కర్ణుడి జన్మరహస్యం చెప్పి అతడిని పాండవులతో కలవమన్న
శ్రీకృష్ణుడు, కుంతీదేవి-తిరస్కరించిన
కర్ణుడు
ఆస్వాదన-55
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (16-01-2022)
ధృతరాష్ట్రుడి
సభ నుండి రాయబారానంతరం వెడలిపోతున్న శ్రీకృష్ణుడి వెంట ఆయనను సాగనంపడానికి
ధృతరాష్ట్రుడు ఆయన పరివారంతో సహా కొంతదూరం వచ్చాడు. దారిమధ్యలో కుంతీదేవి ఇంటికి
పోయి శ్రీకృష్ణుడు ఆమెకు పాదాభివందనం చేసి జరిగిన సంగతులు వివరించాడు. ధర్మరాజాదుల
దగ్గరికి వెళ్లివస్తానని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు. శ్రీకృష్ణుడి మరదులైన
తన కొడుకులు, సంధికొరకు సకల విధాల శ్రమ పడ్డారని, సంధి తప్పిపోవడం కూడా మంచికే జరిగిందని, క్షత్రియజాతికి తగినది వీరవృత్తని, దేవుడు
మేలు చేయగా సంధి భగ్నమైందని అన్నది కుంతి. ఆ తరువాత కుంతి దగ్గరనుండి బయల్దేరి పయనమై
పోయాడు శ్రీకృష్ణుడు.
మధ్యలో
శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్లాడు. కర్ణుడి జన్మ రహస్యం చెప్పాడు. కుంతీదేవి
సూర్యుడివల్ల అతడికి జన్మనిచ్చిందని, అందువల్ల ఆయన పాండురాజు పెద్ద కుమారుడని, కర్ణుడు
తమ అన్న అని ధర్మరాజుకు తెలిస్తే అతడికే రాజ్యభారం వహించడానికి పట్టం కడుతారని, కాబట్టి తనతో కలిసి పాండవుల దగ్గరికి కలిసి
రమ్మని అన్నాడు. దేవేంద్ర వైభవంతో మహానీయుడివై మహీమండలాన్ని పరిపాలించమని పలికాడు.
ద్రౌపది తన ఐదుగురు భర్తలతో పాటు కర్ణుడిని ఆరవ భర్తగా ఆప్యాయంగా స్వీకరిస్తుందని
కూడా అన్నాడు.
తన జన్మ
వృత్తాంతం కొంతమేరకు తనకు తెలుసనీ,
కుంతీదేవి తనను కనికరం లేకుండా గంగలో తోసిందనీ, సూతదంపతులు తనను దయతో పెంచారనీ, తనను వారు కన్నకుమారుడిలాగా చూశారనీ, ఇప్పుడు వారిని వదిలితే ధర్మం తప్పినవాడిని
అవుతాననీ బదులు చెప్పాడు కర్ణుడు. అలాగే సుయోధనుడు తనను ఇంత గొప్పవాడిని చేశాడని, అలాంటివాడిని యుద్ధం వచ్చే ముందర వదలడం
న్యాయమా, ధర్మమా అని ప్రశ్నించాడు. తాను కుంతీ పుత్రుడినన్న రహస్యం బయటకు
పొక్కకుండా భద్రంగా శ్రీకృష్ణుడు తన హృదయంలోనే వుంచుకొమ్మని కోరాడు కర్ణుడు.
ధర్మరాజు లాంటి పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు కర్ణుడికి అయన తమ్ముడినని తెలుస్తే
రాజ్యభారం వహించడని, అతడు రాజు కావడమే న్యాయమని అన్నాడు కర్ణుడు.
కర్ణుడి మాటలు
విన్న శ్రీకృష్ణుడు, అర్జునుడితో కర్ణుడికి జరగబోయే
పోరాటంలో విజయం అర్జునుడిదేనని, అతడిని యుద్ధంలో ఎదుర్కోవడం కర్ణుడి శక్యం కాదని, కాబట్టి సర్వ విధాల పాండవులే జయిస్తారని
అన్నాడు. ఏడెనిమిది రోజుల్లో అమావాస్య వస్తుందని, అది పుణ్య తిథి అని, ఆనాడు యుద్ధం ప్రారంభం కావాలని శ్రీకృష్ణుడు
చెప్పి, ఆ విషయం దుర్యోధనాదులకు
తెలియచేయమన్నాడు. అందుకు కర్ణుడు,
కురుపాండవుల మధ్య జరగనున్న సంగ్రామంలో విజయుడిగా శ్రీకృష్ణుడిని దర్శిస్తానని, లేదా, చనిపోయి వీరస్వర్గం చేరి పరమేశ్వరుడైన ఆయన్ను
చూస్తానని, తనకిక సెలవిప్పించమని అన్నాడు.
సరేనన్న శ్రీకృష్ణుడు రథం ఎక్కి హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు.
ఇదిలా వుండగా, శ్రీకృష్ణుడు వచ్చిపోయిన తరువాత కుంతీదేవి
మనసులో ఒక ఆలోచన వచ్చింది. కర్ణుడిని కలిసి అతడి జన్మ వృత్తాంతం చెప్పి తోబుట్టువుల
మీద ప్రేమ కలిగిద్దామనుకుంటుంది. కర్ణుడి దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకున్నది.
కర్ణుడు ఆ సమయంలో గంగానది దగ్గర జపం చేసుకుంటున్నాడు. ఆమెను చూడగానే తన సూత గోత్రం, రాధేయ నామధేయం చెప్పి ఆమెకు పాద నమస్కారం
చేశాడు. ఆమె రహస్యంగా కర్ణుడికి కొన్ని విషయాలు చెప్పింది.
కర్ణుడు సూత
కులంలో పుట్టలేదని, తనకు సూర్యుడికి జన్మించాడని, ధర్మప్రకారం అతడు
పాండురాజు పుత్రుడని, కాబట్టి కర్ణుడు రాదా తనయుడన్న
హీనస్థితి నుండి బయటకు వచ్చి,
పాండవులతో చేరి భూమినంతా పాలించమని చెప్పింది. ఆమె ఆ మాటలు చెప్తున్నప్పుడే
సూర్యబింబం నుండి అశరీరవాణి కుంతి చెప్పిన మాటలు నిజమని పలికింది. ఆమె చెప్పింది
సత్యమే అయినప్పటికీ క్షత్రియులకు జరగాల్సిన సంస్కారాలు తనకు జరగలేదని, సూర్య భగవానుడి వల్ల తన జన్మ రహస్యంగా
వున్నదని, ఇప్పుడు దానిని వెల్లడి చేయడం
మంచిదికాదని, తానిప్పుడు పాండవులతో కలిస్తే
అర్జునుడికి భయపడి కలిశానని లోకులు హేళన చేస్తారని అన్నాడు కర్ణుడు. దుర్యోధనుడిని
అవసర సమయంలో వదిలేయడం తనకు ధర్మం కాదన్నాడు. ఇదే తన నిశ్చయమని, అయితే ధర్మరాజాదులు యుద్ధంలో తన చేతికి
చిక్కితే ఒక్క అర్జునుడిని తప్ప మిగతావారిని చంపనని మాట ఇచ్చాడు. తమ ఇద్దరిలో ఏ
ఒక్కరు పోయినా కుంతికి అయిదుగురు కొడుకులు మిగులుతారని చెప్పాడు.
ఇది భగవత్
సంకల్పం అని అంటూ కుంతీదేవి, కర్ణుడిని కౌగలించుకుని, ఆర్జునుడిని తప్ప
మిగతావారిని చంపవద్దని మళ్లీ చెప్పి, కర్ణుడు చెప్పినదానికి అంగీకరించింది.
కర్ణుడు ప్రేమతో ఆమెకు నమస్కరించాడు. తరువాత ఇద్దరూ తమతమ నివాసాలకు వెళ్లిపోయారు.
శ్రీకృష్ణుడు
హస్తినాపురం నుండి ఉపప్లావ్యానికి వచ్చి ధర్మరాజును కలిశాడు. కౌరవులు సంధికి
అంగీకరించలేదని చెప్పాడు. హస్తినాపురంలో జరిగినదంతా వివరించాడు. కౌరవ సభలో జరిగిన
విశేషాలను, దుర్యోధనుడు తనను గేలి చేయడాన్ని, సభనుండి లేచి పోవడాన్ని, అతడన్న మాటలను తెలియచేశాడు. ధృతరాష్ట్రుడు
చెప్పిన మంచి మాటలను కూడా దుర్యోధనుడు లక్ష్యపెట్టలేదన్నాడు. దుర్యోధనుడు యుద్ధం
చేస్తాడు కాని పాండవులకు రాజ్యం ఇవ్వడని స్పష్టం చేశాడు. అంతా విన్న ధర్మరాజు
రణరంగానికి కదలమని తమ్ములను ఆదేశించాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, ఉద్యోగపర్వం, చతుర్థాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)
శ్రీకృష్ణుడు కర్ణుడితో "ద్రౌపది తన ఐదుగురు భర్తలతో పాటు కర్ణుడిని ఆరవ భర్తగా ఆప్యాయంగా స్వీకరిస్తుందని కూడా అన్నాడు." అని వ్రాసారు.
ReplyDeleteవ్యాసులవారు భారతంలో షష్టేకాలే అన్నమాట వాడారు. రోజులో పగలు ఐదు భాగాలు ముగిసినపిదప అని దీని అర్ధం.క్షత్రియులకు పట్టాభిషేకం సూర్యాస్తమయం తరువాత జరగటం సంప్రదాయం. అందుచేత షష్టకాలమందు జరిగే నీపట్టాభిషేకంలో నిన్ను ద్రౌపది కూడా సేవిస్తుంది అని అంటున్నాడు కృష్ణుడిక్కడ. ఈవిషయం గురించి మొన్ననే శివైక్యం చెందిన మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు చెప్పగా విన్నాను.
అదీకాక భారతయుధ్ధం నాటికి ధర్మరాజు వయస్సు సరిగా 90 సంవత్సరాలు. దౌపది వయస్సు 80 దాకా ఐనా ఉండి ఉంటుంది కదా. అందుచేత అసంగతంగా "ద్రౌపది నున్ను ఆరవభర్తగా స్వీకరిస్తుంది" అని శ్రీకృశ్ణుడు చెప్పటం జరిగే అవకాశం లేదు.
ఐతే తిక్కనగారు కూడా ఎందుకో అపోహపడి "ద్రౌపది సిన్ను ఆరవభర్తగా స్వీకరిస్తుంది" అని కృష్ణుడు అన్నాడు అనే వ్రాసారు. ఇలా ఈముక్క మరింతగా ప్రచారం పొందింది.