(సూర్య దినపత్రిక:10-10-2010)
వనం జ్వాలా నరసింహారావు
చంద్రబాబుది ‘స్మార్ట్ పాలన'
వైఎస్సార్‌ది ‘కేరింగ్ ప్రభుత్వం’
ప్రస్తుత పాలనలో ఉదాసీనత
అమలు కాని పరిపాలనా సంస్కరణలు
పౌర సేవా పట్టికల తయారీకి టీడీపీ కృషి
పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయత, ప్రజా సంక్షేమం, పౌర సౌకర్యాలు, అభివృద్ధి అనే మాటలను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తరచుగా చెప్పడం గమనిస్తున్న పలువురు పరిశీలకులకు "మేడి పండు" సామెత గుర్తుకొస్తోంది. వీరిరువురు, తమ (కాంగ్రెస్) ప్రభుత్వం పనితీరు గురించి చెప్పుకొంటున్నప్పుడల్లా ఈ పదాలను అదే పనిగా ఉచ్చరించడం ఒక రకమైన ఆనవాయితీగా-అలవాటుగా మారింది. ఆ మాటకొస్తే మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ మాటలు చెప్పకుండా ఏ పనీ చేసేవారు కాదు. కాకపోతే చెప్పిన మాటలను చేయడానికి, చేసినట్లు ప్రజలను నమ్మించడానికి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరించేవారు. చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో తన ప్రభుత్వాన్ని ’స్మార్ట్ గవర్నమెంట్’ అనేవారు. సరళీకృత, నైతిక, జవాబుదారీ, బాధ్యతాయుత, పారదర్శక (సిం పుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్ పరెంట్) విధానాలను త్రి కరణ శుద్ధిగా పాటించే ప్రభుత్వం తమ ప్రభుత్వమని అనే వారు. ఇక దివంగత ముఖ్యమంత్రి అవే పదాలను ఇంచుమించు అటు ఇటుగా మార్చి, తనది ’కేరింగ్ ప్రభుత్వం’ అని నామకరణం చేశారు. రెండింటికి బాధ్యతాయుత ప్రభుత్వమన్న అర్ధమే వస్తుంది. కాకపోతే, ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేయడంలోను, పారదర్శకతకు, జవాబుదారీతనానికి నిదర్శనంగా చెప్పుకోదగిన ప్రభుత్వ పరమైన సాధనాలను ప్రవేశపెట్టడంలోను, వాటిలో అతి ముఖ్యమైన పౌర సేవా పట్టిక (సిటిజన్ చార్ట్)ల రూపకల్పన-అమలు లోను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి ప్రభుత్వం కంటె మెరుగైన శ్రద్ధ కనబరిచారనే విషయంలో సందేహం లేదు. మరో రకంగా చెప్పుకోవాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందనాలి.
పాలనలో పారదర్శకత ఉట్టిపడేందుకు, పాలకుల్లో, ప్రభుత్వోద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు దశాబ్దాల కిందటే కసరత్తులు మొదలైనా ఆచరణలో జరిగింది సున్నా అని చెప్పక తప్పదు. పాలనాపరమైన సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటిస్తూ ఐదు, ఆరు దశకాల్లో గోపాలస్వామి అయ్యంగార్, పాల్ ఏపెల్ బీ, టీటీ కృష్ణమాచారి వంటి ప్రముఖులు నివేదికలు తయారుచేశారు. తమ నివేదికల్లో చేసిన అనేక సూచనలు అమలుకు నోచుకోలేదు. కానీ, ఈ నివేదికల పుణ్యమా అని 1964లో కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా పరిపాలనా సంస్కరణల శాఖను ఏర్పాటు చేసింది. మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన పాలన సంస్కరణల కమిషన్ 500కు పైగా సూచనలు చేసింది. ప్రభుత్వాలు అభివృద్ధికే ప్రాధాన్యమివ్వాలి తప్ప నియంత్రించడానికి కాదని ఎల్.కె. ఝా కమిషన్ సూచించింది. తొమ్మిదో దశకం తొలినాళ్లలోనే ప్రవేశపెట్టిన సరళీకృత ఆర్థిక విధానాల పర్యవసానంగా పాలన సంస్కరణలను తప్పనిసరిగా చేపట్టవలసిన అవసరమేర్పడింది. ఈ నేపథ్యంలో - 1997 మేలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో పాలన సంస్కరణల దిశగా చేసిన తీర్మానం చెప్పుకోదగినది. ఐ. కే. గుజ్రాల్ ప్రధాన మంత్రిగా వుండి, అధ్యక్షత వహించిన ఆ సమావేశంలో, రాజకీయాలకు అతీతంగా-పార్టీలకతీతంగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలోనే, తన "స్మార్ట్ గవర్నమెంట్" విధి విధానాలను వివరించి పలువురు ముఖ్యమంత్రుల ప్రశంసలను అందుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, అలనాటి ఆయన ఉపన్యాసం అత్యంత కీలకమైన పాలనా సంస్కరణలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి అమలు పరచడానికి దోహదపడిందనవచ్చు.
1997లో అప్పటి ప్రధాని అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు గడచిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం. ఆ సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మానం, తదనంతరం రూపొందించిన తొమ్మిది అంశాల కార్యాచరణ పథకం భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా వర్ణించాలి. స్వాతంత్రం లభించి యాభయ్యేళ్లు గడచినా ప్రభుత్వాల పనితీరుపైనా, జవాబుదారీతనంపైనా ప్రజలకు పూర్తి విశ్వాసం ఏర్పడలేదని, ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు అత్యవసరంగా కొన్ని చర్యలు చేపట్టాలని ఆ తీర్మానంలో సూత్రీకరించారు. అలనాటి తొమ్మిది అంశాల కార్యాచరణ ప్రణాళిక కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా బాధ్యతాయుతమైన సుపరిపాలనను అందించడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆ ప్రణాళికే ఇప్పటికీ అమలులో వున్నట్టయితే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం, బయ్యారం గనుల అక్రమాలు, పబ్లిక్ సర్వీసు కమీషన్ అవకతవకలు, అలాంటి అనేకానేక పౌర వ్యతిరేక కార్యక్రమాలు చోటు చేసుకోకపోయేవేమో!
అప్పట్లో ఆ నవ సూత్ర ప్రణాళిక అమలుకు, ఆ రోజునుంచి ఆరు నెలల గడువును కూడా నిర్దేశించుకున్నారు. అందులో అతి ప్రాముఖ్యమైన వాటిలో, పౌర సేవా పట్టికల తయారీ-అమలు, పాలనలో పారదర్శకత - జవాబుదారీతనం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, చట్టాలు - నియమనిబంధనలు - నియంత్రణలను సమీక్షించి తగిన విధంగా సవరణలు చేయడం, సమాచార హక్కు కల్పించడం, పౌర సమాచార సదుపాయాల కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులోకి తేవడం, ప్రజాసేవకులకు నైతిక విలువల నియమావళిని రూపొందించి వర్తింపజేయడం, పాలనలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టడం, ప్రభుత్వోద్యోగులకు పదవీకాలంలో స్థిరత్వం కల్పించడం, సివిల్ సర్వీసెస్ బోర్డును ఏర్పాటు చేయడం వంటి అంశాలున్నాయి. అప్పటి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రుల్లో చాలామంది ఇప్పటికీ అధికారంలో కొనసాగుతున్నారు. మరికొందరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇంకొందరు వారసులో, బంధుగణమో, ఇలా ... వారంతా ఇప్పటికీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నా, అప్పటి ప్రణాళికలోని అంశాల అమలుకు మాత్రం ఈ పదమూడేళ్ల కాలంలో చేసిన కృషి నామమాత్రమే.
మన రాష్ర్టానికి సంబంధించినంతవరకు అప్పటి ప్రణాళికలోని తొమ్మిది అంశాలలో ఒకటైన పౌర సేవా పట్టికల రూపకల్పనకు తెలుగుదేశం ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. పౌర సేవా పట్టికలను తయారు చేయవలసిందిగా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీచేసింది. ఈ కార్యక్రమం ఆమలు కోసం సిబ్బందికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ ఇచ్చారు. వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను, ఉన్నతాధికారులను, మధ్య స్థాయి అధికారులను ఒకే వేదిక పైకి తెచ్చి ప్రజల అవసరాలకు, అభీష్టాలకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్న విషయాలపై ఉమ్మడి ఆలోచన చేసేందుకు చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అనేక ప్రభుత్వ శాఖలు పౌర సేవా పట్టికల్ని తయారుచేశాయి. అయితే, మొదట్లో, అమలు విషయానికి వచ్చేసరికి ఏడెనిమిది శాఖలు మినహా మిగతావన్నీ వాటిని కాగితాలకే పరిమితం చేశాయి. ఇంతలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోవడానికి కొన్ని నెలల ముందు పౌర సేవా పట్టికల అమలు తీరుపై సమీక్ష జరిపినా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పౌర సేవా పట్టికల అమలు విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. బహుశా ఇప్పడు చాలా శాఖల్లో పౌర సేవా పట్టికలనేవి లేకపోవడమో, వున్నా, వాటి విషయం అక్కడి ఉద్యోగులతో సహా సంబంధిత పౌరులకు తెలియకపోవడమో జరుగుతోంది.
ముఖ్యమంత్రుల సదస్సులో అంగీకారం పొందిన ప్రణాళిక అమలు తీరును పరిశీలించేందుకు కేంద్రప్రభుత్వం 2001లో రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకొని అధ్యయనం చేసింది. వీటిని విశ్లేషించేందుకు కేంద్రం నియమించిన కమిటీ 2002లో తన నివేదికను సమర్పించింది. ప్రణాళికలోని తొమ్మిది అంశాలలో ఒక్కటి కూడా ఏ రాష్ట్రంలోనూ సక్రమంగా అమలు జరగడం లేదన్నది ఆ నివేదిక సారాంశం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న ఆంధ్ర ప్రదేశ్ లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అమలు తీరు చాలా బాగుందని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడిందప్పట్లో. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలపై కొరడా ఝుళిపించవలసిన కేంద్రం కూడా ఏమీ పట్టించుకోకుండా మిన్నకుండిపోయింది. ఆ తరువాత మేల్కొని మరో మారు పౌర సేవా పట్టికల రూపకల్పనను తక్షణం చేపట్టాలంటూ ఆదేశాలిచ్చింది. వాటిని రూపొందించడం, అమలు చేయడం వంటి విషయాల్లో కొన్ని మార్గదర్శకాలను సూచించింది. పౌర సేవా పట్టికల తయారీకి ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక నోడల్ అధికారిని నియమించి, అతని సారధ్యంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఉద్యోగ వర్గాల ప్రతినిధులు, ప్రభుత్వేతర సంస్థల సభ్యులు టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉండాలని, వారు పలు దఫాలు చర్చలు జరిపిన అనంతరం పౌర సేవా పట్టికలను రూపొందించాలని కోరింది. ఇన్ని సూచనలు చేసినా, సలహాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిలో మార్పు రాలేదనడానికి మన రాష్ట్రమే ఓ ఉదాహరణ.
ప్రభుత్వానికీ, ప్రజలకూ మద్య పౌర సేవా పట్టిక ఒక అవగాహన పత్రం లాంటిది. ఏయే సేవలను ఎలా, ఎప్పుడు, ఏ విధంగా, ఎంత సమయంలో అందించేదీ ప్రభుత్వం సవివరంగా తెలియజేస్తూ ప్రజలకు ఇచ్చే ఒప్పందపత్రం అది. ఇది కార్యరూపం దాల్చాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి కావాలి. ఏదో ఒకటి రెండు ఉదాహరణలిచ్చి తమ ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తోందని బాకా ఊదుకోవడం ప్రజల్ని మభ్యపెట్టడమే. కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానిగా అయిన తర్వాత తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు కావాలన్నా పౌర సేవా పట్టికల రూపకల్పన, వాటితోపాటు పౌర సమాచార సదుపాయాల కేంద్రాల ఏర్పాటూ తప్పనిసరి. వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తరువాతే ఏ ప్రభుత్వమైనా తమది పారదర్శకత, జవాబుదారీతనం ఉట్టిపడే ప్రభుత్వమని చెప్పుకుంటే బాగుంటుంది. అప్పటివరకూ, ఎమ్మార్ కుంభకోణాలు, బయ్యారం గనుల అక్రమాలు, సోంపేట బాధలు ప్రజలకు తప్పవు.
No comments:
Post a Comment