Friday, July 15, 2011

తెలంగాణ ఇచ్చుడేమో కాని..శాశ్వతంగా తెలుగోళ్లను విడగొడుతున్న ఆజాద్:వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ ఇచ్చుడేమో కాని..

శాశ్వతంగా తెలుగోళ్లను విడగొడుతున్న ఆజాద్

అగ్గికి ఆజ్యం ఆజాద్‌ వ్యాఖ్యలు

సూర్య దినపత్రిక (16-07-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ ప్రజల మాటే మో కాని, అఖిలాంధ్ర ప్రజలకు సైతం బద్ధ శత్రువుగా, ప్రధాన విలన్ గా ఆజాద్ వ్యవహరించడానికి కారణం అర్థం చేసుకోలేని స్థితిలో పడిపోయారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం-పోనీ ఏకాభిప్రాయం తప్పనిసరి అని ఆజాద్ నొక్కి చెప్పడం-అదీ దేశం కాని దేశంలో, అక్కడ కూడా మరీ ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పడంతో , రాజీనామా చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో సహా, అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ వాదులు, ఆజాద్‌పై నిప్పులు చెరుగుతున్నారు. దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆజాద్ ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ ఛార్జీ పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్‌ చేశారు. తెలంగాణపై అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందని అంతా ఆశిస్తున్న తరుణంలో ఆజాద్‌ చాలా దుర్మార్గంగా మాట్లాడారని ఆయనతో సహా, పలువురు కాంగ్రెస్ నేతలు, బహిరంగంగానే ఆజాద్ ను దుయ్యబట్టారు. ఆయనను అధిష్ఠానమైనా తొలగించాలి లేదా ఆయనే స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా దిగన్నా పోవాలని ఎంపీ వివేక్‌ హెచ్చరించారు. వంద మంది ఆజాద్‌లు వచ్చినా తెలంగాణను ఆపలేరని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, ఆజాద్‌ వ్యాఖ్యలు అర్థ రహితం-అ నైతికం అని ఎంపీ మధు యాష్కీ...ఇలా అందరూ ఆజాద్ మీద నిప్పులు కక్కారు. గులాంనబీ ఆజాద్ కొత్త మాట మాట్లాడుతున్నాడని, అసెంబ్లీలో తీర్మానం పెడితే తెలంగాణ ఇస్తామని మోసపూరిత మాటలు చెపుతున్నాడని, తాము చేతగానోళ్లంకాదని, పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఉరికిచ్చికొడతారని, తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌ రావు సహితం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ మరో కపట నాటకం ఆడుతోందని కూడా ధ్వజమెత్తారు.

అంతకు ఒకరోజు క్రితమే, కాంగ్రెస్ అధిష్టానం అనుమతి వున్నదన్న అర్థం స్ఫురించే రీతిలో, అధికార ప్రతినిధి, తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశగా, మూడు-నాలుగు రకాల ప్రతిపాదనలు చేశారన్న వార్తలకు ప్రింటు-ఎలెక్ట్రానిక్ మీడియాలో విశేషంగా ప్రచారం లభించడంతో, ఆశావహులై వున్న తెలంగాణ కాంగ్రెస్-టిడిపి-బిజెపి-టి ఆర్ ఎస్ శ్రేణుల్లో, ఆజాద్ వ్యాఖ్యలు ఒక్క సారిగా కలకలం కలిగించాయి. ఇంతకూ ఏం జరగొచ్చు? ఏం జరిగే అవకాశాలున్నాయి? తెలంగాణ ఇచ్చినా-ఇవ్వక పోయినా, కనీసం తెలుగు మాట్లాడే వారందరినీ, భౌగోళికంగా విడదీసినా-తీయక పోయినా, సన్నిహిత-స్నేహ-బంధుత్వాలన్నా కొనసాగనిస్తుందా యుపిఎ కేంద్ర ప్రభుత్వం? అజాదొక మాట, సింఘ్వీ మరొక మాట, అహ్మద్ పటేల్ ఇంకొక మాట, సీమాంధ్రులు కలిసినప్పుడొక వ్యాఖ్యానం, తెలంగాణ వారు కలిసినప్పుడు మరో విధమైన స్పందన చేయడం తగునా? అన్నీ భేతాళ ప్రశ్నలే!

ఈ నేపధ్యంలో, కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి, తెలంగాణ సెంటిమెంటు ఎంత తీవ్రంగా వుందో తెలియచేయడానికి, రాజీనామాలు చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. కాంగ్రెస్ నాయకులలో-అందునా రాజీనామా చేసిన వారిలో, కొందరికై నా చిత్తశుద్ధి లేదని, సీమాంధ్ర నాయకులు పదే-పదే చెపుతున్న (పోనీ ప్రచారం చేస్తున్న) విధంగా, దీక్షా శిబిరానికి రాజీనామా చేసిన తెలంగాణ మంత్రులలో 11 మంది హాజరైనప్పటికీ, వీరిలో, కారణాలేవైనప్పటికీ, శ్రీధర్‌ బాబు, సుదర్శన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ దీక్షకు మద్దతు తెలిపినట్లే తెలిపి మధ్య లోనే జారుకోవడం చాలా మందిని నిరాశకు గురి చేసిందనాలి. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వేదికపై ప్రసంగించడానికి కూడా ఒప్పుకోక పోవడం వెనుక కారణాలే మై వుండవచ్చో? అంతే కాదు..రాజీనామా చేసిన మంత్రులందరూ-కనీసం చాలా మందైనా, అధికారిక సౌకర్యాలన్నీ అనుభవిస్తూ, ముఖ్య మంత్రి వద్దకు తరచుగా వెళ్ళి మాట్లాడుతూ, అడపదడప తమ శాఖలకు చెందిన అంశాలకు సంబంధించి, అధికారులకు ఆదేశాలూ జారీ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అదెంతవరకు సమంజసమో తేల్చుకోవాల్సింది, రాజీనామా చేసిన మంత్రులే తప్ప మరెవరూ కాదు.

ప్రజా ప్రతినిధులందరూ రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందని, కాంగ్రెస్ అధిష్టానం-యుపిఎ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని భావించిన తెలంగాణ నాయకుల ఆశలు నెరవేరడం లేదు. అలా అని అడియాసలూ కావడం లేదు. అంతా నాన్చుడు ధోరణే. కాంగ్రెస్ పార్టీ సంస్కృతే అంత. అందుకే ఆ పార్టీ వారే నిరసన దీక్షలు చేపట్టారు. అలాంటప్పుడు, నిరసన దీక్షలో రాజీనామా చేసిన వారందరూ చిత్త శుద్ధితో పాల్గొనక పోవడం ఎంతవరకు సమంజసం? వీరిలా చేయడం, అధిష్టానానికి ఎటువంటి సంకేతాలనిస్తుందో తెలియదు. మంత్రులు అంతగా పట్టించుకోక పోయినా, ఎమ్మెల్యేలందరన్నా సంఘీభావంతో వుంటే చాలన్న అభిప్రాయానికి వస్తున్నారు కొందరు. మరో వైపు, తెలుగు దేశం పార్టీకి చెందిన రాజీనామా చేసిన ప్రజా ప్రతినిధులు బస్సు యాత్ర పేరిట జనంలోకి చొచ్చుకు పోతూ, సభలు, సమావేశాలు జరపడం-ప్రజల నుంచి స్పందన కూడా లభించడం, కాంగ్రెస్ శ్రేణులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎవరు ముందు-ఎవరు వెనుక అనే మీమాంసలో పడుతున్నారందరూ. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు దీక్షకు దిగడానికి రెండు రోజుల ముందర, తెలంగాణ ఉద్యమంలో భాగంగా, ఉస్మానియా విద్యార్థి నాయకుల సామూహిక నిరవధిక నిరాహార దీక్ష ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాలలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల దిగ్బంధాన్ని చేదించుకొని, వందల సంఖ్యలో విద్యార్థులు నిరాహార దీక్షకు దిగడం రాబోయే రోజుల్లో, తెలంగాణా ఉద్యమం దాల్చనున్న తీవ్రతకు హెచ్చరికగా భావించాలి. విద్యార్థుల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు అసెంబ్లీ నుంచి బయలుదేరిన నాయకులను అసెంబ్లీ వద్దే అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో, వారు అక్కడే ధర్నాకు దిగారు. తమను అరెస్టు చేయడం ఎమర్జెన్సీని తలపిస్తోందని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జిల్లాల నుంచి హైదరాబాద్ తరలి వస్తున్న విద్యార్థులను మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనేక చోట్ల కేసులు పెట్టారు.

ఇంతకూ ఏం జరుగుతోంది? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వున్న తెలుగు ప్రజలను భౌగోళికంగా విడదీసినా తీయక పోయినా, అనుక్షణం, ఇరు ప్రాంతాల తెలుగు మాట్లాడే వారి మధ్య, వైషమ్యాలు దినదినాభి వృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీ-దాని సారధ్యంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఎంత చేయడానికి వీలుంటుందో అంతా చేసి చూపిస్తున్నది. యుపిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేసిన ముసుగును అదే కొంచెం సేపు తొలగించడం, ఆ తర్వాత సరిచేసి మళ్లీ వేయడం, తెలుగు మాట్లాడేవారి ఆత్మగౌరవాన్ని కించపరచడమే. మంత్రివర్గ విస్తరణ ముగిసిన వెంటనే తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ తనదైన శైలిలో ఒక్కో నాయకుడితో ఒక్కో రకమైన చిలక పలుకులు అనిపిస్తోంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ వెల్లడి చేసిన ప్రతిపాదనలను, ఇరవై నాలుగు గంటలు గడవక ముందే, ఆజాద్‌ ఖండించకపోయినా, అంతకంటే ఘోరంగా మరో ప్రకటన చేశారు. దీనిద్వారా రెండేళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అల జడులకు ముగింపు ఇచ్చే ఆలోచన చేస్తోందా? లేక రాష్ట్రాన్ని రావణా కాష్టంలాగా ఏళ్ల తరబడి మండించే ఆలోచనలో వుందా కాంగ్రెస్-దాని నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనే అనుమానంలో పడ్డారందురు. లేదా, ఇరు ప్రాంతాల ప్రజలను మానసికంగా క్షోభకు గురి చేసి, కేంద్రం ఏది చెప్పినా వినేందుకు సన్నద్ధం చేస్తున్నారా?

ఆజాద్‌ చేసిన ప్రకటన అనేక మతలబులతో కూడుకున్నదనే విషయం ఏ మాత్రం ఇంగిత జ్ఞానం వున్న వారికైనా అర్థమవుతూనే ఉంది. తెలంగాణ సెంటిమెంటుపై కేంద్రం సానుభూతితో ఉందని చెబుతూ నే, రాష్ట్ర విభజనను సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, తెలంగాణలో రాష్ర్టం కోసం ఎంత బలంగా ఉద్యమిస్తున్నారో, సీమాంధ్రలో తెలంగాణకు అంత బలమైన వ్యతిరేకత ఉందని ఆజాద్ అనడంలో కొత్తే మన్నా వుందా? ఆయన ఈ విషయాన్ని ఇప్పుడే తెలుసుకున్నారా? సీమాంధ్రుల మద్దతు లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయడం అసాధ్యమనే సంగతి ఇప్పుడెందుకు ప్రస్తావించాలి? ఏకాభిప్రాయ సాధన ఒక్కటే మార్గమని ఆజాద్‌ చెప్పడంతో సరిపోదు. ఆ ఏకాభిప్రాయ సాధనకు ఆయన గాని, ఆయనతో ఆ మాటలనిపిస్తున్న అధినేత్రి సోనియా గాంధీ కాని, ఏం చర్యలు తీసుకున్నారు-తీసుకోబోతున్నారనేది కూడా స్పష్టం చేయాలి. మూడు ప్రాంతాలు కొత్త రాష్ట్రానికి అంగీకరిస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని చెపుతున్న పెద్దమనిషికి, ఆ మూడు ప్రాంతాల అంగీకారంతోనే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిందా? లేదా? అన్న సంగతి తెలుసోలేదో! ఏదేమైనా, రాయలసీమ, కోస్తా నేతలు అంగీకరించరు కాబట్టి, తెలంగాణ ఏర్పాటు అసాధ్యమని ఆయన మనసులో మాటైతే, ధైర్యంగా-అధికారికంగా-ప్రభుత్వ పరంగా ఆ ప్రకటన చేసి, దానికి కట్టుబడి, సంభవించ బోయే పర్యవసానాలను ఎదుర్కోవాలి. ఒక వేళ తెలంగాణ సమస్య మొత్తంలో హైదరాబాద్ నగరం విషయం అత్యంత క్లిష్టమైన అంశంగా కాంగ్రెస్ హైకమాండ్ గాని, మన్మోహన్ ప్రభుత్వం కాని, ఆజాదు లాంటి వారు కాని భావిస్తే, అది పక్కన పెట్టి, మిగతా విషయాలకు సంబంధించిన స్పష్టమైన ప్రతిపాదనతోనన్నా ప్రభుత్వం ముందుకు రావచ్చు కదా?

వంద మందికి పైగా శాసన సభ్యులు రాజీనామా చేశారు మన రాష్ట్రంలో. మంత్రులలో పలువురు రాజీనామా చేసి విధులకు సరిగ్గా హాజరవడం లేదు. కేంద్రంలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగినట్లే రాష్ట్రంలో జరుగుతుందో-లేదో తెలియదు. పాలన మొత్తం స్తంభించి పోయింది. ఐనా, రాజకీయ సంక్షోభం లేదని ఒకరు, రాజ్యాంగ సంక్షోభం లేదని ఇంకొకరు అంటున్నారు. పాలన సజావుగా సాగక పోవడం కన్నా ఇంకేం సంక్షోభం కావాలో మరి! ప్రభుత్వ విధులకు హాజరవ్వాల్సిన మంత్రులు, నిరాహార దీక్షలో కూచోడం కన్నా సంక్షోభం ఇంకేముంటుంది? ఏదేమైనా, సమస్యను పరిష్కరించుకో దలిస్తే, సంక్షోభం వుందో-లేదో అర్థమవుతుంది కాని, నిర్లిప్తతతో వుండే వారికి అంతా "ఆల్ ఈజ్ వెల్"!

2 comments:

  1. /సెంటిమెంటుపై కేంద్రం సానుభూతితో ఉందని చెబుతూ నే, రాష్ట్ర విభజనను సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, తెలంగాణలో రాష్ర్టం కోసం ఎంత బలంగా ఉద్యమిస్తున్నారో, సీమాంధ్రలో తెలంగాణకు అంత బలమైన వ్యతిరేకత ఉందని ఆజాద్ అనడంలో కొత్తే మన్నా వుందా? /

    కొత్త ఏమి లేదు, అంటే చాలా సాధారణమైన అందరికీ తెలిసిన వాస్తవం.
    /ఆయన ఈ విషయాన్ని ఇప్పుడే తెలుసుకున్నారా?/

    అవును/కాదు. ఆయన ఎప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారు? ఇప్పుడు తెలుసుకోకూడదా?! ఎప్పుడు తెలుసుకునేది అప్రస్తుతము, అనవసరం. అందరికీ తెలిసినదే తను మరోసారి చెప్పాడు అనుకుందాము. మీ అబ్జక్షనేమిటో అర్థం కాలేదు.

    / సీమాంధ్రుల మద్దతు లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయడం అసాధ్యమనే సంగతి ఇప్పుడెందుకు ప్రస్తావించాలి?/
    :)) అందరికీ తెలిసిన, వుందని ఒప్పుకున్న, వాస్తవమైన ముఖ్య విషయమైనప్పుడు ఎప్పుడు చెబితేనేమి?! ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు ఎందుకు చెప్పకూడదు?! అంతలా గింజుకు పోయే విషయం ఏమున్నది?

    అంతర్గత సమస్యలను విదేశాల్లో వాగడం క్షమించరాని భాధ్యతారాహిత్యము. దీన్ని సీరియస్‌గా తీసుకుని he should be kicked out of his responsible position - I strongly agree

    అది తప్పితే, సాధారణగా బేలన్స్డ్గా రాసే మీరు ఏదో ఆవేశంలో సమతుల్యం కోల్పోయినట్టు రాశారు, పరిశీలించుకోండి.

    ReplyDelete
  2. ఆజాద్ విస్పష్టంగా 'తీరాంధ్ర-సీమాంధ్ర' ప్రజల అంగీకారము లేకుండా ఎలాంటి నిర్ణయమూ తీసుకోబోమని చెప్పారు. దానిలో మీరంత తప్పుపట్టానికేమి కనిపించిందో నాకయితే అర్థం కాలేదు. మీరు (తెలంగాణవాదులు, మీరు తెలంగాణవాదినని స్వయంగా ప్రకటించుకున్నారు) తెలుసుకోవాల్సిన ముఖ్యవిషయము ఏమిటంటే మనోభావాలు తీరాంధ్ర-సీమాంధ్రలోనూ ఉంటాయని. తెలంగాణవాదుల నోటితీట (http://krishnaveniteeram.blogspot.com/2011/07/blog-post_9791.html) తగ్గనంతకాలం ఈ రావణకాష్టం ఇలా రగులుతూనే ఉంటుంది.

    అలాగే విభజిస్తే తీరాంధ్ర-సీమాంధ్రకు 'ఇది' ఇస్తాం అనే ప్రతిపాదనతో రావాల్సింది తెలంగాణవాదులు. అసలు చర్చల ప్రస్తావనే లేకుండా తెలంగాణ ఏర్పాటు చేసేయాలంటే ఎలా? హైదరాబాదు సంగతి తేలాలి, ఖమ్మం సంగతి తేలాలి, అప్పుల పంపకాలు తేలాలి. ఇవన్నీ స్పష్టమైన చిత్రం ఏర్పడిన పక్షములో తీరాంధ్ర-సీమాంధ్రులే విభజంకు సై అనవచ్చు తెలంగాణవాదులే నో అనావచ్చు.

    ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే అది దేశ సమగ్రతను బలిపీఠం ఎక్కించినట్లే! మా మీద దశాబ్దాల తరబడి చేస్తున్న అసత్యారోపణలను నిజం చేస్తూ నిర్మించబడే దేన్నయినా అడ్డుకుని తీరుతాం. కాని పక్షములో మా ఆందోళనా దిశ మార్చుకుని స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల దిశాగా కదం తొక్కుతాం.

    ట్యాంకుబండు విధ్వంసాలు, నల్లగొండ సజీవదహనాలూ, ఖమ్మం దౌర్జన్యాలూ ఇవన్నీ మాకెప్పటికీ గుర్తుంటాయి. తెలుగుతల్లికి చెప్పులదండలేసే తెలంగాణవాదులనోట 'తెలుగువారి ఆత్మగౌరవం' అనే చిలుకపలుకులు రావటం నేను విన్న అతిపెద్ద జోకుల్లో ఒకటి.

    ReplyDelete