Sunday, March 13, 2022

జనకుడికి సూర్యవంశ క్రమాన్ని చెప్పిన వశిష్ఠుడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-99 : వనం జ్వాలా నరసింహారావు

జనకుడికి సూర్యవంశ క్రమాన్ని చెప్పిన వశిష్ఠుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-99

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (14-03-2022)

         జనక మహారాజు ఉదయమే నిద్రలేచి, ప్రాతస్సంధ్యాది కృత్యాలను తీర్చుకొని, పురోహితుడైన శతానందుడుతో తన తమ్ముడి ప్రస్తావన తెచ్చాడు. యిక్షుమతీ నదీతీరంలో వున్న పుష్పకంలాంటి సాంకాశ్య నగరాన్ని, నీతి ధర్మం తప్పకుండా, తన తమ్ముడు కుశధ్వజుడనే రాజు, పాలిస్తున్నాడని అంటాడు. తను చేసిన యజ్ఞాన్ని వాడు కాపాడినవిషయం జనకుడు గుర్తుచేసుకున్నాడు.వాడిని చూడాలనుకుంటున్నానని, జరుగనున్న వివాహమహోత్సవం వాడితో కలిసి అనుభవించాలని వుందని, కాబట్టి అతడిని తీసుకొచ్చేందుకు శీఘ్రంగా పోగలిగే దూతలను పంపాలని చెప్పి ఆ పనికి తగినవారిని పంపించాడు. రాజాజ్ఞ ప్రకారం వేగంగా పోయే గుర్రాలపై దూతలు ఆలస్యం చేయకుండా ప్రయాణంచేసి, కుశధ్వజుడికి జనక మహారాజు చెప్పిన వార్తను తెలియచేశారు. అన్న రమ్మనగానే బయలుదేరి వచ్చిన కుశధ్వజుడు, సంతోషాతిశయంతో, అన్నకు-పురోహితుడికి నమస్కరించి తన ఆసనంపై కూర్చున్నాడు. అన్నదమ్ములిద్దరు తమ ఆసనాలపై కూర్చుని మాట్లాడుకుంటూ, ముఖ్యమంత్రి సుధాముడుని పిలిచి, దశరథ మహారాజుదగ్గరికి పోయి, ఆయనను మంత్రులతోను-పుత్రులతోను వెంటబెట్టుకొని తీసుకొని రమ్మంటాడు. సుధాముడు జనకుడు చెప్పినట్లే దశరథుడు విడిదిచేసిన శిబిరానికి పోయి, ఆయనకు శిరస్సుతో నమస్కరించి, పురోహితుడితో వున్న జనక మహారాజు దశరథుడిని చూడాలనుకుంటున్నాడని చెప్పాడు.

         సుధాముడు ఇలా చెప్పడంతో, దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్ఠుడిని చూపించి, ఇక్ష్వాకువంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు. కార్యాలన్నీ సాధించగల శక్తి వశిష్ఠుడికుందనీ, విశ్వామిత్రుడు-ఇతర మునీశ్వరులు అనుమతిస్తే, తమ వంశ విధాన్ని వశిశ్ఠుడు సందేహానికి ఏమాత్రం తావులేకుండా చెప్పుతాడని అని, మౌనంగా కూర్చుంటాడు. హితులతో-మంత్రులతో-పురోహితులతో కూడి వున్న జనకుడితో వశిష్ఠుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడీవిధంగా:

         "అవ్యక్తసంభవుడు-నిత్యుడు-అవ్యయుడైన చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించాడు. మరీచికి కశ్యపుడు-ఆయనకు వివస్వంతుడు-ఆయనకు మనువు-ఆయనకు ఇక్ష్వాకుడు కలిగారు. ఇక్ష్వాకుడి రాజధాని అయోధ్య. ఇక్ష్వాకుడి తనయుడు కుక్షికి వికుక్షి, అతడికి బాణుడు, అతడికి అనరణ్యుడు, అతడికి ప్రుథుడు, అతడికి త్రిశంకుడు, అతడికి దుంధుమారుడు (యువనాశ్వుడని కూడా అంటారు), అతడికి మాంధాత, అతడికి సుసంధి కలిగారు. , సుసంధికి ధ్రువసంధి-ప్రసేనజిత్తు అనే ఇరువురు కుమారులు కలిగారు. ధ్రువసంధి కొడుకు భరతుడు. అతడి కొడుకు యసితుడు. యసితుడి విరోధులైన హైహయులు యుద్ధంలో ఓడించడంతో ఆయన మంత్రులతో పారిపోయి అడవులకెళ్లి, హిమవత్పర్వతం దగ్గర భృగు ప్రస్రవణంలో మితబలుడై నివసించాడని విన్నాను. యసితుడికి ఇద్దరు భార్యలు. ఇద్దరూ గర్భిణులే. అందులో ఒకామె తన సవతికి విషం కలిపిన భక్ష్యాన్ని తినడానికిచ్చింది. భృగువంశంలో పుట్టిన చ్యవనుడనే మహర్షి వీరుండే చోటుకొచ్చాడొకనాడు. యసితుడి భార్య కాళింది ఆయనతో, తనకు పుత్రుడు కలిగేట్లు అనుగ్రహించమని కోరడంతో, ఆమె శూరుల్లో శ్రేష్ఠుడైన కొడుకును కంటుందని చెప్పాడు. ఆమెకు పుట్టనున్న కొడుకు గరళంతో పుడతాడు కనుక అతడి పేరు సగరుడని, అతి బలవంతుడవుతాడని అంటాడు చ్యవనుడు కాళిందితో. ఆయన చెప్పినట్లే సగరుడిని కనింది కాళింది".

         "సగరుడి కుమారుడు అసమంజుడు-అసమంజుడి కొడుకు అంశుమంతుడు-అంశుమంతుడి కుమారుడు దిలీపుడు-దిలీపుడి కొడుకు భగీరథుడు-భగీరథుడి కొడుకు కకుత్థ్సుడు-అతడి కొడుకు రఘుడు-అతడి కొడుకు ప్రవృద్ధుడు. ప్రవృద్ధుడికి శంఖణుడు-అతడికి సుదర్శనుడు-అతడికి అగ్నివర్ణుడు-అతడికి శీఘ్రగుడు-అతడికి మరువు-అతడికి ప్రశుశ్రుకుడు-అతడికి అంబరీషుడు-అతడికి నహుషుడు-అతడికి యయాతి-అతడికి ఆభాగుడు-అతడికి అజుడు-అతడికి బలశాలైన దశరథుడు కొడుకులుగా పుట్టారు. దశరథుడి కుమారులే శ్రీరామ లక్ష్మణులు. ఇలా వీరి వంశం ఆదినుండి పరిశుద్ధమైంది. వీరందరు అసమాన ధర్మరతులు-వీరులు. సత్యమంటే ప్రీతికలవారు". ఇలా సూర్యవంశ క్రమాన్ని వివరించిన వశిష్ఠుడు, శ్రీరామచంద్రుడికి-లక్ష్మణుడికి సరితూగే గుణగణాలుగల తన ఇరువురు పుత్రికలను ప్రేమపూర్వకంగా ఇచ్చి వివాహం చేయమని, ఇది తన మనవి అని కోరాడు జనకుడిని.          (కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. కులం తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు-తీసుకొననూ కూడదు. వివాహంలో వధూవరుల కుల జ్ఞానం అవశ్యంగా తెలియాలి. తొలుత తల్లి కులం, తండ్రి కులం పరీక్షించాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో పది రకాల వంశం వారిని వదలాలని శాస్త్రం చెపుతున్నది. జాతకర్మాది క్రియలు లేని, పురుష సంతానంలేని, విద్యా శూన్యమై, మిగిలి దీర్ఘ రోగాలు కలదై, మూల రోగాలు కలదై, క్షయ-అజీర్ణం-అపస్మారం-బొల్లి-కుష్ఠు రోగాలు కలదైన వంశాలతో వివాహ సంబంధం చేయరాదు. తోడబుట్టినవాడు లేని పిల్లను, తండ్రెవరో తెలియని దానిని వివాహం చేసుకోకూడదు).

         (ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సగరుడి తండ్రి అసితుడిని హైహయులు-తాల జంఘులు-మరికొందరు కలిసి రాజ్య భ్రష్టుడిని చేసి తరిమేశారు. ఆయనప్పుడు హిమవత్పర్వతానికి పోయి నివసించాడు. అక్కడప్పుడు సగరుడి తల్లి గర్భవతిగా వుంది. ఆ సమయంలో అసితుడు మరణించాడు. ఆయన భార్య సహగమనం చేయబోతుంటే, చ్యవనుడు వారించి ఆమెను తన ఆశ్రమంలో వుంచి రక్షించాడు. ఆమెకు పుట్టిన సగరుడికి తానే సంస్కారాదులు చేసి, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్ర విద్యలనూ నేర్పాడు. బుద్ధి తెలిసిన సగరుడు తన తండ్రి వివరాలను అడిగితే, తల్లి ఆ వృత్తాంతమంతా వివరించింది. సగరుడు తండ్రిని తరిమిన వారితో యుద్ధంచేసి, ఓడించాడు. గురువాజ్ఞ ప్రకారం వారిని చంపలేదు. వారిలో యవనులను బోడితలల వారిగానూ, శకులను అర్థముండులుగా, బారదులను విరితల వారిగా జాతి భ్రష్టులను చేశాడు. అలా ఆ క్షత్రియులందరినీ స్వాధ్యాయ హీనులుగా-వషట్కార రహితులుగా-స్వధర్మ హీనులుగా చేసి దేశంనుండి వెళ్లగొట్టాడు సగరుడు.వీరే "మ్లేచ్ఛులు".ఇప్పటి తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారే. ఆర్యన్ కు వికృతి "అయిరాన్". అదే ఇరాన్ గా మారింది తదనంతరం).

Saturday, March 12, 2022

మహాభారత యుద్ధం రెండవ రోజున అర్జునుడి ధాటికి కంపించిన కురుక్షేత్ర రణరంగం .... ఆస్వాదన-63 : వనం జ్వాలా నరసింహారావు

 మహాభారత యుద్ధం రెండవ రోజున అర్జునుడి ధాటికి కంపించిన కురుక్షేత్ర రణరంగం

ఆస్వాదన-63

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (13-02-2022)

కురుక్షేత్ర సంగ్రామంలో మొదటి రోజు జరిగిన యుద్ధంలో పాండవుల మీద కౌరవులది పైచేయి కావడంతో ధర్మరాజు మనస్సు దుఃఖభరితమై పోయింది. తన తమ్ములను, కొందరు స్నేహితులను వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి పోయాడు. తన తమ్ములు భీష్ముడితో యుద్ధం చేయడానికి సమర్థులు కారేమోనన్న అభిప్రాయాన్ని వెల్లడించిన ధర్మరాజు, యుద్ధం విరమించాలని తనకు అనిపిస్తున్నదన్నాడు. తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన రాజులను భీష్ముడికి ఎరగా సమర్పించలేనని, తాను తిరిగి అడవులకు పోయి అక్కడే కూరలు, ఆకులు తింటూ వుంటానని శ్రీకృష్ణుడితో అన్నాడు. తమ కర్తవ్యం ఏమిటో చెప్పమని కోరాడు ఆయన్ను.

జవాబుగా శ్రీకృష్ణుడు, ధర్మరాజును ఆవేదన చెందవద్దని, ఆయనకు ఎదురెవ్వరూ లేరని, ఆయన తమ్ములంతా లోకాలను జయించగల సమర్థులని, భీష్ముడిని శిఖండి జయిస్తాడని, ధర్మరాజుకు ఇష్టం కాని వారందరినీ వరుసగా ఎదో ఒక తీరున తాను సంహరిస్తానని చెప్పాడు. పాండవుల పక్షాన పోరాడే వారంతా తమ ప్రాణాలను అర్పించడానికి, విజయం చేకూర్చడానికి సిద్ధంగా వున్నారని అన్నాడు. అప్పుడు, ఆ మాటలకు తృప్తి చెందిన ధర్మరాజు, యుద్దోత్సాహంగా వున్న ధృష్టద్యుమ్నుడితో, మర్నాటి యుద్ధంలో అద్భుతమైన ‘క్రౌంచవ్యూహాన్ని’ నిర్మించి ఆయన తెలివితేటలను చూపించమని అడిగాడు. ధర్మరాజు చెప్పినట్లే చేస్తానన్నాడాయన.

మర్నాడు ధృష్టద్యుమ్నుడు క్రౌంచవ్యూహం పన్నాడు. అందులో అర్జునుడు ముక్కుగా; కుంతి భోజుడు, శైల్యుడు కన్నులుగా; ద్రుపదుడు తురాయిగా; దశార్ణరాజు, శూరసేన రాజు, కిరాతరాజు కుత్తుకగా; భీముడు, ధృష్టద్యుమ్నుడు కుడి-ఎడమ రెక్కలుగా అయ్యారు. అభిమన్యుడు, సాత్యకి, ద్రౌపది కొడుకులు, పౌండ్ర, చోళ పాండ్యులు భీముడి దగ్గరికి చేరారు. నకుల సహదేవులు, ఘటోత్కచుడు, శంబర వత్స రాజులు, ధృష్టద్యుమ్నుడి దగ్గర చేరారు. కేకయరాజు, కాశిరాజులతో కలిసి విరాటుడు మొల స్థానంలో నిలిచాడు. హూణపతి మొదలైనవారు ధర్మరాజు చుట్టూ చేరి ఆయన వెనక వున్నారు. ఇలా వున్నదా వ్యూహం.

కౌరవ సేనలు మూడు వ్యూహాలుగా ఏర్పడింది. మధ్యలో భీష్ముడు నిలబడ్డాడు. కురుపాండవ సేనలు రెండూ యుద్ధానికి సన్నద్ధులై ఒకరినొకరు ఎదుర్కున్నారు. భీష్ముడు పాండవుల వ్యూహాన్ని చిన్నాభిన్నంచేశాడు. భీష్ముడి విజృంభణ చూసి అర్జునుడు ఆగ్రహించి రథాన్ని అటు తోలమని శ్రీకృష్ణుడికి చెప్పాడు. కొన్ని జాగ్రత్త మాటలు చెప్పి శ్రీకృష్ణుడు భీష్ముడి దిక్కుగా రథాన్ని తీసుకెళ్లాడు. అర్జునుడు భీష్ముడితోను, అతడికి సహాయంగా వచ్చిన కౌరవ వీరులతోను పోరాడుతుంటే, అర్జునుడికి సహాయంగా సాత్యకి మొదలైన వారొచ్చారు. అర్జునుడి ధాటికి కౌరవ వీరులు చెల్లాచెదరైపోయారు. అది చూసి దుర్యోధనుడు భీష్ముడిని అధిక్షేపించాడు. భీష్ముడు అతడి మాటలకు నొచ్చుకున్నాడు.

భీష్మార్జునుల యుద్ధం తీవ్రమైంది. భీష్ముడు తన బాణాలతో శ్రీకృష్ణుడి వక్షఃస్థలం ఛేదించాడు. అర్జునుడు భీష్ముడి సారథిని నొప్పించాడు. ఇరువురూ సమ ఉజ్జీగా పోరాడారు. మరోవైపున ధృష్టద్యుమ్నుడికి, ద్రోణాచార్యుడికి అదే మోతాదులో భీకరమైన యుద్ధం జరిగింది. ఒకరిని మరొకరు తీవ్రంగా నొప్పించారు. ఎవరూ తగ్గలేదు. ద్రోణాచార్యుడి ధాటికి ధృష్టద్యుమ్నుడు ఆగలేకపోయాడు. అప్పుడు భీముడు ధృష్టద్యుమ్నుడిని ఆదుకున్నాడు. వెంటనే కళింగరాజు, ఇతర కౌరవ వీరులు భీముడిని ఎదుర్కున్నారు. భీముడు భయంకరమైన శౌర్యాన్ని ప్రదర్శించాడు. పోరులో భీముడి చేతిలో కళింగదేశ రాజు శ్రుతాయువు కొడుకైన శక్రదేవుడు, తమ్ముడు భానుమంతుడు మరణించారు. శ్రుతాయువు కూడా మూర్ఛపోయాడు. అప్పుడు భీష్ముడు రంగంలో దిగి భీముడిని కలత పెట్టాడు.

ఆ తరువాత ధృష్టద్యుమ్నుడికి, అశ్వత్థామకు యుద్ధం జరిగింది. లక్ష్మణ కుమారుడికి, అభిమన్యుడుకి జరిగిన యుద్ధంలో తన కొడుకు నొచ్చిన సంగతి తెలిసికొని దుర్యోధనుడు అభిమన్యుడు మీదికి యుద్ధానికి పోయాడు. ఆయన వెంటే భీష్మద్రోణాది వీరులు కూడా అభిమన్యుడి మీదికి వెళ్లారు. తన కొడుకుని అనేకమంది వీరులు చుట్టుముట్టడం చూసిన అర్జునుడు అటువచ్చి భీభత్సాన్ని సృష్టించాడు. అతడి ధాటికి రణరంగం కంపించింది. కౌరవసేనలు భయంతో వెనుకంజ వేశాయి. వారలా పారిపోవడం చూసిన శ్రీకృష్ణుడు, అర్జునుడు విజయగర్వంతో తమ శంఖాలను పూరించారు.

భీష్ముడు కౌరవసేన దుస్థితిని గమనించి ద్రోణుడితో, శ్రీకృష్ణుడు తన రథానికి సారథిగా వుండగా అర్జునుడు కౌరవసేనలను సంహరించాడని, రథం నడపడంలో శ్రీకృష్ణుడిని మించిన నేర్పుగల సారథి లేడని, అంత గొప్ప సారథి లభించడం వల్ల రథికుడిగా అర్జునుడు రాణించి కౌరవ సేనలను చీల్చి చెండాడగలిగాడని, ఘోరమైన యుద్ధ భూమిని క్రీడారంగంగా చేసికొని వీరవినోద విహారం చేశాడని అన్నాడు. ఆర్జునుడిని చూస్తుంటే అతడు మూడవ కన్ను విప్పిన పరమ శివుడిలాగా కనిపిస్తున్నాడని, కౌరవ సేనలు అధీనం తప్పాయని, పారిపోయే సేనలను మళ్లించమని ద్రోణుడికి చెప్పాడు భీష్ముడు.

సూర్యాస్తమయం అవుతున్నందున ఆ రోజుకు ఇక యుద్ధం చాలించడం మంచిదని భీష్ముడు అన్నాడు. ద్రోణుడు అతడి మాటలకు తన అంగీకారం తెలిపాడు. అప్పుడు భీష్ముడు అందరినీ యుద్ధభూమినుండి నిష్క్రమించమని ఆజ్ఞాపించి కౌరవ సేనలను మరలించాడు. పాండవులు సింహనాదాలు చేస్తూ తమ శిబిరాలకు పోయారు. అలా రెండవ రోజు యుద్ధంలో పాండవులది పైచేయి అయింది.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Sunday, March 6, 2022

దశరథుడిని కలిసిన జనకుడి దూతలు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-98 : వనం జ్వాలా నరసింహారావు

 దశరథుడిని కలిసిన జనకుడి దూతలు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-98

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-03-2022)

         జనక మహారాజు పంపిన దూతలు, అతివేగంగా గుర్రాలను పరిగెత్తించి, త్వరగా ప్రయాణం ముగించుకొని, మూడు రాత్రిళ్లు దారిలో గడిపి, నాలుగోరోజు పగలు అయోధ్యకు చేరుకున్నారు. రాజద్వారం దగ్గర కాపలా వున్న ద్వారపాలకులతో, తాము జనక మహారాజు దూతలమని-ఆయన పనుపున వచ్చామని-ద్వారం వద్ద వేచి వున్నామని, దశరథ మహారాజుకు తెలియచేయమని కోరారు. రాజుకు తెలియచేసి వచ్చిన ద్వారపాలకులు, జనకుడి దూతలొచ్చారని చెప్పగానే, త్వరగా పిలుచుకొని రమ్మని తమ రాజు చెప్పారనీ, ఆలస్యం చేయకుండా రమ్మనీ అంటారు. వారు లోపటికిపోయి, ముదుసలి-దేవతలతో సమానుడైన దశరథుడిని కలిసారు. రాజుకు నమస్కరించి, విన సొంపైన మృదువైన మాటలతో, మొదలు, తమ రాజు అడిగినట్టుగా క్షేమ సమాచారాలు అడిగారు. జనక మహారాజు, పురోహితులతో-మంత్రులతో-అగ్నులతో కూడిన దశరథ మహారాజు క్షేమం గురించి అడిగాడని చెప్పి, ఇంకొక వార్తకూడా వుందని, విశ్వామిత్రుడి ఆజ్ఞ పొంది తమ రాజిట్లా మనవి చేయమన్నాడని, ఆయన మాటలుగా ఇలా చెప్పారు.

         "రాజేంద్రా, వినుము. నా కూతురు సీత, వీర్యశుల్కని నేను ప్రతిజ్ఞ చేసాను. ఆ చంద్రముఖిని వరించాలని ఎందరో వచ్చి బీరములేనివారై-వ్యర్థాశులై పోయారు. విశ్వామిత్రుడి వెంట నీ కుమారులు, నా అదృష్టం కొద్దీ ఆకస్మికంగా వచ్చి, రాజులందరి సమక్షంలో-నిండు సభలో, అందరుచూస్తుండగా శివుడు ధనస్సును రామచంద్రమూర్తి రెండుగా విరిచాడు. నా పుత్రికను గెలిచాడలా. కాబట్టి ఆ మహాబలశాలికి నా సీతనిచ్చి వివాహం చేసి, నా కూతురు వీర్యశుల్క అని నేను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోదలిచాను. నా కోరిక తీర్చుకొనేటట్లు ఆజ్ఞ ఇవ్వమని అడుగుతున్నాను. రాజేంద్రా మీరిక్కడకొచ్చి మీ కొడుకులను-కోడళ్లను చూడొచ్చు. వివాహం చూసి సంతోషించవచ్చు. నా కోరికా నెరవేరినట్లవుతుంది. కాబట్టి, మంత్రులతో-పురోహితులతో-హితులతో వచ్చి పుత్రులను చూడండి". ఇలా తమ రాజు చెప్పినట్లు చెప్పి, రాజుల వద్ద ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం సమంజసం కాదని వూరుకున్నారు.

దశరథ మహారాజు వెంటనే వామదేవ-వశిష్ఠాదులను,మంత్రులనుపిలిపించి సంతోషం ఉప్పొంగి పోతుంటే, వారితో ఇలా అంటాడు. "విశ్వామిత్రుడిరక్షణలో కౌసల్యా కుమారుడు - మన రామచంద్రమూర్తి, లక్ష్మణుడితో కలిసి జనకుడి రాజధానైన మిథిలా నగరంలో వున్నాడట. మన శ్రీరామచంద్రుడి బల పరాక్రమం చూసి-మెచ్చిన జనకుడు, తనకూతురునిచ్చి వివాహం చేయనున్నాడట. జనకుడు తలపెట్టిన కార్యం మీకు సమ్మతమైతే, ఆలస్యం చేయకుండా పయనమై పోదాం" అనగా మంత్రులందరు ఇది తగిన కార్యమేనని, మంచి సంబంధమేనని అన్నారు. వారి మాటలకు దశరథుడు సంతోషించి, ఉదయమే ప్రయాణమై పోవాలి కనుక, సర్వం సిద్ధం చేయమని మంత్రులను ఆదేశించి, శుభవార్త మోసుకొచ్చిన జనకుడు దూతలకు బహుమానాలిచ్చాడు. వారుకూడా ఆ రాత్రి అక్కడే బస చేసారు.

దశరథుడిని కుశల ప్రశ్నలు వేసిన జనకుడు

         ఉదయం కాగానే దశరథుడు, రాజసభలో, బంధువులు మౌనులు కొలుస్తుండగా మంత్రి సుమంత్రుడిని పిలుస్తాడు. రాజబొక్కసాన్ని పర్యవేక్షించే అధికారులు విశేష ధనాన్ని తీసుకొని తక్షణమే మిథిలకు బయలుదేరాలనీ, వారివెంట చతురంగ బలాలు కూడా ప్రయాణమవ్వాలని, తక్షణం పల్లకిని కూడా సిద్ధంచేయాలనీ, వాసుదేవుడు-వశిష్ఠుడు-జాబాలి-కాశ్యపుడు-దీర్ఘాయువైన మార్కండేయుడు-కాత్యాయనుడు ముందుగా వెళ్లాలి కనుక వారికొక ప్రత్యేకమైన రథాన్ని ఏర్పాటుచేయాలనీ, సుమంత్రుడితో అంటూ దశరథుడు అందరినీ ప్రయాణానికి త్వరపెట్టాడు. ఇలా రాజేంద్రుడైన దశరథుడు, మునిరాజులగుంపు తనను కొలుస్తూ-తన వెంట వస్తుంటే, సేనా సమూహాలతో కూడిన ఇంద్రుడివలె, మిక్కిలి సంతోషంగా ఐదవ రోజు పగటిపూటకల్లా విదేహనగరం చేరుకుంటాడు. ఆయన రాకను తెలుసుకున్న జనకుడు, మిక్కిలి సంతుష్టిగల మనస్సుతో దశరథుడి వద్ద కొచ్చి, ముసలి రాజును పూజించి ఇలా అంటాడు:

         "రాజసత్తమా, నీకు స్వాగతం. నా భాగ్యం ఫలించినందునే నా పట్టణానికి వచ్చావు. నీ కొడుకుల శౌర్యంవల్ల కలిగిన సంతోషాన్ని మనసార అనుభవించు. దశరథరాజ చంద్రా, నా అదృష్టంవల్ల నిన్ను ఈ రోజు దర్శించుకొనే పుణ్యం కలిగింది. నా భాగ్యంవల్ల బ్రాహ్మణులతో కలిసి వచ్చిన వశిశ్ఠుడిని చూడగలిగాను. నా పుణ్య పరిపాకంవల్ల విఘ్న సమూహాలన్నీ నాశనమై పోయాయి. నా పుణ్యం మంచిదైనందున, సూర్య వంశపు రాజులతో వియ్య మాడే అవకాశం కలిగింది. మిక్కిలి బలవంతులైన మీతో బంధుత్వం కలుస్తున్నందువల్ల మా వంశం అతి పూజ్యమైంది. నీ దయవల్ల నా కోరికలన్నీ నెరవేరుతున్నాయి. రేపు ప్రాతః కాలం యజ్ఞం అయింతర్వాత, శాస్త్ర సమ్మతమైన రీతిలో,  పరమర్షులకి ఇష్టమైన విధంగా పరిణయం చేయండి". సమాధానంగా సంతోషంతో దశరథుడు ఇలా చెప్పాడు:

"దానం దాత వశమని పూర్వం పెద్దలంటుంటే విన్నాను. దాతవు నీవే. నువ్వెలా చెపుతే అలాగే ప్రవర్తిస్తాను. నీకు నేను కొత్తవాడినికాదుకదా?". దశరథుడు గొప్ప రాజైనందున, ఎంత రాజసంగా మాట్లాడుతాడోనని తలచిన జనకుడు, వినయంగా ఆయనిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోయాడు. దశరథుడి వెంట వచ్చిన ముని సమూహమంతా అక్కడే సుఖంగా వున్నారు. దశరథుడు తన కొడుకులను చూసి, సంతోషంగా వారితో ముచ్చటలాడుకుంటూ గడిపాడు. జనకుడు యజ్ఞం పూర్తిచేసి కూతురిని పెళ్లికూతురుగా తయారుచేశాడు.

 

Saturday, March 5, 2022

మహాభారత యుద్ధం మొదటి రోజున భీష్ముడి బల పరాక్రమం, శౌర్య ప్రసారం .... ఆస్వాదన-62 : వనం జ్వాలా నరసింహారావు

 మహాభారత యుద్ధం మొదటి రోజున భీష్ముడి బల పరాక్రమం, శౌర్య ప్రసారం

ఆస్వాదన-62

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (06-03-2022)

అర్జున విషాదయోగం, శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శన, అర్జునుడికి తత్త్వజ్ఞానోపదేశం, ఫలితంగా జ్ఞానోదయం అనంతరం భీష్ముడి మొదటి రోజు యుద్ధం ప్రారంభం అయింది. కౌరవ సేనాధిపతిగా భీష్ముడు కదనరంగంలో ముందుండడాన్ని చూసిన పాండవులు భీముడిని ముందుంచుకుని భీష్ముడు నడుస్తున్న చోటుకు దగ్గరిగా తమ సైన్యాలను తరలించారు. భీముడు సింహనాదం చేసి విజృంభించడంతో కౌరవుల పక్షానికి చెందిన దుశ్శాసనుడితో సహా దుర్యోధనుడి ఎనిమిదిమంది తమ్ములు ఆయన్ను ఎదిరించారు. పాండవుల పక్షాన నకులుడు, సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు విజృంభించారు. ఆవిధంగా యుద్ధం ప్రారంభం కాగానే పాండవుల పక్షాన భీముడు, కౌరవుల పక్షాన దుశ్శాసనుడు ముందుగా దూసుకు వచ్చారు. పాండవ, కౌరవ సేనలు భీకరంగా పోరాడాయి.

         అదే సమయంలో అర్జునుడికి, భీష్ముడికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. సాత్యకి, కృతవర్మతో తలపడ్డాడు. అభిమన్యుడు, బృహద్బలుడిని ఎదుర్కున్నాడు. భీమసేనుడి మీద భీష్ముడు కోపించాడు. విలువిద్యలో ఆరితేరిన ధానుష్కుడైన భీష్ముడిని, భీముడు గదతో కాకుండా ధనుస్సు పూని సమ యుద్ధం చేయడం ఒక విశేషం. సహదేవుడికి, దుర్ముఖుడికి మధ్య యుద్ధం జరిగింది. ధర్మరాజు, సాక్షాత్తూ నకులసహదేవుల మేనమామైన శల్యుడిని ఎదుర్కున్నాడు. పాండవ సేనాపతైన ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని తాకాడు. మగధ దేశాధిపతైన సహదేవుడు, భూరిశ్రవుడితో యుద్ధం చేశాడు. ధృష్టకేతుడు కురువృద్ధుడైన బాహ్లికుడిని తలపడ్డాడు. అలంబసుడికి, ఘతోత్కచుడికి భీకరమైన రాక్షస పోరు జరిగింది. శిఖండి అశ్వత్థామను ఎదిరించాడు. భగదత్తుడు, విరాటుడి మీద విజృంభించాడు. కేకయరాజైన బృహత్ క్షత్రవిభుడు, కృపుడు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. జయద్రథుడికి, ద్రుపదుడికి తీవ్రంగా పోరు జరిగింది. వికర్ణుడు, యుధామాన్యుడు తలపడ్డారు.

శకునిని, ధర్మరాజు తనయుడు ప్రతివింధ్యుడు ఎదుర్కోగా, కాంభోజరాజు భీముడి కొడుకైన శ్రుతసోముడితో తలపడ్డాడు. ఉలూచి-అర్జునుడి కొడుకు ఇరావంతుడు ధృతరాష్ట్రుడి కొడుకైన శ్రుతాయువును ఎదుర్కున్నాడు. విందుడు, అనువిందుడు కుంతిభోజుడిని, అతడి కొడుకు పురజిత్తును ఎదుర్కొన్నారు. దీర్ఘబాహుడు ఉత్తరుడి మీదికి విజృంభించాడు. నకులుడి కొడుకు శతానీకుడు ఉలూకుడిని ఎదుర్కున్నాడు.

ఈ విధంగా కౌరవపాండవ సేనల్లోని గొప్ప వీరులు ఒకరితో ఒకరు తలపడగా యుద్ధం భీకరంగా సాగింది. యుద్ధం ఆ విధంగా దాదాపు మధ్యాహ్న సమయం వరకు సాగింది. ఆ తరువాత భీష్ముడు భయంకరుడై విజృంభించి, పాండవ సేనను తాకి, వారు పన్నిన వ్యూహాలను చెదరిపోయేట్లు రణక్రీడ సలిపాడు. ఆయన యుద్ధం చేస్తుంటే పాండవుల సేనలు తల్లడిల్లిపోయాయి. ఆ సమయంలో అభిమన్యుడు కౌరవ సేనను ఎదుర్కున్నాడు. శల్యుడిని, కృతవర్మను, వివింశతిని, కృపుడిని చీకాకు పరచి, భీష్ముడి మీదకు విజృంభించాడు. భీష్మాదులంతా కలిసి అభిమన్యుడిని ఎదుర్కున్నారు. అయినా అతడు చలించలేదు. ఒకానొక సమయంలో అభిమన్యుడి బాణాలకు భీష్ముడి జెండా విరిగి నేలమీద పడిపోయింది. ఆ కార్యాన్ని సాధించి అభిమన్యుడు వీరవిహారం చేసేటప్పుడు భీముడు అతడికి తోడుగా వచ్చి, భీష్ముడిని ఎదిరించాడు. శల్యుడిని సొమ్మసిల్ల చేశాడు. అభిమన్యుడికి, భీముడికి బాసటగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయరాజులు, విరాటరాజు చేరారు. భీష్ముడి వీరోచిత పోరాటం కొనసాగింది.

ఇంతలో ఉత్తరుడు వచ్చి శల్యుడిని ఎదుర్కున్నాడు. అతడిని విరథుడిని చేశాడు. కోపగించిన శల్యుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించి ఉత్తరుడిని చంపాడు. ఇది చూసి, ఉత్తరుడి సోదరుడు శంఖుడు శల్యుడిని ఎదిరించాడు. అప్పుడు భీష్ముడు శంఖుడిని అడ్డుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడు తన రథాన్ని అటువైపుగా మళ్లించాడు. వెంటనే భీష్మార్జునులు ఒకరిమీద ఒకరు విజృంభించారు. అప్పుడు సరిగ్గా మధ్యాహ్న సమయం అయింది. శల్యుడు, శంఖుడి గుర్రాలను నేలమీద పడగొట్టాడు. కౌరవపాండవ వీరులమధ్య యుద్ధం కొనసాగుతుండగా, భీష్ముడు విజృంభించాడు. అతడి అద్భుత పరాక్రమానికి పాండవులు ఆశ్చర్యపోయారు.   

ఇంతలో సూర్యుడు అస్తమించాడు. అంతట చీకట్లు వ్యాపించాయి. అప్పుడు యుద్ద్ధం ఆపుచేసి ఇరుపక్షాల సేనలు తమతమ ఆవాసాలకు వెళ్లిపోయారు. భీష్ముడి బలపరాక్రమాలకు, శౌర్య ప్రసారానికి దుర్యోధనుడు, అతడి తమ్ములు సంతోషించారు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

              

          

    

    

Wednesday, March 2, 2022

కేసీఆర్ ఆలోచనలో ‘బంగారు భారత్' : వనం జ్వాలా నరసింహారావు

 కేసీఆర్ ఆలోచనలో ‘బంగారు భారత్'

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (03-03-2022)

రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం చూపిస్తానని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ దిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు. జాతీయ రాజకీయాలతోపాటు దేశ పాలనలో కూడా ఒక రకమైన గుణాత్మక మార్పును సూచిస్తూ, కేసీఆర్ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. భావసారూప్యం కల పలు రాష్ట్రాల నాయకులను కలుసుకుని తన మదిలోని భావాలను వారితో పంచుకుంటున్నారు. ఆద్యతన భవిష్యత్ లో ఆయన ప్రయత్నాలు ఒక రూపు దిద్దుకుంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  కేసీఆర్ ఈ పాటికే కలిసిన, రకరకాల విధంగా సంఘీభావం తెలిపిన నాయకుల స్పందన చూస్తుంటే ఇది స్పష్టంగా తెలుస్తోంది.

మహోన్నతమైన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్తానం నుండి, తెలంగాణ రాష్ట్ర సాధన వరకు, ఆ తదుపరి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు దాకా, తదనంతరం గత ఎనిమిది సంవత్సరాలలో కేసీఆర్ సాధించిన అద్భుత విజయాలను పరిశీలిస్తే, విశ్లేషిస్తే, భవిష్యత్ లో ఏం జరగబోతుందో యావత్ భారత దేశ ప్రజలకు స్పష్టంగా అవగాహన అవుతుంది. కేంద్రంలోని బీజేపీకి ప్రత్యామ్నాయంపై ఆలోచన చేయడానికి, ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించడానికి ఇప్పుడే సరైన పరిస్థితులున్నాయి, ఇదే సరైన సమయం. ఆ మాటకొస్తే ఒక్క భారతీయ జనతా పార్టీనే కాకుండా, దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ కూడా అధికారానికి దూరంగా వుండే విధంగా ప్రత్యామ్నాయం వుండబోతోంది అనడంలో అతిశయోక్తి లేదు.

         ఈ నేపథ్యంలో దేశంలో గత 75 ఏండ్లుగా దేశ రాజకీయ పరిణామాలను, చక్కదిద్దాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ వేదికల మీద పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఇదే క్రమంలో అవసరమైతే ఏర్పడబోయే జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ కూటమికి తానే నాయకత్వం వహిస్తానని కూడా కేసీఆర్ సూచనప్రాయంగా చెప్పారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 14 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన అగ్రనేతగా, అలాగే గత ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా పాలన సాగించిన కేసీఆర్‌ను నిశితంగా వీక్షిస్తున్నవారికి వారికి, ఆయన తలపెట్టిన పని ఏమంత కష్టం కాదనిపిస్తుంది. బహుశా ఆయన తలపెట్టిన పని భగవదనుగ్రహం వల్ల కష్ట సాధ్యం కాదనిపిస్తున్నది.  

         దేశంలో ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రజలను మతాల వారీగా, కులాల వారీగా విభజించి, రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ, నేరపూరిత రాజకీయాలు చేసే పార్టీలు గత 75 సంవత్సరాలుగా  పాలనలో ఉన్న ఈ దేశాన్ని ఉద్ధరించేందుకు ఏం చేయాలో కేసీఆర్ అరమరికలు లేకుండా స్పష్టంగా చెప్పారు. ఇంతకాలం పాలకులు అవినీతికి పాల్పడ్డారని, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపారని, వారికి ప్రజాస్వామ్య నైతికత, విలువలపై అవగాహన కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అధీనంలోని ప్రతి సంస్థను, రాష్ట్రాల అధికారాలను, సహకార సమాఖ్య ప్రాథమిక స్వరూపాన్ని నిర్వీర్యం  చేస్తున్నదన్న సీఎం కేసీఆర్ ధర్మాగ్రహాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. జాతీయ స్థాయిలో అధికార పీఠాన్ని కేసీఆర్ సూచించిన ప్రత్యామ్నాయం అధిష్టించే అవకాశం వస్తే అది చేసే మొట్ట మొదటి ముఖ్యమైన పని ఏమిటంటే, ఈ దేశ కాలపరీక్షగా నిలిచిన పాత గంగా-జమున తెహజీబ్‌ సంస్కృతిని బలోపేతం చేయడమే.

2014 జూన్ నెలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడగానే సీఎం కేసీఆర్, రాష్ట్రంలో గతంలో నెలకొన్న మతపరమైన విభేదాలను సమసిపోయేలా చేసి, సెక్యులరిజాన్ని బలపరుస్తూ, గంగా జమునా తెహజీబ్ సంస్కృతిని నెలకొల్పారు. అదేవిధంగా దేశస్థాయిలో కేసీఆర్ కు అవకాశం వస్తే, మత సామరస్యం పాటిస్తూ, కులం, మతం, వర్గాల ఆధారంగా ప్రజలపై దాడులు, జరగకుండా చూస్తాడు. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను, తమకిష్టమైన ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను తిరిగి తీసుకువస్తారు. ప్రజలు కోరుకున్నది తినడానికి, వారు కోరుకున్న విధంగా దుస్తులు ధరించడానికి ప్రజల హక్కును కల్పిస్తాడు.

'బంగారు భారత్‌' గురించి కేసీఆర్‌ మాట్లాడినప్పుడు అసలు అర్థం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కొందరికి ఉండవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన సాధించిన అద్భుతమైన విజయాలను చూస్తే ఆయన దార్శనికత గురించి తెలియని వారికి స్పష్టత వస్తుంది. కేసీఆర్ సూచించే ప్రత్యామ్నాయ ప్రభుత్వ పాలనలో తెలంగాణాలో లాగానే విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ రంగాలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి 2 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి దేశంలోని ప్రతి మూలకు సరఫరా చేస్తారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 65,000 టీఎంసీల నీటిని పూర్తిగా వినియోగించుకునేందుకు భారీ, మధ్యతరహా, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభిస్తారు.

దేశంలోని వ్యవసాయ భూములకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి నదులను అనుసంధానం చేయడం జరుగుతుంది. వ్యవసాయ రంగానికి 24 గంటల సాగునీరు, ఉచిత నాన్యమైన విద్యుత్ ఇవ్వడంతోపాటు రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తారు. దేశవ్యాప్తంగా రైతు బంధు, రైతు భీమా కార్యక్రమాలను అమలు పరచడం జరుగుతుంది. రైతు వేదికలను నిర్మిస్తారు.  

కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకోనున్న ప్రత్యామ్నాయం దేశవ్యాప్తంగా వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని సద్వినియోగంలోకి తెచ్చి బీడు భూములను సద్వినియోగ పరిచి సస్యశ్యామలం చేస్తారు.  రైతుల నేలల్లో భూసార పరీక్షలు చేయించి, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉన్న పంటలనే పండించేలా చూస్తారు. రైతుల ఆదాయాన్ని బాగా పెంచుతారు.

దళితుల కోసం కేసీఆర్ తెలంగాణాలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా స్వావలంబన పొందేలా చూడడం జరుగుతుంది. గిరిజనులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా లబ్ధి చేకూర్చేలా, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేలా పథకాలను ప్రవేశపెట్టి అమలుపరచడం జరుగుతుంది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి కార్యక్రమాలను జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడం, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ప్రారంభించి అందులో 50 శాతం బాలికల కోసం కేటాయించడం జరుగనున్నది. విదేశీ విద్యార్థులు కూడా భారత్‌కు ఇష్టంగా వచ్చేలా అవకాశాలు కలిపించి, మన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే బదులు దేశంలోనే అవకాశాలు కలిగించి, ఇతర దేశాల విద్యార్థులు సహితం తమ ఉన్నత చదువుల కోసం భారత్‌కు వచ్చే వెసలుబాటు కలగనున్నది.

లోపభూయిష్టమైన జిఎస్‌టి అమలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హస్తగతం చేసుకోవడం, రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని విషయాలపై నియంత్రణ సాధించే ప్రయత్నం వంటి మోదీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను వెనక్కి తీసుకునేందుకు కూడా కేసీఆర్ ప్రత్యామ్నాయం ఆలోచన చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసిమెలిసి పనిచేయాల్సిన నిజమైన సమాఖ్య స్ఫూర్తికి మార్గం సుగమం అవుతుంది.  వలస రాజ్యాల కాలం నుండి వాడుకలో ఉన్న అన్ని క్రూరమైన చట్టాలను రద్దు చేస్తారు.

ఆర్థిక రంగంలో మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణలను కేసీఆర్ సూచించిన ప్రత్యామ్నాయం పునరుద్ధరిస్తుంది. అలాంటి సంస్కరణలు ఆచరణాత్మకమైనవి, ప్రజలకు అనుకూలమైనవిగా ఉంటాయి. ప్రభుత్వంతోపాటు పన్ను చెల్లింపుదారులకు అనుకూల విధానం, సంస్కరణలు పెద్దఎత్తున పెట్టుబడులను తెస్తాయి.  దీంతో భారతదేశం ప్రపంచంలో అత్యంత అనుకూలమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారుతుంది.

మరో మాటలో చెప్పాలంటే, కేసీఆర్ చెప్పిన “బంగారు భారత్” అంటే శాంతియుత, సంతోషకరమైన, సౌకర్యవంతమైన. అభివృద్ధి-సంక్షేమం ప్రతిబింబించే దేశం అని అర్థం. పారిశ్రామిక పెట్టుబడిదారులకు, విద్యార్థులకు, యాత్రీకులకు, సత్యాన్వేషకులకు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిని అనుసరించే వారందరికీ అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా భారతదేశం మారాలి. అదే కేసీఆర్ కాంక్షించే బంగారు భారత్.