ఒక్క
మోపిదేవేనా!: సమిష్ఠి బాధ్యత సంగతేమిటి?
సూర్య
దినపత్రిక (27-05-2012)
వనం జ్వాలా
నరసింహారావు
మనసులో చెప్పుకోలేని అనుమానంతో, మే నెల 24 గురువారం ఉదయం తన అధికారిక వాహనంలో దిల్‌కుషా అతిథి గృహానికి
రెండో రోజు విచారణకు వచ్చిన రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణను సీబీఐ అధికారులు
అరెస్ట్ చేయడం అందరూ ఊహించిందే. ఆయన ముఖంమీద ఎప్పుడూ కనిపించే చిరునవ్వు... మాయమైంది!
ఆ స్థానంలో ఉత్కంఠ కనిపించింది! ఇక అరెస్ట్
తరువాత కధ మామూలే. ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, ప్రత్యేక
కోర్టుకు తరలించడం, కస్టడీకి తీసుకోవడం, దరిమిలా... మంత్రి పదవికి రాజీనామా చేయడం చకచకా
జరిగింది. మోపిదేవి మొదట్లో రాజీనామా చేయడానికి విముఖత వ్యక్త
పరిచారని, స్నేహితుల సలహా మేరకు రాజీనామాతో పాటు ఒక
సుదీర్ఘమైన లేఖను ముఖ్యమంత్రికి రాశారని వార్తలొచ్చాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్
రాజశేఖర రెడ్డి ఒత్తిడి వల్లే తాను వాన్ పిక్ వ్యవహారంలో ప్రభుత్వ ఉత్తర్వులపై
సంతకం చేసానని, తనకు ఇష్టం లేకపోయినా అల నాడు నెలకొన్న
ప్రత్యేక రాజకీయ నేపధ్యంలో ఫైలుపై సంతకం చేయకుండా వుండలేకపోయానని లేఖలో పేర్కొంటూ,
తన నిర్దోషిత్వాన్ని బలపరిచేలా అనేక అంశాలను అందులో ప్రస్తావించారు.
సహజంగానే ఆయన చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి గవర్నర్ ఆమోదం కొరకు
పంపడం, ఆమోదించడం జరిగిపోయింది. ఇదింతటితో ఆగుతుందా? ఇరవయ్యారు జీవోలతో సంబంధం వున్న మిగతా ఐదుగురు మంత్రులకు కూడా ఇది
చుట్టుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమై పోయింది. మోపిదేవి అరెస్టు అనంతరం
అందుబాటులో వున్న మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రితో ఈ విషయాన్నే సమావేశంలో
పాల్గొన్న పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. జగన్ అక్రమాస్తుల
కేసులో సీబీఐ కన్నేసిన మంత్రుల్లో ప్రత్యేకించి కలవరం పుట్టింది. "ఇలాగైతే మన గతి ఎలా?" అనే ఆందోళన వారంతా
ముక్తకంఠంతో వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులే అరెస్టయితే,
ఇక ప్రభుత్వం పరువు-ప్రతిష్ట ఏం కావాలి? అన్న
మీమాంస మొదలైంది. మంత్రులే కటకటాల వెనక్కి వెళితే... సర్కారుకు
చేటే అని హెచ్చరించేవరకు వెళ్లారు మంత్రులు. ముఖ్యమంత్రిని నిలదీశారనే అనాలి .
పాపం....ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు?
మోపిదేవి
వెంకటరమణ అరెస్ట్ సబబా?
కాదా? ఆయన దోషి అవునా?కాదా?
అన్న మీమాంస లేవదీసే ముందు మంత్రి మండలికి, వ్యక్తిగతంగా
మంత్రులకు ఏ విధమైన బరువు బాధ్యతలు వుంటాయో చర్చించుకోవడం మంచిది. రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర
శాసనసభకు ఎన్నికలు ముగిసిన వెంటనే, శాసనసభలో మెజారిటీ
స్థానాలను పొందిన రాజకీయ పార్టీ-లేదా-సంకీర్ణ కూటమికి చెందిన నాయకుడిని
(నాయకురాలిని) ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించడం ఆనవాయితీ. ఆ
నాయకుడినే ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. అలా ముఖ్యమంత్రిగా నియమించబడిన
వ్యక్తి సూచనమేరకు మాత్రమే, గవర్నర్ ఇతర మంత్రులను, మంత్రి మండలి సభ్యులుగా నియమించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే,
ముఖ్యమంత్రి తనతో "సమాన హోదా కలిగిన ఇతర మంత్రులలో ప్రథముడు"
మాత్రమే (First among
the equals).
ఇక అప్పటినుంచి, విధాన పరమైన ప్రభుత్వ పాలన యావత్తు "మంత్రి మండలి సమిష్టి
బాధ్యత" అన్న రాజ్యాంగ ప్రాధమిక సూత్రం ఆధారంగానే జరుగుతుంది-జరిగి తీరాలి. ఈ
నిబంధనకు ఎవరూ అతీతులు కాదు. అలా కావడం అంటే రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా నడచుకున్నట్లే!
ఇక మంత్రిగా కాబినెట్‌లో చేరిన వ్యక్తికి రెండు రకాల బాధ్యతలుంటాయి. అందులో
మొదటిది ఆయనకు అప్పజెప్పిన శాఖాపరమైన దైనందిన బాధ్యత. దానికి పూర్తి బాధ్యుడు
స్వయంగా ఆ మంత్రి మాత్రమే. రెండోది విధానపరమైన నిర్ణయాలలో యావత్ మంత్రి మండలి
సభ్యులతో పాటుగా సమిష్టి బాధ్యత. అంటే, ఒకటి వ్యక్తిగతమైంది
మరొకటి సమిష్టిది. రొటీన్‌గా వెలువడే ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో బాధ్యత మొత్తం
తనది, సంబంధిత అధికారి(రులది)ది అవుతుంది. కాబినెట్ నిర్ణయం
తీసుకునే ఉత్తర్వుల విషయంలో తనకు, తనతో పాటుగా ఇతర మంత్రులకు
బాధ్యత వుంటుంది. దానర్థం, వాన్ పిక్ వ్యవహారంలో, వ్య్తక్తిగతంగాను-సమిష్టిగాను తన బాధ్యత నుంచి మోపిదేవి తప్పించుకునే
ప్రసక్తే లేదు. ఆ నిర్ణయం కాబినెట్ నిర్ణయం అవుతే, ఆయనతో
పాటు ఇతర మంత్రులకు కూడా బాధ్యత వుండి తీరుతుంది.
వివరాలలోకి పోతే, స్టాంపులు-రిజిస్ట్రేషన్ చట్టం కింద ఇచ్చిన మినహాయింపులు కాని, వాన్ పిక్ రాయితీల ఆమోదం కాని, భూసేకరణ ముసాయిదాకు
అనుమతి కాని, ప్రకాశం-గుంటూరు జిల్లాలలో వేలాది ఎకరాల భూ
కేటాయింపు కాని, ఇండియా సిమెంట్స్ కు భూమి లీజుల పొడిగింపు
కాని-కృష్ణా నదీ జలాల కేటాయింపు కాని, పెన్నా సిమ్మెంట్స్ కు
భూ కేటాయింపు-సున్నపు రాయి గనుల లైసెన్స్ మంజూరు కాని, రఘురాం
సిమెంట్స్ వ్యవహారం కాని, సరస్వతీ పవర్ లిమిటెడ్ కు సున్నపు
రాయి గనుల లీజు కాని, రాంకీ ఫార్మా సిటీ విషంలో కాని,
ఈశ్వర సిమెంట్స్ సంగతి కాని, బ్రాహ్మణి ఇన్
ఫ్రా టెక్ కు సీలింగ్ చట్టం నుంచి మినహాయింపు వ్యవహారంలో కాని విడుదలైన వివాదాస్పద ప్రభుత్వ
జీవోలు ఒక విధంగా సంబంధిత శాఖా మంత్రిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తే, మరో
రకంగా అదే మంత్రిని ఇతర సహచర మంత్రులతో పాటు సమిష్టి గా బాధ్యుడిని చేస్తాయి.
"ముఖ్యమంత్రి సంతకం పెట్టమంటే పెట్టాను కాని తనదేం తప్పు లేద" ని
వాదించడం సబబు కాదు. ముఖ్యమంత్రితో పాటు, తనది-తనతో పాటు ఇతర
మంత్రులది సమిష్టి బాధ్యత కింద తప్పే!
అందుకే జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కింది నుంచి పైదాకా
చాలామందిది-మంత్రులందరిది తప్పే. జగన్ తో పాటు వీరందరిని విచారించాల్సిందే. మోపిదేవి
వెంకటరమణను ఏ విధంగానైతే వాన్ పిక్ రాయితీల ఆమోదం విషయంలో కాని, భూసేకరణ
ముసాయిదాకు అనుమతి విషయంలో కాని, ప్రకాశం-గుంటూరు జిల్లాలలో వేలాది ఎకరాల భూ కేటాయింపు వ్యవహారంలో కాని, ఆరోపణలకు గురి చేశారో, అదే విధంగా, మిగతా ఐదుగురు మంత్రులను కూడా, అదే బాట పట్టించాలి.
వారందరినీ, సిబిఐ దర్యాప్తుకు పిలిచే లోపుగానే మంత్రి మండలి
నుంచి తొలగించాలి. సిబిఐ పిలవడం, విచారణ మొదలవడం, అరెస్ట్ పర్వం ఆరంభమవడం, అప్పుడు రాజీనామా కోరడం
కన్నా ఇదే సరైన మార్గం. అంతే కాదు... సమిష్టి బాధ్యత కింద, దివంగత
ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన ఇతర మంత్రులందరిని కూడా
తొలగించి, మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించాలి. అప్పుడే
దీనికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. లేకపోతే, ఒక్క
మోపిదేవిని మాత్రమే బలి పశువును చేసినట్లవుతుంది.
ఇదిలా వుండగా...ఇక...జగన్ వ్యవహారం...ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన
పడుతున్నట్లుంది. "విచారణకు పిలిపించిన సీబీఐ ఈనెల 25 జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయొచ్చు"
అన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఐతే, సీబీఐ ప్రత్యేక కోర్టు
విచారణకు ఒకరోజు క్రితం ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో జగన్‌ను అరెస్టు చేసే
పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే ఊహాగానాలూ మొదలయ్యాయి. అనుకున్నట్లు గానే 25వ తేదీన న విచారణకే పరిమితం చేసి, 26న కూడా రమ్మని
ఆదేశాలిచ్చింది సిబిఐ. వాస్తవానికి, జగన్ అక్రమాస్తుల కేసు
విచారణ ప్రారంభమై తొమ్మిది నెలలు దాటుతోంది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయిన జగన్
సీబీఐ ఎదుట హాజరు కావడం ఇదే తొలిసారి. కాకపోతే, ఓబులాపురం మైనింగ్ కేసులో గతంలో సీబీఐ ముందుగా సాక్షిగా ఒక సారి
హాజరయ్యారు జగన్. "అరెస్టు తప్పదు" అన్న
నిర్ణయానికి వచ్చిన జగన్ ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఆయన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్టు చేస్తుందనే ఆందోళన ఆయన భయం నుంచే పుట్టిందని, ఈ ఆందోళనకు కారణాలేవీ కనిపించడం లేదని తెలిపింది. కేసు
దర్యాప్తు కీలక సమయంలో కూడా జగన్‌ను సీబీఐ అరెస్టు చేయలేదని, మే నెల 28న కోర్టుకు హాజరు కమ్మని
సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తుందని కోర్టు భావించడం లేదని
స్పష్టం చేసింది. అంతే కాకుండా, మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తే
సీబీఐకి జగన్ సహకరించకపోవచ్చేమోనన్న సందేహం కూడా కోర్టు వ్యక్తం చేసింది.
సీబీఐ
విచారణకు జగన్ హాజరైన సందర్భంగా అంతా హై డ్రామానే. జగన్ అనుచరులు సీబీఐకి
వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే, "రాజు వెడలె రవి తేజము వెడలె" అన్న చందాన,
జగన్ తన బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలో విచారణ జరగాల్సిన దిల్ కుషా
అతిధి గృహానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, టీడీపీ సీనియర్ నేత రాజ్యసభ మాజీ
సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి కూడా జగన్ నివాసానికి వెళ్లారు. తొలి రోజు విచారణ
ముగిసిన తర్వాత జగన్ దిల్ కుషా నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. అప్పుడు కూడా పెద్దఎత్తున పార్టీ నేతల వాహనాలు ఆయన వాహన శ్రేణిని
అనుసరించాయి. విచారణ అనంతరం బయటికి వచ్చిన జగన్... బయట వేచి చూస్తున్న మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. "సీబీఐ విచారణ చాలా కూల్‌గా జరిగింది. సీబీఐ అడిగిన
ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలు ఇచ్చాను. రేపు ఉదయం పదిన్నర కు మళ్లీ వస్తున్నాను''
అని మీడియాకు చెప్పారు. ఇంతకీ సిబిఐ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తుందా?
చేయదా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదమిద్ధంగా
సమాధానం ఇదీ అని అనలేం కాని విశ్లేషణ చేయవచ్చు. తొమ్మిది నెలల పాటు అరెస్ట్ చేయని
సిబిఐ ఇప్పుడు జగన్‌ను అరెస్టు చేయాల్సిన ఆగత్యం ఏంటి? అన్న
ప్రశ్న ఉదయించక మానదు.
ఏదైనా
నేరారోపణ మీద ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందర అరెస్టు అనివార్యమా? కాదా? అన్న విషయాన్ని దర్యాప్తు సంస్థ తప్పక ఆలోచిస్తుంది. ఆ వ్యక్తిని అరెస్ట్
చేయకపోతే, తప్పించుకు పోతాడన్న అనుమానం కానీ, సాక్ష్యాలను తారుమారు చేస్తాడని కానీ, విదేశాలకు
పారిపోతాడని కానీ భావించినప్పుడు అరెస్టు చేసి తీరుతుంది. జగన్ కేసు మొదలై
తొమ్మిది నెలలు దాటింది. ఆయన మొదటి ముద్దాయి కూడా. ఐనా, ఇంతవరకు
ఆయనను, కారణాలేవైనా, అరెస్టు చేయలేదు.
పైగా సహ నిందితులను కొందరిని అరెస్టు చేసింది సిబిఐ. వారిలో కొందరిని సుదీర్ఘంగా
విచారించింది కూడా. విజయ సాయి రెడ్డి లాంటి వారి బెయిల్ పిటీషన్‌ను కూడా
వ్యతిరేకించింది. ఐనా, మొదటి ముద్దాయి జగన్‌ను అరెస్ట్
చేయలేదు. అంటే, అరెస్టు చేయకపోవడానికి బలవత్తరమైన న్యాయపరమైన
కారణాలుండి తీరాలి.
ఇదిలా
వుంటే, వైఎస్సార్సీపి లోకి వలసల భయం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఉక్కిరిబిక్కిరి
చేస్తోంది. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు
తమకు నష్టమేనని ఇరు పార్టీల నాయకత్వాలు విశ్లేషించు కొంటున్నాయి.
(ఈ వ్యాసం ప్రచురించిన నాడే-ఆదివారం సాయంత్రం-జగన్మోహన్ రెడ్డిని అరెస్టు
చేయడం జరిగింది. ఆ మర్నాడు కోర్టు ఆయనను 14 రోజుల జుడిషియల్ రిమాండు విధించి చంచల్‍గుడా
జైలుకు పంపింది)