Saturday, January 1, 2022

హస్తినలో ధృతరాష్ట్ర, దుర్యోధన, విదుర, కుంతీదేవి లను కలిసిన రాయబారి శ్రీకృష్ణుడు ..... ఆస్వాదన-53 : వనం జ్వాలా నరసింహారావు

 హస్తినలో ధృతరాష్ట్ర, దుర్యోధన, విదుర, కుంతీదేవి లను కలిసిన రాయబారి శ్రీకృష్ణుడు

ఆస్వాదన-53

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (02-01-2022)

పాండవుల పక్షాన కౌరవుల దగ్గరికి రాయబారానికి హస్తిన బయల్దేరిన శ్రీకృష్ణుడు, ఒక పావనాశ్రమం సమీపంలో కల ఏటి ఒడ్డున విడిది చేసి మళ్లీ పయనమై పోద్దుకూకే సమయానికి కుశస్థలం చేరాడు. అక్కడొక విశాలమైన మైదానంలో గుడారాలు వేయించాడు. ఆయన రాక గురించి తెలుసుకున్న ధృతరాష్ట్రుడు తన దగ్గరకు భీష్మ, ద్రోణులతో పాటు విదురుడిని, దుర్యోధనుడిని, కర్ణుడిని, సైంధవుడిని, శకునిని పిలిచాడు. శ్రీకృష్ణుడికి సర్వసపర్యలు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించమని దుర్యోధనుడికి చెప్పాడు. తండ్రి ఆదేశానుసారం అన్ని ఏర్పాట్లను చేయడానికి ప్రవీణులను నియమించి, హస్తినాపురంలో ఉత్సవం చాటమని ఆజ్ఞాపించాడు దుర్యోధనుడు.

తదనంతరం భీష్ముడు మాట్లాడుతూ, రాయబారిగా వస్తున్న నారాయణుడు చేయాలనుకున్న పనిని తప్పించడానికి ఎవరి తరం కాదని, ఆ మహాత్ముడి ఆజ్ఞను శిరసావహించమని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. దానికి సమాధానంగా దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు పాండవులకు అర్థరాజ్యం ఇమ్మని చెపుతాడని, తానివ్వనని స్పష్టం చేస్తూ, తాను మరొక పని చేయదల్చానని చెప్తాడు. శ్రీకృష్ణుడిని పట్టి బంధిస్తే పాండవులు రెక్కలు విరిగిన పక్షుల్లాగా తనకు అణగి మణగి వుంటారని, అప్పుడు దేశాలన్నీ తానే ఏలుతానని, దానికై తగిన ఉపాయం, తోడ్పాటు సిద్ధం చేసుకుంటూనని అన్నాడు. దుర్యోధనుడి మాటలకు కోపం తెచ్చుకున్న ధృతరాష్ట్రుడు ఆ దురాలోచన మానుకొమ్మన్నాడు. పట్టి బంధించడానికి ఆ మహాత్ముడు చేసిన తప్పేమిటని ప్రశ్నించాడు. ‘పాపాత్మా! శ్రీకృష్ణుడు నీకేం అపకారం చేశాడురా?’ అని ఎలుగెత్తి ఆక్రోశించాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడి అసంబద్ధమైన మాటలు తాను వినలేనని అంటూ భీష్ముడు అక్కడి నుండి వెళ్లిపోయాడు.

కుశస్థలం నుండి హస్తినాపురానికి వెళ్లిన శ్రీకృష్ణుడికి ధృతరాష్ట్రుడి ఆదేశాలకు అనుగుణంగా, ఒక్క దుర్యోధనుడు తప్ప మిగతా పిన్నలు, పెద్దలు మంగళవాద్యాలతో ఆహ్వానం పలికారు. కృష్ణుడు మెల్లగా రాజమందిర ద్వార ప్రవేశం చేశాడు. అక్కడ రథం దిగి నడచివస్తున్న ఆయనకు ఎదురేగి ఆహ్వానం పలికారు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు మొదలైనవారు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని కౌగలించుకున్నాడు. ఉభయకుశలోపరి, తనకు జరిగిన మర్యాదల అనంతరం, శ్రీకృష్ణుడు సంభాషించడానికి ఉపక్రమించాడు. ఆ సంభాషణ రాయబారపు ఉపన్యాసం కాదు. పలుహోదాలలో అక్కడున్నవారిని ఆయా పద్ధతులలో, పరిహాసలతో పలుకరించే స్నేహపూర్వక మర్యాద.

ఆ తరువాత శ్రీకృష్ణుడు అక్కడి నుండి విదురుడి ఇంటికి బయల్దేరాడు. విదురుడు తన ఇంటిదగ్గర కృష్ణుడికి స్వాగతం పలికాడు. అతడికి పాండవుల యోగ క్షేమాలు చెప్పాడు శ్రీకృష్ణుడు. భోజనానికి విదురుడి ఇంటికి వస్తానని చెప్పి, అక్కడి నుండి కుంతీ గృహానికి వెళ్లాడు. ఆమె దగ్గర పాండవులు పడ్డ కష్టాలను నెమరేసుకున్నారు. కొడుకుల క్షేమం, కోడలి క్షేమం అడిగి తెలుసుకున్నది కుంతి. తన దుఃఖాన్ని ఆర్పమని, తనను ఉద్ధరించమని కోరింది. శ్రీకృష్ణుడు కుంతీదేవిని ఊరడించాడు. కలత మానమని, ఆమె దుఃఖాలను, మనోవ్యాధులను తొలగిస్తానని అన్నాడు కృష్ణుడు. పాండవులు విరోధులను సంహరించి ఉన్నత సామ్రాజ్యాధిపత్యమనే పండుగను జరుపుకోవడం కుంతీదేవి ఉత్సాహంగా చూస్తుందని చెప్పాడు. కుంతీదేవి దగ్గర సెలవు పుచ్చుకొని దుర్యోధనుడి భవనానికి కృతవర్మ, సాత్యకిలతో కలిసి బయల్దేరాడు.

తన దగ్గరికి వచ్చిన శ్రీకృష్ణుడిని దుర్యోధనుడు పరిజనులతో కూడి ఎదురెళ్లి ఆయన, తమ్ముడు దుశ్శాసనుడు ఆలింగనం చేసుకున్నారు. వచ్చిన శ్రీకృష్ణుడితో భోజన విషయం దుర్యోధనుడు ప్రస్తావించగా తానక్కడ భుజించనని స్పష్టంగా చెప్పాడు. భుజించడానికి శ్రీకృష్ణుడు ఇష్టపడకపోవడం తమ చుట్టరికానికి, న్యాయానికి విరుద్ధమైన విషయమని అన్నాడు దుర్యోధనుడు. తన ఇంట్లో భుజించననడానికి హేతువు చెప్పమన్నాడు. వచ్చినపని నేరవేరకుండా రాయబారులు మున్ముందుగా భుజించడం సరైనది కాదని, వచ్చినపని నెరవేరిన తరువాత అన్ని మర్యాదలు అంగీకరిస్తానని అన్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు తాను దుర్యోధనుడి ఇంట్లో విందుకు రాకపోవడానికి రాయబారి ధర్మాన్ని, రాజనీతిని కారణంగా చెప్పాడు.

దుర్యోధనుడు సంభాషణను పొడిగిస్తూ, ‘భుజించడానికి సమ్మతించనని చెప్పవచ్చుకదా కృష్ణా’ అని చమత్కరించాడు. దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ‘నీవు మేమంటే ప్రేమకలవాడివి కావు. అందువల్ల నీ ఇంట్లో భుజించడానికి ఇష్టపడను. శత్రు గృహాలలో భుజించేటప్పుడు వారు తమకేమి పెడతారో అని సందేహం కలుగుతుంది. నేను నీకు విరోదినా? అని ప్రశ్నిస్తావేమో విను. దుర్యోధనా! పాండవులంటే నీకు కోపం. వారు నాకు పంచప్రాణాలు. నీకు వారు శత్రువులు. చిన్నతనం నుండి నువ్వు పాండవులకు అపకారం చేస్తున్నావు. పూజ్యులైన అలాంటివారితో నీకు విరోధం తగునా? నాకు ఒక్క విదురుడి అన్నమే తినదగినది. కాబట్టి అక్కడికే వెళ్తున్నాను అన్నాడు. ఇలా చెప్పి విదురుడి మందిరానికి వెళ్లాడు. విదురుడు వడ్డించిన బక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలనే నాలుగు రకాలైన భోజన పదార్థాలను శ్రీకృష్ణుడు తృప్తిగా ఆరగించాడు.

భోజనానంతరం శ్రీకృష్ణుడితో విదురుడు, దుర్యోధనుడు దురాత్ముడని, నీచుడని, దురహంకార పూరితుడని, అతడు కృష్ణుడి మాటలు వింటాడా అని అన్నాడు. దుర్యోధనుడు తనకు పదకొండు అక్షౌహిణుల సైన్యం వుందని విర్రవీగుతున్నాడని, కర్ణుడు తనకు జయం కలిగిస్తాడని మిడిసి పడుతున్నాడని, కౌరవులు కృష్ణుడి ఆజ్ఞను అతిక్రమిస్తారని, పాండవులకు ఏమీ పంచి ఇవ్వరని, సంధి జరగదని, కౌరవులవన్నీ చెడు ఆలోచనలని, కాబట్టి వారున్న సభకు శ్రీకృష్ణుడు పోవద్దని చెప్పాడు విదురుడు. తనకన్నీ తెలుసని, సంధి పొసగదని కూడా తెలుసని, తన మాట ఫలించినా, ఫలించకపోయినా, పుణ్యయత్నఫలం మాత్రం తనకు దక్కుతుందని అన్నాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు: ‘కురుపాండవుల పొత్తుకొరకు ప్రయత్నం చేస్తాను. ధర్మయుక్తమైన ఒద్దిక మాటలు దుర్యోధనుడికి చెపుతాను. సర్వజనులకు మేలైన మార్గం తెలియచేస్తాను. దుర్యోధనుడు నామాటలు వినకపోతే పోనీ. అదీ ఒకందుకు మంచిదే. నేను సంధికి ప్రయత్నం చేయకపోతే అవివేకులు నన్ను ఆడిపోసుకుంటారు. అందువల్ల కార్యం చక్కబెట్టడానికి అనుకూలమైన మాటలు వారికి చెపుతాను. దుర్యోధనాదులు నామాటలు మన్నిస్తే బాగుపడతారు. ఒకవేళ తిరగబడితే వారు నాముందు నిలువ గల్గుతారా?’.

మర్నాడు ఉదయం ప్రాతఃకాల కృత్యాలన్నీ నెరవేర్చుకుని శ్రీకృష్ణుడు విదురుడి ఇంట్లో సిద్ధంగా వున్న సమయంలో దుర్యోధనుడు, దుశ్శాసన, కర్ణ, శకునిలతో కలిసి వచ్చాడు. ధృతరాష్ట్ర మహారాజు బంధుమిత్రులతో, పరిజనులతో కొలువు తీర్చి ఉన్నాడని చెప్పారు కృష్ణుడికి. వెంటనే రథం మీద బయల్దేరాడు కృష్ణుడు. సభామందిర ద్వారం దగ్గర దిగి నడుచుకుంటూ పోతుంటే ధృతరాష్ట్రడు ఇతర ధరాధిపతులతో ఎదురెళ్లి ఆహ్వానించాడు. సభలో ప్రవేశించి తనకు నిర్దేశించిన ఆసనం మీద కూచున్నాడు శ్రీకృష్ణుడు.         

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

No comments:

Post a Comment