అంతర్మధనం-5
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు
లాభాపేక్ష లేని రిజిస్టర్ డ్ సొసైటీగా, లాంఛనంగా రూపు దిద్దుకోనున్న "ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఇ.ఎం.ఆర్.ఐ" ముఖ్య కార్య నిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన వారణాసి సుధాకర్ తన ప్రయత్నాల్లో భాగంగా డాక్టర్ రంగారావు గారిని సంస్థ మెడికల్ సలహాదారుగా చేసుకుని, అత్యవసర సహాయ సేవలు లభ్యమవడానికి అవసరమైన "మెడికల్ ప్రక్రియల” ను, "ప్రోటోకాల్స్" ను రూపొందించసాగారు. ఈ నాటికీ ఆయన అప్పట్లో రూపొందించిన వాటి ఆధారంగానే ఆ సేవలు ఇంకా కొనసాగుతున్నాయి. కాకపోతే, పెరుగుతున్న-మారుతున్న అవసరాలకు అనుగుణంగా వాటిని మలచుకుంటున్నారా-లేదా అన్న విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. సుధాకర్ కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినంతవరకు ఏ రకమైన ఇబ్బందీ లేదు. ఒక వైపు రంగారావు గారి సలహా తీసుకుంటూనే, మెడికల్ ప్రోటోకాల్స్ విషయంలో కొంత అధ్యయనం చేసేందుకు అమెరికా లాంటి దేశాలకు వెళ్లొచ్చారు. మొత్తమ్మీద, ఏమనుకున్నారో-ఏమోకాని, జనవరి 29, 2005న రాజు గారు నిధుల విషయంలో హఠాత్తుగా ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల వరకు తాను సమకూరుస్తానన్నారు. "అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల" కు అనుగుణంగా-ఏ మాత్రం నాణ్యత తగ్గకుండా వుండే తరహా "ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లను" ఒక్కో రాష్ట్రానికి ఒకటి రూపు దిద్దుకోవాల్సిన అవసరం వుందని సూచించారు. మొదలు ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి, హైదరాబాద్ లో ఏర్పాటు చేయమన్నారు. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వున్న మోహన్ కందా గారికి ఈ విషయాలన్నీ వివరిస్తూ ఒక ప్రెజెంటేషన్ చేశారు సుధాకర్. "టోల్ ఫ్రీ టెలిఫోన్ నంబర్" కొరకు నాటి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి దయానిధి మారన్ ను కూడా కలుసుకున్నారాయన. ఆయనకెందుకో కేంద్ర ప్రభుత్వం తమ సంస్థకు 112 నంబర్ కేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయం బలంగా నాటుకుంది అప్పట్లో. కాకపోతే, ఆయన తర్వాత సీ.ఇ.ఓ బాధ్యతలు చేపట్టిన వెంకట్-ఆయన సహచరుడు కిశోర్ తమకు 108 నంబర్ కేటాయించమని కోరడం, అలానే కేటాయించడం, ఆ నంబర్ అచిర కాలంలోనే ఆబాలగోపాలానికి అత్యంత ఆదరణీయమైంది కావడం జరిగింది. పలు విషయాలను స్వయంగా అధ్యయనం చేయడానికి అత్యవసర సహాయ సేవలందిస్తున్న వివిధ దేశాలకు వెళ్లొచ్చారు సుధాకర్.
దీర్ఘ కాలంపాటు అత్యవసర సహాయ సేవలను అందించాలంటే, లాభాపేక్ష లేకుండా నిర్వహించడంతో సరిపుచ్చుకోకుండా, ఏదో రకమైన "రెవెన్యూ మోడల్" అయితే బాగుంటుందన్న ఆలోచన కూడా చర్చకొచ్చింది. డాక్టర్ రంగారావు తో సహా సహాయ సేవల రూపకల్పనలో నిమగ్నమైన వారందరూ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో, ప్రతి పౌరుడికి "ఉచితంగా సేవలు లభ్యమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఆ నిర్ణయమే ఇప్పటికీ అమల్లో వుంది. దరిమిలా, రాజు గారి బృందం, అయిదారు పర్యాయాలు ముఖ్యమంత్రి (దివంగత) రాజశేఖర రెడ్డి గారిని కలిసి పలు అంశాలపై ప్రభుత్వ తోడ్పాటు కోరారు. అప్పట్లో ఆర్థిక సహాయం కోరకపోయినా అంతర్లీనంగా భవిష్యత్ లో కోరబోతున్నా మన్న సంకేతం తెలియచేశారు. ఆ సంకేతాన్ని ఏప్రియల్ 2, 2005 న కుదుర్చుకున్న మొదటి అవగాహనా ఒప్పందంలో అతి చాకచక్యంగా పొందుపరిచారు రాజు గారు. అంతే చాకచక్యంగా రెండో ఎంఓయు లో కూడా చేర్చడంతో, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జంధ్యాల హరినారాయణ గారు, కుటుంబ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్ వెంకట రమణ గారు 2006 సంవత్సరాంతంలో ప్రారంభించి, 2007-2008 సంవత్సరంలో సుమారు 50-60 శాతం వరకు, ప్రభుత్వ పరంగా నిర్వహణ నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ వివరాలు ముందు-ముందు తెలుసుకుందాం.
ఇక సహాయ సేవలను అందించే సంస్థ రూపురేఖలెలా వుండాలో కూడా సుదీర్ఘంగా చర్చించారు. వాటన్నిటికీ వారణాసి సుధాకర్, డాక్టర్ బాలాజి, డాక్టర్ రంగారావు లాంటి వారితో సహా సత్యం సంస్థలో పనిచేస్తున్న పలువురు నిపుణులను సంప్రదించేవారు రాజు గారు. చివరకు లాభాపేక్ష లేని "సొసైటీ" తరహాలో, తన కుటుంబ సభ్యులే "ప్రమోటర్ సభ్యులు" గా "ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్" (Emergency Management and Research Institute-E.M.R.I) అన్న పేరుతో రిజిస్టర్ చేశారు. ప్రఖ్యాత ఛార్టర్డ్ అక్కౌంటెంట్ ఎస్.వి.రావు గారిని తొలుత ఈ విషయంలో సంప్రదించారు. అత్యవసర సహాయ సేవలకు సంబంధించిన వివిధ అంశాల "ప్రక్రియ-ప్రాసెస్" లను తయారు చేశారు. అందులో ప్రధానమైంది "సెన్స్-రీచ్-కేర్" ప్రక్రియ. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఇ.ఆర్.సి) స్థాపన విషయంలో చర్యలు ప్రారంభించారు. అంబులెన్స్ డిజైన్ కు చెందిన అంశాలను అధ్యయనం చేశారు. ఇ.ఆర్.సి కి చెందినంతవరకు "కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ" అన్న పేరుతో సత్యం సంస్థ ఇ.ఎం.ఆర్.ఐ కొరకు వ్యయం చేయడాన్ని అప్పట్లో అంతర్గతంగా చర్చనీయాంశమైంది. 2005 సంవత్సరపు "సత్యం బాలన్స్ షీట్లో" ఇ.ఎం.ఆర్.ఐ కి పెట్టిన వ్యయానికి సంబంధించిన లెక్కలు చేర్చారని కూడా అంటారు.
ఇలా మౌలిక సదుపాయాలకు-సహాయ సేవల రూపకల్పనకు సంబంధించిన పనులను చేసుకుంటూనే, ప్రభుత్వంతో ఏప్రియల్ 2, 2005 న మొట్టమొదటి "అవగాహనా ఒప్పందం" (Memorandum of Understanding-MoU) పై ప్రభుత్వ ప్రతినిధి, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతినిధి సంతకాలు చేశారు. అప్పట్లో ఇ.ఎం.ఆర్.ఐ ప్రతినిధిగా సీ.ఇ.ఓ వారణాసి సుధాకర్ సంతకం చేయగా ప్రభుత్వం పక్షాన "డిజాస్టర్ మేనేజ్‌మెంట్" శాఖ కార్యదర్శి సంతకం చేసారు. ఎం.ఓ.యు. అంశాల వివరాలు మరో సందర్భంలో తెలుసుకుందాం. రాజుగారు కోరినట్లు గానే జులై 14, 2005 కల్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు తయారయ్యాయి.
ఎం.ఓ.యు పై సంతకం చేసింది సుధాకర్ అయినప్పటికీ, సరిగ్గా ఆ రోజునుంచే ఆయన స్థానంలో ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ గా వెంకట్ చెంగవల్లి నియమించబడ్డ సంగతి ఆ క్షణం వరకు గోప్యంగానే వుంచబడింది. ఇక నాటినుంచి వెంకట్ గారి శకం ఆరంభమయింది. వెంకట్ సారధ్యంలో సుధాకర్ సేవలూ కొనసాగాయి. బాలాజి, రంగారావుల సలహాలు కూడా కొంతకాలం కొనసాగాయి. అయితే, క్రమేపీ "ఒక సూర్యుడు సమస్త జీవులకు..." అన్న చందాన వెంకట్ గారు ఇ.ఎం.ఆర్.ఐ లో అన్నీ తానే అయ్యారు. సంస్థను, సంస్థ లక్ష్యాలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చారు. కాకపోతే "దృష్టి దోషం" తగిలిందేమో... ఎంత త్వరగా పైకెదిగిందో...అంత త్వరగానే రాజుగారి నిష్క్రమణంతో "ఒడిదుడుకుల్లో" ఇరుక్కుపోయింది. ఎందుకిలా జరిగిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయినప్పటికీ సమాధానాలు కూడా దొరుకుతాయి.
వెంకట్ గారి శకం ఆరంభం, బాహ్య ప్రపంచానికి, ఇ.ఎం.ఆర్.ఐ లో పనిచేస్తున్న సీనియర్ అధికారులు సుధాకర్ వారణాసి-కిషోర్-అనిల్ లాంటి వారికి హఠాత్పరిణామమే అయినా అంతకుముందు సుమారు రెండు నెలలకు పైగా, అత్యవసర సహాయ సేవల యాజమాన్య నిర్వహణా సంస్థ-ఇ.ఎం.ఆర్.ఐ కి ముఖ్య కార్య నిర్వహణాధికారిగా తీసుకొచ్చేందుకు చైర్మన్ రామ లింగరాజు గారు ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 18, 2004 వెంకట్, రాజు గారి మధ్య పరిచయానికి బీజాలు పడ్డాయి. మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహించదలచిన ఒక కార్యక్రమానికి ఆయన్ను ఆహ్వానించే బాధ్యతను వెంకట్ కు అప్పగించారు నిర్వాహకులు. అందులో భాగంగా జనవరి 20, 2005న ఇద్దరి మధ్య ఒక "బ్రేక్ ఫాస్ట్ సమావేశం" చెన్నైలో జరిగింది. బహుశా అప్పటికప్పుడే వెంకట్ గారి ప్రతిభను ఆకళింపు చేసుకుని వుండాలి రాజు గారు. ఆ మర్నాడు ఇద్దరు ఒకే వేదికపై సుమారు రెండు గంటలకు పైగా కలిసి పాల్గొన్నారు. ఆ వేదికపై ప్రధాన భూమిక వహించిన వెంకట్ గారి "బహు విధ కార్య కలాపాల నిర్వహణా ప్రజ్ఞ" ను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న రాజు గారు, తాను అమలు పర్చదల్చుకున్న "అత్యవసర సహాయ సేవల" కు సమర్థవంతంగా నాయకత్వం వహించగల సత్తా వున్న వ్యక్తిగా ఆయన్ను ఎంపిక చేసుకున్నారు. ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నారు.
జనవరి 22, 2005 న హైదరాబాద్ నుంచి సత్యం అనుబంధ సంస్థలో పనిచేస్తున్న త్యాగరాజు అనే సీనియర్ ఉద్యోగి దగ్గర్నుంచి రాజుగారి "సందేశం" అందింది వెంకట్ కు. "లాభాపేక్ష" ధ్యేయంగా-లక్ష్యంగా పని చేసే పలు "బహుళజాతి సంస్థల" లో పాతిక సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అనుభవం కలిగిన వెంకట్ కు, భవిష్యత్ లో, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో నిర్వహించాల్సిన ఒక "లాభాపేక్ష లేని" సంస్థకు నాయకత్వం వహించడమంటే ఎలా వుండబోతుందోనన్న ఆందోళన వెన్ను తట్టింది. జీవన యానంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి, "ఉపాధ్యాయ వృత్తి" లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న తండ్రి గారి సలహా కోరారు వెంకట్. " కేవలం ఏభై సంవత్సరాల వయస్సులోనే సమాజానికి లాభం చేకూర్చనున్న లాభాపేక్ష లేని ఒక సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసే అవకాశం కలగడం అదృష్టంగా భావించాలి" అని తండ్రి గారు ప్రోత్సహించారు వెంకట్ ను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా భార్యా సమేతంగా హైదరాబాద్ రాజు గారి ఆహ్వానం మేరకు వచ్చి, ఆయనతో సమావేశం అయ్యారు. తిరిగి మరో మారు ఫిబ్రవరి 3, 2005 న ఇరువురి మధ్య సమావేశం జరిగింది. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఫిబ్రవరి 8, 2005 న సొసైటీ గా-లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థగా ఆవిర్భావం చెందడానికి సరిగ్గా అయిదు రోజుల ముందర, ఆ సంస్థకు భవిష్యత్ లో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసేందుకు వెంకట్ నిర్ణయం తీసుకున్నారు. అలా ఆయన శకానికి అంకురార్పణ జరిగింది ఆనాడు. నేటి వరకూ "మడమ తిప్పకుండా" ఆ బాధ్యతను కష్టమైనా-ఇష్టమైనా నిర్వహిస్తూనే వున్నారాయన.
సెప్టెంబర్ 25, 1953 న జన్మించిన ప్రకాశం జిల్లా చీరాల వాస్తవ్యుడు వెంకట్ చెంగవల్లి, విజయవాడ లయోలా కళాశాలలో విద్యాభ్యాసం ముగించి, వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అహ్మదాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో ఎం.బి.ఏ చేశారు. నిరంతరం జ్ఞానార్జనపైనే ఆసక్తి కలిగిన వెంకట్ వ్హార్టన్ స్కూల్, లండన్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, కొలంబియా బిజినెస్ స్కూల్ కు చెందిన "యాజమాన్య నాయకుల" అనుభవాలను అధ్యయనం చేశారు-ఆకళింపు చేసుకున్నారు. నేర్చుకున్న ప్రతి అంశాన్ని తాను నిర్వహించిన కార్యకలాపాల్లో సందర్భానుసారంగా అన్వయించుకున్నారు. అనేక విజయాలను సాధించారు-విజయాల దిశగా కొనసాగుతున్నారు ఇప్పటికీ.
ఆర్థిక, ప్రణాళిక, మార్కెటింగ్ పరమైన వివిధ అంశాల్లో అపారమైన నైపుణ్యం-అనుభవం ఆయన సొంతం చేసుకున్నారు. తాను ఎదుగుతూ, తనతో పనిచేసినవారి ఎదుగుదలకు తోడ్పడుతూ, ఉమ్మడిగా ఆయన పనిచేసిన ప్రతి సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఆయన నిరంతరం అధ్యయనం చేయడమే కాకుండా, తాను నేర్చుకున్న విషయాలను పనిచేస్తున్న సంస్థ అవసరాలకు అన్వయించుకుంటూ, సంస్థలోని సహచర ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ఆయన ప్రత్యేకత. "టీచింగ్-ట్రైనింగ్" కు ఆయన ఇచ్చే ప్రాముఖ్యత వెంకట్ గారి "ప్రెజెంటేషన్ల" లో స్పష్టంగా కనిపిస్తుంది.
1977 నుంచి అనేక బహుళ జాతి సంస్థల్లో ప్రధాన భూమికలను నిర్వహించారు వెంకట్. ప్రధానంగా ఆయన ఫార్మా, కెమికల్, టెక్ స్టైల్ రంగాలలో అనుభవం గడించారు. వెంకట్ ఆలోచనలన్నీ వ్యూహాత్మకమైన వే. "సముచిత స్థానం నుంచి సమున్నత స్థానానికి" తాను పనిచేస్తున్న సంస్థను ఎలా తీసుకెళ్లాలన్న తపన ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అనేక జాతీయ-అంతర్జాతీయ వేదికల మీద ఆయన చేసిన "పవర్ పాయింట్ ఆధారిత ఉపన్యాసాలు" శ్రోతల-ప్రేక్షకుల మదిలో చిర స్థాయిగా నిలిచిపోతాయి. అంశం హెల్త్ కేర్ కావచ్చు, వ్యూహాత్మక ఆలోచన కావచ్చు, నాయకత్వ నేర్పులు కావచ్చు, వ్యూహాత్మక మార్కెటింగే కావచ్చు, సంప్రదింపుల నైపుణ్యం కావచ్చు... మరేదైనా కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు ఆయనే సాటి. వెంకట్ గారి "బహు విధ కార్య కలాపాల నిర్వహణా ప్రజ్ఞ" ను ఆయనను కలిసిన మరుక్షణంలోనే గుర్తించారు రామలింగ రాజు గారు.
వెంకట్ గారు సీ.ఇ.ఓ గా బాధ్యతలు చేపట్టడానికి సుమారు రెండు నెలల ముందు ఫిబ్రవరి 8, 2005 న సత్యం కంప్యూటర్స్ చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా, "ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్" (అత్యవసర యాజమాన్య నిర్వహణా పరిశోధనా సంస్థ-ఇ.ఎం.ఆర్.ఐ) ఆవిర్భావం జరిగింది. తన కుటుంబ సభ్యులే "ప్రమోటర్స్" గా అతి చాకచక్యంగా సొసైటీ నియమ-నిబంధనలను రూపొందించారు రాజు గారు. దానికి కారణాలు అనేకం వుండొచ్చు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకునే ముందర-విశ్లేషించే ముందర, క్లుప్తంగా ఇ.ఎం.ఆర్.ఐ లక్ష్యాలను-ధ్యేయాలను తెలుసుకుందాం. "భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థగా, ఒకే గొడుకుకింద-ఒకే వ్యవస్థ నిర్వహణలో, ఆరోగ్య-వైద్య-అగ్నిమాపకదళ సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు నెలకొల్ప బడిందే అత్యవసర యాజమాన్య నిర్వహణా పరిశోధనా సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ). తొలుత ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించకుండా, ఆంధ్ర ప్రదేశ్ లో ఆరంభమైన అత్యవసర సహాయ సేవలు, అచిర కాలంలోనే, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో, పది రాష్ట్రాలకు వ్యాపించి, లక్షలాది ప్రాణాలను కాపాడగలిగి, జాతీయ-అంతర్జాతీయ స్థాయి మన్ననలను అందుకునే స్థాయికి ఎదిగాయి. అత్యవసర సహాయ సేవలను, సగటు పౌరుడిపై, ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా, వీరు-వారు అనే తేడా లేకుండా, అందరికీ లభ్యమయ్యేలా నిర్వహించేందుకు ఉద్దేశించబడిన ఇ.ఎం.ఆర్.ఐ అందుకనుగుణంగానే తన లక్ష్యాలను-ధ్యేయాలను రూపొందించుకుంది. క్లుప్తంగా అవి:
• అత్యవసర పరిస్థితికి (ఊహించని విధంగా హఠాత్తుగా, ధన-మాన-ప్రాణహాని ప్రమాదం)గురైన వ్యక్తులను, వారికి ప్రమాదం సంభవించిందని సమాచారం అందుకున్న వెంటనే, తక్షణ సహాయాన్ని సరైన సమయంలో అందించడం
• అత్యవసర సమయాల్లో ప్రాణ రక్షణకు, యాజమాన్య నిర్వహణ సమాచార సహాయ కేంద్రంగా సేవలందిస్తూ, తద్వారా పౌరుల ప్రాణాలను కాపాడి, వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చూడడం
• అంకితభావంతో-నిబద్ధతతో, అత్యవసర యాజమాన్య నిర్వహణ-పరిశోధనను ప్రోత్సహించే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందేందుకు, జాతీయ స్థాయి నాయకత్వాన్ని-నైపుణ్యాన్ని సమకూర్చుకోవడం, పెంపొందించడం
• దేశవ్యాప్తంగా, అత్యవసర సహాయ సేవలకు సంబంధించిన అవసరాలను తీర్చే దిశగా, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని-మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటూ, క్రమేపీ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వాటిని మలుచుకోవడం
• వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆలోచనాత్మక కార్యక్రమం, సహకార విధానాల ద్వారా అత్యవసర యాజమాన్య నిర్వహణలో-పరిశోధనలో నిరంతరాభివృద్ధిని సాధించడం
• పౌరుల అవసరాలకు అనుగుణంగా సహాయ సేవల రూపకల్పన చేయడం
• వీలున్నంతవరకు, అత్యవసర సహాయ సేవల అవసరం పౌరులకు కలగకుండా నివారణ చర్యలు చేపట్టే దిశగా పరిశోధనలు చేపట్టడం
• క్షేత్ర స్థాయిలో అత్యవసర సహాయ సేవలను పటిష్ఠ పరిచేందుకు-అమలు చేసేందుకు, అత్యున్నత స్థాయి జాతీయ-అంతర్జాతీయ సంస్థల, ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థల తోడ్పాటుతో పరిశోధనలు జరపడం
• కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల చొరవతో-తోడ్పాటుతో విజయవంతంగా అత్యవసర సహాయ సేవలను అమలు పరిచేందుకు వ్యూహాత్మక సూచనలను ఇవ్వడం
• సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్ షాపులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఈ సేవల పట్ల అవగాహన పెంపొందించడం.
ఇంత గొప్ప ఆశయంతో-ఆశయాలతో ఆవిర్భవించిన ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు ప్రపంచ ప్రఖ్యాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ అధిపతి చైర్మన్ గా, అపారమైన అనుభవం-అంకిత భావం కలిగిన వ్యక్తి సీ.ఇ.ఓ గా వున్నప్పటికీ సంస్థ ఒడిదుడుకులకు ఎందుకు లోను కావాల్సి వచ్చిందో అంత సులభంగా అర్థం చేసుకోలేం. మున్ముందు ఆ కారణాలనూ తెలుసుకుందాం.
hi rao gaaru,
ReplyDeleteI've strong feeling that I met you somewhere or heard of you. I was in journalism for twenty years after starting my journey in Kothagudem of Khammam district. visit my blog for some stuff on AP media
cheers
Ramu
apmediakaburlu.blogspot.com
Dear Mr. Ramu,
ReplyDeleteThank You for visiting my Blog. Probably if we can get in touch we might recollect our association. I was with Governor, CM and finally retired from Dr MCR HRD Institute as a faculty (Additional Director, Training Management).
Let us get in touch. I am available on 98491-03359
Jwala