Tuesday, December 18, 2012

జాతికో ధర్మం! దేశానికో ఆచారం!: వనం జ్వాలా నరసింహారావు



జాతికో ధర్మం! దేశానికో ఆచారం!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక (10-3-1991)

ఆఫ్రికా ఖండంలో అడుగిడిన పాశ్చాత్యులను, అమిత ఆశ్చర్యానికి గురిచేసేవి వారి ఆటవిక సాంప్రదాయాలు! తోటి వారు చనిపోతే, ఆడా-మగ తేడా లేకుండా గుడారాలలో నుంచి, కేరింతలు కొడుతూ బయటికొచ్చి ఉల్లాసంగా గడపడం, వింతగా వుంటుంది. పశ్చిమాఫ్రికా ఆటవికుల్లోని నమ్మకం ప్రకారం, బ్రతికున్నవారు, పుట్టబోయే వారు, చనిపోయిన వారు అనే మూడు తెగలుంటాయనీ, బ్రతికున్న వారు చనిపోయిన వారిలో కలిసేటప్పుడు వారి గౌరవార్థం ఉల్లాసంగా గడపాలనీ వారి సాంప్రదాయం.

ఈ చిన్న విషయానికే ఇంతగా ఆశ్చర్యపోతే, దేశ దేశాల్లో, వివిధ మతాచారాల ప్రకారం, చనిపోయిన వారికి జరిపే అంత్యక్రియలను చూస్తే మరింతగా బిత్తరపోవాల్సి వస్తుంది. చనిపోయిన మనిషి మృతదేహాన్ని ఏ విధంగా సాగనంపాలనే విషయంలో తుది మాట మతానిదే. జరపాల్సిన అపర కర్మలు కానీ, ఏటేటా నిర్వహించాల్సిన వార్షికాలు కానీ, అన్నీ, వారివారి మతాచారాలపైనే ఆధారపడి వుంటాయి.

జంతువుల విషయానికొస్తే, అవి చనిపోయింతర్వాత, వాటి మృత దేహాలు క్రమేపీ కుళ్లిపోయి కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. వాటికి దిక్కూ మొక్కూ వుండదు. ప్రకృతీ తనకనువైన రీతిలో, వాటి ద్వారా వచ్చే దుర్వాసనను భరించి, తనలో కలుపుకుంటుంది. ఒక్కోసారి ఈ దుర్గంధం, సుదూరంలో వున్న వేరే జంతువులను ఆకర్షించి, వాటి ఆహార కొరత తీరుస్తుంటుంది. మొత్తం మీద జంతు ప్రపంచంలో కర్మ కాండలు లేవనేది స్పష్టంగా తెలుస్తున్నది.


పరిణామక్రమంలో ఉన్నత జాతికి చెందిన కోతులలాంటి కొన్ని జంతువులు, కొన్ని రకాల పక్షులు, అకాల మరణం చెందిన తమతోటి జీవాలను, తమ మధ్య వుంచుకుని వాటికి తోచిన తరహాలో ఆవేదనను వ్యక్తం చేస్తాయి. కాకి చనిపోతే మిగతా కాకులు చేసే గోల, కోతుల్లో ఒకటి చనిపోతే మిగతా కోతులు చేసే ఆగడం, ఏనుగు పిల్ల మరణిస్తే మిగతావి చేసే విలయ తాండవం, మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. చనిపోయిన ఈ జంతువుల శరీరాన్ని అవి, ఆకులలాలతో కప్పి దాచే ప్రయత్నాలు చేస్తాయి. ఆ తరువాత అవి బాక్టీరియాకు గురై భూమిలో కలిసి పోవాల్సిందే. బహుశా ఈ విధంగా ఆకుల మధ్యన జంతువుల మృత దేహాలను కప్పి దాచే పద్ధతి, చనిపోయిన పక్షి పిల్లలను గూటిలోంచి తల్లి పక్షి తొలగించి బయట పారేయడం లాంటివి, ఈనాడు మానవుల విషయంలో మనం ఆచరిస్తున్న మృతదేహాల ఖననానికి కాని, కాల్చడానికి కాని ఆరంభం కావచ్చు.

హిందువుల్లో ఎవరైనా చనిపోతే, మృతదేహాన్ని పవిత్రమైన మంటలకు ఆహుతి చేస్తారు. క్రైస్తవులు, ముస్లింలు, తమవారెవరైనా మరణిస్తే, ఆ మృతదేహాన్ని పది అడుగుల లోతుగా తీసిన గుంటలో శాస్త్రోక్తంగా పూడ్చి పెడతారు. జొరాస్ట్రియన్ మతాచారం ప్రకారం మృతదేహాన్ని ప్రకృతిలోని పశుపక్ష్యాదులకు ఆహారంగా అప్ప చెపుతారు. పద్ధతులలో ఇలా తేడాలు కనిపిస్తుంటాయి.

క్రైస్తవ ఆచారం ప్రకారం, మృత దేహాన్ని వెల్లికిలా పరుండబెట్టి, శవ పేటికలోకి చేరుస్తారు. ఆ శవ పేటికను యధాతధంగా, మతాచారుల ప్రార్థనల మధ్య గోతిలోకి దింపుతారు. ముస్లింల విషయానికొస్తే, అప్పటికప్పుడు తవ్వబడిన గోతిలో, సరాసరి, శవాన్నే తెల్ల గుడ్డతో కప్పి పూడ్చి పెడతారు. అయితే, మృతదేహం తలను మాత్రం, మక్కా దిక్కుగా చూసే విధంగా అమరుస్తారు. ఆ తరువాత తాజ్ మహల్ లాంటి సమాధులు వాటిపై కట్తుంటారు వారివారి స్థాయిని బట్టి.

శవాల్ని పాతేసే పద్ధతి, చితికి ఆహుతి చేసే పద్ధతికన్నా పురాతనమైందనే విషయాన్ని చరిత్ర చెపుతోంది. శవాలను అగ్నికి ఆహుతి చేసే ఆచారం రోమ్, గ్రీక్ నాగరికతల నాటిది కాగా, ఈజిప్ట్ లో ఏనాడో అరవై వేల ఏళ్ల క్రితమే మృత దేహాలను సమాధి చేసిన చారిత్రక సాక్ష్యాధారాలు లభించాయి. ఈజిప్ట్ లో నైలు నది నాగరికత ప్రభావం వున్న కాలంలో, కర్మకాండతో మృత దేహాలను సమాధి చేసేవారు. ఈజిప్ట్ రాజులు, తాము బతికున్నప్పుడే, మరణానంతరం వుపయోగపడేలా తమకు, తమ పిల్లలకు సమాధుల కొరకై పెద్ద పెద్ద పిరమిడ్లను నిర్మించుకునే వారు. అవే ఈనాడు విహార స్థలాలుగా చెలామణి అవుతున్నాయి. ఈ సమాధులలో భధ్రపరచబడిన "మమ్మీల" పై ఆంతులేని ఆభరణాలు, విలువగల దుస్తులు వుంచేవారనీ, అందుకే ఈ ప్రదేశాలను కాపాడేవారనీ అంటారు.

హిందువులలో కర్మకాండలు అనేక రకాలు. చిన్న పిల్లలు చనిపోతే పూడ్చి పెడతారు. కేరళకు చెందిన "పిషారాదీసులు" అనే హిందువులు, మృతదేహాన్ని ఉప్పుతో నింపి, కూర్చున్న ఆకృతిలో పూడ్చి పెడతారు. చనిపోయిన వారి జ్ఞాపకార్థం సంతాప దినాలు పాటించడం, అన్న దానం చేయడం, బూడిదను గంగానది లాంటి పవిత్ర జలాలలో కలపడం, దేశంలోని పలు ప్రాంతాలలో హెలికాప్టర్ల ద్వారా వెదజల్లడం, ఇలా ఎన్నో విధాలుగా మరణించిన వారిని గౌరవిస్తారు.

ఇలా నదులలో బూడిదను కలుపుతూ పోతుంటే కాలుష్యం మాటేంటి? అని అడగవచ్చు. మరణించిన వారి ఆత్మలు తృప్తి చెందాలి కాని, పర్యావరణం ముఖ్యం కాదని ఇలాంటి వారిని ఎవరిని అడిగినా సమాధానం ఇస్తారు. జంతువుల మృత దేహాలను ఆకులతో కప్పే ప్రక్రియ నుంచి, మానవ శరీరాలను మరణానంతరం ప్రకృతి ఒడిలో కలపడం వరకు మనం గమనించాల్సింది ఒకటే. పనికిరాని పదార్ధాన్ని మన మధ్య నుంచి ఏ విధంగానైనా తొలగించడమే!

( 21 సంవత్సరాల క్రితం ఆంధ్ర జ్యోతిలో రాసిన వ్యాసం ఇది)

1 comment:

  1. "...జంతువుల విషయానికొస్తే, అవి చనిపోయింతర్వాత, వాటి మృత దేహాలు క్రమేపీ కుళ్లిపోయి కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. వాటికి దిక్కూ మొక్కూ వుండదు...."

    When dead human cropses are buried the same thing happens but in a controlled way as the same are buried deep into earth.

    Cremation of the dead and its origins are traced only to through recorded history. What about Hindu rituals which have their origins beyond the recorded history.

    I am unable to comprehend the compelling reason for republishing this article after more than two decades.

    ReplyDelete