వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (2-09-2011)
మనది వారసత్వ రాజకీయ భారతం, పార్టీ ఏర్పాటుకు అందరూ మీన మేషాలు లెక్కించిన వారే, నిముషాల్లో ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అడ్డుకునేందుకే వైఎస్సార్ పుస్తకావిష్కరణ, జగన్‌కు చెక్ పెట్టే వ్యూహమేనా?-ఎడిటర్ సూర్య
రాజకీయాలతో పోటీపడగల (సరదా) క్రీడ బహుశా మరేదీలేదేమో! రాణించడం సంగతి పక్కన పెడితే, నేర్చుకోవడం కూడా అంతగా కష్టం కాని ఆట కూడా అదేనేమో! సాధారణంగా ఏ ఆట నేర్చుకోవాలన్నా, చిన్నతనంలోనే మొదలెట్టి తీరాలంటారు. మనిషి పెరిగి పెద్దయినాకొద్ది, నేర్చుకోవడానికి పిన్న వయసులో వుండే చురుకుదనం, తగ్గిపోతుందనేది నిపుణుల అభిప్రాయం. కొందరి విషయంలో-నేర్చుకోవడానికి అన్ని హంగులూ ఏర్పాటు చేసుకునే పుట్టు బంగారు బాతు కూనలకు, అంతో-ఇంతో జన్యుపరమైన నైపుణ్యం వున్న వారికి-మాత్రం, మరీ చిన్నతనంలో కాకపోయినా, ఏ వయసులోనైనా, అనుకున్నదే తడవుగా-కోరుకున్న ఆటలో ప్రావీణ్యం పొందడానికి అవసరమైన శిక్షణను పొందవచ్చు. అలా పొందినవారు మిగతా వారికంటే ఎక్కువగా రాణించవచ్చు కూడా. రాణించి, ఇతరుల అవకాశాలకు గండికొట్టవచ్చు. జాతీయ-అంతర్జాతీయ క్రీడల్లో వారి స్థానం పదిలం చేసుకోనూవచ్చు. మిగతా ఆటలకన్నా రాజకీయం ఆటలో మాత్రం ఇది నూటికి నూరుపాళ్లు నిజం. వారసత్వ రాజకీయాలకు నిలయమైన భారతావనిలో, అందునా ఆంధ్రా వనిలో, అది నూటికి వేయిపాళ్లు నిజం.
అశేష ప్రజాదరణ, లక్షలాది మంది అభిమానుల అండదండలున్న ఎన్ టీ రామారావు లాంటి గొప్ప వ్యక్తి రాజకీయాలలో దిగడానికి చాలాకాలం ఆలోచించాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ స్థాపించడానికి బహుశా ఎంతో తర్జన-భర్జన జరిగే వుంటుంది. సరే పెట్టిన తర్వాత ఏం జరిగిందో చెప్పాల్సిన పని లేదు. ఆ మహానుభావుడికి సైతం గెలుపు-ఓటములు తప్పలేదు. ఆయనంత కాకపోయినా, దాదాపు అంతే మోతాదులో అభిమానుల బలం అపారంగా వున్న, చిరంజీవి కూడా రాజకీయ పార్టీ పెట్టడానికి ఎంత వూగిసలాడిందీ అందరికీ తెలిసిందే. ఓటమి (స్వయంగా ఆయనే ఒక నియోజక వర్గంలో, ఆయన పార్టీ రాష్ట్రంలో) రుచితో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో విలీనం వరకు సాగిందిప్పటివరకు. ఇరవై సంవత్సరాల పాటు ఉన్నత పదవులను చేపట్టి, ఒక ఐఏఎస్ అధికారిగా రాష్ట్రంలోని వివిధ శాఖలలో పనిచేసి మంచి పేరు గడించి, పదవీ విరమణ చేసి, ప్రభుత్వేతర సంస్థ గొడుగు కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రజోపయోగమైన అనేక కార్యక్రమాలను నిర్వహించిన డాక్టర్ జయప్రకాశ్ నారాయణకు రాజకీయ పార్టీ పెట్టడానికి కనీసం నాలుగు సంవత్సరాల పాటు ఆలోచన చేయాల్సి వచ్చింది. గతంలో కాంగ్రెస్ నుంచి వేరుపడిన కొందరు నాయకులైనా, ఇతర పార్టీల నుంచి బయట కొచ్చిన మరికొందరైనా, వేరు కుంపటి పెట్టుకోవడానికి, మీన-మేషాలు లెక్కించే వారు. ఇది ఆంధ్ర ప్రదేశ్ సంగతై తే, మిగిలిన రాష్ట్రాలలోనూ అంతే. అతిరథ-మహారథులనుకునే కురువృద్ధ రాజకీయ నాయకులు సహితం ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి చాలా సమయం తీసుకునే వారు. అలాంటిది, ఆంధ్ర ప్రదేశ్ లో, తనను కాదన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీని లెక్క చేయకుండా, అర నిమిషమైనా ఆలోచించకుండా, దానికి ధీటుగా "వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ" ని స్థాపించి, అతి కొద్ది సమయంలోనే, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు అఖండ మెజారిటీతో ఎన్నికై, అదే పార్టీ నుంచి అంతే భారీ మెజారిటీతో తన తల్లిని శాసనసభకు కూడా ఎన్నిక చేయించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే, కాంగ్రెస్ అధిష్టానానికి భయం లేకుండా వుంటుందా? భయాన్ని కప్పి పుచ్చుకుని, ఆయనను దెబ్బతీయడానికి, ఆ పార్టీ తన సర్వ శక్తులను ఫణంగా పెట్టకుండా వుంటుందా? అలా చేయడానికి, ధీటైన నాయకులను వెతుక్కోకుండా వుంటుందా? ఆ కోణంలో జరిగిన ఆలోచన పర్యవసానమే మొన్న ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ సంరంభం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి, ఎప్పుడైతే సొంత కుంపటి పెట్టారో, ఆ మరుక్షణమే, వైఎస్ బతికున్నప్పుడు ఆయన దూరంగా పెట్టిన-ఆయనకు దూరంగా వున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయక మహాశయులు కొందరు, జగన్ బలం లేనివాడుగా చిత్రీకరించేందుకు "అధిష్టానం వందిమాగధుల" పంచన చేరారు. వారి ద్వారా సోనియాను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డిని కూడా ముందుకు తోసారు. రాజకీయ క్రీడ ప్రారంభమైంది. "అధిష్టానం ఆదేశిస్తే" జగన్మోహన్ రెడ్డిని "ఢీ" కొంటానని డీఎల్ రవీంద్రారెడ్డి ముందుకొచ్చారు. అఖండ విజయం తనదేనని-జగన్ కు డిపాజిట్ కూడా రాదని తొలుత మాట్లాడిన డీఎల్, ఆ తర్వాత తన మెజారిటీని తానే తగ్గించుకుంటూ, చివరకు తన డిపాజిట్ కోల్పాయారు. పాపం వివేకాకు అదే గతి పట్టించారు. నైతిక విలువలంటూ మంత్రి పదవికి రాజీనామా చేసిన వివేకా రెంటికి చెడ్డ... సామెతకు గురయ్యారు. అధిష్టానానికి ఎవరేంటో తెలిసొచ్చింది. ఎవరి బలం ఎంతో అవగాహన కొచ్చింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరో నిర్ణయానికొచ్చింది. పావులు కదపడం మొదలెట్టింది. కలిసొచ్చే రోజున...నడిచొచ్చే...అన్న చందాన, శంకర్ రావు కోర్టులో వేసిన కేసుతో సిబిఐ రంగంలోకి దిగడంతో, కాంగ్రెస్ పార్టీకి కొంత వెసులుబాటు వచ్చింది. దెబ్బమీద దెబ్బ కొట్టడానికి రంగం సిద్ధమైంది. రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం అనంతరం, క్రియాశీలక రాజకీయాలకు కొంత "బ్రేక్" ఇచ్చిన ఆయన సన్నిహితుడు-హితుడు కేవీపీ రామచంద్రరావు అధిష్టానం వేసిన "అంజనం" లో పెద్దలకు కనిపించారు. ఆయన కూడా అవకాశం కొరకు ఎదురు చూస్తుండడంతో, కార్యాచరణ ప్రణాళిక అమలు మొదలైంది. తొలి అంకం "పుస్తకావిష్కరణ" తో ప్రారంభమైంది. ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి జగన్ చేసిన తప్పిదాలను చట్టపరంగా వాడుకుంటున్న కాంగ్రెస్ ఆయన "రాజకీయ క్రీడ" కట్టడికి మరో దిక్కునుంచి ఈ విధంగా అడుగులు వేయ సాగింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై రూపొందించిన "వైఎస్ ఆర్-మాన్ ఆఫ్ ద పీపుల్" అనే ఈ ఛాయాచిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా మారడానికి ప్రధాన కారణం, వైఎస్ రాజకీయ వారసత్వం ఎట్టి పరిస్థితుల్లోను జగన్మోహన్ రెడ్డిది కాదని చెప్పడానికే! జగన్ కేవలం రాజశేఖర రెడ్డి "ఆస్తులకు" మాత్రమే వారసుడని ఇన్నాళ్లూ చెప్తూ వస్తున్న వైఎస్ వ్యతిరేక కాంగ్రెస్ నాయకులు, ఆ వారసత్వం ఆయనకు ఆపాదించడానికి వెనుకనున్న కారణం, అదే ఆరోపణపై జగన్ ను ఇబ్బందుల పాలు చేయడమే. వ్యతిరేకుల వైఖరికి భిన్నంగా వైఎస్ అనుయాయులమని చెపుకుంటున్న వారి వ్యూహం మరో విధంగా వుంది. వైఎస్ రాజకీయ వారసత్వం తనదేనని ఆయన కుమారుడుగా జగన్ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ అభిమానులను- సన్నిహితులను, ఏదో ఒక కారణాన ఒకే వేదికపై తెచ్చి, సంఘటితం చేయడంతో పాటు, మరుగున పడిపోతున్న తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ఆయనకు తెలియకుండానే, ఆయనతో ఈ కార్యక్రమం, ఆయనొక్కడే ఒంటి చేత్తో చేస్తున్నానన్న భావన కలిగించింది అధిష్టానం. ఫలితంగా భారీ స్థాయిలో పుస్తకావిష్కరణ తంతు నడిచింది. స్వయంగా కేవీపి పలువురిని ఆహ్వానించారు. సోనియాగాంధి కార్యక్రమంలో పాల్గొంటుందన్న ప్రచారమూ జరిగింది. వైఎస్ మరో దగ్గరి స్నేహితుడు, ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా, సోనియా సభకు రాలేకపోయిన విషయాన్ని బహిర్గతం చేశారు. యావత్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యోధానయోధులు, కేంద్ర మంత్రి మండలిలోని ఉద్దండులు, రాష్టంలోని వైఎస్ అభిమాన భజన మండలి, వారు-వీరు అనే తేడా లేకుండా, సభలో ప్రత్యక్షమయ్యారు. వైఎస్ రాజకీయ వారసులం తామే అంటూ ఉపన్యాసాలిచ్చారు. అవును మరి! వైఎస్ వల్ల అంతో-ఇంతో లబ్ది పొందిన వీరంతా ఆయన వారసులమని చెప్పుకోకుండా వుండే ధైర్యం వుందా? సోనియా గాంధీ ఢిల్లీలో వుండి వున్నట్లయితే ఆమె ఆ సభకు హాజరై వుండేదా? అనుమానమే! సోనియా కోరుకుంటున్నది తన సారధ్యంలోని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, పార్టీలోని అందరినీ కూడగట్టుకుని జగన్ కు చెక్ పెట్టాలని తప్ప, వైఎస్ వారసులుగా మాత్రం కానే కాదు. ఒకవేళ ఆమె వైఎస్ వారసత్వంతో పటిష్టమయ్యే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కావాలనుకుంటే, ఏనాడో ఒకనాడు జగన్మోహన్ రెడ్డినే ఆహ్వానింస్తుందికాని పరోక్షంగా ఇలా మాత్రం చేయదు. జగన్ ను, ఆయన ఎవరి వారసుడుగా చెప్పుకుంటున్నడో ఆ రాజశేఖర రెడ్డిని ఓడించడమే సోనియా లక్ష్యం అయ్యుండాలి.
అనుకున్నట్లే-ఆహ్వానించింది ఎవరైనా-పరోక్షంగా అధిష్టానం ఆశీస్సులున్నా లేకపోయినా-పిలుపు అందుకున్న వారు, అందుకోనివారు-వై ఎస్ రాజశేఖర రెడ్డి మీద నిజమైన ప్రేమ వున్న వారు, లేనివారు, అందరూ పుస్తకావిష్కరణ సభకు వచ్చారు. ఒకరిని మించి (మనసులో వుద్దేశం ఏదైనప్పటికీ) మరొకరు వై ఎస్ ఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. పనిలో పనిగా రాజశేఖర రెడ్డి విజయాల వెనుక కెవిపి రామచంద్ర రావు వున్నారన్న భావన కూడా వచ్చే ట్లు మాట్లాడారు వారంతా. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి-కేవీపీ రామచంద్ర రావులేనని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నొక్కి వక్కాణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్, ప్రవాస వ్యవహారాల మంత్రి వాయలార్ రవి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కోశాధికారి, సీనియర్ నేత మోతీలాల్ వోరా తదితరులంతా వైఎస్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన అసలు సిసలైన కాంగ్రెస్ వాది అని, సోనియాకు అత్యంత విధేయుడని కూడా పొగిడారు.
ఇంతకూ కెవిపి రామచంద్రరావు మనసులో ఏముంది? పుస్తకావిష్కరణ ఆలోచన ఆయనదేనా? రెండేళ్లు పనికిరాని ఆయన హఠాత్తుగా అధిష్టానానికి ఇప్పుదెందుకు అవసర మయ్యాడు? కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ "విభజించి పాలించు" అన్నదే వ్యూహం. జగన్ నుంచి వివేకాను విడదీసి లబ్ది పొందుదాం అనుకుంటే, అది బెడిసి కొట్టింది. రోశయ్యకు మొదలు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇస్తే ఆశించిన ఫలితాలు రావడం లేదు. శంకరరావు లాంటి వారి పాత్ర పరిమితమైనదే. రాజశేఖర రెడ్డి వ్యవహార శైలి పరిపూర్ణంగా తెలిసిన ఏకైక వ్యక్తి కెవిపి రామచంద్ర రావు మాత్రమే. జగన్ ఎలాగూ ఎదురు తిరిగాడు. ఆయనను సరాసరి యుద్ధంలో ఓడించడం అంత తేలికైన విషయం కాదనే ది అధిష్టానం పసికట్టింది. ఏ ఎత్తులు-జిత్తులతోనైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కెవిపి తెలివితేటలు తోడ్పడ్డాయో, వాటితోనే ఆయన కుమారుడికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే, ఈ పుస్తకావిష్కరణ తతంగం సాగింది. ఎలాగూ కేవిపికి "చంద్రగుప్తుడు"లాంటి పదవిపై కోరిక-కాంక్ష లేదు. ఆయన కోరుకునే "చాణక్యుడి పాత్ర" ఎందుకు ఆయనకే ఇవ్వకూడదనేది అధిష్టానం ఆలోచన. చాణక్య నీతిలో విజయం సాధిస్తే జగన్ ను కట్టడి చేయగలమనే ఆశతోనే ఇదంతా. ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు!
కాంగ్రెస్ చేజేతులా కాబోయే ముఖ్యమంత్రి పదవిని జగన్ వైపు నెడుతుంది. ఈ సి.బి.ఐ ఆరోపణలూ ఇలాంటివే మరెన్నో జరిగి ఎంతలా పీడించి ( ఇక్కడ అవినీతి ని పక్కన పెట్టండి. అవినీతి గూర్చి మాట్లాడితే ఏ ఒక్క రాజకీయ నాయకుడూ మిగలడు ) భయపెట్టాలని చూసి నిజంగా కాలం కలసి రాక జగన్ ను జైలు లో పెట్టించి సంబరపడినా... ఇలాంటివి జరిగే కొద్ది జనం జగన్ కి దగ్గరవడం తప్పించి వేరే ఏమీ అవ్వదు. ఇక ఆంధ్రలో కాంగ్రెస్ సున్నా.
ReplyDeleteThank You. I agree.
ReplyDelete