Sunday, January 24, 2021

అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-41 : వనం జ్వాలా నరసింహారావు

 అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-41

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (25-01-2021)

(పూర్వ కాలంలో అన్ని జాతుల వారు కూడా విద్య నేర్చుకునేందుకు అర్హులనే విషయం దీనివల్ల స్పష్టమవుతున్నది. ఒకానొకప్పుడు శూద్రులని పిలువబడే వారికి విద్యార్హతలుండవని వాదనుండేది. అయితే అది తప్పుడు వాదనేననాలి. నాస్తికులు అసలు లేనే లేరన్నప్పుడు "జాబాలి" అన్న వ్యక్తి నాస్తిక వాదన ఎలా చేశాడన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. జాబాలి చేసింది నాస్తికవాదమైనంత మాత్రాన, ఆయన నాస్తికుడు కావాలన్న నియమం లేదు. నాస్తిక వాదన ఆయనతో పుట్టలేదు-అంతకు పూర్వమే వుంది. దాన్నే "బృహస్పతి గీత" అంటారు. అయోధ్యలో నాస్తికులు లేరంటే, ఆ వాదనను అంగీకరించిన వారు లేరని మాత్రమే అర్థం).

అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే-ప్రేమ స్వరూపులే-ఇంద్రియ నిగ్రహం కలవారే-మంచి స్వభావం వున్న వారే-దోషరహితమైన నడవడిక గల వారే-ఋషితుల్యులే-నిష్కళంకమైన మనసున్నవారే-ముత్యాల హారాలు ధరించి, చెవులకు కుండలాలను అలంకరించుకున్నవారే-అందచందాలున్న వారే-కురూపులు కాని వారే-మకుటాలు ధరించి, చందనం పూసుకుని, కొరత లేకుండా భోగ భాగ్యాలను అనుభవించే వారే-ఇష్టమైన ఆహారాన్ని తీసుకునే వారే-అన్న దాతలే-అవయవాలన్నిటినీ అలంకరించుకునే వారే. ఇంద్రియ నిగ్రహంతో పాటు, ఇంద్రియాలను జయించిన వారక్కడి జనులు. అందరూ సోమ యాగం చేసినవారే-అగ్నిహోత్రాలు కలవారే-వారి, వారి ఆచారం ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారే-బ్రహ్మాన్ని ధ్యానిస్తూ, జప తపాలు చేసేవారే-దయాళులై, చక్కని నడవడి కలవారే. దశరథ మహారాజు పరిపాలన చేసే రోజుల్లో, అగ్నిహోత్రం లేనివాడు కానీ-సోమయాగం చేయని వాడు కానీ-అల్ప విద్య, అల్ప ధనం కలవాడు కానీ-వర్ణ సంకరులు కానీ-దొంగలు కానీ లేనే లేరు అయోధ్యా పురిలో.

తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో-అధ్యయనంలో ఉత్తములై , వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు. దశరథుడు పరిపాలన చేసే సమయంలో, చపలచిత్తులు, ఐహికాముష్మిక కార్య సాధనకు అవసరమైన దేహ బలం-మనో బలం లేనివారు, ఆరంగాలెరుగనివారు, అసత్యం పలికేవారు, ఈర్ష్య గలవారు, పాండిత్యం లేనివారు, చక్కదనం లేనివారు, పదివేలు తక్కువగా దానం చేసేవారు, దుఃఖించే వారు, రాజభక్తిలేని వారు, ఇతరులను పరవశులను చేయగల చక్కదనం లేని స్త్రీ-పురుషులు, స్త్రీలను స్త్రీలు-పురుషులను పురుషులు కూడా పరవశులు చేయగల చక్కదనం లేనివారు అయోధ్యా నగరంలో లేరు. అక్కడ నివసించే అన్ని వర్ణాలవారు దైవ పూజ చేయకుండా-అతిథిని ఆదరించకుండా, భోజనం చేయని దీక్షాపరులు. (పర గృహంలో ఒక్క రాత్రి మాత్రమే నివసించే వారిని అతిథుదులంటారు. ఒక్క రోజుకూడా-ఒక్క చోట కూడా నిలకడగా వుండలేడు కనుకనే "అతిథి" అంటారు). అయోధ్యా పురవాసులు శౌర్య పరాక్రమాలున్నవారు-సత్యమే ధనంగా కలవారు. ధనంలాగా సత్యాన్ని కాపాడుకునే శూద్రులు తాంత్రిక మంత్ర్రాలతో దేవ పూజ-హిరణ్య దానంతో అతిథి పూజ చేస్తారు. బ్రాహ్మణులు విద్యా శూరులు-వాద పరాక్రములు.

బ్రాహ్మణులుపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి క్షత్రియులు నడచుకునేవారు. వైశ్యులు రాజులకు అనుకూలంగా వుండేవారు. వంచన-దొంగతనం అనే వాటిని దరికి రానీయకుండా, బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులకు సేవ చేస్తూ, శూద్రులందరు బ్రతుకు పాటుకై కుల విద్యలు నేర్చుకుని, కులవృత్తులలో నిమగ్నమై వుండేవారు. యుద్ధ భటులు కార్చిచ్చులాంటి దేహాలతో-తేజంతో, మందరం లాంటి ధైర్యంతో, ఇబ్బందులెన్ని ఎదురైనా, అప్పగించిన పనిని నెరవేరుస్తూ దేహ-మనో బలంతో ఉత్సాహంగా వుండేవారు.

దశరథ మహారాజు సైన్యంలోని గుర్రాలను కాంభోజ, బాహ్లిక, అరేబియా దేశాలనుండి కొనుక్కొచ్చేవారు. సూర్యుడి గుర్రాలకంటే-ఇంద్రుడి గుర్రం కంటే వేగంగా వెళ్లేవా గుర్రాలు. గుణం లేనివాడు కొడుకు కానట్లే-తపస్సు చేయని వాడు తెలివైన పండితుడు కానట్లే-భార్యను వశం చేసుకోలేనివాడు మగవాడు కానట్లే-ఏనుగులు లేనివాడు రాజు కాడన్న సూక్తిని అనుసరించి, మూడు జాతుల ఏనుగులు దశరథుడి సైన్యంలో వుండేవి. భద్రం, మంద్రం, మృగం అనే మూడురకాల శుద్ధ జాతి ఏనుగులు - వీటి సంకీర్ణ జాతి ఏనుగులు (భద్ర మంద్రాలు, మృగ మంద్రాలు, భద్ర మృగాలు, భద్ర మంద్ర మృగాలు) దశరథ మహారాజు సైన్యంలో వుండి, ఎనిమిది రకాలైన మదపు నీటిని స్రవింప చేసేవి. చెక్కిళ్ల నుండి (దానం అని) , కళ్ల నుండి (సీధువు అని), చెవుల నుండి (సాగరం అని), తొండం కొన నుండి (శీకరం అని), స్తనాల కొనల నుండి (సిక్యం అని), శిశ్నం నుండి  (మదం అని), హృదయం నుండి (ఘర్మం అని), పాదాల నుండి  (మేఘం అని) మదపు నీరు స్రవించేవి. ఇలాంటి సైన్యం తోడుండగా, ఎటు దిక్కుగా చూసినా రెండామడల దూరం నిడివి కలిగిన అయోధ్యా నగరాన్ని శత్రువులు జయించలేనిదిగా-ఇంద్రుడి అమరావతి నగరం లాగా, దశరథుడు, చుక్కల్లో చంద్రుడివలె పరిపాలించేవాడు.

No comments:

Post a Comment