Wednesday, October 6, 2010

అయోధ్య సెక్యులర్ తీర్పులో ఆసక్తికరమైన అంశాలు : వనం జ్వాలా నరసింహారావు

అయోధ్య సెక్యులర్ తీర్పులో ఆసక్తికరమైన అంశాలు
వనం జ్వాలా నరసింహారావు

అయోధ్య వివాదాస్పద స్థలం విషయంలో చరిత్రాత్మక "సెక్యులర్" తీర్పిచ్చిన ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు వారు చదివిన తీర్పు ముందు-వెనుక పేర్కొన్న దాంట్లో ఆసక్తికరమైన, పరిశోధనలకు కావాల్సిన అనేకానేక విషయాలున్నాయి. ఒక విధంగా ఎనిమిదివేల పేజీల పైనున్న ఆ తీర్పు పాఠం ఒక మోస్తరు "విజ్ఞాన సర్వస్వం" అనవచ్చేమో !

త్రిసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అగర్వాల్, తీర్పు ముందుమాట ముగించి, స్థాన వర్ణన, వివాదాస్పద నిర్మాణం, కోర్టు దావాల వివరాలలోకి పోతారు. ఫైజాబాద్ సివిల్ కోర్టులో అరవై సంవత్సరాల క్రితం దాఖలైన మొదటి వ్యాజ్యం, తర్వాత, ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం ఆ కేసు హైకోర్టు పూర్తి బెంచికి బదిలీ కావడం పేర్కొంటారు న్యాయమూర్తి. ఆ క్రమంలో తాము కేసుకు సంబంధించిన 533 ఎగ్జిబిట్లను, 87 మంది సాక్ష్యులను, 13990 పేజీల సాక్ష్యాన్ని పరిశీలించిన విషయం ప్రస్తావించారు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, ఫ్రెంచ్, టర్కీ భాషలలోని చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పురా తత్వ శాస్త్రం, ప్రాచీన శిల్ప శాస్త్రం, మతపరమైన విషయాలకు సంబంధించిన వేయి కి పైగా గ్రంధాలను, అసంఖ్యాకమైన ప్రాచీన హస్త కళా కృతులను తమ తీర్పుకు ఆధారంగా పరిశీలించా మన్నారు. సుమారు 550 ఏళ్ల క్రితం నాటి నుంచి ఇప్పటివరకూ సంబంధమున్న కోట్లాది సంఘటనలను, మత విశ్వాసాలను, నమ్మకాలను, భావానుబంధాలను, లక్షలాది మంది మనోభావాలను, భావోద్రేకాలను, దేశ-విదేశీయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వివాదానికి సంబంధించిన పూర్వాపరాలను విభిన్న కోణాల నుంచి సమగ్రంగా-సమూలంగా అధ్యయనం చేసిన మీదే, తమ ముందుకొచ్చిన నాలుగు వ్యాజ్యాలపై తీర్పు వెలువరిస్తున్నామని పేర్కొంటారు. ఆ క్రమంలోనే వాద, ప్రతివాదుల వ్రాత పూర్వక వాంగ్మూలంలో పేర్కొన్న విషయాలను తీర్పు పాఠంలో పొందుపరిచారు. వాటిలో పలు ఆసక్తికరమైన, పరిశోధనాత్మకమైన విషయాలెన్నో వున్నాయి.

అయోధ్య లోని "రామ్ కోట్", లేదా, "కోట్ రామచంద్ర" గ్రామం, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, ఫైజాబాద్ జిల్లా, సదర్ తహసీల్, హవేలీ అవధ్ పరగణాలో వుంది. అక్కడున్న స్థలంలోని ఒక ప్రాచీన కట్టడం, భారత దేశంలోని రెండు ప్రధాన సామాజిక వర్గాలైన హిందు-ముస్లింల మధ్య వివాదానికి కేంద్ర బిందువైంది. హిందువుల్లో కూడా "రామ నంది వైరాగీలు" అనే ఒక శాఖ ఇతరులతో కొంత విభేదించి, స్వతంత్రంగా తన వాదనను వినిపించింది. వివాద స్థలంలో శ్రీరాముడు జన్మించాడని, అదే ఆయన జన్మ భూమి అని హిందువులందరి వాదన. వివాదాస్పద స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని, అదే ఆయన జన్మభూమని, అక్కడొక రామాలయం వుండేదని, దాన్ని 1528 లో బాబర్ సేనా నాయకుడు మీర్ బాక్వి కూలగొట్టించి బాబ్రీ మసీదు నిర్మించాడని వాంగ్మూలం ఇచ్చిన హిందువులు, శ్రీరాముడికి అయోధ్యలోని ఆ స్థలంలో తప్ప మరెక్కడా జన్మస్థలం వుండడానికి అవకాశం లేదని, అందువల్ల ఆ స్థలంపై హక్కు తమదేనని కోరారు. రామ నంది వైరాగీలు మరికొంత ముందుకు పోయి, అక్కడున్న నిర్మాణం మసీదు కానే కాదని, అక్కడ ఎల్లప్పుడూ రామాలయమే వుండేదని, అది కూడ తమ అధీనంలోనే వుండేదని వాదించారు. వివాదాస్పదమైన మసీదుగా కనబడే అ నిర్మాణాన్ని డిసెంబర్ 6, 1992 న ధ్వంసం చేశారని, కాకపోతే, అంతకు పూర్వం అదెలా వుండేదో సాక్ష్యాధారాలున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.

గతంలో సంబంధిత కేసుల్లో వెలువడిన తీర్పుల సారాంశాన్ని, ఈ కేసులో దాఖలైన పలు అఫిడవిట్‌లలోని అంశాలను పేర్కొన్నారు న్యాయమూర్తి. ముస్లింల వాదనను వినిపించిన వారి వాంగ్మూలం ప్రకారం, 433 సంవత్సరాల క్రితం బాబర్ కాలంలో నిర్మించిన చరిత్రాత్మక మసీదు అక్కడుందని, ముస్లింల ప్రార్థనా స్థలం గాను, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు గాను దాన్ని ఉపయోగించుకోవడం జరిగేదని పేర్కొన్నారు. ప్రతివాదిగా వ్రాత పూర్వక వాంగ్మూలం ఇచ్చిన ధరం దాస్ పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా వున్నాయి. బాబర్ మూఢాభిమానం కల ముస్లిం కాదని, ఇస్లాం మతంపై విశ్వాసమున్న వ్యక్తి అని, హిందూ దేవాలయాలను కూలగొట్టించే మనస్తత్వం కలవాడు కాదని, అయితే అతడి సేనానాయకుడు మీర్ బాక్వి అలా కాదని అంటాడు. మహరాజా విక్రమాదిత్య కాలంలో, రామ జన్మ భూమిలో నిర్మించిన ఆలయాన్ని కూల్చి వేసి, మీర్ బాక్వి ఆ శిథిలాలతో మసీదు లాంటి నిర్మాణాన్ని చేశాడని అంటాడు. బాబర్ "చక్రవర్తి" కాడని, "కొల్లగొట్టే స్వభావం" కల మనిషని, ఆ నిర్మాణం మసీదు కాదని, బ్రిటీష్ వారి హయాంలో దాన్ని "మసీద్ జనమ్ స్థాన్" అని పిలిచేవారని అంటూ, దాని నిర్మాణంలో పద్నాలుగు కసౌటీ స్థంబాలను, గంధపు చెక్కల దూలాలను వాడారని వాదించారు. ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా మసీదును నిర్మించిన మీర్ బాక్వీని అల్లా క్షమించలేదని, అచిర కాలంలోనే యుద్ధంలో మరణించాడని ధరం దాస్ తన అఫిడవిట్‌లో వాదించారని తీర్పు పాఠంలో పేర్కొన్నారు న్యాయమూర్తి.

వ్రాత పూర్వకంగా వాది-ప్రతివాదులు పేర్కొన్న అంశాల్లో మరో ఆసక్తికరమైన విషయం, 1960 సంవత్సరపు ఫైజాబాద్ గెజిటీర్స్ లో, 50 వ పేజీలో, రికార్డయిన ఇంగ్లీష్ వ్యాపారి విలియం ఫెంచ్ వెలిబుచ్చిన అభిప్రాయం. ఆయన 1608-1611 లలో మొగలాయి సామ్రాజ్యంలో పర్యటించారు. తన పర్యటనలో ఆయన దృష్టి కొచ్చిన అంశాలను పేర్కొంటూ, "అవథ్" ఒక ప్రాచీన ప్రదేశమని, పోతన్ రాజుండే స్థలమని, రామాయణ గాథ నాయకుడు-భారతీయులు ఇలవేల్పుగా తలచే రామచంద్ర మూర్తి నివసించిన భవన శిథిలాలు అక్కడున్నాయని అంటారు. సృష్టికి పూర్వం లక్షలాది సంవత్సరాల క్రితమే, మహనీయులెందరో సమీపంలోని నదిలో స్నానం చేసేవారని, అక్కడ తాను కలిసిన వారు చెప్పినట్లు కూడా విలియం ఫెంచ్ పేర్కొన్నారట.

మదన్ మోహన్ గుప్తా వాంగ్మూలంలో, వేలాది సంవత్సరాల క్రితం, భగవదవతారమైన శ్రీరాముడు జన్మించిన రామ జన్మభూమిలో ఆలయం ఎల్లప్పుడూ వుండేదని, అది హిందూ మతస్థుల ఆధ్యాత్మిక స్థావరం అని, ఆయన త్రేతాయుగాంతంలో-ద్వాపర యుగారంభంలో అవతరించారని పేర్కొన్నారు. శిష్ట రక్షణ కొరకు మానవాకారంలో అవతరించిన భగవంతుడాయన. ఆయనను-ఆయన గుణగణాలను, ఆయన సమకాలీనుడైన వాల్మీకి మహర్షి రామాయణంలోను, తర్వాత వ్యాస మహాభారతంలోను-అందులోని రామోపాఖ్యాన పర్వంలోను, పురాణాల లోను, ఇతిహాసాల లోను, కౌటిల్యుడి అర్థశాస్త్రం లోను, కాళిదాసు రఘువంశం లోను, ఇతర భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లోను ప్రస్తావించారు ఆయా కవులు. నలుగురు మొఘల్ చక్రవర్తులకు (బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్) సమకాలీనుడైన గోస్వామి తులసీదాస్ రచించిన "రామ చరిత్ర మానస్" లో, అయోధ్యలో శ్రీరాముడి జన్మదిన వేడుకల విశేషాలున్నాయి కాని, బాబ్రీ మసీదు ప్రస్తావన ఎక్కడా లేదు. అలానే బాబర్ నామాను, గెజెటీర్స్ ను ఉటంకిస్తూ, తన వాదనను సమర్థించుకున్నారాయన.

జస్టిస్ సుధీర్ అగర్వాల్ తన తీర్పు చివర్లో, యావద్భారత దేశ ప్రజలకు ప్రమేయమున్న, "అత్యంత సున్నితమైన, క్లిష్ట తరమైన, వివాదాస్పదమైన" ఈ కేసును నిర్ణయించి తీర్పివ్వడానికి తాము పరిశీలించిన రికార్డులు ఎంతగానో దోహదపడ్డాయని, ఇదో "జైగాంటిక్, హెర్క్యూలియన్ టాస్క్" అని వర్ణించారు. తీర్పు అనుబంధంలో, న్యాయమూర్తులు పరిశీలించిన అనేక పుస్తకాల వివరాలను ఇచ్చారు. వాటిలో, ఇంపీరియల్ గెజెటీర్స్ తో సహా రకరకాల ఇతర గెజెటీర్స్, మహమ్మదీయుల చట్టాలకు సంబంధించిన పుస్తకాలు, మొగలాయిల డాక్యుమెంట్లు, హోలీ ఖురాన్, బాబర్ నామా, శ్రీ గురు గ్రంధ సాహిబ్, హెగెల్ చరిత్ర తత్వ శాస్త్రం (ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ), రోమిలా థాపర్ రాసిన భారత దేశ చరిత్ర, కుష్వంత్ సింగ్ సిక్కుల చరిత్ర, ఆర్ సి మజుందార్ భారత దేశ చరిత్ర, వివిధ భాషలలోని నిఘంటువులు, హిందూ మత నిఘంటువు, హ్యూయన్ సాంగ్ జీవిత చరిత్ర, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తో సహా అనేక విజ్ఞాన సర్వస్వాలు, ఆర్కియాలాజికల్ సర్వే నివేదికలు, స్వామి వివేకానంద రచనలు, ఆనంద రామాయణం, వాల్మీకి రామాయణం, రామ చరిత్ర మానస, భగవద్గీత, కాళిదాసు రఘువంశం, అధర్వ వేద సంహిత, రుగ్వేదం, రుగ్వేద సంహిత, సామవేదం, శుక్ల యజుర్వేదం, బృహదారణ్యక ఉపనిషత్తు, బృహస్పతి స్మృతి, మను స్మృతి, ధర్మశాస్త్రాలు, మత్స్య పురాణం, మేఘ దూత, నారదీయ ధర్మ శాస్త్రం, నారద స్మృతి, పురుష సూక్తం, శాకుంతలం, శుక్రనీతి, స్కంద పురాణం, యాజ్ఞవల్క్య స్మృతి లాంటివి వున్నాయి.

జస్టిస్ ఎస్ యు ఖాన్ తన తీర్పు పాఠాన్ని అవతారిక, ముందుమాటలతో ఆరంభించి చివర్లో ఉపసంహారం తొ ముగించారు. ఆసాంతం ఆయన తీర్పులో పలు ఆసక్తికరమైన అంశాలను చేర్చారు. తాను రాసిన తీర్పు చాలా చిన్నగా వుందని, అంత చిన్నదిగా రాసినందుకు, తనను, ఇలాంటి అతి సున్నితమైన-నాజూకైన సమస్యకు సంబంధించిన తీర్పును పొడిగించకుండా, ఎప్పుడు-ఎలా-ఎక్కడ ఆపుచేయాల్నో తెలిసిన కళాకారుడని అభినందించడమో, లేక, ఇంత అతి ప్రాముఖ్యత సంతరించుకున్న విషయాన్ని సాధారణమైంది గా తీసుకున్నందుకు అభిశంసించడమో జరగవచ్చని అంటారు జస్టిస్ ఖాన్. కొన్ని-కొన్ని సందర్భాల్లో ఓర్పు వహించడమే తీవ్రమైన చర్యగా, మౌనమే ఉపన్యాస సంభాషణగా, ఒకింత ఆగుకుంటూ కొనసాగించడమే వేగవంతం చేయడమని భావించాలంటారు. చరిత్ర, పురావస్తు, ప్రాచీన శిల్ప శాస్త్రాలకు సంబంధించిన విషయాల్లో తానంత లోతుగా వెళ్ళ లేకపోయానని, దానికి నాలుగు కారణాలున్నాయని అంటారు జస్టిస్ ఖాన్. మొదటిది వ్యాజ్యాలను నిర్ణయించడానికి వాటి అవసరం అంతగా లేదని తాను భావించడం. ఒకవేళ తానలా వాటి మూలాల్లోకి పోయినట్లయితే, ఆ మార్గంలో, తనకు "నిజం అనే నిధి" లభ్యమవుతుందా, లేక, "అస్పష్టమైన కఠోర భ్రమ" మిగులుతుందా తెలియదంటారాయన. చారిత్రక విషయాల గురించి అంతగా పరిజ్ఞానం లేని తాను, చరిత్రకారుల సంకట జ్వాలల్లో ఇరుక్కోవాలని లేదంటారు. సివిల్ వ్యాజ్యాల్లో చరిత్ర సాక్ష్యాధారాలకు అంతగా స్థానం లేదని సుప్రీం కోర్టు గతంలో ఒక తీర్పులో చెప్పడం మరో కారణమంటారు. ఏదేమైనా తాము చెప్తున్న తీర్పు తుది నిర్ణయం కాదని, అసలైన నిర్ణయాత్మక దశ మున్ముందు రానున్నదని, ఆ దిశగా ఇరు పక్షాల వారికి తానొక సూచన చేయదల్చుకున్నానని ఉపసంహారంలో పేర్కొన్నారు జస్టిస్ ఖాన్.

రాము డంటే త్యాగానికి మారు పేరని, ఆయన గుణగణాల్లో త్యాగానికే ప్రాధాన్యత అధికమని అంటారు జస్టిస్ ఖాన్. అలాగే ప్రాఫెట్ మొహమ్మద్ ప్రస్తావనా తెచ్చారు. హుదయ్ లియా వద్ద, ప్రాఫెట్ మొహమ్మద్ విపక్ష బృందంతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని, ఆయన బలీయమైన మద్దతు దార్లతో సహా పలువురు, మొహమ్మద్ లొంగుబాటుగా భావించారని, ఖురాన్ మాత్రం ఆ సంఘటనను మొహమ్మద్ విజయంగా వర్ణించిందని పేర్కొన్నారు. అదే నిజమైందని, అనతికాలంలోనే ముస్లింలు ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందకుండా మక్కాలోకి ప్రవేశించే వీలు కలిగిందని అంటారు న్యాయమూర్తి ఖాన్. డిసెంబర్ 6, 1992 నాటి మసీదు కూల్చివేత సంఘటనను ప్రస్తావించి, అలనాటి భారతీయుల సర్దుబాటు ధోరణిని అభినందనీయమంటారు. అయితే, అలాంటి సంఘటనలు మరల తలెత్తవని, అలా మళ్లీ జరుగు తే, కోలుకోవడం కష్టతరమవుతుందని అభిప్రాయ పడ్డారు. వర్తమాన కాలంలో ప్రపంచ గమనం వేగవంతమైందని, 1992 లో లాగా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చితికిపోవచ్చని అంటారు. "వతన్ కీ ఫికర్ కర్ నాదా ముసీబత్ ఆనే వాలీ హై..." అన్న ఇక్బాల్ కవి వాక్యాలను, డార్విన్ చెప్పిన మాటలను ఉదహరించారాయన. "సహ యోగం చేసిన, మెరుగు పడిన జాతులు మాత్రమే మనుగడ సాధించగలిగాయి" అని చెప్పిన డార్విన్ మాటలను గుర్తుచేశారు.

ఇతర మతాలవారితో ముస్లింల సంబంధ బాంధవ్యాలకు సంబంధించి ఇస్లాం బోధనలేంటో తెలుసుకునేందుకు యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తున్న విషయం ముస్లింలు లోతుగా ఆలోచించాలంటారు జస్టిస్ ఖాన్. విరోధం, శాంతి, స్నేహం, ఓర్పు లాంటి సందేశంతో ఇతరులను మెప్పించే సమయం కొరకా, లేక, ఎక్కడ-ఎప్పుడు వీలుంటే అప్పుడు దెబ్బతీసే సమయం కొరకా ఎదురు చూస్తోంది? అని ప్రశ్నించారాయన. ముస్లింలు భారత దేశంలో అద్వితీయమైన స్థానంలో వున్నారని, వాళ్లు ఒకప్పుడు పాలకులు గాను, మరొకప్పుడు పాలించబడిన వారి గాను వున్నప్పటికీ, ప్రస్తుతం, జూనియర్లగానైనా అధికారంలో భాగస్వాములయ్యారని అంటారు. వారిక్కడ మెజారిటీలో లేకపోయినా, ఉపేక్షించదగిన మైనారిటీలో లేరని, ఇండొనేషియా తర్వాత అధిక సంఖ్యాక ముస్లింలుండేది భారతదేశంలోనేనని పేర్కొన్నారు. చాలా దేశాల్లో వారు మెజారిటీలో వున్నప్పటికీ అక్కడి సమస్యల పట్ల నిర్లిప్తతతో-ఉదాసీనతతో వుంటారని, మైనారిటీలో వున్న దేశాల్లో వారి ఉనికిని గుర్తించకపోవడం జరుగుతున్నదని అంటారు. భారత దేశంలోని ముస్లింలు మత పరమైన విద్యాభ్యాసాన్ని, పరిజ్ఞానాన్ని తర తరాల అపారమైన వారసత్వ సంపదగా పొందారని, అందువల్ల, యావత్ ప్రపంచానికి అసలు విషయాన్ని తెలియ పరిచే దిశగా పయనించడానికి సరైన స్థానంలో వున్నారని, ఆ దిశగా ఈ వివాద పరిష్కారాన్ని ఎరుక పరిచే విధంగా తమ పాత్ర పోషించాలని సూచించారు జస్టిస్ ఖాన్.

మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం అన్వేషణ జరుగుతుందనడానికి వాల్మీకి రామాయణ గాధే చక్కటి ఉదాహరణ. వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణం కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచింది. కథానాయకుడు సాక్షాత్తు మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. త్రేతాయుగంలో ఆయన అవతరించి దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి మానవ విలువలను కాపాడాడనేది సారాంశం. వారి చరిత్రను వాల్మీకే రచించి వుండక పోతే, మనలాంటి వారు అంధకారంలో పడి, దురాచార పరులమైపోయి, మానవ విలువలకు తిలోదకాలిచ్చేవారిమేమో. మతం, భాష, సాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికి, తన మూర్తిని భగవంతుడిలో-ఆయన మూర్తిని తనలో చూసుకుంటూ, తద్వారా క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటాడని ఆశించుదాం.

ఈ సందర్భంగా ఒక్క సారి, ఎవరి హయాంలో డిసెంబర్ 6, 1992 న కరసేవకుల చేతుల్లో బాబ్రీ మసీదు కూలగొట్టబడిందో, ఆ పీ వీ నరసింహా రావు గారు ఇప్పుడున్నట్లయితే ఏ విధంగా ఈ తీర్పు పై వ్యాఖ్యానించే వారో ఊహించాలి. పీవీ గారి ఆంతరంగికుడు, ఆయన ప్రధానిగా వున్నప్పుడు మీడియా సలహాదారుడిగా వున్న పీ వీ ఆర్ కె ప్రసాద్ ఇటీవల ఒక తెలుగు టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన కొన్ని విషయాలలో, ఇలాంటి తీర్పు వస్తుందన్న ఉద్దేశం ఆయనకు లేకపోయినా, అప్పట్లో ఆయన ఇలాంటి తీర్పు దిశగా కొన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు. తీర్పులో టైటిల్ ఎవరిదన్న అంశం తేలక పోయినా, మూడు విడి-విడి భాగాల ఉమ్మడి యాజమాన్య హక్కు అన్న నిర్ణయం వల్ల దేశానికి మేలు జరిగితే మంచిదేనని పీవీ మాటగా ప్రసాద్ అన్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పుకు స్పందనగా వేడి పుట్టించాలని ఎవరూ భావించడం లేదని, మిలిటెంటు మత పరమైన నాయకులు కూడా, సుప్రీం కోర్టుకు వెళ్తాం అని మాత్రమే అంటున్నారు కాని, గందరగోళం సృష్టించే చర్యల గురించి ప్రస్తావన తేకపోవడం పీవీ గారి ఆశయానికి తగినట్లుందని అంటారు ప్రసాద్. కోర్టు వెలుపల సమస్యకు పరిష్కారం కనుగొనాలని పీవీ అల నాడు చేసిన కృషిలో భాగంగా ఆయన ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న "ట్రస్టు", ఆయన అధికారంలో కొన సాగినట్లయితే, ఈ విధంగానే పరిష్కరించేదేమో అని కూడా అన్నారు ప్రసాద్. ఇరు వర్గాల వారు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలన్న దే పీ వీ నరసింహారావు ఆశయం అనుకోవాలి.

5 comments:

  1. చాలా ఓపిగ్గా డీటైల్డ్ గా రాశారు. ఈనాడు, జ్యోతి లాంటి పత్రికల అరకొర రాతలు చూసి వక్ఫ్ బోర్డ్ కన్నా ముందే రెచ్చిపోయిన నాస్థికులమని చెప్పుకునే కులగజ్జి గాళ్ళు బ్లాగుల్లో జడ్జిమెంట్ మీద తమదైన మూర్ఖత్వంతో నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశారు. ఆ తీర్పువెనుక హైకోర్ట్ జడ్జీలు పడ్డ శ్రమ మీ వ్యాసం ద్వారా తెలుస్తోంది. పివి గారు బ్రతికివుంటే ఈ తీర్పుపై సంతోషించేవారనిపిస్తుంది.

    ReplyDelete
  2. నిజంగా చాలా ఆసక్తికరంగా ఉందండి, తీర్పుపూర్తిపాఠం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరు.

    ReplyDelete
  3. thanks for this article. i hope one day penguin or someone will publish this as a book.

    ReplyDelete
  4. http://rjbm.nic.in/

    ReplyDelete
  5. Text in full is available at:

    http://rjbm.nic.in/
    Jwala

    ReplyDelete