అయోధ్య వివాదంపై సెక్యులర్ తీర్పు
వనం జ్వాలా నరసింహారావు
చరిత్రాత్మక సెక్యులర్ తీర్పు
ఇంతటితో ఆగని న్యాయప్రక్రియ
అంతిమ నిర్ణయం కోసం వేచిచూడాల్సిందే
భయాందోళనలను తొలగించిన భారతీయులు
సామరస్యానికి ప్రతీక
శ్రీరాముడి కథకు ప్రామాణికమైన (శ్రీమదాంధ్ర) వాల్మీకి రామాయణం బాలకాండలో అయోధ్యా పుర వర్ణనకు సంబంధించిన సర్గ వుంది. సరయూ నదీతీరంలో వున్న కోసల దేశంలో, మనువు స్వయంగా నిర్మించిన అందమైన-రమ్యమైన, పన్నెండామడల పొడవు-మూడామడల వెడల్పు కలిగి, వంకర టింకర లేని రాజ వీధులతో అలరారుతుండే అయోధ్యా నగరమనే మహా పట్టణం వుండేడట. చక్కగా తీర్చి దిద్దిన వీధి వాకిళ్లతో, తలుపులతో, విశాలమైన అంగడి వీధులతో, అందాలొలికే అయోధ్యా పురం "లక్ష్మీ పురం" నే మరిపించే దిగా వుండేదట. "అయోధ్యా పురి" ని స్వర్గ నగరమైన అమరావతితో పోల్చారు వాల్మీకి మహర్షి. భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడిందని వాల్మీకి భావన. భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం-ఆయన సేవే మోక్షం-అదే సర్వ కర్మలను ధ్వంసం చేస్తుంది. అయోధ్యలో మహా విష్ణువు పుట్టినందువల్లే మనుష్యులందరూ ముక్తులయ్యారని శివుడు పార్వతికి చెప్పినట్లు రామాయణ గాధలో వుంది. ఆ అయోధ్యలోనే, దశరథుడికి సూర్య కిరణాలలాంటి శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. అందుకే అయోధ్యను "రామ జన్మ భూమి" అని పేరు. అదే అయోధ్యలోని ఒకానొక చారిత్రక వివాదంపై అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010 న చరిత్రాత్మక "సెక్యులర్" తీర్పిచ్చింది. "ప్రపంచం మొత్తం మీద రామాలయాలున్నప్పటికీ, రామ జన్మ భూమి దేవాలయం మాత్రం ఒక్క (అయోధ్యలో) ప్రదేశంలో మాత్రమే వుంది" అని తీర్పిచ్చిన ముగ్గురు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ సుధీర్ అగర్వాల్ ఒక సాక్ష్యాధారాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు.
విశ్వాసాల ప్రాతిపదికగా, నమ్మకాల ప్రాతిపదికగా, చారిత్రాత్మక కట్టడాల నేపధ్యం ప్రాతిపదికగా, చారిత్రిక సాక్ష్యాధారాల ప్రాతిపదికగా, స్వాధీన అధీనం ప్రాతిపదికగా అనేకానేక పరిశోధనల సాక్ష్యాధారాలను ప్రామాణికంగా చేసుకుని వెలువరించిన ధర్మాసనం తీర్పిది. అరవై సంవత్సరాల-ఆ మాటకొస్తే సుమారు నూటాపాతికేళ్ల సుదీర్ఘ అనిశ్చిత స్థితికి ఎవరినీ నొప్పించకుండా... దాదాపు అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా, ఒకరు గెలిచామని పొంగిపోకుండా... వేరొకరు ఓడిపోయామని ఆవేదన చెందకుండా..ఎవరినీ అసంతృప్తికి గురిచేయకుండా ఇచ్చిన తీర్పిది.సంతృప్తికి హద్దులుండవు...అసంతృప్తికి పరిమితులుంటాయి...అందుకే అందరికీ అమోదయోగ్యమైంది. ఎక్కువమంది తగు మోతాదులో సంతృప్తి పడేందుకు అనుకూలమైంది.
ఈ కేసులో ముగ్గురు న్యాయమూర్తులు వేర్వేరుగా తమ తీర్పులు రాశారు. త్రి సభ్య ధర్మాసనంలోని జస్టిస్ ఎస్.యూ.ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్ అనేక అంశాలపై ఏకీభవించారు. ధర్మాసనంలోని సీనియర్ న్యాయమూర్తి డి.వి. శర్మ, వివాదాస్పద స్థలం మొత్తం రామ జన్మభూమిగా ప్రకటించారు. అయితే... స్థలాన్ని మూడుగా విభజించి, ముగ్గురి కి కేటాయించాలన్న ఇద్దరు న్యాయమూర్తుల తీర్పు 'మెజారిటీ'గా నిలిచింది. అదే... హైకోర్టు అంతిమ తీర్పు అయ్యింది. ముగ్గురు కలిసి సుమారు 8000 పేజీలకు పైగా తీర్పు రాశారు. వివాదాస్పద కట్టడం మసీదే అని జస్టిస్ ఖాన్ భావిస్తే, దానికి మసీదు లక్షణాలు లేవని జస్టిస్ శర్మ అభిప్రాయపడ్డారు. మసీదు కోసం మందిరాన్ని కూల్చలేదని జస్టిస్ ఖాన్ పేర్కొనగా... మందిరాన్ని కూల్చి ఆ శిథిలాలపైనే వివాదాస్పద కట్టడం నిర్మించారని జస్టిస్ శర్మ తెలిపారు.
సుదీర్ఘమైన తీర్పులో న్యాయమూర్తులు అనేక ఆధారాలను చూపిస్తూ, ఎన్నో ఉదాహరణలను ఉటంకించారు. ఆ ఉదాహరణలు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృత భాషల్లో కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. వివిధ న్యాయస్థానాలో ఇచ్చిన తీర్పులు, పత్రికల్లో-మాగజైన్లలో వచ్చిన సంపాదకీయాలు, వేదాలు, పురాణాల ఉదాహరణలు తీర్పులో చోటుచేసుకున్నాయి. కార్ల్ మార్క్స్ లాంటి మహనీయుల ప్రస్తావన కూడా వుంటుంది అక్కడక్కడ. జస్టిస్ సుధీర్ అగర్వాల్ తన తీర్పు పాఠాన్ని ఋగ్వేదంలోని సంస్కృత శ్లోకాలతో ఆరంభించారు. "ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!" అని మొదలవుతుందా శ్లోకం. అలా కొనసాగిస్తూ, చావు పుట్టుకలు అప్పుడు తెలియదని, సూర్యచంద్రులు వున్నారో-లేరో తెలియనందున రాత్రి-పగలు తేడా లేదని అంటూ, ఆ సమయంలో ఎవరికీ అంతుచిక్కని ఒక పర బ్రహ్మ స్వరూపం, తన శక్తితో సృష్టి ప్రక్రియను ప్రారంభించాడని, ఆ శక్తికి అతీతమైంది మరేదీ లేదని పేర్కొన్నారు. "సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. అన్నీ తెలిసిన పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు-ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?" అని ఆరంభించి, అరవై ఏళ్ల వివాదం విషయం ప్రస్తావిస్తారు న్యాయమూర్తి అగర్వాల్. ఇక అక్కడినుంచి స్థాన వర్ణన, వివాదాస్పద నిర్మాణం, కోర్టు దావాల వివరాలలోకి పోతారు.
జస్టిస్ ఎస్ యు ఖాన్ తీర్పు ఆరంభం చేసిన విధానం అది చదివినవారికే తెలుస్తుంది. అవతారిక, ముందుమాటలతో ఆరంభించారాయన. అవతారికలో, పదిహేను వందల గజాల స్థలం ఒకచోట వుందని, అందులో దేవతలు వెళ్లడానికి కూడా జంకుతారని, ఎందుకంటే ఆ జాగా నిండా మందుపాతరలు అమర్చబడి వున్నాయని పేర్కొని ముందుకు సాగుతారు. "ఆ మందుపాతరలను తొలగించే బాధ్యత మాపై పడింది. వాటి జోలికి పోవద్దని ఉత్తములు కొందరు సలహా ఇచ్చారు. మాకు కూడా ఆదరాబాదరాగా వెళ్లి మూర్ఖుల ఆగడానికి బలి కావాలని లేదు. కాకపోతే, సాహసం చేయక తప్పదు-ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. అవసరం కలిగినప్పుడు, తప్పనప్పుడు, ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి రిస్క్ తీసుకోకపోవడమే, జీవితంలో మనకెదురయ్యే పెద్ద రిస్క్" అంటారు జస్టిస్ ఖాన్. "ఒకానొక సందర్భంలో మానవుడి ముందు దేవతలు మోకరిల్లాల్సి వచ్చిందట. తనకు లభించిన అరుదైన గౌరవానికి మానవుడు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యతుంది. మాకు అలాంటి అవకాశం వచ్చింది. మేము సఫలమయ్యామా? విఫలమయ్యామా? తమ వ్యాజ్యంలో తామే న్యాయమూర్తులు కాలేరు" అని అంటూ, తాను చెప్పబోయే తీర్పుకు ముందుమాట చదువుతారు. తీర్పు పాఠం మధ్యలో, డిసెంబర్ 6, 1992 న మసీదు కూల్చివేత సంఘటనను పేర్కొంటూ, కార్ల్ మార్క్స్ ప్రస్తావన తెచ్చారు. చరిత్ర గమనానికి భాష్యం చెప్పిన మార్క్స్ వాదనను కేవలం ఆర్థిక స్థితిగతులకు మాత్రమే అనుసంధానం చేయడం సబబు కాదంటారు. అయితే ఆయన ప్రవచించిన విధానంలో పాక్షికంగానైనా వాస్తవం లేదని వాదించడం అపాయ కరం (పెరిలియస్) అంటారు. మసీదు కూల్చి వేసిన రోజుల్లో దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఒక పత్రికలో వచ్చిన సంపాదకీయాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు తన తీర్పులో. అంత క్లిష్ట పరిస్థితుల్లోను ప్రజలంతా ఐకమత్యంతో వుండడాన్ని వివరిస్తూ, "సారీ జహాః సే అచ్చా హిందుస్థాన్ హమారా" అన్న గీతాన్ని ఇనుమడించిన ఉత్సాహంతో ఆలపించా మంటారు. ముఖ్యంగా అందులోని "మజ్హాబ్ నహీ సిఖాతా ఆపస్ మె బైర్ రఖ్నాచ..." అనే చరణాలను గుర్తుచేసుకుంటారు.
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ మాత్రం ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే తీర్పు రాశారు.
ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం వివాదాస్పద ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి వాటి యాజమాన్య హక్కులను సున్నీ వక్ఫ్క బోర్డుకు, నిర్మోహీ అఖాడాకు, రామ్ లాలాకు అప్పగిస్తూ తీర్పిచ్చింది. బాబ్రీ మసీదుకున్న మూడు గుమ్మటాలను 1992లో కరసేవ చేసి కూల్చేసిన తర్వాత, ప్రధాన గుమ్మటం కింద రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏర్పాటుచేసిన తాత్కాలిక ఆలయం వున్న స్థలాన్నే రామ జన్మభూమిగా కోర్టు నిర్ణయించింది. దీన్నే రామ జన్మభూమి న్యాస్ ట్రస్టుకు కేటాయించింది. ఆ స్థలానికి రెండువైపుల సీతా రసోయి, రామ్ చబూత్రా ఉండేవి. అవి దశాబ్దాల క్రితం నుంచి సాధువుల సంస్థ నిర్మోహి అఖారా అధీనంలో ఉండేవి. ఆ స్థలం తమదేనని ఆఖారా ఎప్పటి నుంచో పోరాడుతోంది. ఈ రెండు స్థలాలను నిర్మోహి అఖారాకు ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. రామ జన్మభూమికి, నిర్మోహి అఖారాకు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని, ఒకవేళ ఇతరులతో సమానంగా స్థలం లభించకపోతే పక్కనే కేంద్ర ప్రభుత్వం సేకరించిన భూమిలోంచి ఆ భాగాన్ని ఇవ్వాలని కూడా తీర్పిచ్చింది న్యాయస్థానం. ప్రస్తుతం విగ్రహాలు వున్న ప్రదేశంలో ఆలయం నిర్మించడానికి అవరోధాలు తొలగినా, మూడు నెలల వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించి నందువల్ల తదుపరి నిర్ణయం వెలువడేంతవరకు వేచిచూడాల్సిందే.
న్యాయ ప్రక్రియ ఇంతటితో ఆగిపోలేదు. అయినా సెప్టెంబర్ 30 నాటి తీర్పు ప్రాధాన్యత సామాన్యమైందేమీ కాదు. తీర్పు నేపధ్యంలో చోటుచేసుకున్న భయాందోళనలకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన భారతీయులు, తీర్పు తదనంతరం చోటు లేకుండా చేశారు. వి ద్వేషపు సెగలు తమను తాకబోవని నిరూపించింది. యావద్భారత దేశంలోని ప్రజానీకం నుంచి వ్యక్తమయిన ప్రతిస్పందన గమనించిన ఎవరికైనా, అరవై సంవత్సరాల అయోధ్య వివాదానికి పరిష్కారం సుసాధ్యమనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించాయి. ఏదేమైనా సంక్లిష్టమైన వివాదంపై న్యాయస్థానం సమయోచిత తీర్పు చెప్పింది. విశాల భారతావనిలో ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలు కూడా సత్ఫలితాలను ఇచ్చాయి.
No comments:
Post a Comment