పంచవటీ
స్థల వివాదం...అసలు చరిత్ర
శ్రీమదాంధ్ర
వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-27
వనం జ్వాలా
నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (23-09-2018)
పంచవటి
స్థలం ఏదనే వివాదం చిరకాలంగా అనేకమందిని బాధిస్తున్నది. భద్రాచలం దగ్గరున్న
పర్ణశాల అని కొందరు, నాసిక దగ్గర అని మరి కొందరు,
అభిప్రాయ పడుతున్నారు. వీటిల్లో ఏది సత్యమో అనే విషయాన్ని
రామాయణాన్ని బట్టి, స్థలశోధనాన్ని బట్టి
నిర్ధారించాల్సి వుంది. పంచవటి గోదావరీ తీరంలో వుందనే విషయం నిర్వివాదాంశం. పంచవటి
దగ్గర గోదావరి నది ఉత్తరాన్నుండి దక్షిణానికి పారుతూ వుండాలి. ఎందుకంటే
రామలక్ష్మణులు సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ గోదావరీ తీరాన వెళ్లారు. ఇలా
వెళ్తున్న రామలక్ష్మణులకు దక్షిణ దిక్కుగా సీత పోయిందని మృగాలు,
పక్షులు చూపాయి. అప్పుడు రామలక్ష్మణులు నేరుగా దక్షిణానికి పోకుండా,
నైఋతి దిశగా పోయి, గోదావరీ
తీరంలో జటాయువును చూశారు. ఈ కారణాన, గోదావరి
నది జటాయువు పడ్డ స్థలం దాకా, దక్షిణాభిముఖంగా
పారుతుండాలి. జటాయువుకు గోదావరీ జలాలతో రామలక్ష్మణులు నివాపాలు విడిచినందున
వారున్న స్థలం గోదావరి తీరమే అయ్యుండాలి. ఇక్క్డినుండి రామలక్ష్మణులు నైఋతిదిశగానే
మూడు కోసుల దూరం పయనించారు. ఇంతదాకా తూర్పుగా పోవడానికి ఏరు అడ్దం వస్తుంది. కాబట్టి
తూర్పుగా పోలేదు. కొంత తూర్పుగా పోతేనే కాని జటాయువు చెప్పిన దక్షిణ మార్గం
కనిపించదు. కాబట్టే అక్కడినుండి మూడు కోసులు తూర్పుగా పోయారనుకోవాలి. ఇప్పుడు
ఇప్పటి భద్రాచలం దగ్గర, గోదావరి
నదికి దక్షిణాన వున్నారు వారు. ఇలా వచ్చినందున వారికి గోదావరి దాటాల్సిన పనిలేదు.
ఈ కారణాన పంచవటి గోదావరి నదికి పడమటి తీరాన వున్నదని అంగీకరించాలి. తూర్పునే వుండి
వున్నట్లయితే, గోదావరి దాటే వుండాలి. ఆ విషయాన్ని వాల్మీకి చెప్పలేదు.
ఇప్పటి
పర్ణశాలే పంచవటి అని అనుకుంటే, వారొకవేళ
నైరుతి దిక్కుగా ప్రయాణం చేసే వుంటే, ఏటి పాలు
అయ్యేవారు. భద్రాచలం దగ్గర ఏరు దాటినట్లు కొందరు రాశారుకాని,
అది ఆలోచించి రాసిన రాతకాదు. ఇప్పుడు అందరూ అనుకుంటున్న పర్ణశాల కాదు
కాని, దానికి ఎదురు ఒడ్డున, చక్కగా
పంచవటి వుండేదని చెప్పొచ్చు. అలాగే ఒకాయన నాసికను పంచవటి అని పేర్కొన్నారు. అక్కడి
నుండి దక్షిణంగా వచ్చినట్లు చెప్పారాయన. ఇది రామాయణానికి విరుద్ధం. పంచవటి గోదావరీ
నదీ పశ్చిమ తీరాన వున్నదనడానికి స్థలం ఆధారంగా వుంది. పర్ణశాలకు ఎదురుగా రథగుట్త
అనేదొకటి వుంది. ఇక్కడ రావణాసురుడు తన రథాన్ని దాచిపెట్టాడని అంటారు. ఎందుకంటే
సీతాపహరణ సందర్భంలో, రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుని
రాగానే రథం సిద్ధంగా వుంది అని చెప్పడం జరిగింది. సమీపంలో అది కనపడనందున ఆ పని
కొనసాగింది కాని, ఏటికి ఒక ఒడ్డున రథం;
సీత, రావణుడు మరో ఒడ్డున వుంటే ఇది సాగి
వుండేది కాదు. కాబట్టి పంచవటి పడమటి దిక్కునే వుండాలి. సీతాపహరణం ఆ పక్కనే అయి
వుండాలి. అంతే కాదు....దీనికి సమీపంలోనే, సీత
గుట్టలని పెద్ద పర్వతం వుంది. ఇక్కడ ఖరుడు యుద్ధానికి వచ్చినప్పుడుసీతాలక్ష్మణులు
వున్నారని, ఆ కారణాన ఆ గుట్టలకు ఆ పేరు వచ్చిందని అంటారు. కాదనడానికి కారణం
లేదు. తూర్పు ఒడ్డున వున్నట్లయితే, ఏరు దాటి
పోయి, అక్కడి గుట్టల్లో వుండాల్సి వచ్చేది. ఈ గుట్ట కింద పడమటి దిక్కుగా
పెద్ద బయలు ప్రదేశం వుంది. అక్కడ పద్నాలుగువేల రాక్షసులు నిలిచి యుద్ధం చేయగలిగే
పెద్ద స్థలం వుండేది. సీతాలక్ష్మణులకు ఇక్క్డ జరిగిన యుద్ధం గుట్ట మీదనుండి
కనపడేది.
మరొక చోట
వాల్మీకి రామాయణంలో పద్మ సరస్సు పంచవటికి దగ్గర్లోనే వుందని చెప్పడం జరిగింది. అది
ఇప్పటిదాకా వుందో, లేదో, చెప్పడం
సాధ్యపడదు కాని ఇలాంటి పెద్ద చెరువొకటి వున్నట్లు అక్కడుండే కోయవాళ్లు
చెప్తుంటారు. ఈ చెరువుకూ, గోదావరి
నదికి, మధ్య పంచవటి వుంది. వర్షాకాలంలో ఏటి నీళ్లు బురదగా వున్నప్పుడు ఈ
చెరువు నీళ్లు సీతారామలక్ష్మణులు వాడుకునేవారు. ఇప్పటి పర్ణసాలకు దక్షిణంగా
గోదావరీ తీరంలో భద్రాచలానికి వచ్చే తోవలో, దుమ్మగూడెం
అనే వూరుంది. దీనికి ఎదురుగా ఏటికి ఆవలి ఒడ్డున ఒక చిన్న గుట్ట వుంది. దీని
దగ్గరలోనే జటాయువుకు, రావణుడికి యుద్ధం జరిగిందని
రామాయణంలో వుంది. ఇప్పుడు గోదావరి నది తూర్పు ఒడ్డు కోసుకొని వస్తున్నది. ఇప్పటి
ఏటి మధ్యలో దుమ్మగూడేనికి చెందిన కొంత భాగం వుండేదట. అక్కడ అలా చూసిన వారు
ఆంధ్రవాల్మీకికి చెప్పారా విషయాన్ని. వాస్తవానికి ధూమగూడెమే దుమ్మగూడెం అయింది. ఆ
గుట్ట దగ్గరే జటాయువుకు సంస్కారాలు చేశాడు శ్రీరాముడు.
ఇప్పటి
హంపే పంప అనీ, అక్కడే పర్ణశాల వున్నదనీ, చెప్పడానికి
ఒక నిరాకరించలేని ప్రబల కారణం వుంది. రామలక్ష్మణులు లంకకు పోయేటప్పుడు ఏ మార్గంలో
వెళ్లినా, లంక నుండి తిరిగొచ్చేటప్పుడు విమానాన్ని చక్కగా వచ్చేట్లు చేశారు
కాని, వంకర-టింకరగా పోలేదనేది స్పష్ఠం. లంక నుండి సముద్రం దాటిన తరువాత,
రామేశ్వరం దగ్గరనుండి, అయోధ్యకు
వెళ్లారనేది అందరూ అంగీకరించిందే. అలాంటప్పుడు ఎడమవైపున కిష్కింద,
కుడివైపున పంచవటి వుండి వుండాలి. ఈ రెండు స్థలాలను రామచంద్రమూర్తి
సీతాదేవికి చూపించాడు. ఈ మార్గానికి, నాసికకు
సంబంధమే లేదు. కాబట్టి పంచవటి నాసిక కాదు...కావడానికి వీల్లేదు. నాసిక అనేది మొదటి
పేరు కాదనీ, నవశిఖ అనేది నాసిక అయిందనీ, పురాణాలలో
ప్రసిద్ధికెక్కిన నాసిక శూర్ఫణకదే అయినందువల్ల ఆ కథకు, దీనికి
ముడిపెట్టారని కూడా కొందరు రాశారు. నాసిక పంచవటి కాదనడానికి మరికొన్ని
కారణాలున్నాయి.
సీతారామలక్ష్మణులు
చిత్రకూటం నుండి దక్షిణంగా ఋక్షవంతానికి వచ్చి, అక్కడనుండి,
పశ్చిమాభిముఖంగా నాసిక చేరినట్లు కొందరంటారు. వాళ్లు చెప్పిన
మార్గంలో వింధ్యపర్వతాన్నే కాకుండా, నర్మద,
తపతీ నదులను దాటి, విదర్భ
గుండా నాసికలోకి పోవాల్సి వుంటుంది. ఇది చాలా దుర్గమ మార్గం. అదీ కాకుండా,
వాల్మీకి ఎక్కడా, సీతారామలక్ష్మణులు
వింధ్యనూ, నర్మదా తపతులను దాటినట్లు చెప్పలేదు. వారు దాటే వుంటే ఆ సుప్రసిద్ధ
నదుల గురించి వాల్మీకి తప్పక రాసేవాడే. రామలక్ష్మణులు దక్షిణానికి వచ్చి,
ఆ తరువాత ఆగ్నేయంగా కిష్కింధకు వచ్చారనడం రామాయణానికి ప్రత్యక్ష
విరుద్ధం అనాలి. వాస్తవానికి రామలక్ష్మణులు నైఋతీ మూలగా, ఆ
తరువాత కొంత మేరకు నైఋతిగా పోయి, అక్కడనుండి
తూర్పుగా పోయి, కబంధుడిని చంపి, అక్కడనుండి
మళ్లీ పడమరగా పోయి, పంప (తుంగభద్ర) చేరి అక్కడికి పడమర
వున్న శబరి గుహకు పోయారు. జటాయువు గుట్ట దగ్గరనుండి నైఋతిగా వస్తేనే కిష్కింధకు
రాగలరు. అలా కాకుండా కొందరు చెప్పినట్లు ఆగ్నేయ మూలగా పోయివుంటే,
సముద్ర తీరానికి చేరేవారే కాని, కిష్కింధ
చేరకపోయేవారు. ఆగ్నేయ మూలగా ప్రయాణం చేసినట్లు రామాయణంలో ఎక్కడా ఒక్క మాటైనా లేదు.
అలాగే భద్రాచలం దగ్గర ఉష్ణ గుండం వుందనడం, సీతాదేవి
స్నానం చేసేదనడం, రేకపల్లె దగ్గర జటాయువు రెక్క
పడిందనడం బహుశా కల్పితాలు కావచ్చు.
No comments:
Post a Comment