అ నైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు
ఆద్యులెవరు? బాధ్యులెవరు?
వనం జ్వాలా నరసింహారావు
కర్నాటక సంక్షోభం నేపధ్యంలో, రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ సిఫార్సు చేసినట్లు వార్తలొచ్చాయి. నిర్ణయం తీసుకోవాల్సిన యూపీఏ కేంద్ర ప్రభుత్వం, దానికి సారధ్యం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, కారణాలేవైనప్పటికీ, తాత్సారం చేయడంతో, ఈ లోగా మరో సారి బల పరీక్షకు యడియూరప్పకు గవర్నర్ అవకాశం ఇవ్వడంతో, ఆయనందులో గెలవడంతో, ప్రభుత్వం మరికొంతకాలం మనుగడ సాగించే వీలు కలిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంతో-ఇంతో అపహాస్యం పాలైనప్పటికీ, రాష్ట్రపతి పాలన వాయిదా పడింది. గవర్నర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పాలన విధించినట్లయితే, దేశవ్యాప్తంగా కాంగ్రేసేతర ప్రతిపక్షాల నిరసన ధ్వనులు వినిపించేవి. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్ల కాలం పదవిలో కొనసాగనీయకుండా, అప్రజాస్వామికంగా కూల దోయడం ఆరంభించింది కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ, ఆ సాంప్రదాయాన్ని తొలి కాంగ్రేసేతర జనతా సంకీర్ణ ప్రభుత్వం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రేసేతర ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి. అధికారంలో వున్నప్పుడొక నీతి, ప్రతిపక్షంలో వున్నప్పుడు మరొక నీతి పాటించడంలో రాజకీయ పార్టీలన్నీ ఒకే బాటలో నడవడంతో, మెరుగైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు కావాల్సిన సత్ సంప్రదాయాలకు పునాదులు పడలేదు.
దక్షిణ భారతదేశంలో ఏర్పాటైన మొదటి బీజేపీ ప్రభుత్వం కర్నాటకలోనే. పూర్తి మెజారిటీకి కావాల్సినంతమంది మద్దతు లేకపోయినా, అచిర కాలంలోనే అతి చాకచక్యంగా మెజారిటీ పొందగలిగారు. స్వతంత్ర సభ్యులను ఏదో విధంగా తమ పక్షం తిప్పుకోగలిగారు యడియూరప్ప. గాలి సోదరుల మద్దతు-తిరుగు బాటుల మధ్య ఆయన ప్రభుత్వం మనుగడ సాగించినప్పటికీ, సంక్షోభంలో పడక తప్పలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమంటే అంకెల గారడీ అని సోదాహరణంగా నిరూపించారు యడియూరప్ప. ఆయన పార్టీకి చెందిన సభాపతి, బీజేపీ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన పదకొండు మంది పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఐదుగురు ఇండిపెండెంటు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దుచేసి, గవర్నర్ ఆదేశం మీద జరిగిన బల పరీక్షలో యడియూరప్పకు విజయం చేకూర్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడానికి, రాజ్యాంగం ప్రకారం అధికారాలున్న సభాపతి, గవర్నర్ తమ వంతు పాత్రను పోషించారు. ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికైన వారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం తప్పే. అంతకు ముందు ఇండిపెండెంట్లుగా ఎన్నికై, బీజేపీ తీర్థం పుచ్చుకుని, తర్వాత క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడడం కూడా తప్పే. మెజారిటీ కొరకు వారిని బీజేపీ లో చేర్చుకోవడమూ తప్పే. సాధారణంగా, ఫిరాయింపుల చట్టం కింద, పార్టీ విప్ ధిక్కరించి ఓటేసిన తర్వాత సభ్యత్వం రద్దు చేయడం ఆనవాయితీ. కర్నాటకలో స్పీకర్ ఒకడుగు ముందుకు వేసి, అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండానే బీజేపీ-ఇండిపెండెంట్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దుచేశారు. బంతిని కోర్టులో విసిరారు అంతా కలిసి.
శాసన నిర్మాణ, న్యాయ నిర్ణయ, కార్య నిర్వహణ వ్యవస్థల మధ్య "అదుపులూ, అన్వయాలూ" అనే రాజ్యాంగ స్ఫూర్తి, సమన్వయం-సమ న్యాయం వుండేలా వ్యవహరించడం వల్లే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడ సాగించే వీలు కలుగుతోంది. కర్నాటక వ్యవహారంలో, శాసన సభ స్పీకర్కు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేసే తిరుగులేని రాజ్యాంగాధికారం వున్నప్పటికీ, దాన్నెవరూ ప్రశ్నించ లేనప్పటికీ, న్యాయ నిర్ణయ వ్యవస్థ విచారణ చేసే వీలు కలిగింది. ఇక న్యాయ నిర్ణయ వ్యవస్థ విషయానికొస్తే, అంచెలంచల ఏర్పాటుతో పనిచేసే ఆ వ్యవస్థలో ఒక స్థాయిలో న్యాయం జరగలేదని భావించినప్పుడు, పై స్థాయిలో న్యాయం కొరకు ప్రయత్నం చేసే వీలుంది. కాకపోతే, ఈ వ్యవస్థలన్నీ కేవలం రాజ్యాంగ ప్రకరణాలకు లోనై మాత్రమే పనిచేసేకంటే, సత్ సంప్రదాయాలను నెలకొల్పుకుంటూ పనిచేయడం మంచిది. అలా జరుగుతుండడం వల్లే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్ దేశంలో, కాగితంపై రాసుకున్న రాజ్యాంగం లేకపోయినా, సాంప్రదాయాల ప్రాతిపదికపై, ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోంది. బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన మనం, వారి వారసత్వంగా చెడును స్వీకరించ గలిగినప్పుడు, మంచినెందుకు అలవర్చుకోలేకపోతున్నామో?
గవర్నర్ గా నియమించబడిన, కేంద్ర ప్రభుత్వంలోని అధికార పార్టీకి అనుకూలురైన వ్యక్తికి, ఆ వ్యక్తి ద్వారా రాష్ట్రపతికి (అదే రాజకీయ పార్టీ అభ్యర్థిగా పదవిలోకి వచ్చిన వ్యక్తి), కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వున్న పార్టీకి, 356 రాజ్యాంగ ప్రకరణ "రక్షక కవచం" లాంటిది. ఆఖరు ప్రయత్నంగా ఉపయోగించాల్సిన అధికారాన్ని, మొదటి అస్త్రంలాగా-అదీ బ్రహ్మాస్త్రంలాగా వాడుకునే ప్రకరణైంది. దాన్ని ప్రయోగించే ముందు జరగబోయే పరిణామం సత్ సంప్రదాయానికి దారి తీస్తోందా, దుష్ట సంప్రదాయమౌతుందా అని ఒక్క క్షణం ఆలోచించి చేస్తే బాగుంటుంది. దురదృష్ట వశాత్తు అలా జరగక పోవడం వల్ల, కర్నాటక గవర్నర్ తొందర పడ్డాడని భావించాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని అనాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోవటానికి ప్రధాన కారణం 356 రాజ్యాంగ ప్రకరణమంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రాలలో అధికారంలో వున్న పార్టీ స్థానంలో, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీని తెచ్చే ప్రక్రియగా ఆ ప్రకరణంను ఉపయోగించుకునే సంప్రదాయం మొదలైంది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రెండు సంవత్సరాలకే, పంజాబ్‌లో, "రాజ్యాంగ యంత్రాంగం" భగ్నం కావడం, జూన్ 1951 లో రాష్ట్రపతి పాలన విధించడం, ఆ సంప్రదాయం ఎన్నో పర్యాయాలు అదే రాష్ట్రంలో నెలకొనడం జరిగింది. అసలు సిసలైన ప్రజాస్వామ్య ఖూనీ కేరళ రాష్ట్రంలో ఆ తర్వాత జరిగింది. కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలనలో గడపని రాష్ట్రాలు దాదాపు లేనట్లే. కనీసం వంద సార్లకు పైనే రాష్ట్రపతి పాలన వివిధ రాష్ట్రాల్లో విధించడం జరిగింది. 1957 లో ప్రపంచ చరిత్రలోనే మొదటి సారి బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రెండేళ్లకే 1959 లో రద్దుచేసి, కేరళలో రాష్ట్రపతి పాలన విధించింది అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. అలా అప్రజాస్వామిక సంప్రదాయం నెలకొల్పింది ఎవరో కాదు-ప్రపంచంలో ప్రజాస్వామ్య వాదిగా ప్రసిద్ధికెక్కిన జవహర్లాల్ నెహ్రూ. ఆ చర్యకు ప్రేరణ ఇచ్చిన అలనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎవరో కాదు-ప్రజాస్వామ్య నియంతగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధి. అప్పట్లో ఆ చర్యకు బలైంది కమ్యూనిస్టులు కాబట్టి, కాంగ్రెస్ లోని ప్రజాస్వామ్య వాదులు కాని, కమ్యూనిస్టేతర ప్రతిపక్ష నాయకులు కాని నిరసన తెలియచేయలేదు. అచిర కాలంలోనే, తమ వంతు కూడా వస్తుందని కమ్యూనిస్టేతర రాజకీయ పార్టీలు అప్పుడే అనుకుంటే బాగుండేది. అప్పట్లో కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఇంకా రాష్ట్రాలలో అధికారంలోకి రావడం మొదలు కాలేదు. వచ్చిన ఒకే ఒక్కటి కమ్యూనిస్టు పార్టీకి చెందింది కావడం, దాన్నీ అధికారంలో కొనసాగనీయక పోవడం భవిష్యత్ లో జరగబోయే పరిణామాలకు సంకేతమని కాంగ్రేసేతర పార్టీలు పసిగట్టలేక పోయాయి. కాంగ్రెస్ పార్టీ కూడా, అదే అస్త్రం తమపై ప్రయోగించే అవకాశం వుందని భావించలేదు.
1967 కు పూర్వం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాలలోను, కేంద్రంలోను తిరుగులేని మెజారిటీ వుండేది. ఆడింది ఆట-పాడింది పాట. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి (పదవి కొరకు)ఫిరాయింపులుండేవి కాని, కాంగ్రెస్ నుంచి బయటకు పోవడం వుండకపోయేది. నాలుగో సాధారణ ఎన్నికల తర్వాత పరిస్థితిలో మార్పొచ్చింది. కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి ఎదురుదెబ్బ తగిలింది. కిచిడీ సంకీర్ణ ప్రభుత్వాలనేకం రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చాయి. ఆయారామ్-గయారామ్లె ఫిరాయింపు పర్వాలు మొదలయ్యాయి. సుమారు పది సంవత్సరాల కాలంలో, పదమూడు రాష్ట్రాలలో పాతిక పర్యాయాలకు పైగా "రక్షక కవచం" ఉపయోగించి, గవర్నర్ల సహకారంతో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. "రాజకీయ ప్రతిష్టంభన" సాకు చూపి, శాసన సభలను రద్ధుచేసి, పరోక్షంగా కాంగ్రెస్ పాలన సాగిందా రోజుల్లో. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ పనిచేయడానికి రాజకీయ జోక్యం కావాలి కాని, ఆ జోక్యం రాజ్యాంగాన్ని-సంప్రదాయాలను అపహాస్యం చేసే స్థితికి పోకూడదు. ఉదాహరణకు, "శాంతి భద్రతల ప్రతిష్టంభన" ఏర్పడిందన్న సాకుతో, 1967 సాధారణ ఎన్నికల్లో గెలిచి అధికారంలొకొచ్చిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని 1968 లో రద్దుచేసి, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రధాన మంత్రి కాగానే, ఆయన ధర్మ సంస్థాపన, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల దోయడంతో ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో వున్న అర డజన్ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో జనతా పార్టీ లోక్ సభ సభ్యులు గెలిచి నందువల్ల, ఆ ప్రభుత్వాలకు ప్రజల మద్దతు లేదన్న సాకుతో మొరార్జీ వాటిని రద్దుచేయడం మరో దుష్ట సంప్రదాయం. శాసన సభ్యులుగా ఓటర్లు ఐదేళ్ల కాలపరిమితికి ఎన్నుకున్నారన్న ప్రజాస్వామ్య ప్రాధమిక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారాయన.
ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన ప్రభుత్వాలు ఏ పార్టీకి చెందినవైనప్పటికీ, ఆ చర్యలు ఏ పార్టీకి వ్యతిరేకంగా జరిగినవైనప్పటికీ, పార్టీలకతీతంగా ఖండించక పోవడం వల్ల, దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు, ఎంతో కొంత అన్యాయం జరుగుతూనే వుంది. అదే విధంగా నియంతృత్వ ధోరణులు అనుకరిస్తున్న ప్రభుత్వం లోని పార్టీ ఏదైనా, ఆ ధోరణి వల్ల నష్టపోయింది ఎవరైనా, తీవ్రంగా ఖండించకపోతే, వాటికి ఎవరైనా బలికావొచ్చు. ఉదాహరణకు, 1962 లో, చైనాతో యుద్ధం జరిగిన నేపధ్యంలో, పీడీ చట్టం కింద సీపీఎం కు చెందిన వేయి మందికి పైగా పార్టీ కార్యకర్తలను దేశవ్యాప్తంగా నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. నిర్బంధంలో తీసుకుంది కమ్యూనిస్టులనే కదా అన్న ధోరణిలో, ప్రభుత్వ చర్యను ఖండించిన కాంగ్రెస్-కమ్యూనిస్టేతర రాజకీయ పార్టీలు లేనే లేవు. ఆ తర్వాత ఏమైంది? చరిత్ర పునరావృతమైంది. ఇందిరా గాంధీ, ఎమర్జెన్సీ రోజుల్లో, దేశవ్యాప్తంగా వారూ-వీరూ అనే భేదం లేకుండా, తనను వ్యతిరేకించిన స్వపక్షీయులతో సహా, అన్ని రాజకీయ పార్టీల నాయకులను నిర్బంధించింది. 1959 లో, 1962 లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తీసుకున్న అప్రజాస్వామిక చర్యలను అన్ని రాజకీయ పార్టీలు ఖండించినట్లయితే, నూరు పర్యాయాలు రాష్ట్రపతి పాలనలు విధించడం కాని, వేలాది మంది ప్రజాస్వామ్య వాదులను నిర్బంధించడం కాని జరిగుండేది కానేకాదు. అ నైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆద్యులెవరు? బాధ్యులెవరు? అన్ని రాజకీయ పార్టీల వారు ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిదే మో! అంకెల గారడీ తో గండం గట్టెక్కిన యడియూరప్ప, తనకు మద్దతు లభించింది 106 మంది శాసన సభ్యులదే కాని, 113 మందిది కాదని, తనకు ప్రభుత్వం నడిపే నైతిక హక్కు లేదని భావించాలి. చట్ట ప్రకారం బలాన్ని నిరూపించుకున్నందున, శాసన సభను రద్దు చేయమని, తిరిగి ఎన్నికలు నిర్వహించమని గవర్నర్‌ను కోరి, సత్ సంప్రదాయాన్ని నెలకొల్పితే మంచిది. ఆ విధంగానన్నా, గవర్నర్‌కు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఇవ్వకుండా చూడాలి.
Dear Narasimha rao garu, excellent..this is one of the few telugu blogs which i liked and i like to follow your blog from now onwards..i would like to read all your old posts when i get time..regards...Malli
ReplyDeleteధన్యవాదాలు.
ReplyDeleteజ్వాలా నరసింహారావు