Monday, December 24, 2012

పరామర్శకీ పద్దతులున్నాయి!: వనం జ్వాలా నరసింహారావు


పరామర్శకీ పద్దతులున్నాయి!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక (31-03-1991)

          మనం ఏ పని చేసినా అవతలి వారిని ఇబ్బంది పెట్ట కూడదు. ఎవరి దగ్గరి కన్నా వెళ్తే, వీడెప్పుడు వెళ్తాడురా! అని వారు అనుకోకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా సుస్తీగా వున్న స్నేహితుని దగ్గరికో, అధికారి దగ్గరికో, లేక ఇంకెవరి దగ్గరికో వెళ్లినపుడు ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందనేది తెలుసుకోవడం మంచిది.

       మన సహోద్యోగి ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నప్పుడు అక్కడికెళ్లి, ఆ రోజు మనం కుదుర్చుకున్న లక్షల రూపాయల కాంట్రాక్టు గురించి. ఆ లాభ నష్టాల గురించి మాట్లాడితే ఏం బావుంటుంది? ఆతని శారీరక బాధలను చెప్పుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది. కోడలికి జ్వరం వస్తే నోరూరించే పిండి పదార్ధాలను గయ్యాళి అత్త తిన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు.

          సుస్తీ చేసిన వారి దగ్గరకు వెళ్లినపుడు చేయ కూడనిది "గిఫ్ట్" లు తీసుకుపోవడం. ముఖ్యంగా తినే పదార్ధాలు అసలే తీసుకెళ్లకూడదు. రోగికి అవి తినాలనిపించవచ్చు. తప్పనిసరిగా తీసుకు వెళ్లదలిచి నపుడు రోగి బంధువులను, వైద్యులను సంప్రదించి ఆపని చేయడం మంచిది. ఇదీ వీలు కాకపోతే, ఇవ్వదగ్గవి పండ్లు మాత్రమే!

          పూలు, బుకేలు కూడా తీసుకెళ్లడం అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. కొంత మందికి ఇవి ఎలర్జీ కావచ్చు. మరి కొంత మందికి వారి వారి మతాచారాల ప్రకారం ఒక రకం పూవు శుభం చేయవచ్చు, లేక, అశుభం అనిపించవచ్చు.

          ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆసుపత్రికి వచ్చే కొందరు, ఇదేదో పిక్నిక్‍కు వస్తున్నట్లు, టీ-కాఫీలు తెచ్చుకుని అదేపనిగా పేషంటు ముందు సేవిస్తూ వుంటారు. ఇది మంచిది కాదు. మర్యాద అంతకంటే కాదు.


          సుస్తీ చేసిన వారి దగ్గరకు వెళ్లేది, ప్రధానంగా వారి ఆరోగ్యం గురించి వాకబు చేయడానికే. చిరునవ్వు ముఖంతో, సంతోషమైన కబుర్లు చెప్పి బయట పడాలి. అయితే మనం చెప్పే కబుర్లు శృతి మించ కూడదు. రోగి మనకు శ్రోత కాదు. అతని అప్పటి ఆలోచనా ధోరణికి సంబంధించిన విషయాలనే ప్రస్తావించడం మంచిది. అతని జబ్బు గురించి చెపితే ఓపికతో వింటే అతనికి సంతృప్తిని కలిగిస్తుంది. కాకపోతే అతను మాట్లాడడానికి వైద్యులు అంగీకరించాలి. మనం మాట్లాడేది ఉపన్యాస ధోరణిలో కాకుండా, మెల్లగా, నిశ్శబ్దంగా వుండాలి. అప్రియమైన మాటలు ప్రస్తావించడం మానాలి.

          గుంపులు-గుంపులుగా రోగి దగ్గరకు పోవడం, మంచం చుట్టూ గుమికూడడం ప్రోత్సహించకూడదు. ఎక్కువ మంది విజిటర్స్ వుంటే, మనం కొద్ది సేపు వేచి వుండి, ఒక నిమిషం మాట్లాడి బయటకొస్తే, ఇతరులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

          సాధ్యమయినంత వరకు పేషంటు వద్దకు చిన్న పిల్లలను తీసుకోపోక పోవడం శ్రేయస్కరం. వారికి ఓపిక వుండదు. మన పేషంటును, ఆసుపత్రిలో వున్న ఇతర రోగులను ఇబ్బంది పెడతారు. పిల్లల ఆరోగ్యానికి కూడా ఇది మంచిది కాదు. వారున్న కాసేపు ఆసుపత్రిని, మనం వారిస్తున్నా కలియతిరుగుతారు.

          ఒక్కోసారి వైద్యుల సలహాపై, విజిటర్స్ ను అనుమతించరు. అలాంటప్పుడు మనం నిబంధనలను సడలించమని పట్టు పట్ట కూడదు. రోగి క్షేమం దృష్ట్యా వారి సలహా పాటించడం శ్రేయస్కరం. మనం వచ్చిన సంగతి రోగి బంధువులకు తెలిస్తే సరి పోతుంది.

          రోగికి ఉచిత సలహాలను ఇవ్వడం మంచిది కాదు. రోగి సుస్తీకి, మనం వాడిన మందుల గురించి ఉపోద్ఘాతం ఇచ్చి, అతని మనసును చీకాకు పర్చ కూడదు. పేషంటు అడిగినా, జవాబు దాట వేయాలి. మనం డాక్టర్ అయినా, సలహా ఇవ్వడం అంత మంచిది కాదు. అతను మరో డాక్టర్ వద్ద ట్రీట్ మెంటులో వున్నాడని గుర్తించాలి. చికిత్స చేస్తున్న వైద్యుడి గురించి మనం తక్కువగా మాట్లాడితే, అది రోగిలో అపోహలకు దారి తీసే ప్రమాదం వుంది. మానసికంగా రోగి కుదుట పడడానికి ఇది అవరోధమవుతుంది.

          కొంతమంది విజిటర్స్ డాక్టర్లను పట్టుకుని, తమకు తెలిసీ-తెలియని జ్ఞానంతో ఏవేవో అడుగుతారు. వైద్యుని చికిత్స గురించి ప్రశ్నించాల్సిన బాధ్యత రోగి దగ్గర బంధువులకే వదిలేయాలి. మనకు కావాల్సిన సమాచారం వారి దగ్గర నుంచి తెలుసుకోవాలి. అదే విధంగా రోగి స్పృహలో వున్న సమయంలో మనం హఠాత్తుగా ఏదో పనున్న వారిలాగా, పక్కన వున్న వారి బంధువులను బయటకు తీసుకెళ్లి మాట్లాడితే, రోగికి అనుమానం కలగవచ్చు.

          సుస్తీలో వున్నవారు చికిత్స పొందేది ఆసుపత్రిలో అయితే, విజిటింగ్ వేళల్లోనే వెళ్లడం మంచిది. మరో చోట వుంటే, అతని విశ్రాంతి వేళల్లో వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మనం పరామర్శించ దగిన వ్యక్తికీ, మనకూ వున్న సంబంధాన్ని బట్టి, మనం వారితో గడిపే వ్యవధి ఆధారపడి వుంటుంది.

          పేషంటును చూడడానికి వెళ్తున్న మనకు అనవసర ఆదుర్దా, మనమే ముందు వారిని చూడాలన్న తహతహ వుండకూడదు.

          అప్పుడే పుట్టిన శిశువులను చూడడానికి మనం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలకు తొందరగా వ్యాధులు సోకే ప్రమాదం వుంది. మనం వారిని చూడడానికి గదిలోకి వెళ్లినపుడు మన పాదరక్షలను మార్చుకోవాలి. మాస్కు ధరించాలి. వారిని తాకడం కానీ, మాట్లాడడం కానీ చేయకూడదు. మన ఇన్ ఫెక్షన్స్ పిల్లలకు అంటించరాదు. తల్లికి, తన బిడ్డను ఎలా పెంచాలో, మనం ఆ సమయంలో సలహాలు ఇవ్వడం మంచిది కాదు. ఒకవేళ ఆమె అడిగినా జవాబు దాటవేయడమో, డాక్టర్‌ను సంప్రదించమని చెప్పడమో చేయాలి. మరి కొంచెం ఎదిగిన పిల్లలను చూడడానికి పోయినపుడు కూడా వారికి దూరంగా వుండి, పలకరించి పోవడం మంచిది.

(21 సంవత్సరాల క్రితం ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచికలో రాసిన వ్యాసం ఇది)

No comments:

Post a Comment