Sunday, January 24, 2021

అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-41 : వనం జ్వాలా నరసింహారావు

 అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-41

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (25-01-2021)

(పూర్వ కాలంలో అన్ని జాతుల వారు కూడా విద్య నేర్చుకునేందుకు అర్హులనే విషయం దీనివల్ల స్పష్టమవుతున్నది. ఒకానొకప్పుడు శూద్రులని పిలువబడే వారికి విద్యార్హతలుండవని వాదనుండేది. అయితే అది తప్పుడు వాదనేననాలి. నాస్తికులు అసలు లేనే లేరన్నప్పుడు "జాబాలి" అన్న వ్యక్తి నాస్తిక వాదన ఎలా చేశాడన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. జాబాలి చేసింది నాస్తికవాదమైనంత మాత్రాన, ఆయన నాస్తికుడు కావాలన్న నియమం లేదు. నాస్తిక వాదన ఆయనతో పుట్టలేదు-అంతకు పూర్వమే వుంది. దాన్నే "బృహస్పతి గీత" అంటారు. అయోధ్యలో నాస్తికులు లేరంటే, ఆ వాదనను అంగీకరించిన వారు లేరని మాత్రమే అర్థం).

అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే-ప్రేమ స్వరూపులే-ఇంద్రియ నిగ్రహం కలవారే-మంచి స్వభావం వున్న వారే-దోషరహితమైన నడవడిక గల వారే-ఋషితుల్యులే-నిష్కళంకమైన మనసున్నవారే-ముత్యాల హారాలు ధరించి, చెవులకు కుండలాలను అలంకరించుకున్నవారే-అందచందాలున్న వారే-కురూపులు కాని వారే-మకుటాలు ధరించి, చందనం పూసుకుని, కొరత లేకుండా భోగ భాగ్యాలను అనుభవించే వారే-ఇష్టమైన ఆహారాన్ని తీసుకునే వారే-అన్న దాతలే-అవయవాలన్నిటినీ అలంకరించుకునే వారే. ఇంద్రియ నిగ్రహంతో పాటు, ఇంద్రియాలను జయించిన వారక్కడి జనులు. అందరూ సోమ యాగం చేసినవారే-అగ్నిహోత్రాలు కలవారే-వారి, వారి ఆచారం ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారే-బ్రహ్మాన్ని ధ్యానిస్తూ, జప తపాలు చేసేవారే-దయాళులై, చక్కని నడవడి కలవారే. దశరథ మహారాజు పరిపాలన చేసే రోజుల్లో, అగ్నిహోత్రం లేనివాడు కానీ-సోమయాగం చేయని వాడు కానీ-అల్ప విద్య, అల్ప ధనం కలవాడు కానీ-వర్ణ సంకరులు కానీ-దొంగలు కానీ లేనే లేరు అయోధ్యా పురిలో.

తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో-అధ్యయనంలో ఉత్తములై , వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు. దశరథుడు పరిపాలన చేసే సమయంలో, చపలచిత్తులు, ఐహికాముష్మిక కార్య సాధనకు అవసరమైన దేహ బలం-మనో బలం లేనివారు, ఆరంగాలెరుగనివారు, అసత్యం పలికేవారు, ఈర్ష్య గలవారు, పాండిత్యం లేనివారు, చక్కదనం లేనివారు, పదివేలు తక్కువగా దానం చేసేవారు, దుఃఖించే వారు, రాజభక్తిలేని వారు, ఇతరులను పరవశులను చేయగల చక్కదనం లేని స్త్రీ-పురుషులు, స్త్రీలను స్త్రీలు-పురుషులను పురుషులు కూడా పరవశులు చేయగల చక్కదనం లేనివారు అయోధ్యా నగరంలో లేరు. అక్కడ నివసించే అన్ని వర్ణాలవారు దైవ పూజ చేయకుండా-అతిథిని ఆదరించకుండా, భోజనం చేయని దీక్షాపరులు. (పర గృహంలో ఒక్క రాత్రి మాత్రమే నివసించే వారిని అతిథుదులంటారు. ఒక్క రోజుకూడా-ఒక్క చోట కూడా నిలకడగా వుండలేడు కనుకనే "అతిథి" అంటారు). అయోధ్యా పురవాసులు శౌర్య పరాక్రమాలున్నవారు-సత్యమే ధనంగా కలవారు. ధనంలాగా సత్యాన్ని కాపాడుకునే శూద్రులు తాంత్రిక మంత్ర్రాలతో దేవ పూజ-హిరణ్య దానంతో అతిథి పూజ చేస్తారు. బ్రాహ్మణులు విద్యా శూరులు-వాద పరాక్రములు.

బ్రాహ్మణులుపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి క్షత్రియులు నడచుకునేవారు. వైశ్యులు రాజులకు అనుకూలంగా వుండేవారు. వంచన-దొంగతనం అనే వాటిని దరికి రానీయకుండా, బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులకు సేవ చేస్తూ, శూద్రులందరు బ్రతుకు పాటుకై కుల విద్యలు నేర్చుకుని, కులవృత్తులలో నిమగ్నమై వుండేవారు. యుద్ధ భటులు కార్చిచ్చులాంటి దేహాలతో-తేజంతో, మందరం లాంటి ధైర్యంతో, ఇబ్బందులెన్ని ఎదురైనా, అప్పగించిన పనిని నెరవేరుస్తూ దేహ-మనో బలంతో ఉత్సాహంగా వుండేవారు.

దశరథ మహారాజు సైన్యంలోని గుర్రాలను కాంభోజ, బాహ్లిక, అరేబియా దేశాలనుండి కొనుక్కొచ్చేవారు. సూర్యుడి గుర్రాలకంటే-ఇంద్రుడి గుర్రం కంటే వేగంగా వెళ్లేవా గుర్రాలు. గుణం లేనివాడు కొడుకు కానట్లే-తపస్సు చేయని వాడు తెలివైన పండితుడు కానట్లే-భార్యను వశం చేసుకోలేనివాడు మగవాడు కానట్లే-ఏనుగులు లేనివాడు రాజు కాడన్న సూక్తిని అనుసరించి, మూడు జాతుల ఏనుగులు దశరథుడి సైన్యంలో వుండేవి. భద్రం, మంద్రం, మృగం అనే మూడురకాల శుద్ధ జాతి ఏనుగులు - వీటి సంకీర్ణ జాతి ఏనుగులు (భద్ర మంద్రాలు, మృగ మంద్రాలు, భద్ర మృగాలు, భద్ర మంద్ర మృగాలు) దశరథ మహారాజు సైన్యంలో వుండి, ఎనిమిది రకాలైన మదపు నీటిని స్రవింప చేసేవి. చెక్కిళ్ల నుండి (దానం అని) , కళ్ల నుండి (సీధువు అని), చెవుల నుండి (సాగరం అని), తొండం కొన నుండి (శీకరం అని), స్తనాల కొనల నుండి (సిక్యం అని), శిశ్నం నుండి  (మదం అని), హృదయం నుండి (ఘర్మం అని), పాదాల నుండి  (మేఘం అని) మదపు నీరు స్రవించేవి. ఇలాంటి సైన్యం తోడుండగా, ఎటు దిక్కుగా చూసినా రెండామడల దూరం నిడివి కలిగిన అయోధ్యా నగరాన్ని శత్రువులు జయించలేనిదిగా-ఇంద్రుడి అమరావతి నగరం లాగా, దశరథుడు, చుక్కల్లో చంద్రుడివలె పరిపాలించేవాడు.

Saturday, January 23, 2021

అంగదుడిది సుగ్రీవుడి మీద తిరుగుబాటా? : వనం జ్వాలా నరసింహారావు

 అంగదుడిది సుగ్రీవుడి మీద తిరుగుబాటా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (24-01-2021) ప్రసారం  

         సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడి ఆజ్ఞానుసారం పంపబడిన వానరులు భూమండలం అంతా వెతికి నెల గడువు తీరగానే తిరిగి వెనక్కు వచ్చారు. తూర్పు దిక్కుకు పోయిన వినతుడు, ఉత్తర దిక్కుకు పోయిన శతవలి, పశ్చిమ దిక్కుకు పోయిన సుషేణుడు నెలకాగానే మరలి వచ్చి ఎక్కడా సీత కనబడ లేదనీ, సీత జాడ లేదనీ చెప్పారు.

         ఇక హనుమంతుడు సీతాదేవిని తప్పక చూసే వస్తాడని ఆయన రాకకొరకై అందరూ వేచి చూస్తున్నారు. హనుమంతుడు సుగ్రీవుడు సూచించిన విధంగానే, అంగదుడితో, తారుడితో, ఇతరులతో కలిసి మొదలు వింధ్య పర్వతం దగ్గరకు పోయాడు. సీతాదేవి కొరకై అంతటా వెతికారు. సీత ఎక్కడా కనబడలేదు. ఎక్కడ కూడా సీతాదేవి కనబడక పోవడంతో వ్యసనపడుతూ ఒక చెట్టు కింద చేరి వుండడం చూసిన అంగదుడు, తానూ బడలికతో ఉన్నప్పటికీ, తనలాగే శ్రమపడిన వానరులను ఉత్సాహపరిచే మాటలు చెప్పాడు. మళ్లీ-మళ్లీ వెతుకుదాం అన్నాడు. అంగదుడి మాటలు విన్న వారంతా బడలిక తీరగానే మళ్లీ వింధ్య పర్వతం నాలుగు దిక్కులా వెతకసాగారు.

         అలా వెతుకుతుంటే ఋక్షబిలం అనే పేరుకల ఒక పెద్ద బిలాన్ని చూశారు వానరులు. అప్పుడు ఆంజనేయుడు అక్కడ నీళ్లున్న బావో, మడుగో వుండడం నిజం కాబట్టి లోపలికి పోదామన్నాడు. అంతా కలిసి ఆ బిలంలోకి ప్రవేశించి, ఒక ఆమడ దూరం దప్పికతో ప్రయాణం చేసిన తరువాత, వెలుతురున్న ఒక ప్రదేశాన్ని తినుబండారాలను వానరులు చూశారు.  వారంతా అలా-అలా వెతుకుతుంటే ఒక చోట నారచీరెలు, కృష్ణాజినం, వస్త్రంగా ధరించి తపస్సు చేస్తున్న ఒక స్త్రీ కనిపించింది.

         అప్పుడు హనుమంతుడు ఆ ముసలిదాని దగ్గరికి పోయి, తమ ఆకలిదప్పుల విషయం చెప్పి, అక్కడున్న భోజన పదార్థాలు, పండ్లు, ఫలాలు, పుష్పాలు, పరిమళాల బంగారు చెట్లు, నిర్మల జలాలు, బంగారు కమలాలు, ఎవరి తపోమహిమవల్ల కలిగాయని అడిగాడు. ఆమె గురించి, ఆమె మహిమ గురించి ప్రశ్నించాడు. జవాబుగా స్వయంప్రభ అనే ఆమె ఇలా చెప్పింది.

“మాయలుకల రాక్షస ప్రభువైన మయుడు తన అద్భుత శక్తితో దీన్ని నిర్మించాడు. రమ్యమైన ఈ బంగారు గృహాన్ని నిర్మించినవాడు రాక్షసులకు విశ్వకర్మ అయిన దనుజ శ్రేష్టుడు. అతడు ఈ మనోహరమైన వనాన్ని కల్పించి ఇక్కడ వుండసాగాడు. దానవుడైన మయుడు దేవతాస్త్రీ అయిన హేమతో కలిసి వున్నందుకు కోపగించిన ఇంద్రుడు వజ్రధారతో అతడిని చంపాడు. ఆ మయుడు హేమకు ఈ బంగారు గృహాన్ని, వనాన్ని ఇచ్చాడు. ఇక్కడ సమస్త సుఖాలున్నాయి. ఆటపాటల్లో నేర్పరైన హేమకు నేను ప్రేమపాత్రమైన సఖిని. ఆమెదే యీవనం. ఆమెవల్ల నేను దీన్ని వరంగా పొంది దీన్ని రక్షిస్తున్నాను. నేను మెరుసావర్ణి కూతురును. నా పేరు స్వయంప్రభ. ఈ మూలాలు, ఫలాలు, ఇతర పదార్థాలు, పానీయాలు తృప్తి తీరా తినండి, తాగండి. శ్రమ తీరిన తరువాత మీ వృత్తాంతం చెప్పండి”.

హనుమంతుడు తమ చరిత్ర సమస్తం ఆమెకు వివరించాడు. తామొచ్చిన పని గురించీ చెప్పాడు. ఆమె ఇచ్చిన  ఫలమూలాలు తిని బడలిక తీర్చుకుని, తమను ఈ బిలం నుండి మళ్లీ భూమ్మీదకు చేర్చమన్నాడు. తన తపఃఫల బలంతో వానరులందరినీ నిమిషంలో బిలం నుండి దాటించింది ఆమె. వింధ్యపర్వతం దగ్గర ప్రస్రవణం అనే పెద్ద కొండదగ్గర దింపి స్వయంప్రభ వెళ్లిపోయింది. స్వయంప్రభ సర్వజ్ఞ అని అనుకోవాలి. ఆ కారణాన ఆమెకు భూత-భవిష్యత్-వర్తమానాలలో ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఎక్కడ వాళ్లను వదిలితే భవిష్యత్ కార్యం నెరవేరుతుందో అక్కడే, సముద్రతీరంలో విడిచిందని అర్థం చేసుకోవాలి.

          అప్పుడు అంగదుడు వానరులతో ఇలా అన్నాడు. “మీరంతా రాజుకు విశ్వాసపాత్రులైన సేవకులు. రాజాజ్ఞప్రకారం, రామకార్యం నెరవేర్చడానికి, నామీద ప్రేమతో నన్ను ముందుండే వాడిగా చేశారు. ముఖ్యుడిగా వుండడానికి నేను అంగీకరించి మీవెంట వచ్చాను. ఇంత చేసికూడా వచ్చినపని చేయకుండా మరలిపోతే సుగ్రీవుడు మనల్ని తునకలు-తునకలుగా నరుకుతాడు. ఇందులో సందేహం లేదు. సుగ్రీవాజ్ఞ నెరవేర్చకుండా బతికి సుఖపడేవాడు ఎవడు? నియమించిన గడువుకాలం దాటిపోయింది. మనం బాధపడి చేయగలింది ఏమీలేదు. కాబట్టి మనకిప్పుడు ప్రాయోపవేశం ఒక్కటే మార్గం అని తోస్తున్నది”.

         “సుగ్రీవుడు స్వభావసిద్ధంగా క్రూరుడు. దానికితోడు ఇప్పుడాయన రాజు. అధికార బలం వచ్చింది. రాముడి భార్య వార్త చెప్పకపోతే మనల్ని చంపుతాడు కాని క్షమించి వదలడు. కాబట్టి అక్కడికి పోయి చావడం కంటే ఇక్కడే చావడం మంచిది. మనమంతా మరలిపోతే, పోయిన వెంటనే చంపుతాడు. అక్కడికి పోయి అవమానపడి ఘోరమైన చావు చావడం కంటే ఇక్కడే చావడం మేలుకదా! నాకు యౌవరాజ్యం ఇచ్చినవాడు సుగ్రీవుడు కాదు. రామభద్రుడు. ఆయన ఆజ్ఞ మీరలేక తనకిష్టం లేకున్నా నన్ను యువరాజు చేశాడు. నామీద సద్గుణభద్రుడైన రామభద్రుడికి దయ వున్నదికాబట్టి నన్నప్పుడు ఏమీ చేయలేక వూరకున్నాడు. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి ఆయన ఆజ్ఞ మీరానన్న నెపంతో నన్ను చంపుతాడు. అక్కడికి పోయి చావడం కంటే పుణ్యస్థలమైన ఈ సముద్రతీరంలో చావడం మేలు”

         అంగదుడిలా చెప్పడంతో భయపడుతున్న వానరులను చూసి తారుడు ఇలా అన్నాడు. “మీరెందుకు దుఃఖపడతారు. చావాల్సిన పనిలేదు. మనమంతా ఈ బిలంలో మళ్లీ ప్రవేశించుదాం. మనకు కావాల్సిన చెట్లు, తినడానికి భోజ్యాలు, కందమూలఫలాలు, పరిశుద్ధమైన వనం, పరిశుద్ధమైన నీరు అక్కడ వున్నాయి. అవేకదా మనకు కావాల్సింది. భయం మాట కూడా అక్కడ వినపడదు. అక్కడ మనముంటే సుగ్రీవుడే కాదు, ఇంద్రుడైనా, ఇంద్రసమానుడైన రామచంద్రుడైనా మనల్ని చేరలేడు”.

         కిష్కింధకు పోవాల్సిన పనిలేదు, ఇక్కడే వుందాం, అని అంగదుడు చెప్పిన మాటలకు అనుకూలంగా తారుడు చెప్పిన మాట విన్న వానరులందరూ ఎలా చేస్తే మనకు కీడు కలగదో అలాగే చేద్దామని అన్నారు. అంగదుడు, తారుడు ఇలా మాట్లాడడం, దానిని వానరులు ఆమోదించడం గమనించిన హనుమంతుడు, సుగ్రీవుడి రాజ్యాన్ని అంగదుడు హరించాడని భావించాడు. తారుడు చెప్పిన మాటలను అంగదుడు, ఇతరులు నిషేధించలేదు. అంటే వారందరూ బిలంలోకి ప్రవేశించి అక్కడో, బయట అడవులలోనో వానర రాజ్యం ఒకటి ఏర్పరుచుకుంటారు. అప్పుడు ఏకంగా వున్న వానర రాజ్యంలో ద్వైవిధ్యం పుటుతుంది. అప్పుడు సుగ్రీవుడి రాజ్యం చెడిపోతుంది. సుగ్రీవుడిని విభేదించేవారు, వాలి పక్షపాతులు ఇక్కడికి చేరుతారు. అదలా వుండగా ప్రారంభించిన రామకార్యం చెడిపోతుంది. ఈ విధంగా ఆలోచించ సాగాడు హనుమంతుడు.

         అంగదుడిని ఓదార్చడానికి హుమంతుడు పూనుకున్నాడు. “ఏమీ అంగదా! నువ్వీవానరులను నీ చేతికిందకు తీసుకుని ప్రత్యేక వానరరాజ్యం స్థాపించాలని ఉపాయంతో వున్నావా? ఎలా చేస్తావో నేనూ చూస్తాను. వీరంతా రామకార్యం కొరకు నీవెంట వచ్చారు కాని నీతోపాటు కలకాలం ఇక్కడ తమ ఇండ్లు-వాకిళ్లు, భార్య-బిడ్డలను వదిలి ఈ అడవిలో అల్లాడడానికి వచ్చారని అనుకుంటున్నావా? వీరంతా నీకు లోబడ్డారనుకో! అలాగైతే, నేనిప్పుడే పోయి రామలక్ష్మణులను, సుగ్రీవుడిని, తక్కిన సైన్యాన్ని మీ దురుద్దేశం చెప్పి ఇక్కడికి పిలుచుకొస్తాను. ఇప్పుడు మనం చేసింది అబుద్ధి పూర్వకాపరాధం. అప్పుడు మీరు చేయబోయేది రాజద్రోహం. బుద్ధిపూర్వకాపరాధం. కాబట్టి ఇప్పుడు దండం తప్పవచ్చు కాని అప్పుడు దండం తప్పదు. అప్పుడు నువ్వు, నీరాజ్యం ఏం కాబోతున్నదో ఆలోచించు”. అని కోపంగా, ఉపాయంగా, భయం కలిగేట్లు చెప్పి మళ్లీ సామమార్గంలో ఇలా చెప్పాడు.

         “అంగదా!నువ్వు యుద్ధంలో నీ తండ్రి కంటే నేర్పుకలవాడివి. కపిరాజ్యం అంతా తండ్రిలాగే భరించే శక్తికలవాడివి. అయినా ఒక్కటి ఆలోచించు. ఈ కోతులు ఎప్పటికీ చపల చిత్తులే. ఇప్పుడున్న బుద్ధి ఇంకాసేపటికి వుండదు. ఇలాంటి వీళ్లు తమ పెళ్లాలను, పిల్లలను, బంధువులను వదిలి కలకాలం ఇక్కడ నిన్నెందుకు కొలుస్తారు. ఇక్కడ వున్నవారంతా నీకు లోబడి వుంటారని అనుకుంటున్నావేమో? అది పొరపాటు. సుగ్రీవుడిని సుహోత్రుడు, నీలుడు, జాంబవంతుడు ఎలా వదలరో అలాగే నేనూ వదలను. నువ్విక్కడ నీ ప్రయత్నం మొదలు పెట్టగానే మేం సుగ్రీవుడి దగ్గరికి పోయి అంగదుడు ఇలా చేస్తున్నాడని చెప్పేవాళ్ళమే. వీరిని నువ్వు ఏవిధంగానైనా నీలో కలుపుకోలేవు. నువ్వు ఇంకోటి ఆలోచించడం లేదు. ఇక్కడ నీకున్న సేనకంటే అక్కడ సుగ్రీవుడికి ఎక్కువ సేనకలదని తెలుసుకో. మూడు భాగాలు అక్కడ వుంటే ఇక్కడ ఒక్క భాగం వుంది. కాబట్టి నీవల్ల సుగ్రీవుడికి భయం లేదు. బలవంతుడితో విభేదించి బలహీనుడు బతకగలడా?”

         “వానరులను నమ్మి నువ్వు పినతండ్రితో పగబూనినా, వీరు చివరిదాకా నీతో వుండకుండా వెళ్లిపోతారు. నువ్వొక్కడివే మిగులుతావు. నువ్వు బుద్ధిమంతుడివి. ఆలోచించి చూడు. వానరులు భార్యాబిడ్డలను తలచుకుంటూ, ఇక్కడ తినడానికి కందమూలాలు, తాగడానికి నీళ్లు లేక, దినమొక గండంగా శ్రమపడుతూ, దుఃఖస్థానమైన ఈ శయ్యలమీద, రాళ్లమీద, రప్పలమీద, నీలమీద, గడ్డిమీద ఎండనక-వాననక నిద్రిస్తూ, ఆ శ్రమపడలేక నిన్ను వదిలి వెళ్లిపోతారు. సుఖజీవనానికి, సుఖ శయ్యలకు, బంధువుల తోడుకు, అలవాటుపడ్డవారు ఈ ఘోరారణ్యాలలో నీకోసం ఎందుకు కష్టపడతారు? నీ మేలుగోరు బంధువులు, నీ స్నేహితులు, నిన్ను వదిలిపోగా నువ్వు ఒంటరివాడివై భయంతో గాలికి గడ్డిపోచ వణికినట్లు ఏ సమయంలో ఏమవుతుందో అని భయపడతావు. ఉత్తభయం మాత్రమే కాదు. నీకు కీడుకూడా కలుగుతుంది. నీ విరోధ బుద్ధి మానుకుని వినయంగా మా వెంట కిష్కింధకు రా. ఇదివరకులాగే నిన్ను నీ పినతండ్రి యువరాజుగా నియమిస్తాడు. నీమీద ఆయనకు ఎలాంటి ద్వేషం లేదు. ఆయన నిర్మలమైన మనస్సుకలవాడు. ప్రతిజ్ఞ తప్పనివాడు. నామాట నమ్ము. నీకెప్పుడూ సుగ్రీవుడు కీడుచేయడు. కాబట్టి యువరాజా! కిష్కింధకు పోదాం”.

         హనుమంతుడిలా సుగ్రీవుడిని ప్రశంసించి చెప్పగా తన మనసులో మాట మెల్లగా ఆయనకు చెప్పాడిలా. “తనపని చక్కపరిచి తన ప్రాణం కాపాడిన ఋజుమనస్కుడు రామచంద్రుడినే మరచిపోయినవాడు మరింకెవరి మేలు కోరగలడు? ఇది కృతఘ్నతకు దృష్టాంతం. ఇలాంటివాడు ధర్మమార్గంలో నడుస్తాడా? ఈ విధమైన చపల చిత్తుడుని, స్మృతిలేనివాడిని, పాపాత్ముడుని, కృతఘ్నుడుని సద్వంశంలో పుట్టి గౌరవంగా బతకాలనుకున్న వాడెవరూ నమ్మరు. ఆయన తనకొడుకుకు రాజ్యం ఇస్తాడు కాని విరోధి కొడుకైన నన్ను ప్రాణాలతో కూడా వుండనిస్తాడా? ఆయనకు ఇప్పుడు కొడుకుల్లేకపోయినా ముందు-ముందు పుట్టరని ఏమిటి? కాబట్టి నేను బతికితే రాజ్యం ఆశిస్తాడని నన్ను చంపుతాడు. నా మనసులో వున్న ఆలోచనంతా చెప్పాను. ఈ కారణాన నేను స్పష్టంగా అపరాధం చేసినట్లే. దీనుడిని. నా రక్షణలో శక్తిలేనివాడిని. కాబట్టి నేను జీవించి దిక్కులేనివాడిలాగా కిష్కింధలో ఎలా వుండగలను? ప్రాణం తీపికదా? సుగ్రీవుడు నేనెక్కడ రాజ్యానికి ప్రభువునైతానో అని నన్ను బతకనీయడు. అక్కడికి వచ్చి చెరసాలలో పడి చావడం కంటే ఇక్కడ ప్రాయోపవేశం చేయడం మేలు”.

అని చెప్పి అంగదుడు తోటి వానరులతో, “వానరులారా! మీరు మీ ఇష్టం వచ్చినట్లు మీమీ ఇండ్లకు పోవచ్చు. ఆజ్ఞ ఇస్తున్నాను. నేను కిష్కింధకు రాను. నేను ఎలా జీవించి వుండగలను?” అని అంటూ, దర్భలు పరచి, వాటిమీద తూర్పు ముఖంగా కూర్చుని మరణమే మేలని నిశ్చయించుకున్నారు. రామచంద్రుడితో సహా అందరినీ తలచుకుంటూ, జటాయువు పేరెత్తాడు. ఏ ప్రదేశంలోనైతే వానరులు చావాలని నిర్ణయించారో, అక్కడే, జటాయువుకన్నా దీర్ఘకాలం జీవించివున్నవాడు, గద్దలకు రాజు, పర్వతగుహలో వున్నవాడు, సంపాతి బయటకు వచ్చి, వానరులందరినీ సంతోషంగా చూశాడు. ఆయన రాకతో అంగదుడి కథ ఒక మలుపు తిరిగింది.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

 

Wealth created massive employment in TS : Vanam Jwala Narasimha Rao

 Wealth created massive employment in TS

Vanam Jwala Narasimha Rao

Hans India (24-01-2021)

The time has come now to redefine the whole notion and perspective of employment at least in the context of Telangana. It is high time that critics realize that jobs are not mere figures and that too in government departments. The umpteen welfare and development programs in Telangana that enhance the living standards of people and create livelihood in some form or other whereby people are able to stand on their own legs with an assured monthly or annual income are the real employment creation and job creation.

Put this in the perspective of the Telangana State under the Chief Ministership of K Chandrashekhar Rao. Ever since KCR assumed the office, he had been consistently advocating the need to create wealth and prosperity of all sections of the people. He always stresses on the prosperity of people. When wealth is created it automatically creates employment, the term often erratically used for jobs. KCR’s preference is social insurance. 

We defined our country as a Welfare State. The welfare state is a form of government in which the state protects and promotes the economic and social well-being of the citizens, based upon the principles of equal opportunity and equitable distribution of wealth. The welfare state is a way of governing in which the state or an established group of social institutions provides basic economic security for its citizens. By definition, in a welfare state, the government is responsible for the individual and social welfare of its citizens. A fundamental feature of the welfare state is social insurance. All these fundamental concepts hold good cent percent in case of Telangana State led by KCR.

Against this theoretical context, one should understand the difference between unemployment and getting a gainful employment. No State in the world can ever provide jobs for all its unemployed in the government sector.

A quick look at all the welfare and development programmes, policies and schemes that KCR’s government had been implementing for the past six and half years, one can come to the conclusion that, each and every measure is aimed at creating wealth and making people self-reliant financially and socially. This essential part of the policies, programmes and schemes of KCR are never explored in real essence.

Take any of the schemes and programmes of the KCR government, there is an opportunity linked to it to create wealth. These include programmes like Palle Pragathi and Pattana Pragathi that have tremendous economic activity imbibed to it. For instance, under Palle Pragathi each Gram Panchayat is given a Tractor with trolley and Tanker to transport the debris and to water the plants. The activity of each tractor with Trailer and Tanker provides employment at least to three persons. Imagine how much employment it created in the villages all over the State. Should we not count this as job creation?

Take the programmes aimed at empowering the hereditary professions, be it distributing Sheep, fish lets, incentives given to the Dairy industry or helping the Hairdressers to open a modern Saloon in the rural areas or helping a goldsmith to open his workshop and sale outlet have all provided new opportunities. Fish culture has been developed at several irrigation projects and reservoirs. The day is not far off when Telangana state starts exporting the meat and fish to other states and country. These are all directly and indirectly increase the economic activity, which in turn creates both personal, and market wealth. Should we not count this as job creation?

Take another major policy like Rythu Bandhu. The financial assistance given to each farmer for two crops in a year will result in the farmer employing some more people to help him in his activities. Even assuming that each farmer needs four to five persons support, it means more gainful employment. Construction of major, medium, minor and small irrigation projects also add to the list of more employees. Once these projects are all completed, we need a major work force to maintain them. Mechanization of Agriculture too creates job opportunities. Is this not employment? The Rythu Bhima a social insurance enables the diseased farmer’s family members to stand on their own legs-a livelihood.    


For any evaluation of state’s economic health, the per capita calculation gives the actual position. In the Telangana State, for the past six and half years, the Per Capita power consumption has increased leaps and bounds. In 2014, the total power consumption was 47,338 million units (MU). The power consumption was 68,147 MU in 2018-19. In the last six years, there has been an increase of 44 per cent in consumption. This is an indicator of individual’s wealth strength. The reforms and restructuring in the power sector not only pulled the state out of perennial power crisis to a power surplus state but also opened up vast opportunities to thousands of skilled and unskilled people to get a gainful employment.

The per capita income at constant prices in Telangana State had increased from Rs 91121 (During 2011-12) to Rs 153927 (During 2019-20) registering a growth from 1.8% to 7.2%. The GSDP during the same period increased from Rs 359434 to Rs 663258 registering a growth from 2.97% to 8.23%.  The per capita income at current prices in Telangana State had increased from Rs 91121 (During 2011-12) to Rs 228216 (During 2019-20) registering a growth of 11.6%. The GSDP during the same period increased from Rs 359434 to Rs 969604 registering a growth of 12.61%. This is yet another indicator of great wealth creation.  

Right from the day one, KCR had been focussing on the need to strengthen the rural economy. All his schemes, policies and programmes are planned and executed towards this direction. Besides filling up of all the government vacancies in the rural areas, KCR created many jobs with his reform linked administrative decisions like creation of new districts, converting several panchayats to major panchayats, merging some major panchayats to municipalities, converting some municipalities into Corporations etc. The government also converted Tribal Gudems, Thandas and other habitations into Panchayats. Increase in the Police stations, Circles, Divisions and a host of other decisions have created more employment and wealth creation.

Construction of Vaikunta Dhamams, Burial grounds, integrated veg and non-veg markets, Rythu Vedikas, repair and development of internal and external roads, creation of plant nursery in every village, implementation of Haritha Haram on a regular basis, all these activities are proving direct and indirect employment to the local people.

A slew of welfare and development measures taken in the Handloom Sector, Textiles have not only pulled the sector out of woods but also helped it to sustain economically. To support this sector, the government ordered that all the government educational institutions including the residential one gets their required school dresses and other upholstery done from buying cloth from the handloom and power loom sectors. This opened up a flood of activity, which led to more employment and wealth creation.

If one does an analysis sector by sector, the results would be mind-blowing and they show how Telangana State under KCR’s Chief Ministership created more wealth creation and thereby more jobs and more gainful employment as well as livelihood. Moreover, in the past six and half years the state had employed more than 1.25 Lakh jobs in the government, State-owned public Sector undertakings, non-government sector besides 5.82 lakhs in IT sector and 14.96 lakhs in industrial sector due to TS-IPASS totalling 22 lakhs.  

If one can recall what Kautilya (Chanakya) stated in his Arthasastra, one would realise that the ideas of wealth creation are rooted in our country’s tradition. Several recent economic surveys by the States and the Nation have mentioned about the importance of wealth Creation. (with VJM Divakar)

దుష్యంత, శకుంతల వృత్తాంతంలో అద్భుతమైన నన్నయ పద్యాలు (ఆస్వాదన-3) : వనం జ్వాలా నరసింహారావు

 

దుష్యంత, శకుంతల వృత్తాంతంలో అద్భుతమైన నన్నయ పద్యాలు

(ఆస్వాదన-3)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-01-2021)

యయాతి కొడుకు పురూరవ వంశక్రమంలో, ఇలినుడికి-రథంతరికి అత్యంత సమర్థుడైన దుష్యంతుడు జన్మించాడు. అతడు చిన్నవయస్సులోనే దుర్గమ మైన అడవులలో తిరిగే పెద్ద పెద్ద మృగాలను పట్టుకుంటూ తన ధైర్యాన్ని చాటుకునేవాడు. ఆ తరువాత యౌవన గర్వంతో భూలోకంలో మిక్కిలి గొప్పవాడిగా అతిశయించాడు. భుజబలంతో ఓటమిని ఎరుగకుండా భూమిని పాలించాడు.

దుష్యంతుడు ఒకనాడు వేటాడుతూ, అనేక మృగాలను తరిమి తరిమి చంపుతూ, అందమైన ఒక వనాన్ని చూశాడు అడవిలో. దుష్యంతుడు ఆ వన సౌందర్యాన్ని మెచ్చుకుంటూ వచ్చి, ఆ వనంలో ప్రవేశించే సమయంలో ఆయన పొందిన అనుభూతిని చక్కటి పద్యంలో వర్ణించాడు నన్నయ ఈ విధంగా:

చ:       అతిరుచిరాగతుం డయిన యాతనికిన్‌ హృదయప్రమోద మా

తతముగ నవ్వనంబున లతాలలనల్‌ మృదులానిలాపవ

ర్జిత కుసుమాక్షతావళులు సేసలు వెట్టినయట్టిరైరి సం

పత దళినీనినాదమృదుభాషల దీవన లొప్ప నిచ్చుచున్

         (మిక్కిలి సముచితంగా వచ్చిన ఆ దుష్యంతుడికి మనస్సులోని ఆహ్లాదం అధికమయ్యే విధంగా ఆ వనంలోని లతలనే వనితలు అటూ ఇటూ ఎగురుతున్న ఆడు తుమ్మెదల ఝంకారధ్వనులనే మెత్తటి మాటలతో తగిన విధంగా ఆశీస్సులు ఇస్తూ, మెల్లటి గాలులతో రాల్పబడిన పూలనే అక్షతల సమూహాన్ని తలంబ్రాలుగా చల్లినట్లు భాసించారు). 

         ఈ సందర్భాన్ని, పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు ఇలా రాశారు: “ఈ వర్ణనం దుష్యంతుడికి కలగబోయే కల్యాణాన్ని సూచిస్తున్నది. ఈ పద్యం నన్నయగారి ప్రసన్నకథాకలితార్థయుక్తికి, రుచిరార్థసూక్తికీ చక్కటి ఉదాహరణ. సవర్ణదీర్ఘాక్షరాల సంయోజనం పద్యానికి గీతికామాధుర్యాన్ని కలిగిస్తున్నది. నన్నయ కవితా లక్షణాలన్నీ అమరిన అందమైన పద్యం ఇది”.

         దుష్యంతుడు ఆ వనంలో అలా వెళ్తూ, వెళ్తూ కణ్వమహాముని ఆశ్రమాన్ని చూశాడు. అక్కడ కలిసిమెలిసి తిరుగుతున్న పరస్పరం వైరి స్వభావం కల ఎలుకలు-పిల్లులను, ఏనుగులు-సింహాలను చూసి ముని మహిమకు ఆశ్చర్యపడ్డాడు. తన వెంట వచ్చిన అనుచరులను బయటనే ఆపుచేసి, దుష్యంతుడు ఒక్కడే కణ్వుడి నివాసంలోకి పోయి అక్కడ శకుంతల అనే కన్యను చూశాడు. శకుంతలను వర్ణిస్తూ నన్నయ, ఆమెను తామర రేకుల లాంటి విశాలమైన కళ్ళు కలదని, ఒత్తుగా గుమికూడిన తుమ్మెదలాగా నల్లగా వంకరలైన మెత్తటి ముంగురులు కలదని అన్నాడు. నన్నయ రాసిన పద్యాన్ని విశ్లేషిస్తూ డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు, శకుంతల మధురమూర్తిని వర్ణించడంలో నన్నయ మాధుర్యగుణం పోషించాడని అన్నారు. శకుంతల కూడా సౌందర్యవంతుడైన రాజును చూసి, అతిథి మర్యాదలు చేసింది.

          కణ్వుడిని దర్శించుకుని పోదామని వచ్చానని, వారు ఎక్కడికి పోయారని అడిగాడు దుష్యంతుడు. పండ్లు తేవడానికి అడవికి పోయారని జవాబిచ్చింది శకుంతల. కణ్వమహాముని అడవి నుండి వచ్చేవరకు వుండమని కోరింది దుష్యంతుడిని. శకుంతల ఎవరని, ఎవరి కూతురని, అపురూప సౌందర్యంకల ఆమె ఏ కారణాన ఆశ్రమానికి వచ్చిందని ప్రశ్నించాడు రాజు. కణ్వమహాముని కూతురునని జవాబిచ్చింది. ఆమె ముని కన్య అయితే ఆ కోమలిమీద తన మనసు ఎందుకు గాఢంగా లగ్నమైంది అనుకున్న దుష్యంతుడు ఆమె మాటలను నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఇక్కడ నన్నయ ఒక చక్కటి పద్యం రాశాడు ఇలా:

         చ:       ఇది మునికన్య యేని మఱి యేలొకొ యీలలితాంగియందు నా

హృదయము దద్దయుం దవిలె; నిప్పలు కింకను నమ్మనేర న

య్యెద; విజితేంద్రియుం డనఁగ నిమ్మునిఁ బాయక విందు’ నంచుఁ దా

నిది కలరూ పెఱుంగ నవనీపతి యుత్సుకుఁ డయ్యె నాత్మలోన్

         తన తండ్రి కణ్వమహాముని తన జన్మ వృత్తాంతాన్ని ఒక మునికి తాను వినేట్లు చెప్పాడనీ, ఆ వివరాలు దుష్యంతుడికి వివరిస్తాననీ అన్నది శకుంతల. రాజర్షిగా వున్న విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపస్సు చేస్తున్నప్పుడు ఆయన తపస్సు భంగం చేయడాని మేనక వచ్చింది. విశ్వామిత్రుడు ఆమె పొందు కోరుకున్నాడు. వారిద్దరికి బిడ్డ పుట్టింది. ఆ బిడ్డని మేనక మాలినీ నది తీరాన ఉంచి దేవలోకానికి వెళ్లిపోయింది. విశ్వామిత్రుడు తపోవనానికి పోయాడు. ఆ పసిబిడ్డను పక్షులు కాపాడాయి. ఏడుస్తున్న అ అపసిపాపను కణ్వమహాముని చూశాడు. చూసి తన ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచాడు. శకుంతలాల వల్ల రక్షించబడింది కాబట్టి శకుంతల అని నామకరణం చేశాడు. తానే ఆ శకుంతలను అని చెప్పింది.

         అప్పుడు దుష్యంతుడు తనలో తాను ఇలా ఆలోచించాడు. ఇక్కడ నన్నయ రాసిన పద్యం ‘ఇది మునినాథ కన్యయని’ మొదలవుతుంది. లోగడ ‘ఇది మునికన్య యేని’ అని రాసిన పద్యం దీంతో అన్వయించుకుని చదవాలి. శకుంతల ముని కన్య యేమో అని మిక్కలి నిరాశతో వున్న దుష్యంతుడి హృదయం ఆమె రాజపుత్రి అని చెప్పడంతో ఎంతో సంతోషించాడు దుష్యంతుడు. నన్నయ రాసిన ఆ పద్యం:

         చ:       ఇది మునినాథ కన్య యని యెంతయు నిస్పృహవృత్తి నున్ననా

హృదయము రాజపుత్త్రి నని యిక్కమలాక్షి నిజాభిజాత్య సం

పద నెఱిఁగించినన్‌ మదనబాణపరంపర కిప్పు డుండ నా

స్పద మయి సంచలించె నళిపాత వికంపిత పంకజాకృతిన్‌

           నన్నయ రాసిన ఈ పద్యాన్ని గతంలో రాసిన పద్యాన్ని కలిపి విశ్లేషిస్తూ డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు ‘ఇది మునికన్య యేని’ అనే పద్యం, ‘ఇది మునినాథ కన్య యని’  అనే ఈ పద్యం రెండూ నన్నయ ఈ కథకు పెట్టిన రెండు వెన్నెలలు. దుష్యంతుడి ఉత్తమ చిట్టా వృత్తికి ఉదాహరణలు. ఈ రెండు పద్యాలు నాయకగతమైన స్థాయి పోషణలో రెండు బలమైన బిందువులు”.

         దుష్యంతుడు, శకుంతల ఇరువురు అంగీకరించి గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటారు. ఆయన వల్ల తనకు కలిగిన పుత్రుడిని ఆయన విశాల సామ్రాజ్యానికి యౌవరాజ్య పదవిలో అభిషేకం చేయమని శకుంతల కోరింది. దానికి దుష్యంతుడు అంగీకరించాడు. ఇరువురూ ఇష్ట సుఖాలను అనుభవించారు. దుష్యంతుడు ఆ తరువాత తన నగరానికి వెళ్లిపోయాడు.

         అడవికి వెళ్లిన కణ్వమహాముని తిరిగి వచ్చి జరిగినదంతా తన దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు. క్షత్రియులకు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే అన్నాడు. శకుంతల గర్భవతి అయ్యి, మూడేళ్లు నిండిన తరువాత కుమారుడు పుట్టాడు. అతడు కూడా తండ్రిలాగా అమోఘమైన బలవంతుడు. తన బాల్యక్రీడాలను అనేక విధాలుగా ప్రదర్శించే వాడు. కొన్నాళ్ల తరువాత కణ్వమహాముని శకుంతలతో కుమారుడిని తీసుకుని ఆమె భర్త దగ్గరికి పొమ్మని చెప్పాడు. ఆమె అలాగే వెళ్లి రాజును సభలో చూసింది. కాని, రాజు ఆమెను గుర్తు బట్టనట్లు చేశాడు. ఆమె హృదయం వికలమై పోయింది. తమ ఇద్దరి మధ్య జరిగినదంతా చెప్పింది. అయినా స్పందన లేకపోవడంతో ధర్మప్రబోధన చేసింది. ఇక్కడ నన్నయ రాసిన రెండు పద్యాలు అద్భుతంగా వున్నాయి. అవి:

         మ:      విపరీత ప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్త్రగా

త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం

ద్రవరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్న్స యుం బుత్త్రగా

త్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్ శీతమే         

           చ:       నుతజలపూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూఱిటికంటె నొక్కస

త్క్రతువది మేలు; తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు; త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్

         దుష్యంతుడు ఇన్ని చెప్పినా అంగీకరించలేదు. ఆమెను ఇంతకు పూర్వం అసలే చూడలేదన్నాడు. ఏడుస్తూ ఆమె తిరిగిపోతున్న సమయంలో ‘ఈ భరతుడు శకుంతల, దుష్యంతులకు పుట్టిన ముద్దు బిడ్డడని, అతడిని స్వీకరించమని దుష్యంతుడికి ఆకాశవాణి అంతా వినేట్లు చెప్పింది. అప్పుడు దుష్యంతుడు జరిగిన విషయాన్ని అందరికీ చెప్పి భార్యను, కొడుకు స్వీకరించాడు. భరతుడు అపారమైన సామ్రాజ్యాన్ని వహించి, లోకంలో ప్రసిద్ధికెక్కి  అనేక సంవత్సరాలు పాలన చేశాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, చతుర్థాశ్వాసం  

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

హనుమంతుడికే ముద్రికనెందుకిచ్చాడు శ్రీరాముడు? : వనం జ్వాలా నరసింహారావు

 హనుమంతుడికే ముద్రికనెందుకిచ్చాడు శ్రీరాముడు?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శనివారం (23-01-2021) ప్రసారం   

         సీతాన్వేషణ చేయడానికి, శ్రీరాముడికి ఇచ్చిన మాట ప్రకారం వానర సేనను నలుమూలల నుండి రప్పించిన తరువాత, తాను రామచంద్రుడి కార్యం నేరవేర్చానని సంతోషించాడు సుగ్రీవుడు. అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుడితో రామచంద్రమూర్తిని చూడడానికి పోదామా అని అడిగాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం అలాగే చేద్దామని అన్నాడు సుగ్రీవుడు. అంతా కలిసి రామచంద్రమూర్తి వున్న చోటుకు పోయారు. వానరసేనను చూసి రామచంద్రమూర్తి సుగ్రీవుడిని దయగా, ప్రేమగా పలకరించాడు.

         సుగ్రీవుడిని సంతోషంతో కౌగలించుకుని, ప్రేమతో ఇలా అన్నాడు. “సుగ్రీవా! ధర్మం, అర్థం, కామం అనేవాటిని వేర్వేరుగా భాగించుకుని, ఏఏ వేళల దేనిని అనుష్టించాల్నో తెల్సుకుని, ఒకటి చేసేటప్పుడు ఇంకొకటి చేయకుండా, దేన్నీ ఉపేక్షించకుండా వాటిని సేవించే వాడే రాజని కీర్తి వహిస్తాడు. (సుగ్రీవుడు ధర్మార్థాలను సేవించాల్సిన సమయంలో కామం అనుభవించాడని, అది రాజనీతి కాదని ఇక్కడ భావం). ధర్మాన్ని వదిలి, అర్థాన్ని మరిచి, ఎప్పుడూ కామంమీదే ఆసక్తికలవాడు చెట్టు కొనకొమ్మ మీద నిద్రపోయి, నేలమీద పడి మేల్కొన్నవాడితో సమానం. శత్రువులను చంపుతూ, స్నేహితులను సంపాదించుకుంటూ, హెచ్చరికగా ధర్మార్థ కామ ఫలాలను అనుభవించే రాజు ధర్మ మార్గంలో నడిచిన వాడవుతాడు. సుగ్రీవా! ఇది మన పనికోసం ప్రయత్నం చేయాల్సిన సమయం.  మంత్రులు, దండనాయకులు, ఇతరులతో ఇప్పుడే సభ ఏర్పాటుచేయి. ఎలా కార్యం ముందుకు తీసుకుపోవాలో ఆలోచిద్దాం”.

         రామచంద్రమూర్తి చెప్పిన మాటలకు జవాబుగా సుగ్రీవుడు ఇలా అన్నాడు. “రామచంద్రా! నాకు పోయిన మహైశ్వర్యం, వానర రాజ్యలక్ష్మి, గొప్ప కీర్తి, ఇవన్నీ నీ వల్ల, నీ తమ్ముడివల్ల, మీ ఇద్దరి అనుగ్రహం వల్ల, నాకు లభించాయి. ఇలాంటి నీకు ప్రత్యుపకారం చేయతలచనివాడు ఎల్లప్పుడూ నిందించతగిన వాడే. భూమండలంలోకల కోతులను, కొండముచ్చులను, ఎలుగులను, బలవంతులను పిలిపించాను. వీరంతా సాధారణమైన కోతులు కావు. కోరిన రూపం ధరించగలవారు. అడవి మార్గాలు తెల్సినవారు. తమతమ సేనలతో వందలు, వందవేలు, వంద లక్షలు, అయుతాలు, శంకువులు, అర్భుదాలు, ఖర్వాలు, మధ్యములు, అంతములు, సాగరములు, పరార్తాలుగా వస్తున్నారు. దుష్టుడైన రావణుడిని చంపి వీరు నీ భార్యను తెచ్చి నీకు సమర్పిస్తారు”. సుగ్రీవుడిలా చెప్పగా, ఆయన చేసిన యుద్ధ ప్రయత్నమంతా తెలుసుకుని, రామచంద్రమూర్తి సంతోషించాడు.

         ఇలా శ్రీరామ సుగ్రీవులు మాట్లాడుకుంటున్న సమయంలో వానరసేన భూమంతా నిండింది. పదివేల కోట్ల కోతులు కొలుస్తుంటే శతవలి వచ్చాడు. తారకు తండ్రైన సుషేషణుడు పదివేల కోట్ల సేన కొలుస్తుంటే వచ్చాడు. రుమ తండ్రైన తారుడు కోటి సహస్రాల కోతులతో వచ్చాడు. హనుమంతుడి తండ్రైన కేసరి వెయ్యి అనీకములు కొలుస్తుంటే వచ్చాడు. గవాక్షుడు కోటివేల కపులతో వచ్చాడు. రెండు కోట్ల ఎలుగులతో ధూమ్రుడు వచ్చాడు. పనసుడు మూడు కోట్ల కపులతో వచ్చాడు. నీలుడు పదికోట్ల కోతులతో, గవయుడు ఐదు కోట్ల వానరులతో వచ్చారు. వేయి కోట్ల కోతులతో దరీముఖుడు, మూడు కోట్లతో గజుడు, వేయి కోట్ల కోతులతో అశ్వినీ దేవతలా కుమారులు ద్వివిదుడు, మైందుడు, పదికోట్ల కోతులతో జాంబవంతుడు వచ్చారు. నూరుకోట్ల కపులు సేవిస్తుంటే రుమన్వంతుడు సుగ్రీవుడి ఆజ్ఞానుసారం ర్రామచంద్రుడి దగ్గరకు వచ్చాడు. నూరు వేల కోట్ల కోతులతో గంధమాదనుడు వచ్చాడు.

తారుడు ఐదు కోట్ల కోతులతో వచ్చాడు. తార కొడుకు అంగదుడు వేయి పద్మాలు, నూరు శంకువులు సంఖ్య కల కోతులతో వచ్చాడు. ఇంద్రజాను శూరుడు పదకొండు కోట్ల వానరులు కొలుస్తుంటే రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. పదివేల లక్షల కోతులు కొలవగా రంభుడు వచ్చాడు. రెండు కోట్ల కోతులు సేవిస్తుంటే దుర్ముఖుడు వచ్చాడు. వేయి కోట్ల కోతులు సేవిస్తుంటే హనుమంతుడు వచ్చాడు. నలుడు, వీరులైన ఇతర వానరులు శత లక్ష కోట్లతో, దదిముఖుడు పది కోట్ల వానరులతో, వహ్నికుముదుడు, రంహుడు, ఉగ్ర శరభుడు మొదలైన వానర సమూహాలు వచ్చాయి.

వీరు కాకుండా కొండల సమూహాల్లో, నదుల ఒడ్డులలో, అడవుల్లో వుండే వారు వచ్చారు. వారి సమాఖ్య ఇంత అని చెప్ప అలవికాదు. వచ్చిన వారందరినీ సుగ్రీవుడు వాళ్ల గురించి రామచంద్రుడికి తెలియచెప్పి, వారి క్షేమ సమాచారాలను విచారించాడు. వారిని వాళ్ల సేనలతో అడవుల్లో, కొండల్లో వుండమని ఆదేశించాడు. “ఈ సేన అంతా నీదే. నీ ఆజ్ఞకు లోబడి నీ ఆజ్ఞానుసారం నడచుకుంటారు. ఇక ఏమి చేయాలో సెలవివ్వు. ఇక్కడ వున్న వానరులు అప్పచెప్పిన పని చేయడానికి సమర్థులు. వీరందరినీ నేను ఎరుగుదును. అయినప్పటికీ నువ్వు ఆలోచించి తగిన విధంగా వీరితో పని చేయించుకో” అని సుగ్రీవుడు రాముడికి చెప్పాడు.

         రామచంద్రమూర్తి సుగ్రీవుడిని కౌగలించుకుని ఇలా అన్నాడు. “దశకంఠుని ఇంట్లో  సీతాదేవి బతికున్నదో, లేదో మొదట తెల్సుకోవాలి. ఆమె మరణించి వుంటే మనం ఏ ప్రయత్నం చేయలేం కదా? కాబట్టి రావణుడు వుండే ప్రదేశం, సీతాదేవి బతికున్నదా? లేదా? అనే విషయం, బతికుంటే ఎలా వుంది అనే సంగతి, తెలసిన తరువాతే నువ్వు చేయాల్సిన సహాయం గురించి చెప్తాను. కార్యమంతా నెరవేర్చడానికి నువ్వే సమర్థుడివి. ఎవరెవరిని ఎక్కడికి పంపాలో నువ్వే పంపించు.

రామచంద్రమూర్తి ఇలా సుగ్రీవుడికి చెప్పగానే, ఆయన రామలక్ష్మణుల ఎదుటనే, వినతుడిని శీఘ్రంగా పిలిచి లక్షల కొద్దీ వానరులు ఆయనను సేవిస్తుంటే, తూర్పు దిక్కుగా రావణాసురుడు వుండే స్థలం వెతకడానికి త్వరగా వెళ్లమని చెప్పాడు.     తూర్పుదిక్కున వెతకడానికి వానర శ్రేష్టులను పంపిన సుగ్రీవుడు ఆ తరువాత దక్షిణ దిక్కున వెతకడానికి సమర్థులైన అగ్ని కొడుకు నీలుడిని, హనుమంతుడిని, బ్రహ్మ కొడుకైన జాంబవంతుడిని, గజుడిని, సుహోత్రుడిని, గవయుడిని, శరారిని, శరగుల్ముడిని, సుషేణుడుని, ఋషభుడిని, గవాక్షుడిని, అశ్వనీ దేవతల కుమారులైన మైంద-ద్వివిదులను, గంధమాదనుడిని, విజయుడిని, ఉల్కాముఖుడిని, అంగదుడిని, తదితర ప్రసిద్ధ బలులను పంపాలని భావించి కొంత సేనను వారికంటే ముందుగానే దక్షిణ దిక్కుకు పంపాడు. వీళ్లందరినీ తన దగ్గరికి పిలిచి దక్షిణ దిక్కున కల కొండల, గుట్టల, అడవుల గురించి వివరంగా చెప్పాడు.

         హనుమంతుడిని, ఇతరులను దక్షిణ దిక్కుకు పొమ్మని ఆజ్ఞాపించిన సుగ్రీవుడు తన మామ, తారకు తండ్రైన, మహాబల పరాక్రమవంతుడు సుషేణుడిని పిలిచి ఆయనతో పాటు మరీచి మహర్షి కుమారుడిని, మారీచుడనే వాడిని, మిగతా మారీచులను, శూరులను చూసి వారితోపాటు రెండు లక్షల కోతులను తీసుకుని పశ్చిమ దిశగా పొమ్మన్నాడు. తన మామను పశ్చిమ దిక్కుగా పంపిన సుగ్రీవుడు శతవలిని ఉత్తర దిక్కుగా పొమ్మన్నాడు.

         ఈ విధంగా నలుదిక్కులకు పోయేవారికి చెప్పాల్సిన మాటలు చెప్పిన సుగ్రీవుడు హనుమంతుడిని చూసి, ఇతడివల్లే ఈ కార్యం సాధ్యమవుతుందని, ఇతడే ఈ పనిని సాధించగల సమర్థుడని ఆలోచించి, నిశ్చయించి, పరాక్రమశాలైన హనుమంతుడితో ఇలా అన్నాడు.

         “ఓ వానరసత్తమా! నీళ్లల్లో, నిప్పుల్లో, స్వర్గంలో, ఆకాశంలో, నీ గమనం అనివార్యం. నువ్వు పోవాలనుకుంటే అడ్డం రాగలది, ఆటంకపర్చగలది ఏదీ లేదు. ఇది నిశ్చయం. నాకు తెలుసు. అసురులతో, గంధర్వులతో, దేవతలతో, సర్పాలతో, మనుష్యులతో, కొండలతో, సముద్రంతో కూడిన ఈ సమస్త భూమండలంలో నీకు తెలియరానిది వుందా ఆంజనేయా? వేగంలో, తేజంలో, తేలికలో పోవడానికి, బలాతిశయం చూపడానికీ నువ్వు నీ తండ్రితో సమానం ఆంజనేయా! ఓ కపీశ్వరా! నీ అతిశయించిన తేజస్సును పోల్చి చూస్తే నీకు సమానమైన ప్రాణి ఈ భూమ్మీద లేదు. కాబట్టి హనుమంతా! రామచంద్రమూర్తి భార్యను సాధించి మరల తెచ్చే ఉపాయం ఏదో అది నువ్వే చేయాలి. నీకు తప్ప ఇతరులకు అది సాధ్యంకాదు”.

         హనుమంతుడు ఇంత బలశాలి, గొప్పవాడు అని సుగ్రీవుడికి తెలుసు కదా! ఎందుకు అతడిని వాలిమీదకు యుద్ధానికి పంపలేదు? హనుమంతుడు తనంతట తానే ఎందుకు వాలిని నిరోధించలేదు? ఇంత బలవంతుడు సహాయుడిగా వుండి కూడా ఎందుకు సుగ్రీవుడు కష్టపడ్డాడు? హనుమంతుడు సుగ్రీవుడి బంటు. స్వామి ఆజ్ఞ లేకుండా ఏదీ చేయకూడదు. తాను వాలిని జయించలేను, అని చెప్పి బంటు సహాయం కోరలేడు కదా! అలా కోరడం తనకు అవమానంగా సుగ్రీవుడు భావించి వుండవచ్చు. తనంతట తానే వాలిని నిరోధిస్తే అది సుగ్రీవుడిని అవమానించినట్లే. ఒక వేళ హనుమంతుడు సుగ్రీవుడి పక్షాన యుద్ధానికి వస్తే వాలి పక్షం వారంతా అతడిని ఎదిరించడానికి వస్తారు. ఆ పోరుకు అంతం ఎక్కడ? కాబట్టి అన్నదమ్ములే కొట్టుకుని చావనీ అని మిగతా వారంతా వూరుకున్నారు. హనుమంతుడికి కూడా తన బలం తనకు తెలియదు. స్వయంగా దేనికీ సాహసించడు. జాంబవంతుడి లాంటివారు వుండాలి ప్రోత్సహించడానికి. హనుమంతుడికి భయపడడం వల్లే వాలి సుగ్రీవుడిని భయపెట్టాడు కానీ చంపడానికి పూనుకోలేదు.

ఇలా సుగ్రీవుడు అంటుంటే రామచంద్రమూర్ర్తి, సుగ్రీవుడు కార్యభారాన్ని హనుమంతుడి మీద పెట్తున్నాడు కాబట్టి, ఈ అంజనేయుడే నిశ్చయించిన కార్యం చేసే శక్తికలవాడని భావించాడు. ఇలా భావించిన రామచంద్రమూర్తి  తన పేరు చెక్కబడిన బంగారపు ఉంగరాన్ని తన చేతిలో తీసుకున్నాడు. హనుమంతుడితో “వానరశ్రేష్టా! దీన్ని తీసుకునిపో. సీతకు చూపించు. ఇది చూపిస్తే నువ్వు నిజంగా నా దూతవేనని భయం లేకుండా నీతో మాట్లాడుతుంది. సుగ్రీవుడు అప్పచెప్పిన పని చేయగల సమర్థుడివి నువ్వే అని నాకు అనిపిస్తున్నది. ఈ కారణాన దీన్ని నీదగ్గర వుంచుకో” అని అన్నాడు.

రామచంద్రమూర్తికి ఈ ఉంగరం ఎక్కడినుండి వచ్చింది? సర్వం త్యజించిన వానప్రస్థుడు ఉంగరం దరించవచ్చా? అయితే, రామచంద్రమూర్తి వానప్రస్థాశ్రమం స్వీకరించలేదని అయోధ్యకాండలో చెప్పడం జరిగింది. కైకేయి కోరిక ప్రకారం నారచీరెలు ధరించాడే కాని, తక్కిన ఆశ్రమ చిహ్నాలను అనుష్టించలేదు. ఆ కారణాన ఉంగరం ధరించడం వల్ల వ్రతభంగం కలగలేదు. కాగల కార్యం ఆలోచించి సుబాహుడితో మారీచుడిని ఎందుకు చంపలేదో, అలాగే, ఈ ఉంగరాన్ని కూడా పరిత్యజించలేదు. కాని సొగసుకోసం వుంచుకోలేదు. ఇంకో విషయం....ఈ ఉంగరం సీత రామచంద్రమూర్తికి ఇచ్చింది. వివాహ సమయంలో వధూవరులు ఉంగరాలు మార్చుకునే ఆచారం ఇప్పటికీ వుంది. దాని విలువ మాత్రం కొంచెం చెడింది. ఈ ఉంగరాలను భర్త జీవించినంతకాలం భార్య, భార్య జీవించినంతకాలం భర్త విడవరాదు. స్త్రీలకు మంగళసూత్రం ఎలాగో, అలాగే, భర్తలకు ఈ ఉంగరం అలాంటిది. తక్కినవన్నీ త్యజించినప్పటికీ దీన్ని మాత్రం త్యజించకూడదు. దాన్ని త్యజించడం అంటే భార్యను త్యజించినట్లే. ఆ కారణాన రామచంద్రమూర్తి దాన్ని విడవకుండా ధరించాడు. సీతాదేవిని నమ్మించకలిగింది మరేదీ లేదు కనుక, తానిచ్చిన ఉంగరాన్ని, రాముడి వేలుకుండే ఉంగరాన్ని, సీత ఎప్పుడూ చూస్తుండే ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు.

శ్రీరాముడిలా చెప్పగా, హనుమంతుడు ఉంగరాన్ని తీసుకుని, శిరం మీద ధరించి, రెండు చేతులు జోడించి, రామచంద్రమూర్తి పాదాలకు నమస్కరించి నిలబడ్డాడు. తరువాత ఆయనతో సహా వానరులు అందరూ భక్తితో, తమ ప్రభువు అజ్ఞానుసారం పెద్ద మిడతల దండులాగా భూమంతా ఆక్రమించుకుంటూ చాలా వేగంగా పోయారు. వానరులంతా ఎవరికీ వారే తామే సీతను వెతుకుతామనీ, సీతను వెతికి తెస్తామనీ కేకలు వేయసాగారు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)