Wednesday, July 14, 2010

XII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-12) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-12
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

వ్యూహ రచనలో తన తోటి సహచర లీడర్సుకు పాఠాలు నేర్పించడంతో సరిపుచ్చుకోలేదు వెంకట్ చంగవల్లి గారు. రంజన్ దాస్ సలహాలను-సూచనలను అమలు పరుస్తారో, లేదో అన్న విషయంలో, తన దగ్గర పనిచేసేవారి చాకచక్యం ఎవరెవరికి-ఎంత మేరకు వుందని అంచనా వేయడంలో తనదైన శైలితో ముందుకు సాగే తత్వం వెంకట్ ది. "జిమ్ కాలిన్స్" సిద్ధాంతమైన "గుడ్ టు గ్రేట్" ను ఆసాంతం ఔపోసన పట్టిన ఐదో స్థాయి కార్య నిర్వహణాధికారి వెంకట్ చంగవల్లి. పాతికేళ్ల పైబడి బహుళ జాతి సంస్థల్లో ప్రధాన భూమికను నిర్వహించిన వెంకట్, ఇ.ఎం.ఆర్.ఐ లో చేరిన మరుక్షణం నుంచే, తాను భవిష్యత్ లో పనిచేయాల్సింది లాభాపేక్ష లేని సంస్థ అని తెలిసి కూడా, చైర్మన్ రాజు అడుగు జాడల్లో, ఆ సంస్థను లాభాపేక్షతో వ్యాపారం చేసే "కార్పొరేట్ స్థాయి సంస్థ" తో సమానంగా నడిపించే దిశగానే అడుగులు వేశారు. సంస్థ ఆశయమా గొప్పది-వనరుల సంగతే మో అసందిగ్ధం అని తెలిసి కూడా తనతో వివిధ స్థాయిలలో పని చేసే వ్యక్తుల ఎంపిక విషయంలో ఒక వైపు శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూనే, మరో వైపు, వారి జీత భత్యాల విషయంలో లాభాపేక్షతో పనిచేసే కార్పొరేట్ సంస్థలకు తీసిపోని విధంగా జాగ్రత్త తీసుకున్నారు వెంకట్. యాజమాన్యం మారి జి.వి.కే ఇ.ఎం.ఆర్.ఐ అయ్యేంతవరకు, ఆ విషయంలో వెంకట్ రాజీ పడలేదు. ఆ తర్వాత పరిస్థితిలో కొంత మార్పొచ్చిందనే అనాలి. ఆ మార్పుకు గురైనవారిలో-బలైన వారిలో, సంస్థ ఎదుగుదలకు అహర్నిశలూ కృషి చేసినవారూ వున్నారు. కృషి చేయని వారూ వుండొచ్చు. కాకపోతే, అందరి విషయంలోనూ ఒకే న్యాయం పాటించారు. "సముచిత స్థాయి నుంచి సమున్నత స్థాయికి" ఇ.ఎం.ఆర్.ఐ ని తీసుకెళ్లడమే అసలు-సిసలైన రూపాంతరీకరణ అని ఆయన నమ్మకం. రంజన్ దాస్ వ్యూహ రచన శిక్షణా కార్యక్రమానికి ధీటుగా, అంతకంటే నైపుణ్యంగా "జిమ్ కాలిన్స్ గుడ్ టు గ్రేట్" సిద్ధాంతాన్ని నేర్పుగా తోటి లీడర్సుకు వివరించారు వెంకట్. పరోక్షంగా తన మనసులోని మాటను, భవిష్యత్ లో సంస్థలో ఎవరుంటారో-వుండరో అన్న విషయాన్ని బయట పెట్టారు. అది సత్ఫలితాలనే ఇచ్చిందో-లేదో ఆయనే చెప్పాలి.

గుడ్ టు గ్రేట్ సిద్ధాంతంలో గుడ్-గ్రేట్ అనేవి, ఒకదానికి మరొక టి బద్ధ శతృవు. "గుడ్ టు గ్రేట్" ఒక్కసారి-ఒకే ఒక్కసారి దూకుతే జరిగే మార్పు కాదు-కానే కాదు. ఇ.ఎం.ఆర్.ఐ ని "సముచిత స్థాయి నుంచి సమున్నత స్థాయికి" తీసుకెళ్లడానికి కావలసిందల్లా....ఐదో స్థాయి నాయకత్వం. మొదలు (కావాల్సిన వ్యక్తులు) ఎవరు-ఏమిటి అన్న ఆలోచన చేయడం, పాశవిక వాస్తవాలను (నగ్న సత్యాలు) ఎదుర్కోవడం, అర్హత-యోగ్యతల ప్రకంపనలను అధిగమించడమనే హెడ్గెహాగ్ సిద్ధాంతం పాటించడం, నిరంతర ఫలితాల సాధనకు క్రమశిక్షణతో కూడిన సంస్కృతిని అవలంభించడం, సాంకేతిక వేగ సాధనాలను సక్రమంగా ఉపయోగించుకోవడం, ఐదో స్థాయి నాయకత్వానికి మాత్రమే సాధ్యపడుతుంది.

ఐదో స్థాయి అధికార వ్యవస్థంటే...ఆ స్థాయికి చేరుకోవాలంటే.... అంచలంచలుగా వివిధ స్థాయిలలో నాయకత్వ లక్షణాలెలా వుంటాయో అవగాహన చేసుకోవాలి. తమ వ్యక్తిగత ప్రజ్ఞతో, తెలివి తేటలతో, నైపుణ్యంతో, మంచి-మంచి అలవాట్లతో ఫలవంతమైన సహాయాన్ని సంస్థకు అందించగల వారై వుంటారు "మొదటి స్థాయి యోగ్యత గల స్వయం సాధకులు". "రెండో స్థాయికి చెందిన, బృందంలోని భాగస్వామ్య సభ్యులు", సామూహిక లక్ష్యాలను అధిగమించడానికి తమ-తమ వ్యక్తి గత సమర్థతలను జోడించి, తోటి బృంద సభ్యులతో కలిసి-మెలిసి పనిచేయగల వారై వుంటారు. "మూడో స్థాయికి చెందిన మేనేజర్స్-కార్య నిర్వాహకులు", ముందస్తుగా నిర్దారించిన లక్ష్యాలను సమర్థవంతంగా-సార్థకంగా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, అవసరమైన మానవ-ఇతర వనరులను ఏర్పాటు చేయగల నైపుణ్యం కల వ్యక్తులై వుంటారు. "నాలుగవ స్థాయి సార్థక నాయకులు", శ్రేష్టమైన కార్యసాధక ప్రమాణాలను పాటించేందుకు, పురికొల్పే ప్రయత్నం-పట్టుదలతో, నిబద్ధతను ప్రోత్సహించే తరహా వ్యక్తులై వుంటారు. వీరందరిని, ఏఏ పనికి ఉపయోగించుకోవాలో, సంస్థ లక్ష్యాలను చేరుకోవడానికి సరైన స్థానంలో ఎవరెవర్ని నియమించాలో నిర్ణయించగలిగేది "ఐదో స్థాయి కార్య నిర్వహణాధికారి" మాత్రమే. వీరు తమ వ్యక్తిగత నమ్రత-అణకువలను వృత్తి పరమైన కార్య సాధనతో అసంభవమైన మిశ్రమంగా తయారుచేసి, తద్వారా శాశ్వతమైన గొప్పదనాన్ని-సమున్నత స్థాయి సంస్థను నిర్మించగల సామర్థ్యం గల వ్యక్తి అయి వుంటారు. ఇలా వున్న అంచలంచల వ్యవస్థలోనే, "గుడ్ టు గ్రేట్" ఆచరణ సాధ్యమవుతుంది.

వృత్తి పరమైన కార్య సాధన, వ్యక్తిగత నమ్రత-అణకువ లనే ఐదో స్థాయి కార్యనిర్వహణాధికారి నాయకత్వం అర్థం చేసుకోగలగడం ఆ స్థాయి వారికే వీలవుతుంది. తన కార్య సాధనలో భాగంగా సముచిత స్థాయి నుంచి సమున్నత స్థితికి సంస్థ రూపాంతరీకరణ చేసే దిశగా పతాక స్థాయి ఫలితాలను సాదించగలడు. ఎంత కష్టమైనా-ఎన్ని అవాంతరాలెదురైనా సడలించని సంకల్పం ప్రదర్శించి దీర్ఘకాలిక ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తాడు. శాశ్వత సమున్నత స్థితి సంస్థను నిర్మించేందుకు, తగిన ప్రమాణాలను నిర్ణయించగలడు. తన కృషి ప్రతిబింబిస్తోందా, లేదా అన్న అంశాన్ని స్వయంగా పరిశీలించేందుకు అద్దంలో దృష్టి సారిస్తాడు గాని నాలుగు గోడల అవతల వాటి మధ్య నున్న కిటికీ బయట తలపెట్టి చూడడు. అలా చూసి, నిస్సారమైన ఫలితాల బాధ్యతను ఇతరులపై మోపి, వాళ్లపై నింద వేయడు. తన దురదృష్టమనో-కారణాంతరాల వల్ల అనుకున్నది సాధించలేక పోయాననో, తప్పు తనది కాదనో అనడు. నమ్రత-అణకువలను కార్య సాధనలో అడుగడుగునా ప్రదర్శించుకుంటూ, వినయ-విధేయతలతో కార్యోన్ముఖుడవుతాడే గాని, గొప్పలు చెప్పడం-ముఖ స్తుతి కోరుకోవడం చేయడు. పట్టుదలతో, హంగు-ఆర్భాటం లేకుండా నిర్ధారించిన ప్రమాణాల ఆధారంగా ముందుకు సాగుతాడు. సంస్థలో పనిచేసే వారిలో మంచి ఫలితాలను సాధించాలనే ప్రగాఢ వాంఛను కలిగించి, తన లాంటి ఇతరులను తయారుచేసి, భవిష్యత్ లో-రాబోయే తరం వారిలో మరిన్ని విజయాలను సాధించేందుకు తగిన వారసులను సృష్టించగలడు. సాధించిన ఫలితాలన్నీ తన వల్లనే జరిగాయని అద్దంలో చూసుకుని మురిసిపోకుండా, ఆ పేరు-ప్రతిష్ఠలను ఇతరులతో పంచుకునేందుకు, తనకు తోడ్పడిన వ్యక్తులను గుర్తించేందుకు నాలుగు గోడల అవతల దృష్టి సారించుతాడు.

సంస్థలో పనిచేసే ప్రతివారు ముఖ్యులని అనేకన్నా, వారిలోని సరైన వ్యక్తులే ముఖ్యులని భావించడం మంచిది. సముచిత స్థితి నుంచి సమున్నత స్థితికి సంస్థను తీసుకెళ్లాలంటే, అందుకు తగిన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం కార్య నిర్వాహకులు మొట్టమొదట చేసే పని. ముఖ్యంగా తన సహచర "నాయకత్వ బృందం" విషయంలో మరింత శ్రద్ధగా ఆ పని చేయాలి. తాను నిర్దేశించిన ప్రమాణాలను-సంస్థ లక్ష్యాలను చేరుకోలేని వ్యక్తులను సంస్థ వాహనం నుంచి తక్షణమే దింపగల నేర్పరితనముంటుంది వారికి. "గొప్ప దూరదృష్టికి గొప్ప మనుషులే కావాలి" అన్న సిద్ధాంతాన్ని పాటించుతారు వీరందరు. తన కింది వారు నిబద్ధతతో పనిచేయలేరని అనుమానం వచ్చిన వెంటనే, సరైన వ్యక్తులను వారి స్థానంలో నియమించడం వారిలోని నైపుణ్యం. అలా నియమించబడిన "సరైన వ్యక్తుల" తెలివితేటలు-నేర్పరితనం కంటే, వారిలోని సామర్థ్యం-ప్రవర్తన-నడత, సంస్థ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాంటి వారి పనితనాన్ని నిరంతరం అజమాయిషీ చేయడం కంటే, వారికి సరైన మార్గదర్శకాలను సూచించితే సరిపోతుంది. వారిని ముందుకు దూసుకుని పొమ్మని బోధించితే చాలు. "సముచిత స్థితి నుంచి సమున్నత స్థితికి" నడిపించగల బృంద సభ్యులు జీవితాంతం స్నేహితులుగానే నిలిచిపోతారు. ఐదో స్థాయి కార్య నిర్వాహక నాయకుడు చేయాల్సిందల్లా అలాంటి వారిని వెతికి పట్టుకుని, సంస్థ వాహనం ఎక్కించి సత్ఫలితాలను సాధించడమే. అవసరం అనుకుంటే వాహనంలోంచి దింపడంలోనూ చాకచక్యం చూపడమే !

ఈ నేపధ్యంలో, ఒక గొప్ప సమున్నత సంస్థను నిర్మించి, అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న "సరైన వ్యక్తులకు" సంస్థ స్థాయికి తగ్గ జీవితాన్ని-బ్రతుకు తెరువును కలిగించడం అంత తేలికగా సాధ్య పడే విషయం కాదు. అయినా ఇ.ఎం.ఆర్.ఐ విషయంలో సాధ్య-అసాధ్యాలకు అతీతంగా మొదట్లో ఎన్నో సంభవించాయి. అవి కొనసాగాయి. ఐదో స్థాయి నాయకత్వం కూడా లభించింది. సంస్థను సముచిత స్థాయి నుంచి సమున్నత స్థాయికి తీసుకెళ్లగలవారు-తీసుకెళ్లిన అంచలంచల నాయకత్వ లక్షణాలున్న వారు అక్కడ పని చేశారు. యాజమాన్య మార్పిడితో వారిలో చాలామంది "సంస్థ వాహనం” నుంచి దిగి పోవాల్సి వచ్చింది. కొందరిని దిగి పొమ్మన్నారు. కొందరు తమంతట తామే దిగి పోవాల్సిన పరిస్థితులు కలిపించారు. సంస్థ ఒడిదుడుకులకు ఈ మార్పు కొంతవరకు కారణమయిందనడంలో సందేహం లేదు.

సంస్థ ఎదుగుదలకు అహర్నిశలూ కృషి చేసిన వారెందరో వున్నారు. వారిలో ఇంకా అక్కడ పనిచేస్తున్న వారి సంగతి అలా వుంచి, వివిధ కారణాల వల్ల సంస్థను వీడిపోవాల్సిన వారి గురించి కొంత తెలుసుకోవడం మంచిదే మో !

వెళ్లిపోయిన వారిలో మొట్ట మొదట గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ అనిల్ జంపాల. అమెరికా వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో పి.హెచ్.డి , సియాటిల్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఏ పట్టాలు పొందిన అనిల్, ఎమర్జెన్సీ మెడిసిన్ కి చెందిన అమెరికన్ సంస్థల్లో, తత్సంబంధమైన సాఫ్ట్ వేర్ విభాగాల్లో పనిచేసిన అనుభవం అపారంగా వుంది. ఇ.ఎం.ఆర్.ఐ కి సాంకేతిక భాగస్వామ్యంతో సాఫ్ట్ వేర్ ను రూపొందించిన సత్యం కంప్యూటర్స్ లో వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ అనుభవాన్ని, చైర్మన్ రాజు, ఇ.ఎం.ఆర్.ఐ లో వినియోగించుకోవాలని భావించారు. వెంకట్ కన్నా ఏడాది ముందు నుంచే వారణాసి సుధాకర్, డాక్టర్ రంగారావు, డాక్టర్ బాలాజిల ఉమ్మడి పర్యవేక్షణలో సంస్థ రూపు దిద్దుకుంటున్న రోజుల్లో, అనిల్ కూడా ప్రధాన భూమిక నిర్వహించారు. ఇ.ఎం.ఆర్.ఐ వర్కింగ్ మోడల్ రూపకల్పనలో ఆయన కృషి చాలా వుంది. ఇ.ఎం.ఆర్.ఐ టెక్నాలజీ విభాగానికి, ఆపరేషన్స్ విభాగానికి నాయకత్వం వహించడమే కాకుండా, దేశ-విదేశాల్లోని పేరెన్నికగన్న పలు జాతీయ-అంతర్జాతీయ సంస్థలతో, ఒకరి అనుభవాలను మరొకరు పంచుకునేందుకు, ఆయా సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదిరించిన ఏకైక వ్యక్తి అనిల్ జంపాల. అంతర్జాతీయంగా ఇ.ఎం.ఆర్.ఐ సారధ్యంలోని 108-అత్యవసర సహాయ సేవలకు గుర్తింపు రావడానికి అనిల్ కృషి మరువలేనిది. అంతర్జాతీయంగా ఆయన ద్వారా లభించిన గుర్తింపు వల్లే, దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సేవలను ప్రారంభించాయి. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన కొన్నాళ్లకు, నిర్ణయం జంపాల తీసుకున్నారో, లేక, యాజమాన్యం తీసుకుందో గాని, ఆయన మాతృ సంస్థలోకి వెళ్లిపోవడం జరిగింది. మరి కొన్నాళ్లకు సత్యం (మహేంద్ర సత్యంగా మారింతర్వాత) సంస్థ నుంచి కూడా తప్పుకుని, తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. నైపుణ్యం గల ఒక వ్యక్తిని ఇ.ఎం.ఆర్.ఐ శాశ్వతంగా కోల్పోవాల్సి వచ్చింది. కష్ట కాలంలో ఆయన అనుభవం సంస్థకు పనికి రాకుండా పోయింది.

అత్యవసర సహాయ సేవలు ఆంధ్ర ప్రదేశ్ తర్వాత తొలుత ప్రారంభించిన రాష్ట్రం గుజరాత్. అక్కడ మొదలైన కొద్ది కాలానికే గుజరాత్ ఇ.ఎం.ఆర్.ఐ ఆపరేషన్స్ అధిపతిగా నియమించబడి, అనతి కాలంలోనే, అభివృద్ధి పరిచిన ఘనత గోబింద్ లుల్లాకు చెందుతుంది. ముంబాయి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగులో ఉత్తీర్ణుడై, అహ్మదాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో ఫస్ట్ రాంకులో ఎం.బి.ఏ పట్టా పుచ్చుకున్న గోబింద్ లుల్లా, ఇ.ఎం.ఆర్.ఐ లో చేరక ముందు వివిధ బహుళజాతి సంస్థల్లో 30 సంవత్సరాల యాజమాన్య స్థాయి అధికారిగా అపారమైన అనుభవం పొందారు. గుజరాత్ ప్రభుత్వంతో ఆయన నెలకొల్పిన సత్సంబంధాల పర్యవసానమే, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు అహ్మదాబాద్ పరిసరాల్లో ప్రభుత్వ భూమిలో రూపు దిద్దుకున్న కార్యాలయం. హైదరాబాద్ కార్యాలయానికి ధీటుగా నిర్మించడంలో లుల్లా కృషి అమోఘం. ఆంధ్ర ప్రదేశ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యవసర సహాయ సేవలను ఆ రాష్ట్ర ప్రజలకు అందించడంలో లుల్లా అహర్నిశలు పాటుపడ్డారు. ఆయన ఎంపిక స్వయంగా వెంకట్, చైర్మన్ రాజు చేశారు. యాజమాన్య మార్పిడి జరిగిన మూడు నెలలకే లుల్లాకు సంస్థలో చోటు లేకుండా పోయింది. ఆయన అనుభవం అందుబాటులో లేకుండా పోయింది.

సంజయ్ క్షీరసాగర్ ఇ.ఎం.ఆర్.ఐ లో చేరింది మొదలు, ఆర్థిక పరమైన విషయాలలో క్రమ శిక్షణను అమలు పరచడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధమైన ప్రతి అంశానికి, నిర్మొహమాటంగా-ధైర్యంగా అడ్డు తగిలేవారు. సంస్థలో చేరక ముందు దశాబ్దంన్నర కాలం వివిధ జాతీయ-బహుళ జాతీయ సంస్థలలో ఫైనాన్స్-అకౌంట్స్ విభాగాల్లో అపారమైన అనుభవం గడించారాయన. ఆయన ఇ.ఎం.ఆర్.ఐ లో కేవలం ఫైనాన్స్ కే పరిమితం కాకుండా, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర సహాయ సేవల విస్తరణలో చురుకుగా తోడ్పడే వారు. యాజమాన్య మార్పిడి మరి కొద్ది రోజుల్లో జరుగుతుందనగా సంజయ్ సంస్థను వదిలిపోవాల్సిన పరిస్థితులు కలిగాయి. సంస్థ ఆర్థిక పరమైన విషయాలను చక్కదిద్దడంలో ఆయన అనుభవం కూడా దూరమయింది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వుంటారు. ముఖ్యంగా, కారణాలు ఏవైనా, వైద్య వృత్తికి సంబంధించిన సీనియర్లు ఎవరు కూడా సంస్థలో ఇమడ లేక పోయారు. డాక్టర్ దయాకర్ దగ్గర్నుంచి, డాక్టర్ అజయ్... ఆ తర్వాత పలువురు నిపుణులు సంస్థకు దూరమయ్యారు. వారి అనుభవం ఉపయోగించుకోలేక పోవడం దురదృష్టం.

ఇ.ఎం.ఆర్.ఐ ఒడిదుడుకులకు ఇలా దూరమయిన వారి "అనుభవం కొరత" కొంతలో కొంతైనా కారణమనవచ్చునేమో !

No comments:

Post a Comment