ఆంధ్రజ్యోతి దినపత్రిక (07-09-2011)
వనం జ్వాలా నరసింహారావు
ఇ.ఎం.ఆర్.ఐ - 108 ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య మాజీ కన్సల్టెంటు
అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సర్వీసులను నడిపే శక్తి ప్రభుత్వానికి లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నట్లు వార్తలొచ్చాయి. అంబులెన్సుల నిర్వహణ విషయంలో సర్కారు ఇరకాటంలో పడిందన్న వార్తలూ పొక్కాయి. రెండేళ్లుగా వీటిని నిర్వహిస్తున్న జీవీకే సంస్థనుంచి వాటిని తొలగించే అవకాశం వున్నట్లు కూడా సమాచారం. ఎవరు-ఎలా నిర్వహిస్తారో అనే విషయం పక్కన పెడితే, తిరగవలసిన 802 అంబులెన్సుల్లో సుమారు 300 వరకు ఏమైనా యో-ఎక్కడున్నాయో అంతుపట్టకుండా పోయింది. 108 సేవల కొన సాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఒక్కో అంబులెన్సుకు నెలకు ఇంతవరకు ఇస్తున్న రు. 1, 12, 499 కంటే తక్కువగా కేవలం రు. 95 వేల చొప్పున మాత్రమే చెల్లించాలని సూచించినప్పటికీ, ఇ.ఎం.ఆర్.ఐ అంగీకరించడం వెనుక కారణాలు అర్థం చేసుకోవడం కష్టమే! రు. 42 కోట్ల బ్యాంకు రుణాన్ని తీర్చేందుకు కూడా జీవీకే సంస్థ ఒప్పుకున్నదట! 108 నిర్వహణ అధ్వాన్నంగా మారిన విషయం జగమెరిగిన సత్యం. అసలు ఆ సంస్థకు అంబులెన్సులు నడవడం కన్నా, ఆ సేవలను ఎలాగైనా నిర్వహించడమే ప్రధానంగా కనిపిస్తోంది.
ఒక్కో 108 అంబులెన్సు ప్రతి రోజూ కనీసం 3-4 పర్యాయాలైనా ఎమర్జెన్సీ సేవలందించేందుకు సంఘటనా స్థలానికి వెళ్లాలి. సగటున అవి ఇప్పుడు 1-2 సార్లన్నా చేస్తున్నాయో-లేదో అనుమానమే! కాల్ సెంటర్ కు వచ్చే ఫోన్లు కూడా గణనీయంగా పడిపోతున్నట్లు సమాచారం. ప్రతిసారీ రామలింగ రాజు హయాంలో యాక్సెస్ బ్యాంకు నుంచి తీసుకున్న రు. 42 కోట్ల రుణానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తుంటారు. అదేదో ఘన కార్యం చేస్తున్నట్లు తాను ఆ రుణానికి పూచీకత్తు పడతానని సంస్థ చైర్మన్ అనడం గమనించాల్సిన విషయం. సంస్థ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇప్పటివరకు రు. 60 కోట్ల నిధులను (రాజు హయాంలో చేసిన అప్పుల కింద?) సమకూర్చానని సీఎం వద్ద ఆయన వాదిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ కు అదనంగా మరో 9 రాష్ట్రాలకు సహాయ సేవలను విస్తరించానని, జీవికే అనడం హాస్యాస్పదం. సంస్థ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన చొరవతో కనీసం ఒక్క టంటే ఒక్క రాష్ట్రం కూడా కొత్తగా 108 సేవల నెట్‌వర్క్ లోకి రాలేదనే ది వాస్తవం. పైగా అంతకు ముందున్న రాజస్థాన్ రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పరిధి నుంచి వైదొలగింది కూడా.
"లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" ప్రక్రియను ఆరోగ్య వైద్య రంగంలో ప్రవేశపెట్టి యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత ఆంధ్ర ప్రదేశ్ దే. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అధ్యయనంలో "కరుణామయి-కారుణ్య దేవతగా" అభివర్ణించబడిన 108 అంబులెన్స్-అత్యవసర సహాయ సేవలు, ఇతర రాష్ట్రాలలో అంచలంచలుగా అభివృద్ధి చెందుతుంటే, అవి ఆవిర్భవించిన రాష్ట్రంలో, కుంటుపడడం దురదృష్టం. 108 సేవలను తన సొంత నిధులతో ఆరంభించిన రామలింగ రాజు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లిన తర్వాత తలెత్తిన పరిస్థితులను సమీక్షించిన ప్రభుత్వం, అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇది రెండున్నరేళ్ళ క్రితం తీసుకున్న నిర్ణయం. దానికి ప్రత్యక్ష సాక్షులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే. సత్యనారాయణలతో సహా పలువురు ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వ ప్రతినిధులు.
ఇ.ఎం.ఆర్.ఐ సొంత నిధులతో ఆగస్ట్ 15, 2005 న హైదరాబాద్ లో అంబులెన్సులను ప్రవేశ పెట్టింది. తర్వాత తిరుపతి-విశాఖపట్నం-విజయవాడ-వరంగల్ పట్టణాలకు, రాష్ట్రంలోని అన్ని జిల్లా-రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు మొత్తం 70 వాహనాలతో విస్తరించింది. జనవరి 2007 లో గ్రామీణ ప్రాంతాలకు సేవలు విస్తరించడం, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 502 అంబులెన్సులు సేవలందించడం జరిగింది. మే నెల 2008 లో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు, 2008-2009 ఆర్థిక సంవత్సరం నుండి, నిర్వహణ వ్యయంలో 95% ప్రభుత్వం భరించాలని, అంబులెన్సుల సంఖ్యను దశలవారీగా 802 కు పెంచాలని నిర్ణయించింది. అప్పటినుంచి ఇంతవరకు 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం, పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం మొదలైంది.అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? మరెందుకీ సంస్థ-అది అందిస్తున్న అత్యవసర సహాయ సేవలు ఇబ్బందులకు లోను కావాలి? అసలేం జరుగుతున్నది?ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితమా? యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? ఇటీవల కింది స్థాయి సిబ్బందికి కూడా సకాలంలో జీతాలు చెల్లించడం లేదని వార్తలొస్తున్నాయి. కనీసం నాలుగొందల వాహనాలు సేవలను అందించలేని పరిస్థితుల్లో నిరుపయోగంగా పడి పోయాయంటున్నారు. ఏది నిజం?
ఆశయం గొప్పది కావచ్చు. అమలు పరిచేవారు నిష్ణాతులే కావచ్చు- నిబద్ధత, అంకిత భావాలకు సాక్షాత్తు చిరునామా కావచ్చు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వ” భావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వి.కృష్ణారెడ్డి, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు. ఐనా సమస్యలు కొనసాగడంతో, ప్రభుత్వం నియమించిన కమిటీ, ఆర్థిక శాఖ కొంచెం లోతుగా అధ్యయనం చేయడం మొదలెట్టింది. 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో ఇంకొక ముసాయిదాను తయారు చేసి, పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ మధ్య కుదుర్చుకున్న మొదటి, రెండో, మూడో ఎంఓయు విషయంలో గాని, నాలుగో (మే 5, 2008) ఎంఓయు విషయంలో గాని ఏ విధమైన అభ్యంతరాలను ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రాతిపదిక ఆధారంగా ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" అవకాశం ఇచ్చింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ఇలా జరగకుండా వుండాల్సింది.
ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనలో ప్రధానమైంది నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రత్యక్ష నిర్వహణ వ్యయానికి సంబంధించిన విషయం. 2008-2009 ఆర్థిక సంవత్సరానికి, అప్పట్లో ఇ.ఎం.ఆర్.ఐ, ఒక్కో అంబులెన్సుకు సగటున ప్రతినెలా రు. 1, 18, 420 వ్యయమవుతుందని ప్రతిపాదించగా, దాన్ని పరిశీలించి-అంగీకరించిన ప్రభుత్వం, తన వంతు 95% వాటాగా రు. 1, 12, 499 చొప్పున ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ఆ మొత్తం (రు. 1, 12, 499), తర్వాత సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అది కూడా మొదట్లో మూడు నెలల అడ్వాన్సు ఒకే సారి ఇచ్చే సాంప్రదాయం వుండేది. దరిమిలా నెల-నెలా అడ్వాన్సుల సాంప్రదాయానికి అంగీకరించింది యాజమాన్యం. 108 అత్యవసర సహాయ సేవల ఒడిదుడుకులకు ఇదో ప్రధాన కారణం. ముసాయిదాలో 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి 100% పెంచి, ప్రతి నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 18, 420 వంతున ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించింది కొత్త ముసాయిదాలో. అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు !) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారికి ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. రాజు చైర్మన్ గా తొలగిన సమయానికి ఇ.ఎం.ఆర్.ఐ ఇరుక్కుపోయిన సుమారు రు. 120 కోట్ల "అప్పుల ఊబి" వ్యవహారం కూడా ఆర్థిక శాఖకు ఎంతమాత్రం రుచించలేదు. అసలు విషయాలిలా వుంటే ఎంఓయు ఎలా కుదురుతుంది?
లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు? నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు? కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు? రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు? ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు? బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా? ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు? ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు? చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న వారు చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ?
సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజుపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. దాన్ని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.
కొత్తగా సహాయ సేవలను కోరుకునే ప్రతి రాష్ట్రం ముందస్తుగా నిధులను విడుదల చేయడం జరిగింది. గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా విడుదల చేసింది. ఆ తర్వాత కాలంలో ప్రతి రాష్ట్రం పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన నాడే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఎంఓయు నిబంధనల ప్రకారం ఆ నిధులను, ఆ రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు ప్రధానంగా ఉపయోగించాలి. సంస్థ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయం మొదలయింది. అలా చేయడం "దుర్వినియోగం" కింద కు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం.
ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని-సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని-అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని)ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సిందే.
రామలింగ రాజు జైలుకెళ్లే ముందర తన వారసులెవరైతే బాగుంటుందన్న విషయం కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. రాజు గారి కుటుంబ సభ్యులకు పిరమల్-జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వున్నట్లు లేదు మొదట్లో. కాకపోతే, ఎంత కాదనుకున్నా వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు. ఆ తర్వాత జి.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు. పిరమల్ అధినేత, జి.వి.కె. లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి.
రాజు సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం అవసరం. తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో-ఆయన సలహాదారులో అలా చేయించారో? సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షణ లేని" వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు.
ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మీద, "సిద్ధాంతపరంగా" ఎన్నో వ్యాసాలు-మరెన్నో పరిశోధనలు పుంఖానుపుంఖాలుగా లభ్యమయినప్పటికీ, "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" ఆ ప్రక్రియకు భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందిస్తున్న భారత దేశంలోని పది రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడం తేలికైన విషయం కాదు. అలా సాధ్య పడాలంటే భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న వర్తమాన పరిస్థితులలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ, అధిగమించడానికి చర్యలు చేపట్టాలి.
ఇంతవరకూ జరిగిందే దో జరిగింది. ఇక ముందైనా, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో, ప్రయివేట్ సంస్థ కాని-వ్యక్తి కాని ఏ ఒక్కరో కాకూడదన్న నిబంధన రావాలి. పటిష్టమైన "ట్రస్టు" చేతుల్లో ప్రయివేట్ పరమైన యాజమాన్య బాధ్యతలు వుంచాలి. ఇ.ఎం.ఆర్.ఐ అప్పులను, దానికున్న ఆస్తులతో కలిపి విశ్లేషించాలి. అవెవరివో తేల్చాలి. అప్పుడే మరో అడుగు ముందుకు వేయాలి. అంతవరకు, 108-అత్యవసర సహాయ సేవలు ఆగకుండా-నాణ్యతతో నిర్వహించాలి. ప్రభుత్వానికి వాటిని నడిపే శక్తి లేదని సంబంధిత మంత్రి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం. 104 కాల్ సెంటర్ సేవలను, నిర్ధారిత తేదీ సహాయ సేవలను హెచ్.ఎం.ఆర్.ఐ నుంచి తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపగలిగిన శక్తి వున్న ప్రభుత్వానికి 108-అత్యవసర సహాయ సేవలు నడపగలిగే సామర్థ్యం లేదా?
Well documented.
ReplyDeleteI think it is critical to bring in a debate about PPPs and PNPPs (public -not for profit partnerships) into focus - especially in the case of social goods like education and health - total privatization would lead to cost-escalation - which we have seen in healthcare provision -
However, it is important to bring in clarity about the 'skin-in-the-game' for the 'private' partner (preferably large not for profits supported by large organizations) - so that there is no scope for cost escalation (except what is warranted by inflation etc) and there is constant exploration for process improvements and reducing the costs while improving the quality.
For example, HMRI could dramatically reduce technology costs by investing on a new platform - (the first technology was built in 2007) - the benefit of which would go to states where we will be going in future.
Also it is important to learn lessons from the engagement with governments and find mechanisms/frameworks so that the relationships can be free of avoidable stresses and difficulties. probably a number of checklists of do's and donts for both the partners might be a good starting point!
Its unfortunate that the pioneer andhra pradesh seems to have lost steam and a bit of direction - for causes beyond everybody's control - but still i think as a collective who are interested in nation building we must put our heads together and share so that such experiments do not die - instead must evolve into mature models for the country.
Cheers
Balaji Utla Ph.D
CEO
Health Management & Research Institute