Monday, September 24, 2018

మానిఫెస్టోలతో తస్మాత్ జాగ్రత్త : వనం జ్వాలా నరసింహారావు


మానిఫెస్టోలతో తస్మాత్ జాగ్రత్త
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (25-09-2018)

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ రద్దు నిర్ణయం దరిమిలా, తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంతవరకూ అందుబాటులో వున్న సమాచారం మేరకు, ఈ ఏడాది నవంబర్ చివర్లోనో, లేదా డిసెంబర్ మొదటి వారంలోనో ఎన్నికలు జరగే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సమాయుత్తమవుతూనే తమ-తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక రచనలో నిమగ్నమవుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి, ఆ పార్టీ విధి-విధానాలకు అనుగుణంగా దాని లక్ష్యాలను, ఆశయాలను విశదీకరించేదే ఎన్నికల ప్రణాళిక-మానిఫెస్టో. ఇది ఒకరకంగా ఒక వ్రాతపూర్వకమైన వేదిక, ఒక పకడ్బందీ డిజైన్, ఒక విధానం, ఒక మార్గదర్శని, ఒక సిద్దాంతం. ఎన్నికల అనంతరం ప్రజలు గెలిపించిన పార్టీ అధికారంలోకి వస్తే, ప్రభుత్వ పరంగా ఆ పార్టీ ఏమేం చేయబోతున్నదో చెప్పే ఒక సైద్ధాంతిక ప్రకటన మానిఫెస్టో. పోటీ చేస్తున్న రాజకీయ పార్టీ పూర్వాపరాలు ఎన్నికల ప్రణాళిక ద్వారానే తెలుసుకునే అవకాశం వుంది ఓటర్లకు. పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలలో ఏది ప్రజలకు మంచి చేయగలదో విశదీకరించే ఎన్నికల ప్రణాళిక అంశాల ఆధారంగానే ఓటర్ ఎవరికి ఓటు వెయ్యాలనే విషయంలో ఒక నిర్ణయానికి రాగలుగుతాడు. ఏదేమైనా ఎన్నికల ప్రణాళిక రాజకీయ వాగ్దానాల సమగ్ర పట్టిక.

ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్దిష్ట లక్ష్యాలతో కూడి, అమలు చేయడానికి సాధ్యపడే వాగ్దానాలతో, వాస్తవాలకు చేరువగా, ఒక సహేతుకమైన కాలపరిమితిలో నెరవేర్చగల అంశాల పట్టికే మానిఫెస్టో. నెరవేర్చడానికి, అమలుచేయడానికి అనువుగా లేకుండా, ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్పి, ఓటర్లను మభ్యపెట్టడానికి ఉద్దేశించిన మానిఫెస్టోలకు ప్రజాక్షేత్రంలో ఆస్కారం వుండకూడదు. అలాంటివి ప్రజల ముందుకు రానీయకూడదు. ఎన్ని రాజకీయ పార్టీలు, మానిఫెస్టోల కూర్పుల విషయంలో, న్యాయబద్ధంగా, సహేతుకంగా, ప్రజలపట్ల నిబద్ధతతో వుంటాయనేది జవాబు దొరకని ప్రశ్న.

తెలంగా రాష్ట్ర సమితి లాంటి ఏవో కొన్ని రాజకీయ పార్టీలు మినహాయిస్తే, చాలా మటుకు, దురదృష్ట వశాత్తు, నెరవేర్చవీలుకాని, అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చని అంశాలనే ఎన్నికల వాగ్దానాలుగా మానిఫెస్టోలో చేరుస్తున్నాయి మెజారిటీ రాజకీయ పార్టీలు. టీఆరెస్ మాత్రం, ఉదాహరణకు, 2014 ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలను వందకు వందశాతం నెరవేర్చడమే కాకుండా చేయని వాటినెన్నో పథకాలుగా మలచి, ప్రకటించి,  అమలు చేయడం జరిగింది. ఎన్నికల తదనంతరం తమ పార్టీ చేసిన మానిఫెస్టోలోని ఎన్నికల వాగ్దానాలాను, హామీలను పరిపూర్ణంగా విస్మరిస్తున్న ఈ రోజుల్లో, కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి దానికి భిన్నంగా వాగ్దానాల అమలే ధ్యేయంగా పథకాల రూపకల్పన-అమలు చేయడం జరిగింది. కేసీఆర్ అనునిత్యం మానిఫెస్టో కాపీని ఒక పవిత్రమైన పుస్తకం  లాగా తనవద్ద వుంచుకుని మరీ పథకాల రూపకల్పన చేశారు. తెలంగాణా కోసం అలుపెరుగని పోరాటం చేసి, దాన్ని సాధించి, ఎన్నికల బరిలో దిగి, మానిఫెస్టోను ప్రజల అవసరాలకు అనుగుణంగా తయారుచేసి, ప్రజల తీర్పు పొంది, ప్రభుత్వం ఏర్పాటుచేసి, ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారు. ఈ సారికూడా మళ్లీ అదే జరగబోతుందనడంలో అతిశయోక్తి లేదేమో!!! 

ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అదిచేసిన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చిందా? లేదా? అనే విషయంలో పట్టించుకునే నాధుడెవరూ లేరు. రాజ్యంగ పరంగా గణనీయమైన విశేష అధికారాలున్న, పటిష్టమైన రాజ్యంగ వ్యవస్థ కేంద్ర ఎన్నికల సంఘం కూడా, ఇటీవలి కాలం వరకూ, అదికూడా అంతంత మాత్రంగానే, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. ఎన్నికల ప్రణాళికలో అసంబద్ధమైన వాగ్దానాలు చేయొద్దని చెప్పడంలో రాజకీయ పార్టీలను ఒప్పించలేక, నియంత్రించలేక పోతున్నది ఎన్నికల సంఘం. అలా చేస్తే ఓటరును తప్పుదోవ పట్టించినట్లవుతుందని, పట్టించతగదని కూడా ఈసీ చెప్పలేకపోతున్నది. ఇది మారాలి.

జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల ప్రతినిథులతో ఆగస్ట్ 2013 లో ఎన్నికల సంఘం చర్చలు, సంప్రదింపులు జరిపిన దరిమిలా, ఎన్నికల మానిఫెస్టోలకు సంబంధించి కొన్ని సూచనలు, ఆదేశాలు, మార్గదర్శకాలు విడుదలచేసింది ఈసీ. పారదర్శకత దృష్ట్యా, పార్టీ స్థాయికి తగ్గ విధంగా, చేసిన వాగ్దానాలలో విశ్వసనీయత వుండాల్సిన అవసరం నేపధ్యంలో, మానిపెస్టోలో చేసే వాగ్దానాలు అమలు చేయడానికి పడే ఆర్ధిక భారం పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం చెప్పింది. చేసిన వాగ్దానాలు అమలు తీరుతెన్నులను కూడా ఎన్నికల ప్రణాళికలో వివరించాల్సిన అవసరం గురించి ఈసీ పేర్కొన్నది. ఓటర్ల మద్దతు నెరవేర్చగల వాగ్దానాల ఆధారంగా మాత్రమే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓట్లు కోరాలని ఈసీ స్పష్టం చేసింది. రాజ్యంగా విరుద్ధమైన, రాజ్యంగ స్ఫూర్తికి, ఆశయాలకు వ్యతిరేకంగా ఎలాంటి అంశం కూడా మానిఫెస్టోలో పేర్కొనకూడదని ఈసీ నిబంధన పెట్టింది. అంతవరకూ బాగానే వుంది కానీ, దాని ఆదేశాలు అమలు చేయించడం ఎలా అనేది ఆలోచన చేసినట్లు లేదు.

రాజకీయ పార్టీల ప్రతినిథులతో ఈసీ సమావేశం కావడానికి నేపధ్యం, అంతకు కొద్ది రోజుల క్రితం, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో, ఎన్నికల సంఘాన్ని ఆదేశించడమే. ఎన్నికల సంఘం మానిఫెస్టోల విషయంలో మార్గదర్శకాలను రూపొందించి, దాన్ని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగం చేయాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. ప్రజలను-ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎన్నికల ప్రణాళికలో వివిధ రకాల తాయిలాలను ప్రకటించి, “అది చేస్తాం...ఇది చేస్తాం....కొండమీద కోతిని ఇస్తాం....హిందూ మహాసముద్రం పూడ్చి ఇళ్ళు నిర్మిస్తాం” అని చెప్తే, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, స్వేచ్చగా ఎన్నికలు జరగడానికి వీల్లేకుండా వుంటుందని సుప్రీం కోర్టు తీర్పులో అభిప్రాయపడింది.

ఈ నేపధ్యంలో, ఎన్నికల సంఘానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో, మానిఫెస్టో అంశాల విషయంలో మార్గదర్శకాలు రూపొందించి, వాటిని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో పొందుపరచాల్సిందిగా పేర్కొన్నది. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, మానిఫెస్టోలకు సంబంధించి, రాజకీయ పార్టీలను సరైన పద్ధతిలో నియంత్రించే రీతిలో, చట్టసభలు ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇంతైనా దీని విషయంలో పెద్దగా పురోగమనం లేదింతవరకూ.

ఎన్నికల సంఘం ఏ ఒకటి-రెండు సార్లో తప్ప ఎప్పుడూ మానిఫెస్టో అంశాలకు సంబంధించి ఏ రాజకీయ పార్టీనీ ఆక్షేపించిన దాఖలాలు అంతగాలేవు. ఒకసారి, 2016 సంవత్సరం జరిగిన తమిళ నాడు ఎన్నికల్లో, ఏఐడీఎంకే, డీఎంకే పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. బహుశా అలా చేయడం అదే మొదటిసారి (చివరిసారి కూడా కావచ్చు!). మానిఫెస్టోల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను ఆ రెండు పార్టీలు గణనీయంగా పాటించలేదని, దానికి కారణాలేమిటని నోటీసులో ఈసీ ప్రశ్నించింది. వాళ్ల మానిఫెస్టోలలో పేర్కొన్న వాగ్దానాల నిబద్ధతను,  హేతుబద్ధతను శంకిస్తూ, అవి అమలు కావాలంటే పడే ఆర్ధిక భారం ఎలా సమకూర్చుకోవచ్చో వివరణ కోరింది. చివరకు కథ అంతం కావడం మినహా పెద్దగా ఒరిగిందేమీ, జరిగిందేమీ లేదప్పుడు.


ఎన్నికల సమయంలో మానిఫెస్టోల ప్రకటన ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానమే. తమ పార్టీ విధి-విధానాలను, కార్యక్రమాలను, అమలు చేయదలచుకున్న పథకాలను  విస్తారంగా సూచిస్తే ఎవరికీ ఏ అభ్యంతరం వుండకూడదు. అలా కాకుండా ఒక విపరీత దృక్పదంతో-ధోరణితో, ఆచరణ సాధ్యం కాని, అనైతిక వాగ్దానాలు చేసి, తద్వారా ఓటర్లను మభ్యపెట్టి, తప్పుతోవ పట్టించి, అధికారం మీద కన్నేసి, అధికారంలోకి వచ్చిన తరువాత తమ వాగ్దానాలను మర్చిపోయే పార్టీలమీద నియంత్రణ వుండి తీరాలి. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏదైనా పార్టీ గతంలో అధికారంలో కనుక వుండి వుంటే, ఆ పార్టీ ఏ మేరకు దాని ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చిందో విశ్లేషణ జరగాలి. నెరవేర్చక పోయినట్లయితే ఒక రకమైన జరిమానా లాంటిది విధించే వెసలుబాటు వుండాలి. కనీసం, అధమపక్షం, గతంలో ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చని పార్టీ, దరిమిలా వచ్చే ఎన్నికల్లో పోటీలో వున్నప్పుడు, అది ప్రకటించే ఎన్నికల మానిఫెస్టోను ఎన్నికల సంఘం లాంటిది లోతుగా పరిశీలన చేసి, అంగీకరించిన తరువాతే విడుదలకు ఒప్పుకోవాలి.  

ముందస్తుగా ఎన్నికల ప్రణాలికల పరిశీలన అమల్లో వున్న దేశాలున్నాయి. ఉదాహరణకు, భూటాన్ దేశంలో రాజకీయ పార్టీలు ముందస్తుగా తమ ఎన్నికల ప్రణాలికలను ఎన్నికల సంఘం పరిశీలనకు, ఆమోదానికి పంపాలి. దేశ సమగ్రత, సమైక్యత లాంటి వాటికి భంగం కలిగే అంశాలేమన్నా వుంటే వాటిని వడపోసి, తీసేసిన తరువాతే మానిఫెస్టోకు ఆమోదం తెలుపుతుంది ఎన్నికల సంఘం. ఎన్నికల్లో అనైతిక గెలుపుకోసం పాటుపడే ఎలాంటి అంశాలున్నా, అమలు సాధ్యపడనివి వున్నా, మతపరమైన వ్యతిరేకాంశాలున్నా వాటిని తొలగించడం జరిగేది.

ఇంగ్లాడు దేశంలో కూడా ఎన్నికల ప్రణాళిక విషయంలో మార్గదర్శకాలున్నాయి. బ్రిటీష్ ఎన్నికల్లో మానిఫెస్టో ప్రకటన కార్యక్రమం పెద్ద ఎత్తున అట్టహాసంగా నిర్వహిస్తాయి రాజకీయ పార్టీలు. అదొక కీలక ఘట్టంగా భావిస్తాయి రాజకీయ పార్టీలు. రాబోయే ప్రభుత్వ ఎజెండా ఎన్నికల ప్రణాళిక రూపంలో ఓటర్ల ముందుకు వస్తుంది. దాన్ని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విధిగా అమలు చేసి తీరాల్సిందే. బ్రిటీష్ రాజకీయ వ్యవస్థలో మానిఫెస్టోలకు ఒక రకమైన పాక్షిక రాజ్యాంగ ప్రతిపత్తి వుంది. బ్రిటీష్ పార్లమెంట్ దిగువ సభ ఐన హౌజ్ ఆఫ్ లార్డ్స్, ఎలాంటి పరిస్థితుల్లోనూ, ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాన్ని వ్యతిరేకించరాదని, రాజ్యంగా బద్ధమైన సాలిస్బరీ కన్వెన్షన్ నిబంధన విధించింది. బ్రిటన్లో ఎన్నికల మానిఫెస్టోకు అంత శక్తి, అధికారం వుంది.

ఏదేమైనా, ఓటర్లు ఎవరూ, ఏ రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాలికనూ క్షుణ్ణంగా చదవరు. మీడియాలో క్లుప్తంగా వచ్చిన సారాంశాన్ని మాత్రమే చదువుతారు. వాస్తవ దృక్ఫదంతో వ్యవహరించే తెరాస లాంటి ఒకటీ-అరా పార్టీలు మినహాయిస్తే, మిగతా అన్ని మానిఫెస్టోల సారాంశం దాదాపు ఒకే విధంగా వుంటుంది.

అధికారంలో వున్న ప్రభుత్వం వంద రూపాయలు అంటే, అధికారం కోసం అర్రులు చాచే పార్టీ రెండు వందలనడం, వెయ్యి అంటే రెండువేలనడం, బియ్యం ఆరు కిలోలు ఇస్తుంటే ఏడు అనడం, సిల్లీగా, బాధ్యతా రాహిత్యంగా వాగ్దానం చేయడం లాంటి వాటితో అరచేతిలో వైకుంఠo చూపించే రాజకీయ పార్టీల విషయంలో ఓటర్లు అప్రమత్తంగా వుండకపోతే నష్టపోయేది వారే. తస్మాత్ జాగ్రత్త!!!

Sunday, September 23, 2018

లంక కాల్చిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


లంక కాల్చిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు 
సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (24-09-2018)

శత్రువులకు అమితమైన దుఃఖం కలిగించడమే, ఇక తాను చేయవలసిన పని అనీ, అలా చేస్తే, రామకార్యం సులభంగా నెరవేరుతుందనీ, తలుస్తాడు హనుమంతుడు. లంకలోని పౌరులకు బాధకలిగిస్తే, ఈ బాధ రావణుడి మూలాన్నే జరిగిందని, ప్రజలందరూ వాడిపట్ల విరోధం పెంచుకుంటారు కనుక, దానిమూలాన్న, వారిలో వారికి పడక, సీతాదేవిని రాముడికప్పగించమని చెప్పేవారు కొందరుండవచ్చని హనుమంతుడు భావిస్తాడు. రావణుడు వినకపోతే, రాముడి పక్షం వహించేవారు కొందరేర్పడుతారని కూడా అనుకుంటాడు. అందుకే ఈ రాక్షసులకు కొంచెం బాధ కలిగించాలని నిశ్చయించుకుంటాడు.

"అశోకవనాన్ని పాడుచేసాను కనుక, రావణుడికి, వాడి స్త్రీలకు ఇబ్బందికలిగి, సీతను పంపించమని వారు రావణుడికి చెప్పుతారు. రాక్షసులను చంపానుకనుక, వారి సన్నిహితులు, రావణుడిని దూషిస్తుంటారు. సైన్యంలో కొంతభాగం నాశనం చేసాను. వీరికి స్థావరాలైన కోటలు, బురుజులు, మిగిలిన స్థలాలు కూడా పాడుచేయాలి. ఇంకొంచెం ప్రయత్నం చేసి, ఈ నగరాన్ని నాశనం చేస్తే, నేననుకున్న పనులన్నీ అయినట్లే. నేనుపడ్డ శ్రమకు ఫలితం లభించినట్లే!18) నాకుపకారం చేస్తున్న, అగ్నిహోత్రుడికి ప్రత్యుపకారంగా ఇక్కడున్న ఇళ్లన్నీ ఇవ్వడం న్యాయం" అనుకుంటూ ఇళ్లమీద తిరగడం ప్రారంభించాడు.

మెరుపులతో కూడిన మేఘంలా చలించక హనుమంతుడు లంకలోని, ఇల్లిల్లూ, తోటతోటా, మేడమేడా తిరిగి, సర్వం కాల్చేసే కార్యక్రమంలో మునిగిపోయి, ఆనందించసాగాడు. ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, వజ్రనాభుడు, శుకసారణులు, ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతుడు, సూర్యజిత్తు, హ్రస్వకర్ణుడు,  దంష్ట్రుడు, రోమశుడు, మత్తుడు, యుద్ధోన్మత్తుడు, ధ్వజగ్రీవుడు, హస్తిముఖుడు, విద్యుజ్జిహ్వుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, కుంభుడు, బ్రహ్మశత్రువు, నికుంభుడు, యజశత్రువుల ఇళ్ళకు నిప్పుపెట్తాడు. సీతాపక్షం వాడనీ, తన తరఫున ధర్మ మార్గంలో రావణుడితో వాదించాడనీ, విభీషణుడి ఇల్లు మాత్రం తగులపెట్టలేదు. మిగిలిన వారి ఇళ్ళన్నీ కాల్చాడు. ఒకసారి లక్ష్మణుడు హనుమతో అంటాడు, విభీషణుడు ధర్మాత్ముడని శూర్పణఖ రాముడితో చెప్పిందని. తాను స్వయంగా గమనించాడు రావణ సభలో  విభీషణుడు ధర్మబద్ధంగా తనకు హాని కలిగించవద్దని చెప్పిన సంధర్భం కూడా. ఆ తర్వాత వెలలేని బంగారు మణుల సొమ్ములతో అలంకరించబడిన రావణుడి ఇంటికీ చిచ్చు పెట్టాడు.

ప్రళయకాల మేఘధ్వనిలాంటి, సింహనాదధ్వని చేస్తూ, బలంగా గాలి వీస్తుంటే, విజృ౦భించిన హనుమంతుడు, ఇల్లిల్లూ తగులబెట్టడంలో నిమగ్నమైపోయాడు. లంకా నగరమంతా కాలిబూడిదైపోయి, నేలకూలుతున్న పెద్దపెద్ద మేడలతో నిండిపోయింది. మునుపు రావణుడు తనను పెట్టిన బాధలకు బదులు తీర్చుకుంటానికి అగ్నిహోత్రుడే కోతిరూపంలో వచ్చాడేమోనని, అరిచే రాక్షసుల ధ్వనితో ఆకాశం నిండిపోయింది. కొన్దరు రాక్షసస్త్రీలు తమను అగ్నిజ్వాలలు చుట్టుముట్టుకోగా, తల వెంట్రుకలు విరబోసుకుని, పెద్దగా ఏడ్చుకుంటూ, చంటిపిల్లలను రొమ్ముకు హత్తుకుని, మేడలమీదనుండి కింద పడుతుంటే, చూసేవారికి, మేఘాలనుండి మెరుపులు రాలిపడ్తున్నాయా అన్నట్లుంది. అగ్నివేడిమికి వజ్రాలు, పగడాలు, వైడూర్యాలు, వెండి, బంగారం, ముత్యాలు, లోహాలతో చేసిన ఇళ్లు, కరిగి ప్రవహిస్తుంటే చూసాడు హనుమంతుడు.

ఎన్నిళ్లుకాలినా, ఎంత తగులబడినా, భూమిమీద పీనుగులెన్ని పడ్డా, ఆయనకు తృప్తి కలగలేదు. గాలెంత గట్టిగా వీచినా శ్రమ కలుగలేదు. అగ్నిజ్వాలలు మోదుగుపూల కాంతితో ఒకచోట, బూరుగుపూల మాదిరిగా మరోచోట, కుంకుమ నెత్తురులా మరొక్కచోట కనిపించాయి. త్రిపురాలను కాల్చిన రుద్రుడిలా, హనుమంతుడు లంకా దహనం చేస్తుంటే, ఆ మంటలు పెరిగి త్రికూట పర్వతం వరకూ వ్యాపించాయి. అగ్నిజ్వాలలు ఆకాశాన్నంటుతుంటే, రాక్షసుల శరీరాలనే నేయిలో ఆ జ్వాలలను, పొట్టిగా, పొడవుగా, నాలుగు ప్రక్కలా వ్యాపించేటట్లు చేస్తున్నప్పుడు, గాలికూడా సహాయపడింది. హనుమంతుడప్పుడు విజృoభించి, కోటి సూర్యకాంతితో పిడుగుపడ్డట్లు చిటపట ధ్వని చేస్తూ, ఎక్కడ చూసినా తానే కనిపించసాగాడు. మంటలు మోదుగుపూల గుత్తుల్లా, నిప్పు చల్లారిన ప్రదేశంలోని సెగలు నల్లకలువల కాంతిలా కనిపించసాగాయి.

ఇదన్తా జరుగుతుంటే, జ్ఞానులైన రాక్షసులు, అగ్నిజ్వాలలకు దగ్ధమై పోయిన చెట్లను, ఇళ్లను, వనాలను, పక్షులను, ఇతర జంతువులను, లంకానగరాన్నీ చూసి దుఃఖపడ్తూ ఎవరీ వానరుడని ఆలోచనలో పడ్డారు. ఇతడేమన్నా ముప్పైమూడుకోట్ల దేవతలకు ప్రభువై, వజ్రాయుధాన్ని ధరించే ఇంద్రుడా? యముడా? చంద్రుడా? అగ్నిదేవుడా? కుబేరుడా? వరుణుడా? సూర్యుడా? వాయుదేవుడా? రుద్రుడా? అని భయపడ్తారు. వీళ్లల్లో ఎవరో ఒకరై వుండాలేకాని, ఇది సామాన్యకోతి అనటానికి వీల్లేదు అనుకుంటారు. అయితే వీరందరూ లోగడ రావణుడి చేతుల్లో ఓడిపోయినవారైనందునా, పీడించబడ్డందునా, వీరెవరూ కాకపోవచ్చునని కూడా అనుకుంటారు. ఒకవేళ సృష్టికారకుడు చతుర్ముఖ బ్రహ్మ, తనిచ్చిన వరాలబలం వల్ల గర్వంతో చేయకూడని పనులు చేస్తున్న రావణుడికి బుధ్ధి చెప్పటానికీ, రాక్షసులను నాశనం చేయటానికీ, ఇలా వచ్చాడేమోనన్న అనుమానం కూడా కలిగింది. అదీకాదనుకుంటారు కాసేపు.


బ్రహ్మరుద్రాదులు, ఇంద్రాది దిక్పాలకులు, ఎవరూ ఇంత పని చేయలేరని తీర్మానించుకుంటారు. అవ్యక్తమై, (బాహ్యేంద్రియ గోచరం కానిది) అసమానమై, అనంతమై, ఇలా వుంటుందని వూహించలేనిదైన మహావిష్ణుతేజం వానరరూపంలో వచ్చిందని భావిస్తారు. ఈ విష్ణుతేజం శక్తి అచింత్యమై (మనస్సులో ఆలోచించి తెలుసుకునేందుకు సాధ్యపడనంత), అత్యత్భుతమైన పనులు చేయడంకొరకూ, సర్వరాక్షస సంహారం, నాశనం చేసేందుకూ, వచ్చిందని నిశ్చయించుకుంటారు.

హనుమంతుడి మూలాన అగ్నిజ్వాలలకు కాలిపోయిన గుర్రాలు, ఏనుగులు, రథాలు, జనాలు, పక్షులగుంపులు, మృగాలు, వృక్షాలున్న లంకా నగరం, శోకసముద్రంలో మునిగి ఏడుస్తుంది దీనాతిదీనంగా. చిటపట ధ్వనులు చేసుకుంటూ, కాలిపోయి, ఏడుపు ధ్వనులతో నిండిపోయి, హనుమంతుడి కోపాగ్నికి నాశనమైపోయిన లంకా నగరమ్ శాపగ్రస్థురాలిగా దీనమై కనపడింది. తత్తరపాటుతో భయపడి, దుఃఖించే రాక్షసమూకలతో, మండుతున్న మంటల గుర్తులతో, లంక, ప్రళయకాలంలో బ్రహ్మ కోపానికి నశిస్తున్న ప్రపంచంలా వుందప్పుడు.

వనాన్నిపాడుచేసి, రాక్షసులను చంపి, మేడలు, మిద్దెలు నేలమట్టం చేసి, ఇంకా మండుతున్న తోకతోనే, సూర్యుడిలాగా వెలుగుతూ, హనుమంతుడు త్రికూటపర్వతాన్ని చేరుకుని, శ్రీరాముడిని చూడటానికి పోదామనుకుంటాడు. ఆయన చేసిన ఆశ్చర్యకరమైన పనికి, దేవతలు, గంధర్వులు, నాగులు, మునులు, ఆకాశ సంచారులు మిక్కిలి సంతోషపడ్డారు. గంధర్వులు, సిధ్ధులు ఆశ్చర్యపడి కాలిబూడిదైన లంకను చూసారు. అగ్నిజ్వాలలతో చుట్టుకున్న ఆంజనేయుడి తోకచూసి, అగ్నిహోత్రుడే వచ్చాడని భయపడ్డాయి భూతాలు. మునులు, దేవతలు, పన్నగులు, యక్షులు, ఆంజనేయుడు చేసిన పనికి ఎంతో సంతోషించి "మేలు-మేలు" అని ఆయన్ను పొగిడారు.

Saturday, September 22, 2018

పంచవటీ స్థల వివాదం...అసలు చరిత్ర ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-27 : వనం జ్వాలా నరసింహారావు


పంచవటీ స్థల వివాదం...అసలు చరిత్ర
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-27
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (23-09-2018)

పంచవటి స్థలం ఏదనే వివాదం చిరకాలంగా అనేకమందిని బాధిస్తున్నది. భద్రాచలం దగ్గరున్న పర్ణశాల అని కొందరు, నాసిక దగ్గర అని మరి కొందరు, అభిప్రాయ పడుతున్నారు. వీటిల్లో ఏది సత్యమో అనే విషయాన్ని రామాయణాన్ని బట్టి, స్థలశోధనాన్ని బట్టి నిర్ధారించాల్సి వుంది. పంచవటి గోదావరీ తీరంలో వుందనే విషయం నిర్వివాదాంశం. పంచవటి దగ్గర గోదావరి నది ఉత్తరాన్నుండి దక్షిణానికి పారుతూ వుండాలి. ఎందుకంటే రామలక్ష్మణులు సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ గోదావరీ తీరాన వెళ్లారు. ఇలా వెళ్తున్న రామలక్ష్మణులకు దక్షిణ దిక్కుగా సీత పోయిందని మృగాలు, పక్షులు చూపాయి. అప్పుడు రామలక్ష్మణులు నేరుగా దక్షిణానికి పోకుండా, నైఋతి దిశగా పోయి, గోదావరీ తీరంలో జటాయువును చూశారు. ఈ కారణాన, గోదావరి నది జటాయువు పడ్డ స్థలం దాకా, దక్షిణాభిముఖంగా పారుతుండాలి. జటాయువుకు గోదావరీ జలాలతో రామలక్ష్మణులు నివాపాలు విడిచినందున వారున్న స్థలం గోదావరి తీరమే అయ్యుండాలి. ఇక్క్డినుండి రామలక్ష్మణులు నైఋతిదిశగానే మూడు కోసుల దూరం పయనించారు. ఇంతదాకా తూర్పుగా పోవడానికి ఏరు అడ్దం వస్తుంది. కాబట్టి తూర్పుగా పోలేదు. కొంత తూర్పుగా పోతేనే కాని జటాయువు చెప్పిన దక్షిణ మార్గం కనిపించదు. కాబట్టే అక్కడినుండి మూడు కోసులు తూర్పుగా పోయారనుకోవాలి. ఇప్పుడు ఇప్పటి భద్రాచలం దగ్గర, గోదావరి నదికి దక్షిణాన వున్నారు వారు. ఇలా వచ్చినందున వారికి గోదావరి దాటాల్సిన పనిలేదు. ఈ కారణాన పంచవటి గోదావరి నదికి పడమటి తీరాన వున్నదని అంగీకరించాలి. తూర్పునే వుండి వున్నట్లయితే, గోదావరి దాటే వుండాలి. ఆ విషయాన్ని వాల్మీకి చెప్పలేదు.

ఇప్పటి పర్ణశాలే పంచవటి అని అనుకుంటే, వారొకవేళ నైరుతి దిక్కుగా ప్రయాణం చేసే వుంటే, ఏటి పాలు అయ్యేవారు. భద్రాచలం దగ్గర ఏరు దాటినట్లు కొందరు రాశారుకాని, అది ఆలోచించి రాసిన రాతకాదు. ఇప్పుడు అందరూ అనుకుంటున్న పర్ణశాల కాదు కాని, దానికి ఎదురు ఒడ్డున, చక్కగా పంచవటి వుండేదని చెప్పొచ్చు. అలాగే ఒకాయన నాసికను పంచవటి అని పేర్కొన్నారు. అక్కడి నుండి దక్షిణంగా వచ్చినట్లు చెప్పారాయన. ఇది రామాయణానికి విరుద్ధం. పంచవటి గోదావరీ నదీ పశ్చిమ తీరాన వున్నదనడానికి స్థలం ఆధారంగా వుంది. పర్ణశాలకు ఎదురుగా రథగుట్త అనేదొకటి వుంది. ఇక్కడ రావణాసురుడు తన రథాన్ని దాచిపెట్టాడని అంటారు. ఎందుకంటే సీతాపహరణ సందర్భంలో, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుని రాగానే రథం సిద్ధంగా వుంది అని చెప్పడం జరిగింది. సమీపంలో అది కనపడనందున ఆ పని కొనసాగింది కాని, ఏటికి ఒక ఒడ్డున రథం; సీత, రావణుడు మరో ఒడ్డున వుంటే ఇది సాగి వుండేది కాదు. కాబట్టి పంచవటి పడమటి దిక్కునే వుండాలి. సీతాపహరణం ఆ పక్కనే అయి వుండాలి. అంతే కాదు....దీనికి సమీపంలోనే, సీత గుట్టలని పెద్ద పర్వతం వుంది. ఇక్కడ ఖరుడు యుద్ధానికి వచ్చినప్పుడుసీతాలక్ష్మణులు వున్నారని, ఆ కారణాన ఆ గుట్టలకు ఆ పేరు వచ్చిందని అంటారు. కాదనడానికి కారణం లేదు. తూర్పు ఒడ్డున వున్నట్లయితే, ఏరు దాటి పోయి, అక్కడి గుట్టల్లో వుండాల్సి వచ్చేది. ఈ గుట్ట కింద పడమటి దిక్కుగా పెద్ద బయలు ప్రదేశం వుంది. అక్కడ పద్నాలుగువేల రాక్షసులు నిలిచి యుద్ధం చేయగలిగే పెద్ద స్థలం వుండేది. సీతాలక్ష్మణులకు ఇక్క్డ జరిగిన యుద్ధం గుట్ట మీదనుండి కనపడేది.


మరొక చోట వాల్మీకి రామాయణంలో పద్మ సరస్సు పంచవటికి దగ్గర్లోనే వుందని చెప్పడం జరిగింది. అది ఇప్పటిదాకా వుందో, లేదో, చెప్పడం సాధ్యపడదు కాని ఇలాంటి పెద్ద చెరువొకటి వున్నట్లు అక్కడుండే కోయవాళ్లు చెప్తుంటారు. ఈ చెరువుకూ, గోదావరి నదికి, మధ్య పంచవటి వుంది. వర్షాకాలంలో ఏటి నీళ్లు బురదగా వున్నప్పుడు ఈ చెరువు నీళ్లు సీతారామలక్ష్మణులు వాడుకునేవారు. ఇప్పటి పర్ణసాలకు దక్షిణంగా గోదావరీ తీరంలో భద్రాచలానికి వచ్చే తోవలో, దుమ్మగూడెం అనే వూరుంది. దీనికి ఎదురుగా ఏటికి ఆవలి ఒడ్డున ఒక చిన్న గుట్ట వుంది. దీని దగ్గరలోనే జటాయువుకు, రావణుడికి యుద్ధం జరిగిందని రామాయణంలో వుంది. ఇప్పుడు గోదావరి నది తూర్పు ఒడ్డు కోసుకొని వస్తున్నది. ఇప్పటి ఏటి మధ్యలో దుమ్మగూడేనికి చెందిన కొంత భాగం వుండేదట. అక్కడ అలా చూసిన వారు ఆంధ్రవాల్మీకికి చెప్పారా విషయాన్ని. వాస్తవానికి ధూమగూడెమే దుమ్మగూడెం అయింది. ఆ గుట్ట దగ్గరే జటాయువుకు సంస్కారాలు చేశాడు శ్రీరాముడు.

ఇప్పటి హంపే పంప అనీ, అక్కడే పర్ణశాల వున్నదనీ, చెప్పడానికి ఒక నిరాకరించలేని ప్రబల కారణం వుంది. రామలక్ష్మణులు లంకకు పోయేటప్పుడు ఏ మార్గంలో వెళ్లినా, లంక నుండి తిరిగొచ్చేటప్పుడు విమానాన్ని చక్కగా వచ్చేట్లు చేశారు కాని, వంకర-టింకరగా పోలేదనేది స్పష్ఠం. లంక నుండి సముద్రం దాటిన తరువాత, రామేశ్వరం దగ్గరనుండి, అయోధ్యకు వెళ్లారనేది అందరూ అంగీకరించిందే. అలాంటప్పుడు ఎడమవైపున కిష్కింద, కుడివైపున పంచవటి వుండి వుండాలి. ఈ రెండు స్థలాలను రామచంద్రమూర్తి సీతాదేవికి చూపించాడు. ఈ మార్గానికి, నాసికకు సంబంధమే లేదు. కాబట్టి పంచవటి నాసిక కాదు...కావడానికి వీల్లేదు. నాసిక అనేది మొదటి పేరు కాదనీ, నవశిఖ అనేది నాసిక అయిందనీ, పురాణాలలో ప్రసిద్ధికెక్కిన నాసిక శూర్ఫణకదే అయినందువల్ల ఆ కథకు, దీనికి ముడిపెట్టారని కూడా కొందరు రాశారు. నాసిక పంచవటి కాదనడానికి మరికొన్ని కారణాలున్నాయి.

సీతారామలక్ష్మణులు చిత్రకూటం నుండి దక్షిణంగా ఋక్షవంతానికి వచ్చి, అక్కడనుండి, పశ్చిమాభిముఖంగా నాసిక చేరినట్లు కొందరంటారు. వాళ్లు చెప్పిన మార్గంలో వింధ్యపర్వతాన్నే కాకుండా, నర్మద, తపతీ నదులను దాటి, విదర్భ గుండా నాసికలోకి పోవాల్సి వుంటుంది. ఇది చాలా దుర్గమ మార్గం. అదీ కాకుండా, వాల్మీకి ఎక్కడా, సీతారామలక్ష్మణులు వింధ్యనూ, నర్మదా తపతులను దాటినట్లు చెప్పలేదు. వారు దాటే వుంటే ఆ సుప్రసిద్ధ నదుల గురించి వాల్మీకి తప్పక రాసేవాడే. రామలక్ష్మణులు దక్షిణానికి వచ్చి, ఆ తరువాత ఆగ్నేయంగా కిష్కింధకు వచ్చారనడం రామాయణానికి ప్రత్యక్ష విరుద్ధం అనాలి. వాస్తవానికి రామలక్ష్మణులు నైఋతీ మూలగా, ఆ తరువాత కొంత మేరకు నైఋతిగా పోయి, అక్కడనుండి తూర్పుగా పోయి, కబంధుడిని చంపి, అక్కడనుండి మళ్లీ పడమరగా పోయి, పంప (తుంగభద్ర) చేరి అక్కడికి పడమర వున్న శబరి గుహకు పోయారు. జటాయువు గుట్ట దగ్గరనుండి నైఋతిగా వస్తేనే కిష్కింధకు రాగలరు. అలా కాకుండా కొందరు చెప్పినట్లు ఆగ్నేయ మూలగా పోయివుంటే, సముద్ర తీరానికి చేరేవారే కాని, కిష్కింధ చేరకపోయేవారు. ఆగ్నేయ మూలగా ప్రయాణం చేసినట్లు రామాయణంలో ఎక్కడా ఒక్క మాటైనా లేదు. అలాగే భద్రాచలం దగ్గర ఉష్ణ గుండం వుందనడం, సీతాదేవి స్నానం చేసేదనడం, రేకపల్లె దగ్గర జటాయువు రెక్క పడిందనడం బహుశా కల్పితాలు కావచ్చు.

ఓటు నమోదు బాధ్యత ఓటరుదే : వనం జ్వాలా నరసింహారావు


ఓటు నమోదు బాధ్యత ఓటరుదే
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (23-09-2018)

లక్షలాది ఓటర్లను జాబితాలో లేకుండా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమనీ, ఓటు హక్కును ఫణంగా పెట్టారనీ, అలాంటప్పుడు ఎన్నికలు స్వేచ్చాయుతంగా, నిష్పాక్షికంగా జరిగినట్లు ఎలా అవుతుందనీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేదో ప్రభుత్వ తప్పిదమన్నట్లుగా, దీనికంతటికీ ప్రభుత్వాన్నే బాధ్యత వహించమన్న రీతిలో మాట్లాడడం, ప్రశ్నించడం హాస్యాస్పదం.  న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నారు వీరిలో కొందరు. ఇదిలా వుంటే, కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తుల రూపంలో విశేష స్పందన వస్తున్నదనీ, స్పెషల్ డ్రైవ్ ముగిసేదాకా ఈ ధోరణి కొనసాగవచ్చనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి పదిరోజుల ముందు వరకూ కూడా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ఆయన ప్రకటించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయోజనులందరూ ఓటరుగా చేరడానికి వందరకాల వెసలుబాటు కలిగించింది మన రాజ్యాంగం. ఇవేవీ తెలుసుకోకుండా అర్థం-పర్థం లేని వ్యాఖ్యానాలతో వక్రభాష్యం చెప్పి ప్రభుత్వాన్ని విమర్శించడం తగదేమో!!

          ఓటరు నమోదుకు రకరకాల సూత్రాలు, పద్ధతులు, నియమ-నిబంధనలు వున్నాయి. ఎలెక్టోరల్ వ్యవస్థలో భాగంగా అంచలంచల హైరార్ఖీ-సోపానక్రమం మన రాజ్యాంగంలో పొందుపరచబడింది. అత్యున్నత స్థానంలో ఎన్నికల సంఘం వుండగా, ఆ తరువాత వరుస క్రమంలో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల దికారి, ఎన్నికల నమోదు అధికారి, సహాయ ఎన్నికల నమోదు అధికారి...ఇలా బూత్ స్థాయి అధికారి దాకా ఆ సోపానక్రమంలో భాగమే. ఎవరెవరికి ఎన్నికలపరంగా ఎలాంటి బాధ్యత అప్పగించాలనే నిర్ణయం ఎన్నికల సంఘానిదే కాని ప్రభుత్వానిది కానేకాదు. రాష్ట ఎన్నికల అధికారిగా కాని, అదనపు-సంయుక్త ఎన్నికల అధికారిగా కాని, ఎవరిని నియమించాలి అనే నిర్ణయం కూడా కేంద్ర ఎన్నికల సంఘానిదే.  ఎన్నికలకు సంబంధించి అధికార సోపానక్రమంలో సంబంధిత అధికారి తీసుకునే నిర్ణయం పూర్తిగా రాజ్యంగ బద్ధమైనదే అవుతుంది కాని ప్రభుత్వం తీసుకునేది కాదు. ఓటరును చేర్పించడం అయినా, నిబంధనల ప్రకారం తొలగించడం అయినా ఎన్నికల సంఘానిదే కాని ప్రభుత్వానిది కాదు. అయినదానికీ-కానిదానికీ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సరైంది కాదు.

          ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 15 ప్రకారం, ప్రతి నియోగాకవర్గానికి ఒక ఓటర్ల జాబితా తయారుచేయాలి. దీన్ని ఎన్నికల సంఘం ప్రత్యక్ష పర్యవేక్షణలో, మార్గదర్శకత్వంలో రూపొందించడం జరుగుతుంది. ప్రభుత్వ ప్రమేయం వుండదు. ప్రభుత్వంలో వున్న పార్టీ, అర్హులైన తమ పార్టీవారిని చేర్పిమ్చుకునే హక్కుంది కాని, తన ప్రత్యర్థ పార్టీలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించే అవకాశమే లేదు. అలా జరగడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఒక స్వేచ్చాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఓటరు నమోదు కార్యక్రమం సక్రమంగా జరగడం ఎంతైనా అవసరం. దాన్ని ఎవరూ కాదనలేరు. ఓటరు నమోదు కార్యక్రమంలో లోటుపాట్లు జరుగుతే దాని ప్రభావం ఎన్నికలమీద పడకతప్పదు. అది ఏ రూపంలోనైనా జరగవచ్చు. దొంగ ఓట్లు పడడానికి కానీ, ఓటరు కానివారు ఓటువేయడానికి కానీ ఇది దోహదపడవచ్చు. ఓటరు నమోదు కార్యక్రమానికి బాధ్యులైన అధికారులు తత్సంబంధిత చట్టాలను, నియమ-నిబంధనలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని వుండితీరాలి. వీరంతా ఎన్నికల సంఘానికి చెందిన వారే. ప్రభుత్వానికి ఈ ప్రక్రియలో నేరుగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం వుండదు. వుండకూడదు కూడా. తప్పొప్పులకు ప్రభుత్వ పరంగా బాధ్యత లేదు. అంతా ఎన్నికల సంఘమే చూసుకుంటుంది. అందుకే ఎన్నికల సంఘానికి చెందిన అధికారులు ఆచి-తూచి, అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ నమోదు ప్రక్రియను చేపట్టి పూర్తి చేస్తారు.

          ఎన్నికలలో ఓటు ఉపయోగించుకోగల హక్కున్నవారితో కూడిన ఓటర్ల జాబితా తయారు చేయడానికి, దానికొరకు అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయించడానికి, ఒక స్వతంత్ర ప్రతిపత్తి, హోదాకల కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ బాధ్యతను అప్పగించింది రాజ్యాంగం. రాజ్యాంగంలోని  324 (1) ప్రకరణను అనుసరించి, ఈ నమోదు కార్యక్రమ పర్యవేక్షణ, మార్గదర్శకత్వం ఎన్నికల సంఘానిదేనని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నది. భారతదేశంలో ఓటరు నమోదుకు సంబంధించి, భారత పార్లమెంట్ 1950 లో ఆమోదించిన ప్రజాప్రాతినిధ్య చట్టం, 1960 సంవత్సరం నాటి ఓటర్ల జాబితా తయారీ-సవరణ విస్పష్టమైన సూచనలు, ఆదేశాలు చేశాయి. తదనుగుణంగానే ఈ యావత్తు కార్యక్రమం కొనసాగుతుంది. ఓటరు నమోదు ప్రక్రియ అనేది కేవలం ఏ ఒక రోజో-వారమో-నెలో-సంవత్సరం పాటో మాత్రమే జరిగే వ్యవహారం కాదు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఏటేటా ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు-చేర్పులు, కూర్పులు జరుగుతూనే వుంటాయి. జనవరి నెల ఒకటో తేదీ ప్రామాణికంగా  ఏటా ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంటుంది. జాబితా తయారవగానే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి, ప్రజల అభ్యంతరాలకు, అవసరమైన మార్పులేవన్నా వుంటే అవి చేయడానికి, బహిర్గతం చేస్తుంది ఎన్నికల సంఘం. ఇదంతా పూర్తి పారదర్శకతతో జరిగేదే. ఎవరైనా, ఏ రకమైన సవరణను కోరే అధికారం వుంటుంది. అలాంటప్పుడు లక్షల సంఖ్యలో తొలగించారని చేసే ఆరోపణలకు ఆస్కారం, తావు లేనే లేదు. ఏ స్థాయిలో కూడా ప్రభుత్వ జోక్యం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వుండనే వుండదు.


          ఇంతకుముందే చెప్పినట్లు, మన దేశంలో, బహుశా మరికొన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లో, ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సు నిండడం అనేది ఒక కీలక మలుపు. అప్పటికే వారు వయోజనులవుతారు. మౌలికమైన ఎన్నో హక్కులు-బాధ్యతలు మనకు హటాత్తుగా సంక్రమిస్తాయి. అన్నింటికన్నా ప్రధానమైన హక్కు-బాధ్యత ఓటరుగా నమోదు కావడం, తద్వారా ఓటింగు హక్కును ఉపయోగించుకోవడం. అంటే మన దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దే నాయకులను ఎంచుకునే హక్కు, తద్వారా, మన దేశ భవిష్యత్ లో భాగస్వాములయ్యే హక్కు 18 సంవత్సరాల వయస్సు నిండగానే లభిస్తుంది. ఇదొక రకంగా కష్టతరమైన బాధ్యత కూడా. “ఈ దేశాన్ని మార్చడం మన తరం కాదులే” అని విరక్త వాదన చేయకుండా ఓటింగులో పాల్గొని, మనవంతు సహకారాన్ని దేశ అభ్యున్నతికి అందించడానికి ఓటరుగా నమోదు కావడం అత్యంత అవశ్యం. ఎప్పుడో-అప్పుడు ఎన్నికల సంఘానికి చెందిన అధికారులు రాకపోతారా...మనల్ని ఓటరుగా నమోదు చేయకపోతారా...అని ఎదురు చూడకుండా, 18 సంవత్సరాలు నిండుతూనే, మనంతట మనం ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఇది మన హక్కు అని భావించాలి. ఎన్నికల తేదీ ప్రకటించగానే నాకు ఓటు లేకుండా చేసారని పిర్యాదు చేయకూడదు.

          మనది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య మనుగడ ప్రజాశక్తి మీదే ఆధారపడి వుంది. మన నిత్య బిజీ కార్యక్రమం నుండి కొంచెం ఓపిక-తీరిక చేసుకుని, ముందు ఓటరుగా నమోదు చేయించుకుని, ఓటర్ల జాబితాలో వుందా-లేదా అనేది నిర్ధారణ చేసుకుని, లేకపోతే కారణాలు తెలసుకుని, నమోదు అయ్యేదాకా-పేరు కనపడేదాకా ఆ పనిమీదే వుండి, ఎన్నికలప్పుడు మరికొంత తీరిక చేసుకుని ఓటు హక్కును ఉపయోగించుకున్నప్పుడే మనం మన కర్తవ్యం నేరవేర్చినట్లు. దేశాభ్యున్నతిలో భాగస్వామ్య పౌరుడిగా, మార్పు కారకుడి (కారకురాలి) గా కావడానికి ఇదే మార్గం. మనం వేసే ప్రతి ఓటు, మన గ్రామ, మండల, నియోగకవర్గ, మన నగర, మన జిల్లా, మన దేశ పాలనకు, స్థానిక-జాతీయ అంశాల-సమస్యల పరిష్కారానికి ప్రభావితం చేస్తుంది. ఓటుకు వుండే ఇలాంటి నిర్ణయాధికారం, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను అవసరమైనప్పుడు నిలదీయడానికి, అవకతవకలకు-మంచీ చెడులకు బాధ్యులను చేయడానికి, ఉపయోగపడుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైంది, మన గొంతు వినిపించే వీలు, దానికి విలువ ఇవ్వాల్సిన అవసరం కలిగిస్తుంది ఓటు. మన ఒక్క ఓటు ఒక్కోసారి నిర్ణయాత్మకమైన ఓటు కావచ్చు కూడా. అందుకే, మన ఓటు జాబితాలో లేదని పిర్యాదు చేయడం కన్నా, వుండేట్లు చూసుకోవడం మన కనీస బాధ్యత. రాజకీయ పార్టీలు కూడా పిర్యాదుకిచ్చే ప్రాధాన్యం ఓటరుగా చేర్పించడానికి ఇవ్వాలి.

          ఓటరుగా నమోదు చేయించుకున్న తరువాత అనేక కారణాల వల్ల మనం ఇల్లు మారవచ్చు...వూరు మారవచ్చు. అలాంటప్పుడు, మారిన జాగాలో మనకు ఓటు వుండాలంటే, మనమే బాధ్యత తీసుకుని చిరునామా మార్చుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘానికి తెలియచేయాలి. చివరి క్షణంలో ఓటు లేదే అని చింతించకూడదు. దానికి కూడా ఒక నిర్ధుష్టమైన విధానం వుంది. ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టకుండా మనమే ఆపని చేసుకుంటే మంచిది. చిరునామా మారిందా? లేదా? అనేది కూడా మనం నిర్ధారణ చేసుకోవాలి. ఐడీ కార్డు (దీన్నే ఓటరు ఫోటో గుర్తింపు కార్డు లేదా ఎపిక్ అంటారు) కూడా పొందడానికి విధానం వుంది. అది మన ఇంటికి రాలేదే? అని ఎదురు చూడకుండా ఈ-సేవ కేంద్రానికి పోయి తెచ్చుకుంటే మంచిది. మనం ఓటు వేయడానికి ఎన్నిరకాల అర్హత పొందాలో, అన్నీ మనం చేసుకోవడం మంచిది.

          ఓటరుగా నమోదు చేసుకోవడానికి పోస్టు ద్వారా కాని, ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేసుకుని ఫార్మ్ 6 నింపి ప్రధాన ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. మన పేరు నమోదు అయిందా? కాలేదా? అని తెలుసుకోవడం కూడా చాలా తేలిక. మన ప్రాంత ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి దగ్గర కానీ, ఆన్ లైన్లో కానీ చూసుకోవచ్చు. మన పేరు లేకపోతె సోపానక్రమంలో వున్న ఏ అధికారినైనా కలిసి ఫిర్యాదు చేసి సరిదిద్దుకోవచ్చు. ఇన్ని వెసలుబాట్లు వున్నప్పుడు ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని నిందించడం సరైంది కాదు. వాస్తవానికి రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని నిందించే బదులు, ఒక నిరంతర ప్రక్రియగా, ఓటు హక్కుకు అర్హులైన 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతిఒక్కరినీ కలిసి వారికి ఓటరు నమోదు విషయంలో చైతన్యం కలిగించి, ఓటరుగా చేర్పించడం మంచిది. ప్రతిదానికీ ప్రభుత్వాన్ని నిందించడం సబబు కాదు. ముసాయిదా ఓటర్ల జాబితామీద అభ్యంతరాలను, ప్రతిపాదనలను తెలిపేందుకు, ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువును (సెప్టెంబర్ 25), ఓటరును చైతన్యపరచడానికి  వినియోగించుకోవాల్సిన విషయాన్ని మరచి, బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలి. అర్హత కలిగిన ప్రతిఒక్కరినీ, ఒకవేళ ఈ పాటికే ఓటరుగా వారి పేరు జాబితాలోకి ఎక్కకపోతే, తక్షణమే వారితో దరఖాస్తు చేయించే కర్తవ్యం వందశాతం రాజకీయ పార్టీలదే.

Strategy and credibility for success : Vanam Jwala Narasimha Rao


Strategy and credibility for success 
Strategy, credibility key to success in elections
Vanam Jwala Narasimha Rao
Millennium Post, New Delhi (24-09-2018)
The Hans India (23-09-2018)

Elections to the Telangana State Assembly are due earlier than expected in view of dissolution of the House. Every political party is busily engaged in drafting its own strategy. While the party in power, the Telangana Rashtra Samithi, is all set to contest on its own, without any alliance with any party, the opposition parties led by Congress are forming a united front on the name of Mahakootami-the Grand Alliance. All these parties that are diametrically differing with each other, with a one point program to defeat TRS are bonding. For them its not people’s interest that matters but their own political interest. Political analysts and number of surveys, however, predict a landslide victory for TRS notwithstanding the presence of a Grand Alliance.

Political Parties appeal the voters with typical slogans in their manifestos. In earlier national and state elections too we heard slogans like “Garibee Hatao”, Two rupees kilo rice”, “free power”, “democracy or dictatorship?”, “stable government”, “Total prohibition”, no matter whether they won them the election or not. After winning the poll and forming the government, they might or might not have fulfilled the promises made in manifestos.

Convincing the voter with credibility of slogans is very crucial and important. This presupposes a political strategy. Already for the forthcoming assembly elections, couple of parties have announced in advance their exorbitant promises that would form part of manifesto. Absurd promises like “River Krishan and River Godavari will be dewatered and drained to construct houses for poor” are also being made by some parties. They promise to waive the agriculture loans to a tune of Rs 2 lakhs, as a onetime payment and in one go, unaware of the burden of thousands of crores involved in it, which literally meant to do away with every payment either for development or for welfare and even deferring payment of salaries of employees for few months!!! Such promises, without considering the possibility and feasibility shall be checked and disallowed by the Election Commission. Voters however are examining keenly the credibility of promises and assessing the capability of parties to fulfil the promises.


Whether it is an individual or an organization or a political party or for any non-political activity, as long as it has an aim and objectives, to achieve them, it requires a meticulous action plan which in scientific terms is known as Strategy. For every political party, sometimes even unmindful of good or bad, strategically moving forward is a routine business. Even a smallest mistake may lead to severe hardship. Perhaps, as part of such hassled political strategy, on the name of a grand alliance, an unethical and unprincipled combination of political parties is in the offing in Telangana on the eve of elections. Quite ahead of announcement of schedule, the Congress party, the TDP, the Jana Samithi and CPI are forming into grand alliance against ruling TRS. Probably these parties and their leaders are ignorant that in elections one plus one is not two and they are wrong to conclude that the votes they polled in earlier elections if combined will make them victorious.
Every partner of this proposed grand alliance though explicitly want to contest together, have in their heart-in-heart, to outsmart the other and in the process benefit for itself. Which party will ultimately benefit, and which one will be the looser in this process is a difficult assumption. In addition, the thought process of leaders at the state level is totally different to that of the grassroot cadre and constituency level leaders wanting to be in election fray. Earlier when all these so called alliance partners, announced that they would contest all seats, leaders at the constituency level, in anticipation of a certainty of getting party ticket, have already begun their campaign. Now that the decision has been changed in favour of a grand alliance, the fate of these aspirants is in an ambiguous point. Most of them who are denied tickets due to the alliance may turn against and become dissidents and may even campaign against alliance candidates. This would certainly harm the prospects of grand alliance significantly.

Aspirants of party ticket normally tend to seek ticket from other party by defecting if they are denied by their mother party. This is a normal practice to any party and more so in Congress. The recent developments in Congress are an example of this. Often rates are also fixed in this party as is alleged by some senior leaders belonging to that party. Against this background, for the first time in the history of Indian elections, Chief Minister and TRS president KCR has announced party tickets to 105 persons, all but two sitting MLAs, far ahead of elections, and even before the schedule is announced. Making this announcement in a media meet is a new convention set by CM KCR. He has subtly and also explicitly made it abundantly clear that there is little chance to the defectors from other parties to seek party ticket. He wants them to remain only as loyal party workers after they join.

It may perhaps be apt if a rule akin to that of code of conduct is brought imposing restrictions on awarding ticket to the defectors who do so just couple of months before the conduct of elections. Election Commission instead of sleeping all through between election and election for full five years, should strive hard, to strengthen the democratic systems from time to time.  

As against all this, it looks like, in every aspect, TRS is much-much ahead of all the political parties that are in the fray and marching ahead towards victory. Ever since TRS won 2014 election and assumed power, the Chief Minister KCR by treating the election manifesto as a holy book and always keeping it by his side, conceived and implemented umpteen welfare and developmental programs, giving equal priority to both and in the process benefiting all sections of people. Name any scheme or project or program…be it the Mission Bhagiratha, Mission Kakatiya, the irrigation projects like Kaleshwaram, Palamoor, Sitarama, the Aasara pensions, the Kalyana Lakshmi and Shaadi Mubarak, employees salary hike, round the clock power supply without cuts, sheep distribution, Rythu Bandhu, Rythu Bhima, KCR kits, basti clinics, Kanti Velugu and so on…the credit goes to TRS government. Every bit of promise made in the manifesto has been taken care of and in addition 72 additional schemes that were not mentioned in the manifesto were also implemented. There are 60 schemes that are implemented only in Telangana and no where in the country. In a way the manifesto is implemented 172%. All this gained the credibility among people.

TRS, in its manifesto, hence, may certainly include only such promises, that are implementable. Naturally when compared to other parties, the credibility of TRS is on the much-much higher side. TRS may announce in all probabilities many new schemes for the welfare and development of people besides opting for standardization, stabilization and consolidation of the good work done already in various fronts. Almost all the schemes that are in implementation shall continue in all likelihood.

It is only when a leader like TRS President KCR thinks differently, believes that he is different from others, dreams of bright future to the state, undertakes activities which none will be able to do, he is the real strategist. Hundred percent success will be with such leaders only. Strategy coupled with credibility will be the key to success in poll.