రాష్ట్రానికి ఓ గవర్నింగ్ కమిషన్ !
సూర్య దినపత్రిక (08-07-2011)
వనం జ్వాలా నరసింహారావుఒక్క ఆ సేవల విషయంలోనే కాకుండా, ఆయన ఆరంభించిన అనేక సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో రాజశేఖర రెడ్డి చూపించిన శ్రద్ధ, ఆయన తదనంతరం కూడా, ఆయన వారసులమని చెప్పుకుంటున్న ప్రభుత్వాధి నేతలు చూపక పోవడం అత్యంత దురదృష్టకరం. ఆయన తర్వాత వచ్చిన ముఖ్య మంత్రులు, ఏం చేసినా - చేయక పోయినా, ఒక్క పని మాత్రం అత్యంత నైపుణ్యంతో చేయగలిగారు. అదే, అంచలంచలుగా, ఆయన సంక్షేమ పథకాల అమలును శక్తి వంచన లేకుండా అడ్డుకోవడం. దీనికి ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన - ఆయన మంత్రి వర్గ సహచరులు కొందరు, ఆయన సన్నిహితులు మరి కొందరు, ఆయన కుటుంబ సభ్యులతో సహా ఇంకొందరు అవినీతికి పాల్పడినట్లు, ఆయనను బ్రతికుండగా పొగడిన వారితో సహా - ఆగర్భ శత్రువులు కూడా ఆయన మరణానంతరం చేస్తున్న విమర్శలలో నిజా - నిజాలెంతవరకో కాని, ఆయన మదిలో మెదలిన భావాలకనుగుణంగా రూపు దిద్దుకుని - అమలైన సంక్షేమ పథకాల విషయంలో మాత్రం, ఆయనను శంకించే ముందర ఒకటికి రెండు మార్లు ఆలోచించాలి.
రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయనకు నివాళులర్పించిన కాంగ్రెస్-కాంగ్రేసేతర ప్రముఖులందరూ, ఆయనను ఆకాశం అంత ఎత్తులో చూపుతూ పొగడిన వారే. "మహిళల సాధికారితకు, పిల్లల సంక్షేమానికి, పేదలు- రైతుల అభ్యున్నతికి జీవితమంతా ధారపోసిన దార్శనికుడు, ప్రభావశీలి, అభ్యుదయ నాయకుడు" రాజశేఖర రెడ్డి అంటూ, ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమించారని పొగిడారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి. "వై ఎస్ మరణం కాంగ్రెస్‌కు తీరని నష్టం" అని వాపోయారు. మరి కొంచెం ముందుకు పోయి, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కొరకు అహర్నిశలు-అలుపు లేకుండా శ్రమించిన రాజశేఖర రెడ్డి స్ఫూర్తిని ఎప్పటికీ స్మరించుకుంటూ పాలన చేద్దామని సలహా కూడా ఇచ్చారు సోనియా గాంధి. ఇక ఆమె సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వాధినేత-ప్రధాని మన్మోహన్ సింగ్ "డాక్టర్ వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది" అన్నారు. వైఎస్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలు అయన కీర్తిని నిలబెడతాయని, అయన ప్రజల గుండెల్లో సజీవంగా ఎప్పుడూ ఉంటారని అప్పటి ప్రజారాజ్యం అధ్యక్షుడు - ఇప్పటి కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి అన్నారు. తామూ రాజశేఖర రెడ్డిని పొగడడంలో ఏ మాత్రం తీసి పోమన్న తరహాలో, ఆయనను ప్రగతిశీల నాయకుడుగా - అంకిత భావం కల రాజకీయ వేత్తగా అభివర్ణించారు మాజీ ప్రధాని - భారత జనతా పార్టీ నేత అటల్ బిహారీ వాజ్ పాయి. పాతికేళ్ల రాజకీయ జీవితం మొత్తాన్నీ ప్రజల కోసమే అంకితం చేసిన వైఎస్ లేని లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు లోక్ సభలో ప్రతిపక్ష నేత - భావి భారత ప్రధాని ఎల్.కే.అద్వాని. మరణించిన వ్యక్తి గురించి మంచి మాటలు చెప్పడంలో ఏ మాత్రం తప్పు లేదు కాని, ఆయన మరణించిన అనతి కాలంలోనే, సోనియా గాంధీతో సహా - ఆయనను ఆకాశానికి ఎత్తిన పలువురు ప్రతి పక్ష నాయకులు కూడా, రాజశేఖర రెడ్డిని - ఆయన పాలనా కాలానికి సంబంధించిన అనేకానేక అంశాలపై, విమర్శలు గుప్పించడం వెనుక రాజకీయ కారణాలు తప్ప మరింకేమన్నా వున్నాయా?
స్వపక్ష - విపక్ష రాజకీయ నాయకులు అంత గొప్పగా పొగడిన, అరుదైన పాలనా దక్షత కలిగిన వ్యక్తి, హఠాత్తుగా - హెలికాప్టర్ ప్రమాదంలో, మరణించిన వెంటనే రాజకీయ శూన్యత ఎందుకు కలగాలి? మరణించి ఇంకా రెండేళ్లన్నా కాలేదు...ఎందుకంత గా ఆయనను అందరూ విమర్శించాలి? అంతవరకూ బాగానే వుంది. ఏ కారణంతో ఆయన తలపెట్టిన అతి ముఖ్యమైన సంక్షేమ పథకాల అమలు కుంటు పడాలి? కనీసం ఆ పథకాలలో, బీద - సాద, వెనుక బడిన వర్గాల, షెడ్యూల్డ్ కులాల - తెగల, మధ్య తరగతి ప్రజలకు చెందిన లబ్దిదారుల కుటుంబాలకు మేలు చేకూర్చిన కొన్నింటి అమలునన్నా కొనసాగించలేని స్థితిలో ప్రభుత్వం (రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్య మంత్రైన రోశయ్య నాయకత్వంలోనిదైనా - ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిదైనా) వుండడానికి అంత బయటకు చెప్పలేని కారణాలేమై వుంటాయి? అవి "రాజశేఖర రెడ్డి పథకాలు" గా ముద్ర పడినందు వల్లా? లేక, ఆర్థిక ఇబ్బందుల వల్లా? లేక ప్రభుత్వ యంత్రాంగంలో చోటు చేసుకున్న నిర్లిప్తత వల్లా? రాజశేఖర రెడ్డి వారసులుగా వచ్చిన ముఖ్య మంత్రుల ఆదేశాలను అధికారులు బే ఖాతరు చేయడం వల్లా? వీటిలో ఒకటి కంటే ఎక్కువ కారణాల వల్లా? దీనికి సరైన సమాధానం, రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ఒక సీనియర్ సివిల్ సర్వెంటు ఆయన సమీప సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలలో లభించింది కొంతమేరకు. రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా వున్న కాలంలో, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన సంక్షేమ కార్యక్రమాలలో ఒక దాని అమలు విషయంలో ఆ సివిల్ సర్వెంటు అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆయనను ఆ పాత్ర నుంచి తప్పించారు - పోనీ ఆయనే స్వచ్చందంగా వైదొలిగారనుకుందాం!
బయటకు చెప్పే కారణాలు - అందరూ వూహించే కారణాలకు భిన్నంగా ఆ సివిల్ సర్వెంటు ఆసక్తికరమైన తన అభిప్రాయం వెల్లడి చేశారు. వాస్తవానికి అతి చేరువలో వున్న ఆయన అభిప్రాయం నిశితంగా పరిశీలిస్తే ఆయన మాటల్లో యదార్థం గోచరించింది. దివంగత ముఖ్య మంత్రి అభివృద్ధి పధకాలైన జలయజ్ఞం లాంటి విషయంలో ఆచి-తూచి స్పందించిన ఆ సివిల్ సర్వెంటు, పరోక్షంగా వాటి అమలు - వాటి బాటలోనే, సంక్షేమ పథకాల అమలు గురించి కొన్ని విషయాలు చెప్పారు. రాజశేఖర రెడ్డి తన మొదటి విడత పాలనలో, తొలి నాలుగేళ్ల వరకు, అత్యంత జాగరూకతతో - పాలనా దక్షతతో, పటిష్ఠమైన యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని ఏర్పాటు చేయగలిగినా, ఆ తర్వాత, ముఖ్యంగా - 2009 ఎన్నికలకు ఒక ఏడాది ముందు, అంటే 2008 సంవత్సరం మధ్య నుంచి, తన ఆలోచనా ధోరణిని మార్చుకున్నారన్నారు. ఎలాగైనా, మలి విడత జరిగే 2009 ఎన్నికలలో గెలవాలన్న లక్ష్యం ఒక వైపు, తనను నమ్ముకున్న ఎమ్మెల్యేలకు సాధ్యమైనంత సహాయపడాలన్న కోరిక మరో వైపు ఆయనలో కలిగిందని, దాని ప్రభావం పథకాలపై పడడం ఆరంభమైందని అన్నారాయన. ఆ పాటికే, ఆయన ముందు అధికారంలో వున్న తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న కొంతలో-కొంత రాజకీయ అవినీతి ప్రభావం, పెద్ద మోతాదులో మారుతున్న రాజశేఖర రెడ్డి ఆలోచనా ధోరణి మీద పడిందంటారాయన. ఎన్నికైన ప్రజా ప్రతినిధులలో పలువురు, అధికారులను శాసించే దిశగా పాలన సాగడంతో దాని దుష్ప్రభావం పథకాలపై పడి, ఆయన తర్వాత ఇంతై-ఇంతితై-వటుడింతై అన్న చందాన వాటి మూతవేసి స్థితికి చేరుకున్నాయని ఆయన అభిప్రాయం. దానికి ఒక ఉదాహరణగా, ఆయనకు ఇటీవల తాజ్ కృష్ణా హోటల్ సమీపంలో పార్కుచేసి వున్న 108 అంబులెన్సు మీద పూర్తిగా కళా విహీనంగా - మాసి పోయి - కనిపించకుండా వున్న రాజీవ్ గాంధీ బొమ్మ విషయం చెప్పారు. కనీసం ఆ బొమ్మను పునరుద్ధరించడానికి కూడా నిధులివ్వలేని పరిస్థితికి కారణం మూలాలు కూడా రాజశేఖర రెడ్డిలో 2008 సంవత్సరం మధ్య నుంచి వచ్చిన మార్పే అన్నారు.
ఇంతకూ, ఆ మార్పేంటని ప్రశ్నిస్తే, విచక్షణా రహితంగా, రూపాయి ఆదాయం మాత్రమే వుందని తెలిసి కూడా, భవిష్యత్ లో ఏం జరుగుతుందని ఆలోచన చేయకుండా, పది రూపాయల ఖర్చయ్యే పథకాల రూపకల్పన చేయడమేనని ఆయనిచ్చిన మొదటి జవాబు. సంక్షేమ పథకాల అవసరమున్న 30-40 శాతం ప్రజలకు అవి కలిగించే ఆలోచన చేయకుండా, అవసరమున్న వారికి - లేని వారికి, వాటిని అందించుదామన్న ఆలోచన - అదీ రాబోయే ఎన్నికలను దృష్టిలో వుంచుకుని చేసిన ఆలోచనను ఆ సివిల్ సర్వెంటు తప్పుబట్టారు. ఆయన ఆలోచన రాజకీయ ఆలోచన మాత్రమే అంటారాయన. ప్రణాళిక పథకాలను, ప్రణాళికేతర పథకాలుగా మార్చలేక పోవడం, మార్చడానికి ప్రభుత్వ యంత్రాంగానికి అవకాశం ఇవ్వక పోవడంతో, దీర్ఘకాలం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వీలు కాని ఆ పథకాలు కుంటుపడి పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఇవ్వాళ వాటిని తీసేయలేక, కొన సాగించలేక, సహజంగా నీరుకారుస్తే బాగుంటుందన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేయడానికి కారణమైందన్నారు. ఈ పరిస్థితుల్లో సాక్షాత్తు "దేవుడే దిగి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టినా" ఏమీ చేయలేని పరిస్థితులొచ్చాయని అన్నారు. వీటికి తోడు, తెలంగాణా ఉద్యమం కూడా అనిశ్చిత స్థితిని కలిగించిందంటారాయన.
వీటి నుంచి గట్టెక్కడానికి, ఒకే ఒక మార్గం "గవర్నింగ్ కమీషన్" ను ఏర్పాటు చేసి, దానికి రాజ్యాంగ బధ్రతను కలిగించి, పాలనలో సమూలంగా మార్పులు తేవడమే! రాజశేఖర రెడ్డి జన్మదినం నాడు, ఆయన ఏ ఆలోచనతో చేసినప్పటికీ, ఆయన రూప కల్పన చేసి - అమలు చేసిన సంక్షేమ పథకాల కొన సాగింపుకు, కొంతలో - కొంతైనా ఈ మార్గం ఉపయోగపడుతుందేమో నన్న ఆలోచన చేయడం మంచిదే మో!
No comments:
Post a Comment