అంతర్మధనం-4
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు
తాను నడుపుతున్న సత్యం కంప్యూటర్స్ సంస్థ భారతదేశంలోనూ-అంతర్జాతీయం గానూ పేరు-ప్రతిష్ఠలతో పాటు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించడంతో, సంస్థ చైర్మన్ రామలింగ రాజులో అంతర్లీనంగా వున్న దాతృత్వ ధోరణి బహిర్గతం కాసాగింది. తనను ఉన్నతస్థితికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ముందుగా తన ప్రాంత ప్రజలకు, దరిమిలా రాష్ట్ర ప్రజలకు, క్రమేపీ దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి ఏదైనా లాభం కలిగే పని చేపట్టాలన్న భావన కలిగింది రాజుగారిలో. అంతవరకు ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రజల ధనంతోనే తన సంస్థ లాభాలను ఆర్జిస్తున్నదనీ, తాను ఆర్జించిన లాభాలలో కొంత ఆ ప్రజలకే ముట్టచెప్పాలనీ అనుకున్న రాజుగారు తన ఆలోచనలను కార్యరూపంలోకి తేగలిగే వ్యక్తులకోసం వెతకసాగారు. తన సంస్థకు చెందిన-తానే నియమించిన "సత్యం ఫౌండేషన్" స్వచ్చందసంస్థ డైరెక్టర్ డాక్టర్ ఊట్ల బాలాజిని సంప్రదించారు రాజు గారు. యాదృఛ్చికమో-భగవదేఛ్చో కాని సరిగ్గా అదే సమయంలో బాలాజికి ఒక చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన స్నేహితుడొకరికి ప్రాణాపాయ ప్రమాదం సంభవించడం, ఆ సందర్భంలో ఆ స్నేహితుడికి అత్యవసర వైద్య సహాయం కొరకు ఆసుపత్రికి తరలించడానికి కనీస సౌకర్యాలున్న అంబులెన్స్ కోసం బాలాజి ప్రయత్నాలు చేయడం, అతి కష్టం మీద ఒక నామ మాత్రపు "మేటా డోర్ వాహనం" అంబులెన్స్ లభించడం, చివరకు బాలాజి సరైన సమయంలో-సరైన రీతిలో స్నేహితుడిని ఆసుపత్రికి చేర్చలేక పోవడం, అతడు మరణించడం జరిగింది. ఆ సంఘటన డాక్టర్ బాలాజిని కదిలించడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో, తగిన వైద్య సహాయం అందించుకుంటూ, సమీప ఆసుపత్రికి చేర్చగలిగే అంబులెన్సులను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే మార్గం ఏదన్నా వుంటే బాగుంటుందన్న భావన కూడా కలిగింది. తనకు ఈ విషయంలో తోడ్పడగల వైద్య నిపుణుల కొరకు అన్వేషణ సాగించారు. ఒకవిధంగా, రాజుగారి ఆలోచనకనుగుణంగా బాలాజి మనస్సులో మెదిలిన భావన ఆద్యతన భవిష్యత్ లో ఒక గొప్ప సేవా కార్యక్రమంగా రూపు దిద్దుకుని, లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు నాంది పలికిందని చెప్పొచ్చు. ప్రస్తుతం రామలింగ రాజు గారు స్థాపించిన మరో స్వచ్చంద సంస్థ హెచ్.ఎం.ఆర్.ఐ లో డాక్టర్ బాలాజి ముఖ్య కార్య నిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు.
రాజు గారి ఆలోచనలు కార్యరూపంలోకి తేవడానికి డాక్టర్ బాలాజికి తోడ్పడిన వారిలో ముందు వరుసలో డాక్టర్ ఎ.పి. రంగారావు, వారణాసి సుధాకర్, శ్రీకాంత్, కృష్ణ కోనేరు, శ్రీనివాస రాంబాబు, పొలిమల్లు శివ వున్నారు. వీరి లాంటి ఎందరో కలిసి రూపొందించిన ప్రణాళికా బద్ధమైన కార్యాచరణ పథకమే 108-అత్యవసర సహాయ సేవలు. "చీమల పుట్ట పాములపాలైనట్లు", ప్రస్తుతం వారెవరినీ అనుకున్నవారు లేకపోగా, కనీసం, ఒడిదుడుకులకు లోనైన ఆ సేవలను ఆదుకునేదెలా అన్న విషయంలోనైనా ఆవిర్భావ కాలం నాటి వ్యక్తులను సంప్రదించాలన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరం. రాజుగారెప్పుడూ అంబులెన్స్ పైన తన పేరు గాని, తన సత్యం సంస్థ పేరు కానీ వుండాలని మాటమాత్రంగానైనా అనలేదు. ఇప్పుడేమో అవే అంబులెన్సులు ఒకరి సొంత ఆస్తిలాగా రోడ్లపై తిరుగుతున్నాయి. నాకు గుర్తున్నంతవరకు, 108-అత్యవసర సహాయ సేవల ఆవిర్భావ నేపధ్యంలో, అమోఘమైన కృషిచేసి, వైద్య పరంగా ప్రతి చిన్న అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి, ఆ మోడల్ ను రూపొందించి-ఏడాదికి పైగా అన్నిరకాల సలహా సంప్రదింపులను అందచేసిన డాక్టర్ ఎ.పి. రంగారావు, రాజుగారి నిష్క్రమణ తర్వాత, అనుకోకుండా ఒకనాడు ఇ.ఎం.ఆర్.ఐ క్యాంపస్‌కు వచ్చారు ఏదో పనిమీద. సరిగ్గా అదే సమయంలో సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీ.వీ. కృష్ణారెడ్డి మొట్టమొదటి సారిగా క్యాంపస్ చూడడానికి వచ్చారు. ఏక కాలంలో క్యాంపస్‌లో వున్న వారిద్దరినీ ఒకరినొకరికి పరిచయం చేయాలన్న ఆలోచనకూడా డాక్టర్ విజిట్ ను ఏర్పాటు చేసిన వారికి గాని-ఆయన్ను, ఆయన సామర్థ్యాన్ని బాగా ఎరిగిన ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ గారికి గాని రాలేదు. సంబంధ-బాంధవ్యాల విషయంలో ఎంతో జాగ్రత్తపడే వెంకట్ గారికి జీ.వీ.కె దగ్గరకు డాక్టర్ ను ఒక్కసారైనా తీసుకెళ్లాలన్న ఆలోచన రాకపోవడానికి బలవత్తరమైన కారణమేదైనా వుండొచ్చు. బహుశా వారిద్దరికీ పరిచయం చేసుంటే, ఈ నాటి ఒడిదుడుకులకు, కొన్ని పరిష్కార మార్గాలు ఏనాడో లభించేవేమో ! ఇప్పటికీ మించిపోయింది లేదు.
ఇదిలావుండగా హైదరాబాద్ పరిసరాల్లో-నగరంలో అప్పట్లో ఏదో రకమైన సేవలందిస్తున్న అంబులెన్సులను గురించి కొంత సమాచారం సేకరించారు బాలాజి. వాటి సంఖ్య, డిజైన్, సౌకర్యాలు, నాణ్యత లాంటివి అధ్యయనం చేశారు. తాను అర్థం చేసుకున్న విషయాలను రామలింగ రాజు గారికి విశ్లేషణాత్మకంగా వివరించారు. అలా వివరించిన విధానాన్ని ఇష్టపడ్డ రాజు గారు, హైదరాబాద్ నగరంలో ఒకటి-రెండు అంబులెన్సులను నడిపి ఫలితాలెలా వుంటాయో చూద్దామనుకున్నారు. తన ఆలోచనను అమలుచేయాల్సిన బాధ్యత బాలాజికి అప్పచెప్పారు. వాస్తవానికి ఆపాటికే రాజుగారి స్వస్థలమైన భీమవరంలో భైర్రాజు సంస్థ ఆధ్వర్యంలో ఒక అంబులెన్సును తిప్పుతున్నారు. శాస్త్రీయంగా ముందుకుపోవాలన్న సంకల్పంతో, ఈ విషయంలో అవగాహన-ఆలోచన-అనుభవం-నిబద్ధత వున్న వైద్య రంగ నిపుణుడి కొరకు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు బాలాజి. ఆయనకు పరిచయమున్న, ఒక స్వచ్చంద సంస్థను నడుపుతున్న శశి అనే వ్యక్తి ద్వారా డాక్టర్ రంగారావును కలుసుకున్నారు. "సత్యం సంస్థ లాంటి విశ్వసనీయ సంస్థ" అధిపతి ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్తానంటే తన సహాయం తప్పక వుంటుందని రంగారావు హామీ ఇచ్చారు. కేవలం ఒక్కో పౌరుడి మీద సంవత్సరానికి పది రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలిగితే దేశమంతా సంపూర్ణ వైద్య సౌకర్యాలున్న అంబులెన్సులను నడపొచ్చొని అప్పటికప్పుడే సూచించారు రంగారావు గారు. వారిద్దరూ కలిసిన మొదటి రోజే సరదాగా ధూమపానం చేసుకుంటూ బృహత్తరమైన ప్రణాళికను రూపకల్పన చేశారు. ఇదంతా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మొదటి సారి 2004లో అధికారంలోకి రావడానికి రెండేళ్ల ముందు నుంచి ఆరంభమై సరిగ్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి కార్యరూపం దాల్చడం మొదలైంది.
అయితే అప్పటికీ-ఎప్పటికీ "మిలియన్ డాలర్ల ప్రశ్న" గా మిగిలిపోయిన ఒకే-ఒక అంశం రామలింగ రాజు గారు తన బృహత్తర ప్రణాళికకు ఎంత ఖర్చు చేయదల్చుకున్నారనే విషయం. ఆయన ఖచ్చితంగా ఎంత ఇవ్వ దల్చుకున్నాడో, ఎన్నడూ, సూచన మాత్రంగానైనా చెప్పకపోవడం విశేషం.
ఈ నేపధ్యంలో, ఒక రోజు ఉదయాన్నే రాజుగారి దగ్గర్నుంచి డాక్టర్ బాలాజికి ఫోనొచ్చింది. ఒకటి-రెండు రోజుల్లో ముఖ్యమంత్రి (దివంగత) రాజశేఖర రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరుకు వస్తున్నారని, ఆ సందర్భంగా ఆయనకు అందచేసేందుకు, తమ ఆలోచనలకనుగుణంగా, అత్యవసర సహాయ సేవలకు-అంబులెన్సులకు సంబంధించి ఒక సమగ్రమైన పథకాన్ని తయారు చేసి తెమ్మని రాజుగారు కోరారు. అంబులెన్సు సేవల ఆవశ్యకతను వివరించే విధంగా నివేదిక వుండాలని కూడా ఆయన సూచించారు. అంతవరకు తాను-తన మిత్ర బృందం కలిసి సేకరించిన తత్సంబంధమైన వివరాలను క్రోడీకరించి, ఒక "ప్రతిపాదన” ను తయారుచేసి రాజుగారి దగ్గరకు పట్టుకెళ్లారు బాలాజి. కొంతకాలం (మహీంద్రా) సత్యం కంప్యూటర్స్ సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన ఏ.ఎస్. మూర్తి గారింట్లో సరదాగా డిన్నర్ పార్టీలో వున్న సమయంలో బాలాజీ తీసుకెళ్లి చూపించిన ప్రతిపాదనను రాజుగారు మెచ్చుకున్నారు. ఆ విధంగా భవిష్యత్ లో కార్యరూపం దాల్చు కోనున్న ఒక బృహత్తర ప్రణాళికకు, ఆవిర్భావ ప్రతిపాదనకు అంకురార్పణ జరిగింది. ఆ మర్నాడే ఆ ప్రతిపాదన ముఖ్యమంత్రికి సమర్పించేందుకు బాలాజిని ఏలూరుకు రమ్మని సూచించారు రాజుగారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసి అప్పటికింకా పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. జూన్ నెల 2004 లో జరిగిందిది. తక్షణమే ప్రయాణమై అక్కడకు చేరుకొని రాజశేఖర రెడ్డి గారికి నివేదిక సమర్పించారిద్దరు. బాగుందని మెచ్చుకున్న ముఖ్యమంత్రి ఆయన కార్యదర్శికిచ్చి పరిశీలించమన్నారు దాన్ని.
ఇది జరిగిన వారం రోజుల్లోనే ముఖ్యమంత్రికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని, దాన్ని తయారుచేయమని బాలాజిని పురమాయించారు రాజు గారు. సత్యం ఫౌండేషన్ డైరెక్టర్ గా దైనందిన కార్యకలాపాల్లో బాలాజికి పని ఒత్తిడి ఎక్కువగా వుంటుందని భావించిన రాజు గారు సత్యం సంస్థలోనే పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి వారణాసి సుధాకర్ సహాయం తీసుకోమని కూడా చెప్పారు బాలాజికి. ఎలాగూ అపాటికే డాక్టర్ రంగారావు గారి వైద్య పరమైన సలహా-సంప్రదింపులు తీసుకుంటూనే వున్నారు. సత్యం మేనేజ్ మెంట్ విభాగంలో పనిచేస్తున్న మరో అధికారి కృష్ణ కోనేరు కూడా వీరికి తోడయ్యారు. ఆయన సూచించిన "సెన్స్-రీచ్-కేర్" (ప్రాణాపాయ పరిస్థితుల్లో అత్యవసర సహాయం అవసరమైన వ్యక్తికి సంబంధించిన సమాచార సేకరణ-ఆ వ్యక్తి వున్న స్థలానికి వీలైనంత త్వరలో చేరుకోవడం-చేరుకున్న వెంటనే అత్యవసర వైద్య సహాయం తక్షణమే అందించే ప్రక్రియ ఆరంభించి సమీప ఆసుపత్రికి అంబులెన్సులో తరలించడం) నమూనా రాజుగారికి బాగా నచ్చిందంటారు బాలాజి. డాక్టర్ రంగారావు ఎంపికచేసిన (అప్పటికి) సుమారు 132 రకాల "ఎమర్జెన్సీలను" ప్రజెంటేషన్ లో చొప్పించారు. ఇవన్నీ రాజుగారు చాలా మెచ్చుకొని ముఖ్యమంత్రితో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం మీద డాక్టర్ బాలాజి అనుకున్న రోజున ముఖ్యమంత్రికి నచ్చేలా చక్కటి ప్రజెంటేషన్ చేశారు. ఇక అప్పటినుంచి రాజు గారి సూచన మేరకు వారణాసి సుధాకర్ ఎక్కువ చొరవ తీసుకోవడం ప్రారంభించారు.
వారణాసి సుధాకర్ కు ముఖ్య భూమిక అప్పగించమని బాలాజికి చెప్పడంతో సరిపుచ్చుకోకుండా స్వయంగా రాజుగారు దానికి పూనుకున్నారు. బహుశా వీలైనంత త్వరగా తన ఆలోచనలను కార్యరూపంలోకి తేవాలన్న ఆతృత ఆయనలో వుండొచ్చు. బెంగుళూర్లో వినాయక చవితి పూజ చేసుకుంటున్న వారణాసి గారికి సెప్టెంబర్ 17, 2004 ఉదయాన రాజు గారి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. పూజ పూర్తి చేసుకున్న తర్వాత వారిరువురు మాట్లాడుకున్నారు. మరి కాసేపట్లో మళ్ళీ ఫోన్ చేసిన రాజు గారు, ఉమ్మడిగా సమాలోచన చేసేందుకు, కాన్ఫరెన్స్ కాల్ ద్వారా, తమ్ముడు (నాటి సత్యం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్) రామరాజును, ఏ.ఎస్. మూర్తి గారిని, వారణాసి గారిని కలిపి మాట్లాడారు. అప్పట్లో సుధాకర్, సత్యం సంస్థలో, సాంకేతిక సంబంధమైన బిజినెస్ ను, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారు. వృత్తి పరంగా ఆయనకు సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం గల వ్యక్తిగా పేరుంది. అత్యవసర సహాయ సేవలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకనుగుణంగా అందచేయాలంటే, సాంకేతిక పరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం ప్రాధాన్యతా పరమైన అంశమని గ్రహించిన రాజు గారు, అవి సమకూర్చగల సామర్థ్యం వున్న వ్యక్తి వారణాసి సుధాకర్ అని భావించారు. "ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్-అత్యవసర సహాయ సేవల" ను అందుబాటులోకి తెచ్చే బాధ్యత స్వీకరించాల్సిందిగా వారణాసిని కోరారు రాజు గారు.
తనతో ఫోన్లో మాట్లాడిన రాజు గారు, తనకు బాధ్యతను అప్పచెప్తూ, పేపర్ పై రాసుకుని, ఫోనులోనే చదివిన దాన్ని (సుమారు ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా) వారణాసి సుధాకర్ ఇప్పటికీ మర్చిపోలేదు. "సుధాకర్ ! అమెరికాలోని 911 తరహా అత్యవసర సహాయ సేవలను అందించేందుకు, అవసరమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ను, అంతర్జాతీయ ప్రమాణాలతో, ఒక సంవత్సర కాలంలో మీరు ఏర్పాటుచేసి తగు విధమైన సేవలు లభించేలా చర్యలు చేపట్టాలి. తొలుత ఆంధ్ర ప్రదేశ్ లోను, క్రమేపీ దేశ వ్యాప్తంగానూ దాని ద్వారా పౌరులందరికీ ఆ సేవలు లభ్యమయ్యేలా చూడాలి" అని దాని సారాంశం. రాజు గారికి (అప్పట్లో) తాను చెప్పదల్చుకున్న విషయంలో పూర్తి అవగాహన వున్నప్పటికీ "స్పష్టంగా" వ్యక్తం చేయడంలో కొంత ఇబ్బంది పడేవారని సుధాకర్ అభిప్రాయం. తనకు అప్ప చెప్పిన బాధ్యతకు సంబంధించిన సందేహాలను తక్షణమే ఫోన్లో వ్యక్త పరిచారు సుధాకర్. "అత్యవసర యాజమాన్య-నిర్వహణ సేవలు" అంటే తనకు అవగాహన లేదని, "అంతర్జాతీయ ప్రమాణాల సేవలు" అంటే ఏమిటని, "ప్రభుత్వంతో కలిసిమెలిసి ఎలా పనిచేయాలో తెలియదని" మూడు సందేహాలను వెలిబుచ్చారు. అవన్నీ త్వరలోనే ఆయనకు అర్థమవుతాయని ముక్త సరిగా ముగించారు రాజుగారు.
రాజుగారి ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చే బాధ్యతను స్వీకరించిన సుధాకర్ ముందు ఎన్నో సవాళ్లు కనిపించసాగాయి. "మెడికో-లీగల్" కు సంబంధించిన సమస్యలను ఎలా అధిగమించాలన్నది అందులో ముఖ్యమైందంటారాయన (వాస్తవానికి నేను ఇ.ఎం.ఆర్.ఐ లో పనిచేసిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక్కనాడుకూడా అది సమస్య కాలేదు). ఆయన ముందున్న మరో సవాలు ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం (నేను అక్కడ పనిచేసినంతకాలం చేసిన పనే అది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా మొత్తం అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న పది రాష్ట్రాలలో నాకు ఆ సమస్య ఎదురవ్వలేదు). మరో ప్రధానమైన సవాలు, రాజు గారు ఈ సేవలకు ఎంత మోతాదులో నిధులను సమకూరుస్తాడో నని. నిజానికి అప్పటికీ-ఎప్పటికీ ఇది సవాలుగానే, ఒక "యక్ష ప్రశ్న" గానే మిగిలింది. ఇక దానికి సమాధానం లేనట్లే ! ఇలా సవాలు వెంట సవాలు సుధాకర్ మదిని తొలుస్తున్నా కార్యాచరణ పథకం రూపొందించడానికి అవేవీ అవరోధాలు కాలేదు. సెప్టెంబర్ 2004-ఏప్రియల్ 2005 మధ్య కాలంలో సవాళ్లకు సమాధానాలు దొరకడమే కాకుండా, ఎమర్జెన్సీకి "సరైన నిర్వచనం" లభించింది. సందేహాలకు సమాధానాలతో పాటు, ఎన్నో కొత్త అంశాలకు సంబంధించి అవగాహనకు రాసాగారు. టోల్ ఫ్రీ టెలిఫోన్ గురించి, దాని నంబర్ గురించి, అంబులెన్స్ డిజైన్ గురించి, లోగో గురించి, వైద్య పరమైన ప్రోటోకాల్స్ గురించి, సాంకేతిక సదుపాయాల గురించి, ప్రభుత్వ భాగస్వామ్యం గురించి స్పష్టత రాసాగింది. రాందల్లా బడ్జెట్ విషయంలోనే. సుధాకర్ వైద్య పరమైన విషయాలనేకం డాక్టర్ రంగారావుతో చర్చించేవారు. తనకు సాంకేతిక పరంగా తోడ్పడేందుకు వై.ఎన్.ఎస్ కిషోర్ అనే నిపుణుడిని ఇ.ఎం.ఆర్.ఐ లో నియమించారు. అంతకు ముందే బాలాజి సత్యం సంస్థలో నియమించిన మరో నిపుణుడు అనీల్ జంపాలను కూడా ఇ.ఎం.ఆర్.ఐ కి తీసుకొచ్చారు. ఆయనకు అమెరికాలో ఆ రంగంలో పనిచేసిన అపారమైన అనుభవం వుంది.
వీరిద్దరు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పెరుగుదలకు చాలా కృషి చేశారు. కిషోర్ ఇప్పటికీ ఇంకా అక్కడే పనిచేస్తున్నారు. ఆయన కక్కడ ప్రమేయం లేని రంగం లేదనాలి. బహుశా పాత తరం వాళ్లలో ఆయనొక్కడే (ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత సీ.ఓ.ఓ హెచ్.ఎస్.డి.శ్రీనివాస్, వెంకట్ గారు తప్ప) మిగిలారేమో ఇంకా అక్కడ. రెండో తరం వాళ్లలో కూడా బహుశా వైద్య శిక్షణకు సంబంధించిన జీ.వి.రమణారావు గారొక్కడే మిగిలారనుకుంటాను. అంతర్జాతీయంగా 108-అత్యవసర సహాయ సేవలకు వివిధ దేశాల్లో గుర్తింపు రావడానికి, వివిధ దేశాల్లోని సంబంధిత సంస్థలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనిల్ జంపాల అపారమైన కృషి చేశారు. "టెంకాన్" అన్న పేరుతో అంతర్జాతీయ స్థాయి సెమినార్ ను హైదరాబాద్ లో నిర్వహించి, అనాదిగా భారతదేశంలో అత్యవసర సహాయ సేవలు ఎలా అంద చేశారన్న అంశాల నుంచి,ఆధునిక ప్రపంచంలో అవి ఎలా లభ్యమవుతున్నాయన్న అంశాల వరకు పలు విషయాలను కూలంకషంగా చర్చించుకోవడానికి వేదికను ఏర్పాటుచేసిన ఘనత అనిల్ కే దక్కుతుక్కుతుంది. అనిల్-కిషోర్ , ఇద్దరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వారే కావడంతో, ఆ రంగానికి సంబంధించిన అనేక విషయాలు, సమీక్షా సమావేశాల్లో చర్చకొచ్చేవి. ఒక్కోసారి అవి ఘాటుగా వుండేవి కూడా. వాళ్లిద్దరూ సంస్థ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడినప్పటికీ, ఒకే ఒక్క విషయంలో నేను ఊహించని రీతిలో ఎందుకు జరిగిందో ఇప్పటికీ నేను అర్థం చేసుకోలేకపోయాను. వారిద్దరినీ కాదని, వీరికంటే పై స్థాయిలో నూకల సుధాకర్ ను ఆంధ్ర ప్రదేశ్ "ప్రధాన ఆపరేటింగ్ అధికారి" గా రాజుగారు ఎందుకు నియమించాల్సి వచ్చింది? ఎందుకు వెంకట్ ఆ విషయంలో అడ్డు చెప్పలేదు? వారిద్దరికంటే నూకల సుధాకర్ సమర్థుడనే కదా ! అంత గొప్ప సమర్థుడిని అతి తక్కువ కాలంలో (అదీ రాజుగారు చైర్మన్ గా తొలగిన కొద్ది రోజులకే) తప్పుకోమని అడగాల్సిన కారణాలేమై వుంటాయి? ఈ నాటి సంస్థ ఒడిదుడుకులకు ప్రత్యక్షంగా కాని-పరోక్షంగా కాని ఆ కారణాలు ఎంత సహేతుకం అనొచ్చు?
మొదటి అవగాహనా ఒప్పందం ప్రభుత్వంతో కుదుర్చుకోవడానికి పూర్వ రంగంలోనే అనిల్, కిషోర్ ఇద్దరు చేసిన కృషి గాని, ఆ తర్వాత సంస్థ ద్వారా పది రాష్ట్రాల్లో అత్యవసర సహాయ సేవలు లభ్యమయ్యేలా చూడడంలో గాని వారిద్దరి కృషి అమోఘం. నూకల సుధాకర్ లాగానే ఎందరినో "ఆయా రంగాలలో నిపుణులు" అన్న పేరుతో ఇ.ఎం.ఆర్.ఐ లో నియమించడం జరిగింది. అలా నియమించబడిన వారిలో సంస్థ ఎదుగుదలకు కృషి చేసినవారికంటే, చేయనివారే ఎక్కువని అనాలి. బహుశా ఆర్థికంగా ఈ నాటి ఒడిదుడుకులకు కారణం సంస్థా పరంగా వారందరికీ చెల్లించిన పెద్దమొత్తంలోని జీతాలు కూడా. వారికి చెల్లించిన పెద్ద మొత్తంలోని జీతాలను చైర్మన్ రామలింగ రాజు గారు సమకూర్చకపోయినా, ఏ నిధుల్లోంచి-ఎందుకు మళ్లించాల్సి వచ్చిందోనన్న ప్రశ్నకు జవాబు దొరకదేమో ! ఆ వివరాలు మరోసారి తెలుసుకుందాం.
Sir,
ReplyDeleteA very comprehensive history of evolution of EMRI is being chronicled…….a lot of these “nuggets” of information, you brought out are news to me too….. looking forward to fifth part….
Regards,
Srinivas HSD
Sir,
ReplyDeleteWaiting for the next post. Can you please take some time for us.
Thank you and warm regards,
Shiva.
Dear Jwala Garu,
ReplyDeleteI am happy at the same time unhappy also to note some incidents in the past history of EMRI.
Good that you are bringing out some salient features of this great organisation.
I am sorry I could not give my feed back immediately.
I have not received your article no.3 in the series. Kindly forward the same.
Whatever it is today, I am sure that EMRI will certainly get its past glory and its values are held high.
This should not become the personal property of any one individual.
This was started by a gentleman for the benefit of the general public and not with any motive to make money out of this project.
Someone should take forward this noble idea in the larger interest of the Nation.
With Regards,
Mangapati Rao K.
Partner Finance,
EMRI-AP
Dear Shiva,
ReplyDeleteThank You for your feed-back.Do you want me to get in touch with you. If so, please let me know your number and I will talk to you. You are most welcome to meet me if you want.
Regards,
Jwala