Sunday, October 20, 2013

డాక్టర్ యలమంచిలి ఆదర్శ వివాహ పౌరోహిత్యం: వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్య సభ సభ్యుడు, ప్రజా వైద్యుడు, 
ప్రముఖ సిపిఎం నాయకుడు 

డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి 
అక్టోబర్ 19, 2013 న మరణించిన నేపధ్యంలో...)

డాక్టర్ యలమంచిలి ఆదర్శ వివాహ పౌరోహిత్యం

స్వసంఘ పౌరోహిత్యం

నమస్తే తెలంగాణ (22-10-2013)
వనం జ్వాలా నరసింహారావు
మాజీ రాజ్యసభ సభ్యుడు, సిపిఎం రాష్ట్ర-జాతీయ స్థాయి నాయకుడు, సామాజిక కార్యకర్త, ప్రజా వైద్యుడు, నిరీశ్వరవాది, సాహిత్యాభిలాషి, తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచే విప్లవ భావాలను అలవరచుకున్న వ్యక్తి, పౌరహక్కుల నేత, ఖమ్మం జిల్లాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న "సీమాంధ్ర తెలంగాణ వాసి", డాక్టర్ యలమంచిలి రాధా కృష్ణమూర్తి గారు సరిగ్గా తన 86 వ పుట్టిన రోజైన అక్టోబర్ 19, 2013 న హైదరాబాద్ కేర్ బంజారా ఆసుపత్రిలో మరణించారు. వివిధ కోణాలలో డాక్టర్ గారి వ్యక్తిత్వాన్ని విశ్లేషించవచ్చు. అందులో ఒకటి ఆయన వంట్లో ఓపికున్నంతకాలం నిర్వహించిన "స్వసంఘ పౌరోహిత్యం". అదే ఆయనను చాలా మంది కమ్యూనిస్టులకు, ఆదర్శ వివాహాలు చేసుకోదల్చిన కమ్యూనిస్టే తరులకు దగ్గరి వాడిని చేసింది. 

రాధాకృష్ణమూర్తిగారి తండ్రి పౌరోహిత్యం చేసేవారు. ఒక రెండు సంవత్సరాల పాటు పూర్తికాలపు పూజారిగా ఘంటసాల లోని ప్రసిద్ధ శివాలయంలో పనిచేశారు. అందుకే ఆయనను కమ్మ బ్రాహ్మణుడు" గా పిలిచేవారు. "స్వసంఘ పౌరోహిత్యం" అనేది ఆ నాటి (1930s-1950s) ఒక సంస్కరణ ఉద్యమం. దాని మూలాలు బ్రాహ్మణాధిక్యత వ్యతిరేకతలో వున్నాయి. తమిళ నాడులో రామస్వామి నాయకర్ గారు, ఆంధ్ర దేశంలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారు ఆ ఉద్యమానికి స్ఫూర్తి అని డాక్టర్ గారనే వారు. దయానంద సరస్వతి గారి ప్రభావం కూడా వుండొచ్చునంటారు ఆయన. వీరి ఇంట్లో ఆయన రాసిన "సత్యార్థ ప్రకాశిక" వుండేది. డాక్టర్గాఆరి ఉద్దేశంలో, స్వసంఘ పౌరోహిత్యం అంటే, ఏ కులం వారు, ఆ కుల పురోహితులతోనే కర్మలను నిర్వహించవచ్చు. (సీమంతం నుండి అన్న ప్రాశన, విద్యారంభం, వివాహం, శోభనం, అంత్యేష్టి...ఇలా షోడశ దశ-అంటే పదహారు కర్మలను అనుసరించి, ప్రతి దానికి బ్రాహ్మణ పురోహితుని ఆధ్వర్యం వహిస్తారు). 

రాధాకృష్ణమూర్తిగారి నాన్న గారితో పాటు, ఆయన మిత్రుడు-సహాధ్యాయి, పాలడుగు శేషాచార్యులు, ఆ రోజుల్లో ఈ ఉద్యమానికి ప్రతినిధులు. వారు గుంటూరు జిల్లాలోని ఒక స్వర్ణకార పండితుని వద్ద శిష్యరికం చేసి, ఈ పౌరోహిత్య కార్యక్రమానికి సంబంధించిన మంత్రాలు క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చినట్లు చెప్పేవారు. బ్రాహ్మణ పురోహితులు, వారి ఇండ్లలో చేయించినట్లు, పూర్తి వైదిక పద్ధతిలో శూద్రుల ఇళ్లలో చేయించడం లేదని వీరి మరొక ఆరోపణ. "క్షుణ్ణంగా" అనడంలో కారణం కూడా చెప్పారు డాక్టర్ గారు. చాలా సందర్భాలలో వీరు బ్రాహ్మణ పురోహితుల పద్ధతిలో లోపాలను ఎత్తి చూపేవారు. సవాలు కూడా చేసేవారు!


ఇన్ని కార్య క్రమాలు "శాస్త్ర యుక్తంగా" చేయించే డాక్టర్గావరి నాన్న, వాళ్ల ఇంట్లో ఏ పూజలు చేసేవారు కాదు. ఆయనకు దేవుడు మీద కూడా పెద్దగా నమ్మకం వుండేది కాదన్నారు డాక్టర్ గారు. అదేంటో తరువాత తెలిసింది వీరికి. ఇది "పూర్వ మీమాంస కుల" ధోరణి అని. చిత్రం ఏమిటంటే, వీళ్లు ఆ కాలంలోనే అస్పృశ్యతను వ్యతిరేకించేవారు. కులాంతర వివాహాలు, విధవా వివాహాలు చేయించేవారు. పౌరోహిత్యంలో చాలా "ఫ్లెక్సిబుల్" గా వుండేవారు. పెళ్లిళ్లలో మాత్రం, పక్కాగా మంత్రాలు చదివి, తిరిగి తెలుగులో అనువదించేవారు. "వివాహ విధి" అని వారి పాఠ్యగ్రంథం వుండేది. అయితే ఎవరైనా "స్టేజి వివాహం" కావాలంటే, రామస్వామి చౌదరిగారు, సరళమైన పద్యాలలో రాసిన వివాహ విధి సాయంతో, అరగంటలో పూర్తి చేసేవారు. 

గుంటూరు జిల్లాలో 1940 దశకం నుండి హేతువాద ఉద్యమం వుండేది. వారు దైవ ప్రసక్తి లేకుండా స్టేజి పెళ్లిళ్లు చేయించేవారు. అదే కాలంలో, కమ్యూనిస్ట్ ఉద్యమం ఆంధ్ర దేశంలో ప్రబలంగా వుండేది. వారు మంత్ర-తంత్రాలు లేకుండా, తెలుగు మాటల్లో, "దండల పెళ్లిళ్లు" చేయించేవారు. అలా పెళ్లి కార్యక్రమాలు చాలా సరళీకృతంగా చేయబడుతూ వుండేవి. రాధాకృష్ణమూర్తిగారు వైద్య వృత్తి రీత్యా ఖమ్మం వచ్చాక, నిరీశ్వరవాది ఈశ్వర ప్రసాద్ గారు చేయించిన పెళ్ళి చూశారాయన. విజయవాడలో హేతువాదులు చేయించిన రెండు పెళ్లిళ్లు కూడా చూశారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యు.టి.ఎఫ్) నాయకులు శ్రీ నరహరిగారు చేయించిన ఒకటి-రెండు పెళ్లిళ్లు, తాపీ ధర్మారావుగారు చేయించిన ఒక పెళ్లి చూశారు. తాపీ ధర్మారావుగారి ప్రామాణిక గ్రంధం "పెళ్లి-పుట్టు పూర్వోత్తరాలు", "దేవాలయాలపై బూతుబొమ్మలు", ప్రముఖ హేతువాది రావి పూడి వెంకటాద్రిగారి "వివాహ పద్ధతి" చదివారు. ఈ మొత్తం నేపధ్యంలో డాక్టర్గాతరు ఒక పద్ధతిని రూపొందించారు. వధూవరులను-వారి తల్లి తండ్రులను వేదిక మీదకు ఆహ్వానించిన తరువాత, ఒకరు వారి-వారి కుటుంబ వివరాలు, వధూవరుల ఉద్యోగ-విద్యా సంబంధిత వివరాలు చెబుతారు. వివాహ ప్రమాణ పత్రం కాపీలు కొన్ని తయారుగా వుంటాయి. పూల దండలు వుంటాయి. ఆచార్యుడు, ప్రధానంగా సంప్రదాయ పద్ధతికి భిన్నంగా, ఈ దండల-ప్రమాణాల పెళ్లి ఎందుకు ఎంచుకున్నారో వివరిస్తారు. ప్రమాణ పత్రం ఇద్దరితో చెప్పిస్తారు. దండలు మార్పిస్తారు. శుభాకాంక్షలు చెప్పి, పత్రాలపై సంతకాలు చేయించి, ఇద్దరు-ముగ్గురు పెద్దలను ఆశీర్వదించడానికి పిలుస్తారు. 

ఈ నూతన పద్ధతిని ఎంచుకోవడానికి కారణాలను ఇలా వివరించారు డాక్టర్ గారు:

1. పురోహితుడి మంత్రాలు ఎవరికీ తెలియని సంస్కృతంలోనే ఎందుకుండాలి? చెప్పదల్చుకున్నదేదో తేట తెలుగులో చెప్పవచ్చు గదా? 2. కాళ్లకు నీళ్లిస్తాం. మంచి నీరిస్తాం. పానకం ఇస్తాం. ఇవన్నీ అనడానికి, "పాద్యం కరిష్యే", "ఆచమనం కరిష్యే", శుద్ధాచమనం కరిష్యే" లాంటి మంత్రాలు అవసరమా? ఫలానా వూరిలో పెళ్లి జరుగుతుందనడానికి "జంబూ ద్వీపే,  భరత ఖండే, భారత వర్షే, మేరూర్ పర్వత దక్షిణ దిగ్భాగే, కృష్ణా-గోదావరి మధ్య స్థలే...వగైరా...వగైరా" లు ఎందుకు? ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి అమ్మాయి అనడానికి కూడా పెద్ద సంస్కృత శ్లోకం పఠించాలా? 3. ఆధునిక ఆలోచనలో స్త్రీ పురుషుల సమానత్వం ఒక ముఖ్యమైన విషయం. యుక్త వయస్సు వచ్చిన వారు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ చట్టం ఇస్తున్నది. అలాంటి కాలంలో, కన్యాదానం లాంటి ఘట్టాలెందుకు? కన్యాదానంతో బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుందని నిజంగా ఈ రోజుల్లో ఎవరన్నా నమ్ముతున్నారా? 4. మంగళ సూత్రం అన్న దానికి నిజంగా అంత పవిత్రత, "శరదశ్శతం" బ్రతికించే శక్తి వుందా? అసలు ఈ మంగళ సూత్రం అన్ని మతాలలో, అన్ని కులాల లోనూ లేదే? అన్ని ప్రాంతాల లోనూ లేదే? మన దేశంలో కూడా అన్ని కాలాలలోనూ వున్నట్లు ఆధారాలు లేవే! 5. "సప్త పది" పేరుతో ఏడడగులు వేయించడం కేవలం లాంఛనం కదా? అప్పుడు చెప్పే మంత్రాలు: "ఓం యిషే ఏక పదీ భవ...వగైరా..." కొంత అర్థవంతమైనవే. అదే విషయాలు ప్రమాణ పత్రాలలో చెప్పించవచ్చు కదా? 6. పెళ్లి ఒక మత ప్రక్రియ కాదు. కుటుంబ సంబంధమైన సంగతి. వేడుక కూడా. అందుకనే బంధుమిత్రులను పిలుస్తున్నాం. కుటుంబ స్నేహితుల్లో అన్ని మతాల వారుండవచ్చు. కనుక దీన్ని దైవ ప్రసక్తి - మత ప్రసక్తి లేకుండా, ఒక లౌకిక ప్రక్రియగా చేయడం సబబు కదా! 

ఇలాంటి సంగతుల్నే, అనేక ఉదాహరణలతో - ప్రామాణిక రుజువులతో వివరించవచ్చు. కొన్ని ముఖ్యమైన మంత్రాలు కూడా కంఠస్థం చేసి, అర్థం చెప్పి పైన పేర్కొన్న అంశాలకు బలం చేకూర్చితే, కొంత ప్రామాణికత - వాస్తవికత కూడా వస్తుంది. మొత్తం కార్యక్రమం గంటలోనో, అర్థ గంటలోనో పూర్తి చేయవచ్చు. పనిలో పనిగా, కుటుంబ వ్యవస్థ గురించి, ఏంగిల్స్ లాంటి మేధావులు చెప్పిన మాటలను కూడా జోడించవచ్చు. వర కట్నాలు, ఆడంబరాలు లాంటి అవాంఛనీయ ఆచారాలపై విమర్శ పెట్టవచ్చు. సమయాన్ని - సందర్భాన్ని బట్టి, ఇలాంటి వివరాలలోకి పోవచ్చు. 

మన పెద్దలు పెళ్లిని ఒక మంత్ర క్రతువుగా మార్చి, పూజా పునస్కారాలతో మిళితం చేశారు. ఒక కేసులో స్పష్టమైన తీర్పు ఇస్తూ, ఢిల్లీ హైకోర్టు, హిందూ వివాహ ప్రక్రియ మత క్రతువు కాదని, అదొక సామాజిక సంబంధమైనదని చెప్పింది. అసలీ తంతు అంతా ఉభయ కుటుంబాల బంధుమిత్రుల సంతోషం-సంబరం కోసం చేసే ఒక వేడుక. ఒక ప్రసిద్ధ సినీగేయకవి, ఎంతో చక్కగా మూడు ముక్కల్లో-అర్థవంతంగా చెప్పినట్లు: "మాటె మంత్రమా..మనసే బంధమా...ఈ మమతే, ఈ సమతే మంగళవాద్యమా...ఇది కళ్యాణం, కమనీయం, జీవితం". ఇది అత్యాధునిక చట్టబద్ద ప్రక్రియ. ఇక వివాహానికి సంబంధించి రెండో పార్శ్వం కూడా వుంది. పెళ్ళి పెద్దలు కుదిర్చిందా? లేక ఇద్దరూ ఇష్టపడి నిర్ణయించుకున్నదా? వీటి మంచి చెడ్దల గురించి సమకాలీనంగా సమాజంలోనూ, మీడియాలోనూ విస్తృతంగా చర్చ నడుస్తోంది.

దీనిపై మోర్గాన్ తన "ఏన్షియంట్ సొసైటీ" లోనూ, ఏంగిల్స్ తన "కుటుంబం, వ్యక్తిగత ఆస్తి" అన్న ప్రసిద్ధ గ్రంధంలోనూ చాలా చర్చించారు. ఆగస్ట్ బె బెల్ 150 సంవత్సరాల క్రితం ఆయన రాసిన "స్త్రీలు-సోషలిజం" ప్రసిద్ధ గ్రంధంలో ( పేజీలో), పెట్టుబడిదారీ సమాజంలో పెళ్లి కూడా వ్యాపార స్థాయికి దిగజారి పోయిందని వాపోతాడు. ఆయన మార్క్స్, ఏంగెల్స్ సమకాలికుడు. ఈ నిర్ణయం ఈ నాటికి ఎలా నూరు శాతం వాస్తవంగా వుందో చూస్తుంటే, బె బెల్ కు చేయెత్తి నమస్కరించాలనిపిస్తుంది.

ఈ పద్దతి చాలా మందికి - ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్య కర్తలను నచ్చినట్లుందని, ఈ తరహా పెళ్లి చేయించుకోవడానికి వారు ముందుకొస్తున్నారని, ఈ పద్దతినే మాజీ శాసన సభ సభ్యుడు, ప్రముఖ సిపిఎం నాయకుడు, స్వర్గీయ బోడేపూడి వెంకటేశ్వర రావు గారు కూడా మొదలు పెట్టారని అంటూ, ఒక దశలో వారిద్దరికీ డిమాండ్ పెరిగిందని అనేవారు డాక్టర్గా్రు. అయితే దీని వెంట ఒక ఇబ్బంది కూడా వచ్చింది. ముఖ్యమైన పార్టీ కార్యక్రమాలకు ఇవి అడ్డు వచ్చేవి. కొంతమంది ఫలానా వారు ఆచార్యత్వం వహిస్తేనే ఈ తరహా పెళ్ళికి అంగీకరిస్తామని చెప్పడంతో, పద్దతి కంటే వ్యక్తికి ప్రాధాన్యత కావడం మొదలైంది. కొన్ని సందర్భాలలో, పెద్ద వారి ఇళ్ళకే వెళ్తారా? సామాన్యుల ఇళ్లకు రారా? అనే వరకూ వెళ్లింది. కనుక నెమ్మదిగా తమను పిలవకుండా వుండేలా "డిస్కరేజ్‌" చేయాల్సి వచ్చిందన్నారు. కాలం మారుతోందనీ, పోస్ట్ మోడర్నిజం వచ్చినట్లే, తిరిగి సమాజం తిరోగమనం బాట పడుతోందని, పాత పద్దతుల మీద - ఆడంబరాల మీద మోజు పెరుగుతోందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు డాక్టర్గానరు. 

అయితే ఈ తరహా పెళ్లిళ్లపై విమర్శ కూడా లేకపోలేదనేవారాయన. అందులో కొన్ని సహేతుకమైనవి కూడా. మొదటిది: ఇది స్పీడ్ యుగం. సంప్రదాయ వివాహ పద్దతిలో, ఆహుతులు కుదురుగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వచ్చి-ఎప్పుడైనా వెళ్లి పోవచ్చు. లేదా "లగ్న" సమయానికే సరిగ్గా వచ్చి, అక్షింతలు వేసి వెళ్ళవచ్చు. కొత్త పద్దతిలో, ఒక గంట సేపు కుదురుగా కూర్చోవాల్సి వస్తుంది. గంట సేపు ఉపన్యాసాల లాంటివి వినాలి. ఇప్పటికే ఎన్నికల స్టేజీ ఉపన్యాసాలు, రాజకీయ పార్టీ నాయకుల ఉపన్యాసాలు వినీ-వినీ విసిగిపోతున్న వారికి ఇక్కడ కూడా ఈ "శిక్ష" ఎందుకు? అనిపిస్తుంది. రెండోది: సంప్రదాయ పద్దతిలో వున్న అనేక ఘట్టాలు కాస్తంత సరదాగా వుంటాయి. మంత్రాలు అర్థాలు తెలియకపోతేనేం? అదంతా బ్రాహ్మణుడి గొడవ! ఉదాహరణకు: బ్రహ్మ ముడి వేసుకుని ఏడడగులు నడవడం, మంగళ సూత్రం కట్టడం, అన్నింటి కన్నా ఎక్కువగా, తలంబ్రాలు పోటీ పడి మరీ పోసుకోవడం, వాళ్లకే కాకుండా, చూసే వాళ్లకు ముచ్చట గాను-ఆహ్లాదకరంగానూ వుంటుంది. ఇక ఈ కొత్త పద్దతిలో, ఏ సరదా కనిపించదు. సాదా-సీదాగా, చప్పగా, మరీ చెప్పాలంటే విసుగుగా - మీటింగులా వుంటుంది!

ఇప్పడు చాలా పెళ్లిళ్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇది అవసరమే కాకుండా, తప్పనిసరి కూడా కావచ్చు. కనుక, దండల పెళ్ళి, లేక, స్టేజి పెళ్ళి, లేక, ప్రమాణాల పెళ్ళి - పేరు ఏదైనా కావచ్చు - దీన్ని కూడా మరింత ఆకర్షణీయంగా, సరదాగా కూడా చేసే విషయం ఆలోచించాల్సిన విషయమంటారు డాక్టర్ గారు. నిజానికి, ఇవేవీ లేకుండా, వధూవరులు - వారి తల్లితండ్రులు - దగ్గర బంధువులు పదిమంది కలిసి, రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి, ముద్ర వేయించుకుని, దారిలో ఏదైనా రెస్టారెంటులో టీ నో -కాఫీ నో తాగి, లేదా ఏదైనా తిని, ఇళ్లకు వెళ్లిపోవడం ఆదర్శవంతమైన పని. కొన్ని దేశాలలో, పెళ్ళి ప్రసక్తి లేకుండానే, కలిసి జీవించే పద్దతి వస్తున్నది. దాన్ని చట్టం కూడా ఆమోదిస్తున్నది. కాలం మారుతోంది కదా! మనకూ ఆ పద్దతి వస్తుందేమో నని, అప్పుడు ఈ చర్చ అంతా వృధానే మో నని చమత్కరించారు డాక్టర్ గారు. 

(నేను రాసిన డాక్టర్ గారి జీవిత చరిత్ర "అనుభవాలే అధ్యాయాలు" నుంచి సేకరణ)

మార్క్సిస్ట్ మార్గదర్శి యలమంచిలి: వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్య సభ సభ్యుడు, ప్రజా వైద్యుడు, 
ప్రముఖ సిపిఎం నాయకుడు 
డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి 
అక్టోబర్ 19, 2013 న మరణించిన నేపధ్యంలో...)

మార్క్సిస్ట్ మార్గదర్శి యలమంచిలి
ఆంధ్ర జ్యోతి (22-10-2013)
వనం జ్వాలా నరసింహారావు

వై.ఆర్.కె గా సన్నిహితులందరూ సంబోధించే డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి తన 86 వ జన్మదినం నాడే మరణించడం, బాగా తెలిసున్న వాళ్లతో సహా, ఆయన పరిచయస్తులందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అస్వస్థతకు గురైన డాక్టర్ గారిని, హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి వారం రోజుల క్రితం తీసుకు రావడానికి ఒక రోజు ముందు కూడా పరిపూర్ణ ఆరోగ్యంతోనే వున్నారు. తెలుగులో నేను రాసిన ఆయన జీవిత చరిత్ర "అనుభవాలే అధ్యాయాలు" ఆంగ్ల అనువాద ప్రతిని సరిదిద్దుతున్న సందర్భంలో స్వల్పంగా గుండె పోటుకు గురికావడం, ఒకటి రెండు రోజులు ఖమ్మం ఆసుపత్రిలో వుంచి హైదరాబాద్‌కు తరలించడం జరిగింది. నలబై సంవత్సరాలకు పైగా నేనాయనను ఎరిగున్నప్పటికీ, ఆయన జీవిత చరిత్రను గ్రంధస్థం చేసే కార్యక్రమంలో వున్న నాకు, గత మూడేళ్లు గా అనుబంధం కొంచెం పెరిగిందనాలి. ఈ నేపధ్యంతోనే ఈ వ్యాసం రాస్తున్నాను.

కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలను తు. చ తప్పకుండా పాటిస్తూ, నాలుగు దశాబ్దాలు పార్టీ సభ్యత్వం లేకపోయినా-తీసుకోక పోయినా, ఒకనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి పనిచేసి, ఆ తర్వాత పార్టీ ఆదేశం మేరకు సభ్యత్వం తీసుకుని, ఏడు దశాబ్దాలకు పైగా పార్టీకి సేవ చేసి, సమాజం తనకు అప్ప చెప్పిన ఇతర బాధ్యతలను కూడా నెరవేర్చిన కమ్యూనిస్టు యోధుడు-పౌర హక్కుల ఉద్యమ ఆద్యుడు-ప్రజా వైద్యుడు-మాజీ రాజ్య సభ సభ్యుడు, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న "సీమాంధ్ర-తెలంగాణ" వాసి, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవన యానం కమ్యూనిస్టులకు-కమ్యూనిస్టే తరులకు ఆదర్శప్రాయం. సీపీఎం దిద్దుబాటు ఉద్యమానికి ఆయన లాంటి వారి అరుదైన జీవితం ప్రామాణికం. సీపీఎం పార్టీ వారు తప్పనిసరిగా డాక్టర్ జీవిత కథ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే మరి.

డాక్టర్ గారు చిన్నతనం ‍నుండే నిరీశ్వరవాది. సహధర్మచారిణి కూడా, వివాహమైన కొద్ది కాలంలోనే ఆయన బాటలోనే పయనించడంతో, ఇంట్లో పూజలు-దేవుళ్ల బొమ్మలు లేవు. అయితే, సాహిత్యాభిలాషైన వై.ఆర్.కె పుస్తక పఠనం విషయంలోను, జ్ఞాన సముపార్జన విషయంలోను నిరీశ్వర వాదాన్ని-హేతువాదాన్ని అంటిపెట్టుకునేంత "కన్సర్వేటివ్" కాదనాలి. ఆయన కన్సర్వేటివిజం అంతా, ఆహార పానీయాల్లోను, వేష భాషల్లోను, అలవాటున్నంతవరకు ధూమపానం చేయడంలోను మాత్రమే. ఐదు పర్యాయాలు జైలు జీవితం గడిపిన డాక్టర్ గారు, వరంగల్ జైలులో వున్నప్పుడు, తోటి ఖైదీల దగ్గర షడ్దర్శనాలు, భగవద్గీత, ఇస్లాం మతం, ఆయుర్వేద రహస్యాలు లాంటి విషయాలను ఆసక్తిగా నేర్చుకున్నారు.

1985లో సభ్యత్వం తీసుకున్న డాక్టర్, పార్టీలో ఎన్నడూ ఆర్థికపరమైన బాధ్యతలు తీసుకోలేదు. సభ్యత్వం తీసుకున్న తర్వాత "ఆస్తి" సమకూర్చుకోలేదు. పార్టీ నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. పార్టీలో ఏ పదవినీ ఆశించని ఆయన, ఇచ్చిన బాధ్యతను ఎన్నడూ కాదనలేదు. వంట్లో శక్తి వున్నంతవరకు పార్టీకి సేవ చేసిన యలమంచిలి, ఎన్నికల పదవులపట్ల కూడా విముఖత చూపించినా, మూడు పర్యాయాలు ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేయక తప్పలేదు. రెండుసార్లు సభ్యత్వం లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు "బాధ్యత" గా ఒప్పుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కావాలని కూడా ఆయనెప్పుడూ కోరుకోలేదు సరి కదా, ఊహించనూలేదు. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు నెల నెలా పార్టీకి జమ కట్టాల్సిన మొత్తం పోను, మిగాతాదాంట్లో, తన కుటుంబ నిర్వహణకు ఖర్చుచేసి, మిగిలిందంతా "చిత్త శుద్ధి" తో పార్టీకి జమచేశారు. సభ్యత్వం అయిపోయిన తర్వాత వస్తున్న పెన్షన్ మొత్తాన్ని పార్టీకి ఇవ్వడంతో పాటు, తన తదనంతరం తన భార్యకు పంపితే, అది కూడా పార్టీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పుస్తక పఠనం, రచనా వ్యాసంగం, మిత్రులతో కబుర్లు, పార్టీకి అవసరమైనప్పుడు సూచనలు-సలహాలు ఇస్తూ కమ్యూనిజాన్ని అభిమానిస్తూ, అందులోని మంచిని పది మందికి తెలియచేస్తూ, ప్రశాంత జీవితం గడిపి, మరణించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమే!.


నేనాయన జీవిత చరిత్రను గ్రంధస్థం చేస్తున్న సందర్భంలో, తన అనుభవాలను వివరంగా చెప్పారాయన. తానెందుకు ఐదు పర్యాయాలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఎలా ఐదు సెంట్రల్ జైళ్లను చూసింది, ఎలా తాను రాజ్యసభకు నామినేట్ కాబడింది, రాజ్యసభ సభ్యుడుగా ఏం చేసింది, ఎలా ఎంపీ నిధులను సద్వినియోగం చేసింది, ఎలా జీవితంలో ఎదిగింది, ఎలాంటి కష్ట-సుఖాలను అనుభవించింది, వైద్య విద్యను అభ్యసించినప్పుడు ఏం జరిగింది... లాంటి విషయాలెన్నో చెప్పారు. కాకపోతే...జిల్లాలో కాని, రాష్ట్రంలో కాని, ఆ మాటకొస్తే జాతీయ స్థాయిలో కాని, గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ పరంగా చోటుచేసుకుంటున్న పరిణామాల విషయంలో, వివరాలలోకి లోతుగా వెళ్లడానికి డాక్టర్‍గారు అంతగా ఇష్టపడలేదు. "ఔను.. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ పరంగా సంతోషం కలిగించని కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న మాట వాస్తవమే. వాటికి కారణాలు, ఫలితాలు, తలెత్తనున్న పర్యవసానాలు భవిష్యత్ నిర్ణయిస్తుంది. నేనింకా పార్టీలో-పార్టీ సభ్యుడుగానే వున్నాను. సిపిఎం పార్టీ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలను బహిరంగంగా చర్చించడం సమంజసం కాదు." అని స్పష్టంగా చెప్పారు. అదీ...ఆయనకు పార్టీపైనున్న నిబద్ధత!

డాక్టర్ గారి స్వగ్రామం, కృష్ణా జిల్లా, "జమీ దింటకుర్రు" లో కమ్యూనిస్ట్ కార్యకర్తలుండేవారు. మిక్కిలినేని వెంకటేశ్వరరావు, కొల్లి (అంజయ్యగారి) సుబ్బారావు, జాస్తి పున్నయ్య, ఎన్.వీ.ఎస్.ప్రసాదరావు వీరిలో ముఖ్యులు. "స్వతంత్ర భారత్" అనే సైక్లో పత్రిక రహస్యంగా పంచేవారు. ఆసక్తి కొద్దీ దాచుకుని చదువుతుంటే (ఏమీ అర్థం అయ్యేది కాదు) తండ్రిగారు చూసి, "నీకవన్నీ ఎందుకు? పుస్తకాలు చదువుకో" అని మందలించేవారట. 1944 లో, ఆయన ఇంటర్ రెండో సంవత్సరంలో వున్నప్పుడు, పెద్ద ఎత్తున జరిగిన ఆ నాటి "బెజవాడ" అఖిల భారత రైతు మహా సభలను డాక్టర్ గారు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేవారు. ఈ నాటికీ, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో అవి ముఖ్య ఘట్టాలుగా చెప్పేవారాయన. ఆ సందర్భంగా డాక్టర్ గారు బందరు నుండి తన మిత్రులతో కలిసి, ఆ మహా సభలకు ప్రేక్షకులుగా వెళ్లి, అక్కడే చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య, చలసాని వాసుదేవరావు గార్లతో పాటు, బీహారుకు చెందిన ప్రసిద్ధ రైతు నాయకుడు స్వామీ సహజానందను (కాషాయ వస్త్రాలతో) వేదిక మీద చూశారు మొదటిసారి. ఇంటర్ చదువుతున్నప్పుడే, ఆనాటి విద్యార్థి ఫెడరేషన్ తో సంబంధాలుండేవి డాక్టర్ గారికి. పార్టీతో పెద్దగా సంబంధాలు లేకపోయినా, పట్టణ విద్యార్థి ఫెడరేషన్ కమిటీలో తీసుకున్నారు డాక్టర్ గారిని. అప్పటినుంచే, భారత కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య నాయకుడు, రాజ్య సభ సభ్యుడు దాసరి నాగభూషణ రావు గారితో పరిచయం ఏర్పడింది. ఆయన వైద్య విద్య సాగుతున్నప్పుడే వీర తెలంగాణ రైతాంగ విప్లవ సాయుధ పోరాటం సాగింది. జరిగింది తెలంగాణ ప్రాంతంలోనే అయినప్పటికి, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య లాంటి ఆంధ్ర ప్రాంతం వారి సహాయ సహకారాలతో పాటు నాయకత్వం కూడా దానికుండేది. రాధాకృష్ణమూర్తికి అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయి. నేరుగా తెలంగాణ సాయుధ పోరాట నాయకులతో సంబంధాలు లేకపోయినా ఉద్యమానికి తన వంతు సేవ చేస్తుండేవారు.

1949 నాటి "కాటూరు ఎలమర్రు సంఘటన" నేపధ్యంలో, పోలీసు దౌర్జన్యానికి, హింసా కాండకు వ్యతిరేకంగా, వైజాగ్ పట్టణంలో గోడలకు పోస్టర్లు అంటించే కార్యక్రమాన్ని రాధాకృష్ణమూర్తికి, ఆయన స్నేహ బృందానికి అప్పగించింది కమ్యూనిస్ట్ పార్టీ. స్నేహితులను పోగు చేసుకుని, పోస్టర్లు తయారు చేసి, రాత్రి పూట అతికించ సాగారు రాధాకృష్ణమూర్తి బృందం. గస్తీ తిరుగుతున్న బీట్ కానిస్టేబుల్ డాక్టర్ గారిని పట్టుకుని దగ్గరలో వున్న పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు పెట్టి జైలుకు పంపారు. అలా రాధాకృష్ణమూర్తికి మొదటి జైలు అనుభవం కలిగింది.

ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత, వైద్యంలో ఉన్నత చదువులు చదివే అవకాశం లేకుండా పోయింది ఆయనకు. సదరన్ రైల్వే సర్వీసులో తాత్కాలికంగా, మద్రాస్ పెరంబూర్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రిలో చేరారు. మద్రాస్ లో వుండగానే పొట్టి శ్రీరాములుగారి ఆమరణ నిరాహార సత్యాగ్రహ దీక్ష మొదలైంది. ఆయన ప్రాణత్యాగం చూశారు. రైల్వే ఉద్యోగంలో వుండగానే, రాష్ట్ర సర్వీస్ కమీషన్ మెడికల్ ఆఫీసర్స్ సెలక్షన్ కు పిలిచారు. కాని ఆయన విషయంలో పోలీసు రిపోర్టు సెలక్షన్ కు అడ్డుపడింది. రాధాకృష్ణమూర్తి గారు తన మెడిసిన్ నాలుగో సంవత్సరంలో వుండగానే (1949) అరెస్టు కాబడి, కమ్యూనిస్ట్ గా ముద్రపడి వున్నాడు. ఆ రికార్డంతా ప్రభుత్వం దగ్గర, సెలక్షన్ కమిటీ దగ్గర వుంది. ఉద్యోగం రాలేదు. రైల్వే ఉద్యోగం నచ్చలేదు. రాజీనామా చేసి, ఖమ్మం పట్టణానికి వచ్చి, ప్రయివేట్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.

వైద్య వృత్తిలో నైతిక విలువలకు, మానవత్వానికి కట్టుబడి వున్న ప్రతి డాక్టర్‌కు ప్రజల అభిమానం లభిస్తుందని నమ్మిన యలమంచిలి, తన వైద్య శాల ద్వారా ఆ మార్గంలోనే ప్రాక్టీస్ చేయడంతో, అచిర కాలంలోనే ఆయన వద్దకు చికిత్సకొరకు వచ్చే వారి సంఖ్య పెరగ సాగింది. అదనంగా ఆయనకున్న వృత్తి పరమైన నైపుణ్యం వైద్యుడుగా మంచి పేరు తెచ్చి పెట్టింది. వృత్తిలో కొన్ని నియమాలను పాటించేవారు. మొదట్లో అసలు కన్సల్టేషన్ ఫీజు వుండేది కాదు. సంఖ్య పెరిగి, తట్టుకోవడం కష్టం కావడంతో, తలకు రెండు రూపాయలు వసూలు చేసేవారు. విద్యార్థులకు, పార్టీ పూర్తికాలం కార్యకర్తలకు - వారి కుటుంబాలకు ఉచితంగా చేయడం, ఇన్ పేషంట్లకు - సర్జరీలకు బిల్లు వేస్తే ఇచ్చుకోలేమనే వారికి, వారికి చేతనైనంతే ఇవ్వమనడం, ఎన్నాళ్లు సేవలందించినా సరే చనిపోయిన వారికి బిల్లు వేయకపోవడం పాటించేవారు. ఆస్తిపరులు స్వచ్చందంగానే ఏదో ఒక మొత్తం ఇచ్చి వెళ్లేవారు. ఎంత ఇచ్చారనేది చూసుకునేవారు కాదు. కొందరు వార్షికంగా ఇచ్చే వారు.  వుండడానికి అవసరమైన అన్ని ప్రమాణాలను, నైతిక విలువలను తప్పక పాటించేవారాయన.

భారత చైనా యుద్ధం నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ముఖ్యమైన కమ్యూనిస్ట్ నాయకులందరినీ నిర్భంధించింది నాటి ప్రభుత్వం పిడి చట్టం కింద. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర స్థాయిలో సైద్ధాంతిక చర్చ సాగుతున్న రోజుల్లో, సహజంగా దాని ప్రభావం ఖమ్మం కమ్యూనిస్టుల పైన కూడా పడింది. చాలా కాలం వరకు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోక పోయినా పార్టీ నిర్ణయాలను, విధానాలను అమలు జరుపుతుండే డాక్టర్‌. రాధాకృష్ణమూర్తి ఇంటి ఆవరణలో ప్రతి ఆదివారం సాయంత్రం పలువురు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు "మార్క్సిస్ట్ ఫోరం" అనే గొడుగు కింద సమావేశమై సిద్ధాంత పరమైన విషయాలపై చర్చించుకునే వారు. 1961వ సంవత్సరంలో ప్రారంభమై క్రమం తప్పకుండా జరుగుతుండే ఆ సమావేశాలకు, జిల్లా సీనియర్‌ నాయకులైన చిర్రావూరి లక్ష్మీనరసయ్య, మంచికంటి రాంకిషన్‍రావు లతో సహా పలువురు విద్యార్థి నాయకులు, యువకులు హాజరయ్యేవారు. వారందరూ పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఎంలోనే వుండిపోయారు. ఆ వేదిక కింద మార్క్సిజం-లెనినిజం అధ్యయన తరగతులు నిర్వహించడం కూడా జరిగేది. ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో కాని ఖమ్మంలో మార్క్సిస్ట్ ఫోరం ప్రతి ఆదివారం నిర్వహిస్తుండే సమావేశాలకు హాజరయ్యే వారిని “ఆదివారం సంఘం” గా-"సండే సిండికేట్" గా ఎద్దేవా చేస్తూ, పిలవడం జరిగేది ఓ రకమైన హేళనతో అప్పట్లో. ఇప్పటికీ ఆదివారం సంఘంతో అనుబంధమున్న వారు ఆ జిల్లాలో పలువురున్నారు.

నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యని గ్రహించారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి ఆయన మిత్రులు అడ్వకేట్ రాధ, సుబ్బారావులు. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. అలా మొదలైందే ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ. పౌర హక్కుల ఉద్యమం ఆరంభించిన నేపధ్యంలో, ఆ ఉద్యమానికి ఆద్యుడైన డాక్టర్ రాధాకృష్ణమూర్తిని, ఆయనకు తోడ్పడిన ఇతరులను ప్రభుత్వం నిర్బంధించింది. రెండో పర్యాయం జైలు జీవితం అలా ప్రారంభమయింది. డాక్టర్ వై.ఆర్.కె ని మరో మారు కూడా జైలుకు పంపింది ప్రభుత్వం. అఖిల భారత స్థాయిలో జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున రైల్వే కార్మికుల సమ్మె జరిగింది 1974లో. కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీకి ఆ సమ్మెతో పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ, ఆ పార్టీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం.

నాలుగు దశాబ్దాల క్రితం ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అధ్యాయానికి తెర లేసింది. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ నేపధ్యంలో, దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సరసన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిని చేర్చారు. అరెస్ట్ చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. జైలు నుంచి విడుదలై, ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లిలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలకు హాజరయ్యేందుకు వెళ్లారు. వారం రోజులపాటు, ఎమర్జెన్సీ ఇంకా అమలులో వుండగానే జరుగుతున్న సభలు, విజయవంతంగా జరగడాన్ని దగ్గరగా గమనించిన పోలీసులు, వాటిని భగ్నం చేసి, నాయకుడని భావించిన డాక్టర్ వై.ఆర్.కె ను అరెస్ట్ చేసి, మళ్ళీ జైలుకు తరలించారు. అలా ఐదవ సారి అరెస్ట్ చేయడం జరిగింది. జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే, సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. ఖమ్మం నుంచి లోక్ సభ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా డాక్టర్ వై.ఆర్.కె ను పోటీ చేయించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. జైల్లో వున్న ఆయనకు కబురు చేసి విషయం చెప్పారు. ఆయన నామినేషన్ పత్రాలపై జైలులోనే సంతకాలు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పోటీలో వున్న అభ్యర్థిగా విడుదల చేశారు. అలా డాక్టర్ గారి అయిదో పర్యాయం జైలు జీవితం ముగిసింది.

డాక్టర్ గారు తనకిష్టం లేకపోయినా, మూడు పర్యాయాలు లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో పోటీ చేయవలసి వచ్చింది. మొదటి సారి పోటీ చేసింది 1977లో. ఫలితాలు అనుకున్నట్లే వచ్చాయి. ఆయన ఓడిపోయారు. కేంద్రంలో జనతా ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ నాయకత్వాన కొన్నాళ్లు సాగిన తరువాత, అంతర్గత కుమ్ములాటతో అర్థాంతరంగా కూలిపోవడంతో, మధ్యంతర ఎన్నికలు 1980లోనే వచ్చాయి. ఈసారి కూడా డాక్టర్‌గారినే అభ్యర్థిగా నిలబెట్టింది పార్టీ. మళ్ళీ ఓడిపోయారు డాక్టర్ గారు. 1984 సార్వత్రిక ఎన్నికలలో ఒక కొత్త శక్తి ప్రవేశించింది. 1989 లో లోక్ సభకు మరో మారు ఎన్నికలొచ్చాయి.  సిపిఎం తన అభ్యర్థిగా డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తిగారి పేరును ప్రకటించింది. ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి వెంగళరావు వున్నారు. ఈ సారీ ఆయన ఓడిపోయారు. 1971, 1980, 1989లో జరిగిన ఎన్నికల్లో అభ్యర్ధిగా డాక్టర్‌గారి డ్యూటీ ప్రచారం చేసుకోవడం మాత్రమే. అదికూడా ఏ వేదికమీద కూడా తనకు ఓటు వేయమని అడగలేదు. "మా పార్టీకి, మా పార్టీ అభ్యర్ధికి మీ మద్దతు కావాలి" అని అభ్యర్ధించేవారు. ఎన్నికల ఆదాయ వ్యయాల సంగతికి డాక్టర్‌గారు ఎప్పుడూ దూరంగానే వుంటానని ముందుగానే పార్టీకి చెప్పారు. వ్యక్తిగా ఆయన ఎవ్వరినీ ఎన్నికల నిధులు అడగలేదు. కొందరు మిత్రులు, శ్రేయోభిలాషులు స్వయంగా ఇస్తే, మరికొందరు మనియార్డర్-చెక్‍ల ద్వారా పంపేవారు. ఆ మొత్తం వెంటనే పార్టీ ఆర్థిక వ్యవహారాలు చూసే కామ్రేడ్ చేతికి అందించి వారికి రసీదు పంపమని కోరేవారు. డాక్టర్‌గారి కుటుంబ సభ్యులు, నేరుగా పార్టీకే ఇస్తూ వచ్చారు.

తాపీ ధర్మారావుగారి "పెళ్లి-పుట్టు పూర్వోత్తరాలు", "దేవాలయాలపై బూతుబొమ్మలు", ప్రముఖ హేతువాది రావి పూడి వెంకటాద్రిగారి "వివాహ పద్ధతి" చదివి, ఆ నేపధ్యంలో డాక్టర్‍గారు ఆదర్శ వివాహాలు చేయించేవారు. ఎక్కడ-ఎవరు-ఏ సందర్భంలో వక్తగా పిలిచినా, అక్కడి అవసరాలకు అనుగుణంగా-తాను నమ్మిన మార్క్సిజం సిద్ధాంతాలను అన్వయించుకుంటూ మాట్లాడడానికి, ఉపన్యాసంలో పొందుపరచాల్సిన అంశాలను, సమయం-సందర్భానికి తగినట్టుగా తయారు చేసుకునేవారు. భాష విషయంలోను తగినంత శ్రద్ధ తీసుకునే వారు. అదే ఆయనను మంచి వక్త కావడానికి దోహద పడింది. అదే ఆయనను రాజ్యసభ సభ్యుడుగా వున్నప్పుడు మంచి పార్లమెంటేరియన్ గా అనిపించుకోవడానికి తోడ్పడింది. ఖమ్మం పట్టణంలో, జిల్లాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖ నెలకొనడానికి, కారణభూతులైన వారిలో ఆయనొకరు. ఖమ్మం శాఖకు కార్యదర్శిగా, తెలంగాణ ప్రాంత ఐఎంఎ విభాగం ఉపాధ్యక్షుడుగా డాక్టర్ వై.ఆర్.కె పనిచేశారు. జన విజ్ఞాన సంస్థతో, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తో ఆయనకు సంబంధాలుండేవి. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నీలం రాజశేఖరరెడ్డి, తరిమెల నాగిరెడ్డి లాంటి నాయకులు, చీలిక తర్వాత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకులు పలువురు, ఖమ్మంలోని డాక్టర్ వై.ఆర్.కె ఇంట్లో ఆతిథ్యం పొందారు. సాహిత్యం - విస్తృతంగా చదవడం అలవాటు.  పార్టీ సాహిత్యానికి పరిమితం కాలేదు. అన్నిరకాల సాహిత్యాన్ని, కాస్తో - కూస్తో చదువేవాడిని అనేవారాయన.

డాక్టర్ గారు తన జీవిత చరిత్రకు ముందు మాట రాస్తూ..."వయస్సు 84 నడుస్తోంది. ప్రస్తుతం పూర్తి వానప్రస్థం. బతుకుదెరువు కోసం చాలా ఏళ్లు వైద్య వృత్తి చేశాను. ఆసక్తి కొద్దీ చాలా కాలం రాజకీయ కార్య కర్తగా పని చేశాను. సాదా సీదా మధ్య తరగతి జీవితంలో, అందరి లాగానే ఎత్తు పల్లాలు, పువ్వులూ-రాళ్లూ-రెంటి రుచీ చూశాను. మెచ్చుకున్న వారు కొందరైతే, నొచ్చుకున్న వారు మరికొందరు. నా గొప్ప, అదృష్టం ఇటు విస్తృత కుటుంబంలోనూ, బయట సమాజంలోనూ చాలా మంది అభిమానులు వుండడం”. అని ముగించారు.


Thursday, October 17, 2013

"కాళోజీ గొడవ మా అందరి గొడవ" : వనం జ్వాలా నరసింహారావు

కాళోజీ శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న నేపధ్యంలో

"కాళోజీ గొడవ మా అందరి గొడవ"
వనం జ్వాలా నరసింహారావు

          కాళోజీ నారాయణరావు గారిని మొట్ట మొదటిసారి ప్రముఖ పాత్రికేయుడు స్వర్గీయ జి. కృష్ణ గారితో కలిసి నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో ఆయనో పర్యాయం చికిత్స కొరకు ఆసుపత్రిలో చేరిన సందర్భంలో కలిసినట్లు జ్ఞాపకం. అంతకు ముందు, ఆయనతో పరిచయం లేకపోయినా, తెలంగాణ ఉద్యమం సందర్భంగా రెండు-మూడు సభల్లో ఆయన ప్రసంగం విన్నాను. ఆయన్ను కలిసిన రోజున నాతో పాటు డాక్టర్ ఏ. పి. రంగారావు, భండారు శ్రీనివాసరావు కూడా వున్నారు. మమ్మల్ని, ఆయనతో పాటు స్వాతంత్ర్య ఉద్యమం రోజుల్లో జైలులో గడిపిన స్వర్గీయ అయిత రాజు రాం రావు గారి బంధువులుగా (నాకు మామ గారు, రంగారావుకు తండ్రి గారు, శ్రీనివాసరావుకు బావ గారు) పరిచయం చేశారు కృష్ణ గారు. ఆ రోజున కాళోజీతో మాట్లాడుతున్నప్పుడు, శారీరకంగా కొంత బలహీనంగా కనిపించినప్పటికీ, కులాసా కబుర్లు చెప్పడంలో మాత్రం ఆయనలో నాకే అలసట కనిపించలేదు. ఆ రోజున ఆయన చెప్పిన విషయం ఒకటి నాకింకా జ్ఞాపకం వుంది. పీవీ నరసింహారావు సమీప బంధువు ఒకావిడను గురించి విడమర్చి చెప్పి, ఆమె అనుభవిస్తున్న దారిద్ర్యాన్ని విశదీకరించి, ఆమెను ఆదుకోవడానికి పీవీ చేసిన ప్రయత్నాలు కూడా చెప్పి, అవేవీ ఫలించకపోవడానికి ఏవో కొన్ని కారణాలను కూడా వివరించారు. అంత అనారోగ్యంలోను మద్యం గురించిన సంభాషణ కూడా కొంత చేశారు. ఇక ఆయనకు, కృష్ణ గారికి మధ్య జరిగిన సంభాషణంతా సాహిత్యం మీదే! ఆ తరువాత కాళోజీని చాలా సార్లు కలవడం జరిగింది. కలిసి మద్యం సేవించిన సందర్భాలు కూడా చాలా వున్నాయి. ఆయనతో కలిసి కూర్చుని, ఆయన చెప్పే కబుర్లు వింటుంటే, కాలం అలా గడిచి పోయేది. ఎమర్జెన్సీ రోజుల్లో ఆయనతో కలిసిన సందర్భాలు మరీ బాగుండేది. ఆయన ప్లహ్లాద చరిత్ర ఆయన నోటి వెంట వింటుంటే ఒళ్లు పులకరించేది. నాకు ఆయన పరిచయమయ్యేవరకు ఆయన రాసిన "నా గొడవ" కవితల గురించి తెలియదు. ఆయన దగ్గర నుంచే ఆ పుస్తకాన్ని తీసుకుని చదివి, ఇప్పటికీ నా దగ్గరే అట్టి పెట్టుకున్నాను.

          నేను హైదరాబాద్ చిక్కడపల్లి-అశోక్ నగర్ లో కేశిరాజు చలపతిరావు గారింట్లో వుంటున్నప్పుడు (1978-1984 మధ్య కాలంలో) ఒక నాడు రాత్రి పూట మా ఇంటికి భోజనానికి వచ్చారు కాళోజీ. భోజనంలో మా శ్రీమతి "పచ్చి పులుసు" వడ్డించింది. అంతవరకు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్న కాళోజీ గొంతు ఒక్క సారి మారిపోయింది. దుఃఖం రావడం మొదలైంది. దానికి కారణం ఒకటి చాలాకాలం తరువాత "పచ్చి పులుసు" తో భోజనం చేయడం అయితే, మరొకటి అదే పచ్చి పులుసుతో చెరబండరాజు ఇంట్లో భోజనం చేసిన సంగతి గుర్తుకు రావడం. అదే రోజున ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కాళోజీ కలిసి పరామర్శించి రావడం, ఆయన ఆరోగ్య పరిస్థితి అంత బాగా లేకపోవడం కాళోజీ దుఃఖానికి మరో కారణం. చివరిసారి కాళోజీని కలవడం ఆయన 88 వ పుట్టిన రోజు సందర్భంగా, ఉదయం (సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అనుకుంటా) జరిగిన సభలోను, సాయంత్రం తెలంగాణ ప్రభాకర్ ఇంట్లోను జరిగింది. సాయంత్రం కలిసినప్పుడు ఆయన స్వయంగా "నా గొడవ...కాళోజీ కవితల సంపూర్ణ సంకలనం" పుస్తకంపై "జ్వాలా...అగ్గి పిడుగు" అని రాసి సంతకం పెట్టి నా చేతికివ్వడం ఇంకా గుర్తుంది. నవంబర్ 13, 2002 కాళోజీ మరణించిన వార్త విని ఆయన అంతిమ దర్శనం కొరకు ప్రభాకర్ ఇంటికి వెళ్లి వచ్చాను.


పీవీ నరసింహారావు, కాళోజీ నారయణరావు, సదాశివరావు

కాళోజీ 88 వ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన సభ నాకింకా బాగా గుర్తుంది. ఆ రోజున ముఖ్య అతిధిగా వచ్చిన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు చేసిన ప్రసంగం నేను యధాతధంగా రాసుకున్నాను. "జగతికి శాపములు ఇచ్చుచు శత సంవత్సరములు బ్రతుకుము" అని అప్పటికి 28 సంవత్సరాల క్రితం కాళోజీ షష్టి పూర్తి సందర్భంగా తాను అన్న మాటలనే తిరిగి చెప్తున్నానంటూ తన ఉపన్యాసాన్ని మొదలు పెట్టారు పీవీ. కాళోజీ మాట్లాడితే వినాలని, తిడితే పడాలని, అనుకోని వారు బహుశా ఎవరూ వుండరని అంటూ, తనకంటే ఐదేళ్లు పెద్దవాడైన కాళోజీతో తన పరిచయాన్ని, తరువాత క్రమేపీ తమ మధ్య పెన వేసుకుపోయిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పీవీ. కాళోజీ ప్రభావం తనపై ఎంతో గాఢంగా పడిందనీ, ఆ కారణాన, తాను ఏదైనా నిర్ణయం తీసుకున్న ప్రతిసారి కాళోజీ లాంటి విమర్శకుడు ఆ నిర్ణయం విషయంలో ఎలా స్పందిస్తారోనని ఆలోచనలో పడిపోతాననీ, ఆ విధంగా కాళోజీ తన ఆత్మగా మారి కూర్చున్నాడనీ చెప్పారు. వయసులో చిన్నవాడినైన తనకు, తనకంటే పెద్దవాడైన కాళోజీని ఆశీర్వదించాలని వుందనీ, ఆయనింకా పది కాలాల పాటు నడవాలి అని అనాలని వుందని, ఆయన అవసరం ఎంతో వుందని అడుగుతున్నానని, "నువ్వు మాట్లాడితే వినాలని...తిడితే పడాలని" ఆశగా వుందని అంటారు పీవీ. ఆ నాడు పీవీ సుమారు అరగంట పాటు ఏకధాటిగా ప్రసంగించి, "రెండు యుద్ధాల మధ్య సాగిన తమ జీవన యానం" గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఆయన మాటల్లోనే....ఆ ఉపన్యాసంలోని ఆసక్తికరమైన అంశాలు... కొన్ని:

"కాళోజీ గారూ...కాదు సార్...గౌరవ వాచకం తీసేస్తాను. కాళోజీ అనే సంబోధిస్తాను...ఇంత అమూల్య సన్నివేశం నా జీవితంలో వస్తుందని నేనే నాడు ఊహించలేదు. ఇది అపూర్వం కాదు. అమూల్యం. ఒక్క సారి గతంలోకి దృష్టి సారించాను. ఇంతకు ముందు కూడా ఒక సారి ఒకే వేదికపై కలిశాం. అది ఆయన షష్టిపూర్తి సంబరం. వరంగల్‌లో జరిగింది. అదో లొల్లి బృందం. ఆయన కప్పుడు అభినందనలు చెప్తూ...’జగతికి శాపములు ఇచ్చుచు శత సంవత్సరములు బ్రతుకుము’ అన్నాను. కాళోజీ కోప్పడతాడు, ఏడుస్తాడు. ఇదంతా ఆయన గొడవకు సంబంధించిన వైనా మా అందరి గొడవే! అలనాటి మా ఇద్దరి స్మృతులు, మా జంట జీవితాలలోని కొన్ని ఘట్టాలను చెప్తాను...కబీర్, దాదూదయాళ్, వేమనల పరంపరలో కాళోజీ చివరివాడేమో! లోప భూయిష్టమైన ఈ ప్రపంచంలో తప్పులు సరిదిద్దేవారు ఎప్పుడూ ఉంటూనే వుంటారు. ఇది జరగని నాడు జగత్తే అంతమవుతుంది. కాళోజీకి వేమనకు, కాళోజీకి దాదూదయాళ్‍కు, కాళోజీకి కబీర్‌కు వ్యత్యాసం కూడా వుంది. వాళ్ళు సాక్షులు. ఈయన సాక్షి-భాగస్వామి. తాను పాల్గొంటూ, పొరపాట్లను సరి దిద్దుకుంటూ, ఇతరుల పొరపాట్లను బయటపెడుతూ, జంకు-గొంకు లేకుండా చెప్తాడు".

"వరంగల్‌లో నేను కాళోజీకి జూనియర్‌ను. ఆయన టాప్. మధ్యలో నేను. ఆయన క్లాస్ మేట్స్ తర్వాత నాకూ క్లాస్ మేట్సే. నా చదువు పూర్తయ్యే నాటికి కాళోజీ వకీలు ఘట్టం మొదలైంది. నేనప్పుడే చదువు వదిలేసి వచ్చాను. కాళోజీని గమనిస్తే...ఈయన వృత్తికి, ప్రవృత్తికి కలిసినట్లు లేదనిపించింది. అదో సంధికాలం. ఈ నాటి యువకులు ఆనాటి సంగతులు తెలుసుకోవాల్సిన కాలం. బ్రిటీష్ వాళ్లతో ఎంతో కాలం పోరాడాలనీ, ఉద్యమం దీర్ఘకాలం సాగుతుందని, అనుకుంటున్న రోజుల్లోనే, స్వతంత్ర భారతం చేరువల్లోకి వచ్చే రోజులు వచ్చాయి 1942-1945 మధ్య కాలంలో. ’ప్లీజ్ లీవ్ ఇండియా టు గాడ్ అండ్ ఖెయాస్’ అని బ్రిటీష్ వారిని కోరారు గాంధీ. వీళ్లను తుపాకిలతో ఎట్లా అదుపులో పెట్టాలో అర్థంకాని బ్రిటీష్ వారు ఇక్కడి నుంచి నిష్క్రమించాలని మానసికంగా ఓ నిర్ణయానికొచ్చారు. అదో సంధికాలం. పరీక్షా సమయం. మేం 20-30 సంవత్సరాల వెనుకైనా పుట్టలేదే అన్న భావన. తల్లితండ్రులకేమో మేం ఉద్యోగంలో స్థిరపడితే మంచిదని అభిప్రాయం వుండేది. మేం కాంగ్రెస్ అని తిరిగేది. జీవితంలో ఏం చెయ్యాలన్న నిర్ణయం తీసుకునే ప్రయత్నంలో నేనున్నాను. ఐతే అప్పటికే కాళోజీ నిర్ణయం తీసుకున్నట్లే వుంది. ఇంతలో నేను వకీలు వృత్తిలో బూర్గుల దగ్గర జూనియర్‌గా చేరాను".

          "సరిగ్గా అప్పుడే ’సాహిత్య జగత్తు’ అనే మాగజైన్ ఉదయించింది. కాళోజీ గారి సాహిత్య గురువు గార్లపాటి రాఘవరెడ్డి గారి ప్రోత్సాహం-ప్రోద్భలం వుంది దానికి. ఆయన రస సిద్ధి చాలా తక్కువ మందికి వుంటుంది. అనేక విభావ, అనుభవాల వేణు గోపాల శతకం ఆయన రమ్యంగా రాశారు. కాళోజీ నవీనత్వాన్ని, ప్రబంధ కావ్యాల పురాతనత్వాన్ని, అన్నింటినీ, ఆకళింపు చేసుకున్న ఆత్మగతం - మా గురువు ఆయన. ఆ రోజుల్లో, వరంగల్‌లో ఎక్కడ తినేదో, ఎక్కడ తిరిగేదో, ఎక్కడ వుండేదో....అంతా ఏదో విధంగా జరిగి పోయేది. కాళోజీకి ఆయన అన్న రామేశ్వర రావు గారి ఇల్లుండేది. నేను కూడా మధ్యమధ్యన అక్కడే తినేది. మరి మేమేమో ’ఆవారాలు’ కదా! ఇక మావాడు సదాశివ రావు కాకతీయ పత్రికకు ఎడిటర్. పత్రిక మొదలైతే పెట్టాం కాని అమ్మేవాడెవరన్న సందేహం వచ్చింది. నేను అమ్మేవాడిని. స్నేహంగా ఎవర్నైనా అడిగితే ఓ పది రూపాయలు చందా వచ్చేది. ఈ లోపల సదాశివరావు భూస్వాములను తిట్టుకుంటూ వ్యాసాలు రాసేవాడు. వాళ్లు నిరక్షరాస్యులు కాబట్టి కొనరు-చదవరు".


కాళోజీ గారితో నేను

          "కాళోజీ ఆదర్శప్రాయుడు. మా మార్గాలు వేరయ్యాయి. ఐనా, ’కాళోజీ భూతం’ నన్ను ఈ నాటికీ వెంటాడుతుంది. ఏ పని చేసినా, చేస్తున్నా, చేయబోతున్నా, కాళోజీ ఏమంటాడోనన్న భయం. అందుకే అనుకున్నాను..నేను నా జీవిత చరిత్ర రాయకూడదని. రాస్తే అబద్ధాలు రాయాల్సి వస్తుందేమోనని! ఆ సంధి కాలంలోనే, రెండు-మూడేళ్ల సాన్నిహిత్యం, సావాసం ఆయనను నాకు క్రిటిక్‌ను చేసింది. కాళోజీ ఒక ’ఫినామినన్’. బహుశా దానర్థం తెలుగులో లేదేమో! నా జీవితంలో కాళోజీ ఫినామినన్, కాళోజీ అనుభూతి నాలో చొరబడింది. 1942 లో ఈన రాసిన ఆవేదన, కొన్నాళ్ల క్రితం, 1999 లో ఓ సమావేశంలో చెప్పారు. అదో పెద్ద పారిశ్రామికవేత్తల సమావేశం. ఈ సందర్భంలో మా ప్రజాకవి చెప్పింది వినండన్నారు. చిన్ననాటి నుండి నన్ను వెంటాడి వేధిస్తున్న విషయం గ్రామీణ భారత దేశం. దాని విషయమే కాళోజీ చెప్పింది ఆంగ్లంలో చదివి వినిపించాను".

          "ఇన్నాళ్లుగా కాళోజీ నాలో కుదించుకుని కూర్చున్నాడు. ఈయనకు ’ఇజం’ లేదా? ఈయన కాంగ్రెస్ పార్టీ వాడు కాదా? 1952 లోక్ సభ ఎన్నికల్లో మేమిద్దరం జంట అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ నుంచి పోటీ చేసి, జంటగా ఓడాం. కాళోజీ 1400 ఓట్ల తేడాతో ఓడితే, నేను 80, 000 ఓట్ల తేడాతో ఓడాను. ఆయనప్పుడు ’నా మడికొండ ఓట్లతో ఓడాను’ అన్నాడు. ఎందుకంటే అది ఆయన గ్రామం. అక్కడున్న ఓట్లు సరిగ్గా 1400. ఆ తరువాత కాళోజీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ గెలిచి, అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్య బట్టాడు. తనకు తోచింది తాను చేస్తాననేవాడే తప్ప ఎవరి మాట వినడు కాళోజీ. తరువాత పార్టీ రహితుడయ్యాడు. అతీతుడయ్యాడు. అప్పటికీ-ఇప్పటికీ ’ఇజం’ లేదంటాడు. ఐతే, ప్రవేశ ద్వారం వుంటుంది కదా! రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావులు కాంగ్రెస్ సత్యాగ్రహులు. అంత మాత్రాన ఒక పార్టీని అంటి పెట్టుకుని ఎందుకు వుండాలి? ఈ ప్రపంచంలో జరిగేది, శాశ్వతమైనది ’మార్పు’ మాత్రమే! కాళోజీ లాంటి ’ఫినామినన్’ ఎప్పుడో యుగ-యుగాలకు ఒక మారు పుడ్తాడు. ఆయనింకా జగతికి శాపాలిస్తూనే వుంటారు. అలాంటి అద్వితీయుడు ఎక్కడా కనిపించడు. లోకంలో మంచి వాళ్లు వుంటారు-చెడ్డ వాళ్లు వుంటారు. కానీ, ’వెల్ రౌండెడ్ పర్సనాలిటీ’ అన్న అంశాలున్న పూర్ణత్వం కాళోజీ తప్ప మరెవరూ లేరనాలి".

          "ఇది మా అనుబంధం...దారులు వేరైనా, మా దృక్పథం, దృక్కోణం మారలేదు. కాళోజీ కూర్చున్న చోటే బాధ పడుతుంటే, నేను కీకారణ్యంలోకి పోతూ బాధ పట్తున్నాను. అంగీ చినిగినా, దేహం రక్తసిక్తమైనా, స్పిరిట్ పోని కాళోజీ ఆదర్శ ప్రాయుడు. వేదాంతి కూర్చున్న చోట ఆలోచిస్తే, శాస్త్రజ్ఞుడు పరిశోధనాశాలలో పని చేసి ఫలితాలను ఆనందిస్తాడు. ఇదే మా ఇద్దరి ’కామన్-అన్ కామన్’ క్షణాలు. ఈయనకు కొన్ని వందల సన్మానాలు జరిగాయి. ఈ సారే నేను ఎందుకు జ్ఞాపకం వచ్చానో? కేవలం మా బంధం మరోసారి విప్పి చెప్పుకునే అవకాశం కొరకేనేమో!".

మన దురదృష్టం...2001 సెప్టెంబర్‌లో తన 88 వ పుట్టిన రోజు జరుపుకున్న కాళోజీ గారు ఆ మరుసటి సంవత్సరమే, నవంబర్ 13, 2002 న మరణించారు. ఆయన మరణ వార్త విన్న పీవీ నరసింహారావు, ఆ రోజుతో తమ ఇద్దరి మధ్య కొనసాగిన 60 సంవత్సరాల అన్యోన్య స్నేహం, 70 సంవత్సరాల కాళోజీ సాహిత్య సేవ, ప్రజల వెంట వుండి చేస్తున్న కావ్య సేవ...ఇవన్నీ అంతరించి ఒక శకం పూర్తైనందుకు విషాదంగా వుందన్నారు. కాళోజీకి తెలిసిన అందరి లాగానే నేను కూడా ఆ మహానుభావుడిని చివరిసారి దర్శించుకున్నాను.


Friday, October 11, 2013

'కోలాహలంగా నిలిచిన అనుభవం': వనం జ్వాలా నరసింహారావు

జి. కృష్ణ 90 వ జయంతి (విజయదశమి) సందర్భంగా...

'కోలాహలంగా నిలిచిన అనుభవం'
ఆంధ్ర జ్యోతి దినపత్రిక (12-10-2013)
వనం జ్వాలా నరసింహారావు

          కళ్యాణ వేణుగోపాల కృష్ణమూర్తిగా పెద్దలతో పేరు పెట్టించుకున్న గొడవర్రు అగ్రహారికులు, మధురా పుర వాసులు, కృష్ణగారు గా పాత్రికేయ లోకానికి చిరపరిచితులు, "జగమెరిగిన జర్నలిస్ట్" జి. కృష్ణగారు మన మధ్యనుంచి వెళ్లిపోయి పుష్కర కాలం దాటింది. ఆయన మన మధ్య లేరంటే, బాధకంటే వెలితి, గత పన్నెండేళ్లు గా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది. బ్రతికుంటే ఆయన ఈ రోజున తన 90 వ జన్మదినం జరుపుకుండేవారేమో! పోనీ మనలాంటి వాళ్లం ఆయనకు ఇష్టమున్నా, లేకపోయినా జరిపేవాళ్లమేమో! ఆయన చనిపోవడానికి ముందు కొంతకాలం పాటు చెన్నైలోని తన కుమారుడి దగ్గర అనారోగ్య కారణాల దృష్ట్యా వుంటుండేవారు. కొద్ది రోజుల్లో చనిపోతాడనగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారాయనను. వచ్చిన మరుసటి రోజే కృష్ణ గారిని కలవడం జరిగింది. వొరవడని ఉత్సాహం ఆయనలో ఆనాడు కనిపించినా, మాట్లాడలేని స్థితిలో వున్నారనే చెప్పాలి. అస్తమానం మాట్లాడుతుండే ఆయనను ఆ పరిస్థితిలో చూడగానే చాలా బాధ వేసింది. కృష్ణగారు (విజయదశమి) అక్టోబర్ 20, 1924 న గుంటూరు జిల్లా తెనాలి దగ్గర లోని గొడవర్రు అగ్రహారంలో పుట్టి, కృష్ణ జిల్లాలోని సొంత గ్రామం మధురా పురంలో పెరిగారు. సికిందరాబాద్‌లో పాఠశాల విద్యాభ్యాసం, గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్, నిజాం కళాశాలలో డిగ్రీ చదువు పూర్తి చేసారు. మీజాన్, ఫ్రీ ప్రెస్, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లలో పని చేసి అక్టోబర్ 19, 1982 లో పదవీ విరమణ చేసి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా, నేషనల్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్ సంపాదకుడుగా, మరణించేంతవరకు పాత్రికేయ వృత్తిలోనే వున్నారు. ఆంగ్లంలో "నాయన", "హిస్టరీ ఆఫ్ తెలుగు అండ్ దెయిర్ కల్చర్", "కొమర్రాజు జీవిత చరిత్ర": తెలుగులో "మెడోస్ టైలర్ ఆత్మ కథ", "టపా కథలు", "ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జీవిత చరిత్ర...తోడేళ్ల పాలు చేశారు", "గాంధి", "మాదన్న మహామంత్రి" అనే పుస్తకాలను రాసారు కృష్ణగారు.

దుర్భర దారిద్ర్యంలో నిత్య సంతోషి కృష్ణగారు. ఆయన నోట "లేదు"-"కాదు" అన్న మాట ఏ విషయంలో రాలేదు. ఐనా, ఆయనకూ ఇష్టా-అయిష్టాలుండేవి. ఉదాహరణకు...ఆయనకు రుచించని ఏదైనా అంశంపైన కాని, ఎవరైనా వ్యక్తి గురించి కాని, ఏదైనా ఒక వార్త కాని కృష్ణగారితో రాయించడం ఎవరి తరం కాదు. ఇక ఆయన భాష వేరు...వ్యవహార శైలి వేరు...రాసే విధానమే వేరు. అలానే ఆయన ఎడిటింగ్ నేర్పరి తనం. మనం రాసింది రాసినట్లే వుంచి, చక్కగా ఎడిట్ చేసి, ఇది రాసింది మనమేనా అన్నట్లు మార్పు చేసి ఇచ్చేవారు మన వ్యాసాన్ని. ఆయన చివరి రోజుల్లో, కృష్ణగారి చివరి కాలమ్ "విలేఖరి లోకం" పుస్తకావిష్కరణ సభలో ప్రముఖ రచయిత, ఆయన స్నేహితుడు సదాశివ ఆయన గురించి మాట్లాడుతూ...కృష్ణగారు "వ్రాస్తారు", మనం "రాస్తాం" అన్నారు. వాస్తవానికి, కృష్ణగారి గురించి ఎంత రాసినా ఏం సరిపోదు. ఏ ఒక్క కోణంలో ఆయనను చూపించగలం? ఆయనో సీనియర్ పాత్రికేయుడు అంటే చాలా? రచయిత అని సర్దుకోవచ్చా? అనువాదకుడందామా? స్వాతంత్ర్య సమరయోధుడందామా? ఓ పాతికమందికైనా డాక్టరేట్ పొందడానికి సహాయపడ్డ వ్యక్తి అందామా? బహుశా సమాధానం లేదేమో! నిజం చెప్పాలంటే కృష్ణగారొక విజ్ఞాన సర్వస్వం!


నేను బి.హెచ్.ఇ.ఎల్ సంస్థకు చెందిన హయ్యర్ సెకండరీ పాఠశాలలో లైబ్రేరియన్ ఉద్యోగంలో చేరి, హైదరాబాద్‌కు వచ్చిన రోజుల్లో, 1974 లో, స్వర్గీయ భండారు పర్వతాల రావుగారి ద్వారా కృష్ణగారితో మొదటిసారి పరిచయం అయింది. అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ కార్యాలయం లిబర్టీ డౌన్‌లో, హిమాయత్ నగర్ లో వుండేది. పర్వతాల రావుగారి రిఫరెన్స్ తో ఆయనను కలిసిన మరుక్షణంలోనే, కృష్ణ గారు ఒక విచిత్రమైన వ్యక్తిగా అనిపించాడు. ఆ రోజున ఆయన ఉర్దూలో రాసిన ఒక పుస్తకాన్ని చదువుతున్నట్లు గుర్తు. నాతో సంభాషణ మధ్యలో "హిజ్ మదర్" అనే పదాన్ని ఎందుకో వాడి, దాని అర్థం ఆయనదైన శైలిలో విడమర్చి చెప్పి కడుపుబ్బా నవ్వించారు. ఇక ఆ తరువాత కొన్ని వందల సార్లు ఆయనను కలిసి వుంటాను. దురదృష్ట వశాత్తు, ఆయన చివరిసారి ఫోన్ చేసి, "జ్వాలా గారూ...ఒక్క సారి కబుర్లు చెప్పుకుందాం...రాకూడదు"? అని అడగడం, నేను ఖమ్మంలో వున్న కారణాన కలవలేకపోవడం, వచ్చేసరికి ఆయన మరణ వార్త వినడం జరిగింది. పిలిచినప్పుడు వెళ్లలేకపోయానే అన్న బాధ ఈ నాటికీ మిగిలిపోయింది.

          కృష్ణగారు ఆయనను గురించి తప్ప, ఇంకే విషయమైనా అక్షరం పొల్లు పోకుండా, ఏమాత్రం మరచి పోకుండా చెప్పగలరు. అలా చెప్తూ...చెప్తూ.. మధ్య మధ్యలో పొరపాటున తనకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పేవారు. విన్న సంగతి మరచిపొమ్మని కోరేవారు. అలా చెప్పినవి కొన్ని మరిచిపోకుండా వుండలేనివి వున్నాయి. ఉదాహరణకు: ఆయన పనిచేస్తున్న పత్రికలో, సంపాదకుడిగా వున్న వ్యక్తి పదవీ విరమణ చేసినా. పదవి నుంచి ఏదో కారణాన వైదొలగినా, ఇంకొకరిని నియమించాల్సి వస్తే, "ఎవర్ని" చేస్తే బాగుంటుందని కృష్ణగారి సలహా అడిగేవారు కాని "నువ్వే" వుండమని ఎన్నడూ అడగలేదు. ఒకసారి ఆయనను "ఛీఫ్ రిపోర్టర్" గా నియమించితే, అది తనకెందుకని యాజమాన్యాన్ని ప్రశ్నించారట. పి. వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా, అక్కిరాజు వాసుదేవరావు సమాచార శాఖ మంత్రిగా వున్న రోజుల్లో, కృష్ణ గారు నిరుద్యోగిగా విజయవాడలో వుంటూ, సంగీతం-సాహిత్యం, నాట్యంపైన, పుస్తకాలపైన, సమీక్షలు రాసుకుంటూ పదో-పరకా సంపాదించుకుంటుండేవారు. పి. వి గారు సమాచార శాఖ మంత్రిని విజయవాడ పంపి, కృష్ణగారిని ఆ శాఖ డైరెక్టర్‌గా చేసేందుకు ఆయన అంగీకారం అడగమన్నారు. ఆ ఉద్యోగంలో తానేం చేయాలని ఎదురు ప్రశ్న వేసి, కాలి దగ్గర కొచ్చిన ఉద్యోగాన్ని తన్నేశాడు. ఇంకొకళ్లయితే, ఎగిరి గంతేసి ఒప్పుకునేవారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో కృష్ణగారిని ఉద్యోగం మానమని చెప్పిన యజమాని తండ్రి (రామనాథ్ గోయెంకా) స్వయానా విజయవాడ వచ్చి, ఆయన్ను మెప్పించి-ఒప్పించి, మళ్లీ అదే ఉద్యోగం హైదరాబాద్‌లో తనకిచ్చిన సంగతి కొంత చెప్పారొకసారి. అలా వచ్చిన రోజుల్లోనే నాకు ఆయనతో పరిచయమైంది. ఆ ఉద్యోగంలో చేరడం వలన ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆయనకు ఉపయోగపడ్దదో, లేక ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఆయన ఉపయోగపడ్డాడో, కృష్ణగారికి, రామనాథ్ గోయెంకాగారికి తప్ప ఇతరులెవరికీ తెలియదు. ఇలా చెప్పాలంటే మరికొన్ని వున్నాయికాని, బహుశా అలా బయట పెట్టడం కృష్ణగారికి ఇష్టం కాదని రాయడం లేదు.

తననెవరూ, ఏ పేపర్లో పనిచేసినా, సంపాదక బాధ్యతలు ఇవ్వలేదని, ఆ పని నేను, డాక్టర్ ఏ. పి. రంగారావు గారు చేశారని అంటుండేవారు కృష్ణగారు. దానికి కారణం, ఆ రోజుల్లో మేం నడుపుతుండే "నేషనల్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్" అనే ఓ అనామక (అంతగా ప్రాచుర్యం పొందని) ద్విభాషా వార్తా సంస్థకు కృష్ణగారిని గౌరవ సంపాదకుడిని చేయడమే! ఆయన తన బై లైన్‌తో నేషనల్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్ ద్వారా పలు పత్రికలకు వ్యాసాలు రాస్తుండేవారు కూడా. అలా ఆయన సహచర్యంతోనే నాకు కూడా రాయడం అలవాటై, ఆ వ్యాసాలు పత్రికలలో ప్రచురించే స్థాయికి చేరుకున్నాయి. "నిస్ కార్డ్" అన్న పేరుతో నేషనల్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్ ద్వారా ఆయన రాసిన  చాలా ఆర్టికల్స్ తో పాటు, నావి కొన్ని, రమేష్ అనే మరో యువ పాత్రికేయుడివి కొన్ని కలిపి ఒక పుస్తకంగా వేయడం కూడా జరిగింది. ఆ పుస్తకాన్ని నేషనల్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్ గౌరవ అధ్యక్షురాలు అలనాటి రాష్ట్ర గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి ఆవిష్కరించడం కూడా జరిగింది. దాని మొదటి ప్రతిని రాజ్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ కృష్ణగారికి ఇవ్వడం నాకింకా బాగా గుర్తు.

          కృష్ణగారి దగ్గర ఎన్నో అపురూపమైన-అత్యంత విలువైన-విలువ కట్టలేని పుస్తకాలుండేవి. ఒక నాడు వాళ్లింటికి వెళ్లే సరికి అవన్నీ మాయమయ్యాయి. ఏమయ్యాయంటే ఆయన దగ్గరనుంచి కబుర్లే కాని సమాధానం రాలేదు. ఆయన దగ్గర అతి పురాతనమైన ఒక టైప్ మిషన్ వుండేది. దాని మీద ఆయన వ్యాసాలు టైప్ చేస్తుంటే, ఆ చప్పుడు, విజయవాడ సమీపంలోని కృష్ణా బ్రిడ్జ్ మీద రైలు పోతున్నట్లుండేది! ఆ టైప్ మిషన్ కూడా ఆ తరువాత కాలంలో కనిపించలేదు. ఆటోలో ప్రయాణం చేస్తుంటే, సరాసరి శ్మశానికి వెళ్తున్నట్లుగా వుంటుందని అంటూ, ఎక్కడానికి నిరాకరించేవారు. నా స్కూటర్ వెనుక సీటుపై సందేహిస్తూనే కూర్చునేవారు. ప్రయాణపు బడలిక ఆయనలో ఏనాడు కనిపించకపోయేది. కాకపోతే, మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మాత్రం, చాలినంత విరామం, ఐదారు సిగరెట్ల ఆస్వాదన ఆయనకు తప్పనిసరి.

          అందరూ రాసేది ఆయన వ్రాయరు. ఏదో ప్రత్యేకత ఆయన రిపోర్ట్ లో-ఆర్టికల్ లో వుండాలి. ఏ బావి కొండ నిక్షేపాల గురించో, సింధూ లోయ నాగరికత గురించో, ఫలక్ నుమా ప్యాలస్ గురించో, నిజాం నవాబులు పెట్టిన తద్దినాల గురించో, రావి నారాయణ రెడ్డి గారిలోని గాంధేయవాదాన్ని గురించో, చందా కాంతయ్య ధార్మికత్వమో, అయితరాజు రాం రావు హరిజన సేవ గురించో, కాళన్న కవిత్వం గురించో....ఇలా.. అందరూ అనుకోని కథా వస్తువులు ఆయన ఆర్టికల్స్ లో దర్శనమిస్తాయి. ఆయన రాసిన ఆర్టికల్, తాను రాసినట్లుగా, ఎవరన్నా తమ పేరుతో ప్రచురించుకుంటా మంటే, ఆయన నిరభ్యంతరంగా అంగీకరించేవారు. ఐనా, మన పిచ్చికాని, ఎవరి పేరు మీద అచ్చు అయినా, అది కృష్ణ గారు వ్రాసిందని సులభంగా తెలిసి పోదా? ఆ శైలి ఆయనకు తప్ప ఇతరులెవరికీ రాదు.

          ప్రజాతంత్ర వార పత్రిక ప్రారంభానికి ముందు, నేను, దేవులపల్లి అమర్, అజయ్, కృష్ణ గారిని కలిసి, ఆ పత్రికకు ఒక కాలమ్ రాయమని అడిగాం. అలా మొదలైందే "విలేఖరి లోకం". మాట ఇచ్చినట్లే, క్రమం తప్పకుండా, వంద వారాలకు పైగా ఆయన వ్రాసిన "విలేఖరి లోకం", సమకాలీన పాత్రికేయ జీవన యానం అనవచ్చు. నాకు పరిచయమైన పాతిక-ముప్పై సంవత్సరాలలో ఆయన దగ్గర ఎన్నో సంగతులు విన్నాను. ఆయన వ్రాసినవి ఎన్నో చదివాను. కాని, "విలేఖరి లోకం" లో ఆయన వ్రాసినవన్నీ నాకు తెలిసినంతవరకు కొత్త విషయాలే. తెలియని సంగతులే. బహుశా "విలేఖరి లోకం" ఆయన చిట్టచివరి కాలమ్ కావచ్చు. "విలేఖరి లోకం" లోని ఒకటి రెండు విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సమంజసమేమో!   

కృష్ణ గారి "విలేఖరి లోకం" భూత, భవిష్యత్, సమకాలీన పాత్రికేయ జీవన యానం. అది ఆయన ఆత్మ కథ కావచ్చు...స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర కావచ్చు...ఆయనకు పరిచయమున్న వివిధ రంగాలలో రాణించిన వ్యక్తుల గురించీ కావచ్చు....సామాజిక, ఆర్థిక, రాజకీయ, పరిశోధనాత్మక వ్యాస పరంపరే కావచ్చు...ఇవన్నీ కూడా కావచ్చు. ఆయన రాసిన ప్రతి విషయం మళ్లీ, మళ్లీ చదవాల్సిందే....మళ్లీ, మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అందులోని అంశాలన్నీ అసలు-సిసలైన జీవితానుభవాలే. ఆ ఆణిముత్యాల పరంపరలో కొన్ని....

          "పత్రికా రచయితకు చదువు" అన్న ఆర్టికల్ లో, లక్ష్మీనాధం అనే ఒక ఉపాధ్యాయుడి గురించి, రామమూర్తి అనే ప్రధానోపాధ్యాయుడి గురించి వ్రాస్తూ... "ప్రధానోపాధ్యాయుడు పాఠం చెప్తే, విద్యార్థికి నోటికి వచ్చేది. మరి అదేమి ప్రజ్ఞో! చక్కగా చెప్పిన పాఠాన్ని అప్పగించుకుని ఇంటికి పంఫేసేవాడు" అన్నారు. ఇంతకూ ఇదెందుకు వ్రాసారంటే, కృష్ణగారు, ముందు ముందు పత్రికా విలేఖరి కావడానికి రామ మూర్తి వంటి ఉపాధ్యాయులు సహాయపడినారట. పత్రికా విలేఖరికి ఎవరు, ఏమిటి, ఎందుకని, ఎప్పుడు, ఎక్కడ మాట్లాడారో జ్ఞాపకం వుండడం అవసరమని, అది ఆయన విత్తి ధర్మమని అంటూ, ఇతరులు చెప్పేది వినాలని, వినినవాడు మర్చిపోడని అంటారు.  "నేనెందుకు రిపోర్టర్ అయ్యాను" అన్న శీర్షిక కింద, తనకు ఇతిహాసం అంటే ఇష్టమని, అంతమాత్రాన ఇతిహాసం వచ్చునని అనడం లేదని అంటూ, తాను చదువుకున్న సైన్స్ లో కూడా ఇతిహాసం వుంటుందని చెప్తారు. పి. వి. సుబ్బారాయుడు, సి. ఎస్. నాయుడు అనే పాత్రికేయుల గురించి వ్రాస్తూ... "నాకు ఎంత పెద్ద ధనికుడిని చూసినా, ఎంత పెద్ద అధికారిని చూసినా మోజు కలిగేది కాదు కాని, ఈ ఇద్దరినీ చూసి, నా చిన్నతనంలోనే, నేను అసూయ లాంటి మోజు పడ్డాను. పత్రికా విలేఖరిని చూసి మోజు పడిన వాళ్లను నేను ఎరుగుదును. పత్రికా యజమానులే అసూయ పడడం ప్రారంభించిన తరువాత దృష్టి దోషం కలిగిందని ఎప్పుడైనా అనుకుంటూ వుంటాను" అని అంటారు. అప్పట్లో తనకు "రిపోర్టర్ కు, డిక్టేటర్ కు" తేడా తెలియదని చెప్పుకుంటారు. పాఠశాలలో పాఠాన్ని ఇతిహాసంగా చెప్పే, కథ చెప్పినట్లు చెప్పే, చమత్కారాలు కురిపించే పలువురు ఉపాధ్యాయులుండేవాళ్లు కాబట్టే తనకు "విలేఖరిత్వం" అవలీల అయిందని రాశారు. "వినే ఆసక్తి వుండాలి....వినిన దాన్ని బుద్ధిలో ధరించే శక్తి వుండాలి. ఇట్లా వుండాలంటే అటువంటి పోలికను ప్రసాదించగల తల్లితండ్రులుండాలి. ఇన్ని కలిసి వస్తే, విలేఖరి అవుతాడు-న్యాయ మూర్తి అయినా అవుతాడు. ఇవేవీ కాకుండా విలేఖరి అవుతే రాజకీయ కరపత్రాలు రాసేవాడు అవుతాడు" అంటారు మరో చోట. తనకు, పత్రికా రచయితకు కావాల్సిన శిక్షణ కొంతవరకు చిన్ననాడే సంప్రాప్తించిందని, చిన్ననాడే మంచి గాలి పీల్చానని, మంచి నీరు తాగానని, మంచి ఉపాధ్యాయుల వద్ద మెలిగానని గర్వపడతారు.

తాను ఈ లోకానికే శిష్యున్ని అని భావించేవారు కృష్ణగారు. ఆయనే నాడు, ఏ దరఖాస్తులోను, తన కులం గురించి కాని, శాఖ గాని రాసుకోలేదు. తాను పత్రికా రచయిత కావడానికి తగు చదువు చెప్పిన గుంటూరు హిందూ కాలేజీ, హైదరాబాద్ నిజాం కాలేజీ గురించి ముచ్చటించడం ఆయనకు చాలా ఇష్టం. నిజాం కాలేజీలో ఆర్థిక శాస్త్రాచార్యుడుగా పని చేసిన బి. వి. రామ నర్సు (బి. పి. విఠల్ గారి తండ్రి) బోధనా సరళి ప్రభావం కృష్ణ గారిపై బాగానే పడింది. "విద్యార్థి దశలో వినాలి...అధ్యాపక దశలో చదువుకోవాలి...రామ నర్సు గారు రెండు పద్ధతులు బాగా అవలంబించిన వ్యక్తి. విద్యార్థులలోను తెలివి గల వాళ్లు, చదువరులు వుంటారని ఆయన నమ్మకం కాబోలు. వాళ్లతో చర్చించే వాడు. ప్రశ్నలు, జవాబులు ప్రతి ఉపన్యాసంలోనూ వుండేవి" అని ఆయనను గురించి ఆరాధనా పూర్వకంగా రాశారు. అలా అంటూ...ఆ విధమైన బోధనా పద్ధతి, ముందు ముందు పత్రికా రచయిత అయ్యే వాళ్లకు ఎంతో ఉపయోగపడ్తుందని భావిస్తారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతూ "క్విట్ ఇండియా" ఉద్యమంలో పాల్గొన్న ఫలితంగా, జైలు జీవితం అనుభవించారు కృష్ణ గారు. దేశ సేవకు ఉపయోగపడే, గౌరవ ప్రదమైన ఉద్యోగం చేయాలనుకున్న ఆయనకు అప్పట్లో తట్టింది "విలేఖరిత్వం". లక్నో లోని నేషనల్ హెరాల్డ్ పత్రికలో చేరాలన్న ఆశ నెరవేరలేదు. అయితే..."సరిగ్గా వ్రాయక పోతే రూళ్ల కర్ర పెట్టి వేళ్లు విరగ్గొడ్తా" అన్న కోటంరాజు రామారావు గారి మాటల్లోని అర్థాన్ని, "వ్రాయటం నేర్చి, పత్రికలకు వ్రాయమని" హితవు చెప్పిన చలపతి రావు గారి భావాన్ని అర్థం చేసుకున్న కృష్ణ గారు, సికిందరాబాద్‌కు తిరిగి వచ్చి "మీజాన్" లో చేరారు విలేఖరిగా. ఆ రోజుల్లో ఆయన "విలేఖరి" హోదాను నిలబెట్టుకోవడానికి పడిన పాట్లు అనంతం అని ఆయనే చెప్పుకుంటారు. మొత్తానికి మూడు నెలలు మీజాన్ లో పని చేసి, రాం భట్ల, సి. ఎస్. నాయుడు లాంటి వారి మెప్పు పొంది, చెన్నపట్టణానికి వెళ్లారు కృష్ణ గారు.

పత్రికా రచన కోసమే తాను పుట్టినట్లు చెప్పుకుంటారు కృష్ణ గారు. ఆ రంగంలో ప్రవేశానికి తప్ప, మరే సందర్భంలోనూ, ఆయన సిఫార్సుల కోసం తంటాలు పడలేదు. ఆయన దృష్టిలో "పత్రికా రంగం అనేది, ఎవ్వరేమనుకున్నా, తెలిసినంతవరకు, ఆశించినంతవరకూ, మానవత కోసం అన్వేషణ". "పత్రికా రచయితకు తన నిత్య అన్వేషణలో, ఎక్కడైనా మానవుడు, మానవత గల ద్విపాది, కనపడితే, అతడి జీవితం ధన్యం" అని ఎంత చక్కగా చెపుతారో! అయితే, ఆయనను ఎవరూ, "మానవత గల మనిషిని ఎక్కడైనా కలిశావా" అని అడగలేదట. ఎంత ఆశ్చర్యం! ఇలాంటి వ్యక్తి పత్రికా రచయితగా, వ్యాపార స్థాయిని ఆధారం చేసుకున్న వ్యవస్థలో పడ్డానని చెప్పుకోవడం మరింత ఆశ్చర్యకరమైన విషయం. ఖాసా సుబ్బారావు గారి ప్రవేశ సిఫార్సు కాగితంతో చెన్నపట్టణంలోని "ఫ్రీ ప్రెస్" పత్రికలో చేరిన కృష్ణ గారు, చేరిన నాడే తయారు చేసిన చాలా వార్తల్లో, ఒక దానిని చూపించి అక్కడ పని చేస్తున్న ఐరావతం గారు, "ఉన్నట్లుండి పాఠాలు బట్టీ పట్టే విద్యార్థి వ్రాసే శైలిలో ఇదేమిటి?" అని ఒక ఉపన్యాసం కొట్టారట. ఆ విషయం గుర్తు చేసుకుంటూ, "పత్రికలో పడే వార్తలన్నీ సరిగానే వుండాలి కానీ, మధ్య మధ్య సరిగ్గా వ్రాయని వార్త వుండే వీలు లేదు కదూ!" అని రాసుకున్నారు. చిన్న వాక్యాలే అందరికీ అర్థమయ్యే భాషలో రాయమని ఐరావతం ఇచ్చిన సలహాను ఆయన ఎప్పుడూ గుర్తుంచుకునేవారు. పత్రికా రచనే ఒక్కొక్కప్పుడు గంభీరమనీ, ఒక్కొక్కప్పుడు లోకానికి పట్టిన వెలికితనమనీ, అయినా పత్రికా రచన కోసమే పుట్టాననీ అంటారు కృష్ణ గారు.

          కృష్ణ గారి దృష్టిలో పత్రికా విలేఖరికి ప్రతి క్షణమూ చదువుల కాలమే. ఉదాహరణగా ఫీ ప్రెస్‌లో పని చేస్తున్నప్పుడు న్యూస్ ఎడిటర్ ఎం. ఎస్. సుబ్రహ్మణ్యం (ఖాసా సుబ్బారావు గారి స్నేహితుడు-తోటి ఖైదీ) రాజీనామా వ్యవహారం రాస్తారు ఒక ఆర్టికల్ లో. హిందూలో వచ్చిన ఓ పతాక వార్త, ఫీ ప్రెస్‌లో రానందుకు, ఆక్షేపణగా స్నేహితుడైన సుబ్రహ్మణ్యంను ఖాసా గారు ప్రశ్నించారట. ఐదు నిమిషాలలో రాజీనామా లేఖను సుబ్రహ్మణ్యం గారు ఇవ్వడం, దాన్ని ఒక సెకండ్‌లో ఖాసా గారు ఆమోదించి, కాఫీ ఇచ్చి వీడ్కోలు చెప్పటం జరిగిందట. ఇది రాస్తూ..."ఆ రోజుల్లో సంపాదకులనే వాళ్ళు, పత్రికలో వార్తలు ఏవేవి, ఎట్లా పడేవో చూసుకునే వాళ్లు! పైగా తప్పు చేస్తే, అది తప్పే! అది చట్ట ప్రకారం ఒప్పు అవుతుందేమో చూసే వాళ్ళు కారు. వాళ్ళు అట్లా బ్రతికారు" అని అంటారు. పత్రికా రచయితల "లేమి" ని గురించి అర్థం చేసుకున్న విద్యావంతుడు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాన రాలేదనీ, అనేకులు పత్రికా రచయితలే అర్థం చేసుకో లేదనీ కృష్ణ గారంటారు. "మాకు కావాల్సింది విజ్ఞతతో, వాత్సల్య గుణంతో, విజ్ఞానంతో, ఉపాధ్యాయుడు లాంటి పత్రికా సంపాదకుడు......ఐ. ఎస్. ఎస్, ఐ. పి. ఎస్ లాంటి అధికారి సంపాదకుడు కాదు" అని రాస్తూ, అలాంటి వారు విద్యారంగంలోనే లేనప్పుడు పత్రికా కార్యాలయంలో మాత్రం ఎట్లా వస్తారు? అని సర్దుకుంటారు. పత్రికా సంపాదకుడంటే తెలుసుకునే వీలు ఖాసా గారిని ఎరిగి వుండడం వల్లనే అని చెప్తూ, "సంపాదకుడు ఆలోచనా మార్గదర్శి! సంపాదకుడు సమదర్శి" అని రెండు గొప్ప పదాలు వాడారు కృష్ణ గారు. "పత్రికా రచయితలం ఉపనిషద్వర్ణితులం" అంటారు.

"వ్యవహారిక అన్యాయం" అనే పదాన్ని వాడుతూ, కృష్ణ గారు, పత్రికలలో భాషను గురించిన ప్రస్తావన తెస్తారు. ఆయన అనుభవంలో "చెన్న పట్టణంలో వినే తెలుగు విలక్షణమైనది". అంతటితో ఆగకుండా, ప్రతి ద్విభాషా ప్రాంతంలోనూ భాష విలక్షణంగానే వుంటుందంటారు. తన లాంటి కొందరు ఆంధ్రపత్రికలో పని చేస్తున్నప్పుడు, "గ్రాంథికం" అనే శైలిని ఓపిక వున్నంత మేరకు రాసేవాళ్లట. అయితే అది చాలావరకు "చదువుకోని వాళ్ల గ్రాంథికం" అంటారు. ఆంధ్ర పత్రిక గ్రాంథికం రాసేది అని చెప్తూనే, ఆంధ్ర ప్రభ వ్యావహారికం రాసేది అని అంటూ, "చాలా పూనిక, చాలా ప్రయత్నం, చాలా పట్టుదల వుంటేనే, ప్రజల ఆదరంతో భాష చెడుతుంది" అని చమత్కరిస్తారు. "రచయితకు భాష కావాలి" అంటూ....పత్రికా విలేఖరికి ఈ లోకంతో సమగ్ర సంబంధం వుంది అని చెప్తారు. "ఈ ప్రపంచం నా అవగాహనకు లోబడి వుండాలి అని కోరుకునే వ్యక్తి ఒక్క పత్రికా విలేఖరి మాత్రమే....విలేఖరికి తగు భాషా పాండిత్యం వుండాలి-వుండి తీరాలి. లేకపోతే ఈ ప్రపంచం వ్యవహారాన్ని పాఠకులకు ఎట్లా చెప్పగలడు?" అని ప్రశ్నించుతాడు.

          "అవ్యక్త కోలాహలం" అన్న పేరుతో తన "విలేఖరి లోకం" పుస్తకానికి ముందు మాట రాస్తూ... " నా విలేఖరిత్వం జారచోరభజనా"....నా విలేఖరిత్వం దేశానికి సేవా?" అని ప్రశ్నించుకుంటాడు కృష్ణ గారు. ఏదేమైనా అది "కోలాహలంగా నిలిచిన అనుభవం" అని చెప్పుకుంటారు.


Friday, August 30, 2013

చిత్తూరు సోదరుల చింతల విభజన: వనం జ్వాలా నరసింహారావు

చిత్తూరు సోదరుల చింతల విభజన
వనం జ్వాలా నరసింహారావు

Please click here:

https://www.youtube.com/watch?feature=player_embedded&v=eYVRLo_ozHo

www.youtube.com
One district. Two state leaders. Two top parties. Two important leaders. Two different views. Two different arguments. Two different styles. Will it One district. Two state leaders. Two top parties. Two important leaders. Two different views. Two different arguments. Two different styles. Will it provide a solution to a crisis or further complicate it? Chief Minister N. Kiran Kumar Reddy on August 29, 2013 warned that political parties or governments that fail to honour people's wishes or take the right decisions will be rejected in a democracy. Though expressed in a subtle way, he made some sensational comments and it remains to be seen how the Congress Central leadership reacts. His comments gained significance in the backdrop of the sharp criticism levelled against Congress president Sonia Gandhi that she favoured state division to get a significant number of seats in Telangana in the next general election. While Principle opposition Leader, Chandra Babu Naidu demanded the resignation of Prime Minister Manmohan Singh for his failure to run the country effectively. The TDP chief also slammed him for his silence on the Samaikhyandhra agitation going on in coastal Andhra and Rayalaseema regions. Why are they so impatient? Are they not responsible leaders? Are they not aware of constitutional process? Or is that they are worried about their own political future? Is it not the responsibility of these leaders to inform the people to maintain peace and calm?, questionsa live News and views debate -- " Chittooru Sodarula Chintala (vi)Bhajana, moderated by Doordarshan National correspondent, V. Ramakanth. Panelits : Jwala Narasimha Rao, Political Analyst; PL Srinivas, Organising Secretary, Telugu Desham Party; Nalla Surya Prakash, YSRCP Leader and Ch.Umesh Rao, Spokesperson, Congress.