Saturday, February 6, 2021

కణికనీతి-దుర్యోధనుడికి రాజనీతిని ఉపదేశించిన కణికుడు (ఆస్వాదన-5) : వనం జ్వాలా నరసింహారావు

 కణికనీతి-దుర్యోధనుడికి రాజనీతిని ఉపదేశించిన కణికుడు

(ఆస్వాదన-5)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-02-2021)

కురుపాండవ కుమారుల అస్త్ర విద్యా సందర్శనం తరువాత, ధృతరాష్ట్రుడు యౌవరాజ్య భారం వహించడానికి యుధిష్ఠిరుడు తగినవాడని భీష్మ విదురలతో ఆలోచించి, అతడిని యౌవరాజ్యాభిషిక్తుడిని చేశాడు. ఆయన నలుగురు తమ్ములు తమ బలంతో నాలుగు దిక్కులను జయించి, భూమ్మీద రాజకుమారులందరి పొగరణచి, విలువైన కానుకలను తెచ్చి ఇవ్వగా, ధర్మరాజు యువరాజే అయినప్పటికీ, చక్రవర్తిలాగా వెలిగాడు. గజరథాశ్వ యుద్ధాలలో, గదా యుద్ధంలో, భీముడు గొప్పవాడన్న పేరొచ్చింది. ధనుర్విద్య మొదలైన ఆయుధ విద్యలలో ఆర్జునుడిని మించినవాడు ఎవరూ లేరన్న మాట వినిపించింది. నకల సహదేవులు మిక్కిలి పరాక్రమం కలవారని, స్వచ్చమైన నడవడి కలవారని అందరూ అనుకోసాగారు.

ఇలా పాండవులంతా అందరికీ పూజ్యులై ప్రవర్తిల్లుతుండగా గురువుగారైన ద్రోణాచార్యుడు అర్జునుడి గురుభక్తికి మెచ్చి, ‘బ్రహ్మశిరోనామక మనే పేరుగల దివ్యాస్త్రాన్ని ప్రయోగ-సంహారాలతో సహా ఉపదేశించాడు. ఇచ్చి, దాని మహిమను చెప్పి, తనతో అర్జునుడు ఎదురు యుద్ధం చేయకుండా వుండేట్లు తనకు గురుదక్షిణ ఇవ్వమని కోరాడు. అందుకు అర్జునుడు అంగీకరించాడు.

ఇదిలా వుండగా, దుర్యోధనుడు భీమార్జునుల, నకుల సహదేవుల పరాక్రమం చూసి ఓర్వలేక కర్ణశకునిదుశ్శాసనులతో ఏంచేయాల్నా అని ఆలోచించ సాగాడు. ధర్మరాజును యువరాజుగా చేసినందుకు కూడా చింతించసాగాడు. తనకు రాజనీతిని ఉపదేశించమని దుర్యోధనుడు అనగానే, నీతుల్లో నేర్పరి, శకునికి ప్రియమంత్రి అయిన కణికుడు దుర్యోధనుడి కోరికకు తగ్గ విధంగా ఇలా చెప్పాడు.

‘ప్రభువు అనేవాడు ప్రబలమైన అధికారం కలవాడై, తగిన దండనీతిని అవలంభించి, ప్రజలను ధర్మ మార్గాన నడిపించి, మంచి ప్రవర్తన కలవాడుగా వుండాలి. దండనీతిలో స్వపరభేదభావం లేకుండా సమబుద్ధితో వుండే రాజు ఆజ్ఞానుసారం అన్ని జాతులవారు తమతమ జాతి ధర్మాలను ఉల్లంఘించక ప్రవర్తిస్తారు. (దీన్ని విశ్లేషిస్తూ డాక్టర్ అప్పజోడు వేంకటసుబ్బయ్య గారు, ఉత్తమపాలనకు అధికార బలం ఒక్కటే చాలదనీ, నిష్పక్షపాతం, సత్ప్రవర్తనం, ప్రభుతకు పెద్ద బలాన్ని చేకూర్చే గుణాలని, ఇవికూడా ప్రభువుకు వుండాలని అన్నారు). ఈ పని చేయవచ్చా, చేయకూడదా అని ఆలోచించకుండా చెడునడవడి కలవాడైతే, తండ్రైనా, గురువైనా విడిచిపెట్టక ప్రభువు శిక్షించాలి.

‘ఏ పనైనా బుద్ధిమంతులతో ముందుగా విచారించి చేయాలి. అలా చేస్తే ఆ పని చెడిపోకుండా వుంటుంది. రాజైన వాడు మొదలు నేర్పుగాకాని, మెత్తగా కాని, భయంకరంగా కానీ, తనను తాను రక్షించుకోవాలి. తనకు ప్రమాదం లేకుండా చూసుకుని రాజధర్మాలు నడపాలి. తన లోపాలు ఇతరులు తెలుసుకోకుండా, ఇతరుల లోపాలను తాను తెలుసుకుంటూ, దేశకాల పరిస్థితులను ఎరిగి, మిత్రబలం కలవాడై, రాజు తన ధర్మాలను నిర్వర్తించాలి. బలహీనులైనప్పుడే శత్రువులను చంపడం రాజనీతి. శత్రువు బలం చేకూర్చుకున్న తరువాత జయించడం సాధ్యం కాదు. రాజు తన పనులను గురించి, శత్రువుల పనులను గురించి, విసుగు లేకుండా దూతల ద్వారా తెలుసుకోవాలి. శత్రుదేశాల విషయాలను తెలుసుకోవడానికి పలువురు తెలివైన వేగులవారిని నియమించాలి’.

‘పలువిధాలైన ప్రదేశాలకు (క్రీడలకు, ఉద్యానవనాలకు, సభలకు, పుణ్యతీర్ధాలకు, దేవాలయాలకు, వేటాడడానికి) వెళ్లేటప్పుడు ప్రభువుకు ప్రమాదాలు కలగకుండా, ఆయా ప్రదేశాలను ముందుగా తగువిధంగా పరిశీలించి, ప్రమాదం కలిగించే వ్యక్తులు, ఆయుధాలు వుంటే తొలగించి (ఇప్పటికీ ఇది వుంది), పరిశుద్ధంగా వుంచాలి. రాజైనవాడు తనకు ఫలానా వారు నమ్మదగినవారని, ఫలానావారు నమ్మదగిన వారుకాదని, అనకూడదు. నిశ్చయ బుద్ధితో ఎవ్వరినీ నమ్మకుండా తన రక్షణ తానే ప్రధానంగా చూసుకోవాలి. ప్రభువు తనను తాను జాగ్రత్తగా రక్షించుకున్నట్లే, తన రహస్యాలోచానాన్ని కూడా రక్షించుకోవాలి. రహస్యాలోచన వెల్లడి కాకుండా రక్షించుకునే బలం వల్లే అన్ని పనులు ఫలవంతమౌతాయి. రహస్యాలోచన వెల్లడైతే పనులను ఫలవంతం కావించడం ఎవరి తరం కాదు’.

‘చెడు నడవడికల నీచులు తరచుగా ఒట్టుపెట్టుకుంటారు. చేతులు జోడిస్తారు. నమస్కారాలు చేస్తారు. సామోపాయంతో కూడిన ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపు వినయాలు ప్రదర్శిస్తారు. దుర్మార్గుడు తనకు అనుకూల మయ్యేంతవరకు స్నేహితుడిలాగా నటించి, అనుకూలత ఏర్పడిన వెంటనే, పాములాగా తన క్రూరకృత్యాలనే కోరలతో కరుస్తాడు. ఎక్కువ కోపం కానీ, స్నేహంకానీ, వాటి అనుభవ కాలానికే ఇతరులకు తెలియచేయాలి’.

‘తగిన సమయం వచ్చేవరకు శత్రువును భుజం మీద ఎక్కించుకుని మోస్తూ, తగిన సమయం రాగానే మట్టికుండను రాతిమీద కొట్టినట్లు అతడిని నాశనం చేయాలి. లోగడ తనకు అపకారం చేసిన వాడు తక్కువాడుకదా అని అతడిని ఆదరించకూడదు. ముళ్ళు చిన్నదే అయినా అది పాదంలో వుంటే నడవడం సాధ్యంకాదుకదా! బాలుడు కదా అని చులకన భావం వహించి శత్రువుతో కలిసి వుండకూడదు. అపకారాలు చేసేవాళ్ళను సామదానభేదోపాయాలతో లేదా దయచూపి నమ్మకం కలిగేలా మాట్లాడి, నమ్మకం కలిగించి, ఆలస్యం జరగకుండా చంపాలి. ఏవిధంగానైనా రాజనీతితో శత్రువును హతమార్చాలి. అపకారాలు చేసేవారిని శత్రువులైనా, బంధువులైనా అశ్రద్ధ చేయకూడదు. ఆత్మరక్షణ కొరకు వారిని అన్ని విధాలా హతమార్చాలి.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, షష్టాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment