ఆంధ్ర జ్యోతి దినపత్రిక (11-08-2011)
సయ్యద్ హసన్ మాటల్లో...హైదరాబాద్ దశ-దిశ?
వనం జ్వాలా నరసింహారావు
హైదరాబాదీయుల ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిపోవడంతో, ప్రారంభంలో ఏదో ఆర్థిక కారణాల వల్ల తలెత్తిన అసంతృప్తి, పోను పోను తమ హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మార్పు చెంద సాగింది. తమ ప్రాంత పాలన తమ ద్వారానే జరగాలని, పాలనా పరమైన విధివిధానాలను రూపొందించుకునే ప్రత్యేక హక్కు తమకు కావాలని, ఇతరుల (స్థానికేతరుల) ప్రమేయం - జోక్యం ఉండకూడదని, అందుకొరకు సరైన ముల్కీలను మాత్రమ ఎంపిక చేయాలని ముల్కీలు ఒత్తిడి చేయడం మొదలైంది. అలా ఆరంభమైందే 1935 నాటి ముల్కీ ఉద్యమం.
ముల్కీ ఉద్యమాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆరు సూత్రాల పథకం నుంచి 14 ఎఫ్ నిబంధనను తొలగించమని హైదరాబాద్ విద్యార్థులు చేస్తున్న ఇప్పటి ఉద్యమానికి, వందేళ్ళ క్రితం, దివాన్ సాలార్ జంగ్ స్థానికేతరులను తీసుకొచ్చి ఉన్నతోద్యోగాలలో నియమించినప్పుడు దరిమిలా చోటుచేసుకున్న ముల్కీల ఆందోళనకు పెద్ద తేడా ఏమీ లేదనాలి. అప్పుడూ ఇప్పుడూ దోపిడీకి గురైంది తెలంగాణలోని స్థానికులే. నాడు (నిజాం) పాలకుల ఉద్దేశం మంచిదైనా వారి ఆలోచన, వ్యూహం చెడ్డది. నేడు పాలకుల వ్యూహం కూడా చెడ్డదే. తత్ఫలితంగానే ఉద్యమం ప్రజ్వరిల్లింది. తప్పేముంది? సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో హైదరాబాద్ సంస్థానంలో పాలనా సంస్కరణలకు పూనుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు పాలనా దక్షత కలిగిన స్థానికులు లభ్యం కావడం లేదన్న సాకుతో దివాన్ సాలార్ జంగ్, ఇతర రాష్ట్రాల నుంచి స్థానికేతరులను, విద్యాధికులను తీసుకురావడం ప్రారంభించారు. అప్పటినుంచే స్థానికులను దోపిడీకి గురిచేయడం కూడా ఆరంభమైంది. బయటివారిని ఇక్కడికి రప్పించడం కేవలం ఒక తాత్కాలిక చర్య మాత్రమేనని, నాటి పాలకులు చెప్పినప్పటికీ వచ్చిన వారంతా ఇక్కడ శాశ్వతంగా తిష్ఠ వేసుకుపోయారు. అలా వచ్చిన వారిలో కొందరు మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన సీమాంధ్ర ప్రాంతీయులు. వారే, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తరువాత, పాలకుల అవతారంలో, తెలంగాణ ప్రాంత ప్రజలను దోపిడీకి గురిచేస్తూ పోయారు. ఇదే ముల్కీ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్రం కావాలన్న నినాదానికి దారి తీసింది.
స్థానికేతరులను హైదరాబాద్ సంస్థానానికి తీసుకురావడానికి సాలార్ జంగ్ చెప్పిన కారణాలు ఒకటైతే, జరిగింది వేరొకటి. స్థానికులకు సరైన పాలనాపరమైన శిక్షణనిచ్చి, ఉన్నత పదవులలో పనిచేసే సామర్థ్యాన్ని వారికి కల్పించాల్సిన బాధ్యతను స్థానికేతరులకు అప్పచెపితే వారు చేసింది మరొకటి. ఒక క్రమ పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా, స్థానిక సామర్థ్యాన్ని నీరుగార్చే విధంగా, వారికి ఏ మాత్రం ఉద్యోగావకాశాలు కలుగని రీతిలో మరిన్ని పోస్టులను సృష్టించి, వాటిని కూడా తమ వారికే - బైటనుంచి తెచ్చి కట్టబెట్టారు ఆ మహానుభావులు.
ఆ తర్వాత నిజాం నవాబు ఏర్పాటుచేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించి, రాష్ట్రానికి తిరిగొచ్చినవారికి కూడా ఉద్యోగావకాశాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ రాష్ట్రం, అందులోని ఉద్యోగాలు - సంపద న్యాయంగా స్థానికులకే చెందాలన్న నినాదం రూపుదిద్దుకుంది. ఆ నినాదాన్ని ఆచరణాత్మకంగా మలిచేందుకు 'ముల్కీ ఉద్యమం' పేరుతో నిర్మాణాత్మకమైన ఉద్యమంగా ఎప్పుడో ఎనభై సంవత్సరాల నాడే రూపుదిద్దుకుంది. అదే కాలక్రమేణా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమంగా నేటికీ కొనసాగుతోంది. ఏనాడో 1935లోనే తెలంగాణలోని హైదరాబాదీయులలో స్థానికేతరుల దోపిడీకి వ్యతిరేకంగా 'అసంతృప్తి- ఆత్మగౌరవం' ప్రాతిపదికగా ఆవిర్భవించిందే ముల్కీ ఉద్యమం. ఆ క్రమంలో, ఆ ఉద్యమానికి మేధోపరమైన ఆసరా అందించేందుకు అలనాటి ఐదుగురు ప్రముఖుల ప్రమేయంతో వెలసిన సంస్థ 'నిజాం పౌరుల సమితి' (The Nizam's Subjects League). కుమారి పద్మజా నాయుడు, అబ్దుల్ హసన్ సయ్యద్ అలీ, బూర్గుల రామ కిషన్‌రావు, ఎస్‌బిశర్మ, సయ్యద్ అబిద్ హసన్‌లే ఆ ఐదుగురు హైదరాబాద్ ప్రముఖులు.
రాష్ట్రంలో నెల కొన్న పరిస్థితి అస్తవ్యస్తంగా వుందని, సిబ్బందికి సంబంధించిన పాలనా వ్యవహారాలు వుండాల్సిన రీతిలో లేవని, వాటిని మెరుగు పరచాలంటే ఏదో ఒకటి చేయడమో-వున్న దాన్ని మార్చి సరిదిద్దడమో తక్షణం చేయాల్సిన అవసరం వుందని ఆ ఐదుగురి బృందం అభిప్రాయానికి వచ్చింది. 1935 లో సయ్యద్ హసన్ రాసిన "విదర్ హైదరాబాద్" అనే చిన్న ఆంగ్ల పుస్తకంలో, అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలోని పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలను విపులంగా పేర్కొనడం జరిగింది. (పాత పుస్తకాలు అమ్మే చోట ఈ పుస్తకం లభ్యమయింది. దాని ధర కేవలం ఒక రూపాయి మాత్రమే!). ఏ ప్రాంతం వారినీ కించపరచకుండా, ఎవరిపై ఎటువంటి ద్వేష భావం లేకుండా, తమ ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి-స్వయం అభివృద్ధి సాధించడానికి మాత్రమే వుద్దేశించింది ముల్కీ ఉద్యమం అంటూ తన ముందుమాటగా రచయిత పేర్కొన్నారు.
స్థానికుల సాధారణ-ప్రత్యేక హక్కులను నిశ్చితంగా రూఢి పరచుకునే దిశగా ఉద్యమం సాగేందుకు లీగ్ ఒక ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది. హైదరాబాద్ రాష్ట్రానికి సేవలందించేందుకు, అక్కడ లభ్యమయ్యే ఆర్థిక పరమైన వనరుల వల్ల పూర్తిగా లబ్ది పొందేందుకు, పాలనా విధానాలను చక్క దిద్దేందుకు-పాలు పంచుకునేందుకు, అవసరమైన సర్వ హక్కులు ముల్కీలకు మాత్రమే చెందాలని దాని సారాంశం. ఆ కమిటీ మరో ఘాటైన పదం కూడా వాడింది. ఎవరైనా ముల్కీ, ఈ తీర్మానంలోని "న్యాయాన్యాయాలను" ప్రశ్నించుతే-అనుమానించుతే, వారు ముల్కీలుగా పిలువబడే నైతిక అర్హత కోల్పోయినట్లేనని స్పష్టం చేశారు. లీగ్ దృష్టిలో "స్థానికేతరులు" అంటే బయటి నుంచి వచ్చిన ప్రతివారూ ఆ జాబితాలో చేరేవారేనని! "ఎలా? ఎందుకు" అన్న మీమాంసకు తావే లేదన్నారు. తక్షణమే స్థానికేతరుల వలస ఆపు చేయాలని, అలా జరగని పక్షంలో, అసంతృప్తి జ్వాలలు నింగినంటుతాయని-ఉపద్రవకరమైన స్థాయికి చేరుకునే ప్రమాదముందని, అప్పుడు ఉద్యమాన్ని నియంత్రించడం సాధ్యపడక పోవచ్చని లీగ్ హెచ్చరించింది. సాంకేతిక సంబంధమైన వాటితో సహా, పాలనా పరమైన ప్రతి పదవికి అనేకమంది అర్హులైన స్థానికులు సులభంగా దొరుకుతారని కూడా లీగ్ చెప్పింది. త్వరలో (నాటికి) ఏర్పడ బోయే ఉన్నత పదవుల ఖాళీలను స్థానికులతోనే భర్తీ చేయాలని సూచించింది. వారిలో కొందరు (స్థానికేతరులు అభిప్రాయ పడినట్లు) సమర్థులు కాకపోయినా, సకాలంలో-సరైన శిక్షణను ఇచ్చి, వాళ్ల తప్పుల ద్వారా సరి దిద్దుకుని అనుభవం కలిగే విధంగా అవకాశం కలిగించాలని లీగ్ డిమాండ్ చేసింది.
ఆ నాడు ఆ ఐదుగురు మేధావుల సూచనలు కొంతలో కొంతైనా అమలు జరిగినట్లయితే, నేడు పరిస్థితి ఎలా వుండేదో? వారు ముందు చూపుతో చెప్పిన దాన్ని తూచ తప్పక అమలు జరిపినట్లయితే, బహుశా, తెలంగాణ పరిస్థితి మరో విధంగా వుండేదేమో!
సంఖ్యా పరంగా స్థానికేతరులు తెలంగాణలో ఎలా పాతుకుపోయారనే అంశం “విదర్ హైదరాబాద్” పుస్తకంలోని ఆసక్తికరమైన విషయాలలో ముఖ్యమైనది. జనాభా వృద్ధి రేటు పరిగణలోకి తీసుకుంటే-దానికి ఆ తర్వాత వలస వచ్చిన స్థానికేతరులను కలుపుకుంటే, తెలంగాణ ప్రజలు ఉద్యోగ విషయంగా ఎంత దోపిడీకి గురయ్యారో బోధ పడుతుంది. 1931 జనాభా లెక్కల ప్రకారం, నిజాం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలోని 75 లక్షల మందిలో, హైదరాబాద్ నగరంలో, అప్పట్లో సుమారు నాలుగై దు లక్షల మంది కంటే ఎక్కువ వుండే అవకాశం లేదు. వారిలో ముల్కీలు కాని వారు (స్థానికేతరులు) రెండున్నర లక్షల మంది (వీరిలో కొందరు ఇతర జిల్లాలలో వుండ వచ్చు) కాగా, అందులో సగం మందికి పైగా మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన వారే కావడం విశేషం. అంటే...వారంతా ఆంగ్లం-తెలుగు మాట్లాడగల సీమాంధ్ర ప్రాంతం వారే! రైల్వేలలో, సాధారణ వ్యాపారాలలో, విద్యా సంస్థలలో, సింగరేణి గనులలో, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో అప్పట్లో ఉద్యాగాలలో వున్నవారిలో అధిక శాతం మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన వారే! (సీమాంధ్ర ప్రాంతీయులే?). కాల క్రమేణ విశాలాంధ్ర ఏర్పడడం, అప్పట్లో స్థానికేతరులుగా వలస వచ్చిన వారంతా, "స్వరాష్ట్రీయులు" గా రూపాంతరం చెంది, వారే ముల్కీలై పోయి, మరింత పట్టు సాధించుకున్నారు. వీరికి తోడు, ఉత్తర భారత దేశం నుండి వచ్చిన వారంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక బలీయమైన కూటమిగా ఏర్పడి, ముల్కీలను దూరం పెట్టారు. విశాలాంధ్ర ఏర్పాటైన తర్వాత ఇదే తరహా దోపిడి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన "రాజకీయ కూటమి" కనుసన్నల్లో జరుగుతుంది. తమ దోపిడీకి కొత్త భాష్యం చెప్పడానికి వారే పదే-పదే "సమైక్య నినాదం" వినిపిస్తుంటారు. కేంద్రంలో తమ పలుకుబడిని ఉపయోగించి ఆ నినాదానికి మద్దతు కూడగట్టుకుంటున్నారు.
హైదరాబాదీ యుల ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిపోవడంతో, ప్రారంభంలో ఏదో ఆర్థిక కారణాల వల్ల తలెత్తిన అసంతృప్తి, పోను-పోను, తమ హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మార్పుచెంద సాగింది. తమ ప్రాంత పాలన తమ ద్వారానే జరగాలని, పాలనా పరమైన విధి విధానాలను రూపొందించుకునే ప్రత్యేక హక్కు తమకు కావాలని, ఇతరుల (స్థానికేతరుల) ప్రమేయం-జోక్యం వుండకూడదని, అందుకొరకు సరైన ముల్కీలను మాత్రమే ఎంపిక చేయాలని ముల్కీలు ఒత్తిడి చేయడం మొదలైంది. అలా ఆరంభమైందే 1935 నాటి ముల్కీ ఉద్యమం. ఉత్తర భారతం నుండి వచ్చిన స్థానికేతరులు ముస్లింలను రెచ్చగొట్టే విధం గాను, దక్షిణ భారతం నుండి వచ్చిన వారు హిందువులను పురికొల్పే విధం గాను ప్రవర్తించడాన్ని కూడా లీగ్ తప్పుపట్టింది. విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత సమైక్య నినాదం పేరుతో సీమాంధ్ర వ్యాపార-రాజకీయ వేత్తలు చేస్తున్న పని కూడా అదే! లీగ్ దృష్టిలో చిత్త శుద్ధి కలిగిన ముల్కీ అంటే, హిందువో-ముస్లిమో కాదు.. స్థానికులా? స్థానికేతరులా? అనేది మాత్రమే.
స్థానికేతరులు పాలనా రంగంలో ప్రవేశించడంతో అగలేదు. ఒక పద్ధతి ప్రకారం, హైదరాబాద్-తెలంగాణ ప్రాంతంలోని కుటీర పరిశ్రమలను నాశనం చేశారని లీగ్ అభిప్రాయం. లక్షలాది ముల్కీలకు జీవనోపాధి కలిగించిన కుటీర పరిశ్రమలెన్నో తెలంగాణ ప్రాంతంలో వుండేవి. కరీం నగర్, మెదక్ జిల్లాలలోని కాగితం తయారీ కుటీర పరిశ్రమ; వరంగల్, కరీంనగర్, నల్గొండ, మెదక్ లలోని డైఇంగ్-ప్రింటింగ్; హైదరాబాద్ లోని బంగారు తీగెల తయారీ; వరంగల్ తివాచీల తయారీ; షీట్ మెటల్, బొమ్మల తయారీ, సిల్వర్ ఫిలిగ్రి లాంటివెన్నో మూతపడడానికి స్థానికేతరులే కారణమని లీగ్ ఆరోపించింది విదర్ హైదరాబాద్ పుస్తకంలో.
అలనాటి ముల్కీ ఉద్యమమైనా, ఇప్పటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమైనా, కేవలం ఉద్యోగాల్లో తమ వాటా కోసం కాదు. ఇక్కడ స్థానికంగా లభ్యమయ్యే వాటిని, తయారు చేయగల వాటిని, స్థానికేతరులు బయటి నుంచి రవాణా చేసి, ఇక్కడ కుటీర పరిశ్రమలను నిరుపయోగం పరచడాన్ని వ్యతిరేకించడం కూడా ఆ ఉద్యమాలలో భాగమే. ప్రత్యేక రాష్ట్ర నినాదం కేవలం ఆర్థికాభి వృద్ధికే అనడం తప్పు. ఆత్మ గౌరవం-స్వపరిపాలన అన్నింటికన్నా ముఖ్యం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మినహా మరేదీ అంగీకారం కానే కాదు.
No comments:
Post a Comment