లంక కాల్చిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి
వాసుదాసు
సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (24-09-2018)
శత్రువులకు అమితమైన దుఃఖం కలిగించడమే, ఇక తాను చేయవలసిన
పని అనీ, అలా చేస్తే, రామకార్యం సులభంగా నెరవేరుతుందనీ, తలుస్తాడు హనుమంతుడు. లంకలోని పౌరులకు బాధకలిగిస్తే, ఈ బాధ రావణుడి
మూలాన్నే జరిగిందని, ప్రజలందరూ వాడిపట్ల విరోధం పెంచుకుంటారు కనుక, దానిమూలాన్న, వారిలో వారికి పడక, సీతాదేవిని రాముడికప్పగించమని చెప్పేవారు కొందరుండవచ్చని
హనుమంతుడు భావిస్తాడు. రావణుడు వినకపోతే, రాముడి పక్షం వహించేవారు కొందరేర్పడుతారని కూడా అనుకుంటాడు.
అందుకే ఈ రాక్షసులకు కొంచెం బాధ కలిగించాలని నిశ్చయించుకుంటాడు.
"అశోకవనాన్ని పాడుచేసాను కనుక,
రావణుడికి, వాడి స్త్రీలకు
ఇబ్బందికలిగి, సీతను పంపించమని వారు రావణుడికి చెప్పుతారు. రాక్షసులను చంపానుకనుక, వారి సన్నిహితులు, రావణుడిని
దూషిస్తుంటారు. సైన్యంలో కొంతభాగం నాశనం చేసాను. వీరికి స్థావరాలైన కోటలు, బురుజులు, మిగిలిన స్థలాలు కూడా
పాడుచేయాలి. ఇంకొంచెం ప్రయత్నం చేసి, ఈ నగరాన్ని నాశనం చేస్తే, నేననుకున్న పనులన్నీ అయినట్లే. నేనుపడ్డ శ్రమకు ఫలితం
లభించినట్లే!18) నాకుపకారం చేస్తున్న, అగ్నిహోత్రుడికి ప్రత్యుపకారంగా ఇక్కడున్న ఇళ్లన్నీ ఇవ్వడం
న్యాయం" అనుకుంటూ ఇళ్లమీద తిరగడం ప్రారంభించాడు.
మెరుపులతో కూడిన మేఘంలా చలించక హనుమంతుడు లంకలోని, ఇల్లిల్లూ, తోటతోటా, మేడమేడా తిరిగి, సర్వం కాల్చేసే
కార్యక్రమంలో మునిగిపోయి, ఆనందించసాగాడు. ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, వజ్రనాభుడు, శుకసారణులు,
ఇంద్రజిత్తు, జంబుమాలి, సుమాలి, రశ్మికేతుడు, సూర్యజిత్తు,
హ్రస్వకర్ణుడు,
దంష్ట్రుడు, రోమశుడు, మత్తుడు, యుద్ధోన్మత్తుడు, ధ్వజగ్రీవుడు, హస్తిముఖుడు, విద్యుజ్జిహ్వుడు, కరాళుడు, పిశాచుడు,
శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, కుంభుడు, బ్రహ్మశత్రువు,
నికుంభుడు, యజశత్రువుల ఇళ్ళకు నిప్పుపెట్తాడు. సీతాపక్షం
వాడనీ, తన తరఫున ధర్మ మార్గంలో రావణుడితో వాదించాడనీ, విభీషణుడి ఇల్లు మాత్రం తగులపెట్టలేదు. మిగిలిన వారి
ఇళ్ళన్నీ కాల్చాడు. ఒకసారి లక్ష్మణుడు హనుమతో అంటాడు, విభీషణుడు ధర్మాత్ముడని శూర్పణఖ రాముడితో చెప్పిందని. తాను
స్వయంగా గమనించాడు రావణ సభలో విభీషణుడు
ధర్మబద్ధంగా తనకు హాని కలిగించవద్దని చెప్పిన సంధర్భం కూడా. ఆ తర్వాత వెలలేని
బంగారు మణుల సొమ్ములతో అలంకరించబడిన రావణుడి ఇంటికీ చిచ్చు పెట్టాడు.
ప్రళయకాల మేఘధ్వనిలాంటి, సింహనాదధ్వని చేస్తూ, బలంగా గాలి వీస్తుంటే, విజృ౦భించిన హనుమంతుడు, ఇల్లిల్లూ తగులబెట్టడంలో నిమగ్నమైపోయాడు. లంకా నగరమంతా
కాలిబూడిదైపోయి, నేలకూలుతున్న పెద్దపెద్ద మేడలతో నిండిపోయింది. మునుపు రావణుడు తనను పెట్టిన
బాధలకు బదులు తీర్చుకుంటానికి అగ్నిహోత్రుడే కోతిరూపంలో వచ్చాడేమోనని, అరిచే రాక్షసుల
ధ్వనితో ఆకాశం నిండిపోయింది. కొన్దరు రాక్షసస్త్రీలు తమను అగ్నిజ్వాలలు
చుట్టుముట్టుకోగా, తల వెంట్రుకలు విరబోసుకుని, పెద్దగా ఏడ్చుకుంటూ, చంటిపిల్లలను రొమ్ముకు
హత్తుకుని, మేడలమీదనుండి కింద పడుతుంటే, చూసేవారికి, మేఘాలనుండి
మెరుపులు రాలిపడ్తున్నాయా అన్నట్లుంది. అగ్నివేడిమికి వజ్రాలు, పగడాలు, వైడూర్యాలు, వెండి, బంగారం, ముత్యాలు, లోహాలతో
చేసిన ఇళ్లు, కరిగి ప్రవహిస్తుంటే చూసాడు హనుమంతుడు.
ఎన్నిళ్లుకాలినా, ఎంత
తగులబడినా, భూమిమీద పీనుగులెన్ని పడ్డా, ఆయనకు తృప్తి
కలగలేదు. గాలెంత గట్టిగా వీచినా శ్రమ కలుగలేదు. అగ్నిజ్వాలలు మోదుగుపూల కాంతితో
ఒకచోట, బూరుగుపూల మాదిరిగా మరోచోట, కుంకుమ నెత్తురులా మరొక్కచోట కనిపించాయి. త్రిపురాలను కాల్చిన రుద్రుడిలా, హనుమంతుడు లంకా
దహనం చేస్తుంటే, ఆ మంటలు పెరిగి త్రికూట పర్వతం వరకూ వ్యాపించాయి. అగ్నిజ్వాలలు
ఆకాశాన్నంటుతుంటే, రాక్షసుల శరీరాలనే నేయిలో ఆ జ్వాలలను, పొట్టిగా, పొడవుగా, నాలుగు ప్రక్కలా వ్యాపించేటట్లు చేస్తున్నప్పుడు, గాలికూడా
సహాయపడింది. హనుమంతుడప్పుడు విజృoభించి, కోటి సూర్యకాంతితో పిడుగుపడ్డట్లు చిటపట ధ్వని చేస్తూ, ఎక్కడ చూసినా తానే
కనిపించసాగాడు. మంటలు మోదుగుపూల గుత్తుల్లా, నిప్పు చల్లారిన ప్రదేశంలోని సెగలు నల్లకలువల కాంతిలా
కనిపించసాగాయి.
ఇదన్తా జరుగుతుంటే, జ్ఞానులైన రాక్షసులు, అగ్నిజ్వాలలకు దగ్ధమై పోయిన చెట్లను, ఇళ్లను, వనాలను,
పక్షులను, ఇతర జంతువులను, లంకానగరాన్నీ
చూసి దుఃఖపడ్తూ ఎవరీ వానరుడని ఆలోచనలో పడ్డారు. ఇతడేమన్నా ముప్పైమూడుకోట్ల దేవతలకు
ప్రభువై, వజ్రాయుధాన్ని ధరించే ఇంద్రుడా? యముడా?
చంద్రుడా?
అగ్నిదేవుడా? కుబేరుడా?
వరుణుడా?
సూర్యుడా?
వాయుదేవుడా? రుద్రుడా?
అని భయపడ్తారు. వీళ్లల్లో ఎవరో ఒకరై వుండాలేకాని, ఇది సామాన్యకోతి
అనటానికి వీల్లేదు అనుకుంటారు. అయితే వీరందరూ లోగడ రావణుడి చేతుల్లో
ఓడిపోయినవారైనందునా, పీడించబడ్డందునా, వీరెవరూ
కాకపోవచ్చునని కూడా అనుకుంటారు. ఒకవేళ సృష్టికారకుడు చతుర్ముఖ బ్రహ్మ, తనిచ్చిన వరాలబలం
వల్ల గర్వంతో చేయకూడని పనులు చేస్తున్న రావణుడికి బుధ్ధి చెప్పటానికీ, రాక్షసులను నాశనం చేయటానికీ, ఇలా వచ్చాడేమోనన్న
అనుమానం కూడా కలిగింది. అదీకాదనుకుంటారు కాసేపు.
బ్రహ్మరుద్రాదులు, ఇంద్రాది
దిక్పాలకులు, ఎవరూ ఇంత పని చేయలేరని తీర్మానించుకుంటారు. అవ్యక్తమై, (బాహ్యేంద్రియ గోచరం కానిది) అసమానమై,
అనంతమై, ఇలా వుంటుందని వూహించలేనిదైన మహావిష్ణుతేజం వానరరూపంలో వచ్చిందని భావిస్తారు.
ఈ విష్ణుతేజం శక్తి అచింత్యమై (మనస్సులో ఆలోచించి తెలుసుకునేందుకు సాధ్యపడనంత), అత్యత్భుతమైన
పనులు చేయడంకొరకూ, సర్వరాక్షస సంహారం, నాశనం చేసేందుకూ, వచ్చిందని
నిశ్చయించుకుంటారు.
హనుమంతుడి మూలాన అగ్నిజ్వాలలకు కాలిపోయిన గుర్రాలు, ఏనుగులు, రథాలు,
జనాలు, పక్షులగుంపులు, మృగాలు, వృక్షాలున్న లంకా నగరం, శోకసముద్రంలో మునిగి ఏడుస్తుంది దీనాతిదీనంగా. చిటపట
ధ్వనులు చేసుకుంటూ, కాలిపోయి, ఏడుపు ధ్వనులతో నిండిపోయి, హనుమంతుడి కోపాగ్నికి నాశనమైపోయిన లంకా నగరమ్ శాపగ్రస్థురాలిగా దీనమై
కనపడింది. తత్తరపాటుతో భయపడి, దుఃఖించే రాక్షసమూకలతో,
మండుతున్న మంటల గుర్తులతో,
లంక, ప్రళయకాలంలో బ్రహ్మ కోపానికి నశిస్తున్న ప్రపంచంలా వుందప్పుడు.
వనాన్నిపాడుచేసి,
రాక్షసులను చంపి, మేడలు, మిద్దెలు నేలమట్టం
చేసి, ఇంకా మండుతున్న తోకతోనే,
సూర్యుడిలాగా వెలుగుతూ, హనుమంతుడు త్రికూటపర్వతాన్ని చేరుకుని, శ్రీరాముడిని
చూడటానికి పోదామనుకుంటాడు. ఆయన చేసిన ఆశ్చర్యకరమైన పనికి, దేవతలు, గంధర్వులు, నాగులు, మునులు, ఆకాశ సంచారులు
మిక్కిలి సంతోషపడ్డారు. గంధర్వులు, సిధ్ధులు ఆశ్చర్యపడి కాలిబూడిదైన లంకను చూసారు.
అగ్నిజ్వాలలతో చుట్టుకున్న ఆంజనేయుడి తోకచూసి, అగ్నిహోత్రుడే వచ్చాడని భయపడ్డాయి భూతాలు. మునులు, దేవతలు, పన్నగులు,
యక్షులు, ఆంజనేయుడు చేసిన పనికి ఎంతో సంతోషించి "మేలు-మేలు" అని ఆయన్ను
పొగిడారు.
No comments:
Post a Comment