ప్రత్యేక
తెలంగాణ-సమైక్యాంధ్ర
కమ్యూనిస్టుల
ఆలోచనా ధోరణి?
వనం జ్వాలా నరసింహారావు
1930వ దశకంలోనే
భారత దేశాన్ని భాషా ప్రాతిపదికన పునర్విభజించి, భాషా ప్రయుక్త రాష్ట్రాలను
ఏర్పాటు చేయాలని, జాతీయోద్యమం తీర్మానించింది. దక్షినాదిన, విశాలాంధ్ర, ఐక్య
కేరళ, మహా కర్నాటక, బృహన్మహారాష్ట్రలు
ఏర్పాటు చేయాలనీ, అవిభక్త కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా
భావించింది. ఆ
ఆలోచనతోనే, 1946లో ప్రముఖ
కమ్యూనిస్ట్ నాయకుడు స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య, "విశాలాంధ్రలో
ప్రజారాజ్యం" అన్న పేరుతో ఒక పుస్తకం రాశారు. రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పరిచే అనేక సూచనలు ఆ పుస్తకంలో ఆయన
చేశారు. 1946లో హైదరాబాద్
రాష్ట్రంలో నిజాం ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా, సాయుధ రైతాంగ పోరాటం
ప్రారంభమైంది. ఆ పోరాటంలో తెలంగాణా జిల్లాల నుండి రావి
నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, మల్లు
స్వరాజ్యం, మల్లు నరసింహా రెడ్డి, భీమిరెడ్డి
నరసింహా రెడ్డి, ఆరుట్ల దంపతులతో పాటు, ఆంధ్ర జిల్లాల నుండి సుందరయ్య, బసవ పున్నయ్య,
చండ్ర రాజేశ్వరరావు, లావు బాల గంగాధరరావు,
తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి తదితర
నాయకులతో సహా వేలాదిమంది ఇరు ప్రాంతాల కార్యకర్తలు భుజం-భుజం
కలిపి 1951 వరకు
వీరోచిత పోరాటం చేశారు. నాలుగువేల మందికి పైగా ప్రాణాలను
అర్పించారు. సెప్టెంబర్ 17, 1948 న నిజాం
హైదరాబాద్ రాష్ట్రం - హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో
విలీనం కావడం, 1953లో భాషా
ప్రాతిపదికన విభజన జరగడం, 1956 నవంబర్ 1 న ఆంధ్ర
ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావడం తెలియని వారెవరూ లేరు.
1953లో తెలంగాణ
కోసం కొందరు గొంతు విప్పిన నేపధ్యంలో, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ "సమైక్యాంధ్ర సదస్సు" ను ఏర్పాటు చేసి, దానికి అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ
సదస్సుకు శ్రీశ్రీ ప్రధాన ఆకర్షణ. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉదృతంగా మొదలైంది. ఖమ్మం
లో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరాహారదీక్షకు పూనుకోవడం ఉద్యమానికి నాందిగా
చెపుతారు. అతని కుటుంబం వెంగళరావుకు అనుచర వర్గమన్నది
అప్పట్లో అందరికీ తెలిసిన వాస్తవం. ఉద్యమానికి డాక్టర్ మర్రి
చెన్నారెడ్డి నాయకత్వం వహించారు. హైదరాబాద్‌లో విద్యార్థులు
పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యమం గ్రామ
సీమల్లోకి పాకక పోయినా, నగర - పట్టణ
ప్రాంతాలలో విద్యావంతులను ఆకట్టుకుంది. నగరంలో విధ్వంసం చోటు
చేసుకుంది. ఆంధ్ర జిల్లాల నుంచి వచ్చే వాహనాల నంబర్ ప్లేట్లు
కూడా మార్చుకున్న ఉదంతాలున్నాయి. హైదరాబాద్ నగర గోడలపై ఆ నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిపై,
ఆయన భార్యపై అశ్లీల రాతలు వెలిశాయి.
ఖమ్మంలో జులై నెల 6,
1969న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) - సిపిఎం ఆధ్వర్యాన సమైక్యతా సభ జరిగింది. నాటి
మునిసిపల్ చైర్మన్ స్వర్గీయ చిర్రావూరి లక్ష్మీనరసయ్య అధ్యక్షతన నిర్వహించిన ఆ
సభలో, శ్రీ శ్రీ, వావిలాల
గోపాలకృష్ణయ్య, గోరా, సిపిఎం రాష్ట్ర
కార్యదర్శి మోటూరి హనుమంతరావు, నాటి సిపిఎం శాసనసభా పక్ష
నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి, సమైక్యతను సమర్థిస్తూ
ఉపన్యసించారు. సదస్సు తరువాత, సాయంత్రం
నాలుగు గంటలకు మూడువేల మందితో ఊరేగింపు మొదలైంది. ఊరేగింపును
అడ్డుకున్న వారికి బి.ఎన్. నాయకత్వాన
ఎర్ర జెండా కర్రతో దుండగులను తరిమి కొట్టిన సంగతి అప్పట్లో పలువురి దృష్టిని
ఆకర్షించింది. తెలంగాణలోని మొత్తం జిల్లాలలో సమైక్యత కోసం
సిపిఎం చేసిన మొదటి ప్రయత్నం ఇది. జిల్లాలోని ఇతర ప్రాంతాలలో
కూడా సమైక్యతా వాద సదస్సులు జరిగాయి.
సమైక్యాంధ్ర అవసరాన్ని నొక్కి చెపుతూ, ప్రజలలో అవగాహన
కలిగించడానికి సిపిఎం అనేక కరపత్రాలను వేసిందా రోజుల్లో. సిపిఎం
నాయకుడు స్వర్గీయ మోటూరి హనుమంతరావు అనేక వివరాలతో రాసిన "విశాలాంధ్రలో
విషాదచ్ఛాయలు" పుస్తకం వేల కాపీలు రాష్ట్రం మొత్తం
పంచబడింది. తెలంగాణలోని ఇతర జిల్లాలలో కూడా పార్టీ ఆధ్వర్యాన
సదస్సులు, సభలు జరిగాయి. 1973 లో
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రతిగా ఆంధ్ర జిల్లాలలో "జై
ఆంధ్ర ఉద్యమం" ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద
ఎత్తున సాగింది. ఆ సమయంలోను, మార్క్సిస్టు
పార్టీ దానికి వ్యతిరేకంగా తిరిగి పెద్ద ఎత్తున ప్రచార సాహిత్యం వెలువరించింది.
సభలు నిర్వహించింది. ఆ సభలకు నాటి కృష్ణా
జిల్లా మార్క్సిస్టు పార్టీ కార్యదర్శి మానికొండ సుబ్బారావు, ఖమ్మం జిల్లా పార్టీ పక్షాన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (మాజీ రాజ్యసభ సభ్యుడు) ఉపన్యాసకులుగా వెళ్లారు.
ఆ సందర్భంలో కృష్ణా జిల్లా జై ఆంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర
రావు (1983-1984 లో
ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోం మంత్రి), వారి శిష్య గణం సభా
ప్రాంగణం చుట్టూ రాళ్లు పేర్చుకుని తెలంగాణ ప్రతినిధి డాక్టర్ యలమంచిలి
ప్రసంగిస్తుండగా రాళ్ల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. బందోబస్తులో
వున్న పోలీసు బృందం తగు రక్షణలు కలిగించింది. ప్రత్యేక వాదం
ఉద్యమాలపట్ల, ఆ నాడు భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్టు) పార్టీ తీసుకున్న క్రియాశీల వైఖరికి
ఇవి కొన్ని ఉదాహరణలు.
2001-2010 మధ్య
సాగిన - తరువాత నేటికీ కొనసాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం
ఎడల భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్టు) పార్టీ
వైఖరికి, 1969-73 మధ్య
తీసుకున్న వైఖరికి చాలా తేడా కనిపిస్తుంది. ఈ వైఖరికి బహుశా
కారణం, ఈ సారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో పెద్ద
ఎత్తున లేకపోవడమైనా కావచ్చు, లేదా, అది కేవలం మాటల యుద్ధంగా వుండడం వల్ల కావచ్చు, లేక వివిధ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా పార్టీ 2004 లో
తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి కావడం
వల్ల కావచ్చు, తిరిగి 2009 ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర
సమితితో కూడిన గ్రాండ్ అలయెన్స్ లో భాగస్వామి కావడం వల్ల కావచ్చు. ఏదేమైనా వెనుకటి క్రియాశీల పాత్ర సిపిఎంలో లోపించింది. 2004 లో
ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ కమిటీలో సిపిఎం ఎందుకు ప్రాతినిధ్యం నిరాకరించింది?
తాము సమైక్యాంధ్రకు సైద్ధాంతికంగా కట్టుబడి వున్నామని చెప్పడం వరకే
ఎందుకు పరిమితం అవుతోంది? కొంత మంది నాయకులు "తమ పార్టీ చిన్నదనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపే
శక్తి లేదనీ" అనడం భావ్యమేనా? బాధ్యత
కాంగ్రెస్ ది కాగా తాము అడ్డుపడుతున్నామని ప్రచారం చేయడం "తమ పార్టీ భుజాన తుపాకి పెట్టి కాల్చే ప్రయత్నం తప్పు" అనడం సిపిఎంకు సమంజసమేనా? చివరకు "కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామంటే మేం వద్దన్నామా?" అనడం,
"మేం వ్యతిరేకించమనీ" ఇచ్చే
ప్రకటనలు తప్పు దోవ పట్టించే విగా లేవా? మార్క్సిస్టు
పార్టీయే తరులు - అటు తెలంగాణ ప్రాంతం వారైనా, ఇటు ఆంధ్ర ప్రాంతం వారైనా - అపహాస్యం చేసే
పరిస్థితికి సిపిఎం చేరుకోవడం అసలుసిసలైన మార్క్సిస్టులను ఆందోళనకు గురిచేస్తుందనక
తప్పదు. ఎందుకీ అస్పష్ట వైఖరి? ఎవరిని
సంతోషపెట్టడానికి ఇదంతా? ఇటీవల కాలంలో ఆ పార్టీకి సహజమైన "మిలిటెన్సీ" కూడా లోపించిందనక తప్పదు.
ఈ అంశాన్ని ఒకరిద్దరు ప్రముఖ మార్క్సిస్టు నాయకుల దగ్గర
ప్రస్తావించినప్పుడు సైద్ధాంతిక కోణంలో సమాధానాలు కొంత మేరకు లభించినా, సంతృప్తికరంగా
లేవనే అనాలి. 2011 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక బలమైన
సమర్థన అస్తిత్వం వుందన్నారు కొందరు సిపిఎం నాయకులు. ప్రాంతీయ
అస్తిత్వ వాదం అనీ, ఈ సిద్ధాంతానికి మూలాలు పోస్టు
మోడర్నిజంలో వున్నాయనీ, విజ్ఞులందరికీ తెలుసు. పోస్టు మోడర్నిజం అనేది సైద్ధాంతికంగా "యాంటీ
మార్క్సియన్" అని చాలామందికి తెలుసు. ఇది ప్రాంతీయ కుల-జెండర్ వాదాలకు దారితీస్తుంది.
ఈ నేపధ్యంలో ఆంగ్ల భాషలో వచ్చే మార్క్సిస్టు త్రైమాసిక పత్రికలో
రెండు చక్కటి వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఒకటి ప్రసిద్ధ
మార్క్సిస్టు మేధావి ఇంతియాజ్ అహ్మద్ రాసిన ఇరవై పేజీల విపులమైన వ్యాసం. అదే సంచికలో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ వ్యాసం కూడా ఆ
అంశంపైనే వుందన్నారు. ఆ రెండు వ్యాసాలు, ప్రస్తుత వేర్పాటు ఉద్యమ వాతావరణంలో, వామపక్ష
ఆలోచనలు వున్నవారికి ఉపయోగకరంగా వుంటాయి. సమైక్యత నినాదానికి
కట్టుబడే వుంటే, సిపిఎం వాటిని తెలుగులోకి అనువదించి,
ప్రచారంలోకి తీసుకురావడంలో ఎందుకు వెనుకాడుతున్నదో అర్థం కావడం
లేదని కూడా కొందరు సిపిఎం నాయకులు అభిప్రాయపడ్డారు.
"ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సిపిఐదీ, సిపిఐ (న్యూ డెమాక్రసీ)దీ
అత్యుత్సాహంగా వుంటే, మాది నిరుత్సాహంగా, నిర్లిప్తంగా వున్నట్లు తోస్తుంది” అని ముగించారు
సిపిఎం పార్టీకి చెందిన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు.
అసలింతకీ
మనముందున్న సమస్య, కేవలం సమైక్యమా? విభజనా? లేక
మరింత లోతుగా పరిశీలించ వచ్చా? తీగ లాగితే డొంకంతా
కదిలినట్లు ఇది జాతుల, అంతర్జాతీయాల సమస్యను రంగంమీద కి
తెస్తోంది. జాతి
అంటే ఒక స్పష్టమైన అవగాహన లేకుండానే ఏ ప్రాంతానికి బడితే ఆ ప్రాంతానికి జాతి అనే
ముద్ర తగిలించేవాళ్లున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్ర విభజనను
వ్యతిరేకించిన వాళ్లూ-మద్దతిచ్చిన వాళ్లూ వున్నారు. అంతర్జాతీయ సౌభ్రాతృత్వం పేరిట అనలు జాతుల ఉనికినే ప్రశ్నించేవారూ
వున్నారు. రాష్ట్ర సమస్య వచ్చినప్పుడు ఒకే భాష వుంటేమాత్రం
రెండు గాని అంతకుమించి సంఖ్యలోగాని రాష్ట్రాలుంటే నష్టమేమిటని, తప్పేంటి? అని ప్రశ్నించేవారూ వున్నారు. వివిధ భాషలు గల ప్రాంతాలను ఒకే
ఉమ్మడి రాష్ట్రంగా, ఇంగ్లీషు వాళ్లకాలంలోవలె చేస్తే ఏం
ప్రమాదం జరుగుతుందని సవాలు చేసేవారూ లేకపోలేదు. అందుకే జాతి అంటే ఏమిటన్న
విషయంలో, అదీ మార్క్సిస్టు ఆలోచనా ధోరణితో, కొంత స్పష్టమైన అవగాహనకు రావడం సమస్యను అర్థం చేసుకోడానికి ఉపకరిస్తుందేమో!
మన
దేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. అవి కేవలం
పరిపాలనా సౌలభ్యం కొరకు మాత్రమే ఏర్పడినవిగావు. భాషా ప్రయుక్తంగా ఏర్పడినవి. పేరుకు భాషా ప్రయుక్తం అంటున్నా
నిజానికి అవి వివిధ జాతులు గానూ కూడా వున్నాయి. భారతదేశం (అంటే
"ఇండియన్ యూనియన్") ఒక్కటే
అయినా అది వివిధ జాతుల కూటమి కూడాను.
ఈ జాతుల సమైక్యతే మన దేశపు ఏకత్వాన్ని, ఔన్నత్యాన్నీ కాపాడుతుంది.
ప్రపంచంలో ఏక జాతి దేశాలూ వున్నాయి. బహుళ జాతి దేశాలూవున్నాయి. చైనా, ఇండియా
వంటివి బహుళ జాతి దేశాలు. సకల జాతి, సకల దేశ సమైక్యతే విశ్వ మానవ కళ్యాణానికి
దోహదం చేస్తుంది. అది కేవలం భౌగోళికంగా సమైక్యంగా వుండాలని
లేదు. ఒక మనిషి వేరొకమనిషినీ, ఒక జాతి
వేరొక జాతినీ దోపిడీ చేయడం అంతమవ్వాలి.
అందుకు ఆర్ధిక వ్యత్యాసాలూ జాతి విచక్షణలూ పోవాలి. అప్పుడు వర్గ రహిత సమాజం
ఏర్పడుతుంది. సోషలిస్టు
వ్యవస్థే వర్గ రహిత సమాజాన్ని తీర్చిదిద్దగలదు. కాని అది
మనదేశంలో జరగడం లేదే? జరిగే సూచనలు కూడా లేవే?
సమైక్యత
అనేది సోషలిస్టు వ్యవస్థలోనే సాధ్యం గనుక ఈలోగా ఏ జాతీ ఒక్కటి గా వుండవలసిన
అవసరంలేదని కానీ, వుండి తీరాలని కానీ, ఎన్ని ముక్కలుగా చీల్చినా
పరవాలేదని కానీ, అసలు విభజన ఆలోచనే తప్పనీ, ఎవరికి నచ్చిన భాష్యం వారు
చెప్పడం సరైంది కాదు. ఇవన్నీ దారితప్పిన వాదనలు తప్ప
మార్క్సిస్టు వాదనలు కనే కావు. ఒక జాతిగా వున్న వాళ్లు
అవకాశమున్న చోట ఒకే రాష్ట్రంలో వుండటం ఎంత మంచిదో-అదెంత జాతి
అభివృద్ధికి దోహద కారి అవుతుందో, అదే విధంగా అవసరమైతే-ప్రజలు కోరుకుంటే, ఒక జాతి విభిన్న భాగాలుగా చీలడం,
విభిన్న జాతులకు చెందిన భాగాలు ఒక రాష్ట్రంగా ఏర్పడటం అంతే దోహద
కారి అవుతుంది.
జాతి
అన్న దానికి సరైన నిర్వచనాన్ని లెనిన్ - స్టాలిన్ లు ఇచ్చారు. “ఒకే భాష, ఒకే భూభాగం, ఒకే
ఆర్ధిక వ్యవస్థ ఒకే సాంఘిక సంస్కృతీ సముదాయంగా గలదీ, స్థిరమైన
సమాజంగా చారిత్రక పరిణామం పొందినదీ ఒక జాతిగా పరిగణించబడుతుంది”. చైనా, ఇండియా లాంటి దేశాల్లో వున్న వారంతా ఒకే జాతి
వారా? భాష ఒకటే
అయినా ఒకే దేశంలో వున్న వారందరూ ఒక జాతి వారు కాజాలరు. ఇంగ్లండు, అమెరికా,
కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇంగ్లీషు
భాషే మాతృ భాషగా వున్నది. అయినా వారంతా విభిన్న జాతులుగా రూపొందారు. ఇంగ్లండు, ఐర్లాండు
లలో మాట్లాడేది ఒకే భాష. సన్నిహిత భూ భాగంకూడా వున్నది. అయినా అవి రెండూ రెండు జాతులుగా
పరిణామం చెందాయి. ఆలాగే కెనడా, అమెరికాలు
సన్నిహితంగా వున్నా ఒకే జాతిగా పెంపొందలేదు. అందుకనే భాష, భూభాగం, సంస్కృతీ, చరిత్రా,
ఆర్ధిక వ్యవస్థ, స్థిరమైన మనుగడ వంటి
లక్షణాలన్నీ కలిసి వుంటేనే సమైక్యత సాధ్యమవతుందేమో! సాధ్యంకాకపోవడానికీ
అవకాశాలున్నాయి కూడా!
ఈ
లక్షణాలన్నీ తెలుగు జాతి కలిగివుందా? సమాధానం "అవును"
కావచ్చు, "కాదు" కావచ్చు. పూర్తి ఫ్యూడల్ వ్యవస్థలో, ఉర్దూ భాష పెత్తనం క్రింద కొన్నేళ్లు తెలంగాణా నలిగింది. బ్రిటిష్ పాలనలో ఇంగ్లీషు భాష పెత్తనం క్రింద కొంత పెట్టుబడి దారీ
ప్రభావంలో ఆంధ్ర ప్రాంతం కొన్నేళ్లు నడిచింది. ఆ తర్వాత భాషా
ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు నేపధ్యంలో విశాలాంధ్రగా ఏర్పడ్డాయి. విడివిడిగా, కలిమిడిగా దేని అస్తిత్వం దానికే వుంది.
మరిప్పుడు కలిసున్నా, విడిపోయినా లాభనష్టాలు
ఒకటేగా? ఒకరు విడిపోతా మన్నప్పుడు మరొకరికి అభ్యంతరం ఎందుకుండాలి?
సమాధానం దొరకని ప్రశ్నలు.
కమ్యూనిస్టు
పార్టీలలో సగ భాగం కలిసి వుండాలంటుంటే, మరో సగ భాగం విడిపోవాలని
ఉద్యమిస్తున్నారు. మార్క్సిస్టు మహోపాధ్యాయులు చెప్పిన
సూక్తులు ఎవరికి వర్తిస్తా యో వారే తేల్చాలి!
No comments:
Post a Comment