Thursday, April 7, 2011

ఆరాధ్య దైవం భగవాన్ సత్య సాయిబాబా:వనం జ్వాలా నరసింహారావు

ఆరాధ్య దైవం భగవాన్ సత్య సాయిబాబా

సూర్య దినపత్రిక (09-04-2011)

వనం జ్వాలా నరసింహారావు

గత వారం పది రోజులుగా ఏ నోట విన్నా, ఏ నలుగురు కలిసినా, ఏ పత్రిక చదివినా, ఏ ఛానల్ చూసినా, వినిపించే-కనిపించే ప్రధానమైన విషయం భగవాన్ సత్య సాయిబాబా ఆరోగ్యం గురించే. ఆస్తికులు-నాస్తికులు, అన్ని మతాల వారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు, అధికారులు-అనధికారులు, ఆంధ్రులు-ఆంధ్రేతరులు, దేశ-విదేశాల్లోని సామాన్యులు-అసామాన్యులు, బాబా అపర భక్తులు-ఏ మాత్రం గిట్టని వారు, వారు-వీరు అనే తేడా లేకుండా ఆబాల గోపాలం సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం తెలిసిన విషయమే. దీన్ని అర్థం చేసుకోవడంలోనే, ఆయనో మహానుభావుడని, దైవాంశ సంభూతుడని, మానవ రూపంలో మనందరి మధ్యన-మన కోసం కద లాడుతున్న "పురుషోత్తముడు" అనే విషయం బోధ పడుతుంది. పొలిమేరలే తప్ప ఎల్లలు లేని ఒక కుగ్రామంలో జన్మించి, ఎల్లలెరుగని అపురూప ప్రదేశంగా దాన్ని మలిచి, ప్రపంచ వ్యాప్తంగా దేశ-దేశాల పౌరులకు ఆధ్యాత్మిక తృప్తిని, మానసిక స్థయిర్యాన్ని కలుగజేసే "ప్రశాంత నిలయం" గా ఆ పల్లె రూపు-రేఖలనే మార్చి, తన చిన్న కుటుంబాన్ని వసుధైక కుటుంబంగా చేసుకున్న భగవాన్ సత్య సాయిబాబా దేవుడా-కాదా అంటే, దానికి సమాధానం అలా ప్రశ్నించిన వాళ్లే వెతుక్కోవాలి. ఆయనే దేవుడైతే, ఆయనకెందుకు వైద్యం అవసరమవుతుందని, ఎంతో మందికి తన విబూది ద్వారా చికిత్స చేసిన బాబాకు వైద్యులు చికిత్స చేయడం ఎందుకని ప్రశ్నించే వారూ వున్నారు.

హిందూత్వ కర్మ సిద్ధాంతం ప్రకారం, ఈ సకల చరాచర ప్రపంచంలో, భూతకాలంలో జరిగిన దానికీ-వర్తమానంలో జరుగుతున్న దానికీ-భవిష్యత్ లో జరగబోయే దానికీ, కర్త-కర్మ-క్రియ ఒక్కడే. ఏ పనిని, ఎప్పుడు-ఎలా-ఎవరి ద్వారా జరిపించాలో, జరిగినదాని పర్యవసానం ఏమిటో-లాభ నష్టాలేంటోనన్న విషయాలను నిర్ణయించే అధికారం ఒకే ఒక్కరికి వుంది. సృష్టించేది బ్రహ్మనీ, సంహరించేది రుద్రుడనీ, కాపాడుతుండేది విష్ణుమూర్తనీ అనుకుంటాం. బహుశా అది నిజంకాదే మో. అనంత కోటి బ్రహ్మాండానికి "పర బ్రహ్మం" ఒక్కరే అయుండాలి. ఆ ఒక్కరికి సమానులు గానీ, అధికులు గానీ ఎవరూ వుండరు. గడ్డి పోచ కదలాలన్నా ఆ ఒక్కరే కారణం. ఆ ఒక్కరే, సృష్టికొక అధికారిని (బ్రహ్మ), సంహరించడానికి ఒక అధికారిని (రుద్రుడు), కాపాడడానికి మరొక అధికారిని (విష్ణుమూర్తి) నియమించాడు. విష్ణు, బ్రహ్మ, రుద్రులు నిమిత్తమాత్రులే. అంటే, ఎవరో ఒక "జగన్నాటక సూత్రధారి" స్వయంగా రచించి-నిర్మించి-దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అధ్భుతమైన నాటకంలో, సకల చరాచర ప్రపంచంలోని జీవ-నిర్జీవ రాసులన్నీ తమవంతు పాత్ర పోషించాలి. ఆ ఒక్కరు ఎవరికి ఏ పాత్ర ఇస్తే, దాన్ని వారు ఆయన దర్శకత్వం మేరకే పోషించి-సాగమన్నప్పుడు సాగి-ఆగమన్నప్పుడు ఆగి, భగవంతుడిలో లీనమై పోవాల్సిందే. ఆ తర్వాత ఏంజరుగుతుందనేది మళ్లీ "పర బ్రహ్మం" కే తప్ప ఇతరులకెవ్వరికీ తెలియదు. అంత మాత్రాన ఆయన నియమించిన బ్రహ్మ కాని, శివుడు కాని, విష్ణువు కాని దేవుళ్లు కారు అని అనలేం. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, దశావతారాలని చెప్పుకునే మరే అంశావతారుడైనా, మానవుడుగా పుట్టిన తర్వాత, మానవుల కొచ్చిన కష్ట నష్టాలు వారికి కూడా రాకుండా పోలేదు. అలానే, వారి వారి అవతారాలలో, ఇతరుల కష్టాలను తీర్చకుండా వుండలేదు. శ్రీరాముడు రావణుడితో ఒంటరిగా యుద్ధం చేయలేదే! తన కంటే బలహీనులైన వానరుల సహాయం తీసుకున్నాడు కదా! తన తమ్ముడికి యుద్ధంలో ప్రాణాపాయం వచ్చినప్పుడు హనుమంతుడి సహాయం పొంద లేదా? శ్రీకృష్ణుడు నీలాపనిందలకు గురికాలేదా? చిన్న బాణం ఆయన కాలికి గుచ్చుకుని తనువు (అవతారం?) చాలించాల్సిన పరిస్థితి కలగలేదా? వారిరువురు దేవుళ్లే అయితే అలా ఎందుకు జరిగిందని ప్రశ్నించడం తగనప్పుడు భగవాన్ సత్య సాయిబాబా విషయంలోను అంతేనని ఎందుకు అనుకోకూడదు? బాబా ఎంతో మందికి ప్రాణం పోసినంత మాత్రాన, ఆయన ఇతరుల (సూపర్ స్పెషాలిటీ వైద్యుల) మీద (శ్రీరాముడు వానరుల మీద వలె) ఆధార పడకూడదని వాదించడం పొరపాటు.

దాదాపు నలభై సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో విద్యానగర్-నల్లకుంట సమీపంలోని రాం నగర్ లో వుంటున్నప్పుడు మొట్ట మొదటిసారి బాబా గురించి వినడం జరిగింది. అప్పట్లో ఉగాది పర్వదినాన సాధారణంగా బాబా హైదరాబాద్ వస్తుండేవారు. ప్రస్తుతం శివం వున్న ప్రాంతంలోనే ఆయన వచ్చినప్పుడు కోలాహలంగా ఉంటుండేది. అలా వచ్చినప్పుడు ఒకసారి పొరుగున వున్న వారితో కలిసి మా శ్రీమతి కూడా శివం వెళ్లింది. ఇక అప్పటి నుంచి బాబా గురించిన విశేషాల ప్రస్తావన అడపా దడపా మా మధ్యన వస్తున్నప్పటికీ, అప్పటికీ-ఇప్పటికీ, "డివోటీ" గా కాకపోయినా బాబా పట్ల ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల డివోటీల కంటే కూడా అధికంగా ఆరాధనా భావంతో గమనించడం అలవాటైంది. ఆ తర్వాత బాబా వచ్చినప్పుడల్లా మా శ్రీమతి శివానికి వెళ్ళి వస్తున్నప్పటికీ నేనెందుకో అలా చేయలేదు. మధ్యలో, మా కుటుంబ సభ్యులు దక్షిణ భారత దేశ యాత్రలకు వెళ్లినప్పుడొకసారి, వారిని మార్గమధ్యం దాకా పంపేందుకు పుట్టపర్తికి వెళ్లాం. అప్పుడింత హడావిడి లేకపోగా, ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాల సముదాయాలు కూడా ఇంకా రూపు దిద్దుకోలేదు. భక్తుల సంఖ్య కూడా ఇంతగా లేదు. బాబా దర్శనం బాగానే అయింది. అయినా, అంతగా ఆయన ప్రభావం మా మీద పడలేదనే చెప్పాలి.

నమ్మకం అనేది ఒక్కొక్కరి ఇష్టాయిష్టాలపై ఆధార పడి వుంటుంది. భగవంతుడిని నమ్మడం విషయంలోను అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిని ఇష్ట దేవుడుగా భావిస్తారు-అయినా ఇతరుల నమ్మకాన్ని గౌరవిస్తారు. కాకపోతే, కొందరు మరికొంత ముందుకు వెళ్లి, ఇతరుల నమ్మకాన్ని ఎద్దేవా చేస్తూ, తాము నమ్మిన దేవుడే గొప్ప అంటుంటారు. కొందరు సమస్త దేవతలను కొలిస్తే, మరి కొందరు సమస్త దేవతలను తాము నమ్మిన దేవుడిలోనే చూసుకుంటారు. ఇలాంటిది అనాదిగా సాగుతున్నా ఆచారమే. బహుశా సత్య సాయిబాబాను ఆరాధించే భక్తుల్లో చాలా మంది, ఆయనలో అందరు దేవుళ్లను చూస్తుండొచ్చు. అలానే అన్ని మతాల వారు (ఆయన భక్తుల్లో) ఆయనలో తమ తమ మతాలకు చెందిన దైవాన్నే చూస్తుండొచ్చు. ఈ నేపధ్యంలో, పుట్టపర్తికి మొదటిసారి వెళ్లి వచ్చినప్పుడు కూడా బాబాపై కలగని నమ్మకం, ఆ తర్వాత కొంతకాలానికి హైదరాబాద్ లో కొంత మేరకు కలగడానికి కారణం, అప్పట్లో జరిగిన ఒక సంఘటనే. అది యాధృఛ్చికమో-లేక-బాబా అభీష్ఠం మేరకు జరిగిందో చెప్పడం కష్టం. చిక్కడపల్లి సమీపంలోని అశోక్ నగర్ లో వుంటున్న మేమందరం, నేను పెద్దగా ఇష్టం చూపకపోయినా, ఒక ఉగాది నాడు (లేదా శ్రీరామనవమి) బాబా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా శివం వెళ్లాం. దర్శనం చేసుకుని, మండుటెండలో ఇంటి ముఖం పట్టాం. ముప్పై సంవత్సరాల కిందటి మాట ఇది. ఆటో కాని, రిక్షా కాని దొరకలేదు. శివం నుంచి నడక సాగిస్తూ ఎండ వేడిని తట్టుకుంటూ చాలా దూరం పోయాం. "బాబా నిజానికి దేవుడై తే, ఒక కారు పంపుతే ఎంత బాగుంటుంది" అని మాలో ఒకరం అన్న మరు నిమిషాన మా పక్కన ఎవరిదో కారు ఆగడం, వారంతట వారే మమ్ములను ఎక్కడకు వెళ్లాలి అని అడగడం, మా ఇంటి దాకా అందరినీ దింపి, ధన్యవాదాలు చెప్పేలోపునో వెళ్లి పోవడం (అంతర్ధానం?) యదార్థంగా జరిగింది. ఎక్కడో కొంత నమ్మకం-ఎందుకో కలిగింది.

స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి రెండో పర్యాయం ముఖ్య మంత్రిగా పనిచేస్తున్న సమయంలో-నేను ఆయన దగ్గర పౌర సంబంధాల అధికారిగా పని చేస్తున్నప్పుడు, ప్రస్తుతం బాబా కోలుకుంటున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంఖుస్థాపన జరిగింది. సరిగ్గా ఏడాది సమయంలో దాని నిర్మాణం పూర్తి చేయించి, అత్యంత ఆధునికమైన వైద్య సదుపాయాలతో అపురూపమైన ఆసుపత్రిగా దాన్ని తీర్చిదిద్దుతామని అప్పట్లో బాబా చెప్పడం, అలానే జరగడం, మానవ మాత్రులకు సాధ్యపడే విషయమా అని ప్రశ్నిస్తే, బాబా లాంటి మానవ మాత్రులకు మాత్రమే సాధ్యం అని సమాధానం చెప్పుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు, స్వర్గీయ ప్రధాని పీవీ నరసింహారావు సమక్షంలో, అనంతపురం జిల్లా ప్రజలకు తాగు నీటి సౌకర్యం కలిగించే పథకాన్ని ప్రారంభించడం మేం ప్రత్యక్షంగా చూశాం. ఆ పథకాన్ని ఆయన హామీ ఇచ్చిన సమయంలోపునే పనులు ప్రారంభించడం, పూర్తి చేయడం అపర భగీరథుడుని జ్ఞప్తికి తెచ్చే అంశం. ఆయన దేవుడా కాదా అంటే ఏం సమాధానం చెప్పాలి? మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో పనిచేస్తున్నప్పుడు, నేషనల్ డిఫెన్స్ కళాశాల నుంచి, శిక్షణా సంబంధమైన అధ్యయనానికి, పదహారు మంది అత్యున్నత సైనికాధికారుల బృందం ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చింది. ప్రభుత్వ అతిధులుగా వచ్చిన వారిని, రాష్ట్రంలోని వెనుక బడిన జిల్లాలలో పర్యటించే సందర్భంగా, వారి వెంట వుండేందుకు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ నన్ను నియమించింది. ఆ పర్యటనలో భాగంగా పుట్టపర్తి కూడా వెళ్ళాం. బాబా సమక్షంలో, ఆయనకు అతి దగ్గరగా, గంటన్నర సమయం ఆయన మాటలు వింటూ గడిపే అరుదైన అవకాశం మొదటి సారి కలిగింది. ఆయన దైవ సమానుడని నమ్మకం పెరగడానికి ఆ సందర్భంలో జరిగిన విషయాలు మరో నిదర్శనం.

నెల్లూరు నుంచి పుట్టపర్తికి నేరుగా చేరుకున్న నేషనల్ డిఫెన్స్ కాలేజీ అధ్యయన బృందానికి, మా దగ్గర నుంచి ముందస్తు సమాచారాన్ని అందుకున్న ప్రశాంతి నిలయం నిర్వాహకులు, ప్రముఖులుండడానికి ఉపయోగించే "శాంతి భవన్" లో నివాసం ఏర్పాటు చేశారు. వచ్చిన రోజు సాయంత్రమే, బాబా దర్శనం కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు మాత్రం స్వామిని దగ్గరగా దర్శించుకునే అవకాశం మినహా మరే విశేషం జరగలేదు. మర్నాడు ఉదయం దర్శనం వేళకు మమ్మల్నందరినీ స్వామి కూర్చునే కుల్వంత్ హాల్ వేదికపై కూచునే ఏర్పాటు చేశారు. డివోటీలందరి కి ప్రతి ఉదయం సాధారణంగా ఇచ్చే దర్శనం ముగిసిన తర్వాత, మమ్మల్నందరినీ స్వామి ప్రముఖులకు ఇచ్చే ఇంటర్వ్యూ గదిలోకి తీసుకెళ్లారు. అదో అద్భుతమైన అనుభూతి. అందునా, అసలు-సిసలైన డివోటీ కాని నాలాంటి వారికి, అలాంటి అవకాశం కలగడం వింతైన అనుభూతి. సుమారు గంటన్నర పాటు మాతో స్వామి ఆ గదిలో ఎన్నో విషయాలు మాకు వివరిస్తూ, మధ్యలో మమ్మల్ని ప్రశ్నిస్తూ, హింది-ఇంగ్లీష్-తెలుగు-తమిళ-కన్నడ భాషల్లో, ఎవరికి అర్థమైన భాషలో వారితో అదే భాషలో పలకరిస్తూ మమ్మల్ని ఆశ్చర్య పరిచారు. ఒకరికి చేతి గడియారం, మరొకరికి ఉంగరం, ఇంకొకరికి బంగారపు చైన్...ఇలా.. పదహారు మందిలో కొందరికి బహుమానాలను సృష్టించి ఇచ్చారు. పదహారు మందిలో ఒకరు, అంతకు కొద్ది రోజుల క్రితం ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో కర్రల సహాయంతో నడుస్తున్నారు. కుర్చీలో కూచున్న ఆయనను, స్వామి చేతులు చూపించుకుంటూ, లేచి రమ్మనగానే, కర్రల సహాయం లేకుండా అలా చేయడం ఆశ్చర్యం కలిగించింది. చివరికి మేమెళ్ళి పోవాల్సిన సమయం వచ్చినప్పుడు, బాబా నాకేమీ ఇవ్వలేదే అని మనసులో అనుకుంటుండగా నన్ను పిల్చారు. విబూది పొట్లాలున్న సంచిని నన్నొక చేత్తో పట్టుకొమ్మని, తానొక చేత్తో పట్టుకుని, ఆర్మీ అధికారులందరి కి పంచారు. నేను అదంతా గమనించడం తప్ప ఏం చేయాలో తోచలేదు. ఆఖరుగా, నా భుజం తట్టి, జేబు నిండా స్వయంగా బాబానే ఆయన చేతికొచ్చినన్ని విబూది పొట్లాలు కుక్కి "సంతోషమా?" అని అడిగినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించడం కష్టం. అసలు జరిగిన అద్భుతం ఇంకోటుంది. అప్పటికి కొద్ది నెలల్లో పదవీ విరమణ చేయాల్సిన ఆ బృందం నాయకుడు (కమాండెంటు) వెళ్ళ బోతూ, చేసిన విజ్ఞప్తికి సమాధానంగా, బాబా ఆయనకు మరో రెండు సంవత్సరాలు పదవి పొడిగించబడుతుందని చెప్పారు. అది నమ్మ శక్యం కాని విషయం. మిలిటరీ సర్వీసుల్లో పదవీ విరమణ వయసును మించి పొడిగించడం జరగదు. అయితే అదే జరిగింది కొన్నాళ్లకు. ఆర్మీలో పని చేసేవారి పదవీ విరమణ వయస్సునే పెంచింది ప్రభుత్వం వేతన సంఘం సిఫార్సుల నేపధ్యంలో. యాదృచ్చికం కావచ్చు-లేదా-బాబా ఆశీర్వాదం నెరవేరడానికి కమాండెంటుతో సహా పలువురికి లాభం చేకూరి వుండవచ్చు!

ఇలా రాసుకుంటూ పోతే ఇతరుల విషయం సంగతి ఎలా వున్నా స్వయంగా అనుభవంలోకొచ్చినవే చాలా వున్నాయి. పుట్టపర్తికి వెళ్ళినప్పుడల్లా అలాంటి సంఘటనలేవో జరిగేవి. ఇ.ఎం.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల సంస్థలో పని చేస్తున్నప్పుడు, పుట్టపర్తిలో సేవలను ప్రారంభించడానికి వెళ్లాం. బాబా చేతుల మీదుగా, తొలుత లాంఛనంగా 108 సేవలను ప్రారంభించాలని మా కోరిక. ట్రస్టు బోర్డు సభ్యుల, లోగడ మర్రి చెన్నారెడ్డి దగ్గర ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసి బాబా దగ్గరుంటున్న పరమహంస గారి సహాయంతో మా కోరిక నెరవేరింది. ఉదయం రెండు 108 అంబులెన్సులను ప్రశాంతి నిలయం ఆవరణలో, కుల్వంత్ హాల్ సమీపంలో, బాబాకెదురుగా నిలపడానికి అనుమతి లభించింది. మా సీ.ఇ.ఓ వెంకట్ కు, మరో ఇద్దరు సహచరులకు, నాకు, బాబాకు అత్యంత సమీపంలో కూచునే అవకాశం ఆ ఉదయం-సాయంత్రం లభించింది. ఉదయం వెళ్లినప్పుడు, తాను కూర్చున్న స్థలం నుంచే బాబా చేయి వూపుతూ అంబులెన్సు సేవలను ప్రారంభించారు. అంతకు కొన్ని నిమిషాల ముందు మమ్మల్ని తన దగ్గరకు పిలిచి ఆశీర్వదించి, వెంకట్ మెడలో బంగారపు గొలుసు సృష్టించి వేశారు. మాతో పాటు ఆ ఉదయం సమీపం నుంచి బాబాను దర్శించుకున్న వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారి, 108 సేవలు రాష్ట్రంలో రావడానికి కారకుల్లో ఒకరైన ఐ వి సుబ్బారావు గారు కూడా వున్నారు.

సత్య సాయిబాబా మానవ రూపంలో మన మధ్య నున్న దైవం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ దైవాన్ని మన మధ్యన ఆ భగవంతుడు వుంచినంత కాలం అందరికీ అంతా మంచే జరుగుతుంది. ఆ తర్వాత ఆ భగవంతుడు ఎలా జరగాలనుకుంటాడో అలానే జరుగుతుంది. ఇదే కదా భగవత్ అవతార రహస్యం! పోనీ మనకు అర్థమైనంత మేరకు అనుకుందాం!

7 comments:

  1. పది మంది నమ్మేదే నిజం అనుకోలేము. ఇంత మంది బాబాలని నమ్ముతున్నారు కాబట్టి బాబాలు దేవుళ్లని అనుకోవడం అశాస్త్రీయం. పల్లెటూర్లలో దేవాలయాల దగ్గర వేప మండలతో బాదుకుని డాన్స్ చెయ్యడం, జంతు బలులు ఇవ్వడం లాంటి నమ్మకాలని కూడా నమ్ముతారు. అలాగని టౌన్‌లో ఉండే మనం ఆ నమ్మకాలని నమ్మగలమా? పది మంది ఏది నమ్ముతున్నారు అని కాకుండా ఏది శాస్త్రీయం అని ఆలోచించాలి.

    ReplyDelete
  2. అయ్యా ప్రవీణూ, తమ ప్రావీణ్యం విరజిమ్మడానికొచ్చేసేరా! వనం గారు తమ స్వీయానుభవం గురించి రాస్తే, ఏవిటయ్యా నీ కామెంటు, తలా, తోకా లేకుండా.

    ReplyDelete
  3. కాలక్రమేణ మీలో వచ్చిన మార్పు, మీకు కలిగిన అనుభవాలు ఆసక్తికరంగా వున్నాయి. నాకు అలాంటి అనుభవాలు కలగలేదే అని అసంతృప్తిగా కూడా వుంది.

    మర్రి చెన్నారెడ్డి గారి ప్రియశిష్యులైన మీరు, అన్నా హజారే చేపట్టిన జనలోక్‌పాల్ మీద ఓ టపా రాస్తే చూడాలని వుంది. ;)

    ReplyDelete
  4. ప్రవీణ్ గారు,
    ఎవరి అభిప్రాయాలు (నమ్మకాల వలెనె) వారివి. ఒకే రకమైన అభిప్రాయం అందరం వెల్లడించడం మంచిదికాదని మీరు కూడా నమ్ముతారనుకుంటాను. ఇకపోతే..ఒకటి రెండు విషయాలు. "జగన్నాటక సూత్రధారి" స్వయంగా రచించి-నిర్మించి-దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అధ్భుతమైన నాటకంలో, సకల చరాచర ప్రపంచంలోని జీవ-నిర్జీవ రాసులన్నీ తమవంతు పాత్ర పోషించాలని అన్నాను కదా! కాదా మరి? నిశితంగా పరిశీలిస్తే, కార్ల్ మార్క్స్ నిర్థారితవాద సిద్ధాంతంలో ఇలాంటి అంశాలే కనిపిస్తాయి. ఆయన కలలు కన్న కార్మిక రాజ్య స్థాపన పూర్వ రంగంలో "నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థ"కు వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాడుతుందని, దరిమిలా విజయం సాధిస్తుందనీ-ముందున్న వ్యవస్థ కూలిపోతుందనీ, శ్రామికవర్గ నియంతృత్వం స్థాపించబడుతుందనీ, కుల-మత-వర్గ-పేద-ధనిక తేడాలు సమసిపోతాయని మార్క్స్ జోస్యం చెప్పాడు. హిందూత్వ కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, జరిగినదానిని (భూతకాలం) విశ్లేషించి, జరుగుతున్నదానిని (వర్తమానకాలం) వ్యతిరేకించి, జరగాల్సినదాన్ని (భవిష్యత్ కాలం) ముందుగానే నిర్ణయించాడు. తన సిద్ధాంత ధోరణైన గతితార్కిక భౌతిక వాదాన్ని "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్" అని పిలిచాడు. ఒకరకమైన "కర్త, కర్మ, క్రియ" అనొచ్చేమో. ఈ సిద్ధాంత సృష్టికర్త కార్ల్ మార్క్స్, వేళ్లూనుకున్న వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతుందని భావించిన వర్గపోరాటంలో, ఎవరి పాత్ర ఏమిటో ఆయనే నిర్దారించాడు. పాత్రను పోషించే విధానం కూడా ఆయనే వివరించాడు. కార్మిక-కర్షక రాజ్య స్థాపన తదనంతర పరిణామాలెలా వుండాలో-వుండబోతాయో కూడా ఆయనే నిర్ణయించాడు. ఆరంభం-అంతం అంతా కర్మ సిద్ధాంతంలో మాదిరిగానే, నిర్ణయించిన విధంగానే జరుగుతుందని తన సిద్ధాంతంలో చెప్పాడు. ఆయన చెప్పినట్లే చాలావరకు జరిగిందికూడా. చూసారా! మనం నమ్ముతున్న కర్మ సిద్ధాంతానికి మార్క్స్ చెప్పిన దానికి ఎంత పోలికో!
    మార్క్స్ ప్రవచనాలకు, తదనుగుణంగా సంభవించిన సోవియట్ రష్యా- చైనా విప్లవానికి, శ్రామిక రాజ్య స్థాపన జరగడానికి వేలాది సంవత్సరాల పూర్వమే, వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రచించాడు. వాల్మీకి రచించిన రామాయణం సృష్టికర్తైన బ్రహ్మ ప్రేరణతోనే జరిగింది-అంటే జగన్నాటక సూత్రధారి అనుమతితోనే కదా. రామాయణంలోని పాత్రలను-చేయబోయే పనులను ముందుగానే యోగదృష్టితో కనిపెట్టాడు వాల్మీకి. శ్రీరామచంద్రమూర్తిని దైవంగా, మహావిష్ణువు అంశగా, జరగబోయే దాన్ని వివరంగా-రామాయణ గాధగా లోకానికి తెలియచెప్పాడు. శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలో జన్మించి, దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసేందుకు అవతరించాడని తెలియచేసేదే రామాయణ కథ. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఆప్తుడిగా-భక్తుడిగా-కాపలాదారుడిగా వుండే వ్యక్తి దైవానుగ్రహానికి గురై, శ్రీరాముడికి శత్రువుగా-రావణాసురుడనే రాక్షసుడిగా పుట్టబోతున్నాడని ముందే ఊహించి రాశాడు వాల్మీకి.
    మార్క్స్ గతితార్కిక-నిర్ధారిత సిద్ధాంతంలో పేర్లు లేకపోయినా, రష్యా-చైనాలో జరిగిన విప్లవాలకు నాయకత్వం వహించిన లెనిన్, మావోలు మార్క్స్ పరిభాషలోని శ్రీరామచంద్రుడి లాంటి వారే. రష్యా నిరంకుశ రాజు జార్ చక్రవర్తి, చైనా చాంగ్-కై-షెక్ లు రావణాసురుడిలాంటి రాక్షసులు. మార్క్స్ పరిభాషలోని నిరంకుశ-భూస్వామ్య-ధన స్వామ్య వ్యవస్థకు అధినేతైన మహా బలవంతుడు-రాక్షసరాజు రావణాసురుడు, "శ్రామిక వర్గం" లాంటి బలహీన శక్తులైన నర వానరుల కూటమి ఉమ్మడి పోరాటంలో ఓటమి పాలయ్యాడు. కూటమిని విజయపథంలో నడిపించింది నాయకత్వ లక్షణాలున్న యుద్ధ కోవిదుడు శ్రీరామచంద్రుడు. ఆయనకు తోడ్పడింది తమ్ముడు లక్ష్మణుడు, ఆచార్య లక్షణాలున్న హనుమంతుడిని ఏంగెల్స్ తో పోల్చవచ్చు. మార్క్స్ పరిభాషలో చెప్పుకోవాలంటే: మావో, లెనిన్, చౌ-ఎన్-లై, స్టాలిన్ కోవకు చెందినవారు. మార్క్స్ చెప్పిన "యాంటీ థీసిస్‌, థీసిస్‌, సింథసిస్" రామ రావణ యుద్ధంలోనూ అన్వయించుకోవచ్చు. మార్క్స్ కోరుకున్న "శ్రామిక-కార్మిక-కర్షక" రాజ్యమే రావణ వధానంతరం ఏర్పడిన "రామ రాజ్యం". కాకపోతే మార్క్స్ చెప్పడానికి వేలాది సంవత్సరాల క్రితమే వాల్మీకి చెప్పాడు.
    రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. బహుశా...భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆ కోవకు చెందిన వారిలో అగ్రగణ్యుడనాలేమో!

    ReplyDelete
  5. One side of Sai Baba has come out in the article of my friend Jwala. that is is nice. Objectivity requires all round study. There are other aspects of Sai Baba, exposed with evidence by Abraham Kovoor, challenged by scientist vice chancellor of Bangalore University Narasimhaiah, expert abroad Mr Preet Bradey, and so on. There are books written with first hand experince of devotees who were terrified.Mr Premanand extensively dealt with Sai Baba affairs in his magnum opus Murders in Sai Baba ashram. N T Ramarao ordered for enquiry and arrest of the head of Ashram.Any how great miracle cure claimer and divine power poser had to depend upon doctors for scientific treatment which should be eye opener for devotees.
    Innaiah Narisetti
    innaiah@gmail.com

    ReplyDelete
  6. Thank You Innaiah Garu. I agree with you that Baba was challenged and he did neither acknowledge the challenge nor accepted the challenge. Of-course we had people like RK Karanjia also who narrated their own experience. My approach in my article is "Reporting what I personally saw-rather experienced". I believe Valmiki as much as I believe Karl Marx. "karma siddhanta and Theory of Determinism" I try to compare. "Anti Thesis, Thesis and Synthesis" of Karl Marx is Hindu Karma siddhanta...all that what happened, happening and would happen is pre-determined. Ravana to be compared with a Czar or a Chaing-kai-Shek and Rama with Lenin and Mao. The proletariat who supported Lenin are to be equated with Vanaras (both being the weakest) who stood with Rama. Whatever it is HUMAN VALUES are important. If even for a moment Baba exhibited that value either in the shape of a Drinking Water Scheme or a Super Specialty Hospital, however selfish it could have been, it symbolizes human value to me. Well, even now I am not a firm believer of all that Baba did and may do in future. Regards, Jwala

    ReplyDelete
  7. http://media.radiosai.org/www/Rama_Navami_Special_Video.html

    ReplyDelete