Saturday, January 8, 2022

రాజనీతికి శిఖరాయమాణమైన శ్రీకృష్ణ రాయబారం, విశ్వరూప ప్రదర్శన ..... ఆస్వాదన-54 : వనం జ్వాలా నరసింహారావు

 రాజనీతికి శిఖరాయమాణమైన శ్రీకృష్ణ రాయబారం, విశ్వరూప ప్రదర్శన

ఆస్వాదన-54

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (09-01-2022)

కౌరవుల దగ్గరికి రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడి కొలువుకూటం చేరుకొనగానే అక్కడికి వచ్చిన మహామునులను భీష్ముడికి చూపించాడు. వారందరికీ అర్ఘ్యపాద్యాదులిచ్చి, సరైన రీతిలో ఉపచారాలు చేయించి, వారు కూర్చోడానికి పీఠాలు వేయించమని చెప్పాడు. వారు కూర్చోకుండా ఇతరులు కూర్చోవడం న్యాయం కాదని అన్నాడు. భీష్ముడు అలాగే చేయించాడు. కురువీరులంతా లేచి నిలబడి దివ్యమునులకు ఆసనాలిచ్చి కూర్చొనబెట్టారు. దేవర్షులు కూర్చున్నతరువాత శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు, ఇతర ప్రముఖులు కూర్చున్నారు. కర్ణ దుర్యోధనులు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. సభ అంతటా శ్రీకృష్ణాధీనమైన ఒక దివ్యానుభూతి వాతావరణం నెలకొన్నది. రాజనీతికి శిఖరాయమాణమైన రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడు ఒక దివ్యాదివ్యవిభావం (ముదివర్తి కొండమాచార్యులు గారి విశ్లేషణ). కొలువుకూటంలోని వారందరి మనస్సులు శ్రీకృష్ణ సందర్శనంతో సంతోష పరవశాలయ్యాయి.

సభామధ్యంలో వున్న శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి, తానక్కడికి వచ్చిన అవసరాన్ని వివరిస్తూ, భరతవంశం సంతోషించేటట్లు తన ఇరుకుటుంబాలకు ‘న్యాయం’, ‘పరమహితం’ చెప్పడం తన రాకకు కారణం అన్నాడు. కౌరవపాండవులు పాలు, నీరులాగా కలసి మెలసి జీవించడం మంచి పనని, వారలా వుండే విధంగా నడిపించడం ధృతరాష్ట్రుడి బాధ్యత అని, వారిరురువు వేరనే భేదబుద్ధి ఆయనకు లేదుకదా! అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా ‘న్యాయం, హితం తెలియచేశాడు. ఈ సందర్భంగా భరతవంశ గౌరవ, సంప్రదాయ పరిరక్షణను వివరించాడు ఈ విధంగా:

చ:       భరత కులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తుఁ బెంపునుం

గరుణయుఁ గల్గియుండు ననగా నుతి గన్నది యంది సద్గుణో

త్తరులరు నీవు నీయనుగు దమ్ముడు నీతనయుల్ యశోధురం

దర శుభ శీలురీ సుచరిత క్రమ మిప్పుడు దప్ప నేటికిన్

         (భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, పొత్తు, పెంపు, కరుణ కలిగి నుతి కెక్కింది. దాయాది భాగాలకై తగవులాడుకొని కుత్తుకలను ఉత్తరించుకోవటానికి ఎప్పుడూ సిద్ధం కాలేదు. రాజ్యాన్ని త్యాగం చేయటమే గాని దానికై వంశ నాశనానికి పూనుకోవటం భరతవంశ సంప్రదాయం కాదు. ఆ వంశం యొక్క సుచరిత్ర క్రమాన్ని ఇప్పుడు తప్పటం దేనికి?)

         ధృతరాష్ట్రుడు కౌరవవంశ రాజులలో అగ్రగణ్యుడు కావాలంటే ఈ న్యాయం పాటించాలని శ్రీకృష్ణుడన్నాడు. జనులు మెచ్చే విధంగా వ్యవహరించాలని హెచ్చరించాడు. దుర్యోధనాదులు దుష్ట చేష్టలు చేయడానికి వెనుకాడరని, భరతవంశ సంప్రదాయాన్ని కలుషితం చేస్తున్నారని అన్నాడు. కౌరవపాండవులు ఒక మంచి నిర్ణయానికి వచ్చి, శాంతి వహించి, జీవించడం మంచిదన్నాడు. అలాకాకుండా యుద్ధమే జరుగుతే మహావిపత్తు కలుగుతుందని, తన మాటలమీద విశ్వాసం వుంచి సంధి జరిపించాలని కోరాడు. సందికార్యం ధృతరాష్ట్రుడి చేతిలోనే వుందని, సర్వసామ్రాజ్యాధిపత్యం ధృతరాష్ట్రుడిదేనని హెచ్చరిస్తూ, ఉభయ పక్షాలలోని వీరులు యుద్ధంలో చావడం కన్నా కలసి, మెలసి వర్తించడం మంచిదని చెప్పాడు.

         శ్రీకృష్ణుడు పాండవులు చెప్పమన్న మాటలు కూడా ధృతరాష్ట్రుడితో చెప్పాడు వివరంగా. పాండునందనులు ధృతరాష్ట్రుడికి పరమ భక్తితో నమస్కరించి ఒకే గొంతుతో చెప్పమన్న మాటలు చెప్తూ, తమకు రాజ్యంలో సగపాలు పొందగలమన్న దృఢ నిశ్చయంతో వున్నామని అన్న విషయం గుర్తుచేశాడు. ఇంకా ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు:

         ఉ:       సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ

బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె

వ్వార లుపేక్ష చేసిరది వారల చేటు గాని ధర్మ ని

స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్    

         (ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది. కౌరవుల వలన సత్యానికి ధర్మానికి హాని చేకూరింది. సత్యాన్ని, ధర్మాన్ని పాలించే పాండవులను దైవం తప్పక రక్షిస్తాడు. దీనిని విశ్లేషిస్తూ ముదివర్తి కొండమాచార్యులు ఇలా రాశారు: ‘పాండవులు సభాసదులను ఉద్దేశించి చెప్పమన్న సందేశం ఇది. ఉద్యోగపర్వ తాత్పర్యానికీ, మహాభారత కథాతత్త్వానికీ ఈ పద్యం ఆత్మలాంటిది. తెలుగు సాహిత్యంలో ఈ పద్యం ఒక ధర్మదీపం. సారవంతమైన ధర్మం, నిర్మలమైన సత్యం నిత్య ధర్మాలుగా పేర్కొనడం గమనార్హం’).

         పాండవుల తండ్రి భాగం పాండవులకు ఇచ్చి, ఆయన రాజ్యభాగం తన కుమారులు, మనుమలు హాయిగా అనుభవిస్తుంటే ధృతరాష్ట్రుడిని అంతా కొనియాడుతారని చెప్పాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు ఎలాంటివాడో ధృతరాష్ట్రుడికి తెలుసని అంటూ ఆయన ధర్మ గుణాలను పొగిడాడు. పాండవులు ఎంతటి శాంత స్వభావులో అంత వీరాగ్రేసరులని, సంధి-సంగ్రామం రెండింటిలో ఏది హితమో నిర్ణయించమని చెప్పాడు. శ్రీకృష్ణుడి మాటలు అక్కడున్న అందరికీ నచ్చాయి. సభలో వున్న జామదగ్న్య మహాముని, కణ్వమహాముని, నారదుడు, శ్రీకృష్ణుడి మాటలు విని కురువంశాన్ని కాపాడమని దుర్యోధనుడికి చెప్పారు. వారి హితవాక్యాలను మన్నించకుండా, కర్ణుడితో, ‘ఈ మునీశ్వరులు ఎంత పిచ్చివారు అని వ్యాఖ్యానించాడు. బ్రహ్మదేవుడు తనను ఏమి కమ్మని పుట్టించాడో అదే జరుగుతుందని అన్నాడు.

         తానేమీ చేయలేనని ధృతరాష్ట్రుడన్నాడు మహర్షులతో. ఇహపరాలు రెండూ సమకూడే విధానాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడని, కాని ఆయన చెప్పినట్లుగా కార్యం నిర్వర్తించడానికి తనకు ఏమాత్రం చొరవ లేదని అన్నాడు కృష్ణుడితో. తన కుమారుడు మూఢచిత్తుడని అతడిని ఆయనే శాంతింప చేయాలని చెప్పాడు. ధృతరాష్ట్రుడు చెప్పినట్లే శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, అతడికి మొండి పట్టుదల తగదన్నాడు. పాండవులతో పొత్తు పెట్టుకొమ్మన్నాడు. తండ్రి మాట వినమన్నాడు. శకుని, కర్ణ, దుశ్శాసనుల చెడు సలహాలు వినవద్దన్నాడు. భీమార్జున బలపరాక్రమాల గురించి చెప్పాడు. పాండవులు యుద్ధానికి వస్తే కౌరవులు ఎదిరించలేరన్నాడు. కర్ణాదులకే కాదు, దేవదానవులకు కూడా పాండవులను ఎదుర్కోవడం సాధ్యంకాదన్నాడు. కాబట్టి సంధి మంచిదన్నాడు. భీష్మ, ద్రోణులు కూడా దుర్యోధనుడికి హితవు చెప్పారు. శ్రీకృష్ణుడి మాటలు వినమన్నారు.

         వీరందరి మాటలు వున్న దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో, తనను అంతా నిందిస్తున్నారని, కాని, తన తప్పేమీలేదని అన్నాడు. ధర్మరాజు జూదరై రాజ్యాన్ని కోల్పోయాడని అన్నాడు. అంతా ధర్మారాజు ఇష్టప్రకారమే జరిగిందన్నాడు. వారే తమపైదండెత్తడానికి సైన్యాన్ని సమకూర్చుకున్నారని అంటూ, క్షత్రియ ధర్మం ప్రకారం తాను యుద్ధం చేస్తే విజయమో, వీరస్వర్గమో లభిస్తుందని స్పష్టం చేశాడు. పాండవులకు సగ భాగం ఇవ్వడానికి తాను అంగీకరించనన్నాడు. తామూ, పాండవులు భూమిని పంచుకుని పరిపాలించడం జరగదని, వాడి సూది మొన మోపినంత మాత్రమైనా భూమిని’ పంచి పాండవులకు తానివ్వనని, తమలో ఎవరో ఒకరు యుద్ధంలో విజయం సాధించి రాజ్యం చేయాలని తన నిర్ణయమని అన్నాడు దుర్యోధనుడు.

         దుర్యోధనుడు చెప్పినట్లే రణరంగంలో అతడు ఓడిపోతాడని, యుద్ధం రాబోతున్నదని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. గతంలో దుర్యోధనుడు చేసిన దుర్మార్గాలన్నీ చెప్పాడు మరోమారు. శాంతి వహించమని అదే పాండవులకు, కౌరవులకు మంచిదని మళ్లీ అన్నాడు. ఆ సమయంలో దుశ్శాసనుడి సలహామీద దుర్గర్వంతో దుర్యోధనుడు సభనుండి లేచి వెళ్లాడు. ఆయన వెంట కర్ణుడు, శకుని, సహోదరులు, మిత్రులైన రాజులు కూడా పోయి కొంతదూరంలో వున్నారు. ధృతరాష్ట్రుడప్పుడు గాంధారిని సభకు రప్పించాడు. గాంధారి ఆదేశంతో విదురుడు వెళ్లి దుర్యోధనాదులను సభకు తీసుకువచ్చాడు.

         సభకు వచ్చిన దుర్యోధనుడికి గాంధారి హితవాక్యాలు పలికింది కాని అతడికి అవి నచ్చలేదు. గర్వంతో మళ్లీ సభనుండి లేచి వెళ్లి, కర్ణాదులతో దురాలోచనకు పూనుకున్నారు. శ్రీకృష్ణుడిని బంధించాలని పన్నాగం పన్నారు. కృష్ణుడిని చెరసాలలో పెట్టి పాండవులకు దిగులు పుట్టిద్దామని కుట్ర చేశారు. అలా కృష్ణుడిని పట్టాలని దుష్కార్యాలోచన చేసి, దుష్టచతుష్టయం అనబడే దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిలు ఆయనను బంధించాలని నిశ్చయించారు. సాత్యకి ఇది గమనించి శ్రీకృష్ణుడిని హెచ్చరించాడు. విదురుడు ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడి దృష్టికి తెచ్చాడు. తక్షణమే వెళ్లి దుర్యోధనుడిని సభకు తీసుకురమ్మన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు అతడిని సభకు తోడ్కొని వచ్చాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని చీకొట్టాడు.

         శ్రీకృష్ణుడు చిరునవ్వుతో దుర్యోధనుడిని చూసి, తన విశ్వరూపం ప్రదర్శించాడు. వాసుదేవుడి నుదుట బ్రహ్మదేవుడు, వక్షఃస్థలంలో రుద్రుడు, ముఖంలో అగ్ని, పార్శ్వ ప్రదేశాలలో ఇంద్రాది దేవతలు, కుడి-ఎడమ చేతుల్లో ఆయుధాలతో బలరాముడు, పార్థుడు, వీపునుండి మిగిలిన పాండవులు ఆవిర్భవించారు. అంకా అనేకమంది ఆయనలో కనిపించారు. ఆయన చేతుల్లో శంఖం, చక్రం, గద, ఖడ్గం మొదలైన దివ్యాయుధాలు కనిపించాయి. ఆ ముకుందుడి దివ్యతేజ స్వరూపం చూడడానికి శక్యం కాక సమస్త జనులు కన్నులు మూసుకున్నారు. నారదాది మహర్షులకు, భీష్మ, ద్రోణ, విదుర, సంజయులకు తన విశ్వరూపం చూడడానికి దివ్యదృష్టి ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. సభలో కలకల ధ్వని విని,  అది శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శనం అయి వుంటుందని భావించిన ధృతరాష్ట్రుడు తనకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించమని వేడుకున్నాడు. ఆయనకు కూడా దివ్యదృష్టిని ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఆయన్ను చూసిన కన్నులతో ఇంకేమీ చూడనని చెప్పి తన దివ్యదృష్టిని వెనక్కు తీసుకొమ్మన్నాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి కోరిక తీరేవిధంగా అతడి కన్నులను గుడ్డివిగా చేసి తన విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. నారదాది మహర్షులకు వెళ్లిరండని సెలవిచ్చాడు. 

         ఆ తరువాత శ్రీకృష్ణుడు సభ నుండి బయల్దేరి వెళ్లిపోయాడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

  

        

        

         

Sunday, January 2, 2022

కామధేనువును బలాత్కరించి ఎత్తుకునిపోతున్న విశ్వామిత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-89 : వనం జ్వాలా నరసింహారావు

 కామధేనువును బలాత్కరించి ఎత్తుకునిపోతున్న విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-89

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (03-01-2022)

"వశిష్ఠుడలా కామధేనువును ఇవ్వనని చెప్పగానే, విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తీసుకొని పోసాగాడు. అప్పుడా శబల మిక్కిలి విషాదంతో, తనేం తప్పుచేసానని, ఎందుకీ మునీశ్వరుడు తననీవిధంగా వదిలిపెడుతున్నాడని, దుఃఖపడుతూ అనుకుంటుంది. తను ఏడుస్తున్నా వదలకుండా ఈడ్చుకొనిపోతున్న భటుల కట్లు తెంచుకొని, తన్నీడుస్తున్నవారిని నేలపై పడవేసి-తన్ని, మునీశ్వరుడి వద్దకు పోతుంది. కళ్లలో నీళ్లు కారుతుంటే, ఎంతో బాధతో, గోలుగోలున ఏడుస్తూ, దేవ దుందుభిలాంటి ధ్వనితో, ’బ్రహ్మ కుమారా, ఆపదలో వున్నవారిని రక్షించే నువ్వు నన్నొదిలిపెట్టడానికి నేనేం తప్పు చేసాను? నీ దగ్గర వుండనివ్వకుండా రాజభటులు నన్ను ఈడ్చుకుపోతున్నారే?’ అని వశిష్టుడిని దుఃఖాతిశయంతో పరితపిస్తూ-వాడిపోయిన ముఖంతో తోడ పుట్టిన దానిలాగా అడుగుతుంది శబల”.

 ఆవిధంగా ప్రార్థించిన కామధేనువుతో, తాను బుద్ధిపూర్వకంగా దాన్ని వదిలిపెట్టలేదని, మోహంతో కళ్లు కనిపించక న్యాయంతప్పిన రాజు బలాత్కారంగా తీసుకొనిపోతున్నాడని,భూమికంతా ప్రభువు, దేహబలం, సేనాబలం, అస్త్రబలంకల వీరుడైన విశ్వామిత్రుడితో బలహీన బ్రాహ్మణుడినైన తాను ఆపలేక పోయానని అంటాడు వశిష్ఠుడు.విశ్వామిత్రుడికున్న రథాలు,గుర్రాలు, ఏనుగులు, అక్షౌణి సేన గురించి చెప్పిన వశిష్ఠుడితో,క్షత్రియ బలమొక బలమేకాదని,బ్రాహ్మణబలం లెక్కలేని మహిమగలదని,రాజెంత బలవంతుడైనా వశిష్ఠుడికంటే గొప్పవాడుకాదనీ,తనకాజ్ఞ ఇస్తే రాజు సేనంతా నాశనంచేస్తాననీ కామధేనువైన శబల అంటుంది. బలమే న్యాయమని దుష్టబుద్ధితో అనుకుంటున్న విశ్వామిత్రుడిని,బలహీనుడిగా,వశిష్ఠుడి మంత్రబలంతో బలంపొందిన తానుచేస్తానని,ఆజ్ఞ ఇవ్వమని అడుగుతుంది.ఆలా ప్రార్థించిన శబలను, శత్రువులు నివ్వెరపోయే ట్లు-వారి రూపం చెడిపోయే ట్లు చేయగల, అనేకమంది శూరులను సృష్టించమని ఆదేశించాడు వశిష్ఠుడు".

విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేసిన కామధేను కల్పిత సేన

"వశిష్ఠుడి ఆజ్ఞలభించగానే,శత్రు సమూహాలకు భయంకలిగించే పప్లవులనే శూరులను తన హుంభారవంతో శబల. కామధేను కల్పిత శూరులు విశ్వామిత్రుడి సైన్యాన్నంతా రూపుమాపి విజృంభించారు. అది చూసిన పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు, కోపంతో కళ్లెర్రచేసి, భయంకర బాణాలతో పప్లవ శూరులను చంపి నిస్సారంగా భూమ్మీద పడేటట్లు చేశాడు. విశ్వామిత్రుడిపై పగబట్టిన ఆవు, బట్టిసాలు ధరించి యుద్ధం చేయగల యవనశక సేనల గుంపులను అపారంగా సృష్టించింది. ఆ యవనులు-శకులు, కార్చిచ్చు అడవిలో పడ్డట్లు, రాజు సైన్యం మీదపడి దహిస్తుంటే, వాళ్లందరినీ విశ్వామిత్రుడు తన అస్త్రాలతో పీనుగుపెంటల్లా చేసాడు".

వశిష్ఠ విశ్వామిత్రుల యుద్ధం

         "విశ్వామిత్రుడి భయంకరమైన శస్త్రాస్త్రాలతో కాలిపోయిన తన సైన్యాన్ని చూసిన వశిష్ఠుడు, యోగ బలాన్ని ఆశ్రయించి శీఘ్రంగా శత్రు సేనలను సంహరించమని శబలను ఆజ్ఞాపించాడు. వెంటనే హుంకరించిన కామధేనువు తన పొదుగులోంచి కాంభోజ సేనలను, యోనినుండి పప్లవ సమూహాలను, పేడ పుట్టే ప్రదేశంనుండి యవనులను, రోమ కూపాల (వెంట్రుక గూళ్లు) నుండి శకులను, మ్లేచ్ఛులను, కిరాతులను సృజించింది. వారందరు శత్రు సేనలపై పడి, వారి రథాలను-ఏనుగులను-గుర్రాలను-సైన్యాన్ని నాశనం చేసారు. అది చూసిన విశ్వామిత్రుడి నూర్గురు కొడుకులు, మితిమీరిన కోపంతో, ఒకేసారి వశిష్ఠుడిమీదకు దూసుకొచ్చారు. ఆయన వెంటనే హుంకరించి నిమిషంలో వంద మందినీ బూడిద రాసులుగా చేశాడు. తన నూర్గురు కొడుకులు ఒకేసారి మరణించడంతో-సైన్యమంతా నుగ్గుకావడంతో, సిగ్గుతో కుమిలిపోయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడిని గెలిచేదెలానని మధన పడి, విషాదంతో భూమిపై వాలాడు. వేగంలేని సముద్రంలా, కోరలు పీకిన సర్పంలా, గ్రహణం నాటి సూర్యుడిలా, రెక్కలూడిన పక్షిలా కాంతీహీనుడై-గర్వభంగమై, ఎలాగైనా వశిష్ఠుడిని జయించాలన్న పట్టుదలతో, రాజ్యభారాన్ని కొడుకుకప్పగించి, వీరుడైన విశ్వామిత్రుడు హిమవత్పర్వతానికి పోయి, శివుడికొరకు తపస్సు చేశాడు”.

శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాల్నో కోరుకొమ్మన్నాడు. భక్తజనుల సంకటాలను హరించేవాడని, పార్వతీ ప్రియుడని, కఠినాత్ములైన రాక్షసులను సంహరించేవాడని, హరా-త్రిపుర సంహారా అని, మన్మథుడి గర్వం హరించినవాడని, దేవతల పూజలందుకునే చరణాలుగలవాడని శివుడిని స్తోత్రం చేసి, నమస్కరించి, విలువిద్యనంతా అంగాలతో-ఉపాంగాలతో-మంత్రాలతో-వాటి రహస్యాలన్నిటితో తనకు ఉపదేశించమని చేతులు జోడించి ప్రార్థించాడు విశ్వామిత్రుడు. రాక్షసుల వద్ద, మునుల వద్ద, గంధర్వుల వద్ద, యక్షుల వద్ద, దేవతల వద్ద వున్న అస్త్రవిద్యలన్నీ తనకుపదేశించమని కోరాడు. ఆయన కోరినట్లే శివుడు ఉపదేశించి పోయాడు. అస్త్రాలన్నీ తన స్వాధీనంలోకి వచ్చాయన్న ధైర్యంతో-గర్వంతో విశ్వామిత్రుడు పున్నమినాటి సముద్రిడిలా పొంగిపోతూ, దూరపుటడుగులు వేసుకుంటూ, వశిష్ఠుడున్న ఆశ్రమానికి వచ్చాడు"

         "సకల శత్రువులను జయించిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడి తపోవనమంతా, స్వల్ప వ్యవధిలో, బలిష్టమైన తన దివ్యాస్త్రాల జ్వాలల్లో కాల్చి బూడిద చేశాడు. అది సహించలేని అక్కడి మునులందరు, నలు దిక్కులా పరుగెత్తారు. పక్షులన్నీ ఆకాశానికి ఎగిరిపోయాయి. శిష్యులు భయంతో వణికిపోయారు. రెప్పపాటులో ఆ వనమంతా అలా కావడంతో కోపగించిన వశిష్ఠుడు, సూర్యుడు మంచును కరిగించినట్లు, అవలీలగా విశ్వామిత్రుడిని రూపుమాపుతాననీ, ఎవరూ పోవద్దనీ అన్నా, ఆగకుండా వారంతా పరుగెత్తారు. ఎవరుకూడా అక్కడ నిలవకుండా పారిపోతుండడంతో, రోషావేశంతో కనుబొమలదురుతుంటే, విశ్వామిత్రుడిని మందలించాడు వశిష్ఠుడు. ఆతడి విజృంభణాన్ని ఆపలేనివాడిననుకొని, చిరకాలంనుండి పెంచుకుంటున్న తన తపోవనాన్నంతా కాల్చివేసిన చెడుబుద్ధిగల విశ్వామిత్రుడిని ఇక సహించలేనని అంటూ, సాధ్యంకాని తేజస్సుతో అతన్ని తేరిపార చూశాడు వశిష్ఠుడు. ఇంత చెప్పినా విశ్వామిత్రుడు వినిపించుకోకుండా, అస్త్రం వెంట అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో, వశిష్ఠుడు తనదగ్గరున్న రెండవ యమదండంలాంటి-కాలాగ్ని జ్వాలలను చిమ్మే ప్రకాశవంతమైన బ్రహ్మ దండాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడకుండా నిలబడ్డాడు”.

Saturday, January 1, 2022

హస్తినలో ధృతరాష్ట్ర, దుర్యోధన, విదుర, కుంతీదేవి లను కలిసిన రాయబారి శ్రీకృష్ణుడు ..... ఆస్వాదన-53 : వనం జ్వాలా నరసింహారావు

 హస్తినలో ధృతరాష్ట్ర, దుర్యోధన, విదుర, కుంతీదేవి లను కలిసిన రాయబారి శ్రీకృష్ణుడు

ఆస్వాదన-53

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (02-01-2022)

పాండవుల పక్షాన కౌరవుల దగ్గరికి రాయబారానికి హస్తిన బయల్దేరిన శ్రీకృష్ణుడు, ఒక పావనాశ్రమం సమీపంలో కల ఏటి ఒడ్డున విడిది చేసి మళ్లీ పయనమై పోద్దుకూకే సమయానికి కుశస్థలం చేరాడు. అక్కడొక విశాలమైన మైదానంలో గుడారాలు వేయించాడు. ఆయన రాక గురించి తెలుసుకున్న ధృతరాష్ట్రుడు తన దగ్గరకు భీష్మ, ద్రోణులతో పాటు విదురుడిని, దుర్యోధనుడిని, కర్ణుడిని, సైంధవుడిని, శకునిని పిలిచాడు. శ్రీకృష్ణుడికి సర్వసపర్యలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించమని దుర్యోధనుడికి చెప్పాడు. తండ్రి ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లను చేయడానికి ప్రవీణులను నియమించి, హస్తినాపురంలో ఉత్సవం చాటమని ఆజ్ఞాపించాడు దుర్యోధనుడు.

తదనంతరం భీష్ముడు మాట్లాడుతూ, రాయబారిగా వస్తున్న నారాయణుడు చేయాలనుకున్న పనిని తప్పించడానికి ఎవరి తరం కాదని, ఆ మహాత్ముడి ఆజ్ఞను శిరసావహించమని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. దానికి సమాధానంగా దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు పాండవులకు అర్థరాజ్యం ఇమ్మని చెపుతాడని, తానివ్వనని స్పష్టం చేస్తూ, తాను మరొక పని చేయదల్చానని చెప్తాడు. శ్రీకృష్ణుడిని పట్టి బంధిస్తే పాండవులు రెక్కలు విరిగిన పక్షుల్లాగా తనకు అణగి మణగి వుంటారని, అప్పుడు దేశాలన్నీ తానే ఏలుతానని, దానికై తగిన ఉపాయం, తోడ్పాటు సిద్ధం చేసుకుంటూనని అన్నాడు. దుర్యోధనుడి మాటలకు కోపం తెచ్చుకున్న ధృతరాష్ట్రుడు ఆ దురాలోచన మానుకొమ్మన్నాడు. పట్టి బంధించడానికి ఆ మహాత్ముడు చేసిన తప్పేమిటని ప్రశ్నించాడు. ‘పాపాత్మా! శ్రీకృష్ణుడు నీకేం అపకారం చేశాడురా?’ అని ఎలుగెత్తి ఆక్రోశించాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడి అసంబద్ధమైన మాటలు తాను వినలేనని అంటూ భీష్ముడు అక్కడి నుండి వెళ్లిపోయాడు.

కుశస్థలం నుండి హస్తినాపురానికి వెళ్లిన శ్రీకృష్ణుడికి ధృతరాష్ట్రుడి ఆదేశాలకు అనుగుణంగా, ఒక్క దుర్యోధనుడు తప్ప మిగతా పిన్నలు, పెద్దలు మంగళవాద్యాలతో ఆహ్వానం పలికారు. కృష్ణుడు మెల్లగా రాజమందిర ద్వార ప్రవేశం చేశాడు. అక్కడ రథం దిగి నడచివస్తున్న ఆయనకు ఎదురేగి ఆహ్వానం పలికారు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు మొదలైనవారు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని కౌగలించుకున్నాడు. ఉభయకుశలోపరి, తనకు జరిగిన మర్యాదల అనంతరం, శ్రీకృష్ణుడు సంభాషించడానికి ఉపక్రమించాడు. ఆ సంభాషణ రాయబారపు ఉపన్యాసం కాదు. పలుహోదాలలో అక్కడున్నవారిని ఆయా పద్ధతులలో, పరిహాసలతో పలుకరించే స్నేహపూర్వక మర్యాద.

ఆ తరువాత శ్రీకృష్ణుడు అక్కడి నుండి విదురుడి ఇంటికి బయల్దేరాడు. విదురుడు తన ఇంటిదగ్గర కృష్ణుడికి స్వాగతం పలికాడు. అతడికి పాండవుల యోగ క్షేమాలు చెప్పాడు శ్రీకృష్ణుడు. భోజనానికి విదురుడి ఇంటికి వస్తానని చెప్పి, అక్కడి నుండి కుంతీ గృహానికి వెళ్లాడు. ఆమె దగ్గర పాండవులు పడ్డ కష్టాలను నెమరేసుకున్నారు. కొడుకుల క్షేమం, కోడలి క్షేమం అడిగి తెలుసుకున్నది కుంతి. తన దుఃఖాన్ని ఆర్పమని, తనను ఉద్ధరించమని కోరింది. శ్రీకృష్ణుడు కుంతీదేవిని ఊరడించాడు. కలత మానమని, ఆమె దుఃఖాలను, మనోవ్యాధులను తొలగిస్తానని అన్నాడు కృష్ణుడు. పాండవులు విరోధులను సంహరించి ఉన్నత సామ్రాజ్యాధిపత్యమనే పండుగను జరుపుకోవడం కుంతీదేవి ఉత్సాహంగా చూస్తుందని చెప్పాడు. కుంతీదేవి దగ్గర సెలవు పుచ్చుకొని దుర్యోధనుడి భవనానికి కృతవర్మ, సాత్యకిలతో కలిసి బయల్దేరాడు.

తన దగ్గరికి వచ్చిన శ్రీకృష్ణుడిని దుర్యోధనుడు పరిజనులతో కూడి ఎదురెళ్లి ఆయన, తమ్ముడు దుశ్శాసనుడు ఆలింగనం చేసుకున్నారు. వచ్చిన శ్రీకృష్ణుడితో భోజన విషయం దుర్యోధనుడు ప్రస్తావించగా తానక్కడ భుజించనని స్పష్టంగా చెప్పాడు. భుజించడానికి శ్రీకృష్ణుడు ఇష్టపడకపోవడం తమ చుట్టరికానికి, న్యాయానికి విరుద్ధమైన విషయమని అన్నాడు దుర్యోధనుడు. తన ఇంట్లో భుజించననడానికి హేతువు చెప్పమన్నాడు. వచ్చినపని నేరవేరకుండా రాయబారులు మున్ముందుగా భుజించడం సరైనది కాదని, వచ్చినపని నెరవేరిన తరువాత అన్ని మర్యాదలు అంగీకరిస్తానని అన్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు తాను దుర్యోధనుడి ఇంట్లో విందుకు రాకపోవడానికి రాయబారి ధర్మాన్ని, రాజనీతిని కారణంగా చెప్పాడు.

దుర్యోధనుడు సంభాషణను పొడిగిస్తూ, ‘భుజించడానికి సమ్మతించనని చెప్పవచ్చుకదా కృష్ణా’ అని చమత్కరించాడు. దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ‘నీవు మేమంటే ప్రేమకలవాడివి కావు. అందువల్ల నీ ఇంట్లో భుజించడానికి ఇష్టపడను. శత్రు గృహాలలో భుజించేటప్పుడు వారు తమకేమి పెడతారో అని సందేహం కలుగుతుంది. నేను నీకు విరోదినా? అని ప్రశ్నిస్తావేమో విను. దుర్యోధనా! పాండవులంటే నీకు కోపం. వారు నాకు పంచప్రాణాలు. నీకు వారు శత్రువులు. చిన్నతనం నుండి నువ్వు పాండవులకు అపకారం చేస్తున్నావు. పూజ్యులైన అలాంటివారితో నీకు విరోధం తగునా? నాకు ఒక్క విదురుడి అన్నమే తినదగినది. కాబట్టి అక్కడికే వెళ్తున్నాను అన్నాడు. ఇలా చెప్పి విదురుడి మందిరానికి వెళ్లాడు. విదురుడు వడ్డించిన బక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలనే నాలుగు రకాలైన భోజన పదార్థాలను శ్రీకృష్ణుడు తృప్తిగా ఆరగించాడు.

భోజనానంతరం శ్రీకృష్ణుడితో విదురుడు, దుర్యోధనుడు దురాత్ముడని, నీచుడని, దురహంకార పూరితుడని, అతడు కృష్ణుడి మాటలు వింటాడా అని అన్నాడు. దుర్యోధనుడు తనకు పదకొండు అక్షౌహిణుల సైన్యం వుందని విర్రవీగుతున్నాడని, కర్ణుడు తనకు జయం కలిగిస్తాడని మిడిసి పడుతున్నాడని, కౌరవులు కృష్ణుడి ఆజ్ఞను అతిక్రమిస్తారని, పాండవులకు ఏమీ పంచి ఇవ్వరని, సంధి జరగదని, కౌరవులవన్నీ చెడు ఆలోచనలని, కాబట్టి వారున్న సభకు శ్రీకృష్ణుడు పోవద్దని చెప్పాడు విదురుడు. తనకన్నీ తెలుసని, సంధి పొసగదని కూడా తెలుసని, తన మాట ఫలించినా, ఫలించకపోయినా, పుణ్యయత్నఫలం మాత్రం తనకు దక్కుతుందని అన్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు: ‘కురుపాండవుల పొత్తుకొరకు ప్రయత్నం చేస్తాను. ధర్మయుక్తమైన ఒద్దిక మాటలు దుర్యోధనుడికి చెపుతాను. సర్వజనులకు మేలైన మార్గం తెలియచేస్తాను. దుర్యోధనుడు నామాటలు వినకపోతే పోనీ. అదీ ఒకందుకు మంచిదే. నేను సంధికి ప్రయత్నం చేయకపోతే అవివేకులు నన్ను ఆడిపోసుకుంటారు. అందువల్ల కార్యం చక్కబెట్టడానికి అనుకూలమైన మాటలు వారికి చెపుతాను. దుర్యోధనాదులు నామాటలు మన్నిస్తే బాగుపడతారు. ఒకవేళ తిరగబడితే వారు నాముందు నిలువ గల్గుతారా?’.

మర్నాడు ఉదయం ప్రాతఃకాల కృత్యాలన్నీ నెరవేర్చుకుని శ్రీకృష్ణుడు విదురుడి ఇంట్లో సిద్ధంగా వున్న సమయంలో దుర్యోధనుడు, దుశ్శాసన, కర్ణ, శకునిలతో కలిసి వచ్చాడు. ధృతరాష్ట్ర మహారాజు బంధుమిత్రులతో, పరిజనులతో కొలువు తీర్చి ఉన్నాడని చెప్పారు కృష్ణుడికి. వెంటనే రథం మీద బయల్దేరాడు కృష్ణుడు. సభామందిర ద్వారం దగ్గర దిగి నడుచుకుంటూ పోతుంటే ధృతరాష్ట్రడు ఇతర ధరాధిపతులతో ఎదురెళ్లి ఆహ్వానించాడు. సభలో ప్రవేశించి తనకు నిర్దేశించిన ఆసనం మీద కూచున్నాడు శ్రీకృష్ణుడు.         

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)