అంతర్మధనం-3
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలానరసింహారావు
జీ.వీ.కె రెడ్డి గారి అధ్యక్షతన జీ.వీ.కె.ఇ.ఎం.ఆర్.ఐ గా 108-అత్యవసర సహాయ సేవలు రూపాంతరం చెందాక ఊహించీ-ఊహించని-ఊహ కందని అనేకానేక మార్పులు యాజమాన్య పరంగా కొన్ని-నిర్వహణ పరంగా మరికొన్ని కనిపించసాగాయి. మార్పు సహజం అని సర్దుకునే ప్రయత్నం మాలో కొందరు చేస్తే, అనారోగ్యకరమైన మార్పులకు అంకురార్పణ జరిగిన ప్రతి సందర్భంలోనూ బాధను-అసంతృప్తిని మరికొందరం బాహాటంగానో, జనాంతికంగా నో వ్యక్త పరిచాం. మార్పుకు సంబంధించిన సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపించాయనడానికి నిదర్శనంగా జులై నెల 8, 9, 10-2009న జరిగిన "ఇంటెగ్రేటర్స్ సమీక్షా సమావేశం" లో చోటుచేసుకున్న సంఘటనలు కొన్ని ఉదహరించవచ్చు. నూతన చైర్మన్ మొదటిసారిగా తన ఆంతరంగాన్ని ఇ.ఎం.ఆర్.ఐ సీనియర్ అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇ.ఎం.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల నెట్‌వర్క్ నుంచి తొలగిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బహిరంగంగానే శల విచ్చారు. మరి, ఒక్కొక్క రాష్ట్రాన్ని, మాజీ చైర్మన్ రామ లింగరాజు గారి "భవిష్యత్ సందర్శన దృశ్యం-విజన్" ఆలోచనా ధోరణికి ( అత్యవసర సహాయం కావాలని కోరుతూ కనీసం పదిలక్షలకు పైగా టెలెఫోన్ కాల్స్ ప్రతిరోజూ 108 కు వచ్చేలా చూడడం-ప్రతిఏటా దేశవ్యాప్తంగా కనీసం పది లక్షలకు పైగా ప్రాణాలను రక్షించడం) అనుగుణంగా, ఎంతో కృషి చేసి-ఆయా రాష్ట్రాల అధికారులకు-అనధికారులకు నచ్చచెప్పి ఇ.ఎం.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల నెట్‌వర్క్ లోకి తీసుకొచ్చిన మాలాంటి వారికి (వెంకట్ గారితో సహా), అలా వచ్చిన రాష్ట్రాల్లో ఏ ఒక్కటి తొలగిపోయినా కలిగే బాధ మాటల్లో వ్యక్తపరిచేదికాదు. అర్థం చేసుకోగలిగేవారికి మాత్రమే అర్థమవుతుంది.
ఆ వివరాల్లోకి పోయే ముందర ఇ.ఎం.ఆర్.ఐ లో క్రమం తప్పకుండా జరిగే సమీక్షా సమావేశాల గురించి తెలుసుకుందాం.
ఇ.ఎం.ఆర్.ఐ ఆవిర్భావంనుంచి సంస్థ సీ.ఇ.ఓ, ప్రతినెలా క్రమం తప్పకుండా, అత్యవసర సహాయ సేవలకు సంబంధించిన అన్ని విషయాలపై కూలంకషంగా సమీక్షలు చేసేవారు. ఆ సమీక్షా సమావేశాలను "బిజినెస్ సమీక్షా సమావేశం-బీ.ఆర్.ఎం" అని, "ఇంటెగ్రేటర్స్ సమీక్షా సమావేశం-ఐ.ఆర్.ఎం" అని సమావేశంలో పాల్గొనే సంబంధిత అధికారుల స్థాయిని బట్టి పిలిచేవారు. ఈ రెండు కాకుండా, ప్రతినెలా, కనీసం ఒక్కసారన్నా చైర్మన్ రాజుగారు ఉన్నతస్థాయి యాజమాన్య (ఇంటెగ్రేటర్స్) అధికారులను పిలిచి మరో సమీక్ష జరిపేవారు. దాన్ని "చైర్మన్ సమీక్షా సమావేశం-సీ.ఆర్.ఎం" అని అనే వాళ్లం. మొదటి రెండు సీ.ఇ.ఓ-ముఖ్య కార్య నిర్వహణాధికారి వెంకట్ చెంగవల్లి నిర్వహిస్తే, మూడోది చైర్మన్ రాజు గారే స్వయంగా నిర్వహించే వారు. కాకపోతే, మొదట్లో కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే లభ్యమయిన 108-అత్యవసర సహాయ సేవలు, క్రమేపీ మరో పది రాష్ట్ర్రాలకు వ్యాపించడంతో, బీ.ఆర్.ఎం సమీక్షా సమావేశాలను సంబంధిత రాష్ట్ర్రాల ప్రధాన ఆపరేషన్స్ హెడ్ నిర్వహించడం మొదలయింది.
సీ.ఇ.ఓ వెంకట్ గారి సమీక్షలకు, తదనంతరం జరిగిన సమీక్షలకు నాణ్యతా పరమైన తేడా కొంత కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. కొన్ని విషయాల్లో మెరుగుదల కూడా కనిపించిందనాలి. సమీక్షల్లో పాల్గొన్నవారు "వెంకట్ లర్నింగ్ సెషన్లు" మిస్ కావాల్సి వచ్చింది. సీ.ఇ.ఓ వెంకట్ కు బదులుగా సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఆపరేటింగ్ అధికారులు (సీ.ఓ.ఓ) వారి-వారి పరిధిలో సమీక్షలు జరిపేవారు. పర్యవసానంగా కొంత నైపుణ్యం-కొంత యూనిఫార్మిటీ లోపించిందని మాలో కొందరం భావించేవాళ్లం. మరి కొందరు కొన్ని విషయాల్లో మెరుగుదల చూపించినప్పటికీ, సరైన కమ్యూనికేషన్ ను కిందిస్థాయి ఉద్యోగులకు అందచేయడంలో విఫలమైనందున ఎన్నో సమస్యలు తలెత్తాయి. సమీక్షా సమావేశాల్లో సీ.ఓ.ఓ సందేశాన్ని సరిగ్గా అవగాహన చేసుకోని కొందరు జిల్లా స్థాయి ఇ.ఎం.ఆర్.ఐ ఉద్యోగులు తమ పదవులను కోల్పోవాల్సి కూడా వచ్చింది. అలా కోల్పోయిన వారిలో ఇ.ఎం.ఆర్.ఐ ఆవిర్భావం నుంచి, సంస్థకు ఎంతో సేవ చేసి-సంస్థ ఎదుగుదలకు అహర్నిశలూ తోడ్పడిన వారు కూడా వున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ సీ.ఓ.ఓ గా నూకల సుధాకర్ బిజినెస్ రివ్యూ మీటింగులలో (బీ.ఆర్.ఎం) నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతినెలా సమీక్షా సమావేశాలు నిర్వహించి కూలంకషంగా చర్చించడమే కాకుండా "త్రైమాసిక సమీక్షలు" కూడా జరిపి జిల్లా మేనేజర్ల పనితనాన్ని సమీక్షించేవారు. అయితే వాటివల్ల మేలుతోపాటు కీడుకూడా జరిగి నేటికీ కోలుకోలేని స్థితిలో ఇ.ఎం.ఆర్.ఐ కూరుకుని పోయిందనాలి. అప్పట్లో చైర్మన్ రాజు గారి దృష్టంతా అత్యవసర సహాయ సేవలను ఎలా విస్తరించాలనే వుండేది. ఏదో విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని అంబులెన్సుల సంఖ్యను 70 నుంచి 380కి, తర్వాత 502కు, దరిమిలా 652 నుంచి 802 వరకూ పెంచాలని పట్టుదలగా వుండే వారు. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించిన విషయాలను చూస్తుండే నేను, నాకు సంబంధించినంతవరకు, ఆయన ఆలోచనను కార్యరూపం దాల్చడానికి ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు చేయడం జరిగేది. అయితే అంబులెన్సుల సంఖ్య పెంచాలంటే తగు సహేతుకమైన కారణాలను కూడా చూపాల్సిన అవసరం వుంది. అందులో ముఖ్యమైంది "ఎమర్జెన్సీల సంఖ్య" రోజు-రోజుకూ పెరిగి అప్పట్లో వున్న అంబులెన్సులకు వాటికి సరిపడే విధంగా సగటున ట్రిప్పులను వేయలేక పోవడం ఒకటి. సగటున ఒక్కో అంబులెన్స్ ఎక్కువలో ఎక్కువ ఎనిమిది-పది కంటే ట్రిప్పులు వేయలేదు. దానికి కారణాలు అనేకం వున్నాయి. అవి మరో సందర్భంలో తెలుసుకుందాం.
ఇక పోతే సమీక్షా సమావేశాల్లో సీ.ఓ.ఓ దీనికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలు-వాటిని జిల్లా మేనేజర్లు అర్థం చేసుకున్న తీరులో తీవ్రమైన అవగాహనా లోపం వచ్చింది. ఎమర్జెన్సీల సంఖ్య పెరగడం అంటే, ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ కేసు వుందో, వాటిని సరైన ప్రచారం చేసుకుంటూ, 108 అంబులెన్స్ ను అలా ఎమర్జెన్సీకి గురైన వారు వాడుకోవాలన్న వుద్దేశాన్ని మేనేజర్లు కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏదో విధంగా ఎమర్జెన్సీల సంఖ్యను పెంచాలని, వారిలో కొందరు తమ కింది స్థాయి ఉద్యోగులకు "టార్గెట్లు" ఇవ్వ సాగారు. ఫలితంగా ఎమర్జెన్సీల పేరుతో సాధారణ రుగ్మతలొచ్చిన వారిని, అసలు వైద్య సహాయం అవసరమేలేనివారిని, 108 అంబులెన్సులలో ఆసుపత్రికి చేరవేయ సాగారు. ఎమర్జెన్సీల సంఖ్య పెరిగిందని (సమీక్షా సమావేశాల ఆధారంగా)గణాంకాలు చూపడంతో, సీ.ఓ.ఓ సుధాకర్ నూకల సూచన మేరకు క్రమేపీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంబులెన్సుల సంఖ్యను రికార్డు స్థాయిలో 802కు పెంచింది. ఇంతలో చేసిన తప్పు బయట పడింది. కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. చివరకు కారణాలే వైనా సీ.ఓ.ఓ పైకూడా వేటు పడింది. తప్పెవరిదో-ఒప్పెవరిదో తెలుసుకునే లోపల, యాజమాన్య మార్పిడీ జరిగింది. ఇప్పుడేమో అదంతా "గతజల సేతుబంధం". ప్రస్తుతం (గత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఉపన్యాసం ఆధారంగా) అన్ని అంబులెన్సులూ కలిపి సగటున రోజుకు 4000 లోపు ట్రిప్పులే తిరుగుతున్నాయి. అంటే ఒక్కో అంబులెన్స్ 5-6 కంటే ఎక్కువ ట్రిప్పులు తిరగడం లేదన్నమాట. 108 అత్యవసర సహాయ సేవల శాఖను చూస్తున్న మంత్రి పితాని సత్యనారాయణ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, అవగాహనా ఒప్పందం ప్రకారం ఏటా 24లక్షల ట్రిప్పుల తిరగాల్సి వుండగా, ప్రస్తుతం అన్ని అంబులెన్సులు కలిసి 14-15లక్షలు మాత్రమే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తిరగాల్సినన్ని ట్రిప్పులు తిరగకపోవడానికి కారణాలు వెతకాలి.
బీ.ఆర్.ఎం లకు హాజరయ్యేవారిని "ఎఫ్.ఎల్.సీ.ఎల్-ఫుల్ లైఫ్ సైకిల్ లీడర్" అని పిలిచేవారు. వీరిలో రీజనల్ మేనేజర్లు, హెడ్ ఆఫీసులో వివిధ శాఖలను (ఆర్థిక, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య, సాంకేతిక, ఫ్లీట్, మానవ వనరులు, మార్కెటింగ్ వగైరా) నిర్వహిస్తుండే వారు వుండేవారు. క్రితం నెల ఆయా రంగాలలో సాధించిన విజయాలను, రాబోయే నెలలో తలపెట్టిన కార్యక్రమాలను-అవి పూర్తిచేయడానికి రూపొందించిన ప్రణాళికను సంబంధిత బిజినెస్ హెడ్-ఎఫ్.ఎల్.సీ.ఎల్ ఆ సమీక్షా సమావేశాల్లో క్షుణ్ణంగా వివరించాల్సి వుంటుంది.
ఆయా బిజినెస్ హెడ్స్ (ఫుల్ లైఫ్ సైకిల్ లీడర్) ఇచ్చిన వివరాల ఆధారంగా, వారి పై స్థాయి అధికారులు (ఇంటెగ్రేటర్స్ అనేవారు) మరింత శాస్త్రీయంగా-లోతుగా, సీ.ఇ.ఓ నిర్వహించే సమీక్షా సమావేశంలో వివరిస్తారు. సీ.ఇ.ఓ రివ్యూ మీటింగులు ఏదో తూ-తూ మంత్రంలాగా కాకుండా సుమారు పన్నెండు గంటలకు పైగా జరిగేవి. ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నరకు మొదలయిన వెంటనే, అత్యవసర సహాయ సేవలను అన్వయిస్తూ, మేనేజ్ మెంట్ కు-నాయకత్వ లక్షణాలకు-నిబద్ధత, పారదర్శకతలకు సంబంధించిన విషయంపై, కూలంకషంగా కనీసం మూడుగంటల పాటు వెంకట్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సహాయంతో ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహించేవారు. అందులో ఆయన ప్రతిభ స్పష్టంగా గోచరించేది. ఆద్యంతం సరదాగా సాగేది.
ఉదాహరణకు సమీక్షా సమావేశాల్లో నాకు సంబంధించిన సబ్జెక్ట్ తీసుకుందాం. నేను, "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం” అనే "ఫుల్ లైఫ్ సైకిల్ బిజినెస్" కు "ఫుల్ లైఫ్ సైకిల్ లీడర్" గా బిజినెస్ రివ్యూ మీటింగులలోను, ఇంటెగ్రేటర్ గా ఇంటెగ్రేటర్స్ రివ్యూ మీటింగులలోను పాల్గొనేవాడిని. సీ.ఇ.ఓ వెంకట్ గారి దృష్టిలో కొన్ని సార్లు నేను "ఇంటెగ్రేటర్ స్థాయి వాడిని కాదనుకున్న" నెలల్లో నాకు ఇంటెగ్రేటర్స్ రివ్యూ మీటింగులకు అనుమతి వుండకపోయేది. అది ఆయన ఎప్పుడు-ఎందుకు చేశేవారో నాకిప్పటికీ అర్థం కాలేదు. నాకే కాదు, బహుశా నా సహచరులకు కూడా అర్థమయ్యేది కాదు. ఏదేమైనా ఇంటెగ్రేటర్స్ రివ్యూ మీటింగులకు కాని-చైర్మన్ రివ్యూ మీటింగులకు కాని పిలుపు అందకపోతే, ఒక విధంగా సీ.ఇ.ఓ దృష్టిలో పిలుపు అందనివారి సామర్థ్యం తగ్గిందని అక్కడ పనిచేస్తున్న ఇతరులు భావించేవారు. చైర్మన్ రాజు గారైతే వెంకట్ గారు ఎవర్ని తన వెంట తీసుకొచ్చారో-తీసుకు రాలేదో అన్న విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు నేనెప్పుడూ భావించలేదు. వచ్చిన వారందరికీ, వారికి సంబంధించిన బిజినెస్ గురించి కూలంకషంగా మాట్లాడుతామన్న నమ్మకం కూడా లేదు. అదో అనుభవం.
ఆ విషయాలు పక్కనపెడితే బీ.ఆర్.ఎం-ఐ.ఆర్.ఎం లలో పాల్గొన్న ప్రతివారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చేసి వారికి సంబంధించిన బిజినెస్ ఎలా వుందో వివరించాలి. అలా వివరిస్తున్నంతసేపూ, సీ.ఇ.ఓ ప్రతి విషయంలోనూ తరచి-తరచి ప్రశ్నలు సంధించేవాడు. మధ్యలో ఆయనదైన శైలిలో హాస్యం చిందించేవారు. ఆయనే కాకుండా సహచరులనుంచి వచ్చే సందేహాలకు కూడా వివరణలు ఇచ్చుకోవాలి. సుమారు నలభై బీ.ఆర్.ఎం లు, కొంచెం ఇంచుమించుగా అన్నే ఐ.ఆర్.ఎం లు, ఓ ముప్పై వరకు చైర్మన్ రివ్యూ మీటింగులకు హాజరైన నాకు, ఆ అనుభవం జీవితంలో మరవలేని అనుభూతితో పాటు, అపారమైన (నూతన విషయాలకు సంబంధించిన) విజ్ఞానాన్ని సముపార్జించుకునే అవకాశం కలిగించింది. ముఖ్యంగా వెంకట్ గారి "లర్నింగ్ సెషన్స్" నిజంగా ఎన్నో రకాల యాజమాన్య పరమైన విషయాలను తెలుసుకునే అవకాశం కలిగించింది.
నేను అక్టోబర్ నెల, 2007లో జరిగిన ఐ.ఆర్.ఎం లో చేసిన ప్రెజెంటేషన్ ను ఉదహరిస్తానిక్కడ. ఉపోద్ఘాతంగా నా బిజినెస్ "ఇ.ఎం.ఆర్.ఐ కి-ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు మధ్య సంబంధాలను అభివృద్ధి పరిచేదని" చెప్పాను. వివరాల్లోకి వెళ్తూ, నా బిజినెస్ లో భాగంగా, ప్రభుత్వం నుంచి అవసరమైన బడ్జెటరీ మద్దతును పొందడానికి-అత్యవసర సహాయ సేవలు పౌరులందరికీ ఉచితంగా లభ్యమయ్యేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అంగీకరించిన నిధులను సరైన సమయంలో విడుదలయ్యేలా చర్యలు చేపట్టడానికి కృషి చేస్తానని-గత నెలలో కృషి చేశానని ప్రారంభంలో చెప్పాను. అలానే ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆరు నెలలకో సారి జరగాల్సిన "సలహా మండలి సమావేశాలు" నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకున్నానని; సమాజంలో పలుకుబడి-ప్రబావం చూపగల ప్రభుత్వ-ప్రభుత్వేతర వ్యక్తులకు, సంస్థల అధిపతులకు ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తున్న సేవలు వివరించి, తద్వారా భాగస్వామ్య ప్రక్రియను పఠిష్ఠపరిచేందుకు సంబంధిత అధికారులను సంస్థకు తీసుకొచ్చానని; పొరుగు రాష్ర్ట్రాలలో అత్యవసర సహాయ సేవలు ఆరంభించడానికి భాగస్వామ్య ప్రక్రియ చేపట్టానని; అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు అవసరమైన చర్యలు చేపట్టాలని బిజినెస్ ను గురించి కొంచెం లోతుగా వివరించాను.
నా దైనందిన బిజినెస్ కు సంబంధించి నేనెవరికి రిపోర్ట్ చేస్తానో-చేస్తున్నానో, ఎవరెవరి (సహచరుల) సహాయ-సహకారాలు ఏ ఏ విషయంలో తీసుకుంటున్నానో కూడా వివరించాను. నేను నా బిజినెస్ నిర్వహణలో భాగంగా గత నెలరోజుల్లో సాధించిన ఫలితాలను వివరిస్తూ ఉదాహరణగా అక్టోబర్ 5, 2007న ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ అనిల్ పునిఠ మధ్య ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించిన రెండో అవగాహనా ఒప్పందంపైన సంతకాలు పెట్టినప్పటి ఫొటోగ్రాఫ్ ను చూపించాను. ఒక విధంగా సమీక్షా సమావేశంలో పాల్గొన్న సహచరులందరికి ఆ విషయాన్ని తెలియచేసే వేదిక అది కాబట్టి, విషయం తెలిసిన వారికి-తెలియని వారికి వివరించే ప్రక్రియ అది. అదే విధంగా క్రితం నెలలో ఇ.ఎం.ఆర్.ఐ కి వచ్చిన ప్రముఖ వ్యక్తుల్లో, ఢిల్లీ కాట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలచంద్రన్-రాజస్థాన్ ఆరోగ్య శాఖ అధికారిణి రోలీ సింగ్-తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులు-మధ్య ప్రదేశ్ కు చెందిన ఆరోగ్య శాఖ అధికారులు-అస్సాం ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హేమంత, కార్యదర్శి భాస్కర్, తదితర అధికారులు-కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి టీచర్, ఇతర అధికారులు-వగైరాలున్నారని వివరించాను. వాస్తవానికి వీరి రాక వలన భవిష్యత్ లో ఇ.ఎం.ఆర్.ఐ సేవలు రాజస్థాన్-అస్సాం లలో ఆరంభించడానికి వీలు కలిగింది. ఇలా నేను రాబోయే నెలరోజుల్లో తక్షణ చేయాల్సిన పనులు-రాబోయే మూడు నెలల్లో చేయాల్సిన వాటికి తీసుకోబోయే చర్యలు కూడా వివరించాను.
వీటన్నిటి ఆధారంగా సీ.ఇ.ఓ తనకు రిపోర్ట్ చేస్తున్న "లీడర్స్"ను వెంట తీసుకుని చైర్మన్ జరిపే సమీక్షా సమావేశంలో మరో సమీకృత నివేదిక రూపొందించి చర్చిస్తారు. సీ.ఇ.ఓ తెలియచేసిన వివరాలకు సంబంధించి ఏమన్నా సందేహాలుంటే చైర్మన్ ఆయన వెంట వచ్చిన లీడర్స్ ను అడిగి తెలుసుకుంటారు. ఇలా ఇన్ని అంచెల సమీక్షా సమావేశాలు జరిపి ఎక్కడా ఏ లోపం రాకుండా అత్యవసర సహాయ సేవలు అందేలా జాగ్రత్త పడేవారు. సమీక్షల మాట అలా వుంచి, రాజుగారి ఇంట్లో జరిగిన సమావేశాల సమయంలో అందులో పాల్గొన్న మాకు, పాల్గొన్న ప్రతిసారీ ఆయన ఇచ్చిన ఆతిథ్యం జీవితంలో మరువలేం. అల్పాహార మైనా, లంచ్ అయినా, డిన్నరైనా రాజు గారే స్వయంగా ప్రతి వ్యక్తికి ప్లేట్ అందించి, వడ్డించి మరీ తినిపించే వారు. ఇక సమీక్ష జరిగినంతసేపూ, ఆయన ఎప్పుడు ఏం ప్రశ్న వేస్తారోనని మాలో ప్రతి వారికీ జంకుగా వుండేది. రాజుగారి సమీక్షా సమావేశాల్లో అన్ని విషయాలు చర్చకు వచ్చినప్పటికీ, ఆర్థికపరమైన విషయాల ప్రస్తావన తెచ్చినప్పుడల్లా "ఈ విషయాలను తీరిగ్గా-క్వాలిటీ టైమ్ తీసుకుని చర్చిద్దామండీ వెంకట్ గారు" అనేవారెందుకో. అప్పుడర్థం కాలేదు కాని, ఆ తర్వాత అర్థం చేసుకున్నాం. ఆ ఫలితాలను ఆస్వాదించాం-అనుభవించాం. వివరాలు మరో చోట తెలుసుకుందాం.
రాజుగారు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక సీ.ఇ.ఓ సమీక్షలే తప్ప, చైర్మన్ రివ్యూ మీటింగులు దాదాపు నాలుగు నెలల పాటు జరగలేదు. ఆ తర్వాత జీ.వీ.కె గారు జరుపుతున్నట్లు కూడా లేదంటున్నారు. జులై నెల 10-2009న జరిగిన సమీక్షా సమావేశానికి మటుకు ఆయన వచ్చారు. అప్పుడు నేనింకా అక్కడ పనిచేస్తూనే వున్నాను. అంతర్గతంగా ఇ.ఎం.ఆర్.ఐ జరిపే సమీక్షా సమావేశాలే కాకుండా, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పరమైన అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి, కుటుంబ సంక్షేమ కమీషనర్ స్థాయి వరకు ఎన్నో రకాల సమీక్షలు నిరంతరం జరిగేవి. ఆ వివరాలు కూడా ముందు-ముందు తెలుసుకుందాం.
ఇన్ని రకాల సమీక్షా సమావేశాలు-ఇంత పకడ్బందీగా జరిగినప్పటికీ, రాజుగారు రాజీనామా చేసే దాకా ఇ.ఎం.ఆర్.ఐ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు బాహ్య ప్రపంచానికి కాని-అక్కడ పనిచేస్తున్న చాలామందికి కానీ ఎందుకు తెలియలేదు? తెలిసినవాళ్లు మనకెందుకు అని మౌనం వహించారా? రాజుగారు రాజీనామా చేసిన వారం రోజుల్లోనే, ఒక వైపు (దివంగత) ముఖ్యమంత్రి హామీ పత్రికా ముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ, సంస్థ బాంక్ అకౌంట్ ను హఠాత్తుగా స్థంబింప చేయడానికి కారణమేంటి?
Dear Sir,
ReplyDeleteYour narration on 108 is very useful to analyse the institutional dynamics. Though many blame Ramalinga Raju I still believe he is great institution building. If he is not committed this financial irregularities his name would have been entered in the history. Kindly continue though you may disappoint about no comments on this.
Thank you and with regards,
Please continue reading all including previous parts also.
ReplyDeleteThanks
Jwala