Saturday, February 6, 2021

లంకిణి ఓటమి లంకా నాశనానికి సూచనా? : వనం జ్వాలా నరసింహారావు

 లంకిణి ఓటమి లంకా నాశనానికి సూచనా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (07-02-2021) ప్రసారం  

అసాధ్యమైన సముద్రాన్ని సులభంగా, అవలీలగా దాటి, త్రికూటపర్వత శిఖరమందున్న లంకను చూసిన తర్వాతనే హనుమంతుడి మనస్సు కుదుటపడింది. బహిరంగంగా తనుతిరిగితే రాక్షసులు చూస్తారేమోనన్న అనుమానంతో, ఉద్యాన వనంలోని చెట్ల చాటున తిరగసాగాడు.

           హనుమంతుడు నూరు యోజనాల సముద్రాన్ని దాటాడని రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది. అయినప్పటికీ, ఇప్పుడు సముద్రమంత వెడల్పు లేదుకదా? రావణాసురుడి లంక ఇదేనా?. అని కొందరు సందేహపడుతుంటారు. అయితే, కొన్ని బౌధ్ధ ప్రామాణిక గ్రంథాలను చదివినవారికి ఈ అనుమానం నివృత్తి చేసుకునే ఆధారాలు లభ్యమవుతాయి. ఇంద్రజిత్ హోమం చేసిన "నికుంభిల", సీతాదేవిని వున్చిన "అశోకవనం" ఇప్పటికీ వున్నాయక్కడ. అక్కడ సీతాదేవి పూజించబడుతున్నదనీ, "రావణకోట" అనే స్థలం కూడా వున్నదనీ, స్పష్టమవుతున్నది. దీన్నిబట్టి సింహళద్వీపమే ఈనాటి శ్రీలంక, ఒకనాటి లంక.

అయితే, ఇప్పుడు సింహళద్వీపానికీ, మనదేశానికీ, మధ్యవున్న సముద్రం వెడల్పు అరవై మైళ్లే. నూరుయోజనాలకు, అరవై మైళ్లకు ఎంతోవ్యత్యాసముందని అనుకోవడం సహజం కదా. ఇకపోతే యోజనం కొలత, ఇంత అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఎనిమిది మైళ్లని కొందరు, రెండున్నర మైళ్లని కొందరు లెక్కలు చెప్తారు. అదే విధంగా "ఆమడ", "క్రోసు"ల విషయంలో కూడా స్పష్టత లేదు. ఇప్పటిమైలు (1760 గజాలు) పూర్వంలేదు. కావున యోజనం అంటే, ఖచ్చితంగా ఇన్ని మైళ్లని నిర్ధారించలేం. అంతే కాకుండా ఇప్పుడు సముద్రం అరవై మైళ్లే అయినప్పటికీ, రామాయణ కాలంలో, ఎక్కువై వుండవచ్చు. సముద్ర భాగమ్ విశేషంగా పూడిపోయి క్రమేపీ నేలగా మారిందని శాస్త్రవేత్తలు వ్రాసి వున్నారు. వ్రాస్తున్నారు కూడా. ఇప్పటి రఘునాధ పురానికి దక్షిణ భాగమంతా పూర్వం సముద్రంగా వుండేది. అదే విధంగా, పురాణాలలో చెప్పిన దాన్ని బట్టి, ఇప్పటి తిరువాన్‍కూర్ పూర్వం సముద్రంలో మునిగుండేదట. అలాంటప్పుడు నేటి తిరునల్‍వెళ్లి సముద్రంలో మునిగి వుండవచ్చుకదా!

రామాయణంలో చెప్పబడ్డ "త్రికూటం", "లంబపర్వతం", "సువేల" అనేవి లంకకు దక్షిణ భాగాన వున్నవేకాని, ఉత్తర భాగంలో లేవు. కాబట్టి ఇప్పటి లంకలోని ఉత్తర భాగం కూడా సముద్రంలో మునిగే వుండాలి. లేదా హనుమంతుడు ఈ ప్రదేశాన్ని వదిలి అక్కడకైనా పోయుండాలి. ఈ పర్వతం చుట్టూ సముద్రమున్నదన్నాడుకాని, గ్రామాలున్నట్లు వాల్మీకి చెప్పలేదు. "సువేల" అన్న పదమే సముద్ర తీరమన్న అర్ధాన్ని చెప్తోంది. లంకలోని ఇప్పటి ఉత్తర రేవుకు, త్రికూటానికి, మధ్య దూరం, నూరు మైళ్లకు పైనే వుంది. కాబట్టి హనుమంతుడు దాటింది రెండొందల ఏభై మైళ్లని తేలుతున్నది. అంటే నూరుయోజనాలు రెండొందల ఏభై మైళ్లకు సమానం కావచ్చు.

           సీతను దొంగిలించి తెచ్చిన రావణాసురుడు, ఆమెకు కాపలాగా విల్లు, బాణాలు ధరించి ఎల్లప్పుడూ తిరుగుతుండే రాక్షస శ్రేష్ఠులుండే సమస్త ప్రదేశాలు కనిపించాయి ఆఝనేయుడికి. శోభాయమానంగా వున్న లంకను కొండ శిఖరాన్నుంచే చూసిన హనుమంతుడికది ఆకాశాన వున్న స్వర్గంలాగా గోచరించింది. లంకను మొట్టమొదట విశ్వకర్మ నిర్మించాడు. కుబేరుడికి తొలుత స్థానమైంది. అంద-చందాలలో ఈవిధంగా ఉండవచ్చేమోనని ఉహించనలవికానిది.

         లంకను గెలవడం అసాధ్యమనిపిస్తుంది హనుమంతుడికి. శ్రీరామచంద్రమూర్తి లంకకు వచ్చినప్పటికీ, రావణ రక్షణలో ప్రవేశించనలవికాని లంకానగరాన్ని ఏంచేయగలడన్న అనుమానమేస్తుంది ఆయనకు. పోనీ, మనకు విరోధమెందుకు? సీతను అప్పగించమని మంచితనంగా సామ, దాన, భేద, దండో పాయాలు కూడా పనికి రావేమో అనుకుంటాడు. ఇప్పుడు తాను చేయవలసిన పని సీతను వెతకడం, దానికి లంకలో ఎలా ప్రవేశించాలని యోచించడమనుకుంటాడు. లంకకు పోయేమార్గమేంటని ఆలోచిస్తాడు. బహిరంగంగా లోపలికి వెళ్లడం మంచిదికాదు. తెలవకుండా వంచించి, లోపలికి పోయి, కనపడవలసిన చోట కనపడుతూ, కనపడరాని చోట కానరాక వుండే రీతిలో వేషాలు మార్చాలనుకుంటాడు ఆంజనేయుడు. మొత్తం మీద చీకటి మాటున కార్యం చక్కబర్చుకోవాలని కూడా నిర్ణయించుకున్టాడు.

         "ఏవిధంగా చేస్తే నా ప్రయత్నం సఫలమౌతుంది? పగటి వేళ ప్రవేశించాలా? రాత్రి వేళా? ఈ రూపంలోనా? రూపం మార్చాలా? ఈక్షణమే ఈ రూపంతోనే పోవాల్నా? అలాపోతే, రాక్షసుల కంటబడితే, రామకార్యం, సీతాదేవిని వెతకడం చెడిపోతుందికదా? రాక్షస రూపంలో పోవాలా? లంకలోని వారందరూ ఒకరికొకరు తెల్సినవారేకదా? కొత్తవాడినైన నన్ను గుర్తించరా? ఇంకో రూపంలో పోయినా వారు తెలుసుకోవచ్చుకదా? ఈ రాక్షసులకు తెలియకుండా గాలికూడా లంకలో సంచరించలేదుకదా!" అని హనుమంతుడు పరి-పరి విధాలుగా ఆలోచిస్తాడు. చీకటి పడేవరకు ఇక్కడే దాక్కొని, ఆతర్వాత చిన్న కోతిగా మారి, రావణుడి పట్టణంలో చొరబడి, సీతాదేవిని రాక్షసుల ఇళ్లలో వెతకాలి. అట్లైతే రామకార్యం చేసినవాడినన్న గౌరవంతో అతిశయించగలనని ఆలోచించాడు హనుమంతుడు.

          సూర్యుడు అస్తమించగానే, పిల్లి ఆకారంతో, "ప్రదోష"  కాలంలో, లంకలో ప్రవేశించేందుకు, కొండ దిగి నడిచి రాకుండా, అక్కడి నుండే ఒక్క గంతేసాడు హనుమంతుడు. లంక రక్షణకై నియమించబడిన, కఠిన రాక్షసులను లంకా నగరం ప్రవేశిస్తూనే చూసాడు హనుమంతుడు. లంకాపురిని ప్రవేశించడానికి లంబ పర్వతంపైనుండి దిగుతాడు హనుమంతుడు. ఆయన దిగిన లంబ పర్వతమప్పుడు చీకట్లో వేలాడే పర్వతంలాగా వుంది. ఎంతో చిత్ర, విచిత్రంగా వుందే ఈ లంకానగరం! అనుకుంటాడు హనుమంతుడు. లంకానగర సౌందర్యాన్ని చూసి, ప్రాకార సమీపాన్నుండి లంకానగరాన్నొక్కసారి తేరిపార చూస్తాడు హనుమంతుడు. మనోహరమైన ఆరావణుడి పట్టణాన్ని, దాని గొప్పతనాన్ని తిలకించి, ఎంతో సంతోషంతో దాన్ని గురించి మరీ, మరీ అనుకుంటాడు మనస్సులో హనుమంతుడు.

         ఒరనిండా, చేతిలో, కత్తులుంచుకుని తిరిగే సైనికుల రక్షణలో వున్న ఈపట్టణాన్ని బలంతో గెలవడం ఎవరికీ సాధ్యం కాదేమో ననుకుంటాడు హనుమంతుడు. అయితే, అంగదుడు, ద్వివిదుడు, సుగ్రీవుడు, మైందుడు,  సుషేణుడు, రుక్షుడు, కుముడు, కుషపర్వుడు, కేతుమాలుడు మాత్రం లంకలో ప్రవేశించ గలరనుకుంటాడు.

         ఈప్రకారం, లంకలోకి రాగల బలవంతులగు వానరులను లెక్కపెట్టి, రామలక్ష్మణుల బలపరాక్రమాలను ఆలోచించి, భయపడాల్సిన పనిలేదు, వారు వస్తే విజయం కలుగుతుందని సంతోషపడ్తాడు. ఇలా ఆలోచిస్తూ మరీ, మరీ సమీపంలోకి పోతాడు హనుమంతున్తుడు. పోతున్న అతడికి, రావణుడి పట్టణం, మణులనే దుస్తులు కప్పుకొన్నట్లుగా, పశువుల కొట్టంలాంటి శిరోభూషణాలు కలదిగా, యంత్రశాలను పోలిన స్తనాలున్నట్లుగా, అలంకరించుకున్న స్త్రీ లాగా కనిపించింది. ఆయన ఇలా లంకను గురించి అనుకుంటుండగానే లంక స్త్రీగా రానే వచ్చింది.

లంకానగరంలో ప్రవేశిస్తున్న కోతిని లంకాదిదేవత లంఖిని తన సహజ రూపంతో చూసింది. అదే సమయంలో ఆమెనూ చూసాడు హనుమంతుడు. తక్షణమే కోపంతో వూగిపోతూ అసహ్యమైన  ముఖాన్ని, భయంకరమైన రూపాన్ని, దాల్చిన “లంక” హనుమంతుడికి అడ్డంగా నిల్చి గర్జిస్తూ, “నువ్వెవరివి? ఎందుకొచ్చావు? నీవు చావక ముందే చెప్పు” అని ప్రశ్నించింది. ఎల్ల వేళల, అన్ని ప్రదేశాలలో, రావణుడి సేనలతో రక్షించబడుతున్నలంకా నగరంలోకి దేవతలే ప్రవేశించలేనప్పుడు ప్రవేశించినా బ్రతకలేనప్పుడు, హనుమంతుడేలా రాగాలిగాడని నిలదీస్తుంది.

         "సరే నాసంగతి తర్వాత చెప్తాను. వికారపు కన్నులతో, లంకా నగర వాకిట్లో వున్న నీవెవ్వరవు? ఇక్కడెందుకున్నావు? నాకెందుకు అడ్డుపడ్తున్నావు? ఊరంటూ వుంటే ఎవరో ఒకరు రాకుండా వుండరు కదా!" అని ఎదురు ప్రశ్న వేస్తాడు ఆంజనేయుడు. ఆమాటలు విన్న "లంక" మండిపడి, మారుతిని చూసి కోపంతో, భయంకరంగా మాట్లాడడం మొదలెట్టిందీవిధంగా:

         "రావణాసురుడి ఆజ్ఞను శిరసావహించి, ఈపట్టణాన్ని ఎల్లవేళలా రక్షిస్తున్నాను. నాకళ్లు కప్పి నువ్విందులోకి రాలేవు. అది సాధ్యపడే విషయం కాదు. ఓ కోతీ, నువ్విప్పుడే చస్తావు. నేనే లంకనురా! ఇది నాసంగతి. మరి నువ్వెవరివో చెప్పు."

         "లంకిణి" మాటలకు ఏ మాత్రం అధైర్యపడలేదు హనుమంతుడు. స్త్రీ ఆకారంలో వున్న ఆమెను చూస్తూ, ఏమాత్రం సందహించకుండా, లంకను చూసిపోదామన్న కోరికతో వచ్చానని చెప్పాడు. తనను గెలవకుండా ద్రోహబుధ్ధిగల హనుమంతుడు రావణుడు రక్షించే లంకా నగరంలోకి ఎట్లా పోతాడో చూస్తానని కఠినంగా అంటుంది లంకిణి. ఏదేమైనా తాను లంకను చూసి శీఘ్రంగా వచ్చిన దారిలోనే పోతానన్న హనుమంతుడిపై మండిపడుతూ, భయంకరమైన ధ్వని చేస్తూ, అరచేత్తో ఆయన్ను కొడుతుంది. దెబ్బతిన్న మారుతి, కేకపెట్తూ, ఆడదానిపై తన ప్రతాపం ఎందుకు చూపాలని అనుకుంటూ పెద్దగా కోప్పడక, తన ఎడమచేతి పిడికిలితో లంకిణిని పొడుస్తాడు.

ఆ మాత్రం పిడికిటి పోటుకే, లంకిణి నోరు తెర్చుకుని, నేలమీద పడిపోయింది. హనుమంతుడు దాన్ని జాలిగా, దయతో చూశాడు. లంకిణి గర్వమణిగి హనుమంతుడితో: "వానరేంద్రా! నన్ను రక్షించు. నామీద దయ చూపు. నువ్వు చాలా పరాక్రమవంతుడవు. బలవంతులు స్త్రీలను చంపరాదన్న నీతికి కట్టుబడ్తారు. నేనే "లంకిణి" ని. యుధ్ధంలో సాహసంతో, బలపరాక్రమాలతో, నన్నే గెలిచావు. నీకు రాక్షసులు ఇక అడ్డమా? లంకా నగర ప్రతిష్ఠ సమయంలో నాకు బ్రహ్మదేవుడు వరమిస్తూ, సీతాదేవిని వెతికేందుకు వచ్చే కోతి నిన్నెప్పుడు గెలుస్తాడో, అప్పుడే లంక నాశనమౌతుందని చెప్పాడు" అంటుంది.

         తాను సత్యం చెప్తున్నాననీ, బ్రహ్మ దేవుడు యదార్ధం చెప్పాడనీ, ఆయన మాటలు తప్పు కావనీ, సీతాదేవి కారణాన రాక్షసులకు, రావణుడికి చావు మూడిందనీ, హనుమంతుడు నగరంలోకి పోయి పట్టణమంతా కలియతిరిగి, తన ఇష్ఠ ప్రకారం చేయదల్చుకున్న పనులన్నీ చేయవచ్చని హనుమంతుడికి చెప్తుంది లంకిణి. పతివ్రతల శాపానికి గురైన లంకలోకి ప్రవేశించి సీతను చూసేందుకు కోరిక తీరేవరకు సుఖంగా లంకలో తిరగమని కూడా సలహా ఇస్తుంది.

         లంకలో ప్రవేశిస్తున్న హనుమంతుడికీ, అడ్డుతగిలిన లంకిణికీ, యుధ్ధం జరుగుతున్నప్పుడు, వారు కొట్టుకున్టున్నప్పుడు, ఆకేకలు వూళ్లో వున్న రాక్షసులకు ఎందుకు తెలియలేదని సందేహం రావచ్చు. గ్రామదేవతల గుళ్లు ఊరిబయట వుంటాయి. వూళ్లోకి రావటానికి వీల్లేని వ్యక్తులను, పొలిమేరదాటకుండా చేసేటందుకే వీరు అక్కడ కాపలా కాస్తుంటారని శాస్త్రం చెప్తున్నది. లంకిణికి, హనుమకు మధ్య జరిగిన గొడవ వూరిబయట జరిగింది. అదీ రాత్రివేళ. వూళ్లోవారి అరుపుల మధ్య ఇవి వినపడే అవకాశం లేదు. మరో విషయం, ఎవ్వరూలేని ప్రదేశం గుండా లంకలోకి ప్రవేశించే ప్రయత్నం చేసాడు హనుమండు. ఇకపోతే , హనుమంతుడు చెప్పక పోయినప్పటికీ, బ్రహ్మదేవుడి మాటలను గుర్తుచేసుకున్న లంకిణి, హనుమంతుడు సీతాదేవికొరకే వచ్చాడని నిర్ధారించుకుంటుంది.

         "లం" అనేది పృధివీ బీజాక్షరం. కాబట్టి పృధివీతత్వాన్ని తెలుపుతున్నది. అది కలది "లంక". లంకంటేనే "దేహం". హనుమంతుడు లంకను జయించాడంటే, తనలోని ఆత్మను వెతికేవాడు, మొదట దేహాన్ని జయించాలన్న అర్ధం స్ఫురిస్తున్నది. దేహాన్ని జయించనివాడికి ఆత్మావలోకనం జరగదు.

         (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా) 

 

 

 

No comments:

Post a Comment