Saturday, March 12, 2022

మహాభారత యుద్ధం రెండవ రోజున అర్జునుడి ధాటికి కంపించిన కురుక్షేత్ర రణరంగం .... ఆస్వాదన-63 : వనం జ్వాలా నరసింహారావు

 మహాభారత యుద్ధం రెండవ రోజున అర్జునుడి ధాటికి కంపించిన కురుక్షేత్ర రణరంగం

ఆస్వాదన-63

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (13-02-2022)

కురుక్షేత్ర సంగ్రామంలో మొదటి రోజు జరిగిన యుద్ధంలో పాండవుల మీద కౌరవులది పైచేయి కావడంతో ధర్మరాజు మనస్సు దుఃఖభరితమై పోయింది. తన తమ్ములను, కొందరు స్నేహితులను వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి పోయాడు. తన తమ్ములు భీష్ముడితో యుద్ధం చేయడానికి సమర్థులు కారేమోనన్న అభిప్రాయాన్ని వెల్లడించిన ధర్మరాజు, యుద్ధం విరమించాలని తనకు అనిపిస్తున్నదన్నాడు. తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన రాజులను భీష్ముడికి ఎరగా సమర్పించలేనని, తాను తిరిగి అడవులకు పోయి అక్కడే కూరలు, ఆకులు తింటూ వుంటానని శ్రీకృష్ణుడితో అన్నాడు. తమ కర్తవ్యం ఏమిటో చెప్పమని కోరాడు ఆయన్ను.

జవాబుగా శ్రీకృష్ణుడు, ధర్మరాజును ఆవేదన చెందవద్దని, ఆయనకు ఎదురెవ్వరూ లేరని, ఆయన తమ్ములంతా లోకాలను జయించగల సమర్థులని, భీష్ముడిని శిఖండి జయిస్తాడని, ధర్మరాజుకు ఇష్టం కాని వారందరినీ వరుసగా ఎదో ఒక తీరున తాను సంహరిస్తానని చెప్పాడు. పాండవుల పక్షాన పోరాడే వారంతా తమ ప్రాణాలను అర్పించడానికి, విజయం చేకూర్చడానికి సిద్ధంగా వున్నారని అన్నాడు. అప్పుడు, ఆ మాటలకు తృప్తి చెందిన ధర్మరాజు, యుద్దోత్సాహంగా వున్న ధృష్టద్యుమ్నుడితో, మర్నాటి యుద్ధంలో అద్భుతమైన ‘క్రౌంచవ్యూహాన్ని నిర్మించి ఆయన తెలివితేటలను చూపించమని అడిగాడు. ధర్మరాజు చెప్పినట్లే చేస్తానన్నాడాయన.

మర్నాడు ధృష్టద్యుమ్నుడు క్రౌంచవ్యూహం పన్నాడు. అందులో అర్జునుడు ముక్కుగా; కుంతి భోజుడు, శైల్యుడు కన్నులుగా; ద్రుపదుడు తురాయిగా; దశార్ణరాజు, శూరసేన రాజు, కిరాతరాజు కుత్తుకగా; భీముడు, ధృష్టద్యుమ్నుడు కుడి-ఎడమ రెక్కలుగా అయ్యారు. అభిమన్యుడు, సాత్యకి, ద్రౌపది కొడుకులు, పౌండ్ర, చోళ పాండ్యులు భీముడి దగ్గరికి చేరారు. నకుల సహదేవులు, ఘటోత్కచుడు, శంబర వత్స రాజులు, ధృష్టద్యుమ్నుడి దగ్గర చేరారు. కేకయరాజు, కాశిరాజులతో కలిసి విరాటుడు మొల స్థానంలో నిలిచాడు. హూణపతి మొదలైనవారు ధర్మరాజు చుట్టూ చేరి ఆయన వెనక వున్నారు. ఇలా వున్నదా వ్యూహం.

కౌరవ సేనలు మూడు వ్యూహాలుగా ఏర్పడింది. మధ్యలో భీష్ముడు నిలబడ్డాడు. కురుపాండవ సేనలు రెండూ యుద్ధానికి సన్నద్ధులై ఒకరినొకరు ఎదుర్కున్నారు. భీష్ముడు పాండవుల వ్యూహాన్ని చిన్నాభిన్నంచేశాడు. భీష్ముడి విజృంభణ చూసి అర్జునుడు ఆగ్రహించి రథాన్ని అటు తోలమని శ్రీకృష్ణుడికి చెప్పాడు. కొన్ని జాగ్రత్త మాటలు చెప్పి శ్రీకృష్ణుడు భీష్ముడి దిక్కుగా రథాన్ని తీసుకెళ్లాడు. అర్జునుడు భీష్ముడితోను, అతడికి సహాయంగా వచ్చిన కౌరవ వీరులతోను పోరాడుతుంటే, అర్జునుడికి సహాయంగా సాత్యకి మొదలైన వారొచ్చారు. అర్జునుడి ధాటికి కౌరవ వీరులు చెల్లాచెదరైపోయారు. అది చూసి దుర్యోధనుడు భీష్ముడిని అధిక్షేపించాడు. భీష్ముడు అతడి మాటలకు నొచ్చుకున్నాడు.

భీష్మార్జునుల యుద్ధం తీవ్రమైంది. భీష్ముడు తన బాణాలతో శ్రీకృష్ణుడి వక్షఃస్థలం ఛేదించాడు. అర్జునుడు భీష్ముడి సారథిని నొప్పించాడు. ఇరువురూ సమ ఉజ్జీగా పోరాడారు. మరోవైపున ధృష్టద్యుమ్నుడికి, ద్రోణాచార్యుడికి అదే మోతాదులో భీకరమైన యుద్ధం జరిగింది. ఒకరిని మరొకరు తీవ్రంగా నొప్పించారు. ఎవరూ తగ్గలేదు. ద్రోణాచార్యుడి ధాటికి ధృష్టద్యుమ్నుడు ఆగలేకపోయాడు. అప్పుడు భీముడు ధృష్టద్యుమ్నుడిని ఆదుకున్నాడు. వెంటనే కళింగరాజు, ఇతర కౌరవ వీరులు భీముడిని ఎదుర్కున్నారు. భీముడు భయంకరమైన శౌర్యాన్ని ప్రదర్శించాడు. పోరులో భీముడి చేతిలో కళింగదేశ రాజు శ్రుతాయువు కొడుకైన శక్రదేవుడు, తమ్ముడు భానుమంతుడు మరణించారు. శ్రుతాయువు కూడా మూర్ఛపోయాడు. అప్పుడు భీష్ముడు రంగంలో దిగి భీముడిని కలత పెట్టాడు.

ఆ తరువాత ధృష్టద్యుమ్నుడికి, అశ్వత్థామకు యుద్ధం జరిగింది. లక్ష్మణ కుమారుడికి, అభిమన్యుడుకి జరిగిన యుద్ధంలో తన కొడుకు నొచ్చిన సంగతి తెలిసికొని దుర్యోధనుడు అభిమన్యుడు మీదికి యుద్ధానికి పోయాడు. ఆయన వెంటే భీష్మద్రోణాది వీరులు కూడా అభిమన్యుడి మీదికి వెళ్లారు. తన కొడుకుని అనేకమంది వీరులు చుట్టుముట్టడం చూసిన అర్జునుడు అటువచ్చి భీభత్సాన్ని సృష్టించాడు. అతడి ధాటికి రణరంగం కంపించింది. కౌరవసేనలు భయంతో వెనుకంజ వేశాయి. వారలా పారిపోవడం చూసిన శ్రీకృష్ణుడు, అర్జునుడు విజయగర్వంతో తమ శంఖాలను పూరించారు.

భీష్ముడు కౌరవసేన దుస్థితిని గమనించి ద్రోణుడితో, శ్రీకృష్ణుడు తన రథానికి సారథిగా వుండగా అర్జునుడు కౌరవసేనలను సంహరించాడని, రథం నడపడంలో శ్రీకృష్ణుడిని మించిన నేర్పుగల సారథి లేడని, అంత గొప్ప సారథి లభించడం వల్ల రథికుడిగా అర్జునుడు రాణించి కౌరవ సేనలను చీల్చి చెండాడగలిగాడని, ఘోరమైన యుద్ధ భూమిని క్రీడారంగంగా చేసికొని వీరవినోద విహారం చేశాడని అన్నాడు. ఆర్జునుడిని చూస్తుంటే అతడు మూడవ కన్ను విప్పిన పరమ శివుడిలాగా కనిపిస్తున్నాడని, కౌరవ సేనలు అధీనం తప్పాయని, పారిపోయే సేనలను మళ్లించమని ద్రోణుడికి చెప్పాడు భీష్ముడు.

సూర్యాస్తమయం అవుతున్నందున ఆ రోజుకు ఇక యుద్ధం చాలించడం మంచిదని భీష్ముడు అన్నాడు. ద్రోణుడు అతడి మాటలకు తన అంగీకారం తెలిపాడు. అప్పుడు భీష్ముడు అందరినీ యుద్ధభూమినుండి నిష్క్రమించమని ఆజ్ఞాపించి కౌరవ సేనలను మరలించాడు. పాండవులు సింహనాదాలు చేస్తూ తమ శిబిరాలకు పోయారు. అలా రెండవ రోజు యుద్ధంలో పాండవులది పైచేయి అయింది.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

No comments:

Post a Comment