ఆంధ్ర ప్రదేశ్ లో...పసందైన "అపనమ్మకం" ఆయుధం
వనం జ్వాలా నరసింహారావు
ఇటీవలి కాలంలో, "అపనమ్మకం" అనే ఆయుధం అలవోకగా వాడకంలో కొచ్చింది. శత్రువును దెబ్బ తీయడానికి అంత కంటే సులువైన ఆయుధం మరొకటి లేదనే భావన అందరి లోను, ప్రత్యేకించి రాజకీయ నాయకులలోను బలంగా నాటుకుని పోయింది. అకార క్రమంలో అగ్రభాగాన వున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఆయుధాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఆది మానవుడు చేతికి దొరికిన దాన్నే తనకు రక్షణగా ఉపయోగించుకుంటే, పాత రాతి యుగం నుంచి కొత్త రాతి యుగానికి మారడంతో, అలా రక్షణకు వాడిన వాటినే, ఇతరులపై దాడికి ఉపయోగించుకో సాగారు. మరి కొంతకాలం గడిచాక, వాటినే పదునైన ఆయుధాలుగా మలచుకోవడం మొదలైంది. ఇలా ఆరంభమైన ఆయుధాల వాడకం, పరిణామ క్రమంలో, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందడంతో, తుపాకులుగాను-ఫిరంగులగాను, దరిమిలా రసాయన-అణ్వాయుధాల వాడకం వరకూ పోయింది. ఆ తర్వాత ఆంత్రాక్స్...అలాంటి మరి కొన్ని మాధవ మేధస్సులోంచి బయటకొచ్చాయి.
ఒక వ్యక్తి మరో వ్యక్తి నుంచి తన రక్షణకోసం-ఎదుటివారిని దెబ్బతీయడానికి ఆది మానవుల కాలం నుంచి మొదలైన ఆయుధాల వాడకం, నాగరికత పెరిగే కొద్దీ, దేశ దేశాల మధ్య యుద్ధాలకు దారితీసే దాకా పోయింది. ఇవన్నీ ఒక వైపు ఇలా కొన సాగుతూంటే, ఆధిపత్య పోరులో భాగంగా, అధికారం కొరకు, వ్యక్తుల మధ్య పోరాటం మొదలైంది. ఆ పోరాటానికి వాడే ఆయుధాలు, వ్యూహాత్మకమైన ఆయుధాలు కా సాగాయి. వాటి రూపకర్తలు ప్రజాస్వామ్యం ముసుగులో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న రాజకీయ నాయకులు. మొదట్లో ఆ వ్యూహాలు, ప్రజలకు తామేం మంచి చేయదల్చు కున్నామో తెలియచేసే "వాగ్దానాలు" మాత్రమే. అలా చెప్పే వారిలో నిజాయితీ ప్రతి బింబించేది మొదట్లో. క్రమేపీ, చేస్తామని మభ్య పెట్టే వాగ్దానాలు మొదలయ్యాయి. సమాంతరంగా, ఎదుటి వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు కూడా మొదలయ్యాయి. చాలా కాలం వరకు కొంతలో కొంత నిజాయితీగానే, ఒకరిపై మరొకరు ప్రచారాలు చేసుకునే వారు. అవన్నీ పనికి రాని రోజులొచ్చాయిప్పుడు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, వారి నుంచి పాఠాలు నేర్చుకుంటూ-వారినే ఆదర్శంగా తీసుకుంటున్న అనేక మంది, ఎదుటి వారిని దెబ్బ తీయడానికి వాడుకుంటున్న అతి పదునైన ఆయుధం "అప నమ్మకం". తన ప్రత్యర్థి విషయంలో ఎంత ఎక్కువ అపనమ్మకం ప్రజల్లో కలిగించగలిగితే అంత భారీగా విజయం తమ సొంతం చేసుకోవచ్చనే భావన మొదలైంది. ఈ అంటు వ్యాధి అన్ని రంగాల్లోకి పాక సాగింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ఆంధ్ర ప్రదేశ్ లో గత కొంతకాలం నుంచి, సాగుతున్న మాటల యుద్ధమే.
పాతిక-ముప్పై సంవత్సరాల క్రితం, సినిమా హీరో నందమూరి తారక రామారావు, తెలుగు దేశం పార్టీని స్థాపించి, తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీదుల్లో అవమానం పాలైందనీ-ఆ అవమానానికి ప్రతీకారంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోను-దేశంలోను ఓడించాలని ఇచ్చిన పిలుపుకు తొలుత ఆయన స్వరాష్ట్రంలోను, అనంతరం దేశ వ్యాప్తంగానూ స్పందించిన ఓటర్లు, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపారు. అప్రతిహతంగా, స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి అటు కేంద్రంలోను, ఇటు పలు (ఆంధ్ర ప్రదేశ్ తో సహా) రాష్ట్రాలలోను, అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగలడం గత శతాబ్ది డబ్బై దశకంలో మొదలైంది. రాష్ట్రాలలో ఆ ప్రక్రియ కొంత ముందుగా మొదలైనప్పటికీ, కేంద్రంలో తొలి కాంగ్రెసే తర ప్రభుత్వం అధికారం చేపట్టడానికి 1977 వరకు ఆగవలసి వచ్చింది. 1971 లో కాంగ్రెస్ పార్టీని విజయ పధంలో నడిపించిన ఇందిరా గాంధిని ఓడించడానికి, అప్పటి రాజకీయ పార్టీలు, ఎదురు దెబ్బ తీశారే తప్ప, వెన్ను పోటు రాజకీయాలను కాని, అవాస్తవాలు ప్రచారం చేయడం కాని చేయ లేదు. ఆమె చేసిన "తప్పు" నే తమ ఎన్నికల ప్రధానాంశంగా ఉపయోగించుకున్నారు. ఉవ్వెత్తున పెల్లుబుకిన "అవినీతి వ్యతిరేక ఉద్యమం" లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో, ఇంతై-ఇంతింతై-వటుడింతై అన్న చందాన, ఆబాల గోపాలాన్ని అందులో పాల్గొనే లా చేసింది. వారూ-వీరూ అనే తేడా లేకుండా, ఇందిరా గాంధి పార్టీకి చెందిన కొందరు నాయకులతో సహా, ఎందరో, ఆ ఉద్యమానికి మద్దతిచ్చి ఇందిరను ఓడించారు. ఆమె చేసిన తప్పులను మాత్రమే ఎంచి చూపారు కాని, ఆమె చేయని-ఆమెకు సంబంధం లేని విషయాలపై, ప్రజల్లో ఆమెపై "అప నమ్మకం" కలిగే ప్రయత్నం బహుశా ఎవరూ చేయలేదు.
1977 ఎన్నికలలో, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రేసేతర ప్రతిపక్షాల నాయకులు ఉపయోగించిన మరో బ్రహ్మాస్త్రం "నియంతృత్వమా-లేక-ప్రజాస్వామ్యమా" కోరుకొమ్మని ఓటర్లను అడగడం. ఎమర్జెన్సీకి ముందు-ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు, కారణాలు సహేతుకమైనా-కాక పోయినా, ఇందిరా గాంధీలో నియంతృత్వ పోకడలు చోటు చేసుకున్న విషయం, ఆమెకు అతి సన్నిహితంగా మెలిగిన వారు సహితం ధృవీకరించిన మాట వాస్తవం. ప్రతిపక్షాల పిలుపుకు స్పందించిన ఓటర్లు, "ప్రజాస్వామ్యానికి" ఓటే సారు. జనతా పార్టీని గెలిపించారు. రెండేళ్ల లోనే ప్రజాస్వామ్యానికి సరైన సారధులు "జనతా పార్టీ నాయకులు" కానే కాదని, కాలేరని నిరూపించడానికి ఇందిరకు అవకాశం దక్కింది. తనపై నమ్మకం పెట్టుకునే దిశగా దరిమిలా వచ్చిన మధ్యంతర ఎన్నికలలో వాగ్దానాలు చేసిందే కాని, ప్రత్యర్థులపై అపనమ్మకం అస్త్రాన్ని వాడుకోలేదు. జనతా పార్టీ అప్పట్లో సుస్థిర ప్రభుత్వాన్ని అందించడంలో విఫలమయిందని ఓటర్లకు తెలియచేసే ప్రయత్నం మాత్రం చేసింది ఇందిరా గాంధి.
ఇందిరా గాంధీనైతే ఓడించ గలిగారు కాని, నిల దొక్కుకోలేక పోయారు అలనాటి కాంగ్రేసేతర రాజకీయ నాయకులు. ఎన్నికలొచ్చాయి. ఇందిరా గాంధి వ్యూహాత్మకంగా, "సుస్థిరతా? అస్థిరతా" అన్న నినాదం లేవనెత్తిందే కాని, "అప నమ్మకం" ఆయుధాన్ని వాడ లేదు. శత్రువును తన బలంతోను, వారి బలహీనతల తోను, గెలిచిందే తప్ప, వాళ్లకు అపవాదు అంటగట్టే విధంగా ప్రచారం చేయలేదు. మధ్యలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇందిరా కాంగ్రెస్ తాను చేయబోయే పనుల ప్రాతిపదికగానే గెలిచింది. అలాగే, అయిదేళ్ల తర్వాత, అదే మోతాదు ప్రభంజనంలో ఆమె పార్టీని ఓడించిన ఎన్ టీ రామారావు, ఇందిరా కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బ తీశాడే కాని ఆమెపై ప్రజల్లో "అప నమ్మకం" ప్రచారం చేయలేదు. తన వ్యతిరేకులతో ఆమె జత కట్టిందని అసత్య ప్రచారాలు చేయలేదు. "మాచ్ ఫిక్సింగ్" అన్న పదాలు ఆమెకు వ్యతిరేకంగా వాడిన దాఖలాలు లేవు. బహుశా ఇదే పద్ధతి, మన దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఇటీవలి కాలం వరకూ అవలంబిస్తూనే వున్నాయి. కాని కాలం మారింది. ఎన్నికల ప్రణాళికలో వాగ్దానాల కన్నా, తప్పుడు వాగ్దానాల కన్నా పదునైంది, ప్రత్యర్థిని కించపరచడం-అసత్యాన్ని ప్రచారం చేయడం-ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల వారిపై ఓటర్లలో "అప నమ్మకం" కలగ చేయడం అని గ్రహించాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో ఎవరు కూడా ఒకరికి మరొకరు తీసిపోరనే చెప్పాలి.
ఇటీవల తరచుగా వినిపిస్తున్న పదం "మాచ్ ఫిక్సింగ్". క్రికెట్ ఆటలో గెలిచిన జట్టు గెలుపుకు ప్లేయర్ల-కోచ్ ల-కెప్టెన్ల ప్రతిభ కాదని, ఓడిన జట్టులోని కొందరితో రహస్యంగా చేసుకున్న ఒప్పందం వల్లనే అని, ప్రచారాలు మొదలయ్యాయి. దాన్నే "మాచ్ ఫిక్సింగ్" అని ముద్దుగా పిలువ సాగారు. అదొక అ నైతిక ఒప్పందంగా ముద్ర పడింది. నిజానికి అలా జరిగుంటే అది అ నైతికమే. ఒకటి రెండు సందర్భాలలో అలా జరిగుండొచ్చు కూడా. కాకపోతే, ఎప్పుడు ఏ మాచ్ ఏ టీం గెలిచినా, దానికి ఏదో రకమైన "మాచ్ ఫిక్సింగ్" కారణం అనే "అప నమ్మకం" ప్రచారంలోకొచ్చింది. ఆ తరహా "అప నమ్మకం" ఎంత బలంగా క్రికెట్ క్రీడాభిమానుల్లో నాటుకు పోయిందంటే, గెలిచిన ప్రతి టీం విజయ రహస్యం "మాచ్ ఫిక్సింగే మో!" అన్నంత "నమ్మకం" గా భావించడం మొదలైంది. ఇక రాజకీయ నాయకులు ఆ ఆయుధాన్ని వాడకంలోకి తెచ్చారు. దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది. మీడియా-రాజకీయ నాయకుల మధ్య "మాచ్ ఫిక్సింగ్" స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం.
ఉదాహరణలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. శాసన సభలో వై ఎస్ ఆర్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్-తెలుగు దేశం పార్టీల మధ్య "మాచ్ ఫిక్సింగ్". అంటే ఆ రెండు పార్టీల మీద ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి జగన్ వర్గీయులు వాడిన ఆయుధం. అలానే కాంగ్రెస్-జగన్ వర్గాల మధ్య "మాచ్ ఫిక్సింగ్" ఆరోపణను తెలుగు దేశం పార్టీ కొంత కాలం ప్రచారం చేసి, ప్రస్తుతం జగన్-బిజెపి ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో గళం కలిపింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆ మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో, ప్రతి పార్టీ నాయకులు, ఇతర రెండింటి మధ్య "మాచ్ ఫిక్సింగ్" అన్న ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. సోనియా-జగన్ ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" గురించి బిజెపి ప్రచారం చేసిన సందర్భం కూడా వుంది. తామేంటో, తమ వ్యూహం ఏంటో, గెలుస్తే తమ పంథా ఎలా వుండబోతుందో, ప్రచారం తెలియచేయాల్సిన రాజకీయ పార్టీలు, దాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థుల పై ఓటర్లలో అప నమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం. చంద్రబాబు నాయుడు బాబ్లీ విషయంలో చేసిన ఉద్యమాన్ని కూడా అప నమ్మకం కోణంలోనే ఆయన వ్యతిరేకులు వాడుకున్నారు తప్ప, ఆయన సరళిలోని తప్పులను ఎంచి చూప లేకపోయారు. ఇటీవలి కాలంలో రెండు ప్రధాన దిన పత్రికల ఎడిట్ పేజీలలో, ఆ పత్రిక యాజమాన్య అధినేతల విషయంలో, వస్తున్న వ్యాస పరంపరలు, వ్యతిరేకుల మీద "అప నమ్మకం" కలిగించేలా వున్నవే తప్ప, వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న తపన కనిపించడం లేదు.
ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమై పోలేదు. అన్ని రంగాలకూ వ్యాపించ సాగింది ఒక అంటు జబ్బులా. దీన్ని అరికట్ట లేక పోతే, ఇది అవినీతి కంటే వేయి రెట్ల ప్రమాదం కలిగించే స్థాయికి పోతుంది. మరో అన్నా హజారే లాంటి వారు ఉద్యమించాల్సిన అవసరం కలిగినా ఆశ్చర్య పోనక్కర లేదు. తస్మాత్ జాగ్రత్త!
హ హ హ, ఈ అపనమ్మకం జబ్బు మనకు మొదటినుంచి ఉన్నదే, ప్రతివాడికి పక్కవాడిమీద అనుమానమే, ఎక్కడ బాగుపడిపోతున్నాడో అని :)
ReplyDelete