యూపీఏ- కాంగ్రెస్‌లకు సమర్ధ నాయకత్వం ఉందా?
వనం జ్వాలా నరసింహారావు
గత కొద్ది మాసాలుగా దేశ చరిత్రలో కనీ-వినీ ఎరుగని మోతాదులో, సమష్ఠి బాధ్యతా రాహిత్యం-సమన్వయ లోపం-అసమర్థ నాయకత్వంతో, పీకల లోతుకు మునిగి పోయిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ ప్రభుత్వం దాని సారధి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఏ విషయంలోను ఒక విధానం అంటూ లేకుండా పనిచేయడం మరి కొంతకాలం కొన సాగితే, భావి భారత భవిష్యత్ అంధకార బంధురం కావడం ఖాయం. కేంద్రంలో అధికారంలో వున్న ప్రధాన పార్టీ వారే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అధికారంలో వుండడంతో, ఆ నీలి నీడలు ఇక్కడ కూడా పడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అక్కడ కేంద్రంలోను, ఇక్కడ రాష్ట్రంలోను, కాంగ్రెస్ పార్టీ అడ్రసు గల్లంతు కావడం తప్పక పోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఎందుకిలా జరుగుతుంది? దీనికి బాధ్యులు ఒకరా? ఏ విషయంలోనూ-ఏ నిర్ణయం తీసుకోలేని దుస్థితిలో వీరుండాల్సిన ఆగత్యం ఏంటి? సమాధానాలు వారివ్వ లేక పోయినా, తెలుసుకోవాల్సిన-పోనీ ఏదో విధంగా రాబట్టాల్సిన అవసరం ప్రజల కుంది.
కేంద్ర ప్రభుత్వ-రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నాయకత్వానికి, విధాన పరంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితికి, కీలకమైన విషయాలలో తమ విధానం ఇదంటూ పాలక పార్టీ ప్రకటించ లేక పోవడానికి, ప్రతి పక్ష పార్టీల సూచనలు-సలహాలు పాటించక పోవడానికి, పలు ఉదాహరణలు పేర్కొనవచ్చు. లోక్ పాల్ బిల్లు విషయంలో ప్రభుత్వానికి కాని, కాంగ్రెస్ పార్టీకి కాని స్పష్టమైన విధాన మంటూ లేదు. అన్నా హజారే నిరాహార దీక్షను ఏ వుద్దేశంతో విరమింప చేసారు? ఏ వుద్దేశంతో పౌర సమాజం వారితో ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసారు? ఎందుకు ఒకడగు ముందుకు వేస్తారో-ఎందుకు మళ్లీ ఎవరూ అడక్కుండానే అడుగులో అడుగు వేసుకుంటూ వెనక్కు తగ్గుతారో ఎవరికీ అర్థం కాదు. పోనీ చట్టాల రూప కల్పనలో పార్లమెంటుకే సార్వభౌమాధికారం అని ప్రకటించే ధైర్యం వుందా? అంటే ...అదీ లేదు. చివరకు జరిగిందేంటీ అంటే, లోక్ పాల్ బిల్లు విషయంలో ఎక్కడి గొంగళి అక్కడే! ఆగస్టు పదహారు నుంచి హజారే మరో నిరాహార దీక్షకు దిగేందుకు పరోక్షంగా దోహదం. ప్రభుత్వానికి కావలసిందల్లా...ఏదో విధంగా నిర్ణయం వాయిదా పడడం. అదే జరుగుతోంది లోక పాల్ విషయంలో. బాబా రాం దేవ్ విషయంలోనూ అదే విరుద్ధ పాత్రలను పోషించారు ప్రభుత్వ-కాంగ్రెస్ పెద్దలు. కొందరేమో ఆయనకు స్వాగత మిస్తారు...కొందరేమో ఆయనను పనిగట్టుకుని దూషిస్తారు. ఒకరు దీక్షకు కూచోమని పురమాయిస్తే, మరొకరు దీక్షను భగ్నం చేయించే బాధ్యతను నెత్తిమీద వేసుకుంటారు.
ఒక్క లోక్ పాల్ విషయమే కాదు. విదేశాల్లో నల్ల ధనం వ్యవహారమూ అంతే. రాజా కుంభకోణం సంగతీ అంతే. మైనారిటీల రిజర్వేషనూ అలానే. వెనుకబడిన వర్గాల వారికి సమకూరాల్సిన హక్కుల పరిరక్షణ విషయంలోనూ అదే తీరు. వర్గీకరణ వ్యవహారంలో అంతా నాన్చుడే! ఏ విషయమూ తేల్చరు. దొందు-దొందే...అన్న చందాన, రాష్ట్ర ప్రభుత్వం కూడా, అదే దోవలో నడుస్తుంటుంది. వర్గీకరణ వ్యవహారంలోను, తెలంగాణ ఎన్ జీవో నాయకుల డిమాండ్ల విషయంలోనూ, ప్రభుత్వ పరంగా అఖిల పక్షాన్ని తీసుకెళ్తానని చెప్పి, ఏం చేసింది అందరికీ తెలిసిందే. ఇక సంక్షేమ పథకాల అమలు విషయం చెప్పాల్సిన పనే లేదు. కొన్ని పథకాలను నిధుల లేమి పేరుతో, మరి కొన్ని రాజశేఖర రెడ్డి పథకాలన్న పేరుతో, మరి కొన్ని సంస్కరణల అమలు అన్న నెపంతో, ఇంకొన్ని అధికారుల అలసత్వంతో, ఇంకా కొన్ని సంబంధిత మంత్రులకు ఇష్టంలేక పోవడంతో, అమలుకు నోచుకోని పరిస్థితులు కలుగుతే-తద్వారా పౌరులు నిత్యం ఇబ్బందులకు గురవుతుంటే, ప్రభుత్వ పరంగా కనీసం సమీక్షించే నాధులే లేరు. మంత్రులే మో రాజీనామా చేశారా యె! చేయని మంత్రులే మో ఏ క్షణానన్నా చేయడానికి సిద్ధంగా వున్నారాయె! వారి వద్ద నున్న ఫైళ్లకు దిక్కూ-మొక్కూ లేదా యె! మధ్యలో తెలంగాణ-సమైక్యాంధ్ర-జై ఆంధ్ర ఉద్యమాలు-రాజీనామాలా యె! తెలంగాణ ఉద్యోగ సంఘాల సమ్మె నోటీసా యె! ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి పాపం. ఏదన్నా పరిష్కార మార్గం కనుక్కుందా మని కేంద్ర ప్రభుత్వం వైపుగా, కాంగ్రెస్ అధిష్ఠానం వైపుగా దృష్టి సారిస్తే, అక్కడా అంతా అగమ్య గోచరంగా కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి-ఆ ప్రభుత్వ కాంగ్రెస్ నాయకత్వానికి. మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత తలనొప్పి కలిగించడం చూస్తే ఒక్కో సారి జాలి కూడా వేస్తోంది. చివరకు ఆ విషయంలో హైకోర్టు పుణ్యమా అని, సిబిఐ విచారణ మొదలవడంతో, కాంగ్రెస్ పార్టీ వారికి ’ఇంటర్వెల్’ లాంటి రిలీఫ్ దొరికింది.
ఇదంతా ఒక ఎత్తై తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం-సమైక్యాంధ్ర నినాదం, ఆ రెండింటి లో పాలుపంచుకుంటున్న ఉద్యమకారుల-నాయకుల డిమాండ్లకు స్పందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలను నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏ కోణం లో అర్థం చేసుకోవాలో బోధపడడం లేదు. ప్రభుత్వంలో వున్న వారి-పార్టీలో వున్న వారి వ్యవహార శైలి, అత్యంత జుగుప్సాకరంగా, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా, యావదాంధ్ర తెలుగు ప్రజలను అనుక్షణం అవమాన పరిచే రీతిలో వుందనాలి. అసలు కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నాయకుడు (రాలు) అంటూ ఎవరన్నా వున్నారా? వుంటే, ఆ నాయకుడు (రాలు) గతంలో, ఏ కాంగ్రెస్ నాయకులకూ లేని నాయకత్వ లోపం వుందనాల్సిందే!
రాష్ట్రానికి సంబంధించి నంతవరకూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు? గులాంనబీ ఆజాదా? బొత్స సత్యనారాయణా? పోనీ టీఆర్‌ఎస్‌అధ్యక్షుడు చంద్రశేఖర రావా? సోనియా గాంధీ దగ్గర పలుకుబడి వున్న వారు నాయకులా? అలాంటప్పుడు వారు కాంగ్రెస్ వారు కాకపోయినా పరవాలేదా? అలాంటి నాయకులు సాక్షాత్తు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆజాద్ ను తప్పుబడుతూ, మొత్తం తెలంగాణ కాంగ్రెస్ నాయకులున్న వేదికపై ఉపన్యసిస్తుంటే, అడ్డు తగలక పోవడానికి బలవత్తరమైన కారణాలేంటి? రెండు వారాల్లో తెలంగాణ ప్రకటన వెలువడుతుందని ధైర్యంగా ఒక కాంగ్రేసేతర నాయకుడు కాంగ్రెస్ నాయకులున్న వేదికపై ప్రకటించారంటే, ఎవరు సమర్థులో-ఎవరు అసమర్థులో ప్రశ్నించుకోవాలి-సమాధానం వెతుక్కోవాలి. ఏ కాంగ్రెస్ అధినాయకత్వం చంద్రశేఖర రావు వెనుకనుండి ఆ ప్రకటన చేయించారో కాని, ఆ ప్రకటనతో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ధైర్యం తెచ్చుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే, దేశం కాని దేశంలో చీమ టపాకాయ లాంటి టపాసు పేల్చాడు గులాం నబీ ఆజాద్. అంటే మరో దిక్కునుంచి మరో సంకేతం...దాని పర్యవసానం... ఇప్పట్లో తెలంగాణ లేనట్లేనా! కేసీఆర్ ప్రకటనకు తెలంగాణ వారికి ధైర్యం ఎంత వచ్చిందో కాని, సీమాంధ్ర నాయకులలో మాత్రం ఐక్యత మరో మారు తక్షణమే వచ్చింది. మళ్లీ కధ పునరావృతం... మరో మారు ఢిల్లీ ప్రయాణం... సమైక్య నాదం వినిపించడం... అధినాయకత్వం భరోసా పొందడం...వెంట వెంటనే జరిగాయి. ఏం జరుగుతోంది? ఎవరు ఎవరిని ఎందుకు ఎంతకాలం ఏ కారణాన మోసం చేయాలనుకుంటున్నారు? సరిగ్గా ఆ సమయంలోనే, డిసెంబర్ తొమ్మిది-రెండువేల తొమ్మిది నాటి నుంచి-నేటి వరకు, కోటల దాటిన మాటలు, ఒక్కొక్కటే వెనక్కు మళ్ల సాగాయి. పెద్దా-చిన్నా అన్న భేదం లేకుండా అన్నది అనలేదని బాధ్యతాయుత పదవులలో వున్న వారనడం, దానికి మనలో కొందరం వంత పాడడం, తెలుగు మాట్లాడే వారందరినీ, మూకుమ్మడిగా అవమానాలకు గురిచేయడానికి కాంగ్రెస్ పార్టీకి-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు అవకాశం ఇచ్చినట్లే!
చిదంబరం కొద్ది రోజుల ముందే బయటపడ్డారు. డిసెంబర్ తొమ్మిది ప్రకటనను, డిసెంబరు ఇరవై మూడు ప్రకటనతో కలిపి చదవాలని. ఆ మాటకొస్తే, ఆయన అధికారంలో లేనప్పుడు, చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా రాసిన వాక్యాలను, అసలు పరిగణలోకే తీసుకోవద్దని ఆయనే ఒక సారి అన్న మాట గుర్తు చేసుకోవాలి. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆజాదు చైనాలో అన్న మాటలను, మీడియా వక్రీకరించిందని, సాక్షాత్తు ఆయనే అన్నారు. ఆ సంగతి ఆయనకు పదిమంది చివాట్లు పెట్టిందాకా జ్ఞప్తికి రాకపోవడం విశేషం. పోనీ, మీడియా వారన్నా, ఆజాదును ఖండించారా అంటే అదీ లేదు. ఆయనే మన్నారు? ఎంతవరకు మీడియా వక్రీకరించింది? ఎవరికీ తెలియదు. ఈ లోపున, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడిందాకా ఢిల్లీ ముఖం చూసే ప్రసక్తే లేదని హైదరాబాద్ లో భీష్మించుకుని కూర్చొన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు, ఆజాదు వ్యూహాత్మకంగా వెనుకడుగు వేయడం కొంత వెసులుబాటు కలిగించింది. పొలో మంటూ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు కొందరు "కీలక నాయకులు".
మరో వైపు కాంగ్రెస్ పార్టీలో అతి సీనియర్ నాయకుడు, ప్రధాని కావాలని అహర్నిశలూ వువ్విళ్లూరుతున్న వ్యక్తి, సోనియాకు అత్యంత ఆంతరంగికుడు, ప్రణబ్ ముఖర్జీ, మరో బాంబ్ పేల్చారు. డిసెంబర్ తొమ్మిది ప్రకటన చిదంబరం ఒక్క డిదే కాదని, దానికి తనతో సహా ప్రభుత్వ పెద్దలందరి బాధ్యత వుందని, దానికి సమష్టిగా బాధ్యత వహించాల్సిసిందేనని ప్రణబ్ ప్రకటన చేశారు. ఇంతకంటే, "సమష్ఠి బాధ్యతా రాహిత్యం-సమన్వయ లోపం-అసమర్థ నాయకత్వం" ఎక్కడైనా-ఏ దేశంలోనైనా వుంటుందా? ఒక సీనియర్ నాయకుడు అనవలిసిన-అనదగ్గ మాటలేనా ఇవి? తెలంగాణ ఇవ్వు-ఇవ్వక పో! కాని ఇంత బాధ్యతారాహిత్యంతో యుపిఎ ప్రభుత్వంలో-కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్న నువ్వు-నీ అధినేత్రి సోనియా-ఆమె కనుసన్నలలో మెలిగే ప్రధాని సోనియా దేశాన్ని ఎలా సమర్థవంతంగా నడిపించగలరయ్యా?
ఇలాంటి అసమర్థ నేతలు, స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో వుండి వున్నట్టయితే, సంస్థానాలన్నీ భారత దేశంలో విలీనం అయ్యేవా? నిజాం నవాబు హైదరాబాద్ ను విలీనం కానిచ్చేవాడా? భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేవా? నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగుండేదా? అంతరిక్షంలోకి భారతావని అడుగుడగలిగేదా? న్యూ క్లియర్ శక్తిగా ఎదగ గలిగే దా? చైనా-పాకిస్తాన్ దేశాలకు గుణపాఠాలు నేర్పగలిగే దా?
చేవ వుంటే, అల నాడు, 1969-70 లలో, ఇందిరా గాంధీ చెప్పినట్లు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సిద్ధంగా లేదని చెప్పాలి. పోనీ, పార్టీలో ఒప్పించి, అందరూ అంగీకరించే నిర్ణయమన్నా తీసుకోవాలి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి, ఒక విధానం లేని పార్టీకి అధికారంలో వుండే అర్హత లేదు. ఉంటే, "సమష్ఠి బాధ్యతా రాహిత్యం-సమన్వయ లోపం-అసమర్థ నాయకత్వం" మరికొంత కాలం కొనసాగినట్లే!
No comments:
Post a Comment