Sunday, June 27, 2010

X-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-10) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-10
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు

వనం జ్వాలా నరసింహారావు

రామలింగ రాజు, తాను తలపెట్టిన, మహత్తరమైన "బృహత్తర ప్రాణ రక్షణ యజ్ఞం" నిర్వహించగల సమర్థుడైన "ఋత్విజుడు" కొరకు అన్వేషిస్తున్న సమయంలో, జర్మనీకి చెందిన ఒక బహుళ జాతీయ సంస్థలో, చెన్నై ప్రధాన కార్యాలయంగా, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న వెంకట్ చంగవల్లి తారస పడ్డారు. అలా తారసపడ్డ వెంకట్ పుట్టు-పూర్వోత్తరాల గురించి, నైపుణ్యం-అర్హతల గురించి, తనతో పాటు యజ్ఞాన్ని నిర్వహించగల సత్తా వున్న తోటి "ఋత్విక్కులను" నియామకం చేసుకోగల సామర్థ్యం గురించి ఇంతకు ముందే కొంత తెలుసుకున్నాం. ఋత్విజుడుగా యజ్ఞ భారాన్ని మోయడమే కాకుండా, కష్ట కాలంలో తోటి ఋత్విక్కులలో స్థయిర్యాన్ని పెంపొందించేందుకు వెంకట్ చేసిన కృషి ముందు ముందు తెలుసుకుందాం. వెంకట్ 108-అత్యవసర సహాయ సేవల సంస్థ సిఇఓ గా పనిచేసిన-చేస్తున్న కాలాన్ని నాలుగై దు ప్రధాన దశలుగా విభజించి చూడాలి. ఆయా దశల్లో, ఆయన నిర్వహించిన పాత్ర, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఎదుగలకు ఎంత మేరకు తోడ్పడింది-ఒడిదుడుకులకు ఏ మోతాదులో కారణమైంది, విశ్లేషణ చేయడానికి, ఆ దశలకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మొదటి దశ: సంస్థ సిఇఓ గా వెంకట్ ఏప్రిల్ 15, 2005 న బాధ్యతలు చేపట్టడానికి పూర్వం; రెండవ దశ: బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆగస్టు 15, 2005 న అత్యవసర సహాయ సేవలను లాంఛనంగా హైదరాబాద్ నగరంలో ఆరంభించడం వరకు; మూడవ దశ: ఆగస్టు 15, 2005 నుంచి జులై-ఆగస్టు 2006 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇ.ఎం.ఆర్.ఐ తో గ్రామీణ ప్రాంతాలలో సేవలందించడానికి ఒప్పందం కుదుర్చుకునేందుకు చొరవ చూపించడం వరకు-ఆ తర్వాత; నాలుగవ దశ: రామలింగ రాజు జనవరి 8, 2009 న చైర్మన్ గా తప్పుకోవడం-తదనంతర పరిస్థితులు, దరిమిలా మే నెల 26, 2009 న (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చొరవతో జీవికే సంస్థ యాజమాన్య బాధ్యతలు స్వీకరించే వరకు; ఐదవ దశ: వర్తమాన-భవిష్యత్ కాల పరిస్థితులలో ఆయన పాత్ర. ఆయా దశల్లో వెంకట్ నిర్వహించిన పాత్ర, ఆయన పట్ల అలనాటి రాజు గారికి-ఈ నాటి డాక్టర్ జీ. వి. కె. రెడ్డి గారికి వున్న అపారమైన విశ్వాసం పూర్వాపరాలు పలు రకాలుగా ఆసక్తికరమైన వనే అనాలి.

మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సదస్సుకు సంబంధించిన అంశాలను చర్చించడానికి, జనవరి 21, 2005 ఉదయాన, చెన్నైలో రాజు బసచేస్తున్న హోటల్ లో ఆయనతో "బ్రేక్ ఫాస్ట్" సమావేశమయ్యారు వెంకట్ తొలుత. ఆ నాడు జరుగనున్న సదస్సులో రాజు గారికి ఇష్టమైన "బియాండ్ క్రియేటింగ్ వేల్యూ" అన్న అంశంపైన చర్చ జరుగనుంది. అత్యవసర సహాయ సేవల పేరుతో "అపారమైన విలువను" తాను సృష్టించగలడు గాని, ఆ విలువకు తగ్గ మూల్యానికి అతీతంగా-అవధులకు మించి, ఆ సేవల ఫలితాలను కావల్సినవారికి అందచేయడం ఎలా సాధ్యమవుతుందని ఆయన అనుకుంటున్న సమయంలోనే, దానికి సంబంధించిన అంశంపై సదస్సులో చర్చించబోవడం రాజు గారికి అనుకోని అవకాశంగా కలిసి వచ్చింది. నిర్వహణ బాధ్యతలను అప్ప చెప్పేందుకు నాయకత్వ పటిమగల వ్యక్తిగా వెంకట్ ఆయనకి కనిపించారు. ఆయన అనుభవం, విధి నిర్వహణ దక్షత, సంబంధ-బాంధవ్యాలను ఏర్పాటు చేసుకోగల నేర్పరితనం, నిబద్ధత, నైపుణ్యం, విశ్వసనీయత లాంటి అంశాలను కాసేపట్లోనే నిశితంగా గమనించారు రాజు. సదస్సు నిర్వహిస్తున్న సమయంలో మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ చైర్మన్ మహాపాత్ర, వెంకట్ గురించి-ఆయన "వినయ-విధేయతల" గురించి రాజు తో గొప్పగా చెప్పారు. హైదరాబాద్ తిరిగొస్తూనే రాజు తన సంస్థలో పనిచేస్తున్న ఉమ్మడి స్నేహితుడి ద్వారా వెంకట్ ను కదిపారు. వెంకట్ తక్షణ స్పందన రాజు ప్రతిపాదనకు అనుకూలంగా రాలేదు. తన సహోద్యోగులను, తండ్రిని సంప్రదించిన తర్వాత వెంకట్ లో మార్పు రాసాగింది. అమెరికా 911 స్థాయిలో అత్యవసర సహాయ సేవల నిర్వహణ గురించి, లాభాపేక్ష లేని సంస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి వెంకట్ లాంటి వారి అవసరాన్ని గురించి, ఆయన నిర్వహణా దక్షత గురించి పదే పదే ప్రస్తావించసాగారు రాజు. "మీరు తెలుగు వారు. విజయవంతంగా ఇతర ప్రాంతాలలో తెలుగే తర సంస్థలలో పని చేస్తున్నవారు. ప్రాణ రక్షణకు ప్రారంభిస్తున్న అత్యవసర సహాయ సేవల నిర్వహణను చేపట్టండి" అని అనేవారు. సూత్రప్రాయంగా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సారధ్యం వహించడానికి అంగీకరించి, ఫిబ్రవరి 3, 2005 న రాజు ఆహ్వానం మేరకు భార్యా సమేతంగా హైదరాబాద్ వచ్చి కలిశారు వెంకట్. "వివరించనలవి కాని ఆకర్షణ శక్తి" వుంది రాజుగారిలో అంటారు వెంకట్. అతిథి మర్యాదల విషయంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఒకరోజు ముందర హైదరాబాద్ చేరుకున్న వెంకట్ దంపతులకు విమానాశ్రయంలో స్వాగతం ఏర్పాటు చేసిన పద్ధతి, వాహనం పంపిన విధానం, సరాసరి సత్యం సంస్థకు తీసుకెళ్ళడం, అక్కడ ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు.... లాంటివి.... వెంకట్ ను ఆకట్టుకున్నాయి.

రాజు-వెంకట్ మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. మర్నాడు వెంకట్ దంపతులను తమ ఇంటికి సాదరంగా ఆహ్వానించిన రాజు దంపతులు (రామలింగ రాజు, నందిని) హైదరాబాద్ లో వారెక్కడ వుండ దల్చుకుంది అడిగి తెలుసుకున్నారు. వారు కోరినట్లే జూబ్లీ హిల్స్ లో ఆకర్షణీయమైన భవనంలో అద్దె కుండే ఏర్పాటు స్వయంగా చేశారు రాజు. ఇక అప్పటినుంచి, ఉద్యోగంలో చేరేవరకు వారం-వారం (ఆ తర్వాత ప్రతిరోజు-ప్రతి గంట-ప్రతి నిమిషం) ప్రాజెక్ట్ గురించి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో దానిని నిర్వహించడం గురించి ఫోన్లో మాట్లాడే వారు రాజు. ఆయన సంస్థకు సిఇఓ గా వస్తున్న సంగతి చేరేంతవరకు గోప్యంగా వుంచాలని కూడా అనేవారు. ఫిబ్రవరి 10, 2005 న వెంకట్ పెళ్లి రోజు సందర్భంగా, తిరుపతికి కారులో పోతున్న ఆయనకు శుభా కాంక్షలు తెలిపిన రాజు, పనిలో పనిగా, జీత-భత్యాల విషయంలో ఆయన మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేశారు. తనకు 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కేవలం ఒక్క రూపాయి జీతానికే పని చేస్తానని, మిగతా విషయాలు రాజుగారికే వదిలేస్తున్నానని జవాబిచ్చారు వెంకట్. అయితే జర్మనీకి చెందిన బహుళ జాతి సంస్థలో పనిచేస్తున్న వెంకట్ జీతం-బోనస్ కలిపి అప్పటికే సుమారు కోటి రూపాయల వర కుంది. 2003 నుంచి ఆయన పనిచేస్తున్న సంస్థలోనే 2007 వరకు కొన సాగినట్లయితే, షేర్ల రూపంలో వెంకట్ గారికి కనీసం మూడు కోట్ల రూపాయలకు పైగా లభించేది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రాజు గారు, ఒక లాభాపేక్ష సంస్థలో పనిచేసేందుకు ఎంత మేరకు వీలవుతుందో, అంత మేరకు వెంకట్ జీత-భత్యంగా ఏర్పాటు చేశారు.

ఆ కమిట్ మెంట్ ను రాజు స్థానంలో వచ్చిన డాక్టర్ జీ. వీ. కే. రెడ్డి కూడా అమలు పరిచారు. కాకపోతే, 34 కోట్ల రూపాయలను సమకూర్చి, మరో 42 కోట్ల రూపాయల బాంక్ రుణం తీసుకుని సంస్థను నడిపిన రాజు, సంస్థ చైర్మన్ గా రాజీనామా చేసినప్పుడు ఎలా అయితే సుమారు 120 కోట్ల లోటును మిగిల్చారో, అలానే వెంకట్ గారికి ఇస్తానన్న "కాంపన్సేషన్" విషయంలోను కొంత బకాయి పడి వుండవచ్చు. రాజు ఎంత ఇస్తానన్నారు-ఎంత ఇచ్చారు, భవిష్యత్ లో ప్రస్తుత యాజమాన్యం ఎంత ఇస్తుంది, అన్న విషయాలు ప్రాధాన్యత సంచరించుకున్నవే అయినప్పటికీ, అవేవీ, వెంకట్ కమిట్ మెంటుకు, ప్రతిబంధకాలు కాలేదు. 2005 లో ఇ. ఎం.ఆర్.ఐ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి 2009 సంక్షోభం వరకు, ఆ తర్వాత సంక్షోభం కొనసాగుతున్నప్పుడు, తీవ్ర ఇబ్బందులను అధిగమించి ఐదారు నెలల తర్వాత యాజమాన్యం మార్పిడి జరిగిన తర్వాత సంస్థ నిర్వహణ పట్ల-నిధులను సమకూరుస్తున్న ప్రభుత్వాల పట్ల వెంకట్ వైఖరిలో మార్పు లేదు. కాకపోతే, అలనాటి రాజు మార్గదర్శకత్వానికి, ఈ నాటి రెడ్డి గారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా కొన్ని సందర్భాలలో ఆయన నిర్వహించిన-నిర్వహిస్తున్న "ఉద్యోగపరమైన బాధ్యత" లో అపశృతులు దొర్లి వుండవచ్చు. ఆ అపశృతులు ఒడిదుడుకులకు దారి తీసి వుండవచ్చు. అలానే ప్రభుత్వంలో వున్న వారితో సంబంధ బాంధవ్యాల విషయంలోనూ జరిగుండాలి. బహు జాగరూకతతో ఆయన నియమించిన "లీడర్సులో కొందరు" సంబంధ బాంధవ్యాల విషయంలో చేసిన పొర పాట్లు సరిద్దిద్దడంలో జాగు జరిగుండాలి. ఆ జాగు ఒడిదుడుకులకు దారి తీసి వుండాలి.

అత్యవసర సహాయ సేవలను సంబంధిత ప్రభుత్వ-ప్రయివేట్ పరమైన ఇతర ఆరోగ్య-వైద్య సేవలతో సంఘటిత పరిచే విషయంలో గాని, దశల వారీగా దేశ వ్యాప్తంగా విస్తరింప చేసే విషయంలో గాని, నాణ్యత విషయంలో గాని, సహచరుల విధి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించే విషయంలో గాని, వేగవంతంగా సహాయ సేవల కల్పన విషయంలో గాని వెంకట్ దృక్ఫదం అప్పుడు-ఇప్పుడూ ఒకే మాదిరిగా వుందనాలి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కోట్లాది రూపాయలు నిర్వహణ-మూలధనం వ్యయం కింద పొందుతున్నప్పటికీ, ఒక్క నాడు కూడా, అలా పొందడానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. అధికార-అనధికారులెవరు కూడా వెంకట్ ని కాని-ఆయన సహచరులను కాని ఈ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు. ఇ.ఎం.ఆర్.ఐ లో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలను గిరించి కదిపినప్పుడు, ఆవిర్భావ కాలం నాటి విలువలను అప్పటి యాజమాన్యం ఎలా గౌరవించేదో, ఇప్పటి యాజమాన్యం కూడా అలానే గౌరవిస్తున్నదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సిఇఓ వెంకట్. విధి నిర్వహణలో వెంకట్, గతంలో మాదిరి "స్వతంత్రంగా వ్యవహరించ లేకపోతున్నాడన్న" కొందరి అభిప్రాయం సరైంది కాదని, జీ. వి. కే ప్రయివేట్ భాగస్వామిగా ప్రవేశించిన కొత్తలో సంస్థకు సంబంధించిన కొందరు వ్యక్తుల అనవసర జోక్యం తనను ఇబ్బందికి గురిచేసినప్పటికీ, క్రమేపీ అది తగ్గిందని అంటారు వెంకట్.

జర్మనీకి చెందిన బహుళజాతి సంస్థలో నిర్వహిస్తున్న పదవికి రాజీనామాచేసిన వెంకట్ కు 31, 2005 న సింగపూరులో వీడ్కోలు ఏర్పాటు చేశారు సహచరులు. ఏప్రిల్ 2, 2005 న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటున్నందున, ఆ రోజు కల్లా హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా వెంకట్ ను రామలింగ రాజు కోరారు. వీడ్కోలయితే ఇచ్చారు గాని, ఏప్రిల్ 15, 2005 వరకు బాధ్యతలు నిర్వహించాల్సిందిగా సంస్థ యాజమాన్యం కోరడంతో, హైదరాబాద్ రావడంలో ఇబ్బంది వున్నా వెంటనే బయల్దేరి మొదటి తేదీ కల్లా వచ్చారు. దాదాపు ఇక ఆ రోజునుంచే అనధికారికంగా ఇ.ఎం.ఆర్.ఐ బరువు-బాధ్యతలు వెంకట్ కు అప్పగించారు రాజు. సత్యం టెక్నాలజీ కేంద్రంలో అప్పటికే ఇ.ఎం.ఆర్.ఐ లో సీనియర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న అనిల్ జంపాల, వై.ఎన్.ఎస్. కిశోర్, వారణాసి సుధాకర్ ప్రభృతులను వెంకట్ కు పరిచయం చేశారు రాజు. ఆయన సంస్థ కొత్త కార్య నిర్వహణాధికారి అని కూడా చెప్పారు. మర్నాడు, ఏప్రిల్ 2, 2005 న, (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సమక్షంలో, మొదటి ఎంఓయు పై ప్రభుత్వం పక్షాన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమీషనర్ ఆసుతోష్ మిశ్రా-ఇ.ఎం.ఆర్.ఐ పక్షాన వారణాసి సుధాకర్ సంతకాలు చేశారు. రామలింగ రాజు తన సమీప బంధువులను, కొందరు స్నేహితులను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. కాబోయే సిఇఓ గా వెంకట్ ను ముఖ్యమంత్రికి రాజు పరిచయం చేయగానే, "మన రాష్ట్రానికి ఇలాంటి తరహా సేవలందించడానికి మీ లాంటి వాళ్లు ఎందరో రావాలి" అని ఆప్యాయంగా అన్నారని వెంకట్ ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. తన జీవితంలో కలిసిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారని కూడా అంటాడాయన. ఆ తర్వాత ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రారంభించేంతవరకు ముఖ్యమంత్రిని కలవలేదని, అప్పటి నుంచి ఎన్నో పర్యాయాలు కలవడం జరిగిందని, ప్రతి కలయికలోను "అత్యవసర సహాయ సేవల కార్యక్రమం సామాన్యుడికి ఎంతగా తోడ్పడుతుందనే" విషయం గురించే ప్రస్తావించే వాడని, మాటల్లోను-చేతల్లోను త్రి కరణ శుద్ధిగా కార్యక్రమం అమలుకు ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకున్నారని కూడా అంటారు వెంకట్. ఎంఓయు పై సంతకం చేసిన నాడే, ఆగస్ట్ 15, 2005 న సేవలు ఆరంబించుతామని ముఖ్యమంత్రికి వాగ్దానం చేశారు రాజు. ఆ దిశగా కార్యాచరణ పథకాన్ని రూపొందించమని కోరారు వెంకట్ ను.

వెంకట్ ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా ఏప్రిల్ 15, 2005 చేరడానికి పది రోజుల ముందర, ఒక సారి హైదరాబాద్ వచ్చి, ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను ప్రారంభించడానికి, అవసరమైన కనీస సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టారు. ఉద్యోగంలో చేరిన మరుక్షణం నుంచే, చైర్మన్ రాజు-సిఇఓ వెంకట్ ల మధ్య ముఖాముఖి సమావేశాలు గాని, సంస్థకు సంబంధమున్న ఇతరులతో కూడిన సమావేశాలు గాని క్రమం తప్పకుండా జరిగేవి. వాస్తవానికి ఆ తరహా సమావేశాలు, సత్యం కుంభకోణం వెలుగులోకి రావడానికి పక్షం రోజుల క్రితం వరకు కొనసాగాయనే అనాలి. అయితే, ఏ సమావేశంలోను, నిధుల ప్రస్తావన "స్పష్టంగా" వచ్చేది కాదు. అంబులెన్సులు ఎన్ని వుండబోతున్నాయన్న విషయంలోను అసందిగ్ధత వుండేది. ఎంత సేపు "ఉత్తర ధృవం" (నార్త్ స్టార్) గురించి, ఆరు "పి" లు-ఐదు "ఆర్" ల గురించి, అంతర్జాతీయ ప్రమాణాల గురించి-విధానాల గురించి, భారత దేశంలోని ఇతర ప్రాంతాలలో సంబంధిత సేవల అమలు-ఆచరణల గురించి మాట్లాడుతుండేవారు రాజు. "ధృవ తార"-నార్త్ స్టార్ (North Star), సిక్స్ పి-ఫైవ్ ఆర్ (Six "P" s and Five "R" s) ల గురించి వివరంగా మరో సందర్భంలో తెలుసుకుందాం. వాస్తవానికి రాజుగారు ప్రారంభించి ప్రపంచంలోనే అగ్రగామి కంప్యూటర్ సంస్థల సరసన నిలిపిన "సత్యం కంప్యూటర్స్" నిర్వహణా విధానం "సత్యం పంథా" (Satyam Way) అనే పేరుతో పేర్కొనేవారు. ఈ అంశాలలో "నిష్ణాతుడు", అత్యవసర సహాయ సేవల ఆలోచన చేసినప్పుడు రాజు గారికి తన వంతు సూచనలు-సలహాలు ఇచ్చిన డాక్టర్ బాలాజి దగ్గర, వాటిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోమని వెంకట్ కు చెప్పారు రాజు. సత్యం కంప్యూటర్స్ సంస్థ మాదిరిగానే, ఇ.ఎం.ఆర్.ఐ లో కూడా ఆ పంథానే అనుసరించి, సహాయ సేవల నిర్వహణ-అమలు విషయంలో ముందుకు సాగేవారు యాజమాన్య-ఇతర సిబ్బంది.

అప్పట్లో, చైర్మన్ సమీక్షా సమావేశాల్లో, వెంకట్ తో పాటు తప్పనిసరిగా, డాక్టర్ అనిల్ జంపాల, వై ఎన్ ఎస్ కిశోర్, వారణాసి సుధాకర్, డాక్టర్ ఎ పి రంగారావు, శ్రీనివాసరావు ప్రభృతులు హాజరయ్యేవారు. ఆఫీస్ కార్యకలాపాలన్నీ జూబ్లీ హిల్స్ కార్యాలయం నుంచే జరిగేవి. జులై 29, 2005 న ప్రస్తుతం వుంటున్న మేడ్చల్ రోడ్ లోని కార్యాలయంలోకి మారారు. సమావేశాలు సాధారణంగా ఉదయం తొమ్మిది గంటలకు మొదలై, మూడు గంటల పాటు జరిగేవి. డాక్టర్ అనిల్ జంపాల నిస్వార్థంగా సంస్థ పురోగతికి కృషి చేసే తరహా వ్యక్తని, అపారమైన నిబద్ధతతో పని చేసేవాడని, అనుభవజ్ఞుడని, ఎటువంటి పరిస్థితుల్లోను ఎవరినీ కించపరిచే స్వభావం లేనివాడని అనిల్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వెంకట్ అంటుంటారు. ఏ పనైనా, ఏదో విధంగా సాధించగల నేర్పరితనం కిశోర్ కుందని కూడా అనేవారు వెంకట్. వారణాసి సుధాకర్ పట్ల వ్యక్తిగతంగా గౌరవం వ్యక్త పరిచేవారు వెంకట్. సుధాకర్ ఏర్పాటు చేసిన "టెక్నాలజీ టీం"-దాని లీడర్ రంగనాథం గురించి, ఆ బృందంలోని శ్రీకాంత్ - మరో ముప్పైమంది గురించి, వారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ను నెలకొల్పిన తీరు గురించి, అత్యంత గర్వంగా-గౌరవంగా ప్రస్తావించేవారు వెంకట్. అనుకున్న ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను ప్రారంభించడానికి టెక్నాలజీ టీమ్ తో పాటు అహర్నిశలు కృషి చేసిన మరికొందరిని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే వుంటారు వెంకట్. మెడికల్ ప్రోటోకాల్స్, ఎమర్జెన్సీల గుర్తింపు విధానం, గ్రామీణ ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విధానం లాంటి విషయాలను డాక్టర్ రంగారావు చూసేవారు. ప్రాజెక్ట్ ప్రణాళిక, సిబ్బంది నియామకం, అంబులెన్స్ డిజైన్, 108 నంబర్ కేటాయింపు లాంటి విషయాలను కిశోర్ చూసుకునేవారు. ఎంఓయు కు సంబంధించిన అంశాలు, ప్రభుత్వ సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాలు-విధానాలు అనిల్ పర్యవేక్షణలో జరిగేవి. ఇ.ఎం.ఆర్.ఐ-వివిధ అంతర్జాతీయ సంస్థల మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలన్నీ అనిల్ చొరవతోనే జరిగాయి. డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రులతో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కృషి చేసేవారు. ఉన్న కొద్ది మంది సిబ్బందిలో స్థైర్యాన్ని-అత్యవసర సేవలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే దిశగా వెంకట్ వారికి అధ్యయన తరగతులు నిర్వహించేవారు. ఉదాహరణకు ఒకసారి ఆయన అంబులెన్సుకు సంబంధించిన అధ్యయన తరగతి నిర్వహించారు. 108- అంబులెన్సులో "స్ట్రెచ్చర్" విషయంలో రాజీ మార్గానికి తావులేదన్న విషయం, ఇతర అంబులెన్సులకు-108 అంబులెన్సులకు తేడా వుండే పరికరాల ఆవశ్యకత అంశం, "కుయ్-కుయ్" ధ్వని అమర్చడం లాంటి వాటిపై అవగాహన కలిగించారు వెంకట్. సత్యం సంస్థలో పనిచేసే డిజైన్ బృందం 108-అంబులెన్స్ ను డిజైన్ చేశారు.

ఆగస్ట్ 15, 2005 న లాంఛనప్రాయంగా అంబులెన్సులను హైదరాబాద్ లో ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రంలోని మరికొన్ని ప్రధాన కేంద్రాలలో ప్రారంభించేందుకు ఏప్రిల్-ఆగస్ట్ నెలల మధ్య, డాక్టర్ రంగారావు తోడ్పాటుతో-ఆయన తోడుండగా, పలువురు ప్రముఖులను కలిశారు వెంకట్. అనిల్ జంపాల కూడా వీరితో పాటే వుండేవారు. చిత్తూరు కలెక్టర్ రావత్ ను, కృష్ణా కలెక్టర్ నవీన్ మిట్టల్ ను, వైజాగ్ కలెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ ను, వరంగల్ కలెక్టర్ బెన్హర్ దత్ ఎక్కాను కలిశారు. విజయవాడ పోలీస్ కమీషనర్ ఉమేష్ ను, వైజాగ్ కమీషనర్ కౌముదిని ని, చిత్తూరు- వరంగల్ ఎస్పీలను కూడా కలిశారు. వెళ్ళిన ప్రతి చోట, డాక్టర్ రంగారావు స్థానిక ప్రభుత్వ-ప్రయివేట్ డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసేవారు. రాజధాని హైదరాబాద్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాను, డిజిపి స్వరణ్‌జిత్ సేన్ ను, సీనియర్ పోలీస్ అధికారులైన ఏ కే ఖాన్ ను-మహేందర్ రెడ్డి ని-దినేష్ రెడ్డిని, డిజాస్ట్రర్ మేనేజ్‌మెంట్ శాఖ కార్యదర్శి-కమీషనర్ అశుతోశ్ మిశ్రాను, ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి ఐ వి సుబ్బారావు ను, కుటుంబ నియంత్రణ కమీషనర్ సీ బి ఎస్ వెంకటరమణ ను కలిశారు. భవిష్యత్ లో వీరు కలిసిన ప్రతి అధికారి, సంస్థ ఎదుగలకు ఎంతగానో తోడ్పడ్డారు. వెంకట్ గారి ఇ.ఎం.ఆర్.ఐ సిబ్బంది అప్పట్లో వేళ్లమీద లెక్కించ తగినంత మంది మాత్రమే వుండేవారు. వారిలో డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, జ్యోతి, స్వరూప్, శాస్త్రి, గురు రాజ్ లు ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు. ఢిల్లీ స్థాయిలో కలిసిన వారుకూడా వున్నారు. (దివంగత) ముఖ్యమంత్రి లేఖ సహాయంతో 108 టోల్ ఫ్రీ నంబర్ కొరకు రాష్ట్ర కాడర్ ఐఏఎస్ అధికారి శ్రీధర శర్మను, ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి దయానిధి మారన్ ను కూడా కలిశారు.

ఇదిలా వుండగా, అనుకున్న నాడు అంబులెన్సు సేవలను ఆరంభించాలంటే, అవి తయారు కావాలి. అంబులెన్స్ డిజైన్ లో, వైద్య పరమైన జాగ్రత్తలన్నీ డాక్టర్ రంగారావు-ఆయన సహచర వైద్యుల బృందం తీసుకుంది. తొలుత ప్రవేశపెట్ట దల్చిన 30 ఎ ఎల్ ఎస్ (అడ్వాన్స్ లైఫ్ సపోర్టింగ్) తరహా అంబులెన్సులై వుండాలని డాక్టర్ రంగారావు సూచన మేరకు, వెంకట్ చేసిన ప్రతిపాదనకు చైర్మన్ రాజు అంగీకరించారు. మరో తరహా అంబులెన్సులను బి ఎల్ ఎస్ (బేసిక్ లైఫ్ సపోర్టింగ్) అంబులెన్సులంటారు. వీటికి సంబంధించిన వివరాలు మరో సందర్భంలో తెలుసుకుందాం. రెండింటికి తేడా వుంది. ఎ ఎల్ ఎస్ తరహాలో ఏ ఇ డి, వెంటిలేటర్ పరికరాలు అదనంగా అమర్చుతారు. వీటి ఉపయోగం ప్రతి ఎమర్జెన్సీలోను వుండక పోయినప్పటికీ, వాటి అత్యవసర ప్రాధాన్యత దృష్ట్యా అవి అమర్చడం అభిలషణీయమని నిపుణుల అభిప్రాయం. కాకపోతే ఈ రెండు పరికరాల విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు కావడంతో, ఎ ఎల్ ఎస్ అంబులెన్సు ధర రు. 21.5 లక్షలు కాగా, బి ఎల్ ఎస్ అంబులెన్స్ ధర రు. 15.5 లక్షలే అయిందప్పుడు. మామూలు బజాజ్ టెంపో ట్రావెలర్ వాహనం ఆరున్నర లక్షల బేసిక్ ధరకు కొనుగోలు చేసి, తొమ్మిది లక్షల రూపాయలు ఫాబ్రికేషన్-వైద్య పరికరాల కొరకు వ్యయం చేసి, రు. 15.5 లక్షలకు అంబులెన్సును రూపొందించారు మొదట్లో. నాణ్యత పరంగా ఏ మాత్రం రాజీ పడకుండా, దరిమిలా, అదే బి ఎల్ ఎస్ అంబులెన్స్ ధరను రు. 9.75 లక్షలకు స్థిర పరిచింది ఇ.ఎం.ఆర్.ఐ. ఒకప్పుడు అంబులెన్స్ అంటే, ఇంగ్లీషు అక్షరాలను తిప్పి వాహనం ముందర రాస్తే సరిపోయేది. ఎప్పుడైతే 108-అంబులెన్స్ డిజైన్ మార్కెట్లోకి వచ్చిందో, ఇక అప్పటినుంచి, ఇంచుమించుగా అందరూ, ఆ మోడల్ నే అనుకరిస్తున్నారు. అంబులెన్స్ సేవలను ఆరంభించడానికి పక్షం రోజుల ముందర, జులై 29, 2005 న మేడ్చల్ రోడ్ లో వున్న ఒకనాటి సత్యం పబ్లిక్ స్కూల్ ఆవరణలోకి ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం మారింది. మరో నెల రోజులకు, ఆగస్ట్ 29, 2005 న నూతన కార్యాలయ భవనాలకు భూమి పూజ జరగడం, ఏడు నెలల రికార్డ్ సమయంలో సమస్త హంగులతో తయారైన భవనంలోకి మార్చ్ 31, 2006 న మారడం జరిగింది.

ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దయానిధి మారన్, గౌరవ అతిథిగా (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి, కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అప్పటి ఆరోగ్య-ఆర్థిక శాఖల మంత్రి (ఆ తర్వాత ముఖ్యమంత్రి) రోశయ్య వచ్చారు. ప్రధాన కార్యదర్శి మోహన్ కందా కూడా వచ్చారు. హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్ లో భారీ సంఖ్యలో హాజరయిన ఆహుతుల సమక్షంలో, ఆగస్ట్ 15, 2005 న, ఆద్య తన భవిష్యత్ లో, లక్షలాది ప్రాణాలను కాపాడనున్న అత్యవసర ఆరోగ్య, వైద్య-పోలీసు-అగ్నిమాపక దళ సహాయ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేవలం పదిహేను అంబులెన్సులతో ఆరంభమయిన ఆ సేవలు, అచిర కాలంలోనే, "ఇంతై-ఇంతితై-వటుడింతై" అన్న చందాన దేశంలోని పది రాష్ట్రాలలో సుమారు మూడు వేలకు పైగా అంబులెన్సులను ప్రవేశ పెట్టడానికి దారితీసింది.

No comments:

Post a Comment