Thursday, September 22, 2011

తిలా పాపం తలా పిడికెడు: వనం జ్వాలా నరసింహారావు

తిలా పాపం తలా పిడికెడు !

సూర్య దినపత్రిక (23-09-2011)

చరిత్ర ఎరుగని మహాపాతకం ఈ రాష్ట్రానికి పట్టిందా?

వనం జ్వాలా నరసింహారావు

"సకల జనుల సమ్మె" ప్రభావం వుందనే వారి వాదన-లేదనే మరి కొందరి వాదన, తీవ్రంగా వుందనే తెలంగాణ వాదుల ప్రకటనలు-అసలు ఏ మాత్రం లేనే లేదని బల్ల గుద్ది చెపుతున్న సమైక్య వాదుల మాటలు, అటూ-ఇటూ చెప్పలేని వారి నిర్వేదం-ములుకుల్లాంటి పలుకులు.... ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అంటుంటే, ఎవరి వాదంతో ను ఏకీభవించలేని వారి పరిస్థితి గందర గోళంలో పడింది. అసలు, ఇలా ఎవరికి తోచినట్లుగా వారు మాట్లాడుతున్నారంటే, వీరి దృష్టిలో సమ్మె ప్రభావం అంటే ఏంటో, తెలిసే మాట్లాడుతున్నారా? లేక దీనికంటే మరింత ప్రభావం కనిపించాలనా? ప్రభావం లేదని అనడం ద్వారా సమ్మెలో పాల్గొంటున్న వారిని రెచ్చగొట్టడమా? నిజంగానే సమ్మె ప్రభావం లేదని అనుకోవాలా? పోనీ, సమ్మె మూలాన, ప్రస్తుతం ప్రజలు పడుతున్న ఇక్కట్లు సరిపోవడం లేదని అర్థం చేసుకోవాలా? తెలంగాణ కాంగ్రెస్ వాదులు-తెలుగుదేశం తెలంగాణ నాయకులు, ఒకపక్క తెలంగాణ రాష్ట్రం కావాలంటూనే, తమ-తమ అధినాయకత్వం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఆచి-తూచి, కర్ర విరగకుండా-పాము చావకుండా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోవడానికి-వీలైనంత జాప్యానికి గురిచేయడానికి, తమ వంతు సహకారాన్ని మాటల తూటాల ద్వారా అందిస్తున్నారనాలి. ఒక రాజకీయ పరిష్కారం లభించాల్సిన అంశాన్ని తమ సొంత రాజకీయాల కోసం, సొంత ఎజెండాల కోసం, "రాజకీయం" చేయడం ఎంతవరకు సబబు? పట్టు విడుపులు వుండవా? రాష్ట్రం ఇలా రావణ కాష్టంలా మండాల్సిందే నా? ప్రభుత్వం (కేంద్రం కాని-రాష్ట్రం కాని) లో ఎందుకింత నిర్లిప్తత? సుపరిపాలన సంగతి దేవుడెరుగు! అసలు పాలనంటూ వుందా?

హైదరాబాద్ లో సుమారు దశాబ్దం క్రితం (చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా వున్న రోజుల్లో) దేశంలోనే ప్రప్రధమ "సుపరిపాలన కేంద్రం" స్థాపించి, నాటి బ్రిటీష్ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ చేతుల మీదుగా ఆరంభించిన సందర్భంలో, చలోక్తిగా ఒకరన్న మాటలు ఈ సందర్భంగా పేర్కొనాలి. సుపరిపాలన కేంద్రం స్థాపించడానికి కారణం అంతవరకు సాగుతున్న పాలన మంచిగా లేదని అర్థం చేసుకోవాలా? అని సభా ముఖంగా సదరు వ్యక్తి ప్రశ్న వేశారు. ఎవరిచ్చారో కాని, ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తిగానే వుంది. ప్రజలకు అంతవరకు మంచి పాలన అందినప్పటికీ, అంతకంటే మెరుగైన పాలన కావాలని, పాలన చేసేవారిలో గణనీయమైన మానసిక పరివర్తన-ప్రభుత్వ ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, వాటికి కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించి-అమలు చేయించడానికే ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనీ ఆ సమాధానం సారాంశం. అంటే ఏంటంటే...పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, పౌరులతో స్నేహంగా-మర్యాద పూర్వంగా వ్యవహరించినప్పుడే, ఆ ప్రభుత్వాన్ని "సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వం" గా గుర్తించాలని టొనీ బ్లెయిర్ తో సహా పలువురు వక్తలన్నారు ఆ సందర్భంగా. బహుశా, ప్రస్తుతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తీరు తెన్నులు నిశితంగా గమనిస్తుంటే, ఈ లక్షణాలేవి వారి పాలనలో లేవనే భావించాల్సి వస్తుంది. సకల జనుల సమ్మె జరుగుతుంటే, ఎంత శాతం మంది అందులో పాల్గొన్నారనీ-ఏ ప్రాంతం వారు ఇబ్బందులకు గురవుతున్నారనీ-దాని ప్రభావం అసలే మాత్రం లేదనీ-సమ్మెవల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతోందా అనీ-కేంద్ర నిర్ణయంపై సమ్మె ప్రభావం ఏ మాత్రం పడదనీ.....బాధ్యతాయుతమైన పదవులు నిర్వహిస్తున్న వారు అనడం భావ్యం కాదు. రాష్ట్రం ఇవ్వడం-ఇవ్వక పోవడం సంగతి అలా వుంచితే, నిర్ణయాత్మకమైన కార్యాచరణ దిశగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రం ప్రభుత్వం అడుగులు వేయకపోవడమంటే, పాలననేది పూర్తిగా స్తంభించి పోయిందని ప్రయోగాత్మకంగా ప్రదర్శించడమే!

సమ్మె సంగతిలా వుంటే, ఒక్కో రాజకీయ నాయకుడు (కురాలు), ఒక్కో విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వింతగా-విడ్డూరంగా వుంది.

(తన) కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖంగా వున్న సంగతి, పార్టీ కార్యవర్గ సభ్యుడుగా తనకు ఎప్పటినుంచో తెలుసని, రాజ్య సభ సభ్యుడు కేశవరావు మరోమారన్నారు. తన నమ్మకానికి ఆధారంగా రాష్ట్రపతి ప్రసంగంలో ఆ అంశం పెట్టిన సంగతి, దానికి అనుగుణంగానే డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటన గురించి, అదేదో కొత్త విషయంలా బయట పెట్టారు. పాపం, పనిలో పనిగా, రోశయ్యను తప్పుబట్టారు. సీమాంధ్రులు రోశయ్యతో నాటకం ఆడించారని మరో కొత్త (పాత) విషయం కూడా చెప్పారు. కేశవరావు తన సరికొత్త వ్యూహంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర రావుని ఆయన నివాసంలో కలిసి మీడియాతో ఈ "బ్రేకింగ్ న్యూస్" ను చెప్పారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, ఖమ్మం (తెలంగాణ జిల్లా) లోక్ సభ మాజీ సభ్యురాలు, సకల జనుల సమ్మె అనేది అసలు జరగడం లేదనే అర్థం స్పురించే రీతిలో మాట్లాడడం కూడా, ఈ సందర్భంలో అంత సమయోచితం కాదని కూడా పలువురంటున్నారు. ఆమె కనీసం ఆ మాటనే ముందర, ముఖ్యమంత్రితో ఒక్క సారి మాట్లాడి వుంటే, సమ్మె విజయవంతంగా సాగుతుందో లేదో తెలిసేదని కూడా ఆమె పార్టీకి చెందిన వారే రేణుకకు గుర్తు చేశారు. రేణుకా చౌదరి ఎక్కడి నుంచో తెలంగాణకు వచ్చారని నర్మగర్భంగా కేశవరావు అనడం గమనించాల్సిన విషయం. ఇక మరో కాంగ్రెస్ నాయకుడు, సీమాంధ్రుడైనా తెలంగాణకు ప్రతికూలం కాదని ముద్ర వేయించుకున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించాలని పెద్ద మనసుతో విజ్ఞప్తి చేసారు. ఆయన చేసే విజ్ఞప్తిని తన అధిష్టానానికి చేసి, తెలంగాణ ఇచ్చుడో-లేదో త్వరగా తేల్చమని అంటే ఆయన పెద్ద మనసుకు అర్థం వుండేది. సందులో సడేమియా అన్నట్టు, "రాహుల్ గాంధీ ప్రత్యేక దూత" గా దీపక్ బబారియా అనే ఒక పెద్ద మనిషి హైదరాబాద్ కొచ్చి, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులన్నింటిని అవగాహన చేసుకున్నానని అంటున్నారు. ఈనెంతవరకు అర్థం చేసుకుంటారో, ఆయన చేసుకున్న దానిని రాహుల్ గాంధీకి ఎంతవరకు అప్ప చెపుతారో, ఆయనెంతవరకు సమస్యను ఆకళింపు చేసుకుంటారో, ఆ భగవంతుడి కే (బహుశా సోనియా గాంధీకి!) తెలియాలి. ఒక కీలక సమస్యను, ఇంత తేలికగా, ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ధోరణిలో మార్పు రావాలి.

ఈ నేపధ్యంలో సకల జనుల సమ్మెటను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడింది. సకల జనులు-ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే, సమ్మెను విరమించమని విజ్ఞప్తి చేశారు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. సమ్మె ప్రభావం లేదన్న ముఖ్య మంత్రి మాటల్లోనే, దాని ప్రభావం కనిపించింది. జంట నగరాలలో రెండు గంటల కరెంటు కోత, గ్రామ స్థాయికి చేరుకునే సరికి ఆ కోత ఎనిమిది గంటల దాకా వుండడం, సమ్మె ప్రభావం కాకపోతే మరింకేంటి? మహానది, వెస్ట్రన్ కోల్‌ ఫీల్డ్ నుంచి ఐదారు లక్షల టన్నుల బొగ్గు తెప్పించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తడమంటే, అది సమ్మె ప్రభావం కాదా? ఉపాధ్యాయుల విధుల బహిష్కరణ, ప్రైవేటు స్కూళ్ల స్వచ్చంద బంద్ సమ్మె ప్రభావం అనాల్నా వద్దా? పాఠశాలలకు దసరా సెలవులను బాగా ముందుకు జరుపుతున్నా మనడం-మళ్లీ వెనుకంజ వేయడం, ప్రభుత్వం పరోక్షంగా సమ్మె ప్రభావాన్ని గుర్తించడమే కదా? ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులపై కొరడా ఝళిపించడం (సంబంధిత మంత్రి దృష్టికి వచ్చిన తర్వాత ఆ వుత్తర్వులను వెనక్కు తీసుకోవడం), అప్రెంటిస్ టీచర్లను క్రమశిక్షణకు గురిచేయడం సమ్మె ప్రభావం కాదా? పోనీ సమ్మె తీవ్రతను తగ్గించే ప్రయత్నం కాదా? రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని జోక్యం పరోక్షంగా కోరడం వాస్తవమే కదా? అలా జరిగిందనడానికి నిదర్శనం, పొరుగు రాష్ట్రాల నుంచి బొగ్గు, విద్యుత్తు, గ్యాస్ సరఫరా ఉదారంగా చేయాలని ప్రధానిని కిరణ్ కోరడమే! బహుశా సమ్మె ప్రభావాన్ని ప్రధాని కూడా గుర్తించినందువల్లే, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా వారి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వండని సంబంధిత శాఖలను ఆదేశించారే మో! ఇంత జరుగుతున్నా ఎందుకీ నిర్లిప్తత?

ఈ నేపధ్యంలో, 2009 డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయించుకోవడానికి తెరాస అధినేత కేసీఆర్, మరో పర్యాయం ఆమరణ నిరాహారదీక్షకు దిగవచ్చనే వార్తలు వచ్చాయి. కుటుంబసభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, కేశవరావు లాంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆయనను వారించారంటున్నారు. ఆరోగ్యం సహకరించే పరిస్థితి లేకపోవటం, సకల జనుల సమ్మె కొనసాగుతున్న సందర్భంలో ఆయన నాయకత్వం అనుక్షణం కావాల్సిన అవసరం లాంటి కారణాలు, కేసీఆర్ ను ఆలోచనలో పడేసాయనవచ్చు. ఐనా ఆయన నిర్ణయమంటూ తీసుకుంటే, భగవంతుడు కూడా మార్చలేడని విశ్లేషకుల అభిప్రాయం. సకల జనుల సమ్మె ఉదృతంగా సాగుతున్నా కేంద్రం స్పందించక పోవడం, బహుశా కేసీఆర్ ను మనస్థాపానికి గురిచేసి వుండవచ్చు.

ఇదిలా వుంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులలో మళ్లీ అలజడి-ఒకింత కలకలం మరో మారు మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. సకల జనుల సమ్మెపై ముఖ్య మంత్రి కేంద్రానికి తప్పుడు నివేదికలను పంపుతున్నారని ఆరోపణ చేశారు. మరో అడుగు ముందుకు వేసి, విద్యార్థులను-ఉద్యోగులను ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అంతటితో ఆగకుండా, రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించ వద్దంటూ హెచ్చరిస్తున్నానని కూడా కోమటి రెడ్డి అన్నట్లు వార్తలొచ్చాయి. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను అందజేసి-ఆమోదింపజేసుకుని-గాంధీ జయంతి నుంచి ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. మరో వైపు ఆయన సోదరుడు, లోక్ సభ సభ్యుడు రాజ గోపాలరెడ్డి రాజీనామా చేయాలని తెలంగాణ వాదులు డిమాండు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. నల్గొండకు చెందిన మరో మంత్రి జానారెడ్డి సోనియాకు ఉత్తరం రాశానని ప్రకటించారు. ఇంకా రాతలేనా? చేతలేమన్నా వున్నాయా? అని అసలు-సిసలైన తెలంగాణ వాదులు వీరిలాంటి వారిని ప్రశ్నిస్తున్నారు.

ఎవరేమంటున్నారో....అనే విషయం... అనే వారికి అర్థం కాకపోయినా...వినే ప్రజలకు బాగా అవగాహనవుతోంది. ఈ నాటి ఈ పరిస్థితులకు ఎవరి బాధ్యత ఎంతో నాయకులకన్నా ప్రజలకే ఎక్కువ తెలుసు. ఎన్ని మాటలన్నా ఎన్నికల వరకు తప్పించుకోగలుగుతారే కాని, అప్పుడు ఎదుర్కోనున్న పరాభవాన్నుంచి తప్పించుకోలేరు కదా! ఈ "తిలా పాపాన్ని తలా పిడికెడు" పంచుకోక తప్పదు. తస్మాత్ జాగ్రత్త!

1 comment:

  1. మీరు కాస్త విభజన వాదుల కళ్ళద్దాలు కాస్త తీసి ఇంకోసారి ఇదే వ్యాసాన్ని రాయాలని నా కోరిక.

    ReplyDelete