరణించైనా వుండాలి అనుకుంటాడు. భార్యపై ప్రేమ వున్న రాముడికి తాను ఏమనిచెప్పాలని మధనపడ్తాడు హనుమంతుడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

Sunday, February 7, 2021

పుత్ర హీనతకు విషాద పడిన దశరథుడికి అశ్వమేథ యాగం చేయాలన్న ఆలోచన .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-43 : వనం జ్వాలా నరసింహారావు

 పుత్ర హీనతకు విషాద పడిన దశరథుడికి

అశ్వమేథ యాగం చేయాలన్న ఆలోచన

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-43

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (08-02-2021)

ధార్మికుడు, భగవదవతారానికి అన్ని అర్హతలున్న దశరథుడు, భగవదారాధన రూపకమైన యజ్ఞాన్ని మున్ముందు చేయబోతున్నాడనే విషయాన్ని వివరిస్తాడీ సర్గలో వాల్మీకి మహర్షి. విష్ణుమూర్తికి శ్రీదేవి-భూదేవి-నీళాదేవి లాగా, ధర్మ-అర్థ-కామాల లాగా, రాజస-సాత్విక-తామస గుణాలున్న ముగ్గురు భార్యలున్నారు దశరథ మహారాజుకు. ధర్మ బుద్ధిగల కౌసల్య, బంగారు కొండలాంటి సుమిత్ర, రూపమే ప్రధానమైన కైకేయి లే ఆ ముగ్గురు. కౌసల్యకు రజో గుణం, సుమిత్రకు తత్వ గుణం, కైకకు తమో గుణం ప్రధానంగా వున్నాయి. ముగ్గురిలో ఇలా మూడు రకాలైన గుణాలుండడం విశేషం. కౌసల్య కోసల రాజుకు, సుమిత్ర మగధ రాజుకు, కైక కేకయ రాజుకు కూతుళ్లు. భోగభాగ్యాలెన్ని వున్నా కొడుకులున్న సుఖం దశరథుడికి  గానీ, కన్నకొడుకులను ఎత్తుకునే అదృష్టం ముగ్గురు భార్యలకు గానీ లేదు. సంతానం లేదన్న కారణాన తపస్సు చేసినా ఫలితం దక్కలేదు. సుందర మందిరాలు-సువాసనలిచ్చు పూలతోటలు-ఏనుగు దంతాలతో, బంగారు రత్నాలతో కట్టిన అసమాన శాలలు-రాజ్య విలాస క్రీడలు-సుకుమారంలో రతీదేవిని మించిన సుందరమైన భార్యలు-అసమాన పరాక్రమం వున్నా, సంతానం లేనందున, సుఖాలెన్ని వున్నా-కుమారులవలన కలిగే భోగ భాగ్యాలతో సరితూగవని-తన తపస్సు వ్యర్థమనీ బాధపడేవాడు దశరథుడు.

(బ్రాహ్మణుడు పుట్టుకతోనే బ్రహ్మచర్యమైన ఋషుల రుణం, యజ్ఞాలైన దేవ రుణం, బిడ్డలను కనాల్సిన పితృ రుణం అనే మూడు రుణాలతో జన్మిస్తాడు. సుతులు లేనివారికి గతులు లేవంటారు. కొడుకులవల్ల జయం-మనుమల వల్ల సౌఖ్యం-ముని మనుమల వల్ల స్వర్గ సుఖం కలుగుతాయి. ఈ సుఖ సౌఖ్యాలన్నీ సత్ పుత్రులైతేనే. ఇదే మోతాదులో, దుష్ట పుత్రులవల్ల కీడు కలుగుతుంది. అందుకే, ఆజన్మాంతం భగవత్ భక్తి లేనివాడు తమ వంశంలో పుట్ట కూడదని, పుట్టినా వెంటనే చచ్చిపోవాలనీ పితృదేవతలు కోరుకుంటారు).

మనస్సులో పరితపిస్తున్న దశరథుడు సభా మందిరానికి వచ్చి, మంత్రులతో సమాలోచనలు చేస్తాడు. పుత్రులు కలిగేందుకు అశ్వమేథ యాగం చేస్తాననీ-అలా చేస్తే సంతానం కలగొచ్చనీ అంటాడు. అలా నిశ్చయించుకున్న వెంటనే, ఆ కార్యక్రమం గురించి ఆలోచించేందుకు, గురువులను-పురోహితులను తీసుకుని రావాలని, మంత్రులలో శ్రేష్టుడైన సుమంత్రుడిని కోరతాడు దశరథుడు. రాజాజ్ఞ ప్రకారం సుమంత్రుడు ఏమాత్రం ఆలశ్యం చేయకుండా, వేదాధ్యయనం చేసే వాసుదేవుడిని-సుయజ్ఞుడిని-జాబాలిని-కాశ్యపుడిని, ముఖ్య గురువైన వశిష్ఠుడిని, ఇంకొందరు ప్రముఖులను స్వయంగా వెళ్ళి తోడుకొని వస్తాడు. దశరథుడు వారినుద్దేశించి, ఇంతమంది తపస్సంపన్నులు తనకు సహాయం చేస్తున్నప్పటికీ, క్రూర గ్రహాలు తనకు కొడుకులు పుట్టకుండా ఎలా చేయగలుగుతున్నాయని ప్రశ్నిస్తాడు. సూర్యుడు మొదలు తన తరం వరకూ, అవిచ్ఛిన్నంగా వస్తున్న తమ వంశం, తన తదనంతరం ఆగిపోతే, రాజ్యం పరుల పాలై తనకు అపకీర్తి వస్తుందని వారితో అంటాడు దశరథుడు. సంతానం కలగలేదని చింతా సాగరంలో మునిగి బాధపడుతున్న తనకేదన్నా దారి చూపమని వారిని అడుగుతాడు. పుత్రులకొరకు అశ్వమేథ యాగం చేద్దామన్న తన కోరిక నెరవేరే ఉపాయం ఆలోచించమని కోరుతాడు. దశరథుడి ఆలోచన సక్రమంగానే వుందనీ-దానికవసరమైన పనులు ప్రారంభించమనీ వశిష్ఠుడితో సహా అందరు సలహా ఇస్తారు దశరథుడికి.

సందేహం మాని గుర్రాన్ని దేశ సంచారం కొరకు పంపాలనీ, పుత్రులు అవశ్యం కలుగుతారని, ధర్మబుద్ధిగల దశరథుడికి నీతిమంతులైన పుత్రులే పుడతారని వారంటారు. బ్రాహ్మణ వాక్యం వ్యర్థం కాదని నమ్మిన దశరథుడు, తన కప్పుడే పుత్రులు కలిగిన ఆనందంతో ఉప్పొంగి పోతాడు. యజ్ఞానికి కావల్సిన సమస్త సామాగ్రిని సమృద్ధిగా సమకూర్చాలని మంత్రులను ఆజ్ఞాపిస్తాడు. గురువులు చెప్పినట్లే గుర్రాన్ని విడవాలని-దానికి రక్షణగా ఒక పురోహితుడిని పంపాలని-సరయూనదీ తీరాన యజ్ఞశాల నిర్మించాలని-శాస్త్ర ప్రకారం జరగాల్సిన విధులన్నీ నిర్వహించాలని, దశరథుడు ఆదేశిస్తాడు. ఇలాంటి యజ్ఞాన్ని అందరు రాజులకు చేయాలన్న కోరికున్నప్పటికీ, మంత్రలోపమో-తంత్రలోపమో-శ్రద్ధాలోపమో-దక్షిణాలోపమో జరిగితే, ఇబ్బందులెదురైతాయనీ, అందుకే చేయడానికి భయపడుతారనీ అంటూ, అవేమీ లేకుండా చూడమని మంత్రులకు చెప్తాడు దశరథుడు.

యజ్ఞం నిర్వహణలో ఎక్కడో అక్కడ ఏదన్నా లోపం జరుగకపోతుందానని కాచుక్కూచుండే బ్రహ్మ రాక్షసులు దాన్ని విఘ్నం చేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తారనీ-అదే జరిగితే కర్తకు కీడు కలుగుతుందనీ-అందువల్ల ఎలా చేస్తే విఘ్నాలు లేకుండా కొనసాగుతుందో అలానే సమర్థవంతంగా చేయాలని అంటాడు దశరథుడు. (పతితులతో కలిసిమెలిసి వుండేవాడు, పర స్త్రీ సాంగత్యం చేసేవాడు, బ్రాహ్మణుడి సొమ్ము అపహరించేవాడు, బ్రహ్మ రాక్షసుడిగా పుట్తాడు. రాక్షసుల్లో బ్రాహ్మణులు బ్రహ్మ రాక్షసులు. రావణాసురుడు క్షత్రియ రాక్షసుడు).

దశరథుడి లాంటి గొప్పవారు, సత్యాత్ములు పూనుకొని చేసే కార్యక్రమాలు విఘ్నం లేకుండా జరుగుతాయని చెప్తూ, పనులన్నీ చక్కగా నెరవేరుస్తామని హామీ ఇస్తారు మంత్రులు. మంత్రులు-పురోహితులు మినహా మిగతావారందరు అప్పటికింక దశరథుడిని దీవించి, శలవు తీసుకుంటారు. యజ్ఞం కొరత లేకుండా జరగడానికి కావలసినవన్నీ సమకూర్చమని మంత్రులను మళ్లీ ఆజ్ఞాపించి, దశరథుడు అంతఃపురానికి వెళ్తాడు. పుత్రులు కలగడానికి కారణమైన యజ్ఞాన్ని చేయబోతున్నానని, అంతఃపురంలోని తన భార్యలతో అంటూ, ఆ రోజునుండి వారుకూడా దీక్షతో వుండాలని కోరతాడు దశరథుడు.

Saturday, February 6, 2021

లంకిణి ఓటమి లంకా నాశనానికి సూచనా? : వనం జ్వాలా నరసింహారావు

 లంకిణి ఓటమి లంకా నాశనానికి సూచనా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (07-02-2021) ప్రసారం  

అసాధ్యమైన సముద్రాన్ని సులభంగా, అవలీలగా దాటి, త్రికూటపర్వత శిఖరమందున్న లంకను చూసిన తర్వాతనే హనుమంతుడి మనస్సు కుదుటపడింది. బహిరంగంగా తనుతిరిగితే రాక్షసులు చూస్తారేమోనన్న అనుమానంతో, ఉద్యాన వనంలోని చెట్ల చాటున తిరగసాగాడు.

           హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని దాటాడని రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది. అయినప్పటికీ, ఇప్పుడు సముద్రమంత వెడల్పు లేదుకదా? రావణాసురుడి లంక ఇదేనా?. అని కొందరు సందేహపడుతుంటారు. అయితే, కొన్ని బౌధ్ధ ప్రామాణిక గ్రంథాలను చదివినవారికి ఈ అనుమానం నివృత్తి చేసుకునే ఆధారాలు లభ్యమవుతాయి. ఇంద్రజిత్ హోమం చేసిన "నికుంభిల", సీతాదేవిని వున్చిన "అశోకవనం" ఇప్పటికీ వున్నాయక్కడ. అక్కడ సీతాదేవి పూజించబడుతున్నదనీ, "రావణకోట" అనే స్థలం కూడా వున్నదనీ, స్పష్టమవుతున్నది. దీన్నిబట్టి సింహళద్వీపమే ఈనాటి శ్రీలంక, ఒకనాటి లంక.

అయితే, ఇప్పుడు సింహళద్వీపానికీ, మనదేశానికీ, మధ్యవున్న సముద్రం వెడల్పు అరవై మైళ్లే. నూరుయోజనాలకు, అరవై మైళ్లకు ఎంతోవ్యత్యాసముందని అనుకోవడం సహజం కదా. ఇకపోతే యోజనం కొలత, ఇంత అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఎనిమిది మైళ్లని కొందరు, రెండున్నర మైళ్లని కొందరు లెక్కలు చెప్తారు. అదే విధంగా "ఆమడ", "క్రోసు"ల విషయంలో కూడా స్పష్టత లేదు. ఇప్పటిమైలు (1760 గజాలు) పూర్వంలేదు. కావున యోజనం అంటే, ఖచ్చితంగా ఇన్ని మైళ్లని నిర్ధారించలేం. అంతే కాకుండా ఇప్పుడు సముద్రం అరవై మైళ్లే అయినప్పటికీ, రామాయణ కాలంలో, ఎక్కువై వుండవచ్చు. సముద్ర భాగమ్ విశేషంగా పూడిపోయి క్రమేపీ నేలగా మారిందని శాస్త్రవేత్తలు వ్రాసి వున్నారు. వ్రాస్తున్నారు కూడా. ఇప్పటి రఘునాధ పురానికి దక్షిణ భాగమంతా పూర్వం సముద్రంగా వుండేది. అదే విధంగా, పురాణాలలో చెప్పిన దాన్ని బట్టి, ఇప్పటి తిరువాన్‍కూర్ పూర్వం సముద్రంలో మునిగుండేదట. అలాంటప్పుడు నేటి తిరునల్‍వెళ్లి సముద్రంలో మునిగి వుండవచ్చుకదా!

రామాయణంలో చెప్పబడ్డ "త్రికూటం", "లంబపర్వతం", "సువేల" అనేవి లంకకు దక్షిణ భాగాన వున్నవేకాని, ఉత్తర భాగంలో లేవు. కాబట్టి ఇప్పటి లంకలోని ఉత్తర భాగం కూడా సముద్రంలో మునిగే వుండాలి. లేదా హనుమంతుడు ఈ ప్రదేశాన్ని వదిలి అక్కడకైనా పోయుండాలి. ఈ పర్వతం చుట్టూ సముద్రమున్నదన్నాడుకాని, గ్రామాలున్నట్లు వాల్మీకి చెప్పలేదు. "సువేల" అన్న పదమే సముద్ర తీరమన్న అర్ధాన్ని చెప్తోంది. లంకలోని ఇప్పటి ఉత్తర రేవుకు, త్రికూటానికి, మధ్య దూరం, నూరు మైళ్లకు పైనే వుంది. కాబట్టి హనుమంతుడు దాటింది రెండొందల ఏభై మైళ్లని తేలుతున్నది. అంటే నూరుయోజనాలు రెండొందల ఏభై మైళ్లకు సమానం కావచ్చు.

           సీతను దొంగిలించి తెచ్చిన రావణాసురుడు, ఆమెకు కాపలాగా విల్లు, బాణాలు ధరించి ఎల్లప్పుడూ తిరుగుతుండే రాక్షస శ్రేష్ఠులుండే సమస్త ప్రదేశాలు కనిపించాయి ఆఝనేయుడికి. శోభాయమానంగా వున్న లంకను కొండ శిఖరాన్నుంచే చూసిన హనుమంతుడికది ఆకాశాన వున్న స్వర్గంలాగా గోచరించింది. లంకను మొట్టమొదట విశ్వకర్మ నిర్మించాడు. కుబేరుడికి తొలుత స్థానమైంది. అంద-చందాలలో ఈవిధంగా ఉండవచ్చేమోనని ఉహించనలవికానిది.

         లంకను గెలవడం అసాధ్యమనిపిస్తుంది హనుమంతుడికి. శ్రీరామచంద్రమూర్తి లంకకు వచ్చినప్పటికీ, రావణ రక్షణలో ప్రవేశించనలవికాని లంకానగరాన్ని ఏంచేయగలడన్న అనుమానమేస్తుంది ఆయనకు. పోనీ, మనకు విరోధమెందుకు? సీతను అప్పగించమని మంచితనంగా సామ, దాన, భేద, దండో పాయాలు కూడా పనికి రావేమో అనుకుంటాడు. ఇప్పుడు తాను చేయవలసిన పని సీతను వెతకడం, దానికి లంకలో ఎలా ప్రవేశించాలని యోచించడమనుకుంటాడు. లంకకు పోయేమార్గమేంటని ఆలోచిస్తాడు. బహిరంగంగా లోపలికి వెళ్లడం మంచిదికాదు. తెలవకుండా వంచించి, లోపలికి పోయి, కనపడవలసిన చోట కనపడుతూ, కనపడరాని చోట కానరాక వుండే రీతిలో వేషాలు మార్చాలనుకుంటాడు ఆంజనేయుడు. మొత్తం మీద చీకటి మాటున కార్యం చక్కబర్చుకోవాలని కూడా నిర్ణయించుకున్టాడు.

         "ఏవిధంగా చేస్తే నా ప్రయత్నం సఫలమౌతుంది? పగటి వేళ ప్రవేశించాలా? రాత్రి వేళా? ఈ రూపంలోనా? రూపం మార్చాలా? ఈక్షణమే ఈ రూపంతోనే పోవాల్నా? అలాపోతే, రాక్షసుల కంటబడితే, రామకార్యం, సీతాదేవిని వెతకడం చెడిపోతుందికదా? రాక్షస రూపంలో పోవాలా? లంకలోని వారందరూ ఒకరికొకరు తెల్సినవారేకదా? కొత్తవాడినైన నన్ను గుర్తించరా? ఇంకో రూపంలో పోయినా వారు తెలుసుకోవచ్చుకదా? ఈ రాక్షసులకు తెలియకుండా గాలికూడా లంకలో సంచరించలేదుకదా!" అని హనుమంతుడు పరి-పరి విధాలుగా ఆలోచిస్తాడు. చీకటి పడేవరకు ఇక్కడే దాక్కొని, ఆతర్వాత చిన్న కోతిగా మారి, రావణుడి పట్టణంలో చొరబడి, సీతాదేవిని రాక్షసుల ఇళ్లలో వెతకాలి. అట్లైతే రామకార్యం చేసినవాడినన్న గౌరవంతో అతిశయించగలనని ఆలోచించాడు హనుమంతుడు.

          సూర్యుడు అస్తమించగానే, పిల్లి ఆకారంతో, "ప్రదోష"  కాలంలో, లంకలో ప్రవేశించేందుకు, కొండ దిగి నడిచి రాకుండా, అక్కడి నుండే ఒక్క గంతేసాడు హనుమంతుడు. లంక రక్షణకై నియమించబడిన, కఠిన రాక్షసులను లంకా నగరం ప్రవేశిస్తూనే చూసాడు హనుమంతుడు. లంకాపురిని ప్రవేశించడానికి లంబ పర్వతంపైనుండి దిగుతాడు హనుమంతుడు. ఆయన దిగిన లంబ పర్వతమప్పుడు చీకట్లో వేలాడే పర్వతంలాగా వుంది. ఎంతో చిత్ర, విచిత్రంగా వుందే ఈ లంకానగరం! అనుకుంటాడు హనుమంతుడు. లంకానగర సౌందర్యాన్ని చూసి, ప్రాకార సమీపాన్నుండి లంకానగరాన్నొక్కసారి తేరిపార చూస్తాడు హనుమంతుడు. మనోహరమైన ఆరావణుడి పట్టణాన్ని, దాని గొప్పతనాన్ని తిలకించి, ఎంతో సంతోషంతో దాన్ని గురించి మరీ, మరీ అనుకుంటాడు మనస్సులో హనుమంతుడు.

         ఒరనిండా, చేతిలో, కత్తులుంచుకుని తిరిగే సైనికుల రక్షణలో వున్న ఈపట్టణాన్ని బలంతో గెలవడం ఎవరికీ సాధ్యం కాదేమో ననుకుంటాడు హనుమంతుడు. అయితే, అంగదుడు, ద్వివిదుడు, సుగ్రీవుడు, మైందుడు,  సుషేణుడు, రుక్షుడు, కుముడు, కుషపర్వుడు, కేతుమాలుడు మాత్రం లంకలో ప్రవేశించ గలరనుకుంటాడు.

         ఈప్రకారం, లంకలోకి రాగల బలవంతులగు వానరులను లెక్కపెట్టి, రామలక్ష్మణుల బలపరాక్రమాలను ఆలోచించి, భయపడాల్సిన పనిలేదు, వారు వస్తే విజయం కలుగుతుందని సంతోషపడ్తాడు. ఇలా ఆలోచిస్తూ మరీ, మరీ సమీపంలోకి పోతాడు హనుమంతున్తుడు. పోతున్న అతడికి, రావణుడి పట్టణం, మణులనే దుస్తులు కప్పుకొన్నట్లుగా, పశువుల కొట్టంలాంటి శిరోభూషణాలు కలదిగా, యంత్రశాలను పోలిన స్తనాలున్నట్లుగా, అలంకరించుకున్న స్త్రీ లాగా కనిపించింది. ఆయన ఇలా లంకను గురించి అనుకుంటుండగానే లంక స్త్రీగా రానే వచ్చింది.

లంకానగరంలో ప్రవేశిస్తున్న కోతిని లంకాదిదేవత లంఖిని తన సహజ రూపంతో చూసింది. అదే సమయంలో ఆమెనూ చూసాడు హనుమంతుడు. తక్షణమే కోపంతో వూగిపోతూ అసహ్యమైన  ముఖాన్ని, భయంకరమైన రూపాన్ని, దాల్చిన “లంక” హనుమంతుడికి అడ్డంగా నిల్చి గర్జిస్తూ, “నువ్వెవరివి? ఎందుకొచ్చావు? నీవు చావక ముందే చెప్పు” అని ప్రశ్నించింది. ఎల్ల వేళల, అన్ని ప్రదేశాలలో, రావణుడి సేనలతో రక్షించబడుతున్నలంకా నగరంలోకి దేవతలే ప్రవేశించలేనప్పుడు ప్రవేశించినా బ్రతకలేనప్పుడు, హనుమంతుడేలా రాగాలిగాడని నిలదీస్తుంది.

         "సరే నాసంగతి తర్వాత చెప్తాను. వికారపు కన్నులతో, లంకా నగర వాకిట్లో వున్న నీవెవ్వరవు? ఇక్కడెందుకున్నావు? నాకెందుకు అడ్డుపడ్తున్నావు? ఊరంటూ వుంటే ఎవరో ఒకరు రాకుండా వుండరు కదా!" అని ఎదురు ప్రశ్న వేస్తాడు ఆంజనేయుడు. ఆమాటలు విన్న "లంక" మండిపడి, మారుతిని చూసి కోపంతో, భయంకరంగా మాట్లాడడం మొదలెట్టిందీవిధంగా:

         "రావణాసురుడి ఆజ్ఞను శిరసావహించి, ఈపట్టణాన్ని ఎల్లవేళలా రక్షిస్తున్నాను. నాకళ్లు కప్పి నువ్విందులోకి రాలేవు. అది సాధ్యపడే విషయం కాదు. ఓ కోతీ, నువ్విప్పుడే చస్తావు. నేనే లంకనురా! ఇది నాసంగతి. మరి నువ్వెవరివో చెప్పు."

         "లంకిణి" మాటలకు ఏ మాత్రం అధైర్యపడలేదు హనుమంతుడు. స్త్రీ ఆకారంలో వున్న ఆమెను చూస్తూ, ఏమాత్రం సందహించకుండా, లంకను చూసిపోదామన్న కోరికతో వచ్చానని చెప్పాడు. తనను గెలవకుండా ద్రోహబుధ్ధిగల హనుమంతుడు రావణుడు రక్షించే లంకా నగరంలోకి ఎట్లా పోతాడో చూస్తానని కఠినంగా అంటుంది లంకిణి. ఏదేమైనా తాను లంకను చూసి శీఘ్రంగా వచ్చిన దారిలోనే పోతానన్న హనుమంతుడిపై మండిపడుతూ, భయంకరమైన ధ్వని చేస్తూ, అరచేత్తో ఆయన్ను కొడుతుంది. దెబ్బతిన్న మారుతి, కేకపెట్తూ, ఆడదానిపై తన ప్రతాపం ఎందుకు చూపాలని అనుకుంటూ పెద్దగా కోప్పడక, తన ఎడమచేతి పిడికిలితో లంకిణిని పొడుస్తాడు.

ఆ మాత్రం పిడికిటి పోటుకే, లంకిణి నోరు తెర్చుకుని, నేలమీద పడిపోయింది. హనుమంతుడు దాన్ని జాలిగా, దయతో చూశాడు. లంకిణి గర్వమణిగి హనుమంతుడితో: "వానరేంద్రా! నన్ను రక్షించు. నామీద దయ చూపు. నువ్వు చాలా పరాక్రమవంతుడవు. బలవంతులు స్త్రీలను చంపరాదన్న నీతికి కట్టుబడ్తారు. నేనే "లంకిణి" ని. యుధ్ధంలో సాహసంతో, బలపరాక్రమాలతో, నన్నే గెలిచావు. నీకు రాక్షసులు ఇక అడ్డమా? లంకా నగర ప్రతిష్ఠ సమయంలో నాకు బ్రహ్మదేవుడు వరమిస్తూ, సీతాదేవిని వెతికేందుకు వచ్చే కోతి నిన్నెప్పుడు గెలుస్తాడో, అప్పుడే లంక నాశనమౌతుందని చెప్పాడు" అంటుంది.

         తాను సత్యం చెప్తున్నాననీ, బ్రహ్మ దేవుడు యదార్ధం చెప్పాడనీ, ఆయన మాటలు తప్పు కావనీ, సీతాదేవి కారణాన రాక్షసులకు, రావణుడికి చావు మూడిందనీ, హనుమంతుడు నగరంలోకి పోయి పట్టణమంతా కలియతిరిగి, తన ఇష్ఠ ప్రకారం చేయదల్చుకున్న పనులన్నీ చేయవచ్చని హనుమంతుడికి చెప్తుంది లంకిణి. పతివ్రతల శాపానికి గురైన లంకలోకి ప్రవేశించి సీతను చూసేందుకు కోరిక తీరేవరకు సుఖంగా లంకలో తిరగమని కూడా సలహా ఇస్తుంది.

         లంకలో ప్రవేశిస్తున్న హనుమంతుడికీ, అడ్డుతగిలిన లంకిణికీ, యుధ్ధం జరుగుతున్నప్పుడు, వారు కొట్టుకున్టున్నప్పుడు, ఆకేకలు వూళ్లో వున్న రాక్షసులకు ఎందుకు తెలియలేదని సందేహం రావచ్చు. గ్రామదేవతల గుళ్లు ఊరిబయట వుంటాయి. వూళ్లోకి రావటానికి వీల్లేని వ్యక్తులను, పొలిమేరదాటకుండా చేసేటందుకే వీరు అక్కడ కాపలా కాస్తుంటారని శాస్త్రం చెప్తున్నది. లంకిణికి, హనుమకు మధ్య జరిగిన గొడవ వూరిబయట జరిగింది. అదీ రాత్రివేళ. వూళ్లోవారి అరుపుల మధ్య ఇవి వినపడే అవకాశం లేదు. మరో విషయం, ఎవ్వరూలేని ప్రదేశం గుండా లంకలోకి ప్రవేశించే ప్రయత్నం చేసాడు హనుమండు. ఇకపోతే , హనుమంతుడు చెప్పక పోయినప్పటికీ, బ్రహ్మదేవుడి మాటలను గుర్తుచేసుకున్న లంకిణి, హనుమంతుడు సీతాదేవికొరకే వచ్చాడని నిర్ధారించుకుంటుంది.

         "లం" అనేది పృధివీ బీజాక్షరం. కాబట్టి పృధివీతత్వాన్ని తెలుపుతున్నది. అది కలది "లంక". లంకంటేనే "దేహం". హనుమంతుడు లంకను జయించాడంటే, తనలోని ఆత్మను వెతికేవాడు, మొదట దేహాన్ని జయించాలన్న అర్ధం స్ఫురిస్తున్నది. దేహాన్ని జయించనివాడికి ఆత్మావలోకనం జరగదు.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా) 

 

 

 

కణికనీతి-దుర్యోధనుడికి రాజనీతిని ఉపదేశించిన కణికుడు (ఆస్వాదన-5) : వనం జ్వాలా నరసింహారావు

 కణికనీతి-దుర్యోధనుడికి రాజనీతిని ఉపదేశించిన కణికుడు

(ఆస్వాదన-5)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-02-2021)

కురుపాండవ కుమారుల అస్త్ర విద్యా సందర్శనం తరువాత, ధృతరాష్ట్రుడు యౌవరాజ్య భారం వహించడానికి యుధిష్ఠిరుడు తగినవాడని భీష్మ విదురలతో ఆలోచించి, అతడిని యౌవరాజ్యాభిషిక్తుడిని చేశాడు. ఆయన నలుగురు తమ్ములు తమ బలంతో నాలుగు దిక్కులను జయించి, భూమ్మీద రాజకుమారులందరి పొగరణచి, విలువైన కానుకలను తెచ్చి ఇవ్వగా, ధర్మరాజు యువరాజే అయినప్పటికీ, చక్రవర్తిలాగా వెలిగాడు. గజరథాశ్వ యుద్ధాలలో, గదా యుద్ధంలో, భీముడు గొప్పవాడన్న పేరొచ్చింది. ధనుర్విద్య మొదలైన ఆయుధ విద్యలలో ఆర్జునుడిని మించినవాడు ఎవరూ లేరన్న మాట వినిపించింది. నకల సహదేవులు మిక్కిలి పరాక్రమం కలవారని, స్వచ్చమైన నడవడి కలవారని అందరూ అనుకోసాగారు.

ఇలా పాండవులంతా అందరికీ పూజ్యులై ప్రవర్తిల్లుతుండగా గురువుగారైన ద్రోణాచార్యుడు అర్జునుడి గురుభక్తికి మెచ్చి, ‘బ్రహ్మశిరోనామక’ మనే పేరుగల దివ్యాస్త్రాన్ని ప్రయోగ-సంహారాలతో సహా ఉపదేశించాడు. ఇచ్చి, దాని మహిమను చెప్పి, తనతో అర్జునుడు ఎదురు యుద్ధం చేయకుండా వుండేట్లు తనకు గురుదక్షిణ ఇవ్వమని కోరాడు. అందుకు అర్జునుడు అంగీకరించాడు.

ఇదిలా వుండగా, దుర్యోధనుడు భీమార్జునుల, నకుల సహదేవుల పరాక్రమం చూసి ఓర్వలేక కర్ణశకునిదుశ్శాసనులతో ఏంచేయాల్నా అని ఆలోచించ సాగాడు. ధర్మరాజును యువరాజుగా చేసినందుకు కూడా చింతించసాగాడు. తనకు రాజనీతిని ఉపదేశించమని దుర్యోధనుడు అనగానే, నీతుల్లో నేర్పరి, శకునికి ప్రియమంత్రి అయిన కణికుడు దుర్యోధనుడి కోరికకు తగ్గ విధంగా ఇలా చెప్పాడు.

‘ప్రభువు అనేవాడు ప్రబలమైన అధికారం కలవాడై, తగిన దండనీతిని అవలంభించి, ప్రజలను ధర్మ మార్గాన నడిపించి, మంచి ప్రవర్తన కలవాడుగా వుండాలి. దండనీతిలో స్వపరభేదభావం లేకుండా సమబుద్ధితో వుండే రాజు ఆజ్ఞానుసారం అన్ని జాతులవారు తమతమ జాతి ధర్మాలను ఉల్లంఘించక ప్రవర్తిస్తారు. (దీన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఉత్తమపాలనకు అధికార బలం ఒక్కటే చాలదనీ, నిష్పక్షపాతం, సత్ప్రవర్తనం, ప్రభుతకు పెద్ద బలాన్ని చేకూర్చే గుణాలని, ఇవికూడా ప్రభువుకు వుండాలని అన్నారు). ఈ పని చేయవచ్చా, చేయకూడదా అని ఆలోచించకుండా చెడునడవడి కలవాడైతే, తండ్రైనా, గురువైనా విడిచిపెట్టక ప్రభువు శిక్షించాలి’.

‘ఏ పనైనా బుద్ధిమంతులతో ముందుగా విచారించి చేయాలి. అలా చేస్తే ఆ పని చెడిపోకుండా వుంటుంది. రాజైన వాడు మొదలు నేర్పుగాకాని, మెత్తగా కాని, భయంకరంగా కానీ, తనను తాను రక్షించుకోవాలి. తనకు ప్రమాదం లేకుండా చూసుకుని రాజధర్మాలు నడపాలి. తన లోపాలు ఇతరులు తెలుసుకోకుండా, ఇతరుల లోపాలను తాను తెలుసుకుంటూ, దేశకాల పరిస్థితులను ఎరిగి, మిత్రబలం కలవాడై, రాజు తన ధర్మాలను నిర్వర్తించాలి. బలహీనులైనప్పుడే శత్రువులను చంపడం రాజనీతి. శత్రువు బలం చేకూర్చుకున్న తరువాత జయించడం సాధ్యం కాదు. రాజు తన పనులను గురించి, శత్రువుల పనులను గురించి, విసుగు లేకుండా దూతల ద్వారా తెలుసుకోవాలి. శత్రుదేశాల విషయాలను తెలుసుకోవడానికి పలువురు తెలివైన వేగులవారిని నియమించాలి’.

‘పలువిధాలైన ప్రదేశాలకు (క్రీడలకు, ఉద్యానవనాలకు, సభలకు, పుణ్యతీర్ధాలకు, దేవాలయాలకు, వేటాడడానికి) వెళ్లేటప్పుడు ప్రభువుకు ప్రమాదాలు కలగకుండా, ఆయా ప్రదేశాలను ముందుగా తగువిధంగా పరిశీలించి, ప్రమాదం కలిగించే వ్యక్తులు, ఆయుధాలు వుంటే తొలగించి (ఇప్పటికీ ఇది వుంది), పరిశుద్ధంగా వుంచాలి. రాజైనవాడు తనకు ఫలానా వారు నమ్మదగినవారని, ఫలానావారు నమ్మదగిన వారుకాదని, అనకూడదు. నిశ్చయ బుద్ధితో ఎవ్వరినీ నమ్మకుండా తన రక్షణ తానే ప్రధానంగా చూసుకోవాలి. ప్రభువు తనను తాను జాగ్రత్తగా రక్షించుకున్నట్లే, తన రహస్యాలోచానాన్ని కూడా రక్షించుకోవాలి. రహస్యాలోచన వెల్లడి కాకుండా రక్షించుకునే బలం వల్లే అన్ని పనులు ఫలవంతమౌతాయి. రహస్యాలోచన వెల్లడైతే పనులను ఫలవంతం కావించడం ఎవరి తరం కాదు’.

‘చెడు నడవడికల నీచులు తరచుగా ఒట్టుపెట్టుకుంటారు. చేతులు జోడిస్తారు. నమస్కారాలు చేస్తారు. సామోపాయంతో కూడిన ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపు వినయాలు ప్రదర్శిస్తారు. దుర్మార్గుడు తనకు అనుకూల మయ్యేంతవరకు స్నేహితుడిలాగా నటించి, అనుకూలత ఏర్పడిన వెంటనే, పాములాగా తన క్రూరకృత్యాలనే కోరలతో కరుస్తాడు. ఎక్కువ కోపం కానీ, స్నేహంకానీ, వాటి అనుభవ కాలానికే ఇతరులకు తెలియచేయాలి’.

‘తగిన సమయం వచ్చేవరకు శత్రువును భుజం మీద ఎక్కించుకుని మోస్తూ, తగిన సమయం రాగానే మట్టికుండను రాతిమీద కొట్టినట్లు అతడిని నాశనం చేయాలి. లోగడ తనకు అపకారం చేసిన వాడు తక్కువాడుకదా అని అతడిని ఆదరించకూడదు. ముళ్ళు చిన్నదే అయినా అది పాదంలో వుంటే నడవడం సాధ్యంకాదుకదా! బాలుడు కదా అని చులకన భావం వహించి శత్రువుతో కలిసి వుండకూడదు. అపకారాలు చేసేవాళ్ళను సామదానభేదోపాయాలతో లేదా దయచూపి నమ్మకం కలిగేలా మాట్లాడి, నమ్మకం కలిగించి, ఆలస్యం జరగకుండా చంపాలి. ఏవిధంగానైనా రాజనీతితో శత్రువును హతమార్చాలి. అపకారాలు చేసేవారిని శత్రువులైనా, బంధువులైనా అశ్రద్ధ చేయకూడదు. ఆత్మరక్షణ కొరకు వారిని అన్ని విధాలా హతమార్చాలి’.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, షష్టాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)