Saturday, January 8, 2022

రాజనీతికి శిఖరాయమాణమైన శ్రీకృష్ణ రాయబారం, విశ్వరూప ప్రదర్శన ..... ఆస్వాదన-54 : వనం జ్వాలా నరసింహారావు

 రాజనీతికి శిఖరాయమాణమైన శ్రీకృష్ణ రాయబారం, విశ్వరూప ప్రదర్శన

ఆస్వాదన-54

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (09-01-2022)

కౌరవుల దగ్గరికి రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడి కొలువుకూటం చేరుకొనగానే అక్కడికి వచ్చిన మహామునులను భీష్ముడికి చూపించాడు. వారందరికీ అర్ఘ్యపాద్యాదులిచ్చి, సరైన రీతిలో ఉపచారాలు చేయించి, వారు కూర్చోడానికి పీఠాలు వేయించమని చెప్పాడు. వారు కూర్చోకుండా ఇతరులు కూర్చోవడం న్యాయం కాదని అన్నాడు. భీష్ముడు అలాగే చేయించాడు. కురువీరులంతా లేచి నిలబడి దివ్యమునులకు ఆసనాలిచ్చి కూర్చొనబెట్టారు. దేవర్షులు కూర్చున్నతరువాత శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు, ఇతర ప్రముఖులు కూర్చున్నారు. కర్ణ దుర్యోధనులు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. సభ అంతటా శ్రీకృష్ణాధీనమైన ఒక దివ్యానుభూతి వాతావరణం నెలకొన్నది. రాజనీతికి శిఖరాయమాణమైన రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడు ఒక దివ్యాదివ్యవిభావం (ముదివర్తి కొండమాచార్యులు గారి విశ్లేషణ). కొలువుకూటంలోని వారందరి మనస్సులు శ్రీకృష్ణ సందర్శనంతో సంతోష పరవశాలయ్యాయి.

సభామధ్యంలో వున్న శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి, తానక్కడికి వచ్చిన అవసరాన్ని వివరిస్తూ, భరతవంశం సంతోషించేటట్లు తన ఇరుకుటుంబాలకు ‘న్యాయం’, ‘పరమహితం’ చెప్పడం తన రాకకు కారణం అన్నాడు. కౌరవపాండవులు పాలు, నీరులాగా కలసి మెలసి జీవించడం మంచి పనని, వారలా వుండే విధంగా నడిపించడం ధృతరాష్ట్రుడి బాధ్యత అని, వారిరురువు వేరనే భేదబుద్ధి ఆయనకు లేదుకదా! అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా ‘న్యాయం, హితం తెలియచేశాడు. ఈ సందర్భంగా భరతవంశ గౌరవ, సంప్రదాయ పరిరక్షణను వివరించాడు ఈ విధంగా:

చ:       భరత కులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తుఁ బెంపునుం

గరుణయుఁ గల్గియుండు ననగా నుతి గన్నది యంది సద్గుణో

త్తరులరు నీవు నీయనుగు దమ్ముడు నీతనయుల్ యశోధురం

దర శుభ శీలురీ సుచరిత క్రమ మిప్పుడు దప్ప నేటికిన్

         (భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, పొత్తు, పెంపు, కరుణ కలిగి నుతి కెక్కింది. దాయాది భాగాలకై తగవులాడుకొని కుత్తుకలను ఉత్తరించుకోవటానికి ఎప్పుడూ సిద్ధం కాలేదు. రాజ్యాన్ని త్యాగం చేయటమే గాని దానికై వంశ నాశనానికి పూనుకోవటం భరతవంశ సంప్రదాయం కాదు. ఆ వంశం యొక్క సుచరిత్ర క్రమాన్ని ఇప్పుడు తప్పటం దేనికి?)

         ధృతరాష్ట్రుడు కౌరవవంశ రాజులలో అగ్రగణ్యుడు కావాలంటే ఈ న్యాయం పాటించాలని శ్రీకృష్ణుడన్నాడు. జనులు మెచ్చే విధంగా వ్యవహరించాలని హెచ్చరించాడు. దుర్యోధనాదులు దుష్ట చేష్టలు చేయడానికి వెనుకాడరని, భరతవంశ సంప్రదాయాన్ని కలుషితం చేస్తున్నారని అన్నాడు. కౌరవపాండవులు ఒక మంచి నిర్ణయానికి వచ్చి, శాంతి వహించి, జీవించడం మంచిదన్నాడు. అలాకాకుండా యుద్ధమే జరుగుతే మహావిపత్తు కలుగుతుందని, తన మాటలమీద విశ్వాసం వుంచి సంధి జరిపించాలని కోరాడు. సందికార్యం ధృతరాష్ట్రుడి చేతిలోనే వుందని, సర్వసామ్రాజ్యాధిపత్యం ధృతరాష్ట్రుడిదేనని హెచ్చరిస్తూ, ఉభయ పక్షాలలోని వీరులు యుద్ధంలో చావడం కన్నా కలసి, మెలసి వర్తించడం మంచిదని చెప్పాడు.

         శ్రీకృష్ణుడు పాండవులు చెప్పమన్న మాటలు కూడా ధృతరాష్ట్రుడితో చెప్పాడు వివరంగా. పాండునందనులు ధృతరాష్ట్రుడికి పరమ భక్తితో నమస్కరించి ఒకే గొంతుతో చెప్పమన్న మాటలు చెప్తూ, తమకు రాజ్యంలో సగపాలు పొందగలమన్న దృఢ నిశ్చయంతో వున్నామని అన్న విషయం గుర్తుచేశాడు. ఇంకా ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు:

         ఉ:       సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ

బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె

వ్వార లుపేక్ష చేసిరది వారల చేటు గాని ధర్మ ని

స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్    

         (ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది. కౌరవుల వలన సత్యానికి ధర్మానికి హాని చేకూరింది. సత్యాన్ని, ధర్మాన్ని పాలించే పాండవులను దైవం తప్పక రక్షిస్తాడు. దీనిని విశ్లేషిస్తూ ముదివర్తి కొండమాచార్యులు ఇలా రాశారు: ‘పాండవులు సభాసదులను ఉద్దేశించి చెప్పమన్న సందేశం ఇది. ఉద్యోగపర్వ తాత్పర్యానికీ, మహాభారత కథాతత్త్వానికీ ఈ పద్యం ఆత్మలాంటిది. తెలుగు సాహిత్యంలో ఈ పద్యం ఒక ధర్మదీపం. సారవంతమైన ధర్మం, నిర్మలమైన సత్యం నిత్య ధర్మాలుగా పేర్కొనడం గమనార్హం’).

         పాండవుల తండ్రి భాగం పాండవులకు ఇచ్చి, ఆయన రాజ్యభాగం తన కుమారులు, మనుమలు హాయిగా అనుభవిస్తుంటే ధృతరాష్ట్రుడిని అంతా కొనియాడుతారని చెప్పాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు ఎలాంటివాడో ధృతరాష్ట్రుడికి తెలుసని అంటూ ఆయన ధర్మ గుణాలను పొగిడాడు. పాండవులు ఎంతటి శాంత స్వభావులో అంత వీరాగ్రేసరులని, సంధి-సంగ్రామం రెండింటిలో ఏది హితమో నిర్ణయించమని చెప్పాడు. శ్రీకృష్ణుడి మాటలు అక్కడున్న అందరికీ నచ్చాయి. సభలో వున్న జామదగ్న్య మహాముని, కణ్వమహాముని, నారదుడు, శ్రీకృష్ణుడి మాటలు విని కురువంశాన్ని కాపాడమని దుర్యోధనుడికి చెప్పారు. వారి హితవాక్యాలను మన్నించకుండా, కర్ణుడితో, ‘ఈ మునీశ్వరులు ఎంత పిచ్చివారు అని వ్యాఖ్యానించాడు. బ్రహ్మదేవుడు తనను ఏమి కమ్మని పుట్టించాడో అదే జరుగుతుందని అన్నాడు.

         తానేమీ చేయలేనని ధృతరాష్ట్రుడన్నాడు మహర్షులతో. ఇహపరాలు రెండూ సమకూడే విధానాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడని, కాని ఆయన చెప్పినట్లుగా కార్యం నిర్వర్తించడానికి తనకు ఏమాత్రం చొరవ లేదని అన్నాడు కృష్ణుడితో. తన కుమారుడు మూఢచిత్తుడని అతడిని ఆయనే శాంతింప చేయాలని చెప్పాడు. ధృతరాష్ట్రుడు చెప్పినట్లే శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, అతడికి మొండి పట్టుదల తగదన్నాడు. పాండవులతో పొత్తు పెట్టుకొమ్మన్నాడు. తండ్రి మాట వినమన్నాడు. శకుని, కర్ణ, దుశ్శాసనుల చెడు సలహాలు వినవద్దన్నాడు. భీమార్జున బలపరాక్రమాల గురించి చెప్పాడు. పాండవులు యుద్ధానికి వస్తే కౌరవులు ఎదిరించలేరన్నాడు. కర్ణాదులకే కాదు, దేవదానవులకు కూడా పాండవులను ఎదుర్కోవడం సాధ్యంకాదన్నాడు. కాబట్టి సంధి మంచిదన్నాడు. భీష్మ, ద్రోణులు కూడా దుర్యోధనుడికి హితవు చెప్పారు. శ్రీకృష్ణుడి మాటలు వినమన్నారు.

         వీరందరి మాటలు వున్న దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో, తనను అంతా నిందిస్తున్నారని, కాని, తన తప్పేమీలేదని అన్నాడు. ధర్మరాజు జూదరై రాజ్యాన్ని కోల్పోయాడని అన్నాడు. అంతా ధర్మారాజు ఇష్టప్రకారమే జరిగిందన్నాడు. వారే తమపైదండెత్తడానికి సైన్యాన్ని సమకూర్చుకున్నారని అంటూ, క్షత్రియ ధర్మం ప్రకారం తాను యుద్ధం చేస్తే విజయమో, వీరస్వర్గమో లభిస్తుందని స్పష్టం చేశాడు. పాండవులకు సగ భాగం ఇవ్వడానికి తాను అంగీకరించనన్నాడు. తామూ, పాండవులు భూమిని పంచుకుని పరిపాలించడం జరగదని, వాడి సూది మొన మోపినంత మాత్రమైనా భూమిని’ పంచి పాండవులకు తానివ్వనని, తమలో ఎవరో ఒకరు యుద్ధంలో విజయం సాధించి రాజ్యం చేయాలని తన నిర్ణయమని అన్నాడు దుర్యోధనుడు.

         దుర్యోధనుడు చెప్పినట్లే రణరంగంలో అతడు ఓడిపోతాడని, యుద్ధం రాబోతున్నదని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. గతంలో దుర్యోధనుడు చేసిన దుర్మార్గాలన్నీ చెప్పాడు మరోమారు. శాంతి వహించమని అదే పాండవులకు, కౌరవులకు మంచిదని మళ్లీ అన్నాడు. ఆ సమయంలో దుశ్శాసనుడి సలహామీద దుర్గర్వంతో దుర్యోధనుడు సభనుండి లేచి వెళ్లాడు. ఆయన వెంట కర్ణుడు, శకుని, సహోదరులు, మిత్రులైన రాజులు కూడా పోయి కొంతదూరంలో వున్నారు. ధృతరాష్ట్రుడప్పుడు గాంధారిని సభకు రప్పించాడు. గాంధారి ఆదేశంతో విదురుడు వెళ్లి దుర్యోధనాదులను సభకు తీసుకువచ్చాడు.

         సభకు వచ్చిన దుర్యోధనుడికి గాంధారి హితవాక్యాలు పలికింది కాని అతడికి అవి నచ్చలేదు. గర్వంతో మళ్లీ సభనుండి లేచి వెళ్లి, కర్ణాదులతో దురాలోచనకు పూనుకున్నారు. శ్రీకృష్ణుడిని బంధించాలని పన్నాగం పన్నారు. కృష్ణుడిని చెరసాలలో పెట్టి పాండవులకు దిగులు పుట్టిద్దామని కుట్ర చేశారు. అలా కృష్ణుడిని పట్టాలని దుష్కార్యాలోచన చేసి, దుష్టచతుష్టయం అనబడే దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిలు ఆయనను బంధించాలని నిశ్చయించారు. సాత్యకి ఇది గమనించి శ్రీకృష్ణుడిని హెచ్చరించాడు. విదురుడు ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడి దృష్టికి తెచ్చాడు. తక్షణమే వెళ్లి దుర్యోధనుడిని సభకు తీసుకురమ్మన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు అతడిని సభకు తోడ్కొని వచ్చాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని చీకొట్టాడు.

         శ్రీకృష్ణుడు చిరునవ్వుతో దుర్యోధనుడిని చూసి, తన విశ్వరూపం ప్రదర్శించాడు. వాసుదేవుడి నుదుట బ్రహ్మదేవుడు, వక్షఃస్థలంలో రుద్రుడు, ముఖంలో అగ్ని, పార్శ్వ ప్రదేశాలలో ఇంద్రాది దేవతలు, కుడి-ఎడమ చేతుల్లో ఆయుధాలతో బలరాముడు, పార్థుడు, వీపునుండి మిగిలిన పాండవులు ఆవిర్భవించారు. అంకా అనేకమంది ఆయనలో కనిపించారు. ఆయన చేతుల్లో శంఖం, చక్రం, గద, ఖడ్గం మొదలైన దివ్యాయుధాలు కనిపించాయి. ఆ ముకుందుడి దివ్యతేజ స్వరూపం చూడడానికి శక్యం కాక సమస్త జనులు కన్నులు మూసుకున్నారు. నారదాది మహర్షులకు, భీష్మ, ద్రోణ, విదుర, సంజయులకు తన విశ్వరూపం చూడడానికి దివ్యదృష్టి ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. సభలో కలకల ధ్వని విని,  అది శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శనం అయి వుంటుందని భావించిన ధృతరాష్ట్రుడు తనకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించమని వేడుకున్నాడు. ఆయనకు కూడా దివ్యదృష్టిని ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఆయన్ను చూసిన కన్నులతో ఇంకేమీ చూడనని చెప్పి తన దివ్యదృష్టిని వెనక్కు తీసుకొమ్మన్నాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి కోరిక తీరేవిధంగా అతడి కన్నులను గుడ్డివిగా చేసి తన విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. నారదాది మహర్షులకు వెళ్లిరండని సెలవిచ్చాడు. 

         ఆ తరువాత శ్రీకృష్ణుడు సభ నుండి బయల్దేరి వెళ్లిపోయాడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

  

        

        

         

No comments:

Post a Comment