ఆంధ్ర జ్యోతి దిన పత్రిక (25-09-2011)
కోట్ల విజయ భాస్కర రెడ్డి
వనం జ్వాలా నరసింహారావు
పరిపాలనకు-సు పరిపాలనకు, ప్రభుత్వానికి-సమర్థమైన, కార్య సాధకమైన ప్రభుత్వానికి చాలా తేడా వుంది. ఈ రెండింటికి బాధ్యత వహించాల్సిన "కార్య నిర్వహణ వ్యవస్థ" అధిపతి (కేంద్రంలో ప్రధాన మంత్రి, రాష్ట్రాలలో ముఖ్య మంత్రి) తనదంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుని, పాలనా రధాన్ని ముందుకు తీసుకుని పోలేకపోతే, అది వారి అసమర్థతకు నిలువెత్తు నిదర్శనమవుతుంది. అసమర్థతలను అణువణువునా పుణికి పుచ్చుకుని పాలనను అందిస్తున్న వర్తమాన ప్రభుత్వాలను గమనిస్తున్న నేటి తరం యువత, ఒకింత ఓపికగా గతంలోకి తొంగి చూస్తే, దివంగత ముఖ్య మంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి లాంటి నాయకుల సు పరిపాలన-సమర్థ నాయకత్వానికి సంబంధించిన వివరాలు అవగతం చేసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రెండు పర్యాయాలు సమర్థుడైన ముఖ్య మంత్రిగా సు పరిపాలనను అందించడంతో పాటు, కేంద్రంలో పలు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించడం, అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో వివిధ రకాల బాధ్యతాయుతమైన పదవులను చేపట్టడం విజయ భాస్కర రెడ్డి ప్రత్యేకత. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, రాష్ట్ర-కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అప్పగించి నన్ని గురుతర బాధ్యతలు, బహుశా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఏ నాయకుడు విషయంలోను జరగలేదనడం అతిశయోక్తి కాదే మో! విజయ భాస్కర రెడ్డి నిజాయితీకి, నిరాడంబరతకు, నిబద్ధతకు, నిక్కచ్చితనానికి దక్కినవే ఆ పదవులన్నీ. ఏ పదవిలో వున్నా, తన వారు-పరాయివారు అనే తేడా లేకుండా, నిర్మొహమాటంగా స్పందించడం ఆయన ప్రత్యేకత. నైతిక విలువలపై ఏ నాడూ రాజీ పడని మనస్తత్వం ఆయనది. ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ నాడూ విజయ భాస్కర రెడ్డి తాను నమ్మిన భావాలపై వెనుకంజ వేయ లేదు. నెహ్రూ హయాంలో ఆరంభమైన విజయ భాస్కర రెడ్డి రాజకీయ ప్రస్థానం, పదవిలో వున్నా-లేక పోయినా, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల నాయకత్వం రోజుల వరకూ కొనసాగింది.
పాత తరం నాయకులలో కోట్ల విజయ భాస్కర రెడ్డికి ప్రత్యేకత వుందనాలి. ఆద్యంతం-ఆజన్మాంతం, చెదరని క్రమశిక్షణతో, ముందు చూపుతో, సామర్థ్యంతో, ఆత్మ విశ్వాసంతో, ముక్కు సూటిగా పోయే మనస్తత్వంతో, పట్టుదలతో రాష్ట్ర-దేశ రాజకీయాలలో తనదంటూ చెరిగిపోని ముద్ర వేసిన పెద్దమనిషి విజయ భాస్కర రెడ్డి. సౌమ్యుడుగా, మితభాషిగా, అజాతశత్రువుగా, సంస్కార వంతుడుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. ఆయనో అరుదైన "సహజ నాయకుడు" . జీవన యానంలో సహస్ర చంద్ర దర్శనం, రాజకీయ యానంలో షష్టి పూర్తి జరుపుకున్న ఆ మహామనీషిని వరించని పదవి లేకపోయినా, ఎన్నడూ పదవే ధ్యేయంగా రాజకీయాలు చేయలేదు. అందుకేనేమో, అశేష జనం అభిమానాన్ని చూరగొన్న "పదహారణాల పెద్దాయన" అయ్యారు. మిగిలిన రాజకీయ వాదులతో పోల్చితే విజయభాస్కర రెడ్డిది పెద్ద మనిషి తరహా వ్యవహార శైలి. 1992 లో జాతీయ స్థాయి ఇంగ్లీష్ మాగజైన్ "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా" నిర్వహించిన సర్వేలో, నాటి కేంద్ర మంత్రివర్గంలో అత్యంత సమర్థుడైన మంత్రిగా, సఛ్చీలుడుగా, అధికారిక కార్యకలాపాలలో జాప్యానికి ఏ మాత్రం తావివ్వని వాడుగా, విజయ భాస్కర రెడ్డిని పేర్కొంది.
అనేక ప్రజోపయోగమైన కీలక పదవులను తన అరవై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో పొందారు. ప్రతి పదవికి వన్నె తెచ్చారు. స్వపక్షం-విపక్షం అన్న తేడా లేకుండా, తప్పుచేశారని భావించినప్పుడు, వారెవరైనా-ఎంత దగ్గరి వారైనా, న్యాయ విచారణకు ఆదేశించి, ప్రశంశలను-అభిశంసలను అందుకున్నారు. అందుకేనేమో, సాక్షాత్తు రాజీవ్ గాంధీ లాంటి వారు, తన తల్లిపై-ఆమె ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో దాన్ని తిప్పికొట్టడానికి, విజయభాస్కర రెడ్డి లాంటి వారి పేరును వాడుకున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆయనను వరించేంత వరకు, అటు కేంద్రంలోను-ఇటు రాష్ట్రంలోను నిర్మాణాత్మక పాత్ర పోషించేవారు విజయభాస్కర రెడ్డి. ఆయన "నంబర్ టు" గా వుండడం, ఎప్పుడో బ్రహ్మానంద రెడ్డి కాలంలోనే ఆరంభమైంది. ఆయన ఏ శాఖను ఏ స్థాయిలో నిర్వహించినా, దానికి సంబంధించిన పూర్వా-పరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారని ఆయన ఆంతరంగిక అధికారులంటుండేవారు. నిజాయితీ పరులైన అధికారులంటే ఆయనకు ఎనలేని గౌరవం. వారిని ఎన్నో రకాలుగా ప్రోత్సహించేవారని పేరుంది. ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు ఎన్ టీ రామారావు దగ్గర ఎస్వీ ప్రసాద్ పనిచేసినప్పటికీ, నిజాయితీ పరులైన అధికారులంటే ఆయనకున్న గౌరవమే తన దగ్గర పనిచేసేందుకు కూడా ఆయన్నే ఎంపిక చేసుకునేందుకు దారితీసింది. మొట్టమొదటి సారి తాను ముఖ్యమంత్రి ఐన రోజుల్లో, ఎస్వీ ప్రసాద్ కడప కలెక్టర్ గా పని చేసినప్పుడు, ఆయన సామర్థ్యాన్ని తెలుసుకున్నానని సన్నిహితులతో అన్నారాయన. అదే విధంగా సీఎం పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన చంద్ర శేఖర రెడ్డిని ఎంపిక చేసే ముందర విజయ భాస్కర రెడ్డి సన్నిహితులు, ఆయన రాజశేఖర రెడ్డికి దగ్గర వాడని చెప్పారు. "రాజాకు దగ్గరైతే ఏమి? వ్యక్తి మంచివాడై వుండాలి కదా?" అని ఎదురు ప్రశ్న వేసి మరీ చంద్ర శేఖర రెడ్డిని నియమించారు సీఎం. అలానే ఎటువంటి క్లిష్టమైన సమస్య ఎదురైనా, దాన్ని ధైర్యంగా ఎదుర్కునేవారు కాని, ఇప్పటి నాయకులవలె బాధ్యతనుంచి తప్పించుకునే ధోరణి కాని-ఇతరులను నిందించడం కాని ఎన్నడూ చేయలేదని కూడా ఆయనతో పనిచేసిన అధికారులనేవారు. ఉదాహరణకు, తీవ్రవాదుల కిడ్నాప్‌కు గురైన నాటి ఎమ్మెల్యేను (ఆ తర్వాత ఆయన మంత్రి కూడా అయ్యారు) విడుదల చేయించేందుకు ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో పలువురి ప్రశంసలనందుకుంది.
కోట్ల తీసుకున్న సారా నిషేధం నిర్ణయం వల్ల మహిళలకు ధైర్యం కలగడం-అనేక బీద కుటుంబాలు బాగుపడడం జరిగింది. చౌక దుకాణాలను మహిళలకు కేటాయించాలనే నిర్ణయం కూడా ఆయనదే. అనాదిగా కాంగ్రెస్ పార్టీపై మహిళలకున్న అభిమానం, విజయభాస్కర రెడ్డి నిర్ణయాల మూలంగా ఇనుమడించిందనాలి. కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా పనిచేసిన ఆయనకు పాలనా దక్షుడుగా పేరొచ్చింది. ఆ పేరే ఆయనను 1962లో రాష్ట్ర స్థాయికి ఎదిగేందుకు దోహదపడిందంటారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడుగా, రాష్ట్ర స్థాయికి చేరుకుని, దరిమిలా కేంద్ర స్థాయికి ఎదిగారు. ఆయన ప్రతిభను గుర్తించిన అధిష్టానం, ఎన్ని విధాల వీలై తే అన్ని విధాల, ఆయన సేవలను ఉపయోగించుకుంది. అహర్నిశలు ఆత్మవిశ్వాసంతో పనిచేసే విలక్షణమైన వ్యక్తిత్వమున్న విజయభాస్కర రెడ్డి ఏ పదవిలో వున్నా, అనవసర విషయాలకు, ఇప్పటి నాయకుల లాగా ప్రాధాన్యమివ్వకుండా, తన కర్తవ్య నిర్వహణలో ఎవరు కూడా వేలెత్తి చూపని రీతిలో హుందాగా ముందుకు సాగేవారు.
మానవత్వానికి, మంచితనానికి, సహనానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయన గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా ఆయన కాన్వాయ్ వెంట ప్రయాణిస్తున్న పాత్రికేయుల వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అది గమనించిన విజయభాస్కర రెడ్డి, తాను ముఖ్యమంత్రినన్న విషయం పక్కన పెట్టి, తన వాహనం దిగి, స్వయంగా గాయపడిన విలేఖరులకు సహాయ పడ్డారు. అదీ ఆయన మానవత్వం. వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్ విషయంలో తొలిసారిగా శ్లాబ్ పద్దతిని ప్రవేశపెట్టిన రైతు పక్షపాతి ఆయన. కాపులను ముస్లింలను వెనుకబడిన వర్గాల వారిగా గుర్తించే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించింది ఆయనే. బలహీన వర్గాల గృహనిర్మాణ పధకం రూపకర్తా ఆయనే. ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం జాతీయ స్థాయిలో అమలు చేయాలని ఇందిరా గాంధి నిర్ణయం తీసుకోవడానికి కారణం, అంతకు ముందే, అలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఆంధ్ర ప్రదేశ్ లో విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా అమలుపరచడమే. ఆయనకు సాగునీటి శాఖన్నా, విద్యుత్ శాఖన్నా, విద్యా శాఖన్నా ఎక్కువ మక్కువ నేవారు. అప్పటి ప్రధాని పీవీ సమక్షంలో తనకు, తన పార్టీ వారినుంచే జరిగిన అవమానానికి నిరసనగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆత్మగౌరవం ప్రదర్శించిన వ్యక్తి విజయభాస్కర రెడ్డి. ముఠా రాజకీయాలకు ఆలవాలమైన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆయన సహనానికి ప్రతీక అనాలి. రాజకీయ నాయకుల కుండే సహజసిద్ధమైన "లౌక్యం" ఆయనకు అలవాటులేదు. నిర్మొహమాటంగా తాను చెప్పదల్చుకుంది చెప్పేవారేకాని మనసులో ఒక మాట, బయటకు మరో మాట చెఫ్ఫే మనస్తత్వం కాదు. ఉదాహరణకు, పీవీ నరసింహా రావు ఓటమి తర్వాత, యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ మద్దతు విషయంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం చెప్పుకోవాలి. తెలుగు దేశంతో కలిసి ఫ్రంట్ కు మద్దతివ్వడం మంచిది కాదని నిక్కచ్చిగా ఆయన చేసిన సూచన విలువ కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత గానీ తెలిసి రాలేదు.
విజయ భాస్కర రెడ్డి మరణించిన మరుసటి రోజు, దాదాపు పతాక శీర్షికలతో, ఆయన జీవిత విశేషాలను గురించి వార్తా పత్రికలన్నీ రాశాయి. రెండు పర్యాయాలు కర్నూల్ జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా, జిల్లా వ్యాప్తంగా అనేక నూతన పాఠశాలలను నెలకొల్పిన విషయం, గ్రామ-గ్రామానికి తాగునీరు సరఫరా గురించి ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ లాంటివి వాటిలో ముఖ్యంగా పేర్కొనాలి. కర్నూల్ మునిసిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గా పనిచేసిన విజయ భాస్కర రెడ్డి సన్నిహితుడొకరికి ఒక సారి తీవ్రమైన జబ్బు చేసి, నిమ్స్ లో చేరడానికి హైదరాబాద్ వస్తున్నట్లు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు ఫోన్ చేశారు. ఆ మిత్రుడు నిమ్స్ చేరుకునే లోపునే, ముఖ్య మంత్రి హోదాలో వున్నప్పటికీ, అక్కడకు వెళ్లి, స్వయంగా అతడిని ఆసుపత్రిలో చికిత్స కొరకు చేర్పించిన విషయం కూడా ఒక ఆంగ్ల పత్రిక పేర్కొన్నది. అదీ ఆయన మానవత్వం!
విజయభాస్కర రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన గురించి పెద్దలు చెప్పిన మంచి వాక్యాలు మన మదిలో ఎల్లప్పుడూ మెదులుతూనే వుంటాయి. సీపీఎం నాయకుడు స్వర్గీయ బోడేపూడి వెంకటేశ్వర రావు, శాసన సభలో తెలుగు గంగపై జరిగిన అవినీతికి సంబంధించిన చర్చలో పాల్గొన్నారొక పర్యాయం. అప్పుడాయన ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతూనే, ఆయన మంత్రివర్గ సహచరులపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూనే, విజయభాస్కర రెడ్డిని గురించి మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యాఖ్యలు చేశారు. "నీతి-నిజాయితీలకు" ఆయన నిదర్శనమని, తాను చేస్తున్న ఆరోపణలకు విజయభాస్కర రెడ్డికి సంబంధం లేదని అన్నారాయన. అందుకే విజయ భాస్కర రెడ్డి ఒక అరుదైన నాయకుడుగా అందరి మన్ననలను అందుకున్నారు.
No comments:
Post a Comment