Saturday, March 5, 2022

మహాభారత యుద్ధం మొదటి రోజున భీష్ముడి బల పరాక్రమం, శౌర్య ప్రసారం .... ఆస్వాదన-62 : వనం జ్వాలా నరసింహారావు

 మహాభారత యుద్ధం మొదటి రోజున భీష్ముడి బల పరాక్రమం, శౌర్య ప్రసారం

ఆస్వాదన-62

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (06-03-2022)

అర్జున విషాదయోగం, శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శన, అర్జునుడికి తత్త్వజ్ఞానోపదేశం, ఫలితంగా జ్ఞానోదయం అనంతరం భీష్ముడి మొదటి రోజు యుద్ధం ప్రారంభం అయింది. కౌరవ సేనాధిపతిగా భీష్ముడు కదనరంగంలో ముందుండడాన్ని చూసిన పాండవులు భీముడిని ముందుంచుకుని భీష్ముడు నడుస్తున్న చోటుకు దగ్గరిగా తమ సైన్యాలను తరలించారు. భీముడు సింహనాదం చేసి విజృంభించడంతో కౌరవుల పక్షానికి చెందిన దుశ్శాసనుడితో సహా దుర్యోధనుడి ఎనిమిదిమంది తమ్ములు ఆయన్ను ఎదిరించారు. పాండవుల పక్షాన నకులుడు, సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు విజృంభించారు. ఆవిధంగా యుద్ధం ప్రారంభం కాగానే పాండవుల పక్షాన భీముడు, కౌరవుల పక్షాన దుశ్శాసనుడు ముందుగా దూసుకు వచ్చారు. పాండవ, కౌరవ సేనలు భీకరంగా పోరాడాయి.

         అదే సమయంలో అర్జునుడికి, భీష్ముడికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది. సాత్యకి, కృతవర్మతో తలపడ్డాడు. అభిమన్యుడు, బృహద్బలుడిని ఎదుర్కున్నాడు. భీమసేనుడి మీద భీష్ముడు కోపించాడు. విలువిద్యలో ఆరితేరిన ధానుష్కుడైన భీష్ముడిని, భీముడు గదతో కాకుండా ధనుస్సు పూని సమ యుద్ధం చేయడం ఒక విశేషం. సహదేవుడికి, దుర్ముఖుడికి మధ్య యుద్ధం జరిగింది. ధర్మరాజు, సాక్షాత్తూ నకులసహదేవుల మేనమామైన శల్యుడిని ఎదుర్కున్నాడు. పాండవ సేనాపతైన ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని తాకాడు. మగధ దేశాధిపతైన సహదేవుడు, భూరిశ్రవుడితో యుద్ధం చేశాడు. ధృష్టకేతుడు కురువృద్ధుడైన బాహ్లికుడిని తలపడ్డాడు. అలంబసుడికి, ఘతోత్కచుడికి భీకరమైన రాక్షస పోరు జరిగింది. శిఖండి అశ్వత్థామను ఎదిరించాడు. భగదత్తుడు, విరాటుడి మీద విజృంభించాడు. కేకయరాజైన బృహత్ క్షత్రవిభుడు, కృపుడు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. జయద్రథుడికి, ద్రుపదుడికి తీవ్రంగా పోరు జరిగింది. వికర్ణుడు, యుధామాన్యుడు తలపడ్డారు.

శకునిని, ధర్మరాజు తనయుడు ప్రతివింధ్యుడు ఎదుర్కోగా, కాంభోజరాజు భీముడి కొడుకైన శ్రుతసోముడితో తలపడ్డాడు. ఉలూచి-అర్జునుడి కొడుకు ఇరావంతుడు ధృతరాష్ట్రుడి కొడుకైన శ్రుతాయువును ఎదుర్కున్నాడు. విందుడు, అనువిందుడు కుంతిభోజుడిని, అతడి కొడుకు పురజిత్తును ఎదుర్కొన్నారు. దీర్ఘబాహుడు ఉత్తరుడి మీదికి విజృంభించాడు. నకులుడి కొడుకు శతానీకుడు ఉలూకుడిని ఎదుర్కున్నాడు.

ఈ విధంగా కౌరవపాండవ సేనల్లోని గొప్ప వీరులు ఒకరితో ఒకరు తలపడగా యుద్ధం భీకరంగా సాగింది. యుద్ధం ఆ విధంగా దాదాపు మధ్యాహ్న సమయం వరకు సాగింది. ఆ తరువాత భీష్ముడు భయంకరుడై విజృంభించి, పాండవ సేనను తాకి, వారు పన్నిన వ్యూహాలను చెదరిపోయేట్లు రణక్రీడ సలిపాడు. ఆయన యుద్ధం చేస్తుంటే పాండవుల సేనలు తల్లడిల్లిపోయాయి. ఆ సమయంలో అభిమన్యుడు కౌరవ సేనను ఎదుర్కున్నాడు. శల్యుడిని, కృతవర్మను, వివింశతిని, కృపుడిని చీకాకు పరచి, భీష్ముడి మీదకు విజృంభించాడు. భీష్మాదులంతా కలిసి అభిమన్యుడిని ఎదుర్కున్నారు. అయినా అతడు చలించలేదు. ఒకానొక సమయంలో అభిమన్యుడి బాణాలకు భీష్ముడి జెండా విరిగి నేలమీద పడిపోయింది. ఆ కార్యాన్ని సాధించి అభిమన్యుడు వీరవిహారం చేసేటప్పుడు భీముడు అతడికి తోడుగా వచ్చి, భీష్ముడిని ఎదిరించాడు. శల్యుడిని సొమ్మసిల్ల చేశాడు. అభిమన్యుడికి, భీముడికి బాసటగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, కేకయరాజులు, విరాటరాజు చేరారు. భీష్ముడి వీరోచిత పోరాటం కొనసాగింది.

ఇంతలో ఉత్తరుడు వచ్చి శల్యుడిని ఎదుర్కున్నాడు. అతడిని విరథుడిని చేశాడు. కోపగించిన శల్యుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగించి ఉత్తరుడిని చంపాడు. ఇది చూసి, ఉత్తరుడి సోదరుడు శంఖుడు శల్యుడిని ఎదిరించాడు. అప్పుడు భీష్ముడు శంఖుడిని అడ్డుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడు తన రథాన్ని అటువైపుగా మళ్లించాడు. వెంటనే భీష్మార్జునులు ఒకరిమీద ఒకరు విజృంభించారు. అప్పుడు సరిగ్గా మధ్యాహ్న సమయం అయింది. శల్యుడు, శంఖుడి గుర్రాలను నేలమీద పడగొట్టాడు. కౌరవపాండవ వీరులమధ్య యుద్ధం కొనసాగుతుండగా, భీష్ముడు విజృంభించాడు. అతడి అద్భుత పరాక్రమానికి పాండవులు ఆశ్చర్యపోయారు.   

ఇంతలో సూర్యుడు అస్తమించాడు. అంతట చీకట్లు వ్యాపించాయి. అప్పుడు యుద్ద్ధం ఆపుచేసి ఇరుపక్షాల సేనలు తమతమ ఆవాసాలకు వెళ్లిపోయారు. భీష్ముడి బలపరాక్రమాలకు, శౌర్య ప్రసారానికి దుర్యోధనుడు, అతడి తమ్ములు సంతోషించారు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

              

          

    

    

No comments:

Post a Comment