Thursday, August 11, 2011

పెట్టుబడుల గుట్టు బయటపడే నా?: వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (12-08-2011)

వనం జ్వాలా నరసింహారావు

దర్యాప్తు జగన్‌కే పరిమితమా?, కేసులతో సతమతమతం కాక తప్పదు!, అనుయాయులు ప్లేటు ఫిరాయిస్తారా?, ప్రజల అండదండలు అనుమానమే!, కాంగ్రెస్‌-టీడీపీలకు అంది వచ్చిన అవకాశం, బయట పడిన పాలనా వ్యవస్థ డొల్లతనం, ఆశ్రిత పక్షపాతాలతో ప్రభుత్వ రంగ సంస్థలు.... వెరసి రాబోయే రాజకీయ పరిణామాలు...

జగన్‌ ఆరంభించిన సంస్థలలోకి అచిర కాలంలోనే కోట్లాది రూపాయల పెట్టుబడులు ఎలా-ఎప్పుడు-ఎందుకు వచ్చాయో అనేది సిబిఐ సంస్థతో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పులో చెప్పడం అవినీతికి వ్యతిరేకంగా గళ మెత్తాలనుకున్న ప్రతి వారూ హర్షించాల్సిన విషయమే. దర్యాప్తు జరగాల్సిందే. ప్రజలకు నిజా-నిజాలు తెలపాల్సిందే. ప్రజలకు చెందిన వందల-వేల కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని మౌనంగా చూస్తూ కూర్చోలే్మని ఉన్నత న్యాయస్థానం భావించడమంటే, ఎక్కడో తప్పు జరిగిందని అనుమానించడమే. కేవల దేశీయ పెట్టుబడులే కాకుండా, జగన్‌ "శైశవ సంస్థలలోకి" విదేశీ నిధుల ప్రవాహం చాప కింద నీరులా ప్రవహించినందువల్లే కోర్టు అలా తీర్పిచ్చిందనడంలో సందేహం లేదు. దీన్ని సాధారణ విషయంగా పరిగణించలేమని స్పష్టం చేసిన హైకోర్టు న్యాయమూర్తులు, జగన్‌పై అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్‌ చట్టం కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తును సీబీఐ చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. భారత దేశ చరిత్రలో న్యాయస్థానాల పాత్ర ఎంత కీలకమైంది ఈ ఒక్క ఉదాహరణ చాలు. "యధా యధా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత! అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం వృజా మ్యహమ్" అన్న శ్లోకార్థం స్ఫురణకు తెచ్చుకునే రీతిలో న్యాయస్థానం తీర్పును అన్వయించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి తన సంస్థలలో పెట్టుబడులు తెచ్చుకోవడం ద్వారా అవినీతికి పాల్పడ్డాడన్న అభియోగం నిన్న-మొన్నటిదికాదు. వై ఎస్ రాజశేఖర రెడ్డి జీవించిన రోజుల్లోనే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, తిరుగులేని సాక్ష్యాధారాలతో, ఢిల్లీ నుంచి గల్లీ దాకా, కరప్షన్ రాజా అంటూ ఎలుగెత్తి చాటినా, దాని సమయం వచ్చే దాకా, దర్యాప్తు చేయాల్సిందే అని చెప్పేవారు వచ్చేదాకా, "ఎక్కడి అవినీతి అక్కడే" అన్న చందాన ఆగిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి, తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై స్పందిస్తూ, తన టైం బాగోలేదిప్పుడు అన్నారు. ఎంతో సందర్భోచితంగా అన్న ఆ మాటల వెనుక, మరెంతో అర్థం వుండి తీరాలి. అందుకేనేమో సమయం-సందర్బం వచ్చిందాకా ఏదీ జరగదని పెద్దలంటారు.

తాను (తన) ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడినందుకు ఇవన్నీ జరుగుతున్నాయని, (తన లాంటి) ఒక వ్యక్తి ఒక మాట మీద నిలబడటం ఎంత కష్టమో (నిజమే కదా!) స్పష్టమవుతోందని, పార్టీ పెట్టిన నాటినుంచే (వాస్తవానికి పెట్టక ముందు నుంచే) కష్ట-నష్టాలు వస్తాయని తానూహించానని, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన నెల రోజులకే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందాయని, దరిమిలా తాను వీడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన శంకర్రావుతో (అంతకు ముందే ఎర్రన్నాయుడు పెట్టిన సంగతి చెప్పి వుండాల్సింది) కేసులు పెట్టించారని, నైతిక విలువలకు తావీయకుండా తనను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్‌-టీడీపీ పార్టీలు కుమ్మక్కయ్యాయని వాపోయిన జగన్మోహన్ రెడ్డి. భారమంతా దేవుడిపైనే వేశారు. అవును మరి...దేవుడనేవాడుంటే తప్పక న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని ఆయనే కాదు దేవుడిని నమ్మే వారందరూ తప్పక నమ్ముతారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో జగన్‌ అక్రమంగా వందలకోట్లు రూపాయలు ఆర్జించడం నిజమేనా? ఆయన సంస్థలలో భారీ ఎత్తున అక్రమ మార్గంలో పెట్టుబడులు పెట్టడం జరిగిందా? అలా పెట్టినందుకు గాను అయా సంస్థలకు-వ్యక్తులకు ప్రభుత్వ పరంగా మరో మార్గంలో ఏమన్నా ప్రయోజనాలు కలిగాయా? మంత్రి శంకర్రావు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ లలో చేసిన ఆరోపణలలో నిజా-నిజాలేంటి? అనే విషయాలు సిబిఐ దర్యాప్తులో తేలనున్నాయి. సిబిఐ దర్యాప్తు చేయాలని కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. తీర్పులో న్యాయ మూర్తులు ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి. జగన్‌ తరఫు న్యాయవాదులు ఆయనపై కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేసు నడిచిందనడం తప్పు బట్టింది న్యాయస్థానం. కోట్లాది రూపాయల లావాదేవీలు-వందలకోట్లు రూపాయల పెట్టుబడులు ఇమిడి వున్న ఈ కేసులో, కేవలం రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయంటే తాము అంగీకరించలేం అని న్యాయమూర్తులు ప్రకటించారు.

న్యాయ మూర్తులు తమ తీర్పులో ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వంలో సంబంధిత అధికారులలో, సరైన చర్యలు తీసుకున్న వారిని ప్రశంసించడం, తమ బాధ్యతను సరిగ్గా నిర్వహించని వారిని తప్పు బట్టడం గమనించాల్సిన విషయం. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారంపై ప్రభుత్వంపైన-అప్పటి పాలకులు-అధికారులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వారొక విధంగా "ప్రేక్షక పాత్ర వహించారని" చెప్పకనే చెప్పారు. అందుకేనేమో, వందలకోట్లు రూపాయల ప్రజల సొమ్ము అక్రమంగా తరలిపోతూంటే న్యాయస్థానం-న్యాయ మూర్తులు చూస్తూఊరుకోలేమన్నారు. ఎమ్మార్‌ వ్యవహారంలో ఎపిఐఐసి అధికారుల నిర్లిప్తతపైన, సెజ్‌లు-మైనింగ్‌ వ్యవహారాలు-పవర్‌ కారిడార్‌ల విషయాలలో ఆసాంతం జరిగిన అధికార దుర్వినియోగంపైన ప్రాధమిక విచారణలో వాస్తవాలు నిర్థారణ అయిన ట్లుగా కూడా న్యాయమూర్తులు వెల్లడి చేశారు. రాష్ట్ర విజిలెన్సు ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాన్ని కూడా వారు ప్రశంసించారు. మొత్తం మీద సిబిఐ విచారణకు ఆదేశించారు. విచారణ-దర్యాప్తు చేయాలంటే సిబిఐనే సరైందని కూడా అభిప్రాయ పడ్డారు. ఇంతవరకూ బాగానే వుంది. ఇన్నాళ్లు-ఇంత జరుగుతున్నా-ఇంతమంది అధికారులు, అనధికారులున్నా-ప్రధాన ప్రతిపక్షం కోడై కూస్తున్నా-మీడియా ఎప్పటికప్పుడు అక్రమాలను పత్రికలలోను, ఛానళ్ళలోను వెలుగులోకి తెస్తున్నా, ఏ మాత్రం భయం లేకుండా, ఇంత పెద్ద యెత్తున చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగాయంటే, ఏదైనా అసాధ్యం కాదని భావించాల్సిందేనా?

ముఖ్యమంత్రి కావాలని సర్వ శక్తులనూ కాంగ్రెస్ పార్టీలో వున్నన్నాళ్లు-రాజీనామా చేసిన తర్వాత కూడా ఒడ్డిన, జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే (సిబిఐ) దర్యాప్తు పరిమితమౌతుందా? ఆయన చుట్టూ పరిభ్రమిస్తున్న రాజకీయ నాయకులలో కొందరు ఆయన సంస్థలలో పెట్టుబడులను పెట్టారని-అవి కాపాడుకునేందుకు గత్యంతరం లేని పరిస్థితులలో ఆయన వెంట నడుస్తున్నారని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అలా కొందరు భావిస్తున్నట్లు (వాస్తవం తేలిందా కా!) ఇప్పుడా నాయకులపై కూడా ఎప్పుడో ఒకప్పుడు, దర్యాప్తులో భాగంగా విచారణ జరిగే అవకాశాలుండవచ్చా? అలాంటప్పుడు, ఒక యువ నేతగా, భావి భారత (పోనీ ఆంధ్ర ప్రదేశ్) కీలక రాజకీయ నాయకుడుగా ఆయనను భావించి ఆయన చుట్టూ తిరుగుతున్న ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయిస్తారా? అవునన్నా-కాదన్నా, వాస్తవం ఎలా వుండబోతుందోనన్న విషయం కొన్నాళ్లు పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి-ఆయన సంస్థలు అవినీతి కేసులతో కొంతకాలం సతమతమవడం తప్పనిసరి. ప్రజాస్వామ్యంలో అన్నింటికన్నా ముఖ్యం ప్రజల అండ దండలే. కాదని ఎవరూ అనరు. ఆ అండ దండలు, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారికి కూడా నిరంతరాయంగా లభిస్తాయా? ప్రజల మద్దతు (ఆయన సభలకు భారీగా తరలి వస్తున్న జన సమూహాన్ని చూసి) దండిగా వున్న తనను ప్రపంచంలో శక్తీ ఏమీ చేయలేదని ఇంతవరకూ చెప్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి ధైర్యం సడల వచ్చా? రాజకీయ భవితవ్యాన్ని, న్యాయస్థానం తన తీర్పుతో, తాత్కాలికంగానన్నా అడ్డుతగిలందనక తప్పదు. ఎప్పుడా-ఎప్పుడా, జగన్మోహన్ రెడ్డిని ఎలా దెబ్బ తీయాలా? అని అహర్నిశలు ఆలోచిస్తున్న కాంగ్రెస్-టిడిపి పార్టీలకు ఇదొక చక్కని అవకాశమే. అలానే జగన్మోహన్ శిబిరంలో అవినీతికి దూరంగా వుండే (కనీసం తమకు తాము భావించే) కొందరు (కాంగ్రెస్-మాజీ కాంగ్రెస్-మాజీ టిడిపి, పీఆర్ పి) రాజకీయ నాయకులు, ఇదే అదనుగా ఆయనకు దూరమయ్యే ప్రమాదం కూడా లేక పోలేదు. జగన్‌కు సంబంధించిన ఆస్తుల దర్యాప్తులో ఆయన అవినీతిపరుడన్న ది వెలుగులోకి రాక ముందే, తడి తమకూ అంటుతుందేమోనన్న భయాందోళనతో మరికొందరు దూరమవడం కూడా జరగొచ్చు.

సరే..ఏదెలా జరగాలో..అలానే జరుగుతుందను కుందాం. ఈ తీర్పు నేపధ్యంలో, బహుశా, భవిష్యత్ లో పాలనాపరమైన వ్యవస్థాగత సంస్థల విషయంలో కొన్ని సమూలమైన మార్పులు-చేర్పులు తీసుకొని రావాల్సిన అవసరం కలగుతుందేమో! ఉదాహరణకు, ఎపిఐఐసి నే తీసుకుందాం. అక్కడి అధికారులు సక్రమంగా, వ్యవహరించాల్సిన విధంగా, బాధ్యతలను నిర్వహించలేదని తీర్పు ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎపిఐఐసి లో అలా జరగడానికి బాధ్యత ప్రధాన ఎగ్జిక్యూటివ్ అధికారైన మేనేజింగ్ డైరెక్టర్ దా? రాజకీయంగా-రాజకీయ కారణాల వల్లే చైర్మన్ పదవిలో వున్న వ్యక్తిదా? మేనేజింగ్ కమిటీదా? ఎపిఐఐసి ఎండి పాలనాపరంగా రిపోర్టు చేయాల్సిన సచివాలయ అధికారులదా? సంబంధిత శాఖ మంత్రివర్యులదా? సమిష్టి బాధ్యతతో నిర్ణయాలు తీసుకోవాల్సిన మంత్రి మండలి సభ్యులదా? పరోక్షంగా చక్రం తిప్పిన (దివంగత) ముఖ్యమంత్రి దా (రాజ్యాంగ పరంగా కార్య నిర్వహణ వ్యవస్థకు అధిపతి)? ఏ కోణం నుంచి దానిని చూడాలో దర్యాప్తులో బయట పడిన తర్వాత, ఒక ప్రభుత్వ రంగ సంస్థలో, ఎవరి బాధ్యతలు ఏంటి అనేది బహుశా వెల్లడయ్యే అవకాశాలుండవచ్చేమో.

ప్రభుత్వంలో చోటుచేసుకోవచ్చని భావించే జాప్యం-అవినీతి-ఆశ్రిత పక్షపాతం లాంటి వాటిని అధిగమించేందుకు స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే రూపు దిద్దుకున్న ప్రభుత్వరంగ సంస్థలు వాటికి దూరంగా వుండాలని-వుంటాయని పలువురు భావించారు. రాజకీయాలకు అతీతంగా వాటి నిర్వహణ బాధ్యతలను, నిపుణులకు అప్ప చెప్పారు మొదట్లో. పోను-పోను, రాజకీయ పునరావాస కేంద్రాలుగా-అవినీతికి నిలయాలుగా మారడం దురదృష్టకరం. రాబోయే రోజుల్లో, ఈ కేసు దర్యాప్తు ఫలితంగా బయటపడనున్న కొన్ని వాస్తవాలు, ప్రభుత్వరంగ సంస్థలు బలోపేతం కావడానికి దోహద పడితే మంచిదే మో!

No comments:

Post a Comment