సుజనరంజని (సిలికానాంధ్ర వెబ్ మాగజైన్) ఆగస్ట్ 2011
వనం జ్వాలా నరసింహారావు
ప్రపంచంలో మొట్ట మొదటిసారి, బుల్లెట్ ద్వారా కాకుండా, బాలెట్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కేరళ రాష్ట్రంలో, రాష్ట్ర రాజధాని నగరం తిరువనంతపురానికి మూడు-నాలుగు మైళ్ల దూరంలో-దాదాపు నగరం నడి బొడ్డులోనే, గత కొన్ని వారాలుగా జాతీయ-అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తల్లోకెక్కిన "పద్మనాభ స్వామి మందిరం" గా మళయాళంలో పిలువబడే ప్రాచీన "శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం" వుంది. ఎవరెవరి వూహకందిన విధంగా వారి వారి అంచనాల ప్రకారం, కోట్ల-కోట్లాది రూపాయల విలువగల అపార సంపద ఆ దేవాలయం నేల మాళిగలలో నిక్షిప్తమై వుందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి పోవడంతో, న్యాయమూర్తుల ఆదేశానుసారం, ఆ నిధి-నిక్షేపాలను వెలికితీయడం మొదలైంది. ఇదమిద్ధంగా ఇంతని అధికారికంగా విలువలు వెలువడకపోయినా, లభ్యమైన సంపద అంతులేనిది-అపారమైనది అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే, దేవాలయానికి-దేవాలయంలోని అనంత పద్మనాభుడుకి, ఆ మందిరం భూగర్భంలో వెలువడిన-వెలువడుతున్న విలువకట్టలేని నిధులకు, ఏకంగా అంతరిక్ష పహారాతో పటిష్టమైన బధ్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గగన తలంలోని ఉపగ్రహ సేవలను ఇందుకోసం వినియోగించుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.
శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర
క్షేత్రాల్లో ఒకటైన అనంతపద్మనాభ క్షేత్రం
వైష్ణవుల ఆరాధ్యదైవం పద్మనాభుడు. చారిత్రక నేపథ్యం, పౌరాణిక విశిష్టత సంతరించుకున్న సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం తిరువనంతపురం. సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం అక్కడ కట్టబడిన, అత్యంత పురాతనమైన అనంత పద్మనాభుడి ఆలయం ఒకప్పుడు "ఎట్టువీట్టిల్ పిల్ల మార్" అనే ఎనిమిది కుటుంబాల వారి నిర్వహణలో వుండేది. తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్ సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని, 1729 సంవత్సరంలో పునరుద్ధరించి, ఆలయానికి తామే సమస్తమంటూ ప్రకటించి, ఆలయంలోని శంఖాన్ని తమ సంస్థానానికి సంకేతంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566 లోనే నిర్మించారు. 10008 సాల గ్రామాలతో రూపు దిద్దుకున్న ఈ ఆలయాన్ని ఆసాంతం చూడాలంటే వరుసగా మూడు ద్వారాలను దర్శించుకోవాల్సిందే. నేటికి ఈ ఆలయం ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకుల ఆధీనంలోనే ఉంది. ఇక్కడ దీర్ఘ చతురస్రంగా వున్న వరండా నిర్మించడానికి 4000 మంది తాపీ పనివారు, 6 వేల మంది నిపుణులు, 100 ఏనుగులను ఉపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారని అంటారు. ఈ దేవాలయ ప్రాంగణం 7 ఎకరాల వరకుంటుంది. ప్రత్యేకమైన టేకుతో-బంగారు కవచంతో తయారు చేయబడిన ఈ దేవాలయం ధ్వజ స్తంభం ఎత్తు 80 అడుగులు.
1750 ప్రాంతంలో ట్రావన్ కోర్‌ను పరిపాలించిన మార్తాండ వర్మ అనంతపద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేశాడు. ఇక నుంచి రాజులు అనంతపద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావన్ కోర్ రాజులకు అనంత పద్మనాభ దాస అనే బిరుదు కూడా వచ్చింది. ఆలయం నుంచి లభించిన అపార సంపద ట్రావన్ కోర్ రాజవంశం వారసులకు చెందుతుందని పలువురు అంటున్నా, రాజ వంశానికి చెందిన వారు మాత్రం ఆ సంపద అంతా అనంత పద్మనాభుడికే చెందుతుందనడం వారి అపార భక్తికి నిదర్శనం. ట్రావన్ కోర్ రాజులు అనంత పద్మనాభుడుని సర్వస్వంగా భావించి, ఆరాధించారు. మార్తాండ వర్మ కాలంలోనే ఆలయానికి అపార సంపద సమకూరి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ దేవాలయంలో దైవ దర్శనమంటే, ఆదిశేషుడి మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుడి 18 అడుగుల మూర్తిని మూడు ద్వారాల నుంచి-ముఖాన్ని దక్షిణ ద్వారం నుండి, పాదాలను ఉత్తర ద్వారం నుండి, నాభిని మధ్య ద్వారం నుండి దర్శించు కోవడమే. పదివేల ఎనిమిది సాల గ్రామాలతో రూపు దిద్దుకొని, అమూల్యమైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్వామి ధగధగా మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. ఆదిశేషుడిపై యోగనిద్రలో వుండే విగ్రహం ఎదుట వుండే మండపం పై కప్పు ఒకే ఒక్క గ్రైనేట్ రాయితో మలచింది. ట్రావెన్ కోర్ రాజు తమ ఇలవేల్పుగా భావించిన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకు, నిత్య ఆలయానికి వెళ్లడం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు యోగనిద్రా మూర్తిగా దర్శనం ఇచ్చే అనంత పద్మనాభ స్వామి ఆలయం అపురూప శిల్పకళకు నిలయం. ఆలయం లోని స్తంభాలపై అనేక రకాల శిల్పాలు చెక్క బడి వుంటాయి. శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో అనంతపద్మనాభ క్షేత్రం ఒకటి. విష్ణుమూర్తి ఇక్కడ మూడు భంగిమల్లో... శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని దర్శనం ఇస్తారు. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. తమిళ ఆళ్వారుల ప్రబంధాల్లో ఈ ఆలయం ప్రస్తావన కనిపిస్తుంది. ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం, స్త్రీలు చీరె ధరించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.
"పద్మ నాభ" అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కల వాడని అర్థం. యోగ నిద్రా మూర్తిగా శయనించి ఉండగా, నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై వున్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం, నయనానందకరంగా కనిపిస్తుంది భక్తులకు. శేషుడు మీద శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కింద శివ లింగం కూడా ఉంటుంది. ఈ విధంగా, ఆలయం, త్రిమూర్తులకు నిలయంగా వెలిసిపోతుంటుంది. గర్భగుడిలో మూలవిరాట్టు వెనుక, కుడి, ఎడమ గోడల మీద అపురూపమైన దేవతామూర్తుల చిత్రాలు ఉంటాయి. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీమహావిష్ణువు ఉత్సవ మూర్తుల విగ్రహాల్ని కూడా భక్తులు దర్శించుకునే వీలుంటుందిక్కడ. ఆలయంలో నరసింహ, అయ్యప్ప, గణపతి, శ్రీకృష్ణ, హనుమ, విష్వక్సేన, గరుడ ఆలయాలు కూడా ఉన్నాయి. శిల్పాలు, పంచ లోహాలు, చెక్కలో అందంగా మలచిన దేవతామూర్తులు ఈ ఆలయంలో దర్శనం ఇస్తాయి. గర్భగుడితో పాటు గాలి గోపురం మీద కూడా అందమైన శిల్పాలు దర్శనం ఇస్తాయి. ఆలయం ముందు పద్మ తీర్థం అనే కోనేరు ఉంటుంది. ఆలయం లోపల 80 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయ ప్రాంగణంలో ఉన్న బలిపీఠం మండపం, ముఖమండపాల్లో కూడా దేవతామూర్తుల అపురూప శిల్పాలు కనిపిస్తాయి. ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం. శిల్పుల కళా ప్రతిభ అంతా ఇక్కడ పోత పోసుకుందా అనిపిస్తుంది.
నయనానందకరమైన అనంత పద్మనాభ స్వామి
దివ్య మంగళ రూపం
ద్రావిడ శైలి వాస్తు-శిల్ప శాస్త్రం ఆధారంగా నిర్మించిన పద్మనాభ మందిరం వివరాలు చాలా వరకు మధ్య కాలీన తమిళ ఆళ్వారుల దివ్య ప్రబంధాలలో చెప్పడం జరిగింది. ఆరు-ఏడు శతాబ్దాల కాలంలో రూపు దిద్దుకున్న ఈ దేవాలయ నిర్మాణం, మధ్య యుగపు చేరా వంశీ యుల కాలం వరకూ మార్పులూ-చేర్పులూ చోటుచేసుకుంటూ, పదహారవ శతాబ్దిలో గోపురం కట్టేంతవరకు కొనసాగింది. ఆ మాటకొస్తే, పద్ధెనిమిదవ శతాబ్దంలో కూడా పునరుద్ధరణ పనులు జరిగాయక్కడ. కేరళ రాష్ట్ర రాజధాని "తిరువనంతపురం" పేరు కూడా ఈ దేవాలయంలోని దేవుడి పేరు ఆధారంగానే వచ్చింది. "తిరు-అనంత-పురం" అంటే, అనంత పద్మనాభ స్వామి నిలయమైన పవిత్ర స్థలం అని అర్థం. భారత దేశాన్ని పాలించిన రాజుల్లో, చేరా రాజవంశం అతి ప్రాచీనమైన రాజ వంశంగా చరిత్రకారులు అంటుంటారు. చోళులతోను, పాండ్యులతోను కలిసిన చేరా రాజవంశీయులు, ఉమ్మడిగా దక్షిణ భారతంలోని మూడు ప్రధాన తమిళ రాజ్యాలను నెలకొల్పారు. సంగం తరం రాజ వంశీ యుల కంటే ముందు నుండి, పన్నెండవ శతాబ్దం వరకు దక్షిణ భారత దేశాన్ని ఏలిన చేరా రాజులు, తమ పరోక్ష వారసులుగా వేనాడ్ చేరా వంశస్త్తులుగా తయారు చేశారు. చేరా రాజ వంశం వారసులే ఐన, కులశేఖర వంశానుక్రమం నుంచి వచ్చిన "ట్రావన్ కోర్ రాజులు" "పద్మనాభ సేవకులు" గా తమను తామే భావించుకుని, అనంత పద్మనాభ స్వామి దేవాలయం నిర్వహణ బాధ్యతలు నిర్వహించుకుంటూ వస్తున్నారు అనాదిగా.
అనంత శయనుడి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాల గ్రామాలను, నేపాల్ లోని గండకి నది ఒడ్డునుంచి తెప్పించారు. సాల గ్రామాలను ఏనుగులపై వూరేగించుకుంటూ అక్కడకు తెచ్చారట. ప్రతి సాల గ్రామం పైన ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారుచేసిన పదార్థాన్ని, అతకడానికి వీలయ్యే ప్లాస్టర్ లాగా ఉపయోగించారట. క్రిమి-కీటకాల నుంచి విగ్రహం కాపాడబడ్డానికి అలా చేశారంటారు. నిత్యం జరిగే పూజా కార్యక్రమాలకు పుష్పాలను ఉపయోగిస్తారు. అభిషేకానికి ఉత్సవ విగ్రహాలనే వాడుతారక్కడ. గర్భ గుడి ముందుండే ఎత్తైన ప్రదేశాన్ని "ఒట్టక్కళ్ మండపం" అంటారు. పూజ చేయాలన్నా-దర్శనం చేసుకోవాలన్నా, ఆ మండపం ఎక్కాల్సిందే. దర్శనం కావాలంటే, మూడు ద్వారాలు దాటాల్సిందే. ఒక్క ట్రావన్ కోర్ రాజు మినహా ఎవరికీ సాష్టాంగపడి ప్రణామం చేసే అర్హత లేదక్కడ. ఆ రాజులు మాత్రమే "పద్మనాభ సేవకులు" గా పిలువ బడుతారు.
శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో, మూడు భంగిమల్లో ఏదో ఒక భంగిమలో మాత్రమే స్వామి దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మాత్రం, శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని స్వామి దర్శనం ఇస్తారు స్వామి. మరొక విశేషమైన అంశం, అదీ, ఇటీవలే బయట పడిందింకొకటుంది. పద్మనాభ స్వామి విగ్రహం, ముఖం-ఛాతీ మినహా, పూర్తిగా బంగారంతో చేయబడిందే కావడం. ఆయుర్వేద మిశ్రమం ఉపయోగించడానికి కూడా బలీయమైన కారణం వుంది. ముస్లిం రాజుల దండయాత్రలలో విగ్రహాలను ధ్వంసం కాకుండా కాపాడుకోవడానికి దాన్ని ఉపయోగించి వుండొచ్చు. స్వామి కిరీటం, చెవులకున్న కుండలాలు, ఛాతీని అలంకరించిన భారీ సాల గ్రామ మాల, మొత్తం ఛాతీ భాగం, శివుడి విగ్రహం వున్న చేతికున్న కంకణం, కమలం పట్టుకున్న ఎడమ చేయి, నాభి నుండి బ్రహ్మ వున్న కమలం వరకున్న తీగ, స్వామి పూర్తి పాదాలు కూడా బంగారు మయమే.
పద్మనాభ స్వామి దేవాలయం పుట్టు పూర్వోత్తరాల గురించి కథలు-కథలుగా చెప్పుకుంటారక్కడి వారు. "విల్వ మంగళతు స్వామియార్" గా ప్రసిద్ధికెక్కిన దివాకర ముని, శ్రీ కృష్ణ భగవానుడి దర్శనం కొరకు ప్రార్థన చేశాడట. ఆయనను కరుణించేందుకు, భగవంతుడు, మారు రూపంలో-ఒక అల్లరి పిల్లవాడుగా దివాకర ముని వద్దకు వచ్చాడు. ముని పూజలో వుంచిన ఒక సాల గ్రామాన్ని తీసుకుని మింగడంతో, కోపంతో పిల్ల వాడిని తరిమికొట్టగా, ఆ రూపంలో వున్న శ్రీ కృష్ణుడు సమీపంలో వున్న ఒక చెట్టు పక్క దాక్కున్నాడు. మరు క్షణమే పడిపోయిన ఆ వృక్షం, విష్ణు మూర్తిగా మారి పోయి, శయన భంగిమలో-అనంత శయనంగా-యోగ నిద్రా మూర్తి తరహాలో కనిపించింది. అలా జరిగిన ఆ సందర్భంలో, ఆయన రూపం-ఆకారం ఎంతో పెద్దగా వుండడంతో, దివాకర ముని, అంత పెద్ద ఆకారాన్ని పూర్తిగా-తన తనివి తీరా దర్శించుకోలేక పోతున్నానని, దాంట్లో మూడో వంతుకు తగ్గమని ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలను అంగీకరించిన భగవంతుడు, అలానే తగ్గి పోయి, తనను దర్శించుకోవాలంటే, మూడు ద్వారాల గుండా మాత్రమే వీలుంటుందని అంటాడు. ఇప్పుడున్న ఆ మూడు ద్వారాలు రావడానికి అదే కారణ మంటారు. ఏడు పరశురామ క్షేత్రాలలో ఒకటైన పవిత్ర స్థలంలో, పద్మనాభ స్వామి దేవాలయం వుందని మరొక నమ్మకం. స్కంద, పద్మ పురాణాలలో, ఈ దేవాలయానికి సంబంధించిన విశేషాలున్నాయి.
కేరళలో అత్యంత ప్రధానమైన పండుగ ఓనం. ఏటేటా, ఆ పండుగను పురస్కరించుకుని, శతాబ్దాల కాలం నుంచి, తమిళనాడులోని కాంచీపురం నుండి తిరువనంతపురం వలస వచ్చిన, సంప్రదాయ కుటుంబ కళాకారులు, పద్మనాభుడుకి అపురూపమైన కాల్పనిక చిత్రాలను కానుకగా ఇచ్చే సంప్రదాయం వుంది. చెక్కలపై విష్ణుమూర్తి అవతారాల కాల్పనిక చిత్రాలను, అత్యంత రమణీయంగా రూపొందించి, "ఓనవిల్లులు" గా పిలువబడే ఈ బహుళ రంగుల చిత్ర కళాఖండాలను, ఆలయంలో జరుపుకునే ఓనం సంబరాల సందర్భంగా, "తిరువోనం" రోజున, భగవంతుడికి సమర్పించు కుంటారు. పద్దెనిమిదవ శతాబ్దంలో, పద్మనాభ స్వామి ఆలయాన్ని పునరుద్ధరించిన, నాటి ట్రావెన్ కోర్ రాజు మార్తాండ వర్మ పిలుపు మేరకు, తమిళనాడు నుంచి వచ్చి పని చేసిన, "వణియమ్మూల విలాయిల్" కుటుంబీకుల సంతతికి చెందిన ఈ తరం ప్రధాన కళాకారుడు, బిన్ కుమార్, నాటి పరంపరను ఈ ఏడాది కూడా కొనసాగించే పనిలో తమ కుటుంబీకులు నిమగ్నమై వున్నారని అంటున్నారు. సుమారు వేయి చిత్రాలకు పైగా తయారు చేసి, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరుగనున్న ఓనం పండుగ కల్లా, అనంత పద్మనాభుడుకి కానుకగా అందచేసే ప్రయత్నంలో కళాకారులున్నారు.
పురాతన ఆలయాలన్నింటికీ అపారమైన సంపదలున్నాయి. ఆస్తులు కొదవ లేదు. వేలాది ఎకరాల భూములు, నగదు ఉండటం మామూలే. అయితే అనంత పద్మనాభుడి ఆస్తులు ఇతర దేవాలయాలతో పోల్చదగినవి కాదు. తిరుమలేశుని సంపద కంటే ఎక్కువే. ఇటీవల దేవాలయంలోని నేలమాళిగలో బయట పడిన నిధులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనంత పద్మనాభుడి ఆలయంలో ధన-కనక రాశులను భద్రపరిచే రహస్య భూ గృహాలు ఆరున్నాయి. వీటిలో దేవుడి సంపద కొంత దాగుందని ఒకప్పుడు కొందరికి, ఇప్పుడు అందరికీ తెలిసిన రహస్యం. ఈ సంపదను ఎప్పుడూ-ఎవరూ లెక్కించిన ఆనవాళ్లు లేనట్లే. రాళ్లతో మూసివుండే ఈ గదుల్లో కొన్నింటిని తెరిచి దాదాపు 150 ఏళ్లు దాటిపోయింది.1860 లో కొన్ని గృహాలను ఏదో కారణం వల్ల మూసి వేశారు. 1950లో కొన్నింటిని సీల్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఆలయాలన్నింటినీ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినప్పటికి, పద్మ నాభస్వామి ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులు తమ పర్య వేక్షణలోనే ఉంచుకున్నారు. ఇప్పటికీ ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకులే దీని కార్య నిర్వహణ ట్రస్టీలుగా కొన సాగుతున్నారు.
ప్రస్తుతం, ఉత్తర దామ్ తిరుణాళ్ ఈ ఆలయ ట్రస్టీగా ఇంకా కొనసాగుతున్నారు. ఆలయ సంపద నిర్వహణలో అక్రమాలు నెల కొన్నాయని, వీటిని గాడిలో పెట్టాలని సుందర రాజన్ అనే న్యాయవాది 2011 లో, సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దేవాలయాన్ని నిర్వహించే ట్రస్టుకు, ఆస్తులు సంరక్షించే శక్తి-సామర్థ్యాలు లేవని సుందర రాజన్ తన పిటీషన్లో ఆరోపించారు. అగ్నిమాపక దళం శాఖకు చెందిన ప్రభుత్వాధికారులను, పురావస్తు శాఖకు చెందిన అధికారులను, గర్భ గుడిలోని రహస్య గృహాలను తెరిచి-తనిఖీ చేసి చూడాల్సిందిగా, వారికి కనిపించిన వస్తువులేంటి తేల్చాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందే, కేరళ హై కోర్టు, దేవాలయ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. కోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించి సంపదను లెక్కించాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆలయ సంపద లెక్కింపు మొదలవడం, రోజు-రోజుకూ అపార ధన-కనక రాశులు కోకొల్లలుగా బయటపడడం-బయట పడ్డ విలువ తెలుసుకున్న కమిటీ సభ్యులు-వారి ద్వారా యావత్ ప్రపంచం ఆశ్చర్య పోవడం విశేషం.
ఆలయ నేల మాళిగలలో గదుల నుంచి వెలికి తీసిన టన్నుల కొద్దీ బంగారం, బంగారు-వజ్రా భరణాలు, వజ్ర-వైఢూర్యాలు, దేవతా ప్రతిమలు-కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు, పురాతన బంగారు-వెండి నాణాలు, కోట్లాది రూపాయల విలువ చేసే విష్ణుమూర్తి బంగారు విగ్రహం, బంగారంతో చేసిన ఏనుగు బొమ్మ, కేజీల కొద్దీ ఇతర బంగారు విగ్రహాలు, వేలాది కంఠాభరణాలు-గొలుసులు, కమిటీ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సంచుల్లో భద్రపరిచిన 16వ శతాబ్దం నాటి శ్రీ కృష్ణదేవరాయల కాలం నాణాలు, ఈస్టిండియా కంపెని-నెపోలియన్ కాలాల నాటి నాణాలు కూడా లభ్యమయ్యాయంటున్నారు. బంగారు గొలుసులు-బంగారు టెంకాయలు, స్వర్ణ శంఖాలు, తదితర చిత్ర-విచిత్రమైన పురాతన వస్తువులు అక్కడ లభ్యం కావడం ప్రపంచమంతటినీ విస్మయానికి గురిచేసింది. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలుగా నేలమాళిగలో నిక్షిప్తమై పోయాయి. మానవ మాత్రులెవ్వరూ, ఇప్పటి వరకు, కనీ-వినీ ఎరుగని, కళ్లారా ఒక్క చోట చూడని "అనంతమైన సంపద", పద్మనాభ స్వామి ఆలయంలో బయటపడింది. ఆలయంలో లభ్యమైన సంపద ఇన్ని లక్షల కోట్ల రూపాయలని, విదేశీ కరెన్సీలో ఇన్ని బిలియన్ల డాలర్లేనని చెప్పడం అవివేకం తప్ప మరేమీ కాదు. ఆ సంపదకున్న పురావస్తు ప్రాధాన్యతా దృష్టితో మాత్రమే దాన్ని చూస్తే, ఆ విలువ మరిన్ని రెట్లనడమే కాకుండా, బహుశా విలువ కట్టలేనిదని కూడా అనాల్సి వస్తుందేమో! విలువ కట్టడానికి, ఆ సంపదేమన్నా బహిరంగ మార్కెట్లో అమ్మే అంగడి సరుకు కాదు కదా! అందుకే కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి అంతులేని ఆ వింత సంపదంతా పద్మనాభుడిదేనని తేల్చి చెప్పారు.
అనంత పద్మనాభ స్వామి ఆలయ నేల మాళిగల్లోంచి బయటపడిన అపార నిధులన్నీ దేవ-దేవుడి ఆస్తులని, ఆ సంపద రాజ కుటుంబానికి గానీ, భక్తులకు గానీ చెందదని, ప్రభుత్వానికీ దానిపై అధికారం లేదని ఒకప్పటి తిరువాన్‌కూర్ మహారాణి రాణీ గౌరీ లక్ష్మీబాయి అంటున్నారు. ఆమె మరొక మాట కూడా చెప్పారు. ఆ నిధులను ఆలయ నేల మాళిగల్లోనే తిరిగి భద్రపరిచి, యథాతథ స్థితిని కొనసాగించాలంటారు. అదెంతవరకు సమంజసమో ఆలయ నిర్వాహకులు, ప్రభుత్వం, అత్యున్నత న్యాయస్థానం ఆలోచించాలి.
తిరుమల ఆస్తులను మించి పోయిన తిరువనంతపురం పద్మనాభుడి సంపద ఎలా వచ్చిందన్న దాని పై ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. ఈ గదులకు వేసిన తాళాల తీరు, రాళ్లతో పకడ్బందీగా గదులను మూసి వేసిన వైనం, వాటిని తెరిపించిన కమిటీ సభ్యులను ఆశ్చర్య పరిచింది. ఒక్కో గది తాళాలు తీయడానికి చాలా సమయం పట్టినట్లు అధికారులు చెప్పారట. అనంత పద్మనాభ దేవాలయంలో దొరికిన నిధిని ఎలా కాపాడాలన్న విషయంపై అధికారులు ఆలోచనలో పడ్డారు. మధ్యంతర చర్యగా కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎవరెన్ని చెప్పినా, దొరికిన సంపదను ఏం చేయాలనే దాని పైన కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అపురూప నిధి నిక్షేపాల గురించి ట్రావన్ కోర్ మహారాజులకు తెలిసుండవచ్చని, అందుకే, వీటిని బయటకు తీసే విఫల ప్రయత్నం ఒక సారి 1908లో చేశారని చరిత్రకారులు కొందరంటున్నారు. 1931లో మాత్రం ఒకసారి సంపదను లెక్కించారట. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 1933లో ప్రచురించిన, రచయిత్రి ఎమ్లి గ్రిల్ క్రిస్ట్ హాచ్ పుస్తకం, "ట్రావన్ కోర్ : ఏ గైడ్ బుక్ ఫర్ ద విజిటర్" లో, ఆమె ట్రావన్ కోర్‌లో పర్యటిస్తున్న సమయంలో, పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న నిధిని బయటకు తీసి వాటిలో ఉన్న వస్తువులను నమోదు చేసేందుకు ఒక ప్రయత్నం జరిగిందని వుంది. నిధులను వెలికి తీసే ప్రయత్నం చేసినప్పుడు, అవి భద్రపరిచిన గదుల్లో పాములు తిరగడం గమనించినట్లు కూడా ఆమె తన పుస్తకంలో రాసింది. ఆలయంలోని ఆరో నేలమాళిగకు నాగ బంధం ఉందని, దాన్ని తెరవకూడదని వినిపిస్తున్న వాదనలకు, గ్రిల్ క్రిస్ట్ పుస్తకంలో చెప్పిన దానికి సంబంధముండ వచ్చు.
దేవాలయ నేలమాళిగలకు సంబంధించి మొత్తం ఆరు ఖజానా గదులున్నాయి. గర్భ గుడి కింద వున్న ఆ గదులను తెరిచేందుకు న్యాయస్థానం, "ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్" గదులుగా వాటికి పేరు పెట్టారు. వీటిలో "ఎ, బి" గదులు గత 130 సంవత్సరాలలో ఎన్నడూ తెరవలేదు. "సి, డి, ఇ, ఎఫ్" లేబులున్న గదులు మాత్రం అప్పుడప్పుడూ తెరుస్తూనే వున్నారు. ఆ నాలుగు గదుల "సంరక్షకులు" గా వున్న ఇద్దరు దేవాలయ పూజారులు "పెరియ నంబి", "తెక్కెడం నంబి" పర్యవేక్షణలో మాత్రమే అవి అప్పుడప్పుడూ తెరవడం జరుగుతోంది. నిత్యం దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు భంగం వాటిల్లని రీతిలో మాత్రమే, "సి, డి, ఇ, ఎఫ్" లేబులున్న గదులు తెరవాల్సి వుంటుందని, అవి తెరవడానికుద్దేశించిన పని పూర్తైన తర్వాత తిరిగి యథావిధిగా మూసేసి వుంచాలని ఇటీవలి సుప్రీం కోర్టు ఉత్తర్వుల సారాంశం. ఇక "ఎ, బి" గదుల విషయానికొస్తే, వాటిల్లో నిక్షిప్తమై వున్న, నిధుల లెక్కింపు చేసి, రికార్డులలో నమోదు కార్యక్రమం పూర్తైన వెంటనే, వాటినీ మూసేసి వుంచాలని కూడా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, "ఎ" అని మార్కు చేసి వున్న గదిని తెరవడం, అందులోని నిక్షిప్తమై వున్న అపార సంపదను గుర్తించడం పూర్తైంది. ఇక మిగిలిందల్లా, "బి" అని లేబుల్ వున్న గదిని తెరవడమే. ఆ గదికి నాగ బంధం వుందని, ఇనుప గోడలతో పటిష్టంగా గదిని నిర్మించారని, ఆ గదిని తెరిస్తే తీవ్ర అరిష్టం వాటిల్లే ప్రమాదముందని, గది లోపల నుంచి సముద్రం మధ్యలోకి మార్గముందని, తెరిచిన మరుక్షణంలోనే సముద్రంలోని నీరు కేరళ రాష్ట్రాన్ని ముంచేస్తుందని, రకరకాల అనుమానాలు-అపోహలు-వాస్తవానికి చేరువగా వుండే కొన్ని చారిత్రక సాక్ష్యాలు ప్రచారంలోకి వచ్చాయి. "ఎ" గదిని తెరవడానికి నియమించిన కమిటీ సభ్యుల్లో కొందరి అనారోగ్యం కలిగిందన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఇదిలా వుండగా, నిజా-నిజాలను కాసేపు పక్కనుంచి, పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగల్లో సంపద పరిశీలనను ఆపేయండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు తెరవొద్దని ఏడుగురు సభ్యుల పరిశీలన కమిటీకి సూచించింది. ఇంత పెద్ద మొత్తంలో బయటపడిన ఆస్తులకు, ఆలయానికి మీరెలా భద్రత కల్పించగలరని, ఆలయ పవిత్రతను కాపాడడానికి తీసుకునే చర్యలేమిటని ట్రావెన్ కోర్ రాజ కుటుంబం ఆధ్వర్యంలోని ట్రస్టును, కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో గుప్త నిధులు బయలుపడిన నేపథ్యంలో తమిళనాడులోని తిరుచ్చి, తిరువారూర్ ఆలయాల్లోనూ ఇలాంటి నిధులుండే అవకాశముందని భూగర్భ పరిశోధక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా భూలోక వైకుంఠంగా పేరు గాంచిన తిరుచ్చి శ్రీరంగనాథ స్వామి ఆలయ శిలాఫలకాలపై ఉన్న శాసనాలను, రాతలను చూపుతున్నారు. తంజావూరు జిల్లా భూగర్భ పరిశోధకులు ఈ వివరాలను బయటపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా అహోబిలంలో, గుంటూరు జిల్లా ఉండవల్లిలో, రంగారెడ్డి అనంతగిరిలో వున్న దేవాలయాల్లో కూడా గుప్త సంపద వుందని కొందరంటున్నారు.
పద్మనాభ స్వామి ఆలయంలో లభ్యమైన సంపదను, ఈజిప్టు చక్రవర్తి టుటుంకమన్ సమాధి నుండి వెలికి తీసిన నిధి నిక్షేపాలతో పోలుస్తున్నారు. ఆయన సమాధిలో, హొవార్డ్ కార్టర్ అనే వ్యక్తి కనుగొన్న రహస్య నిధులలో మూడు వేల సంవత్సరాల క్రితం నాటి, మూడు వేల రకాల అంతులేని విలువైన వస్తువులు దొరికాయట. పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగల్లో దొరికినవి మూడు వందల ఏళ్ల క్రితానివి మాత్రమే.
ఇంత తతంగం జరిగింతర్వాత, జరగబోయేది మరెంతో మిగిలి వుండగా, వెలుగులోకి వచ్చిన ఈ అపార సంపద ఎవరి పరం కావాలన్న చర్చ జోరందుకుంది. ఇలా చర్చించే పలువురికి, మన భారత దేశ సంస్కృతీ-సంప్రదాయాల గురించి అంతగా తెలిసినట్లు లేదని, దేవాలయాలకు సంబంధించిన అనేకానేక అంశాలను క్షుణ్ణంగా పరిశోధించి-పరిశీలన చేసిన, తమిళనాడు రాష్ట్రానికి చెందిన పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ ఆర్. నాగ స్వామి అంటున్నారు. ఒక ఆంగ్ల పత్రికకు ఆయన ప్రత్యేకంగా రాసిన వ్యాసంలో, ఈ అంశానికి చెందిన పలు విషయాలను, వివిధ కోణాలలోంచి, ఆవిష్కరించారు. అన్నింటి కన్నా తొలుత అందరూ దృష్టి పెట్టాల్సిన విషయం, తరతరాలుగా, ట్రావన్ కోర్ రాజ వంశీ యులు, పద్మనాభుడి దాసులుగా, ఏళ్ల తరబడి, ఈ అమూల్యమైన ధన రాశులను, కంటికి రెప్పలాగా కాపాడి-భద్ర పరిచినందుకు, జాతి యావత్తూ వారికి కృతజ్ఞతలు తెలియ చేసుకోవాలని నాగ స్వామి అంటున్నారు. ఈ అపార సంపద ఆ దేవాలయంలోకి ఎలా వచ్చిందని, ఒక వేళ భక్తులే ఇచ్చి వుంటే, అవి వారు భగవంతుడికిచ్చారా? లేక, దేవాలయానికిచ్చారా అని ప్రశ్నిస్తున్నారు పలువురు. ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు, భారత దేశంలో పలు ప్రదేశాల్లో లభ్యమయ్యే శిలా శాసనాలను కాని, రాత రికార్డులను కాని చదివినవారికి, భక్తులలా ఇచ్చే కానుకలు, "దేవుడికే గాని" దేవాలయానికి కాదనేది బోధ పడుతుంది. తిరుమల-తిరుపతి దేవస్థానం ఇందుకు చక్కటి ఉదాహరణ. ఇంకా లోతుగా పరిశీలించి చూస్తే, క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నుండే కేరళ రాష్ట్రంలోని దేవుళ్లకు భక్తుల కానుకలు అపారంగా వచ్చాయని, తొమ్మిదో శతాబ్దం తర్వాత నమోదైన రికార్డులలో వుండడం గమనించాల్సిన విషయం. శివాలయాల్లో భక్తుల కానుకలను "చండికేశ్వరుడు" పేరు మీద, వైష్ణవాలయాల్లో "విశ్వక్సేనుడు" పేరు మీద ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది.
నాగ స్వామి వ్యాసంలో మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఆయన "లండన్ నటరాజ కేసు" ను ప్రస్తావించారు. ఆ కేసులో కీలకమైన తీర్పిచ్చిన న్యాయ మూర్తి, భారత దేశం న్యాయస్థానాలలో వెలువడిన అనేక తీర్పులను పరిశీలించారు. లండన్ హైకోర్టులో ఆ కేసు విచారణ సందర్భంగా నాగ స్వామిని కూడా సాక్ష్యం ఇవ్వడానికి పిలిచారు. ఏ దేవాలయమైనా, ఎంత పురాతనమైన దైనా, పూర్తిగా శిథిలమై పోయినా, ఆ దేవాలయం ఆనవాళ్లున్నట్లుగానే భావించి, దానికి చెందిన ఆస్తులన్నీ దేవాలయానికే చెందాలని న్యాయ మూర్తి తీర్పిచ్చారు. ప్రాచీన ధర్మ శాస్త్రాలను అనుసరించి, ఎవరైనా (భగవంతుడికైనా సరే) ఎవరికైనా కానుకలివ్వాలంటే, ఆ సొత్తు వారు న్యాయ పరంగా సంపాదించిందై వుండి తీరాలి. అలాంటి కానుకలనే "దానం" అంటారు. దాత ఆ సొత్తుపై న్యాయ పరమైన హక్కులుండాలి. దానం స్వీకరించే వారి చేతిలో నీరు పోసి, దాత వారి సొంతం చేయాలి తన కానుకలను.
ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో, ఇన్నాళ్లూ నిక్షిప్తమై, ఇప్పడు వెలికి తీసిన సంపదంతా, ఆ విధంగానే, అనేకమంది భక్తులు, ఆ స్వామికి కానుకలుగా ఇచ్చినవంటారు నాగ స్వామి. పరాయి దేశాల రాజులతో యుద్ధం చేసి గెలుచుకున్న సొత్తు ఇదని కొందరంటున్నారు. నిజమే...కాని, యుద్ధంలో గెలుచుకున్న సొత్తుకు కూడా హక్కుదారు గెలిచిన రాజే! అంటే, ఏళ్ల తరబడి ఆ దేవాలయంలో నిక్షిప్తంగా వుంచిన సంపదకు యజమాని-హక్కుదారు అనంత పద్మనాభ స్వామి తప్ప ఇతరులు కాదు. కొందరు మరో వితండ వాదన లేవదీస్తున్నారు. ఆ సంపదను సందర్శకుల దర్శనార్థం "మ్యూజియం" లో పెట్టాలట! భగవంతుడికి భక్తులిచ్చే కానుకలను మ్యూజియాల్లో పెట్టడానికి కాదు. లండన్ నటరాజ కేసులో నాగ స్వామి చెప్పిన సాక్ష్యాన్ని అంగీకరించిన న్యాయ మూర్తి, నటరాజ విగ్రహాన్ని, శిథిలమై పోయిన పత్తూర్ చోళ దేవాలయానికే చెందాల్సిందిగా తీర్పిచ్చారు. ఒక విదేశీ న్యాయ మూర్తి, భారత దేశ సంస్కృతీ-సంప్రదాయాలను గౌరవించి, దానికి అనుగుణంగానే తీర్పిస్తే, మన మధ్య నున్న-మన మేధావులు కొందరు, మ్యూజియాలలో దేవాలయాల భగవంతుడి సొత్తు భద్ర పరచాలనడం హాస్యాస్పదం.
దేవాలయంలో దొరికిన సొత్తు-సంపద విలువ ఎంతనేది అప్రస్తుతం. ఆ సంపదంతా భగవంతుడు కే చెందాలి. దాని పరిరక్షణ-ఉపయోగం, న్యాయ బద్ధంగా-న్యాయ స్థానాల తీర్పు మేరకు నియమితులయ్యే, ట్రస్టీలే నిర్ణయించడం సమంజసం. ఇన్నాళ్లు, ఇంత పకడ్బందీగా, ఆ సొత్తును కాపాడుకుంటూ వస్తున్న, ని స్వార్థ ట్రావెన్ కోర్ రాజ వంశీయుల వారసులకే ఆ బాధ్యత అప్ప చెప్పడం హర్షణీయంగా వుంటుంది. కాక పోతే, ఆధునిక యుగంలో చోటు చేసుకుంటున్న అబధ్రతా కారణాల దృష్ట్యా, ఆ సంపదకు రక్షణ కలిగించే బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కలివిడిగా తీసుకుంటే బాగుంటుంది.
Post Script: (Added on 22nd July 2011) ఈ నేపధ్యంలో, అనంత పద్మనాభుడి సంపద పరి రక్షణకు, ఆలయం నేల మాళిగలలో ఇంకా ఉన్నదని భావిస్తున్న సంపదను వెలికి తీయడానికి, ఐదుగురు నిపుణులతో కూడిన ఓ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. నేషనల్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ బోస్ నేతృత్వంలో పనిచేయనున్న ఈ కమిటీలో, తీయ పురావస్తు శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంకుకు చెందిన నిపుణులు ఉండాలని కోర్టు ఆదేశించింది. కమిటీ తన నివేదికను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించాలని జస్టిస్ ఆర్ వీ రవీంద్రన్, జస్టిస్ ఏకే పట్నాయక్ తో కూడిన బెంచ్ ఆదేశించింది. అలానే, ఆలయ సంపదను వెలికి తీసే కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన మరో కమిటీని కూడా కోర్టు నియమించింది. తిరువాన్కూర్ రాజవంశం వారసుడు రాజా మార్తాండ వర్మ, సెక్రటరీ స్థాయి ప్రభుత్వ ప్రతినిధి, కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంఎస్ కృష్ణన్ ఈ పర్యవేక్షక కమిటీ సభ్యులు. సంపదను వెలికి తీసేటప్పుడు, అనధికారికంగా, ఎవరినీ అనుమతించ రాదని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.
Good information. Thank u very much sir. jagadeesh.
ReplyDeleteసమాచార సేకరణ,కూర్పు అభినందనీయం - భండారు శ్రీనివాసరావు
ReplyDeleteThank u telugu lo rasinaduku
ReplyDeleteచాలామంచిసమాచారాన్నిఅందిoచారు,కానీ,సుందర రాజన్ పరమపదిoచడం చాలా భాదాకరo.
ReplyDeletetravel kovela raja vamsastula nijayiteni ma politicians patiste mana desam swarna yugamga marutndi.siva rama krishna prasad.
ReplyDeleteReally True. Thank You
ReplyDeleteWELL MESSAGE
ReplyDelete