Saturday, July 24, 2010

XIII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-13) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-13
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నోడల్ ఏజన్సీగా, 108-అత్యవసర సహాయ సేవలు, ఆంధ్ర ప్రదేశ్ తో సహా పది రాష్ట్రాలలో లభ్యమవుతున్నాయిప్పుడు. గుజరాత్, ఉత్తరాంచల్, గోవా, తమిళనాడు, రాజస్థాన్, కర్నాటక, అస్సాం, మధ్య ప్రదేశ్, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలు ఇ.ఎం.ఆర్.ఐ తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుని, ఆంధ్ర ప్రదేశ్ తరహాలోనే అత్యవసర సహాయ సేవలు అక్కడి ప్రజలకు పూర్తి ఉచితంగా అందిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సత్యం సంక్షోభం దరిమిలా, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు జనవరి 2009 లో రాజీనామా చేయడంతో, మీడియాలో ఆ సేవలందించడం పట్ల సందేహాలు వ్యక్తమైన నేపధ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలాంటి హామీనే 108-అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, రాజకీయాలకు అతీతంగా ప్రకటించారు. అంతవరకు ప్రభుత్వం భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని, నూటికి 100% భరించడానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. సుప్రీం కోర్టులో ఇ.ఎం.ఆర్.ఐ కి వ్యతిరేకంగా వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం గాని, సంస్థ చైర్మన్ రాజీనామా గాని, ఆ సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకున్న "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" సడలించ లేకపోయాయి . అప్పట్లో "విశ్వసనీయత" కు ఇ.ఎం.ఆర్.ఐ పర్యాయపదం అనొచ్చు. ఈ అన్ని రాష్ట్రాలలో మేఘాలయ ప్రభుత్వాన్ని మరీ-మరీ అభినందించాలి. కోర్టు కేసులో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు అందాయని తెలిసి కూడా, సంస్థ చైర్మన్ రాజీనామా చేశారని తెలిసి కూడా, ఫిబ్రవరి 2009 లో, వీటన్నిటి కి అతీతంగా, అక్కడి అధికారులు-అనధికారులు ఒక్క మాట మీద నిలబడి, ఇ.ఎం.ఆర్.ఐ ని నోడల్ ఏజన్సీగా నియమిస్తూ ఎంఓయు కుదుర్చుకునేందుకు కృషి చేశారు.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, ప్రపంచంలోనే, అత్యంత అరుదైన పద్ధతిలో, అత్యవసర సహాయ సేవలను పూర్తి ఉచితంగా పౌరులకు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం-ఆ రాష్ట్ర (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి. అచిర కాలంలోనే, ఇక్కడ లభిస్తున్న ఈ అరుదైన తరహా సేవల ప్రక్రియను అధ్యయనం చేసేందుకు, పొరుగు రాష్ట్రాల నుంచి-విదేశాల నుంచి అధికార-అనధికార ప్రతినిధులు, బృందాలు రావడం మొదలయింది. అంతటితో ఆగకుండా, ఆ సేవలను ఇతర రాష్ట్రాలలో ఆరంభించడం కూడా మొదలయింది. అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఇ.ఎం.ఆర్.ఐ ద్వారా సేవలను ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. రాజుగారు చైర్మన్ గా వుండి వుంటే, ఈ పాటికి కనీసం రెండు-మూడు ఇతర దేశాలలో ఇ.ఎం.ఆర్.ఐ ఝండా ఎగురుతుండేదే ! ఇప్పుడిక ఆస్కారం లేకపోగా, అప్పట్లో ముందుకొచ్చిన కొన్ని ప్రభుత్వాలు వెనక్కు తగ్గుతున్నాయి కూడా. సేవలు లభ్యమవుతున్న రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాల ఆలోచనా ధోరణిలో కొంత మార్పు వస్తున్న సంకేతాలు అందుతున్నాయి. మరో వైపు, గతంలో మాదిరిగానే, ఇ.ఎం.ఆర్.ఐ పట్ల-సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి పట్ల "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" ప్రదర్శిస్తూ, ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఏప్రిల్ 2010 లో, ఎంఓయు కుదుర్చుకుంది. ఆ "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" ఆయన పై స్థాయిలో వున్న"భాగస్వామ్య యాజమాన్యం" ఎంతవరకు నిలుపుకోగలుగుతుందో చూడాలి.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమైన అత్యవసర సహాయ సేవలు, దరిమిలా, అతి కొద్ది కాలంలోనే, పది రాష్ట్రాలకు వ్యాపించడం, సుమారు మూడువేల అంబులెన్సుల ద్వారా ప్రతిరోజు పది-పదిహేను వేలకు పైగా ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన వ్యక్తులను సమీప ఆసుపత్రికి చేర్చడం, కులాలకు-మతాలకు-రాజకీయాలకు-సామాజిక వర్గాలకు-ధనిక, బీద తేడాలకు-స్త్రీ, పురుష భేదాలకు అతీతంగా లక్షల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయడం పలు జాతీయ-అంతర్జాతీయ సంస్థలను, పరిశోధకులను ఆసక్తి పరిచాయి. అసలీ ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ ఏమిటని-ఎలా రూపు దిద్దుకుంటుందని-మనుగడ ఎలా సాగిస్తున్నదని ప్రశ్నించసాగారు. వాస్తవానికి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మీద, "సిద్ధాంతపరంగా" ఎన్నో వ్యాసాలు-మరెన్నో పరిశోధనలు పుంఖానుపుంఖాలుగా మనకు లభ్యమయినప్పటికీ, "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" ఆ ప్రక్రియకు భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందిస్తున్న భారత దేశంలోని పది రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. ప్రయివేట్ భాగస్వామి "లాభాపేక్ష" తో ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం-కొనసాగించడం ఆచరణ సాధ్యమవుతుందేమోగాని, "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడం తేలికైన విషయం కాదు. అలా సాధ్య పడాలంటే భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న వర్తమాన పరిస్థితులలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ, అధిగమించడానికి చర్యలు చేపట్టాలి.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో అత్యవసర సహాయ సేవలు పది రాష్ట్రాలలో లభ్యం కావడానికి ప్రక్రియ ఎలా జరిగిందో తెలుసుకోవడం మంచిది. ఈ భాగస్వామ్యంలో ప్రయివేట్ భాగస్వామిగా కేవలం ఇ.ఎం.ఆర్.ఐ నే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఎంపిక చేశాయో-ఎలా ఎంపిక చేశాయో-చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడం కూడా అవసరమే. ఆ విషయాలు సవివరంగా తెలుసుకునే ముందర ఒక ప్రముఖ జాతీయ ఆంగ్ల వారపత్రిక (ఔట్ లుక్, జనవరి 26, 2009) ఇ.ఎం.ఆర్.ఐ ని తప్పుబడుతూ ప్రచురించిన వ్యాసంలోని ముఖ్య విషయాలపై దృష్టి సారించాలి. సత్యం కుంభకోణం-సుప్రీం కోర్టులో ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపధ్యంలో ప్రచురించిన ఆ వ్యాసంలో పేర్కొన్న అంశాలు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య సిద్ధాంతానికి-ఆచరణకు సంబంధించినవైనందున వాటిని ప్రస్తావించడం ఇక్కడ అవసరమని భావిస్తున్నాను. సత్యం కుంభకోణం నేపధ్యంలో రాజుగారికి సంబంధముందనుకున్న సంస్థలన్నిటి మీద నిఘా సంస్థల కన్ను పడిందని, సత్యం కంప్యూటర్ సర్వీసుల అనుబంధ సంస్థలకు చెందిన సమాచారాన్నంతా వెబ్సై్ట్లోంచి తొలగించే ప్రయత్నం చేసినా ఇ.ఎం.ఆర్.ఐ ని వేరుపరచడం సాధ్య పడలేదని, రాజు గారికి చెందిన 108-అత్యవసర సహాయ సేవలను ఇతర రాష్ట్రాలకు వ్యాపింప చేయడానికి "అనైతిక పద్ధతులను" అవలంబించారని, "టెండర్లను-ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇన్ట్రె స్టులను" తమకు అనుకూలంగా మలచుకోవడానికి అధికారులను ప్రభావితం చేశారని, తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి "భారీ మొత్తంలో బడ్జెట్" కేటాయింపులు జరిగేలా చేశారని ఆ వ్యాసంలో ఆరోపించడం జరిగింది. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో పనిచేస్తున్న "యాజమాన్య స్థాయి ఉద్యోగులు" భారీ మొత్తంలో వేతనాలు పొందేవారని, అందులో కొందరి జీతభత్యాలన్ని కలిపి, ఏడాదికి సుమారు "కోటి రూపాయల" వరకుంటుందని ఆరోపించబడింది.

ఆగస్టు 15, 2005 న కేవలం 30 అంబులెన్సులతో ఆంధ్ర ప్రదేశ్ లో ఆరంభమయిన ఇ.ఎం.ఆర్.ఐ ప్రస్థానం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వ్యాపించి, నెల-నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 12, 000 చొప్పున, నిర్వహణ వ్యయంలో ప్రభుత్వ పరంగా లభించిన 95% నిధులతో, తమ వంతుగా కేవలం 5% నిధులను మాత్రమే భరిస్తూ, 652 అంబులెన్సులను నడిపే స్థాయికి ఎదిగిందని, ఇక అక్కడినుంచి, ఇతర రాష్ట్రాలలో "టెండర్" ప్రక్రియను ప్రభావితం చేసి దిన-దిన ప్రవర్థమానం అయిందని వ్యాసంలో రాశారు. అప్పట్లో ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య యూనిట్ లీడ్ పార్ట్ నర్ హోదాలోను, తర్వాత కన్సల్టెంట్ గాను పనిచేస్తున్న "జ్వాలా నరసింహారావు" (నేను), తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి (పి. డబ్ల్యు. సి. డవిడర్) తో నిరంతరం సంబంధాలు ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వం విడుదల చేయబోయే టెండర్ అడ్వర్టయిజ్ మెంటులో పొందుపరచాల్సిన అంశాలను ఇ.ఎం.ఆర్.ఐ కి అనుకూలంగా వుండే విధంగా తయారు చేయించాడని ఆరోపణ కూడా వుందా వ్యాసంలో. అందుకు సాక్ష్యంగా ఇరువురి మధ్య సాగిన ఇ-మెయిల్ కమ్యూనికేషన్లు తమ దగ్గరున్నాయని పేర్కొన్నారు. అలానే మధ్య ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని విషయాలను రాశారందులో. దీంట్లో అనైతికత ఏమీ లేదని నేను చేసిన వ్యాఖ్యానాన్ని కూడా ప్రచురించారు అదే వ్యాసంలో. టెండర్లలో అత్యవసర సహాయ సేవలను నిర్వహించడానికి కావాల్సిన అనుభవం విషయంలో ఇ.ఎం.ఆర్.ఐ కున్న అనుభవానికి సరిపడే విధంగా మేం రాయించామని మరో ఆరోపణ చేశారు.

రెండు సంవత్సరాలలో, అంబులెన్సు నిర్వహణ వ్యయాన్ని, ఇ.ఎం.ఆర్.ఐ, నెలకు రు. 14, 000 నుంచి రు. 1,12,000 కు పెంచిందని మరో అసంబద్ధమైన ఆరోపణ కూడా చేసింది ఆ వార పత్రిక. మరీ హాస్యాస్పదమైన విషయం ఇంకోటుంది. ప్రపంచ బాంక్ నిధులతో, అప్పటివరకు తమిళనాడులో, నెల-నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 10,000 సరిపోతుండగా, ఇ.ఎం.ఆర్.ఐ ప్రభావితం చేసినందున దాన్ని లక్ష రూపాయలకు పెంచారని దాని సారాంశం. ఇ.ఎం.ఆర్.ఐ పైన చేసిన ఆరోపణలకు బలం చేకూరేందుకు, సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన (ట్రాన్సపరెన్సీ ఇన్ కాంట్రాక్ట్స్) సంస్థకు చెందిన వ్యక్తి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు లోని అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. వ్యాసంలోని ప్రతి అంశానికి వివరణ ఇస్తూ పంపిన లేఖను ప్రచురించే సాహసం ఇంతవరకూ చేయలేదాపత్రిక. ఇ.ఎం.ఆర్.ఐ ఇతర రాష్ట్రాలలో కూడా అత్యవసర సహాయ సేవలను ఎలా ప్రారంభించింది, నిర్వహణ వ్యయం పెంచడంలోని నిజా-నిజాలు వివరంగా మరో చోట తెలియచేస్తాను. క్లుప్తంగా, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియను, నిర్వహణ వ్యయం పెరిగిందా, లేక, ప్రభుత్వ పరంగా అందిస్తున్న నిధులు పెరిగాయా అనేది ఇక్కడ వివరిస్తాను.

ప్రభుత్వ పరంగా చాలాకాలం నుంచీ ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, సంస్కరణలే శరణ్యమని, ఆ రంగంలోని నిపుణులు నిర్ధారించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలనే సరైన రీతిలో నిర్వహించలేని స్థితిలో వుందని గుర్తించింది ప్రభుత్వం. దానికి ప్రభుత్వాన్ని మాత్రమే నిందించడం కూడా భావ్యం కాదు. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా గ్రామీణ-గిరిజన ప్రాంతాలలో పనిచేయడానికి వైద్యులు కావల్సినంత సంఖ్యలో ముందుకు రావడం లేదు. పట్టణాలలో పరిస్థితి మరో మాదిరిగా వుంది. ప్రభుత్వ పరంగా లభించే వైద్య సేవలకు ధీటుగా-మరింత మెరుగుగా ప్రయివేట్ సేవలు ఆరంభమై, అచిర కాలంలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటుచేసే స్థాయికి వ్యవస్థ మారింది. ఈ నేపధ్యంలో, సామాన్యుడికి-అ సామాన్యుడికి మధ్య ఆరోగ్య-వైద్య సేవలు లభించడం విషయంలో అంతరాలు పెరిగాయి. ప్రయివేట్ సామర్థ్యాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన అవసరం వచ్చింది. సంస్కరణలకు నాంది పలికింది ప్రభుత్వం. సంస్కరణలలో ప్రధానంగా పేర్కొనాల్సింది ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ ద్వారా ఆరోగ్య-వైద్య సేవల కల్పన. మన దేశంలో, స్వాతంత్ర్యం లభించిన తర్వాత, వరుస పంచవర్ష ప్రణాళికలలో-జాతీయ ఆరోగ్య, వైద్య విధానాలలో-ప్రపంచ బాంక్ ఆదేశాలలో, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ఆవశ్యకతకు సంబంధించి కొంత పురోగతి కనిపించినప్పటికీ, 2004 లో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణాత్మకమైన ప్రగతి కనిపించిందనాలి. ఆయన ఆలోచనా ధోరణికి అనుకూలంగా రూపుదిద్దుకున్న "జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్" ఈ ప్రక్రియకు మరికొంత ఊతమిచ్చిందనాలి. ఆ ఆలోచనల-ఆచరణల అడుగుజాడల్లోనే, అత్యవసర సహాయ సేవలను, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సమకూర్చేందుకు ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ లో చొరవ తీసుకోవడం, క్రమేపీ ఇతర రాష్ట్రాలకు వ్యాపించడం జరిగింది.

అనవసర జాప్యాలకు, ప్రభుత్వ ఉద్యోగులలో కూరుకుపోయిన అలసత్వానికి అతీతంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు లభ్యమయ్యే అభివృద్ధి-సంక్షేమ పథకాలను మరింత మెరుగుగా-వేగవంతంగా అందించాలన్న ఆశయంతో, భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న పలు ప్రజాస్వామ్య దేశాల్లో, ఐదారు దశాబ్దాల క్రితం ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన జరిగింది. దురదృష్టవశాత్తు, యావత్ ప్రపంచంలో, అధిక సంఖ్యాకం ప్రభుత్వ రంగ సంస్థలు, ఆశించిన రీతిలో ఫలితాలు ఇవ్వకపోగా, నష్టాల్లో కూరుకుపోయాయి. మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధానమంత్రిగా వున్న కాలంలో, ఆమె చొరవతో రూపు దిద్దుకున్న "ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణలు" క్రమేపీ వివిధ దేశాల ప్రభుత్వాధినేతలను ఆకర్షించాయి. సంస్కరణల పుణ్యమా అని, భారతదేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయడం జరిగింది. వాటి మూసివేతకు కొంత ముందు-వెనుకగా నెల కొన్న "జాయింట్ వెంచర్లు" కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. "ప్రభుత్వ ప్రయివేట్ సంయుక్త రంగంలో" స్థాపించిన పరిశ్రమలలో చాలా వరకు, యాజమాన్య పరమైన బాలారిష్టాలకు గురై, మూసివేయడం జరిగింది. సుమారు దశాబ్దంన్నర-రెండు దశాబ్దాల క్రితం, ఒకే ఒక్క సంవత్సరంలో, స్వదేశీ-విదేశీ సంస్థల భాగస్వామ్యంలో వందల సంఖ్యలో నెలకొల్పిన జాయింట్ వెంచర్లు, విరివిగా లాభాలను ఆర్జించాలన్న లక్ష్యంతో వెలిసినప్పటికీ, నష్టాల బాటలో పయనించాయి.

ఒక వైపు వీటి పరిస్థితి ఇలా వుంటే, మరో వైపు, ప్రయివేట్ రంగంలో నెల కొన్న అనేక సంస్థలు మెరుగైన సేవలను అందించడమే కాకుండా, లాభాలను ఆర్జించడం కూడ మొదలయింది. ప్రభుత్వ రంగ సంస్థల, జాయింట్ వెంచర్ల చేదు అనుభవాల నేపధ్యంలో-ప్రయివేట్ పరంగా మెరుగైన పౌర సేవలు లభ్యమవుతున్న నేపధ్యంలో, ప్రభుత్వ ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ పరంగా సమకూర్చడం కన్నా, ప్రయివేట్ తోడ్పాటు తీసుకోవడానికి అనువైన-సులువైన-ఆచరణాత్మకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఫలితంగా రూపుదిద్దుకున్నదే "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఈ ప్రక్రియలో రెండు రకాల భాగస్వామ్యాలు ఆచరణలోకి రాసాగాయి. దీర్ఘకాలిక ఉత్పాదకతను దృష్టిలో వుంచుకుని రూపొందించే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రభుత్వ పరంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ కార్యక్రమాలను అమలుచేసేందుకు, లాభాపేక్షతో పనిచేస్తున్న ప్రయివేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మొదటిది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వ బాధ్యతగా అమలుపర్చాల్సిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో-తోడ్పాటుతో, మరింత మెరుగైన రీతిలో, లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు సమకూర్చడం రెండో తరహా భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సంక్షేమ కార్యక్రమాలను-అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు-దీర్ఘకాలంగా కొనసాగించేందుకు, అవసరమైన ముఖ్య సాధనం, భాగస్వామ్య పక్షాల మధ్య అంగీకారంతో తయారు చేయబడే "అవగాహనా ఒప్పందం" (Memorandum of Understanding-MoU).

ప్రభుత్వ శాఖలలోని నైపుణ్యం-నాణ్యతా పరమైన లోటుపాటులను, ప్రయివేట్ రంగంలోని (లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల) ఆర్థిక పరమైన ఇబ్బందులను, ఉమ్మడిగా అధిగమించేందుకు, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం సరైన ప్రక్రియని ప్రభుత్వం గుర్తించింది. ఈ దిశగా, ఆరోగ్య-వైద్య రంగంలో మెరుగైన సేవలందించేందుకు, పదవ పంచవర్ష ప్రణాళికలోనే, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ఆవశ్యకతను గుర్తించింది ప్రభుత్వం. అలా గుర్తించడానికి బలవత్తరమైన కారణం కూడా వుంది. అప్పట్లో (బహుశా ఇప్పటికీ), ఆరోగ్య-వైద్య రంగంలోని పలు సేవలను, ప్రభుత్వపరంగా లభించే అవకాశం లేకపోవడంతో, ఆర్థిక స్థోమత లేనివారు కూడా, కార్పొరేట్ రంగాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దారిద్ర్యరేఖకు దిగువనున్న మూడోవంతు పైగా జనాభా మాత్రం, ప్రభుత్వపరంగా లభించే సేవలు ఎలా వున్నప్పటికి-నాణ్యత లోపాలున్నప్పటికీ, తమ వైద్యావసరాలకు అక్కడకు వెళ్లక తప్పలేదు. మధ్యతరగతి వారి విషయం అగమ్య గోచరం. అటు పోలేక-ఇటు పోక తప్పక అప్పుల్లో కూరుకు పోయేవారు. ఈ నేపధ్యంలో, మౌలిక వసతులను ఏర్పాటు చేయగలిగే సామర్థ్యం, దానికి కావాల్సిన తొలి విడత పట్టుబడి సమకూర్చుకోగలిగే స్థోమత, సాంకేతిక పరిజ్ఞానం అమర్చుకోగల శక్తి గల, లాభాపేక్ష లేని ప్రయివేట్ వ్యక్తులతో-సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందించే ఆలోచన చేసింది ప్రభుత్వం. పరస్పర సంబంధ-బాంధవ్యాల విషయంలో, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం-నిబద్ధత-హక్కులు-బాధ్యతల విషయంలో, ఎవరి పాత్ర ఏమిటన్న అంశం క్షుణ్ణంగా పరిశీలించాలని భావించింది ప్రభుత్వం.

పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-2012), ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరోగ్య సేవలందించేందుకు, తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేయడానికి, ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక కార్య నిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య రంగంలోని ఏ విభాగాలలో ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ అర్థవంతంగా-సమర్థవంతంగా ఫలితాలనిచ్చే అవకాశాలు, ఆ విధమైన భాగస్వామ్యంలో వ్యయ నియంత్రణ అవకాశాలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లక్ష్యాలను అమలు పరిచే అవకాశాలు, ప్రజల ఆరోగ్య-వైద్య అవసరాలు తీర్చేందుకు భాగస్వామ్య ప్రక్రియ ఎలా తోడ్పడగలదన్న అంశాలు పరిశీలించాల్సిందిగా అధ్యయన నిర్వాహక బృందాన్ని కోరింది ప్రణాళికా సంఘం. ప్రజల ఆరోగ్య-వైద్య అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన-మెరుగైన-నాణ్యమైన సేవలను పౌరులకు లభ్యమయ్యేలా చేసేందుకు, యావత్ వైద్య రంగం "జాతీయ సంపద" గా మలిచేందుకు, ఒక ప్రధానమైన సాధనంగా "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" ఉపయోగించుకోవాలని, ఆ ప్రక్రియకు నిర్వచనం వివరిస్తూ పేర్కొంది ప్రణాళికా సంఘం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలోని ప్రయివేట్ పదానికి పెడార్థాలు చెప్పరాదని, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా "ప్రయివేటీకరణ" చేసి, బాధ్యతలనుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నదని భాష్యం చెప్పొద్దని ప్రణాళికా సంఘం అభిప్రాయం వెలిబుచ్చింది.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లక్ష్యాలు-ధ్యేయాలు చేరుకునేందుకు, అందులో ప్రధాన భాగమైన "గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవల పథకం" అమలుకు-ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమై పది రాష్ట్రాలకు పాకిన 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడింది.

No comments:

Post a Comment