Sunday, January 16, 2022

కర్ణుడి జన్మరహస్యం చెప్పి అతడిని పాండవులతో కలవమన్న శ్రీకృష్ణుడు, కుంతీదేవి-తిరస్కరించిన కర్ణుడు ..... ఆస్వాదన-55 : వనం జ్వాలా నరసింహారావు

 కర్ణుడి జన్మరహస్యం చెప్పి అతడిని పాండవులతో కలవమన్న

శ్రీకృష్ణుడు, కుంతీదేవి-తిరస్కరించిన కర్ణుడు

ఆస్వాదన-55

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (16-01-2022)

ధృతరాష్ట్రుడి సభ నుండి రాయబారానంతరం వెడలిపోతున్న శ్రీకృష్ణుడి వెంట ఆయనను సాగనంపడానికి ధృతరాష్ట్రుడు ఆయన పరివారంతో సహా కొంతదూరం వచ్చాడు. దారిమధ్యలో కుంతీదేవి ఇంటికి పోయి శ్రీకృష్ణుడు ఆమెకు పాదాభివందనం చేసి జరిగిన సంగతులు వివరించాడు. ధర్మరాజాదుల దగ్గరికి వెళ్లివస్తానని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు. శ్రీకృష్ణుడి మరదులైన తన కొడుకులు, సంధికొరకు సకల విధాల శ్రమ పడ్డారని, సంధి తప్పిపోవడం కూడా మంచికే జరిగిందని, క్షత్రియజాతికి తగినది వీరవృత్తని, దేవుడు మేలు చేయగా సంధి భగ్నమైందని అన్నది కుంతి. ఆ తరువాత కుంతి దగ్గరనుండి బయల్దేరి పయనమై పోయాడు శ్రీకృష్ణుడు.

మధ్యలో శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్లాడు. కర్ణుడి జన్మ రహస్యం చెప్పాడు. కుంతీదేవి సూర్యుడివల్ల అతడికి జన్మనిచ్చిందని, అందువల్ల ఆయన పాండురాజు పెద్ద కుమారుడని, కర్ణుడు తమ అన్న అని ధర్మరాజుకు తెలిస్తే అతడికే రాజ్యభారం వహించడానికి పట్టం కడుతారని, కాబట్టి తనతో కలిసి పాండవుల దగ్గరికి కలిసి రమ్మని అన్నాడు. దేవేంద్ర వైభవంతో మహానీయుడివై మహీమండలాన్ని పరిపాలించమని పలికాడు. ద్రౌపది తన ఐదుగురు భర్తలతో పాటు కర్ణుడిని ఆరవ భర్తగా ఆప్యాయంగా స్వీకరిస్తుందని కూడా అన్నాడు.

తన జన్మ వృత్తాంతం కొంతమేరకు తనకు తెలుసనీ, కుంతీదేవి తనను కనికరం లేకుండా గంగలో తోసిందనీ, సూతదంపతులు తనను దయతో పెంచారనీ, తనను వారు కన్నకుమారుడిలాగా చూశారనీ, ఇప్పుడు వారిని వదిలితే ధర్మం తప్పినవాడిని అవుతాననీ బదులు చెప్పాడు కర్ణుడు. అలాగే సుయోధనుడు తనను ఇంత గొప్పవాడిని చేశాడని, అలాంటివాడిని యుద్ధం వచ్చే ముందర వదలడం న్యాయమా, ధర్మమా అని ప్రశ్నించాడు. తాను కుంతీ పుత్రుడినన్న రహస్యం బయటకు పొక్కకుండా భద్రంగా శ్రీకృష్ణుడు తన హృదయంలోనే వుంచుకొమ్మని కోరాడు కర్ణుడు. ధర్మరాజు లాంటి పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు కర్ణుడికి అయన తమ్ముడినని తెలుస్తే రాజ్యభారం వహించడని, అతడు రాజు కావడమే న్యాయమని అన్నాడు కర్ణుడు.

కర్ణుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు, అర్జునుడితో కర్ణుడికి జరగబోయే పోరాటంలో విజయం అర్జునుడిదేనని, అతడిని యుద్ధంలో ఎదుర్కోవడం కర్ణుడి శక్యం కాదని, కాబట్టి సర్వ విధాల పాండవులే జయిస్తారని అన్నాడు. ఏడెనిమిది రోజుల్లో అమావాస్య వస్తుందని, అది పుణ్య తిథి అని, ఆనాడు యుద్ధం ప్రారంభం కావాలని శ్రీకృష్ణుడు చెప్పి, ఆ విషయం దుర్యోధనాదులకు తెలియచేయమన్నాడు. అందుకు కర్ణుడు, కురుపాండవుల మధ్య జరగనున్న సంగ్రామంలో విజయుడిగా శ్రీకృష్ణుడిని దర్శిస్తానని, లేదా, చనిపోయి వీరస్వర్గం చేరి పరమేశ్వరుడైన ఆయన్ను చూస్తానని, తనకిక సెలవిప్పించమని అన్నాడు. సరేనన్న శ్రీకృష్ణుడు రథం ఎక్కి హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు.

ఇదిలా వుండగా, శ్రీకృష్ణుడు వచ్చిపోయిన తరువాత కుంతీదేవి మనసులో ఒక ఆలోచన వచ్చింది. కర్ణుడిని కలిసి అతడి జన్మ వృత్తాంతం చెప్పి తోబుట్టువుల మీద ప్రేమ కలిగిద్దామనుకుంటుంది. కర్ణుడి దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకున్నది. కర్ణుడు ఆ సమయంలో గంగానది దగ్గర జపం చేసుకుంటున్నాడు. ఆమెను చూడగానే తన సూత గోత్రం, రాధేయ నామధేయం చెప్పి ఆమెకు పాద నమస్కారం చేశాడు. ఆమె రహస్యంగా కర్ణుడికి కొన్ని విషయాలు చెప్పింది.

కర్ణుడు సూత కులంలో పుట్టలేదని, తనకు సూర్యుడికి జన్మించాడని, ధర్మప్రకారం అతడు పాండురాజు పుత్రుడని, కాబట్టి కర్ణుడు రాదా తనయుడన్న హీనస్థితి నుండి బయటకు వచ్చి, పాండవులతో చేరి భూమినంతా పాలించమని చెప్పింది. ఆమె ఆ మాటలు చెప్తున్నప్పుడే సూర్యబింబం నుండి అశరీరవాణి కుంతి చెప్పిన మాటలు నిజమని పలికింది. ఆమె చెప్పింది సత్యమే అయినప్పటికీ క్షత్రియులకు జరగాల్సిన సంస్కారాలు తనకు జరగలేదని, సూర్య భగవానుడి వల్ల తన జన్మ రహస్యంగా వున్నదని, ఇప్పుడు దానిని వెల్లడి చేయడం మంచిదికాదని, తానిప్పుడు పాండవులతో కలిస్తే అర్జునుడికి భయపడి కలిశానని లోకులు హేళన చేస్తారని అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడిని అవసర సమయంలో వదిలేయడం తనకు ధర్మం కాదన్నాడు. ఇదే తన నిశ్చయమని, అయితే ధర్మరాజాదులు యుద్ధంలో తన చేతికి చిక్కితే ఒక్క అర్జునుడిని తప్ప మిగతావారిని చంపనని మాట ఇచ్చాడు. తమ ఇద్దరిలో ఏ ఒక్కరు పోయినా కుంతికి అయిదుగురు కొడుకులు మిగులుతారని చెప్పాడు.

ఇది భగవత్ సంకల్పం అని అంటూ కుంతీదేవి, కర్ణుడిని కౌగలించుకుని, ఆర్జునుడిని తప్ప మిగతావారిని చంపవద్దని మళ్లీ చెప్పి, కర్ణుడు చెప్పినదానికి అంగీకరించింది. కర్ణుడు ప్రేమతో ఆమెకు నమస్కరించాడు. తరువాత ఇద్దరూ తమతమ నివాసాలకు వెళ్లిపోయారు.

శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి ఉపప్లావ్యానికి వచ్చి ధర్మరాజును కలిశాడు. కౌరవులు సంధికి అంగీకరించలేదని చెప్పాడు. హస్తినాపురంలో జరిగినదంతా వివరించాడు. కౌరవ సభలో జరిగిన విశేషాలను, దుర్యోధనుడు తనను గేలి చేయడాన్ని, సభనుండి లేచి పోవడాన్ని, అతడన్న మాటలను తెలియచేశాడు. ధృతరాష్ట్రుడు చెప్పిన మంచి మాటలను కూడా దుర్యోధనుడు లక్ష్యపెట్టలేదన్నాడు. దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు కాని పాండవులకు రాజ్యం ఇవ్వడని స్పష్టం చేశాడు. అంతా విన్న ధర్మరాజు రణరంగానికి కదలమని తమ్ములను ఆదేశించాడు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Sunday, January 9, 2022

వశిష్టుడి విజయం గాయత్రీ విజయమే ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-90 : వనం జ్వాలా నరసింహారావు

                                      వశిష్టుడి విజయం గాయత్రీ విజయమే

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-90

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (10-01-2022)

“అయినా ఆగని విశ్వామిత్రుడు పొగరుబోతు మాటలాడుతూ-అక్కడే నిలబడమని-ఇంకెక్కడికీ పోలేవని అంటూ, తనదగ్గరున్న ఆగ్నేయాస్త్రాన్ని మునిపై ప్రయోగించాడు. తనపైకొస్తున్న అస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడిని నీచ క్షత్రియుడా అని సంబోధిస్తూ: తనక్కడే నిలుచున్నాననీ-ఆతడి బలమెంతో, చలమెంతో, శస్త్రాస్త్రాల పాండిత్యమెంతో చూపమని-ముందు వాటన్నిటినీ భస్మం చేసి ఆతర్వాత ఆతడిని భూమి మీద లేకుండా చేస్తానని-క్షత్రియ బలానికి, బ్రాహ్మణ బలానికి తేడా అతడికి తెలియదని-దివ్యమైన బ్రాహ్మణ బలాన్ని ఇక చూపబోతున్నానని, అంటూనే, విశ్వామిత్రుడి ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మ దండంతో చల్లార్చాడు".

         "అంతటితోనూ ఆగకుండా విశ్వామిత్రుడు, వారుణాస్త్రం-రౌద్రాస్త్రం-పాశుపతం-ఐషీకం-స్వాపనం-గాంధర్వం-మోహనం-మానవం-జృంభణం-మాదనం- సంతాపనం- విలాపనం- శోషణం- దారణం- జయించలేని వజ్రశరం – బ్రహ్మపాశం – కాలపాశం – వారుణపాశం - దండం-పైశాచం-దయితం-రెండశనులు-క్రౌంచాస్త్రం-శుష్కం-ఆర్థ్రం – పైనాకం - ధర్మచక్రం - భయంకరమైన కాలచక్రం – విష్ణుచక్రం – మథనం – వాయవ్యం – హయశిరం - రెండు శక్తులు – ముసలం - కంకాళం-కాలాస్త్రం-వైద్యాధరం-కాపాలం-త్రిశూలం-కంకణాస్త్రాలను వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. వీటన్నిటినీ బ్రహ్మ సుతుడైన వశిష్ఠుడు తన బ్రహ్మ దండంతో హరించివేశాడు. తన అస్త్రాలన్ని వ్యర్థమై పోవడంతో, దీర్ఘమైన కోపంతో, భయంకరాకారుడై, దేవతా గణం-ముల్లోకాలు భయపడుతుండగా, బ్రహ్మాస్త్రాన్ని సంధించి విడిచాడు విశ్వామిత్రుడు”.

“తనమీదకొస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, చేతిలో బ్రహ్మదండాన్ని పట్టుకొని, దేవతలంతా విభ్రాంతితో గమనిస్తుంటే, దాన్ని మింగాడు. బ్రహ్మాస్త్రాన్ని మింగిన వశిష్ఠుడు మిక్కిలిభయంకరంగా కనిపిస్తుంటే, ఆయన రోమకూపాలనుండి, అగ్నిజ్వాలలు ప్రవహించసాగాయి. ఆ మహా ఋషి శ్రేష్టుడిని, ఋషీశ్వరలందరు ప్రార్థించారు. వశిష్ఠుడి తపో బలమింతని చెప్పలేమని, సత్కీర్తిగల ఆయన తన తేజస్సును శమించజేయాలని, బ్రాహ్మణోత్తముడైన ఆయన చేతిలో విశ్వామిత్రుడు ఓటమి చెందాడని అంటారు వారంతా. ఇలా తనను ఋషీశ్వరులందరు కోరడంతో, వశిష్ఠుడు శాంతించాడు. ఇదంతా చూసిన విశ్వామిత్రుడికి ఏంచేయాల్నో తెలియక నిట్టూర్పులు విడిచి దుఃఖంతో తనలో తానే ఆలోచించసాగాడు. తన క్షాత్రం వ్యర్థమయిందని, అస్త్రాలన్నీ వ్యర్థమయ్యాయని, వాటితో తనకింక అవసరం లేదని, బ్రాహ్మణుడై-శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించినందువలనే కదా వశిష్ఠుడికింత మహాత్మ్యం కలిగిందని అనుకుంటాడు. తనుకూడా శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించి, బ్రాహ్మణుడు కావడానికి ప్రయత్నించాలని అనుకొని, తపస్సు చేసేందుకు సిద్ధమవుతాడు".

(వశిష్టుడి గురించి చెప్పేటప్పుడు వాసుదాసుగారు రాసిన పద్యాల్లో, ఆయన్ను "జపివర్యుడు", "జపశీలుడు" అనే విశేషణాలను ప్రయోగించారు. ఇలా ప్రయోగించడంలో వక్త-వ్యాఖ్యాత వుద్దేశం, వశిష్ఠుడి మహాత్మ్యానికి కారణం ఆయన నిరంతరం చేస్తున్న జపమే. ఆయన జపించే మంత్రం "గాయత్రి" యే. గాయత్రీ మంత్రమే బ్రహ్మాస్త్రం. అది జపించడం వల్లే, వశిష్ఠుడింతటి మహాత్మ్యంగలవాడయ్యాడు. ఇంకో క్షత్రియుడయితే, బ్రహ్మాస్త్రం తగిలితే చనిపోవాల్సిందే. ఒకవేళ అతడికి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం వస్తే శత్రువు అస్త్రాన్ని అణచి వేయొచ్చు.ఇవేవీలేకుండా,వశిష్ఠుడు దాన్నిమింగి జీర్ణించుకున్నాడు. తపోబలంతో, జపబలంతో, బ్రాహ్మణ్యంతో వశిష్థుడి దేహమే బ్రహ్మమై వుండగా, ఆయన్నెవరేం చేయగలరు? కార్చిచ్చుమీద చిచ్చుబుడ్లు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అదేజరిగింది వశిష్ఠ-విశ్వామిత్రుల మధ్య జరిగిన "ఆత్మ-అనాత్మల" యుద్ధంలో. వశిష్ఠ విజయం నిజానికి గాయత్రీ విజయమే. అంతటి గొప్పదైన గాయత్రిని అధికరించి చెప్పబడిందే, శ్రీమద్రామాయణం-శ్రీ మధాంద్ర వాల్మీకిరామాయణం. అందుకే ఇవి సర్వోత్కృష్ట  గ్రంథాలని వేరే చెప్పాల్సిన పనిలేదు.

గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకిరామాయణంలో, ప్రతి అక్షరానికి, గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో, అంతే మహిముంది. వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమేకాదు. ఆత్మవిద్యకు, అనాత్మవిద్యకు మధ్యజరిగిన యుద్ధం.సంపూర్ణంగా అనాత్మవిద్య నేర్చుకున్నప్పటికీ, వాడు,ఆత్మవంతుడిని గెలవలేడు. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడుకాని, తన ఉప్పుతిని-కృతఘ్నుడై-దివిటీ దొంగలా తన సొమ్ము అపహరించేందుకు పూనుకున్నవాడినీ, తన ఆశ్రమాన్నంతా పాడుచేసి తనను చంపే ప్రయత్నం చేసినవాడినీ, దెబ్బకు-దెబ్బ అనిగూడా కీడుతలపెట్టలేదు. ఇదే ఆత్మవంతుడైన బ్రాహ్మణుడి లక్షణం. బ్రాహ్మణుడు ఇతరులవల్ల నష్టపడినాగాని, పరులకు హానితలపెట్టడు. వశిష్ఠుడు ఇంతజరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు).

 

Saturday, January 8, 2022

రాజనీతికి శిఖరాయమాణమైన శ్రీకృష్ణ రాయబారం, విశ్వరూప ప్రదర్శన ..... ఆస్వాదన-54 : వనం జ్వాలా నరసింహారావు

 రాజనీతికి శిఖరాయమాణమైన శ్రీకృష్ణ రాయబారం, విశ్వరూప ప్రదర్శన

ఆస్వాదన-54

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (09-01-2022)

కౌరవుల దగ్గరికి రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడి కొలువుకూటం చేరుకొనగానే అక్కడికి వచ్చిన మహామునులను భీష్ముడికి చూపించాడు. వారందరికీ అర్ఘ్యపాద్యాదులిచ్చి, సరైన రీతిలో ఉపచారాలు చేయించి, వారు కూర్చోడానికి పీఠాలు వేయించమని చెప్పాడు. వారు కూర్చోకుండా ఇతరులు కూర్చోవడం న్యాయం కాదని అన్నాడు. భీష్ముడు అలాగే చేయించాడు. కురువీరులంతా లేచి నిలబడి దివ్యమునులకు ఆసనాలిచ్చి కూర్చొనబెట్టారు. దేవర్షులు కూర్చున్నతరువాత శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు, ఇతర ప్రముఖులు కూర్చున్నారు. కర్ణ దుర్యోధనులు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. సభ అంతటా శ్రీకృష్ణాధీనమైన ఒక దివ్యానుభూతి వాతావరణం నెలకొన్నది. రాజనీతికి శిఖరాయమాణమైన రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడు ఒక దివ్యాదివ్యవిభావం (ముదివర్తి కొండమాచార్యులు గారి విశ్లేషణ). కొలువుకూటంలోని వారందరి మనస్సులు శ్రీకృష్ణ సందర్శనంతో సంతోష పరవశాలయ్యాయి.

సభామధ్యంలో వున్న శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి, తానక్కడికి వచ్చిన అవసరాన్ని వివరిస్తూ, భరతవంశం సంతోషించేటట్లు తన ఇరుకుటుంబాలకు ‘న్యాయం’, ‘పరమహితం’ చెప్పడం తన రాకకు కారణం అన్నాడు. కౌరవపాండవులు పాలు, నీరులాగా కలసి మెలసి జీవించడం మంచి పనని, వారలా వుండే విధంగా నడిపించడం ధృతరాష్ట్రుడి బాధ్యత అని, వారిరురువు వేరనే భేదబుద్ధి ఆయనకు లేదుకదా! అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా ‘న్యాయం, హితం’ తెలియచేశాడు. ఈ సందర్భంగా భరతవంశ గౌరవ, సంప్రదాయ పరిరక్షణను వివరించాడు ఈ విధంగా:

చ:       భరత కులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తుఁ బెంపునుం

గరుణయుఁ గల్గియుండు ననగా నుతి గన్నది యంది సద్గుణో

త్తరులరు నీవు నీయనుగు దమ్ముడు నీతనయుల్ యశోధురం

దర శుభ శీలురీ సుచరిత క్రమ మిప్పుడు దప్ప నేటికిన్

         (భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, పొత్తు, పెంపు, కరుణ కలిగి నుతి కెక్కింది. దాయాది భాగాలకై తగవులాడుకొని కుత్తుకలను ఉత్తరించుకోవటానికి ఎప్పుడూ సిద్ధం కాలేదు. రాజ్యాన్ని త్యాగం చేయటమే గాని దానికై వంశ నాశనానికి పూనుకోవటం భరతవంశ సంప్రదాయం కాదు. ఆ వంశం యొక్క సుచరిత్ర క్రమాన్ని ఇప్పుడు తప్పటం దేనికి?)

         ధృతరాష్ట్రుడు కౌరవవంశ రాజులలో అగ్రగణ్యుడు కావాలంటే ఈ న్యాయం పాటించాలని శ్రీకృష్ణుడన్నాడు. జనులు మెచ్చే విధంగా వ్యవహరించాలని హెచ్చరించాడు. దుర్యోధనాదులు దుష్ట చేష్టలు చేయడానికి వెనుకాడరని, భరతవంశ సంప్రదాయాన్ని కలుషితం చేస్తున్నారని అన్నాడు. కౌరవపాండవులు ఒక మంచి నిర్ణయానికి వచ్చి, శాంతి వహించి, జీవించడం మంచిదన్నాడు. అలాకాకుండా యుద్ధమే జరుగుతే మహావిపత్తు కలుగుతుందని, తన మాటలమీద విశ్వాసం వుంచి సంధి జరిపించాలని కోరాడు. సందికార్యం ధృతరాష్ట్రుడి చేతిలోనే వుందని, సర్వసామ్రాజ్యాధిపత్యం ధృతరాష్ట్రుడిదేనని హెచ్చరిస్తూ, ఉభయ పక్షాలలోని వీరులు యుద్ధంలో చావడం కన్నా కలసి, మెలసి వర్తించడం మంచిదని చెప్పాడు.

         శ్రీకృష్ణుడు పాండవులు చెప్పమన్న మాటలు కూడా ధృతరాష్ట్రుడితో చెప్పాడు వివరంగా. పాండునందనులు ధృతరాష్ట్రుడికి పరమ భక్తితో నమస్కరించి ఒకే గొంతుతో చెప్పమన్న మాటలు చెప్తూ, తమకు రాజ్యంలో సగపాలు పొందగలమన్న దృఢ నిశ్చయంతో వున్నామని అన్న విషయం గుర్తుచేశాడు. ఇంకా ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు:

         ఉ:       సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ

బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె

వ్వార లుపేక్ష చేసిరది వారల చేటు గాని ధర్మ ని

స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్    

         (ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది. కౌరవుల వలన సత్యానికి ధర్మానికి హాని చేకూరింది. సత్యాన్ని, ధర్మాన్ని పాలించే పాండవులను దైవం తప్పక రక్షిస్తాడు. దీనిని విశ్లేషిస్తూ ముదివర్తి కొండమాచార్యులు ఇలా రాశారు: ‘పాండవులు సభాసదులను ఉద్దేశించి చెప్పమన్న సందేశం ఇది. ఉద్యోగపర్వ తాత్పర్యానికీ, మహాభారత కథాతత్త్వానికీ ఈ పద్యం ఆత్మలాంటిది. తెలుగు సాహిత్యంలో ఈ పద్యం ఒక ధర్మదీపం. సారవంతమైన ధర్మం, నిర్మలమైన సత్యం నిత్య ధర్మాలుగా పేర్కొనడం గమనార్హం’).

         పాండవుల తండ్రి భాగం పాండవులకు ఇచ్చి, ఆయన రాజ్యభాగం తన కుమారులు, మనుమలు హాయిగా అనుభవిస్తుంటే ధృతరాష్ట్రుడిని అంతా కొనియాడుతారని చెప్పాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు ఎలాంటివాడో ధృతరాష్ట్రుడికి తెలుసని అంటూ ఆయన ధర్మ గుణాలను పొగిడాడు. పాండవులు ఎంతటి శాంత స్వభావులో అంత వీరాగ్రేసరులని, సంధి-సంగ్రామం రెండింటిలో ఏది హితమో నిర్ణయించమని చెప్పాడు. శ్రీకృష్ణుడి మాటలు అక్కడున్న అందరికీ నచ్చాయి. సభలో వున్న జామదగ్న్య మహాముని, కణ్వమహాముని, నారదుడు, శ్రీకృష్ణుడి మాటలు విని కురువంశాన్ని కాపాడమని దుర్యోధనుడికి చెప్పారు. వారి హితవాక్యాలను మన్నించకుండా, కర్ణుడితో, ‘ఈ మునీశ్వరులు ఎంత పిచ్చివారు’ అని వ్యాఖ్యానించాడు. బ్రహ్మదేవుడు తనను ఏమి కమ్మని పుట్టించాడో అదే జరుగుతుందని అన్నాడు.

         తానేమీ చేయలేనని ధృతరాష్ట్రుడన్నాడు మహర్షులతో. ఇహపరాలు రెండూ సమకూడే విధానాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడని, కాని ఆయన చెప్పినట్లుగా కార్యం నిర్వర్తించడానికి తనకు ఏమాత్రం చొరవ లేదని అన్నాడు కృష్ణుడితో. తన కుమారుడు మూఢచిత్తుడని అతడిని ఆయనే శాంతింప చేయాలని చెప్పాడు. ధృతరాష్ట్రుడు చెప్పినట్లే శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, అతడికి మొండి పట్టుదల తగదన్నాడు. పాండవులతో పొత్తు పెట్టుకొమ్మన్నాడు. తండ్రి మాట వినమన్నాడు. శకుని, కర్ణ, దుశ్శాసనుల చెడు సలహాలు వినవద్దన్నాడు. భీమార్జున బలపరాక్రమాల గురించి చెప్పాడు. పాండవులు యుద్ధానికి వస్తే కౌరవులు ఎదిరించలేరన్నాడు. కర్ణాదులకే కాదు, దేవదానవులకు కూడా పాండవులను ఎదుర్కోవడం సాధ్యంకాదన్నాడు. కాబట్టి సంధి మంచిదన్నాడు. భీష్మ, ద్రోణులు కూడా దుర్యోధనుడికి హితవు చెప్పారు. శ్రీకృష్ణుడి మాటలు వినమన్నారు.

         వీరందరి మాటలు వున్న దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో, తనను అంతా నిందిస్తున్నారని, కాని, తన తప్పేమీలేదని అన్నాడు. ధర్మరాజు జూదరై రాజ్యాన్ని కోల్పోయాడని అన్నాడు. అంతా ధర్మారాజు ఇష్టప్రకారమే జరిగిందన్నాడు. వారే తమపైదండెత్తడానికి సైన్యాన్ని సమకూర్చుకున్నారని అంటూ, క్షత్రియ ధర్మం ప్రకారం తాను యుద్ధం చేస్తే విజయమో, వీరస్వర్గమో లభిస్తుందని స్పష్టం చేశాడు. పాండవులకు సగ భాగం ఇవ్వడానికి తాను అంగీకరించనన్నాడు. తామూ, పాండవులు భూమిని పంచుకుని పరిపాలించడం జరగదని, ‘వాడి సూది మొన మోపినంత మాత్రమైనా భూమిని’ పంచి పాండవులకు తానివ్వనని, తమలో ఎవరో ఒకరు యుద్ధంలో విజయం సాధించి రాజ్యం చేయాలని తన నిర్ణయమని అన్నాడు దుర్యోధనుడు.

         దుర్యోధనుడు చెప్పినట్లే రణరంగంలో అతడు ఓడిపోతాడని, యుద్ధం రాబోతున్నదని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. గతంలో దుర్యోధనుడు చేసిన దుర్మార్గాలన్నీ చెప్పాడు మరోమారు. శాంతి వహించమని అదే పాండవులకు, కౌరవులకు మంచిదని మళ్లీ అన్నాడు. ఆ సమయంలో దుశ్శాసనుడి సలహామీద దుర్గర్వంతో దుర్యోధనుడు సభనుండి లేచి వెళ్లాడు. ఆయన వెంట కర్ణుడు, శకుని, సహోదరులు, మిత్రులైన రాజులు కూడా పోయి కొంతదూరంలో వున్నారు. ధృతరాష్ట్రుడప్పుడు గాంధారిని సభకు రప్పించాడు. గాంధారి ఆదేశంతో విదురుడు వెళ్లి దుర్యోధనాదులను సభకు తీసుకువచ్చాడు.

         సభకు వచ్చిన దుర్యోధనుడికి గాంధారి హితవాక్యాలు పలికింది కాని అతడికి అవి నచ్చలేదు. గర్వంతో మళ్లీ సభనుండి లేచి వెళ్లి, కర్ణాదులతో దురాలోచనకు పూనుకున్నారు. శ్రీకృష్ణుడిని బంధించాలని పన్నాగం పన్నారు. కృష్ణుడిని చెరసాలలో పెట్టి పాండవులకు దిగులు పుట్టిద్దామని కుట్ర చేశారు. అలా కృష్ణుడిని పట్టాలని దుష్కార్యాలోచన చేసి, దుష్టచతుష్టయం అనబడే దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునిలు ఆయనను బంధించాలని నిశ్చయించారు. సాత్యకి ఇది గమనించి శ్రీకృష్ణుడిని హెచ్చరించాడు. విదురుడు ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడి దృష్టికి తెచ్చాడు. తక్షణమే వెళ్లి దుర్యోధనుడిని సభకు తీసుకురమ్మన్నాడు ధృతరాష్ట్రుడు. విదురుడు అతడిని సభకు తోడ్కొని వచ్చాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని చీకొట్టాడు.

         శ్రీకృష్ణుడు చిరునవ్వుతో దుర్యోధనుడిని చూసి, తన విశ్వరూపం ప్రదర్శించాడు. వాసుదేవుడి నుదుట బ్రహ్మదేవుడు, వక్షఃస్థలంలో రుద్రుడు, ముఖంలో అగ్ని, పార్శ్వ ప్రదేశాలలో ఇంద్రాది దేవతలు, కుడి-ఎడమ చేతుల్లో ఆయుధాలతో బలరాముడు, పార్థుడు, వీపునుండి మిగిలిన పాండవులు ఆవిర్భవించారు. అంకా అనేకమంది ఆయనలో కనిపించారు. ఆయన చేతుల్లో శంఖం, చక్రం, గద, ఖడ్గం మొదలైన దివ్యాయుధాలు కనిపించాయి. ఆ ముకుందుడి దివ్యతేజ స్వరూపం చూడడానికి శక్యం కాక సమస్త జనులు కన్నులు మూసుకున్నారు. నారదాది మహర్షులకు, భీష్మ, ద్రోణ, విదుర, సంజయులకు తన విశ్వరూపం చూడడానికి దివ్యదృష్టి ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. సభలో కలకల ధ్వని విని,  అది శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శనం అయి వుంటుందని భావించిన ధృతరాష్ట్రుడు తనకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించమని వేడుకున్నాడు. ఆయనకు కూడా దివ్యదృష్టిని ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఆయన్ను చూసిన కన్నులతో ఇంకేమీ చూడనని చెప్పి తన దివ్యదృష్టిని వెనక్కు తీసుకొమ్మన్నాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి కోరిక తీరేవిధంగా అతడి కన్నులను గుడ్డివిగా చేసి తన విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. నారదాది మహర్షులకు వెళ్లిరండని సెలవిచ్చాడు. 

         ఆ తరువాత శ్రీకృష్ణుడు సభ నుండి బయల్దేరి వెళ్లిపోయాడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ఉద్యోగపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

  

        

        

         

Sunday, January 2, 2022

కామధేనువును బలాత్కరించి ఎత్తుకునిపోతున్న విశ్వామిత్రుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-89 : వనం జ్వాలా నరసింహారావు

 కామధేనువును బలాత్కరించి ఎత్తుకునిపోతున్న విశ్వామిత్రుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-89

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (03-01-2022)

"వశిష్ఠుడలా కామధేనువును ఇవ్వనని చెప్పగానే, విశ్వామిత్రుడు బలవంతంగా దానిని తీసుకొని పోసాగాడు. అప్పుడా శబల మిక్కిలి విషాదంతో, తనేం తప్పుచేసానని, ఎందుకీ మునీశ్వరుడు తననీవిధంగా వదిలిపెడుతున్నాడని, దుఃఖపడుతూ అనుకుంటుంది. తను ఏడుస్తున్నా వదలకుండా ఈడ్చుకొనిపోతున్న భటుల కట్లు తెంచుకొని, తన్నీడుస్తున్నవారిని నేలపై పడవేసి-తన్ని, మునీశ్వరుడి వద్దకు పోతుంది. కళ్లలో నీళ్లు కారుతుంటే, ఎంతో బాధతో, గోలుగోలున ఏడుస్తూ, దేవ దుందుభిలాంటి ధ్వనితో, ’బ్రహ్మ కుమారా, ఆపదలో వున్నవారిని రక్షించే నువ్వు నన్నొదిలిపెట్టడానికి నేనేం తప్పు చేసాను? నీ దగ్గర వుండనివ్వకుండా రాజభటులు నన్ను ఈడ్చుకుపోతున్నారే?’ అని వశిష్టుడిని దుఃఖాతిశయంతో పరితపిస్తూ-వాడిపోయిన ముఖంతో తోడ పుట్టిన దానిలాగా అడుగుతుంది శబల”.

 “ఆవిధంగా ప్రార్థించిన కామధేనువుతో, తాను బుద్ధిపూర్వకంగా దాన్ని వదిలిపెట్టలేదని, మోహంతో కళ్లు కనిపించక న్యాయంతప్పిన రాజు బలాత్కారంగా తీసుకొనిపోతున్నాడని,భూమికంతా ప్రభువు, దేహబలం, సేనాబలం, అస్త్రబలంకల వీరుడైన విశ్వామిత్రుడితో బలహీన బ్రాహ్మణుడినైన తాను ఆపలేక పోయానని అంటాడు వశిష్ఠుడు.విశ్వామిత్రుడికున్న రథాలు,గుర్రాలు, ఏనుగులు, అక్షౌణి సేన గురించి చెప్పిన వశిష్ఠుడితో,క్షత్రియ బలమొక బలమేకాదని,బ్రాహ్మణబలం లెక్కలేని మహిమగలదని,రాజెంత బలవంతుడైనా వశిష్ఠుడికంటే గొప్పవాడుకాదనీ,తనకాజ్ఞ ఇస్తే రాజు సేనంతా నాశనంచేస్తాననీ కామధేనువైన శబల అంటుంది. బలమే న్యాయమని దుష్టబుద్ధితో అనుకుంటున్న విశ్వామిత్రుడిని,బలహీనుడిగా,వశిష్ఠుడి మంత్రబలంతో బలంపొందిన తానుచేస్తానని,ఆజ్ఞ ఇవ్వమని అడుగుతుంది.ఆలా ప్రార్థించిన శబలను, శత్రువులు నివ్వెరపోయే ట్లు-వారి రూపం చెడిపోయే ట్లు చేయగల, అనేకమంది శూరులను సృష్టించమని ఆదేశించాడు వశిష్ఠుడు".

విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేసిన కామధేను కల్పిత సేన

"వశిష్ఠుడి ఆజ్ఞలభించగానే,శత్రు సమూహాలకు భయంకలిగించే పప్లవులనే శూరులను తన హుంభారవంతో శబల. కామధేను కల్పిత శూరులు విశ్వామిత్రుడి సైన్యాన్నంతా రూపుమాపి విజృంభించారు. అది చూసిన పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు, కోపంతో కళ్లెర్రచేసి, భయంకర బాణాలతో పప్లవ శూరులను చంపి నిస్సారంగా భూమ్మీద పడేటట్లు చేశాడు. విశ్వామిత్రుడిపై పగబట్టిన ఆవు, బట్టిసాలు ధరించి యుద్ధం చేయగల యవనశక సేనల గుంపులను అపారంగా సృష్టించింది. ఆ యవనులు-శకులు, కార్చిచ్చు అడవిలో పడ్డట్లు, రాజు సైన్యం మీదపడి దహిస్తుంటే, వాళ్లందరినీ విశ్వామిత్రుడు తన అస్త్రాలతో పీనుగుపెంటల్లా చేసాడు".

వశిష్ఠ విశ్వామిత్రుల యుద్ధం

         "విశ్వామిత్రుడి భయంకరమైన శస్త్రాస్త్రాలతో కాలిపోయిన తన సైన్యాన్ని చూసిన వశిష్ఠుడు, యోగ బలాన్ని ఆశ్రయించి శీఘ్రంగా శత్రు సేనలను సంహరించమని శబలను ఆజ్ఞాపించాడు. వెంటనే హుంకరించిన కామధేనువు తన పొదుగులోంచి కాంభోజ సేనలను, యోనినుండి పప్లవ సమూహాలను, పేడ పుట్టే ప్రదేశంనుండి యవనులను, రోమ కూపాల (వెంట్రుక గూళ్లు) నుండి శకులను, మ్లేచ్ఛులను, కిరాతులను సృజించింది. వారందరు శత్రు సేనలపై పడి, వారి రథాలను-ఏనుగులను-గుర్రాలను-సైన్యాన్ని నాశనం చేసారు. అది చూసిన విశ్వామిత్రుడి నూర్గురు కొడుకులు, మితిమీరిన కోపంతో, ఒకేసారి వశిష్ఠుడిమీదకు దూసుకొచ్చారు. ఆయన వెంటనే హుంకరించి నిమిషంలో వంద మందినీ బూడిద రాసులుగా చేశాడు. తన నూర్గురు కొడుకులు ఒకేసారి మరణించడంతో-సైన్యమంతా నుగ్గుకావడంతో, సిగ్గుతో కుమిలిపోయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడిని గెలిచేదెలానని మధన పడి, విషాదంతో భూమిపై వాలాడు. వేగంలేని సముద్రంలా, కోరలు పీకిన సర్పంలా, గ్రహణం నాటి సూర్యుడిలా, రెక్కలూడిన పక్షిలా కాంతీహీనుడై-గర్వభంగమై, ఎలాగైనా వశిష్ఠుడిని జయించాలన్న పట్టుదలతో, రాజ్యభారాన్ని కొడుకుకప్పగించి, వీరుడైన విశ్వామిత్రుడు హిమవత్పర్వతానికి పోయి, శివుడికొరకు తపస్సు చేశాడు”.

“శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాల్నో కోరుకొమ్మన్నాడు. భక్తజనుల సంకటాలను హరించేవాడని, పార్వతీ ప్రియుడని, కఠినాత్ములైన రాక్షసులను సంహరించేవాడని, హరా-త్రిపుర సంహారా అని, మన్మథుడి గర్వం హరించినవాడని, దేవతల పూజలందుకునే చరణాలుగలవాడని శివుడిని స్తోత్రం చేసి, నమస్కరించి, విలువిద్యనంతా అంగాలతో-ఉపాంగాలతో-మంత్రాలతో-వాటి రహస్యాలన్నిటితో తనకు ఉపదేశించమని చేతులు జోడించి ప్రార్థించాడు విశ్వామిత్రుడు. రాక్షసుల వద్ద, మునుల వద్ద, గంధర్వుల వద్ద, యక్షుల వద్ద, దేవతల వద్ద వున్న అస్త్రవిద్యలన్నీ తనకుపదేశించమని కోరాడు. ఆయన కోరినట్లే శివుడు ఉపదేశించి పోయాడు. అస్త్రాలన్నీ తన స్వాధీనంలోకి వచ్చాయన్న ధైర్యంతో-గర్వంతో విశ్వామిత్రుడు పున్నమినాటి సముద్రిడిలా పొంగిపోతూ, దూరపుటడుగులు వేసుకుంటూ, వశిష్ఠుడున్న ఆశ్రమానికి వచ్చాడు"

         "సకల శత్రువులను జయించిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడి తపోవనమంతా, స్వల్ప వ్యవధిలో, బలిష్టమైన తన దివ్యాస్త్రాల జ్వాలల్లో కాల్చి బూడిద చేశాడు. అది సహించలేని అక్కడి మునులందరు, నలు దిక్కులా పరుగెత్తారు. పక్షులన్నీ ఆకాశానికి ఎగిరిపోయాయి. శిష్యులు భయంతో వణికిపోయారు. రెప్పపాటులో ఆ వనమంతా అలా కావడంతో కోపగించిన వశిష్ఠుడు, సూర్యుడు మంచును కరిగించినట్లు, అవలీలగా విశ్వామిత్రుడిని రూపుమాపుతాననీ, ఎవరూ పోవద్దనీ అన్నా, ఆగకుండా వారంతా పరుగెత్తారు. ఎవరుకూడా అక్కడ నిలవకుండా పారిపోతుండడంతో, రోషావేశంతో కనుబొమలదురుతుంటే, విశ్వామిత్రుడిని మందలించాడు వశిష్ఠుడు. ఆతడి విజృంభణాన్ని ఆపలేనివాడిననుకొని, చిరకాలంనుండి పెంచుకుంటున్న తన తపోవనాన్నంతా కాల్చివేసిన చెడుబుద్ధిగల విశ్వామిత్రుడిని ఇక సహించలేనని అంటూ, సాధ్యంకాని తేజస్సుతో అతన్ని తేరిపార చూశాడు వశిష్ఠుడు. ఇంత చెప్పినా విశ్వామిత్రుడు వినిపించుకోకుండా, అస్త్రం వెంట అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో, వశిష్ఠుడు తనదగ్గరున్న రెండవ యమదండంలాంటి-కాలాగ్ని జ్వాలలను చిమ్మే ప్రకాశవంతమైన బ్రహ్మ దండాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడకుండా నిలబడ్డాడు”.