అంగరంగ వైభోగంగా ముగిసిన అతిరాత్రం పుణ్య యజ్ఞం
వనం జ్వాలా నరసింహారావు
("అతిరాత్రం-ఏప్రిల్ లో కేరళలో జరుగనున్న అత్యంత ప్రాచీన వైదిక పుణ్య యజ్ఞం" శీర్షికన ఫిబ్రవరి 2, 2011 న బ్లాగ్ లో రాసిన ఆర్టికల్ కు అనుబంధంగా...)
శుక్రవారం (ఏప్రిల్ 15, 2011) రాత్రి, సుమారు తొమ్మిదిన్నర గంటల సమయంలో, కేరళ రాష్ట్రం పంజాల్ గ్రామంలో నిర్వహిస్తున్న అతిరాత్రం పుణ్య యజ్ఞాన్ని ఆరంభం (ఏప్రిల్ 4, 2011) నుంచి వీక్షిస్తూ, దేశ వ్యాప్తంగా వున్న పాత్రికేయులకు ప్రతి దినం పత్రికా ప్రకటనలను విడుదల పంపిస్తున్న జర్నలిస్టు సురేఖతో, యాగం ముగింపు విశేషాల గురించి అడిగాను. అడగడానికి ప్రత్యేకమైన కారణం కూడా వుంది. 1975 లో యజ్ఞం పూర్తైన వెంటనే, యాగ శాలను శాస్త్రోక్తంగా అగ్నికి ఆహుతి చేసిన మరు నిమిషంలోనే (అది కూడా అనుకున్న సమయానికే!) మేగావృతమై, వర్షం కురిసింది. నాలుగు వేల సంవత్సరాల క్రితం నుంచి ఆచరణలో వున్న, ఈ సాంప్రదాయ క్రతువు, నాడూనేడూ, ముగిసిన వెంటనే, వర్షించడం జరిగినప్పుడే, యాగం పరిపూర్ణంగా పరిసమాప్తమైనట్లు భావించాలి. అలానే జరుగుతున్నది కూడా. నేను ఆ విషయం కనుక్కుందామని అక్కడే వున్న సురేఖకు ఫోన్ చేసి వర్షం కురిసిందా అని అడగడమే కాకుండా, అదే రోజు సాయంత్రం, హైదరాబాద్ తో సహా ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రదేశాల్లో వర్షం (వడ గళ్ల వాన) పడిన సంగతి కూడా చెప్పాను. అప్పడికింకా అతిరాత్రం జరుగుతున్న పంజాల్ లో వర్షం కురవలేదని ఆమె సమాధానం ఇచ్చింది.
సరిగ్గా, తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు, సురేఖ నుంచి, మొబైల్ ఫోన్ లో సందేశం వచ్చింది. "కుండ పోతగా పంజాల్ పరిసర ప్రాంతాలలో వాన పడుతోంది" అన్న ఆ సందేశం చదివిన వెంటనే, హిందువుల నమ్మకాలు, సంస్కృతీ సాంప్రదాయాలు, వైదిక కర్మ కాండలు, వేదాల్లో ఉటంకించిన విషయాలు, వాటిని ఆచరిస్తున్న కేరళ నంబూద్రి బ్రాహ్మణుల తరహా సంప్రదాయ కుల నిబద్ధత లాంటివి మనసులో మెదిలాయి. "మంత్రాలకు చింతకాయలు రాలు తాయా" అని వాదించే ప్రభుద్ధులకు ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం ఏం కావాలి? అని అనిపించింది. అసలు విషయం-నన్ను మరీ ఆశ్చర్య పరిచిన విషయం తెలుసుకుని మరింత విస్మయం కలిగింది. అతిరాత్రం పుణ్య యజ్ఞం సరిగ్గా పన్నెండు రోజులు నిర్విరామంగా-నిర్విఘ్నంగా, శాస్త్రోక్తంగా, వేద పండితులు ఋత్విక్కులుగా వ్యవహరిస్తుండగా జరుపుతారు. ఏ రోజు, ఏ సమయంలో, ఏది, ఎలా నిర్వహించాల్నో అనేది శాస్త్రోక్తంగా, ముందే ప్రణాళికా బద్ధంగా, సిద్ధం చేసుకుని అలానే ముందుకు సాగుతారు. దాని ప్రకారం, ముగింపు రోజున యాగ శాలను అగ్నికి ఆహుతి చేయాల్సిన సమయం కొంచం సేపు ఆలశ్యమై, రాత్రి తొమ్మిదిన్నర కు జరపాల్సింది, పది గంటలకు జరిగింది. అయితే, మరి కొన్ని నిమిషాలలో, యాగ శాలను అగ్నికి ఆహుతి ఇవ్వ పోతుండగా, అనుకున్న సమయానికే, తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు, ఆకాశం చిల్లులు పడినట్లు గా, కుండ వృష్టితో, భారీ వాన పడింది పంజాల్ పరిసరాల్లో. పుణ్య యజ్ఞాన్ని, ఆ క్షణాన, కను లారా వీక్షిస్తున్న సుమారు పది లక్షల మంది, ఆ వర్షంతో, యజ్ఞం పరిసమాప్తమవుతుంటే, పులకించి పోయారు.
అలా ముగిసింది అతిరాత్రం పుణ్య యజ్ఞం.
(ఏ రోజున ఎలా ఆ పుణ్య యజ్ఞం నిర్వహించింది, ముగిసింది... పూర్తి వివరాలతో, మరో ఆర్టికల్ లో...)
No comments:
Post a Comment