Thursday, August 25, 2011

విజ్ఞప్తి చేయాల్సిన పౌర సమాజం ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడం తగదు: వనం జ్వాలా నరసింహారావు

విజ్ఞప్తి చేయాల్సిన పౌర సమాజం

ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడం తగదు

వనం జ్వాలా నరసింహారావు

ఏ రాజకీయ నాయకుడిని కదిలించినా, ఏ ప్రభుత్వేతర సంస్థ ప్రతినిధిని పలకరించినా, అంతో-ఇంతో పరిజ్ఞానం వున్న ఏ వ్యక్తిని మాట్లాడించినా, వారి నోట వచ్చే ఒకే ఒక వాక్యం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలన్నదే! అలా మాట్లాడుతున్నవారికి అవినీతి గత చరిత్ర వుండవచ్చు-వుండక పోవచ్చు...ఐనా పోరాటంలో ముందేనంటారు. టెలివిజన్ ఛానళ్లు, దిన-వార-మాస పత్రికలు, హజారే బృందానికి, ప్రభుత్వానికి, లేదా అరుణా రాయ్ లాంటి పౌర సమాజం కార్యకర్తలకు అనుకూలంగానో-వ్యతిరేకంగానో వెల్లడి చేసే వారి అభిప్రాయాలకే పెద్ద పీట వేస్తున్నాయి. అందరిది ఒకే నినాదం..."అవినీతి అంతమొందాలి, లోక్ పాల్ చట్టం రావాలి" అని. ఆ చట్టం ఎలాంటిది అనే విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు-ఎవరి దారి వారిదే! గతంలో కేంద్రంలోను-రాష్ట్రాలలోను ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం వచ్చినప్పుడు అధికారంలో వుండి కూడా ఏమీ చేయని-చేయలేని వారితో సహా, ప్రతి రాజకీయ నాయకుడు, ఆపాదమస్తకం తానేదో నీతిమంతులకు ప్రతిరూపం అనుకుని, తనకున్న పరిధిలోనే లోక్ పాల్ బిల్లును చట్ట సభలో ప్రవేశ పెట్టడానికి కారణమైన ప్రధాని మన్మోహన్ సింగ్ ను తీవ్రంగా విమర్శించే వారే. ఇలాంటి వారు తాము చేయక-చేయలేక పోగా చేసేవాడిని చెయ్యనివ్వరు. విమర్శించడానికి మాత్రం వెనుకాడరు.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అన్న సాకుతో, పార్లమెంటుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు, న్యాయ స్థానాలకు, రాజ్యాంగానికి, రూల్ ఆఫ్ లాకు అతీతమైన ఒక సూపర్-డూపర్ నామినేటెడ్ బాడీని ఏర్పాటు చేయాలని పౌర సమాజం ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడం ఎంతవరకు సబబు? దానికి ఈ మహానుభావులంతా వంత పాడడం ఎంతవరకు న్యాయం? అరవై నాలుగు సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో-అరవై రెండు సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రలో, అంచలంచలుగా బలపడాల్సిన రాజ్యాంగ వ్యవస్థలను, పటిష్టం చేయాల్సిన బాధ్యతను విస్మరించిన రాజకీయ నాయకులనేకమంది, అదే బాధ్యతను ఇన్నాళ్లు విస్మరించిన పౌర సమాజం నాయకులకు వత్తాసు పలకడంలోని ఔచిత్యం ఏమిటి? నలభై రెండేళ్ల క్రితం నాటిన లోక్ పాల్ మొక్కకు నీరు పోసిన వారు-పోయనివారు ఏకమై పోయారిప్పుడు. వాస్తవానికి మనకు రాజ్యాంగం ప్రసాదించిన అవినీతి వ్యతిరేక అస్త్ర-శస్త్రాలను, అదే రాజ్యాంగంలోని అనేకానేక ప్రకరణాలను, ఒకదానికి మరొక టి అనుసంధానం చేసి అవినీతి పరులపై ప్రయోగించడానికి, ఇదే రాజకీయ నాయకులు-పౌర సమాజం ప్రతినిధులు ఆదినుంచి పూనుకున్నట్లయితే, సమస్య ఇంత జటిలమయ్యేదా? అంతా జరిగినాక, ఇప్పుడు రాత్రికి రాత్రే, "సర్వోపతి" లాంటి ఒక దివ్యౌషధం కావాలని ప్రభుత్వంపై పౌర సమాజం ఒత్తిడి తేవడం సమంజసం కాదు.

దశాబ్దంన్నర క్రితం, స్వాతంత్ర్యం వచ్చి ఏబై వసంతాలు పూర్తి చేసుకోనున్న తరుణంలో, నవంబర్ 1996 లో నాటి ప్రధాని దేవె గౌడ, మే 1997 లో ఆయన వారసుడు ఐకె గుజ్రాల్, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల, ముఖ్య మంత్రుల సమావేశాలు నిర్వహించారు. కేంద్ర-రాష్ట్ర స్థాయిలలో బాధ్యతాయుతమైన, పారదర్శకతతో కూడిన పాలన ప్రజలకందించాల్సిన అంశంపై ఏకగ్రీవ తీర్మానాలను ఆ రెండు సభలు ఆమోదించాయి. ప్రభుత్వాలపై ప్రజలకు సడలుతున్న నమ్మకాన్ని ఏ విధంగానైనా నిలబెట్టుకోవాలన్న ఆందోళన వారిలో అప్పట్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ సభల దరిమిలా దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని, ప్రత్యక్షంగాను-పరోక్షంగాను, సేకరించే ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన ఆరు నెలల లోపు అ సభలో ఆమోదించిన "నవ సూత్ర కార్యాచరణ ప్రణాళిక" కు సంబంధించిన అంశాలను అమలు చేయాలని, అమలు ఎలా జరుగుతున్నదనే విషయాలను ప్రధాన మంత్రి స్వయంగా సమీక్షించాలని నిర్ణయం కూడా జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే ది ఆ ప్రణాళికలో ప్రధానమైన అంశం. అలనాటి నిర్ణయాలే అక్షరాలా అమలు జరిగివుంటే ఈనాడు హజారే ఆందోళన చేయాల్సిన అవసరమే లేదు.

అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నా హజారే ఆ నాడూ పౌర జీవితంలోనే వున్నారు. నవ సూత్ర కార్యాచరణ ప్రణాళిక అమలుకు సంబంధించి వైఫల్యాల విషయంలో మాట మాత్రంగా నన్నా, నిరసన తెలియ చేసినట్లయితే, బాగుండేదేమో! అప్పట్లో ఉద్యోగాలలో వుంటూ, నేడు హజారే ఆందోళనకు మద్దతిస్తున్న "పౌర సమాజం నాయకులు" కేజ్రివాల్, కిరణ్ బేడి తదితరులు కొంచెమన్నా గళం విప్పినట్లయితే పరిస్థితులు ఎలా వుండేవో? అలానే శాంతి భూషణ్, ప్రశాంతి భూషణ్ లు తమ న్యాయవాద వృత్తికి కేటాయించిన సమయాన్ని కొంతలో కొంతైనా ప్రజల సమస్యలకు కేటాయించినట్లయితే సమంజసంగా వుండేదేమో! అంతెందుకు...అప్పట్లో ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరైన అతిరథ-మహారథులెందరో నేటికీ రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. వారిలో కొందరు అధికారంలో, కొందరు ప్రతిపక్షంలో వుంటూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు..నాటి గుజరాత్ ముఖ్య మంత్రి-ఆ తర్వాత కొన్నాళ్లకు కేంద్ర మంత్రిగా పనిచేసిన శంకర్ సింగ్ వాఘేలా; నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి-నేటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్ర బాబు నాయుడు; అప్పుడు-ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి; ఇప్పుడు నాలుగో దఫా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నాటి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్; నాటి బీహార్ ముఖ్యమంత్రి రబ్రీ దేవి-ఆమె భర్త లాలూ ప్రసాద్ యాదవ్; శివ సేనకు చెందిన నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ జోషి వీరిలో ప్రముఖులు. ఒకరి వెంట మరొకరు ప్రధానులుగా పనిచేసిన దెవె గౌడ, గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్ పాయీలు కూడా రాజకీయాలలో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారింకా. వీరంతా వ్యక్తిగతంగనో-కలిసికట్టుగానో అలనాటి నవ సూత్ర ప్రణాళిక అమలుకు కృషి చేసి వుంటే అవినీతి కొంతలో కొంతన్నా కట్టడి అయివుండేదేమో? ఇప్పుడు మాత్రం వీరంతా అన్నా హజారే జపం చేస్తున్నారు. తప్పంతా తమదికాదని-ఇతరులదేనని వీరి నమ్మకం.

దేవె గౌడ-గుజ్రాల్ ల తర్వాత ప్రధాని పీఠం ఎక్కిన అటల్ బిహారీ వాజ్ పాయి, తమ రాజకీయ కూటమికి చెందిన ఎన్డీఏ జాతీయ ఎజెండాలో (మార్చ్ 18, 1998) అవినీతి నిర్మూలన విషయం పొందుపరిచారు. "పటిష్టమైన లోక్ పాల్ చట్టాన్ని తీసుకొస్తామని, ప్రధానిని కూడా అందులో చేరుస్తామని" ఎన్డీఏ నొక్కి వక్కాణించింది. ఆ తర్వాత, పార్లమెంటులో, ఆ చట్టం తేకపోయినా, "సమాచార స్వేచ్ఛ చట్టం" తీసుకొచ్చింది. చట్టం కాని లోక్ పాల్ కు ఏ గతి పట్టించిందో, అదే గతి సమాచార స్వేచ్ఛ చట్టానికి కూడా పట్టించింది. అది ఎన్డీఏ కాలంలో అమలుకు నోచుకోలేక పోయింది. ఇప్పుడేమో, అన్నా హజారే ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీతో ఎన్డీఏ లో భాగస్వాములుగా నాడు-నేడు వున్న మరికొన్ని పార్టీలు, తమ సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. ఇంతకంటే "హిపొక్రసీ" ఇంకేముంటుంది? వాజ్ పాయి ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత అధికారంలో కొచ్చిన యుపిఎ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ చొరవతో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పటిష్టంగా అమలు చేస్తుంది. ఆ చట్టం రూపకల్పనలో, హజారే నడుపుతున్న పౌర సమాజం లాంటి దానికే సారధ్యం వహిస్తున్న అరుణా రాయ్, నేటి హజారే ఉద్యమంలాగా కాకుండా, సంయమనంతో తన వంతు సహకారాన్ని అందించారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ లోక్ పాల్ బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అంతవరకు మాత్రం ఆయనను అభినందించాల్సిందే!

రే అయిందేదో అయిందను కుందాం. తన మాట నెగ్గ లేదనుకుని, మరింత పటిష్టమైన లోక్ పాల్ బిల్లు తేవాలని ప్రభుత్వాన్ని కోరటంలో తప్పు లేదనుకుందాం. దాని కొరకు దీక్షకు దిగడంలోను న్యాయం వుందను కుందాం. ఆయన వెంట నడుస్తున్న ఇతర పౌర సమాజం సభ్యులు, హజారే కంటే అధిక స్థాయిలో పట్టుదల ప్రదర్శించడాన్నీ ఒప్పుకుందాం. కాని, తమకు-తమ పౌర సమాజానికి-తమకు మద్దతిస్తున్న వారికి తప్ప ఇతరులెవరికీ లోక్ పాల్ బిల్లు విషయంలో, ఏమీ తెలవదని వాదించడం మాత్రం అన్యాయం. హజారే ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన ప్రభుత్వం-ప్రతి పక్షాలు, పరస్పరం సంప్రదింపులు చేసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తున్న సమయంలో తమవంతు సహకారం అందించడంలో హజారే బృందం సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా-ప్రతిపక్షాలు ఎంత సహకారం అందించినా, పరిష్కారం కను చూపు మేరలో కనిపించడం లేదు. జన లోక్‌పాల్‌ బిల్లు పెడతామని ప్రధానమంత్రి లిఖిత పూర్వంగా హామీ ఇవ్వాలని , హజారే బృందం అనడం కంటే విడ్డూరం మరొక టి లేదు. ఒక వైపు తాను మరో తానింకా తొమ్మిది రోజులు దీక్ష చేయగలనని హజారే అంటుంటే, క్షణ-క్షణానికి ఆయన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలన్న పరోక్ష సలహాతో, ఆయన బృందం సభ్యులు, హజారేకేమన్నా జరుగు తే, ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరికలు చేస్తున్నారు. తాను ఆసుపత్రికి పోయే సమస్యే లేదని చెప్తున్న హజారే, తనను నిర్బంధంగా పోలీసులు పట్టుకెళితే వారిని అడ్డుకోవాలని ఒక వైపు చెప్తూనే-మరో వైపు శాంతియుతంగా ఆందోళన చేయాలని భోదిస్తున్నారు గాంధీ తత్వం పుణికిపుచ్చుకున్న అన్నా హజారే!

ప్రభుత్వం ఎన్నో మెట్లు దిగి వచ్చింది. జన లోక్ పాల్ బిల్లులోని మరికొన్ని అంశాలను, పార్లమెంటు ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులో చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. పార్లమెంటు స్థాయీ సంఘం ఆమోదం పొందడానికి రాజ్యాంగపరంగా ఎలాంటి వెసులుబాటు వుందో పరిశీలిస్తోంది. హజారే నిరసన దీక్ష విరమింప చేయడానికి-ఆయన బృందం సభ్యులు వేసిన పీట ముడిని విప్పడానికి, ప్రభుత్వం, పౌర సమాజం సభ్యులతో, అఖిల పక్షం సభ్యులతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించింది. పౌర సమాజం సభ్యుల ప్రతినిధులైన కేజ్రీవాల్, కిరణ్ బేడి, ప్రశాంత్ భూషణ్ లు తమ పట్టు సడలించేది లేదన్న రీతిలో వ్యవహరించా రక్కడ. సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి, బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్, ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ ఒక్క విషయంలో ప్రభుత్వానికి అండగా నిలిచారని చెప్పొచ్చు. పార్లమెంటు సార్వభౌమాధికారం, శాసన ప్రక్రియ, న్యాయ స్థానాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా లోక్ పాల్ బిల్లులో మార్పులు-చేర్పులు చేయాలన్నది వారి మాటల్లో స్ఫురించింది. అలాగే హజారే దీక్షను విరమించుకోవాలని కూడా అందరూ అభిప్రాయ పడ్డారు.

సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం ప్రధాని పదే-పదే వ్యక్తం చేశారు. లోక్ సభలో అవినీతిపై జరిగిన చర్చకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. లోక్ పాల్ బిల్లును చట్ట సభలో ప్రవేశ పెట్టడానికి ఒకరకంగా కారణ భూతుడైన అన్నా హజారేకు "అభివాదం" చేస్తున్నానని వినమ్రంగా చెప్పారు. జన్ లోక పాల్ ముసాయిదాతో సహా, అరుణా రాయ్, జయప్రకాశ్ నారాయణ్ లాంటి వారి ముసాయిదాలను కూడా పార్లమెంటులో చర్చకు చేపట్టి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్త పరిచారు ప్రధాని. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, సభాపతి మీరా కుమార్ లు కూడా అన్నా హజారేను దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతకంటే ముందు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మను జోక్యం చేసుకోమని-హజారే నిరాహార దీక్ష విరమింప చేయాలని ప్రధాని ఆయనను కోరినట్లు వార్తలొచ్చాయి. ఇదిలా వుంటే, మరోవైపు మంకు పట్టు వీడని అన్నా హజారే బృందం, ప్రధాని నివాసం ఎదుట ఆందోళన చేయాలని పిలుపిచ్చింది.

దీక్ష చేపట్టడం ఎంత ముఖ్యమో, సమయం వచ్చినప్పుడు దీక్ష విరమించడం కూడా అంతే ముఖ్యమని మహాత్మా గాంధీ నిరూపించారు. గాంధీ స్ఫూర్తితో దీక్ష చేస్తున్నానంటున్న హజారే పట్టుదలకు పోకుండా, చర్చల ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన లోక్ పాల్ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చేలా చేస్తే మంచిదే మో!

5 comments:

  1. చాల్లేండి పెద్ద చెప్పొచ్చారు గాని. 60ఏళ్ళనుంచి పందికొక్కుల్లా దేశాన్ని బొబ్బితిన్న్న పార్టీల నాయకులని పౌరులు ఇప్పుడు 'వినమ్రంగా' చెప్పాలి అంట! పి.ఎం కేమి అందితే కారణం లేకుండా తిహార్లో పెడతాడు, అందకుంటే అబివాదాలు చేసి కాళ్ళ మీద పడతాడు. కాంగ్రెస్ కుక్కలు ఆ ముసలాయన్ని అవినీతిపరుడు, సావత్ కమిటీలో చించి ఆరగట్టారు, ఆయన వెనక మావో ఇస్టులున్నారు, అమెరికాలున్నాయి, అల్ కైదా వుంది, హస్తాలున్నాయి, వీల్ చేర్ ఫాసిస్టు, అని కారు కూతలు కూయించి, ఇన్నాళ్ళూ ఆవిషయాలమీద మెదపక, ఇప్పుడు చేతులు ఒళ్ళు కాలాయి అని ఆయన ఆకులు పట్టుకుందామనుకుంటున్నారా!

    లోక్‌పాల్ అంటే ఇంకో గవర్నర్ పదవిలాంటి పార్టీ ముసలి తివారిలు జడకోలాటం ఆడుకునేందుకు మరో పదవి సృష్టించుకుందామనుకుంటున్నారని తెలుస్తూనేవుంది.

    ఏదీ మీరోసారి 'రాహుల్ గాంధీ దేశ్ బచావో' , 'సోనియాజీ త్యాగమయి' అని స్లోగనివ్వండి, అంతవరకూ ఏ చేర్మన్ పదవులు ఇవ్వబడవు. :P :))

    ReplyDelete
  2. మన దేశప్రజలకు ఓపిక, బద్ధకం బాగా ఎక్కువ. అందుకే ఇక్కడ ఇతరదేశాల్లోలా పెద్ద ఎత్తున ఉద్యమాలు రావటం లేదు. అంతవరకూ సంతోషించండి. దేశంలో అవినీతి ఆకాశాన్ని తాకుతున్నా ఇంకా మీరు విజ్ఞప్తులు మాత్రమే చెయ్యాలని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. . కిరణ్ బేడీ, కేజ్రీవాల్ ఇంతకు పూర్వం అవినీతి గురించి మాట్లాడకపోయుండవచ్చు. అంటే , పూర్వం మాట్లాడనంత మాత్రాన , ఇక జీవితంలో ఎప్పుడూ మాట్లాడ కూడదంటారా ? "పార్లమెంటు సార్వభౌమాధికారం, శాసన ప్రక్రియ, న్యాయ స్థానాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా లోక్పాల్ బిల్లు వచ్చేలా " చూడాలని మేధావులు తాపత్రయపడుతున్నట్లుగా ఉంది. కానీ, అవినీతి వల్ల దేశంలో పెరిగిపోతున్న పేదరికం, ప్రజల కష్టాల కన్నా మనం రూపొందించుకున్న చట్టాలను కాపాడుకోవటమే ముఖ్యం అన్నది హాస్యాస్పదంగా ఉంది. నిజమే, హజారేది కొంచెం మొండిపట్టు గానే ఉన్నా , అందువల్లే ఈ మాత్రం కదలిక వచ్చిందనేది కూడా నిజం...అయినా బిల్లు వచ్చినంత మాత్రాన ఏమవుతుంది ? .దాన్ని సరిగ్గా అమలు చేసేది ఎవరు ? అసలు సరైన ప్రభుత్వాలు ఉంటే ప్రజలకు ఇలా ఉద్యమాలు చెయ్యవలసిన ఖర్మ ఎందుకొస్తుంది ?

    ReplyDelete
  3. Excellent post. మీ వాదనతో ఏకీభవిస్తాను. ప్రభుత్వం కొన్ని strategic mistakes చేసింది. అన్నాను అవినీతి పరుడని అనటం, ఆయనకున్న మీడియా, పౌర సమాజం అండదండలను తక్కువగా అంచనా వెయ్యటం, ముందుగా అరెస్ట్ చెయ్యటం, వెంటనే తగ్గటం ఇవన్నీ ప్రభుత్వాన్ని నిలదీయటానికి, సమస్యని పక్కదారి పట్ట్తించటానికి ఉపయోగపడ్డాయి. ఇది ఒకరకంగా ప్రభుత్వపు స్వయంక్రుతాపరాధం.మీరన్నట్టు USA ఎన్నో మెట్లు కిందకి తిగింది. దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఇంకా అన్నా బెట్టు చెయ్యటం బాగాలేదు.

    నాకున్న అవగాహన బట్టి..మనకు చట్టాలకు కొదువలేదు. వాటిని అమలుపరిచే వ్యక్తుల్లో నిజాయితీనే లేదు. అది లేనప్పుడు, ఇలాంటి నిరంకుశ చట్టాలు చాలా ఎక్కువగా MISUSE అయితాయని నా ఉద్దెశ్యం. SC/ST Attrocities act, 498A లాంటివి రెండు ముఖ్యమైనా ఉదాహరణలు. జగన్ ని ఊపిరి సలపకుండా చేసే ఈ చట్టాలే, అస్మదీయుల జోలికి అంత తేలిగా పోవు గాక పోవు. ఈ చట్టాలు తల్చుకుంటే పీవీ లాంటి వారిని రోడ్డున నిలబెట్ట గలవు..అవే రాజీవుడికి రక్షణగాను నిలవగలవు. అదీగాక కేవలం అధికారులతో నిండిన లోక్పాల్ నిజంగా సర్వ స్వతంత్ర సంస్తగా, నిస్పాక్షికంగా ఉండగలదా.నాయకులనించి, వారిని గెలిపించిన ప్రజలనించి వచ్చేవత్తిడిని తట్టుకోని నిష్కళంకంగా మనగలదా. ఒకాసారి పదవిలో ఉన్నysr ని కోర్టుకీడ్చడం ఊహించుకోండి..అలాగే సోనియాని, రాహుల్ ని, ఇంకా అనేకానెక మహిళా, దలిత, వెనుకబడ్డ, మైనారిటీ నాయకుల్ని. నాయకూడంటేనే అవినీతిపరుడని మన నమ్మిక కదా..మరి ఎంత మందిని జైల్లో పెట్టగలరో చట్టాలున్నయికదా అని. అవినీతి కొత్తరూపు తీసుకోటానికి ఇలాంటి చట్టాలు ఉపయోగపడ్తాయి. మధ్యపాన నిషేధం ఉన్నప్పుడే తాగుబోతులెక్కువయ్యారు..నేరాలు పెరిగాయి.డబ్బు వ్రుధా మరింత పెరిగింది--ఈ మాటలన్నది నేను కాదండి. ఆ సారాకేసులెన్నిట్నో వాదించిన రావిశాస్త్రి గారు..ఆరు సారా కథలులో.

    రేపీ లక్షణలే మరింతగా విజ్రుభించటాని కావాల్సిన అన్ని హంగులు జన లోక్పాల్ బిల్లులో ఉన్నాయి. అంచెలంచెలుగా ఎదగాల్సిన ఇలాంటి అతి ముఖ్యమైన చట్టాన్ని ఒకేసారి తీసుకోరావటం సరైంది కాదు. దానికన్నా ముందు పారదర్శికత, effective use of technology, decentralization..ఇలాంటివి కనీసం కిందస్థాయిలో అవినీతిని తగ్గిస్తాయి.
    అలాగే మీడియా, ప్రతిపక్షాలు పైస్థాయిలో ఉన్న అవినీతిని(ఉన్నా,లేకున్న )నిరంతరం ఎండగడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలుకూడా మునపటిలాగా నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం కుదరదు. ఒక చోట అవినీతి జరుగుతుందంటే దానిని అధికారులకి, మీడియాకి, న్యాయస్థానాలికి చెప్పటాని ప్రస్తుతం ఏమి అడ్డంకులున్నాయో నాకు తెలియదు. భయం, మనకెందుకులే అనుకోవటం తప్ప అడ్డంకులేవీ లేవనే నా నమ్మకం.
    అయినా ఇంత అవినీతి ఎందుకుందంటే ...సమాధనం కోసం నావరకు నేనైతే అద్దంలో చూసుకుంటా.

    I do not think creating a revenge society(like US) helps the nation. It leads to a police state, increase in beaurocracy, delays, increase in costs. It keeps officials in defensive mode, hide under one rule or other. US is one great example of this. Other than the improvement in quality and transparency in some areas, in every other aspect US govt. is as inefficient, as corrupt, as lethargic, as expensive as it is in India. They fear everything. Machine replaced the common sense long back. I doubt emerging economies like India can bear such huge cost. Thats why there should be moderation and balance in everything one does. This bill should not be an exception to that rule.

    ReplyDelete
  4. జన లోక్ పాల్ బిల్లు ఏం పనిచేస్తుందిలే అని నిరాశ పడి , బిల్లు వద్దు అనటం కన్నా , కొద్దిగా పనిచేసినా జన లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టడమే మంచిది.

    ReplyDelete
  5. This is quite a negative approach to the surge of anti-corruption movement under Anna Hazare's inspiration and example. True, Anna Team has made and is making mistakes but that does not deprive them of the credit of having been able to mobilized millions, especially youths, all over India in concerted demonstrations against corruption. Many may not know the intricacies of Lok Pal Bills and whether such an institution is really necessary or not, what should be its powers and limits, etc. but all think something good is being done, after all these decades, to counter corruption and one person has boldly risen to the need of the times. Now that Anna Team also recognized its limitations and a sort of suspension of movement is declared, it is better to give more time to parliamentarians to thoroughly deliberate, discuss and debate and pass some workable Act of Lok Pal which could at least to an extent curb corruption among higher levels of civil servants and ministers.

    ReplyDelete