ఎమ్మెల్యేల పై అనర్హత వేటుకు సమయం-సందర్భం?
(సూర్య దిన పత్రిక:23-04-2011)
వనం జ్వాలా నరసింహారావు
పక్కా "అంచెలంచల అధికార వ్యూహం" తో జగన్ వర్గంగా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పై, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద, అనర్హత వేటు వేసేందుకు రంగం తయారవుతోంది. దీనికంటే ముందే, నాయకుల ఫిర్యాదు మేరకు రాజీనామా చేసిన పోచారం శ్రీనివాస రెడ్డితో సహా, ముగ్గురు తెలుగు దేశం శాసన సభ సభ్యులపై కూడా వేటు వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరో పక్క కాంగ్రెస్ బాటలోనే, ఆ పార్టీలో విలీనం కానున్న ప్రజారాజ్యం పార్టీ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తోంది. ఆ పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డి, కాటసాని రాం రెడ్డిలపై అనర్హత పిటిషన్ సభాపతికి ఇచ్చేందుకు పీ ఆర్పీ నాయకులు సిద్ధమవుతున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నియమ నిబంధనలున్నాయి. కాకపోతే, అవి ఎంత సక్రమంగా అమలుకు నోచుకుంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ, సత్ సాంప్రదాయాలే మన్నా నెలకొన్నాయంటే, అలా ఏ రాష్ట్రంలోను జరిగిన దాఖలాలు లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే, రాజ్యాంగ నియమ నిబంధనలకు అదనంగా, చిరకాలం గుర్తుంచుకునే సంప్రదాయాలు నెలకొనడం తప్పని సరి. ఏ పార్టీ అధికారంలో వున్నా, వారి వారి రాజకీయ అనుకూలతలు-అననుకూలతల ఆధారంగా, ఆ పార్టీ టికెట్ పై చట్ట సభకు ఎన్నికై సభాపతి పీఠాన్ని అధిష్టించిన వ్యక్తి, తన మాతృ సంస్థ ఆలోచనా ధోరణి ప్రకారమే నడచుకుంటున్న అపవాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పటికీ సమయం మించి పోలేదు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ (ఉప) సభాపతిగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్, ఈ విషయంలో, యావత్ భారత దేశం అభినందించే రీతిలో, రాజ్యాంగ నిబంధనలకు లోబడిన ఒక సత్ సంప్రదాయం ఆవిర్భావానికి చొరవ తీసుకుంటే మంచిది.
చట్ట సభలకు ఎన్నికైన వారు, ఏ ఏ సందర్భాలలో, సభ్యులుగా కొనసాగడానికి అనర్హులవుతారనే విషయం, రాజ్యాంగంలో స్పష్టంగా వివరించ బడింది. సర్వ సాధారణంగా పేర్కొనే విషయాలకు అదనంగా, పదవ షెడ్యూలులో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని కూడా వివరించబడింది. రాజీవ్ గాంధి ప్రధానిగా వున్నప్పుడు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1985 లో అమల్లోకొచ్చింది. నాలుగు వందలకు పైగా లోక్ సభ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, ముందు జాగ్రత్తగా రాజ్యాంగ సవరణ చేసిందన్న ప్రచారం కూడా జరిగిందప్పుడు. ఒక రాజకీయ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, స్వచ్చందంగా, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు, సహజంగా శాసన సభ సభ్యత్వం కూడా కోల్పోతారు. ఒక పార్టీ సభ్యుడుగా చట్ట సభకు ఎన్నికైన వ్యక్తి, ఎన్నికల అనంతరం, మరో పార్టీలో చేరి, తన పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా సభ్యత్వానికి అనర్హులవుతారు. సభాపతిగా-ఉప సభాపతిగా, లేదా శాసన మండలి అధ్యక్షుడుగా-ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వారికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ, అనర్హత వేటు పడకుండా చట్టం మినహాయించింది.
అదే విధంగా, టికెట్ ఇచ్చిన పార్టీ అధికారికంగా జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా, శాసన సభలో జరిగే ఓటింగులో పాల్గొనక పోయినా-పాల్గొని వ్యతిరేకంగా ఓటేసినా, సభ్యత్వానికి అనర్హుడవుతారు. కాకపోతే, అలా చేయడానికి పార్టీ నుంచి ముందస్తుగా అనుమతి పొందినా, లేక, అలా చేసిన పదిహేను రోజుల లోపు అధికారికంగా పార్టీ నాయకత్వం ఆ వ్యక్తిని మన్నించినా, అర్హతకు గురి కాకుండే అవకాశం వుంది. చట్టం మరో చిన్న వెసులుబాటు కూడా కలిగించింది. ఏదైనా రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన శాసన (లోక్ సభ) సభ సభ్యులలో, మూడింట ఒక వంతు మంది, మూకుమ్మడిగా పార్టీ మారితే-వేరే పార్టీలో విలీనమైతే, ఆ చర్యకు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపు వుంది. అయితే, రాజ్యాంగ 91 వ సవరణ ఈ నిబంధనను మార్చి, మూడింట రెండు వంతుల సంఖ్య వుంటేనే, విలీనమైనట్లవుతుందని చెప్పింది. అలానే ఒక రాజకీయ పార్టీలో చీలిక వచ్చినప్పుడు, పార్టీ మొత్తం మరో పార్టీలో చేరితే కూడా ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు వుంటుంది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన కొందరు శాసన సభ సభ్యులు విలీనానికి అంగీకరించకుండా వేరే పార్టీ పెట్టుకున్నా, ఒక ప్రత్యేకమైన గ్రూపుగా ఏర్పడినా, మినహాయింపుంటుంది.
అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా (ఉప) సభాపతి దే. పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి, సభాపతి తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా, న్యాయ స్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్ నిబంధనలను అమలు పరిచే విషయంలో, తదనుగుణమైన విధి-విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి వుంది. రాజకీయ పార్టీలు తమ-తమ పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, కొత్తగా చేరిన వారి వివరాలు, పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలు, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిన వారి వివరాలు, సంబంధిత అంశాలకు చెందిన ఇతర వివరాలను పార్టీలు నమోదు చేసుకోమని అడిగే అధికారం వుంది సభాపతికి. సభ్యుల అర్హత-అనర్హతలు నిర్ధారించ వలసిన సమయంలో అవి ఉపయోగ పడే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులు, యాంత్రికంగా, తమ సభ్యత్వాన్ని కోల్పోరు. వారిని పార్టీ నుంచి తొలగించ వచ్చు కానీ, చట్ట సభల సభ్యత్వాన్నించి తొలగించడానికి, పార్టీ నాయకత్వం నియమించిన ప్రతినిధి, సంబంధిత సభ్యుల అనర్హత విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకుని పోయిన తదుపరి, తగు విచారణ జరిగిన చేసిన తర్వాతే, సభాపతి తగు నిర్ణయం తీసుకుంటారు.
సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయ స్థానాలకు లేకపోయినా, చట్టంలో పొందు పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారం, రాజ్యాంగ పరంగా, న్యాయ మూర్తులకు వుంది. తాను ఎన్నికైన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి, స్వచ్చందంగా పార్టీకి రాజీనామా చేస్తే, సభ్యత్వానికి అనర్హుడవుతాడని చట్టం చెప్పిన దాన్ని విస్తరిస్తూ, సరి కొత్త నిర్వచనం చెప్పింది అత్యున్నత న్యాయ స్థానం. లాంఛనంగా రాజీనామా చేయకుండా, తనకు టికెట్ ఇచ్చిన పార్టీ వ్యతిరేక కార్య కలాపాల్లో పాల్గొనే రీతిలో, స్పష్టమైన వైఖరిలో ప్రవర్తించే చట్ట సభ సభ్యుల విషయంలో కూడా, ఫిరాయింపుల నిబంధనలు వర్తించుతాయని, 1994 లో, సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అదే విధంగా, స్వతంత్రుడుగా గెలిచి, ఏదైనా పార్టీలో చేరిన వ్యక్తి కూడా, ఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తారని చెప్పింది కోర్టు. పార్టీ ఫిరాయింపుల నియమ నిబంధనలను ఉల్లంఘించే సభ్యుల వివరాలు, సభాపతి దృష్టికి తీసుకుని రానంత వరకు, అర్హత-అనర్హతలతో నిమిత్తం లేకుండా, చట్ట సభలలో నిరాటంకంగా సభ్యులుగా కొనసాగడానికి, ఎన్ని రకాల అవకాశాలుండాలో అన్ని రకాల అవకాశాలను చట్టం కలిగించింది. రాజకీయ పార్టీల "అధి నాయకులు" తమకు అనుకూలమని భావించి, సభాపతికి ఫిర్యాదు చేయనంత కాలం, ఫిరాయింపుల చట్టం కాగితాలకే పరిమితం. అలా కాకుండా కొన్ని సత్ సాంప్రదాయాలకు ఎవరో ఒక రాష్ట్రానికి చెందిన శాసన సభ సభాపతి చొరవ తీసుకోవాలి.
తాత్కాలిక-శాశ్వత, ఆర్థిక-లేదా-పదవి లాభం కొరకు, పార్టీ ఫిరాయింపులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకోవడం చాలా కాలం నుండి జరుగుతున్న వ్యవహారం. విలువలకు తిలోదకాలిచ్చి, తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన, మాతృ సంస్థకే ద్రోహం తలపెట్టడం నేరం. ఆ నేరానికి కనీసం శిక్ష అనర్హత వేటు. పాతిక సంవత్సరాల క్రితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినా, దాని అమలు అంతంత మాత్రమే. రాజీవ్ గాంధి హయాంలో, చట్టం తేవడానికి ప్రధాన కారణం, అంతకు ముందు, దేశ వ్యాప్తంగా, ఆయారాం-గయారాంల హవాలో అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకం కావడమే. అయితే, చట్టం తేవడం జరిగినప్పటికీ, ఫిరాయింపులు మాత్రం ఆగలేదు. చట్టం అమలు బాధ్యత సభాపతి మాత్రమే కావడంతో రాజకీయాలకు అతీతంగా, సత్ సాంప్రదాయాలు నెలకొనక పోవడమే దీనికి కారణం. పార్టీ ఫిరాయింపులు యదేఛ్చగా కొనసాగుతూనే వున్నాయి. అవసరార్థం ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే వున్నాయి. కోట్ల ధనం చేతులు మారుతూనే వుంది. ప్రజాస్వామ్యం విలువను అపహాస్యం పాలు చేయడానికి ఫిరాయింపు దారులు చట్టం లోని లొసుగులను ఇంకా వాడుకుంటూనే వున్నారు. రాష్ట్ర మాజీ గవర్నర్, పాలనానుభవం దిట్ట, ఇందిరా గాంధికి సన్నిహితుడు, పీసీ అలెగ్జాండర్, ఫిరాయింపుల చట్టం లోప భూయిష్టమైందని విమర్శించారు. పదవ షెడ్యూల్ లోని ఫిరాయింపుల చట్టాన్ని తిరగ రాసి, ఏ స్థాయి ప్రజా ప్రతినిధైనా, తాను ఎన్నికైన పార్టీని వీడినట్లైతే, ప్రజల విశ్వాసం కోల్పోయినట్లుగా భావించి, తక్షణం సభ్యత్వానికి అనర్హుడైనట్లుగా ప్రకటించే విధంగా వుండాలని సూచించారు.
ఇక ఈ నాటి మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయానికొస్తే, తెలుగు దేశం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యుల విషయంలో అనర్హత కేసు నడుస్తోంది. అందులో ఒకరైన పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయనపై అనర్హత ఫిర్యాదు సభాపతికి చేరక ముందే తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించమని కోరుతూ, ఆందోళన కూడా చేశారు. తాను పోటీ చేసిన నాడు, తన పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న దానికి-ప్రజలకు వాగ్దానం చేసిన దానికి విరుద్ధంగా, పార్టీ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో వ్యవహరిస్తున్నందున, పార్టీలో వుండడానికి ఇష్టపడని తాను రాజీనామా ఇస్తున్నానని బహిరంగంగా ప్రకటించారు. రాజీనామా అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా మారారు. ఏదో వ్యక్తిగత లాభం కొరకు కాకుండా, నాలుగున్నర కోట్ల ప్రజల ఉద్యమానికి మద్దతుగా రాజీనామా ఇచ్చిన వ్యక్తి ఫిరాయింపుదారుడుగా భావించడానికి వీలు లేదు. ఇక మిగిలిన ఇద్దరు, బహిరంగంగా, పార్టీకి వ్యతిరేకంగా (సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న ఫిరాయింపుల శ్రేణిలో) పని చేశారని నాయకత్వం ఫిర్యాదు చేసింది. వారి విషయం సభాపతి నిర్ణయం మేరకే జరగొచ్చు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల విషయానికొస్తే, ఏడాదిన్నర కాలం మౌనంగా వుండి, ఇప్పుడేదో కొంప మునిగినట్లు, సభాపతికి ఫిర్యాదు చేయడంలోని ఆంతర్యం కేవలం రాజకీయ సౌకర్యం తప్ప మరేమీ కాదు. ఒక వేళ జగన్ వెంట వెళ్లారని వేటు వేయదల్చుకుంటే, వీరితో పాటు మరి కొందరి విషయంలో ఫిర్యాదు చేయకపోవడానికి కారణాలేంటి అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వాలి.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోను, దానికి కారణమైన వారి మాతృ సంస్థ రాజకీయ పార్టీల విషయంలోను, ఎన్నికల సంఘం అంతో-ఇంతో అప్రమత్తంగా వుంటే మంచిదే మో! ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలో, పార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ ఇవ్వడం సమంజసం. ఒక పార్టీ, ఒక సారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించి, అమలుకు నోచుకోని అంశాల విషయంలో, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పోచారం లాంటి వారికి ఇబ్బందులు తప్పవు. అదే విధంగా, పదవ షెడ్యూల్ అమలు విషయంలోను, కనీసం, సభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనా, ఎన్నికల సంఘం పాత్ర అంతో-ఇంతో వుండడం మంచిది. ఐదేళ్లకో సారి మేల్కొన కుండా, రాజకీయ పార్టీల-పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం మరిచిపోకూడదు.
No comments:
Post a Comment