Thursday, August 18, 2011

హజారేది సరైన మార్గమేనా?: వనం జ్వాలా నరసింహారావు

హజారేది సరైన మార్గమేనా?

సూర్య దిన పత్రిక (19-08-2011)

వనం జ్వాలా నరసింహారావు

లోక్‌ పాల్‌కు సభ వెలుపలా అవరోధాలే, ఎవరు నాయకులు, ఎవరు ప్రతినాయకులు?, అన్నా హజారేది నిఖార్సైన మార్గమేనా?, ఉభయ సభల అధికారాలు అనుల్లంఘనీయం, ఇటూ- అటూ అందరిదీ మొండితనమే!, పౌర సమాజ ఉద్యమ నీడలో అవినీతిపరులు, రాజకీయ నాయకులకు కలిసొచ్చిన అవకాశం, విభజించి పాలించ చూసిన యూపీఏ సర్కారు...వెరసి టీం హజారే ఉద్యమం..

పార్లమెంటు దిగువ సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్ పాల్ బిల్లు, శాసన ప్రక్రియకు నోచుకుని, చట్టంగా రూపాంతరం చెందే లోపునే, సభ లోపల ఎదురవ్వాల్సిన అవరోధాలు బాహ్య ప్రపంచంలో ఎదురవడం బహుశా మన దేశంలోనే జరుగడానికి ఆస్కారముంటుందేమో! నాలుగున్నర దశాబ్దాల క్రితం సంగతి పక్కన పెడితే, వర్తమాన కాలపు లోక్ పాల్ వ్యవహారానికి సంబంధించి నంతవరకు, "ధర్మ-అధర్మ" యుద్ధం ఆరంభమై అప్పుడే కొన్ని నెలలు కావస్తోంది. సాధారణంగా యుద్ధ రంగంలోకి దిగిన ఇరుపక్షాలలో ధర్మం వున్న పక్షానికి నాయకత్వం వహిస్తున్న వారిని "నాయకులు" గా, అధర్మంగా యుద్ధం చేస్తున్న వారిని "ప్రతి నాయకులు" (ఖల్ నాయక్) గా పిలవడం ఆచారం. లోక్ పాల్ విషయంలో జరుగుతున్న సమరంలో అటు పౌర సమాజం నేతలు, ఇటు ప్రభుత్వ సారధులు, తమదంటే తమదే న్యాయ పోరాటమని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. అంటే, ఇరు పక్షాల సారధ్యం వహిస్తున్నది నాయకులన్నా కావాలి-లేదా-ప్రతి నాయకులన్నా కావాలి. అందుకే అవినీతికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న పౌరులందరినీ ధర్మ పక్షంగా, (పౌర సమాజం నాయకులతో సహా) ప్రభుత్వాధి నేతలందరినీ అధర్మ పక్షంగా పిలవడం సమంజసమేమో! పార్లమెంటు ఉభయ సభలలో, అన్నా హజారే అరెస్టు జరిగిన మరుసటి రోజు జరిగిన చర్చలో, ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష నేతలు అరుణ్ జైట్లీ-సుష్మా స్వరాజ్ లు వెలిబుచ్చిన అభిప్రాయాలను నిశితంగా పరిశీలిస్తే, ఈ వాదనలోని వాస్తవం అర్థం చేసుకోవచ్చు.

అన్నా హజారే ఎంత గాంధేయ వాదైనా, చట్ట ప్రకారం-నిబంధనల ప్రకారమే ఢిల్లీ పోలీసులు వ్యవహరించారని, ఆయన నిరాహార దీక్షకు దిగడానికి ముందే అరెస్టు చేయడం పూర్తిగా సమంజసమైందని, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పార్లమెంటు ఉభయ సభలలో ఆ చర్యను సమర్థించారు. ప్రధాని ప్రకటనలోని ప్రతి అంశాన్ని తీవ్రంగా రాజ్య సభలో విమర్శించిన అరుణ్ జైట్లీ, ప్రజలంతా (?) యూపీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న అవినీతి మార్గంతో విసిగి-వేసారి పోయారని, అందుకే హజారే నాయకత్వంలో వీధుల్లోకి వచ్చారని అన్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం రాజకీయ సమస్యకు పోలీసు పరిష్కారం చూపాలను కోవడం పొరపాటన్నారు. అరెస్టుపై ప్రధాని మన్మోహన్ ఇచ్చిన వివరణ అబద్ధాల పుట్టని, ప్రభుత్వం పూర్తిగా అవినీతితో నిండిపోయిందని, చివరకు అణచివేత చర్యలకూ పాల్పడడానికి వెనుకాడడం లేదని, బాధ్యతను పూర్తిగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు అప్పగించి చేతులు దులుపుకుంటున్నదని, ప్రతిపక్ష బీజేపీ నేత సుష్మాస్వరాజ్ లోక్‌సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా హజారే తన సొంత లోక్‌ పాల్ బిల్లును పార్లమెంటుపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించడంతో పాటు, బిల్లు రూపొందించాల్సిందెవరు? ఆమోదించాల్సిందెవరు? అని ప్రతిపక్షాలను నిలదీశారు. పార్లమెంట్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం తగదని హితవు పలికారు. ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను కాదనే రీతిలో, సామాజిక కార్యకర్తలు కోట్లాది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామనే దృక్ఫదంతో వ్యవహరించడం అసమంజసం అని స్పష్టం చేశారు. దానికి జవాబుగా, మొత్తం వ్యవహారాన్ని పార్లమెంట్‌కు, పౌర సమాజానికి మధ్య ఘర్షణగా చిత్రీకరించడానికి ప్రధాని ప్రయత్నిస్తున్నారని అరుణ్ జైట్లీ ధ్వజం ఎత్తారు.

అత్యున్నత విలువల నుంచి హజారే స్ఫూర్తి పొంది ఉండవచ్చు గాక! ఆయన వెంట అశేష జన వాహిని నేడు నడుస్తుండవచ్చు కాక! ఆయన వేసిన ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ, పౌర సమాజానికి చెందిన అతిరథ-మహారథులు హజారే చెప్పే ప్రతి వాక్యాన్ని వేద వాక్కుగా పరిగణిస్తుండ వచ్చు గాక! అంత మాత్రాన ఆయన ఎంచుకున్నది మాత్రం చాలా అసలు సిసలైన నిఖార్సైన మార్గం అనే వీలు లేదు. ఇందిరా గాంధీ హయాంలో అత్యవసర పరిస్థితి విధించిన దరిమిలా, అసలే అంతంత మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న పార్లమెంటరీ వ్యవస్థ- అందులోని ఉభయ సభల రాజ్యాంగ బద్ధమైన అధికారాలను హరించే ప్రయత్నం చేస్తే వారెంత గొప్ప వారైనా వారి చర్యలను ఎదుర్కోవాల్సిందే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రమాదకరమైన ప్రభావం పడే ఎటువంటి చర్యైనా అటు ప్రభుత్వం కాని, ఇటు ప్రతి పక్షాలు కాని, వీటన్నింటి కీ అతీతం అని అంటున్న పౌర సమాజం కాని చేపట్టే, దాన్ని అడ్డుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం. అవినీతిని రూపుమాపాల్సిందే. కాకపోతే కాన్సర్ లాగా పాకిపోయిన అవినీతికి రాత్రికి రాత్రే అన్నిరకాల చికిత్స ఒకే ఒక చిట్కాతో చేసి, మర్నాటికల్లా నయం చేయడమంటే-చేయాలని ఎవరైనా అంటే, అది మూర్ఖత్వం తప్ప మరేమీకాదు. బహుశా ఆగస్టు పదిహేనున జాతీయ జండా ఎగురవేస్తూ ఎర్రకోటపై ప్రధాని చెప్పిన మాటల్లోను, పార్లమెంటులో హజారే అరెస్టుపై జరిగిన చర్చలో పునరుద్ఘాటించిన ప్రకటనలోను వున్న నిజాయితీని అర్థం చేసుకోవడం మంచిదే మో!

ఇంతకూ తప్పెవరిది? ఒప్పెవరిది? లోక్ పాల్ బిల్లు సుదీర్ఘ చరిత్ర - హజారే ఆందోళన - పౌర సమాజం జోక్యం - ప్రభుత్వ ఏమరుపాటు - రాందేవ్ బాబా రంగ ప్రవేశం - ప్రభుత్వం తొందర పాటు చర్యలు - రాజీ మార్గాల అన్వేషణ - పౌర సమాజం సభ్యులతో కలిసిన సంయుక్త కమిటీ ఏర్పాటు - జన లోక్ పాల్, ప్రభుత్వ లోక్ పాల్ ముసాయిదా బిల్లుల తయారీ - ఏకాభిప్రాయ సాధన - నాలుగై దు మినహా జన లోక్ పాల్ లో ప్రతిపాదించిన అంశాలన్నింటినీ చేర్చుతూ ప్రభుత్వం లోక్ పాల్ బిల్లు ముసాయిదా రూపొందించడం - మంత్రి మండలి ఆమోదం - లోక్ సభలో ప్రవేశ పెట్టడం - మధ్యలో అసంతృప్తి చెందిన అన్నా హజారే నెల రోజుల క్రితమే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటన చేయడం - అన్న మాట ప్రకారం ఆగస్టు పదహారున దీక్షకు దిగేందుకు సన్నద్ధం కావడం - హజారే ముందస్తు అరెస్టు, అదే రోజు రాత్రి పొద్దు పోయాక ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం - ఈ లోపల చిదంబరం తో సహా ముగ్గురు కేబినెట్ మంత్రులు ఢిల్లీ పోలీసుల చర్యను సమర్థించడం - హజారేతో సహా పలువురి నిర్బంధం, విడుదల - పార్లమెంటు లోపల, బయట ప్రభుత్వం, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం - చివరకు జైలులోనే వుంటానని భీష్మించుకుని కూర్చున్న హజారే మూడోరోజుకల్లా దిగి రావడం...ఒకటి వెంట ఒకటి జరిగిన పరిణామాలు. వీటిలో, అంతా సత్య సంధులే అనడం నిజం కాదు...ప్రభుత్వం ది ఒక రకమైన మొండి వైఖరై తే, ప్రతి పక్షాల ది మరో రకమైన మొండి తనం...ఇక పౌర సమాజానిది గజ మొండి తనం! వెరసి, మీడియాకు బిజీ-బిజీ-బిజీ!

నాలుగున్నర దశాబ్దాల తర్వాత లోక్ పాల్ బిల్లు ఆవశ్యకతను గుర్తుచేస్తూ, అన్నా హజారే నాయకత్వంలోని పౌర సమాజ బృందం మొదట్లో ఆందోళనకు దిగడం సమంజసమే. అప్పట్లో వారి డిమాండు ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును తెచ్చి చట్టం చేయాలని మాత్రమే! సరే మధ్యలో దూరారు బాబా రాందేవ్. అదే అదనుగా తీసుకుని, స్వతంత్ర భారత దేశంలో అంతో-ఇంతో అవినీతి భాగోతం నడిపించిన వారితో సహా సింహభాగం అవినీతిలో భాగస్వాములైన ఎందరో మహానుభావులు హజారే సరసన చేరారు. ఆయన వెంట వున్న పౌర సమాజం సభ్యులు నిజాయితీ పరులే-అందులో సందేహం లేదు. వచ్చిన చిక్కల్లా, వారూ-వీరూ అనే తేడా లేకుండా, తన దగ్గరకు వచ్చిన అందరినీ తన అక్కున చేర్చుకున్నారు గాంధేయ మార్గాన్ని అనుసరించే హజారే! అంతటితో ఆగలేదు..వీరికి తోడుగా, రాజకీయ పార్టీల నాయకులు ఇదే అదను అనుకుని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి సరైన సమయం అనుకుని, హజారే పక్షాన నిలిచారు. గండం గట్టెక్కడానికి ప్రాధాన్యతనిచ్చే మన్మోహన్ సర్కారు, ఆపాటికే కూరుకుపోయిన కష్టాలకు మరిన్ని తోడవుతావేమోనన్న భయంతో రాజీ మార్గాన్ని ఎంచుకుంది మొదట్లో. "విభజించి పాలించు" అన్న బ్రిటీష్ సిద్ధాంతాన్ని స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ అనుసరిస్తూ వస్తున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ-దాని సారధ్యంలోని మన్మోహన్ యుపియే సర్కారు, పౌర సమాజాన్ని-ప్రతిపక్షాలను చీల్చాయి అప్పట్లో. ప్రతి పక్షాలను దూరం పెట్టి పౌర సమాజాన్ని దగ్గరకు తెచ్చుకునే వ్యూహంతో ముందుకు సాగింది. ఆందోళనను తాత్కాలికంగా పలచన చేయగలిగింది.

అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్న లోక్ పాల్ బిల్లు ముసాయిదాను ఖరారు పర్చే ముందర, సంప్రదాయ బద్ధంగా-ఆనవాయితీగా వస్తున్న ప్రతిపక్షాలను సంప్రదించే ఆచారాన్ని పక్కన పెట్టింది. కమిటీలో పౌర సమాజం సభ్యులకు మాత్రమే ప్రభుత్వ సభ్యుల సరసన పెద్ద పీట వేసింది. వారిలో కొందరిపై ఆరోపణలున్నాయని మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోలేదు. ఆ చర్యతో, పౌర సమాజం సభ్యులు, తమ వాదనను వినిపించడంలో బలపడ సాగారు. వ్యవహారమంతా హజారే బృందం చేతుల్లోకి పోతుందని పసికట్టిన, ప్రభుత్వం లోని కొందరు పెద్దలు, ఆధిక్యత దిశగా అడుగులు వేయసాగారు. ప్రధానిని కూడా లోక్ పాల్ పరిధిలోకి తేవాలని పౌర సమాజం సభ్యుల ప్రతిపాదనకు సహితం మన్మోహన్ సింగ్ తలూపే స్థితికి రావడంతో, ఖంగుతిన్న ప్రభుత్వ పెద్దలు కొందరు, అది జరగకుండా జాగ్రత్త పడ్డారు. చేర్చడం-చేర్చక పోవడం అనేది చర్చనీయాంశం. ఎవరి వాదనలు వారికుండవచ్చు. చివరకు అంతా తమదే విజయం అని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో పౌర సమాజం ఎదురు తిరిగింది. జన లోక్ బిల్లు తప్ప ప్రభుత్వ బిల్లు తమకు ఆమోద యోగ్యం కాదు పొమ్మంది! ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. తానేమీ తక్కువ తిన్నానా అన్న చందాన, ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునే బదులు, ఎదురుదాడికి దిగింది. అప్రజాస్వామిక చర్యలకు పూనుకుంది. అవసరం లేకపోయినా హజారే ను-ఆయన బృందాన్ని నిర్బంధంలోకి తీసుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంది.

పార్లమెంటు సార్వభౌమాధికారం అన్న మాటను ఆలశ్యంగా తెరపైకి తెచ్చింది. అది కాదనే పరిస్థితి ప్రతిపక్షాలకు కలిగించింది. ఎప్పుడైతే హజారే పార్లమెంటు ఆధిపత్యాన్ని ప్రశ్నించారో, అప్పుడే, ప్రభుత్వం ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని వుండాల్సింది. వారి మద్దతుతో హజారేను తప్పు బట్టాల్సింది. ప్రజాస్వామ్య వ్యవస్థల హక్కుల పరిరక్షణలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయాల్సింది. భవిష్యత్ లో నేటి ప్రతిపక్షమే అధికార పక్షం కావచ్చని నచ్చ చెప్పాల్సింది. ప్రతిపక్షాలను హజారే వైపు మళ్లకుండా జాగ్రత్త పడాల్సింది.

ఇప్పుడు జరుగుతున్నదేంటి? లోక్ పాల్ బిల్లు విషయాన్ని అటు పౌర సమాజం-ఇటు ప్రభుత్వం పక్కన పెట్టి, హజారే దీక్ష ఎక్కడ-ఎన్నాళ్లు-ఏ తరహాలో-ఎంతమంది మద్దతు దార్లతో జరగాలనే విషయం మీద రాజీ మార్గాలు వెతకడం. రాజీ కుదిరింది. ఆమరణ దీక్ష చేస్తానన్న హజారే పదిహేను రోజులు మాత్రమే చేయాలని ఢిల్లీ పోలీసులు విధించిన నిబంధనకు ఆయనతో సహా పౌర సమాజ బృందం అంగీకరించింది! దీక్షా స్థలం రాంలీలా మైదానం వుండడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. మరో పదిహేను రోజుల పాటు ఆ సినిమా కొనసాగుతుందేమో కాని, లోక్ పాల్ బిల్లు అంశాలు మాత్రం మరుగున పడడం ఖాయం. నీతికి-అవినీతికి మార్గదర్శకాలంటే ఇవేనేమో!

"ఆల్ ద బెస్ట్ టీం అన్నా హజారే"!

9 comments:

  1. పదిహేను రోజుల నిరాహార దీక్ష అంటే అది రాజీ దీక్షే అవుతుంది కానీ పోరాటం అవ్వదు.

    ReplyDelete
  2. నూటికి నూరు పాళ్లు నిజం

    ReplyDelete
  3. It is stupid to talk on length of the fasting. Hazare is right in accepting all to take part, otherwise he wouldn't have achieved his goal, so easily. It is the government that was stubborn, foolishly arrogant in dealing with the activists by unleashing their dogs to attack Anna Hazare, particularly Kapil Sibal and Manish Tiwari.
    You mentioned that "Anna Hazare had to come down after 3days.." seems you are closing your eyes to what the world witnesse these three days. The government gave permission for 3days with 22conditions. These three days they bargained for 5, 7, 10, 12 , 14 and finally to 15& accepted to extension. Who came 'down', here? Anna or the govt?

    It is foolish to say that the activists tried to hijack the parliament, that is a meaningless allegation. He insisted for a strong Lokpal with powers on investigating agencies and as a constitutional body. The corrupt politicians are not ready for that they introduced some toothless 'jokepal', as an eye-wash.
    Even Pakistan media responded positively, but unfortunately, our wheel-chaired, hardened journalists are not ready to accept the change. Whether youi change or not, they have support of the people. It is different matter all together whether they will be successful in their effort, but as on now they are on right-track.

    ReplyDelete
  4. పదిహేను రోజులు నిరాహార దీక్ష చేసిన తరువాత హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి కొన్ని రోజులు చికిత్స చెయ్యించుకుంటే తగ్గిపోయిన సుగర్ తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటుంది. తెలంగాణావాదులలాగా రాస్తా రోకోలూ, రైల్ రోకోలూ చేసినా అర్థం చేసుకోవచ్చు కానీ ఈ పేరు గొప్ప నిరాహార దీక్షలు చేస్తే ఏమి లాభం?

    ReplyDelete
  5. Let us respect others view also.
    Jwala

    ReplyDelete
  6. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అంటారు. ప్రజలలో చైతన్యాన్ని రగిలించి దేశాన్ని ఒక్క తాటి మీదకి తీసుకు రాగలిగిన వారు ఎన్నాళ్ళ తర్వాత వచ్చారు.

    పేరు గొప్ప నిరాహార దీక్షలు చేస్తే ఏమి లాభం? మీ బాధేంటో అర్ధం కాదు ఎవ్వరికి.
    పైగా తెలంగాణావాదులలాగా రాస్తా రోకోలూ, రైల్ రోకోలూ చేసినా అర్థం చేసుకోవచ్చు!!!

    అధ్బుతమైన ఆచరణీయమైన ఆదర్శం!

    ReplyDelete
  7. నరసింహారావు గారూ,
    "ఇందిరా గాంధీ హయాంలో అత్యవసర పరిస్థితి విధించిన దరిమిలా, అసలే అంతంత మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న పార్లమెంటరీ వ్యవస్థ- అందులోని ఉభయ సభల రాజ్యాంగ బద్ధమైన అధికారాలను హరించే ప్రయత్నం చేస్తే వారెంత గొప్ప వారైనా వారి చర్యలను ఎదుర్కోవాల్సిందే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రమాదకరమైన ప్రభావం పడే ఎటువంటి చర్యైనా అటు ప్రభుత్వం కాని, ఇటు ప్రతి పక్షాలు కాని, వీటన్నింటి కీ అతీతం అని అంటున్న పౌర సమాజం కాని చేపట్టే, దాన్ని అడ్డుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం."
    పై వాక్యాల్లో ఏవో ఒకటి రెండు పదాలు మిస్సవడమో, తప్పు పడటమో జరిగినట్టుంది. మొత్తం మీద అర్థం కొంత గందరగోళంగా ఉంది. సరే, అన్నా పార్లమెంటును ధిక్కరిస్తున్నారు అని మీ ఉద్దేశం అని అనుకుంటున్నాను.

    అసలు అన్నా పార్లమెంటు అధికారాలను హరించే ప్రయత్నం చేసిందెక్కడ? ’పార్లమెంటు బిల్లు చెయ్యొద్దు, మేమే చేస్తామ’ని చెప్పలేదే! ’ఇదుగో, బిల్లు ఇలా కావాలి మాకు’ అని అడుగుతున్నాడు. బిల్లులు ఫలానా విధంగా ఉండాలని వివిధ వర్గాల జనం లాబీయింగు ద్వారా వత్తిడి చెయ్యడం తెలిసిందే! అన్నా లాబీయింగు జోలికి పోకుండా బహిరంగంగా తన డిమాండును చాటాడు. ప్రజలు స్పందించి అయనతో గొంతు కలిపారు. ఇలాగే కావాలి అని డిమాండుతున్నారు. ఇందులో తప్పేంటి? "మేం పార్లమెంటును వ్యతిరేకించడం లేదు. మాకిచ్చిన వాగ్దానాలపై వెనక్కుపోయిన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం తెచ్చిన బిల్లు బలహీనమైనది, ఎల్లెడలా వ్యాపించిన అవినీతిని అది అరికట్టలేదు", అని స్పష్టంగా చెప్పారు గదా, ఇక పార్లమెంటును ధిక్కరించిందెక్కడ? మీవంటి అనుభవజ్ఞులైన పాత్రికేయులు కూడా ఈ ’పార్లమెంటు ధిక్కారం’ వాదన చెయ్యడం నాకు అశ్చర్యం కలిగిస్తోంది.

    అయినా.. చట్టాలెందుకు, ప్రజలకోసమా? పార్లమెంటు సభ్యుల కోసమా? ఈ బిల్లులో ఒక ప్రత్యేకత ఉంది -ఎవరైతే బిల్లును సభలో పాస్ చెయ్యాలో, వాళ్ళకు సంబంధించినదే ఈ బిల్లు. బిల్లు కట్టుదిట్టంగా ఉంటే తరవాత్తరవాత తమకే ఇబ్బంది అని వాళ్లకు తెలుసు. అంచేతే అది తమకు బాగా అనుకూలంగా ఉండేలా చూస్తారు వాళ్ళు. చూస్తున్నారు కూడా. వాళ్ళనుకున్నట్టుగా బిల్లు చేస్తే అది వాళ్ళకు బాగానే ఉంటది. కానీ ప్రజలకే.. పనికిరాదు. అందుకని అన్నా బృందం వత్తిడి పెడుతున్నది. అన్ని బిల్లుల విషయంలో జోక్యం చేసుకోలేదే!

    అన్నా పార్లమెంటును ధిక్కరించడం లేదు సరిగదా, ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యమని పార్లమెంటును అడుగుతున్నాడు.
    -----------------
    టపా మొత్తం బొద్దు అక్షరాలతో ఉంది. అది కళ్ళకు అంత సౌకర్యంగా లేదు. వేరే కారణమేమీ లేకపోతే, మామూలు అక్షరాలను వాడగలరు.

    ReplyDelete
  8. కేవలం చట్టాలు తయారు చేస్తే ఏమి లాభం? సామాజిక పరిస్థితులు మారాలి. సమాజం గురించి ఆలోచించకుండా వ్యక్తిగత జీవితం గురించే ఆలోచించేవాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సామాజిక వాతావరణంలో పుట్టి పెరిగినవాళ్ళు అంత సులభంగా సామాజిక బాధ్యతని అలవరుచుకుని లంచాలకి దూరంగా ఉండగలరా? చిన్నప్పుడు నేను సమాజం గురించి ఆలోచిస్తే మా అమ్మానాన్నలు నన్ను తిట్టేవాళ్ళు. సమాజం గురించి మనకెందుకురా, నీ చదువేదో నువ్వు చదువుకుని హై ప్రొఫైల్ ఉద్యోగం చూసుకుని బాగుపడు అనేవాళ్ళు. సమాజం గురించి ఆలోచించకుండా బండగా టెక్నికల్ చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడినవాడు సమాజం గురించి బాధ్యతగా వ్యవహరించి లంచం తీసుకోకుండా ఉంటాడా?

    ReplyDelete
  9. //పైగా తెలంగాణావాదులలాగా రాస్తా రోకోలూ, రైల్ రోకోలూ చేసినా అర్థం చేసుకోవచ్చు!!!
    అధ్బుతమైన ఆచరణీయమైన ఆదర్శం!//
    కేవలం అడుక్కుంటే పాలక వర్గంవాళ్ళు చట్టాలు మారుస్తారా? స్వాతంత్ర్య సంగ్రామంలో పని చేసిన కాంగ్రెస్ గ్రామ స్థాయి కార్యకర్తలకి ఉన్న నిజాయితీ అన్నా హజారేకి లేనట్టు ఉంది.

    ReplyDelete